తాను నృత్యకారిణిగా కొనసాగాలని, తన కూతురిని కూడా గొప్ప కళాకారిణిగా చూడాలని ఓ కన్నతల్లి ఆరాటం.. మూడేళ్ల వయసులోనే కూతురికి శిక్షణ.. చదువుల వేటలో మార్గాలు వేరుపడినా.. వేర్వేరు రంగాల్లో రాణింపు.. అయినా కూతురితో కలిసి ప్రదర్శన ఇవ్వాలనే ఆ తల్లి ఆశ మాత్రం చిరంజీవిగా ఉండడం.. చివరకు ఆ ఆకాంక్ష జయించడం.. బహుశా కీర్తిశేషులు కళాతపస్వి కె.విశ్వనాథ్ ఉండి ఉంటే ఇదో భావోద్వేగ భరిత వెండితెర కథగా మారి ఉండేదేమో.. హైదరాబాద్ నగరంలోని ఓ ఉన్నత కుటుంబానికి చెందిన తల్లీ కూతుళ్లు కలిసి సమర్పించనున్న సంప్రదాయ నృత్య ప్రదర్శన నేపథ్యం ఆసక్తికరమైనదిగా మారింది..
‘ఇది అమ్మ చిరకాల ఆకాంక్ష. నాతో కలిసి నృత్య ప్రదర్శన ఇవ్వాలని తను ఎప్పటి నుంచో ఆశపడుతోంది’ నగరంలో ఒక మోడల్‌గా, ఫిట్‌నెస్ ట్రైనర్‌గా, ఈవెంట్ మేనేజర్‌గా చిరపరిచితమైన అభిమానిక.. మన హైదరాబాద్‌కి చెందిన అమ్మాయే. ఆమె అకస్మాత్తుగా నృత్యకారిణిగా మారడం వెనుక కారణాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. హైదరాబాద్‌కి చెందిన అభిమానిక
అమ్మతో కలిసి అడుగులు..
ప్రస్తుతం హైకోర్ట్‌లో సీనియర్ లాయర్‌గా ఉన్న దువ్వూరి వత్సలేంద్రకుమారి తొలి అడ్వకేట్ జనరల్ దువ్వూరి నరసరాజు కుమార్తె.. తను మూడేళ్ల వయసు నుంచే నటరాజు రామకృష్ణ దగ్గర శిష్యరికం చేసి నాట్య ప్రదర్శనలు ఇస్తూ వచ్చారు. న్యాయవాదిగా మారినా నాట్యాభిరుచిని కొనసాగించారు. తన కూతురు అభిమానిక కూడా తనలాగే గొప్ప నాట్యకారిణి కావాలని మూడేళ్ల వయసులోనే ఆమెకు కూడా తానే గురువుగా మారి శిక్షణ ప్రారంభించారు. ఆ తర్వాత తన కుమార్తె కూడా ప్రదర్శనలు ఇస్తుంటే తన ఆకాంక్ష నెరవేరుతోందని మురిసిపోయారు. అయితే
ఆ తల్లి ఒకటి తలిస్తే.. కాలం మరొకటి తలచింది. చదువుల వేటలో అభిమానిక నాట్యపిపాస అటకెక్కింది. బీటెక్ టాపర్‌గా నిలిచినా.. వ్యక్తిగత అభిరుచి మేరకు ఫిట్‌నెస్ ట్రైనర్‌గా మోడల్‌గా, ఈవెంట్ మేనేజర్‌గా విజయవంతంగా కొనసాగుతున్నారు అభిమానిక.. ఇప్పుడు తల్లి ఆకాంక్షకు తలొగ్గారు.
పాతికేళ్ల తర్వాత.. మారిన ప్రయాణం
‘నేను నాట్యానికి పాతికేళ్లుగా దూరమైనా అమ్మ తన ఆశకు మాత్రం దూరం కాలేదు. తరచూ నాకు గుర్తు చేస్తూనే ఉన్నారు. అమ్మ పట్టుదలతో కొన్ని రోజుల్లోనే మళ్లీ నా చిన్ననాటి నాట్య పిపాస తిరిగి ఊపిరి పోసుకుంది. ఇప్పుడు సంపూర్ణమైన ఇష్టంతో నెలల తరబడి కఠినమైన సాధన ద్వారా అమ్మతో కలిసి ప్రదర్శనకు సిద్ధమవుతున్నా.. నిజం చెప్పాలంటే అమ్మ నాట్యానికి నేనో అభిమానిని’ అంటూ భావోద్వేగంతో చెప్పారు అభిమానిక.
‘నృత్యకారిణిగా, న్యాయవాదిగా రెండు పడవల ప్రయాణం విజయవంతంగా కొనసాగిస్తూ వచ్చాను. ఎందరినో శిష్యురాళ్లుగా, నృత్యకారిణులుగా తయారు చేశాను. 2017లో పేరిణిలో తొలి మహిళా నృత్యకారిణిగా ప్రదర్శన ఇచ్చి భారత్ వరల్డ్ రికార్డ్ దక్కించుకున్నాను. వ్యక్తిగతంగా ఎన్ని సాధించినా.. నా కూతురుతో కలిసి నాట్య ప్రదర్శన ఇవ్వాలనేది నా చిరకాల వాంఛ’ అన్నారు వత్సలేంద్ర కుమారి.
వయసు పైబడకుండానే..
‘కేవలం కలిసి నృత్యం చేయడమే కాదు తనతో ధీటుగా చేయాలి కదా.. అందుకే వయసు మరీ పైబడకుండానే చేయాలని అనుకున్నా. ఏమైతేనేం.. ఇన్నాళ్లకు నా కల నెరవేరుతోంది’ అంటూ ఆనందంగా చెప్పారు వత్సలేంద్ర కుమారి.. ఇప్పటిదాకా తల్లీ కూతుర్లు కలిసి నృత్య ప్రదర్శన ఇవ్వడం అనేది లేదని, అది తామిద్దరూ సాధించనుండడం గర్వంగా ఉందన్నారు. కూచిపూడి, భరతనాట్యం మేలు కలయిక లాంటి ఆంధ్రనాట్యం నటరాజ రామకృష్ణ ప్రారంభించారని, ఇటీవల అంతగా ప్రాభవానికి నోచుకోని ఈ నాట్యాన్ని అందరికీ చేరువ చేయాలనేదే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment