నగరంలో పెరుగుతున్న కొత్త కల్చర్
అనేక లాభాలు ఉన్నాయంటున్న నిపుణులు
గుండె సంబంధ సమస్యలు దూరం
ఒత్తిడి, మానసిక సమస్యలకు చెక్ పెట్టే అవకాశం
యువతతో పాటు అన్ని వయసుల వారూ ప్రాక్టీస్
జుంబా ప్రస్తుతం నగరాల్లో ట్రెండింగ్ అవుతున్న పదం.. డ్యాన్స్‌లో ఇదో కొత్త తరహా అనే చెప్పాలి. అయితే సరదా కోసం వేసే డ్యాన్స్ కాదు.. ఆరోగ్యం కోసం, వెయిట్ లాస్ కోసం చేసేదే జుంబా. ఇటు డ్యాన్స్.. అటు ఎక్సర్ సైజ్ రెండూ ఇందులో మిళితమై ఉంటాయి. అందుకే నగరంలో ఎక్కువ మంది ప్రస్తుతం జుంబాకు ఆకర్షితులవుతున్నారు. జుంబాతో శరీరానికి, గుండెకు మేలు చేసి, మానసిక ప్రశాంతత ఇవ్వడమే కాకుండా ఎన్నో వ్యాధులు దరిచేరకుండా చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఉదయం లేవగానే ఇంటి పనులు.. ఉద్యోగం కోసం పరుగులు.. ఆఫీస్ వర్క్.. టార్గెట్స్.. టెన్షన్స్.. సాయంత్రం పొద్దుపోయాక రావడం.. అలసిపోయి ఏదో తినేసి పడుకోవడం.. మళ్లీ ఉదయంతో షరా మామూలే.. అన్నట్లు మారిపోయింది. కనీసం ఆరోగ్యం గురించి కాస్త సమయం కేటాయించడానికి కూడా కష్టం అవుతోంది. దీంతో చిన్న వయసులోనే అనారోగ్యంతో పాటు మానసిక సమస్యలతో సతమతం అవుతున్నారు. ముఖ్యంగా హృద్రోగ సమస్యలు వెంటాడుతున్నాయి. అందుకే ప్రతి రోజు కాకపోయినా వారంలో రెండు, మూడు రోజులైనా ఓ గంట పాటు వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతున్నారు. అయితే జిమ్‌కు వెళ్లడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. వెళ్లినా జిమ్ చేయడం అందరి శరీరాలకు సెట్ కాకపోవచ్చు. అందుకే నగరంలో చాలా మంది జుంబా డ్యాన్స్‌ను ఎంచుకుంటున్నారు.
బరువు తగ్గేందుకు..
నగరంలో మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మందిలో ఊబకాయం, బరువు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో మానసికంగానే కాకుండా సామాజికంగా కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. అందుకే చాలా మంది బరువు తగ్గేందుకు జిమ్‌లను కాకుండా జుంబా డ్యాన్స్ క్లాసులకు వెళ్తున్నారు. జుంబా అంటే ఒక రకమైన కార్డియో వ్యాసు్కలార్ ఎక్సర్‌సైజ్‌లలో ఒకటని చెప్పుకోవచ్చు. ఏరోబిక్ ఎక్సర్‌సైజ్ అని కూడా అనొచ్చు. రోజులో కనీసం గంట పాటు చెమటలు వచ్చేదాకా జుంబా డ్యాన్సులు చేయిస్తుంటారు. దీని ద్వారా శరీరంలో కేలరీలు కరిగి బరువు తగ్గుతుందని చెబుతున్నారు. ఈ జుంబా క్లాసుల్లో మ్యూజిక్ పెట్టి.. సాల్సా, కుంబియా, బచతా, మెరెంగ్యూ వంటి డ్యాన్స్ స్టెప్స్ వేయిస్తుంటారు. వీటితో పాటు సినిమా పాటలకు కూడా స్టెప్స్ వేయిస్తుంటారు. పైగా పది మందితో కలిసి డ్యాన్స్ చేస్తుంటారు కాబట్టి ఫన్ ఉంటుంది.
హార్ట్‌కు మాంచి ఎక్సర్‌సైజ్..
జుంబా డ్యాన్స్ ఏరోబిక్ ఎక్సర్‌సైజ్ కావడంతో గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. రక్త పీడనం (బ్లడ్ ప్రెషర్) తగ్గించడంతో పాటు హృద్రోగ సమస్యలు దరి చేరకుండా చూస్తుంది. శరీర బరువు తగ్గడంతో పాటు శరీరాకృతిని మెరుగుపరుస్తుంది. అంటే చక్కటి శరీరాకృతి వచ్చేలా చేస్తుంది. జుంబా డ్యాన్స్‌లో చేసే స్టెప్స్ ద్వారా శరీరం ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది. అంతేకాకుండా కాన్ఫిడెన్స్ పెరిగేందుకు దోహదం చేస్తుంది. ఒత్తిడిని తగ్గించడమే కాకుండా మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది.
మరెన్నో లాభాలు..
జుంబా డ్యాన్స్ క్లాసులకు చాలా మంది వస్తుంటారు. వారితో తరచూ సంభాషిస్తుండటం.. కలిసి డ్యాన్సులు చేస్తుండటంతో స్నేహం పెరుగుతుంది. అలాగే మ్యూజిక్ వింటూ డ్యాన్స్ చేస్తుంటే మంచి మూడ్ పెంచే హార్మన్స్ విడుదల అవుతాయి. రోజంతా ఉల్లాసంగా ఉంటుంది. రోజులో చేయాల్సిన పనులను ఎంతో ఉత్సాహంగా చేస్తుంటాం. దీంతో ఉత్పాదకత కూడా పెరగుతుంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. మనపై మనకు నమ్మకం పెరుగుతుంది. డ్యాన్స్ వల్ల చెమటలు రావడంతో చర్మంపై ఉన్న రంధ్రాలు తెరుచుకుంటాయి. శరీరంలోని మలినాలు బయటకు వెళ్లి.. చర్మ సౌందర్యం కూడా పెరుగుతుంది.
వయసుతో సంబంధం లేకుండా..
వయసుతో సంబంధం లేకుండా జుంబా డ్యాన్స్ ఎవరైనా చేయొచ్చని శిక్షకులు చెబుతున్నారు. ఆడవాళ్లు మాత్రమే జుంబా డ్యాన్స్ క్లాసులకు వెళ్తారనే అపోహ చాలా మందిలో ఉంది. అయితే ఆడవారితో పాటు మగ వారు కూడా జుంబా డ్యాన్స్ చేయొచ్చని పేర్కొంటున్నారు. నిపుణుల పర్యవేక్షణలో సరైన పద్ధతిలో, సరైన రీతిలో జుంబా డ్యాన్స్ చేస్తే ఎన్నో లాభాలు ఉంటాయని వివరిస్తున్నారు.
ఎనిమిదేళ్లుగా శిక్షణ..
గత ఎనిమిది ఏళ్లుగా జుంబా డ్యాన్స్ నేరి్పస్తున్నాను. 10 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసు వరకూ ఎంతో మంది క్లాసులకు వస్తుంటారు. కొందరు బరువు తగ్గడానికి వస్తుంటారు. చాలా మంది ఫిట్‌నెస్ కోసం వస్తుంటారు. జుంబా క్లాసులను బాగా ఎంజాయ్ చేస్తుంటారు. రెగ్యులర్‌గా జుంబా చేస్తే ఆరోగ్య పరంగా, మానసికంగా ఎన్నో లాభాలున్నాయి.
– ప్రేమ్ శోతల్, జుంబా ట్రైనర్, డివైన్ స్టూడియో
ఆహ్లాదం.. ఆరోగ్యం..
బరువు తగ్గడమంటే చాలా మంది ఎదో బర్డెన్‌లా చూస్తుంటారు. కానీ జుంబాతో ఇటు ఎంటర్‌టైన్‌మెంట్ అటు బరువు తగ్గే వీలుంటుంది. దీని ద్వారా శరీరంలోని కొవ్వు తగ్గిస్తుంది. ఫ్లెక్సిబిలిటీ పెరిగి, శరీరాకృతి మెరుగు పడుతుంది. ఆహారంలో పెద్దగా మార్పులు ఏం అవసరం లేదు. కాకపోతే ఇంట్లో ఆహారం సమయానికి, కాస్త తక్కువగా తింటే లాభాలు కనిపిస్తాయి. రెగ్యులర్‌గా జుంబా డ్యాన్స్ చేస్తుంటే అనుకున్న ఫలితాలు చూడొచ్చు.
– బుద్ధరాజు పూజిత, జుంబా ట్రైనర్, వన్ ఆల్ ఎరేనా
Comments
Please login to add a commentAdd a comment