
ప్రపంచ కవితా దినోత్సవం (World Poetry Day) మనసుల్లోతుల్లో దాగివున్న భావాన్ని, అనుభవాన్ని, బాధను, లోతైన గాథల్ని వ్యక్తికరించేందుకు అనుసరించే ఒక ప్రక్రియ కవిత. హృదయాంతరాలలోని భావాలను అర్థవంతంగా, స్ఫూర్తివంతంగా ప్రకటించే సామర్థ్యం కొందరికి మాత్రమే లభించే వరం. సాంస్కృతిక ,భాషా వ్యక్తీకరణ రూపాలలో ఒకటైన ఈ ప్రపంచ కవితా దినోత్సవాన్ని మార్చి 21న జరుపుకోవడం ఆనవాయితీ.
1999లో పారిస్‌లో జరిగిన 30వ సర్వసభ్య సమావేశంలో UNESCO (యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్) ప్రపంచ కవితా దినోత్సవాన్ని మొదలు పెట్టింది. 1999లో పారిస్‌లో జరిగిన 30వ సర్వసభ్య సమావేశంలో UNESCO (యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్) ప్రపంచ కవితా దినోత్సవాన్ని ఆమోదించారు. భాషా వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, సాంస్కృతిక మార్పిడి, . సృజనాత్మకతను ప్రోత్సహించడం కవిత్వం అంతరించిపోతున్న భాషలతో సహా భాషల గొప్పతనాన్ని చాటుకోవడం, సమాజాలకు స్వరాన్ని అందివ్వడం దీని ఉద్దేశం. విభిన్న సంస్కృతుల నుండి కవితలను పంచుకోవడం ద్వారా ఇతర ప్రజా సమూహాల అనుభవాలు, దృక్కోణాలపై అంతర్దృష్టులను పొందుతారు, సానుభూతి మరియు అవగాహనను పెంపొందిస్తారు.
ప్రపంచ కవితా దినోత్సవం సందర్బంగా కొంతమంది మహిళా కవయిత్రుల కవితలను చూద్దాం. సమాజంలోని పురుషాహంకార ధోరణిని నిరసిస్తూ, ఆ భావజాలాలపై తిరుగుబాటు బావుటా ఎగురవేసింది స్త్రీవాద కవిత్వం. స్త్రీల భావాలను, బాధలను, స్త్రీలు మాత్రమే ప్రభావవంతంగా ఆవిష్కరింగలరు అనేదానికి అక్షర సత్యాలుగా అనేక కవితలు తెలుగు కవితా ప్రపంచంలో ప్రభంజనం సృష్టించాయి. స్త్రీ స్వేచ్ఛ, సాధికారత అన్ని రంగాల్లో సమాన హక్కులతో పాటు సంతానోత్పత్తి , మాతృత్వం మాటున దాగివున్న పురుషాధిక్యాన్నిచాటి చెప్పిందీ కవిత్వం.
ఇందులో సావిత్రి, బందిపోట్లు కవిత మొదలు ఘంటశాల నిర్మల, కొండేపూడి నిర్మల, జయప్రభ, ఓల్గా, సావిత్రి, మందరపు హైమవతి, రజియా బేగం, పాటిబండ్ల రజని, బి. పద్మావతి, కె. గీత, ఎస్. జయ, శిలాలోలిత, విమల ఇలా ఎంతోమంది తమ కవితలను ఆవిష్కరించారు.తొలి స్త్రీవాద కవితగా 1972లో ఓల్గా రాసిన ‘ప్రతి స్త్రీ నిర్మల కావాలి’ అనే కవితను విమర్శకులు గుర్తించారు. ‘పాఠం ఒప్పచెప్పకపోతే పెళ్ళి చేస్తానని పంతులుగారన్నప్పుడు భయమేసింది, ‘ఆఫీసులో నా మొగుడున్నాడు, అవసరమొచ్చినా సెలవు ఇవ్వడ’ని అన్నయ్య అన్నప్పుడే అనుమానం వేసింది.
ఇంకా ‘అయ్యో! పాలింకిపోవడానికున్నట్లు మనసింకి పోవడానికి మాత్రలుంటే ఎంత బాగుండు’ అన్న పాటిబండ్ల రజనీ కవితతో పాటు, ‘లేబర్ రూం* రైలు పట్టా మీద నాణెం విస్తరించిన బాధ, కలపను చెక్కుతున్న రంపం కింద పొట్టులా ఉండచుట్టుకున్న బాధ. ఇది ప్రసవ వేదన కవితగా మారిన వైనం. ఇంకా పైటను తగలెయ్యాలి, చూపులు, అబార్షన్ స్టేట్‌మెంట్, సర్పపరష్వంగం, రాజీవనాలు, కాల్‌గళ్స్ మొనోలాగ్, గుక్క పట్టిన బాల్యం, కట్టుకొయ్య, గృహమేకదా స్వర్గ సీమ, దాంపత్యం, నిషిద్ధాక్షరి, నీలి కవితలే రాస్తాం, విమల సౌందర్యాత్మకహింస లాంటివి ఈ కోవలో ప్రముఖంగా ఉంటాయి.
ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా మరో కవిత
మనసుకు అలసటతో చెమట పట్టినపుడో
దేహంలోని నెత్తురు మరిగినపుడో
గొంతు అక్షరాల సాయం తీసుకుంటుంది
వేదన కళగా మారి
సృజనాత్మకతను
లేపనంగా అద్దుకుంటుంది
శిశిరాలు వెంటపడి
అదేపనిగా తరుముతున్నప్పుడు
వసంతం కోసం చేసే తపస్సు
పెనవేసుకున్న శీతగాలి
ఖాళీతనపు భావాగ్నిని అల్లుకున్నపుడు
తుపాన్లతో చైతన్య పరిచేది
చందమామ మాగన్నుగా నిద్రిస్తున్నపుడు
కళ్ళు మూసుకున్న ప్రపంచాన్ని
వేకువ గీతాలై నిద్రలేపేది
ఎప్పటికీ కాలని, విడగొట్టినా చీలని
అనంతం నిండా వ్యాపించిన
అక్షయం కాని అక్షర సముదాయం
ఒకానొక మహావాక్యమై
అద్వితీయ కావ్యమై నిలుస్తుంది.
– ర్యాలి ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment