poet
-
మనసారా మాట్లాడండయ్యా!
కవితాత్మక ప్రసంగాలతో మంత్రముగ్దుల్ని చేసే చాతుర్యం వాజ్‌పేయికి వెన్నతో పెట్టిన విద్య. తేలికైన పదాలతో బరువైన భావాలను వెల్లడించే మాటలకు ఆయన పెట్టింది పేరు. సాహితీ రంగంలోనూ అటల్ తనదైన ముద్ర వేశారు. హిందూ పురాణాల సారాన్ని నింపుకున్న ఆయన వాక్యాలకు పార్లమెంటులో పార్టీలకు అతీతంగా సభ్యులంతా సలామ్ కొట్టేవారు. ఆయన రాజకీయ ప్రసంగాలు కూడా సాహితీ సౌరభాలు వెదజల్లేవి. తాను అధికారంలో ఉండగా విపక్షాలు చేసే విమర్శలకు హుందాగా, చమత్కారంగా బదులిచ్చేవారు. ‘మనసారా మాట్లాడండయ్యా’ అంటూ తోటివారిని ప్రోత్సహించేవారు.చిరస్మరణీయ ప్రసంగం ప్రజాస్వామ్యంపై వాజ్‌పేయికి ఉన్న అపార నమ్మకం ఆయన దార్శనికతలో తొణికిసలాడేది. తన తొలి ప్రభుత్వం 13 రోజులకే కూలిన సందర్భంలో 1996 మే 27న ఆయన పార్లమెంట్లో చేసిన ప్రసంగం మరపురానిది! దాన్ని నాటి పార్లమెంట్ సభ్యులు, రాజకీయ నేతలు నేటికీ గుర్తు చేసుకుంటారు. ఎమర్జెన్సీ వేళ జైలు జీవితం గడుపుతూ రాసిన కవితలతో ‘ఖైదీ కవి కుండలీ’ అనే కవితా సంకలనం రచించారు. ‘అమరత్వం అగ్ని లాంటిది’, ‘నా 51 కవితలు’ వంటి పలు సంకలనాలు వెలువరించారు. ‘కవిత్వం రాసుకునేంత సమయాన్ని కూడా రాజకీయాలు మిగల్చలేదు. నా కవితా వర్షపుధార రాజకీయ ఎడారిలో ఇంకిపోయింది’ అని ఓసారి వాపోయారు. ధోతీ, కుర్తాలో నిండుగా కనిపించే అటల్ ఖాళీ సమయాల్లో కవితలు రాస్తూ సాహిత్యంతో దోస్తీ చేసేవారు. అవుంటేనే కవిత వాజ్‌పేయి సరదా మనిషి. ‘‘కవిత్వం రాయాలంటే అనువైన వాతావరణముండాలి. మనసు లగ్నం చేయగలగాలి. మనల్ని ఆవిష్కరించుకునే సమయం చిక్కాలి. ఈ రణగొణ ధ్వనుల మధ్య అవెలా సాధ్యం?’’ అన్నారోసారి. కొంతమేర సాహిత్య కృషి చేసినా పెద్దగా రాణించలేదంటూ తెగ బాధపడేవారట. ‘‘కవిత్వంలో నేను చేసింది సున్నా. అసలు రాజకీయాల గడప తొక్కక పోయుంటే హాయిగా కవితలు రాసుకుంటూ, కవి సమ్మేళనాల్లో పాల్గొంటూ ముషాయిరాల్లో మునిగి తేలుతూ గడిపేవాడిని’’ అంటూ తరచూ అంతర్మథనానికి లోనయ్యేవారు. -
Kanimozhi Karunanidhi: రాజకీయ కవయిత్రి
కనిమొళి కరుణానిధి.. బహుముఖ ప్రతిభావంతురాలైన రాజకీయవేత్త, కవి, పాత్రికేయురా లు, ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) సభ్యురాలు. తూత్తుక్కుడి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. చురుకైన విద్యార్థి... కనిమొళి చిన్నప్పటి నుంచే చురుకైన విద్యార్థి. బాల్యంలో తండ్రితో పెద్దగా గడపలేకపోయినా.. ఆయనకు మాత్రం ప్రియమైన కూతురే. కనిమొళి పుట్టిన తరువాతే ముఖ్యమంత్రి పదవి దక్కడంతో అది ఆమె తెచి్చన అదృష్టమేనని కరుణానిధి భావించేవారు. తండ్రి తన దగ్గరలేని బాధను కనిమొళి కవిత్వంగా మలిచారు. అది చదివి ఆయన కదిలిపోయారు. అలా తండ్రీకూతుళ్లను సాహిత్యం మరింత దగ్గర చేసింది. కనిమొళి క్రియాశీల రాజకీయాలకు దూరంగా పెరిగారు. 2001లో జయలలిత హయాంలో కరుణానిధిని అరెస్టు చేసినప్పుడు తండ్రి పక్కన నిలబడి తొలిసారి ప్రముఖంగా బయటకు కనిపించారు. నాటినుంచీ ఆయన గళంగా మారిపోయారు. తండ్రి బహుముఖ ప్రజ్ఞకు కనిమొళి అప్రకటిత వారసురాలు. దానికి తోడు ఇంగ్లిష్ బాగా మాట్లాడతారు. దాంతో కరుణానిధి ఢిల్లీలో పెద్దలెవరినీ కలిసినా వెంట కనిమొళి ఉండేవారు. కనిమొళి ఢిల్లీ రాజకీయాల్లో, స్టాలిన్ రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉండేలా కరుణానిధి ముందుచూపుతో వ్యవహరించారు. 1982లో జయలలిత క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించిన వేదికపైనే 2008 జూన్‌లో కనిమొళితో డీఎంకే తొలి మహిళా సమ్మేళనం నిర్వహించారు. అలా ఆమెను అగ్రనాయకురాలిగా నిలబెట్టే ప్రయత్నాలు చేశారు. కనిమొళిని జయలలితకు కౌంటర్‌గా కరుణానిధి చూశారు. వారిద్దరికీ సారూప్యమూ ఉంది. ఇద్దరూ ఒకే పాఠశాలలో చదువుకున్నారు. జర్నలిస్టులుగా పనిచేశారు. రాజ్యసభ సభ్యులుగానే రాజకీయ జీవితం ప్రారంభించారు. రాజకీయాల్లో... కనిమొళి 2007లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. çఆరోగ్యం, కుటుంబ సంక్షేమ, విదేశీ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి కమిటీ, హోమ్ వ్యవహారాల వంటి పలు కమిటీల్లో చురుగ్గా పనిచేసి ఆకట్టుకున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ జనరల్ అసెంబ్లీ సభ్యురాలిగా చేశారు. 2013లో రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2018లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్నారు. 2019లో తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. తూత్తుక్కుడి నుంచి బీజేపీ అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్‌పై ఏకంగా 3,47,209 ఓట్ల మెజారిటీతో గెలిచారు. సక్సెస్ఫుల్ జర్నలిస్టు.. కనిమొళి సక్సెస్ఫుల్ జర్నలిస్టు కూడా. ప్ర ముఖ ఆంగ్ల దినపత్రికలో సబ్ ఎడిటర్‌గా చేశా రు. తమిళ వారపత్రిక ‘కుంగుమం’ సంపాదకురాలిగా వ్యవహరించారు. సింగపూర్‌కు చెందిన ‘తమిళ మురసు’ వార్తాపత్రికకూ ఫీచర్స్ ఎడిటర్‌గా సేవలందించారు. తమిళంలో కవిత్వం రాశారు. తమిళ కవిత్వాన్ని ఇంగ్లి‹Ùలోకి అనువదించారు. ఆమె రచనలు ఇంగ్లి‹Ù, మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లోకి అనువాదమయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అక్కడ కవి పుట్టిన రోజు ఓ పండుగలా జరుపుకుంటారు!
మన దేశంలో కవుల జయంతులు, వర్ధంతులు తప్పనిసరి తతంగాలుగా జరుగుతాయి. ఈ తప్పనిసరి తతంగాల్లో ఉత్సాహభరితమైన కార్యక్రమాలు ఉండవు. విందు వినోదాలు ఉండవు. కళా ప్రదర్శనలు ఉండవు. ఒక్కముక్కలో చెప్పాలంటే.. మన దేశంలో కవుల జయంతులు, వర్ధంతుల కార్యక్రమాల్లో వక్తల ఊకదంపుడు ఉపన్యాసాలకు మించిన విశేషాలేవీ ఉండవు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఇంగ్లండ్, స్కాట్లండ్లలోనైతే, రాబర్ట్ బర్న్స్ పుట్టినరోజు కవితాభిమానులకు పండుగరోజు. ఆయన పుట్టినరోజు అయిన జనవరి 25న ఏటా ఇంగ్లండ్, స్కాట్లండ్లలోని ప్రధాన నగరాల్లో భారీ స్థాయిలో వేడుకలు జరుగుతాయి. ‘బర్న్స్ నైట్’ పేరుతో విందు వినోదాలు, కవితా గోష్ఠులు, సంప్రదాయ సంగీత, నృత్య ప్రదర్శనలు జరుగుతాయి. బర్న్స్ కవిత్వాన్ని చదువుతూ అభిమానులు ఉర్రూతలూగిపోతారు. గాయనీ గాయకులు ఆయన గీతాలను ఆలపిస్తారు. వేడుకలు జరిగే వేదికలకు చేరువలోనే బర్న్స్ జ్ఞాపకాలను తలపోసుకుంటూ భారీస్థాయిలో విందు భోజనాలను ‘బర్న్స్ నైట్ సప్పర్’ పేరుతో నిర్వహిస్తారు. ఈ వేడుకలకు విచ్చేసే అతిథులను సంప్రదాయ బ్యాగ్‌పైపర్ వాయిద్యాలను మోగిస్తూ స్వాగతం పలుకుతారు. ఎప్పటి మాదిరిగానే ఈ ఏడాది కూడా బర్న్స్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఇంగ్లండ్, స్కాట్లండ్లలోని వివిధ నగరాల్లోని అభిమానులు ఇప్పటికే ఏర్పాట్లను ప్రారంభించారు. పద్దెనిమిదో శతాబ్దికి చెందిన స్కాటిష్ కవి రాబర్ట్ బర్న్స్ 1759 జనవరి 25న పుట్టాడు. తన కవిత్వంతో స్కాటిష్ సాహిత్యాన్ని సుసంపన్నం చేశాడు. ఆయన 1796 జూలై 21న మరణించాడు. స్కాట్స్ భాషను, స్కాటిష్ కవిత్వాన్ని సుసంపన్నం చేసిన కవిదిగ్గజం రాబర్ట్ బర్న్స్ జ్ఞాపకార్థం నిర్వహించే ‘బర్న్స్ నైట్ సప్పర్’ కార్యక్రమాన్ని స్కాటిష్ పార్లమెంటు ముఖ్యమైన సాంస్కృతిక కార్యక్రమంగా పరిగణిస్తుంది. స్కాటిష్ పార్లమెంటు కూడా ఈ సందర్భంగా విందు ఏర్పాటు చేస్తుంది. ఈ విందులో స్కాటిష్ బ్రోత్, పొటాటో సూప్, కల్లెన్ స్కింక్, కాక్–ఏ–లీకీ వంటి సూప్స్, గొర్రెమాంసంతో తయారుచేసే హ్యాగిస్ వంటి సంప్రదాయ వంటకాలను వడ్డిస్తారు. ఒక కవి పుట్టినరోజును మరే దేశంలోనూ ఇలా ఒక పండుగలా జరుపుకోవడం కనిపించదు. (చదవండి: ఆత్రేయపురం పూతరేకులను తలపించే ఇరానీ పుతరేకు! ఎలా చేస్తారంటే..) -
Muthuswami Dikshitar: ఆ మూడూ చాలు నాకు...
‘‘నాకు అమూల్యమైన అవకాశం దొరికింది. గురువుగారికి స్థాన శుశ్రూష చేస్తున్నాను. (అంటే గురువుగారు ఎక్కడున్నారో అక్కడ ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయడం), ఆత్మ శుశ్రూష చేస్తున్నాను. (అంటే గురువుగారి మాటలు వింటూ వాటిని జ్ఞాపకం పెట్టుకుని మననం చేయడం. గురువుగారు చేసే జ్ఞానబోధ జారిపోకుండా మనసులో నిలబెట్టుకోవడం). వీటన్నింటికన్నా దేహ శుశ్రూష చేస్తున్నా...’’ గురువుగారు ఎంతకాలం ఉంటారో అంతకాలమే మాట్లాడగలరు. గురువుగారి శరీరం పతనం అయితే ఆయనకు వచ్చిన నష్టం ఏమీ లేదు. కారణం –‘‘నైనం చిందంతి శస్త్రాణి/నైనం దహతి పావకః /న చైనం క్లేదయంత్యాపో /న శోషయతి మారుతః’’ అన్నది భగవద్గీత వాక్యం.. శరీరం అసత్యం, ఆత్మ నిత్యం అనీ, అది ఖడ్గం చేత నరకబడదు, అగ్నిచేత కాల్చబడదు, నీటిచేత తడపబడదు, గాలిచేత విసిరి వేయబడదు.. అటువంటి ఆత్మ తానని గురువుగారికి తెలుసు. అందువల్ల శరీరం పతనమయితే ఆయన పొందే బాధేం లేదు. అది సహజం. కానీ గురువుశరీరం వదిలి పెట్టేస్తే నష్టం ఎవరికి అంటే శిష్యులకు. అందుకని శిష్యులు గురువుగారి శరీరాన్ని కాపాడుకుంటుంటారు. పద్మపాదుడు అలానే కదూ శంకరాచార్యులవారిని కాపాడుకున్నది! ‘‘...అలా గురుశుశ్రూష చేస్తున్నా. పరమపావనమైన గంగానదిలో స్నానం చేస్తున్నా. ఆపైన విశ్వనాథ దర్శనం చేస్తున్నా. ఈ మూడూ ప్రతిరోజూ జరుగుతున్నాయి. ఇంతకన్నా ఐశ్వర్యం ఏముంటుంది! అందువల్ల నాకు అమ్మానాన్నలను చూడాలనో, తోబుట్టువులను, నా స్నేహితులను చూడాలనో కోరికలు లేవు. మీదగ్గర ఉండడం చాలు నాకు’’ అన్నారు ముత్తుస్వామి దీక్షితార్ వారు... ‘చాలా కాలమయింది అమ్మానాన్నలను వదిలివచ్చి, ఇల్లు గుర్తుకు రావడం లేదా...’’ అని అడిగిన గురువుగారితో. శిష్యుని గురుభక్తికి చిదంబర నాథ యోగి గారు పరమానందం పొందారు. ఆరోజు గంగానదికి స్నానానికి వెళ్లేటప్పుడు శిష్యుడిని పిలిచి..‘‘నాయనా! ఈరోజు ముందు నీవు వెళ్ళు. రోజూ నదిలో స్నానానికి ఎక్కడిదాకా వెడతావో దానికంటే కొంచెం ముందుకు వెళ్ళివచ్చేటప్పడు మజ్జనం (తలను పూర్తిగా ముంచడం) చెయ్యి. అక్కడ తడిమి చూడు’’ అన్నారు. దీక్షితార్ వారు అలా చేసి చూస్తే అక్కడ ఆయనకు ఒక వీణ దొరికింది. అన్ని వీణలకు యాళి కిందికుంటే దీనికి పైన ఉంది. అది చూసి గురువుగారు సంతోషించారు. నీ శుశ్రూషకి గంగమ్మ అనుగ్రహించి దీనిని ప్రసాదించిందని చెప్పారు. నువ్వు గొప్ప వాగ్గేయకారుడివై అసమాన కీర్తి ప్రతిష్ఠలు పొందుతావు.’’ అని ఆశీర్వదించి స్నానానికి వెళ్లి నీటిలో మునిగారు. ఇక పైకి లేవలేదు. తరువాత ఆయన భౌతిక కాయం లభించింది. అంత్యేష్ఠి సంస్కారం చేసి ముత్తుస్వామి దీక్షితార్ వారు తిరిగొచ్చేసారు. వాగ్గేయకారుడిగా కీర్తిప్రతిష్ఠలు గడించారు. గురువుల వైభవాన్ని కీర్తిస్తూ ఆయన చాలా కీర్తనలు చేసారు. వాటిలో ఒకదానిని చిదంబరనాథ యోగి పేర కూడా చేసారు.. అంత గొప్ప గురుభక్తి దీక్షితార్ వారిది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ప్రఖ్యాత కవి ఇమ్రోజ్ కన్నుమూత
ముంబై: ఇమ్రోజ్‌గా అందరికీ సుపరిచితుడైన ప్రముఖ కవి, కళాకారుడు ఇందర్ జీత్(97) శుక్రవారం ముంబైలో కన్నుమూశారు. వయో సంబంధ రుగ్మతలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు చెప్పారు. ఇమ్రోజ్, రచయిత్రి అమృతా ప్రీతమ్ మధ్య నాలుగు దశాబ్దాల బంధం ఉంది. ముంబైలోని కాండివిలిలో ఆయన అంత్యక్రియలు పూర్తి చేసినట్లు అమృతా ప్రీతమ్ కోడలు అల్కా క్వాట్రా చెప్పారు. ఇమ్రోజ్ చితికి ప్రీతమ్ మనవరాలు నిప్పంటించారు. 1926లో పంజాబ్‌లోని ల్యాల్‌పూర్‌లో ఇమ్రోజ్ జన్మించారు. పంజాబీలో రచయిత్రిగా మంచి పేరున్న అమృతా ప్రీతమ్‌తో 1950ల నుంచి ఆయన అనుబంధం కొనసాగింది. దాదాపు 40 ఏళ్లపాటు కలిసే ఉన్నారు. 2005లో అమృతా ప్రీతమ్ చనిపోయారు. ప్రీతమ్ అనారోగ్యం బారిన పడినప్పటి నుంచి ఇమ్రోజ్ కవితలు రాయడం ప్రారంభించారు. అమృతా ప్రీతమ్ చనిపోయాక కూడా కవితా వ్యాసంగం కొనసాగించి, ఆమెకు అంకితం చేశారు. -
మనోనేత్రంతో ముందడుగు...
జ్యోత్స్న ఫణిజ... తెలుగమ్మాయి. ఢిల్లీ... ఏఆర్ఎస్డీలో అసిస్టెంట్ ప్రోఫెసర్. దేశవిదేశాల్లో అవార్డులందుకున్న కవయిత్రి మిస్ కాలేజ్... బెస్ట్ హాఫ్ శారీ విజేత. ర్యాంప్ వాకరే కాదు... మారథాన్ రన్నర్ కూడా. కర్ణాటక, హిందుస్థానీ సంగీత గాయని... చిన్న వయసులో డాక్టరేట్ అందుకున్న చదువరి. స్క్రైబ్ సహాయంతో పరీక్షలు రాసిన జ్యోత్స్న... ఆత్మస్థయిర్యం... ఆత్మవిశ్వాసమే నా కళ్లు అంటోంది. జ్యోత్స్న ఫణిజ సొంతూరు ఆంధ్రప్రదేశ్, కృష్ణాజిల్లా, కైకలూరు. ఆమె పుట్టినప్పుడు ఆమెలోని జన్యు సమస్యను డాక్టర్లు గుర్తించలేకపోయారు. కంటి సమస్య గురించి ఆరు నెలలకు తెలిసింది. మేనరికపు వివాహం కారణంగా ఇలా జరిగిందని, వైద్యచికిత్సలతో ప్రయోజనం లేదన్నారు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ డాక్టర్లు. అమ్మాయి చదువు కోసం నర్సాపురంలో ఉన్న స్పెషల్ స్కూలు గురించి కూడా వాళ్లే చెప్పారు. ఊహ తెలిసినప్పటి నుంచి తన జీవనప్రయాణాన్ని సాక్షితో పంచుకున్నారు జ్యోత్స్న ఫణిజ. అంతులేని ఆప్యాయత ‘‘నా సమస్య తెలిసిన తరవాత ఇంట్లో అందరూ నా గురించి ప్రత్యేక శ్రద్ధ చూపించారు. నా చదువు కోసం అమ్మమ్మ నర్సాపురంలో ఇల్లు తీసుకుని ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు సంరక్షించింది. అమ్మ సాహిత్యాభిలాష్. నన్ను సాహిత్యానికి దగ్గర చేయడానికి కథలు, హిందీ పాటల క్యాసెట్లు తెచ్చేది. నాకు అనేక ప్రదేశాలు తెలియడం కోసం తరచూ టూర్లకు తీసుకెళ్లేవారు. వాళ్లు కళ్లతో చూసినవన్నీ పూసగుచ్చినట్లు వివరిస్తుంటే నేను మనోనేత్రంతో చూసేదాన్ని. డిగ్రీ వరకు బ్రెయిలీలో చదివాను. డిగ్రీ విజయవాడలోని మేరిస్ స్టెల్లా కాలేజ్‌లో చదివాను. బ్రెయిలీలో త్వరగా పేజీ నిండిపోతుంది. లెక్చరర్లు నోట్స్ డిక్టేట్ చేసేటప్పుడు నన్ను గమనిస్తూ నాకు పేపర్ మార్చుకునే విరామం ఇచ్చేవారు. పరీక్ష రాయడానికి కొన్నిసార్లు లెక్చరర్లే స్క్రైబ్‌గా సహకరించేవారు. ఎగ్జామ్ రాయడానికి నాకు మామూలు వాళ్లకంటే ఎక్కువ సమయం ఇచ్చేవారు. నా పరీక్ష పూర్తయ్యే వరకు నా ఫ్రెండ్స్ నా కోసం వెయిట్ చేసేవాళ్లు. క్లాస్ మేట్స్ నుంచి క్లాస్ లీడర్, లెక్చరర్లు, ప్రిన్సిపల్ అందరూ ఆప్యాయంగా చూశారు. వారందరి సహకారం వల్లే ఇప్పుడు ఈ స్థాయికి చేరగలిగాను. హైదరాబాద్‌లో ఇఫ్లూలో ఎం.ఏ ఇంగ్లిష్ లిటరేచర్, పీహెచ్డీ చేశాను. పీజీకి వచ్చిన తర్వాత మొత్తం బ్రెయిలీలో రాయడం కుదరదని టైపింగ్ నేర్చుకున్నాను. దాంతో కంప్యూటర్ ఆపరేట్ చేయడం సులువైంది. చదువుతోపాటు కర్ణాటక, హిందూస్థానీ సంగీతం నేర్చుకుని టీవీ ్రపోగ్రాముల్లో పాటలు పాడాను. కాలేజ్‌లో బ్యూటీ కాంటెస్ట్‌లు, ఫ్యాషన్ ర్యాంప్ వాక్ చేశాను. ఇప్పుడు ఢిల్లీలో కూడా మారథాన్లు చేస్తున్నాను. దేనికీ ‘నో’ చెప్పను. అందరూ చర్మచక్షువులతో చూస్తే నేను మనోనేత్రంతో చూస్తాను. రన్లో మాత్రం హెల్పర్ల సహాయం తీసుకుంటాను. పాఠాలు... పేపర్లు ఢిల్లీలో ఏఎస్ఆర్డీ కాలేజ్‌లో ఉద్యోగం వచ్చింది. ఇక్కడ కూడా సహోద్యోగులు, ప్రిన్సిపల్, స్టూడెంట్స్ ఎంతగా స్నేహపూర్వకంగా ఉంటారో చెప్పలేను. పాఠాలు చెప్పడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ స్టూడెంట్స్ పేపర్లు దిద్దడంలో మాత్రం మా వారి సహకారం తీసుకుంటాను. రొటేషన్‌లో భాగంగా ఇంగ్లిష్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ బాధ్యతలు వచ్చాయి. అప్పుడు కొలీగ్స్ ‘చేయలేనని చెప్పకు. అది కెరీర్లో పెద్ద అడ్డంకి అవుతుంది. బాధ్యతలు తీసుకో, మేమున్నాం’ అన్నారు. ఆ భరోసాతో అడ్మినిస్ట్రేషన్బాధ్యతలు తీసుకున్నాను. ‘నువ్వు పేరుకి ఉంటే చాలు, పని మేము చేసి పెడతాం’ అన్నారు. కానీ నా మనసే అంగీకరించలేదు. టైమ్‌టేబుల్ సెట్టింగ్ నుంచి స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ వరకు స్వయంగా చేశాను. పేపర్ వర్క్ అయితే కష్టమయ్యేదేమో, టెక్నాలజీతో అప్డేట్ అవుతుంటాను కాబట్టి మొత్తం డిజిటల్‌గానే చేయగలిగాను. రాష్ట్రపతి పురస్కారం ఇంగ్లిష్ పాఠాలు చెప్పడం నా వృత్తి అయితే, ఇంగ్లిష్ సాహిత్యం నా ప్రవృత్తి అని చెప్పవచ్చు. తెలుగులో నాకు నచ్చిన సాహిత్యాన్ని ఇంగ్లిష్‌లోకి అనువాదం చేస్తున్నాను. నెల్లూరులో పెన్నా రైటర్స్ అసోసియేషన్‌కు చెందిన ప్రముఖ రచయిత మోపూరు పెంచల నరసింహం గారి ఎర్రదీపం రచనను క్రిమ్సన్ ల్యాంప్ పేరుతో, రాతిపాటను స్టోన్సాంగ్ పేరుతో అనువదించాను. వివిధ సామాజికాంశాల మీద జర్నల్స్‌లో 12 వ్యాసాలు రాశాను. రచయితల సదస్సుకు హాజరవుతుంటాను. రచయితల నుంచి ‘దృష్టిలోపం’ అనే ఇతివృత్తం ఆధారంగా రచనలను ఆహ్వనించి ప్రచురించడం, కలకత్తా రైటర్స్ వర్క్‌షాప్‌లో పోయెట్రీ కలెక్షన్‌ను ప్రచురించడంలో కీలకంగా పని చేశాను. డిసెంబర్ మూడవ తేదీ ఇంటర్నేషనల్ డిజేబులిటీ డే సందర్భంగా 2017లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్గారి చేతుల మీదుగా ‘రోల్‌మోడల్’ జాతీయ పురస్కారం అందుకోవడం, ప్రధానమంత్రి నుంచి ప్రశంసాపూర్వకమైన అధికారిక ఉత్తరం అందుకోవడం మాటల్లో చెప్పలేని ఆనందం. ఏడు కవితలకు అవార్డులు వచ్చాయి. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్, నాటా సభలకు ఆహ్వనం, దర్భంగా, మైథిలీ రీజియన్‌లో కుల అణచివేత, ఆదివాసీ సాహిత్యం, దళితుల సమస్యల మీద రాయడం... వంటివి నేను నా జీవితాన్ని ఆదర్శవంతంగా జీవిస్తున్నాననే సంతోషాన్ని కలిగించిన సందర్భాలు. స్ట్రీట్ చిల్డ్రల్డన్ గురించి రాసిన ‘వీథిచుక్క’ రచనకు తెలుగు వాళ్ల నుంచి అందుకున్న ప్రశంసలకు లెక్కలేదు. అందమైన కుటుంబం కుటుంబం విషయానికి వస్తే... డిగ్రీ కాగానే పెళ్లయింది. మా వారు బంధువులబ్బాయే. ఆయనది ఫైనాన్స్ సెక్టార్. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో కాపురం ఉన్నాం. అప్పుడు పీజీ, పీహెచ్డీ చేశాను. నాకు ఢిల్లీలో ఉద్యోగం రావడంతో ఇద్దరు పిల్లలతో ఢిల్లీలో ఉంటున్నాం. ఇక్కడకు వచ్చిన తర్వాత ఫ్రెంచ్‌లో అడ్వాన్స్డ్ డిప్లమో చేశాను. నిత్యం చదువుతూ, రాస్తూ ఉండడం ఇష్టం. అలాగే పిల్లలకు కథలు చెప్పడం ఇంకా ఇష్టం’’ అన్నారు జ్యోతి ఫణిజ. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
చిన్నతనంలోనే గద్దర్ మనసుకు గాయాలు.. అడుగడుగునా అవమానాలే!
పదం ఆయన కోసం కదం తొక్కుతుంది. కళామతల్లి ఆయన పేరు చెప్తే పులకరించిపోతుంది. తెలంగాణ ఉద్యమంలో మూడక్షరాల పేరు మూడు కోట్ల మందిలో చైతన్యం తీసుకొచ్చింది. ఆయనే ప్రజాకవి గద్దర్. అందరికీ అర్థమయ్యేలా, ముచ్చట చెప్తున్నట్లుగా, రోమాలు నిక్కబొడిచేలా, పిడికిలి బిగించి పోరాటం చేసేలా పాడటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. సినిమాల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎన్నో పాటలు పాడారు. ఆయన పాటలు, కళారూపాలు దేశంలోని దాదాపు అన్ని ఆదివాసీ భాషలు సహా 15 నుంచి 20 దాకా భారతీయ భాషల్లోకి అనువాదమైన చరిత్ర కూడా గద్దర్‌దే! కోట్ల మంది మనసులు గెలుచుకున్న ఆయన గొంతు నేడు(ఆగస్టు 6) శాశ్వతంగా మూగబోయింది. గద్దర్ అసలు పేరు విఠల్ రావు. ఆయన ప్రస్థానం అంత ఈజీగా సాగలేదు. జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాలేజీలో వెంట్రుకలు కత్తిరించి అవహేళన తను ఎదుర్కొన్న వివక్ష గురించి గద్దరే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో పెదవి విప్పారు. 'నా పేరు గుమ్మడి విఠల్ రావు.. చిన్నప్పటినుంచి క్లాస్‌లో ఫస్ట్. ఓసారి తరగతిలో టీచర్ ఉండి.. నీదే కులమని అడిగాడు. మేము అంటరానివాళ్లం అని చెప్పాను. మరి నీకెందుకు రావు? అని పేరు చివరన దాన్ని తీసేశారు. ఇప్పుడు నా పేరు రికార్డుల్లో గుమ్మడి విఠల్ అని మాత్రమే ఉంది. చదువులో నేను ముందుండేవాడిని. ఉస్మానియా కాలేజీలో చేరినప్పుడు నా వెంట్రుకలు కత్తిరించేవారు. మొజంజాహీ మార్కెట్లోని హాస్టల్ నుంచి ఉస్మానియా కాలేజీకి నడుచుకుంటూ వెళ్లేవాడిని. ఓ పూట తిండి కోసం, కాలేజీ ఫీజు కోసం హోటల్లో పనిచేశాను' అని పేర్కొన్నారు. (చదవండి: విషాదం.. ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత) గోచీ కట్టి, గొంగడి భుజాన వేసుకుని ఊళ్లో మొదటి బెంచీ కుర్రాడైన గద్దర్ ఇక్కడ మాత్రం చివరి బెంచీలో కూర్చున్నారు. ఈ వివక్షే అతడిని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. సమాజాన్ని మార్చాలనుకున్నారు. పాటను తన ఆయుధంగా మలుచుకున్నారు. గోచీ కట్టి, గొంగడి భుజాన వేసుకుని ఎర్రజెండా చేతపట్టుకుని గద్దర్ పాట పాడుతూ నృత్యం చేస్తుంటే చూసేవాళ్లకు సాక్షాత్తూ శివుడు తాండవం చేస్తున్నట్లుగా అనిపించేది. అయితే దేవుడి గుడిలో జరిగిన ఓ కార్యక్రమంలో పెద్దలు.. దళితుడైన విఠల్ రావును వేదిక మీది నుంచి కాకుండా కింద ప్రదర్శన ఇవ్వాలనే షరతు పెట్టారు. బ్యాంకు ఉద్యోగం చేసిన తొలినాళ్లలో విమలను పెళ్లి చేసుకున్నాక ఆయన కులం తెలిసి ఎవరూ అద్దెకిచ్చేవారు కాదు. దీంతో వేరే కులం పేరు చెబుతూ అద్దె ఇళ్లలో కాపురం చేసేవారు. ఈ అసమానతల ప్రపంచంలో ఉనికిని చాటుకునే క్రమంలో గద్దర్‌కు అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి. బుర్ర కథ కళాకారునిగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం (1969)లో పాల్గొని అరెస్టు కావడం, గుడిసెవాసుల పోరాటంలో పాల్గొనడం, అంబేద్కర్ విగ్రహ స్థాపన ఉద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలు తినటం... ఈ అనుభవాలతో ఆయనకు రాజ్య హింస గురించి తెలిసి వచ్చింది. తాను ఎంచుకున్న మార్గం కష్టాలతో కన్నీటిమయంగా ఉంటుందని తెలిసినా ప్రజల కోసం ఆయన నిలబడ్డారు. నిర్భయంగా, నిక్కచ్చిగా ముందుకు వెళుతూ పాటతో ప్రజల్లో చైతన్యం తెచ్చారు. చదవండి: గద్దర్ ఏ సినిమాల్లో నటించారో తెలుసా? -
పాటల తూటాల యోధుడు
పాట పోరాట రూపం. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా ప్రజల గుండెల్లోకి తీసుకెళ్లేది పాటే. అలాంటి పాటల ప్రవాహానికి బలాన్నీ, బలగాన్నీ సమకూర్చిన వాగ్గేయకారుడు సుద్దాల హనుమంతు. ‘బాంచెన్ దొర కాలు మొక్కుతా’ అన్న వారితో బందూకులను పట్టించిన పాటలు ఆయనవి. హరికథ, బుర్రకథ, యక్షగానాలతో బూజు పట్టిన నిజాం నిరంకుశ పాలకుల కోట గోడలను కూల్చివేసిన జనగీతం ఆయన. 1910లో నేటి యాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో లక్ష్మీ నరసమ్మ, బుచ్చి రాములు దంపతులకు జన్మించారు. 14 ఏళ్ల వయసులోనే ఆయన పాటలు తెలంగాణలోని ప్రతి గడపగడపను తట్టి లేపాయి. హైదరాబాద్‌లో వ్యవసాయ శాఖలో చిన్న ఉద్యోగం చేస్తూ ప్రజోద్యమాలకు ఊతం ఇచ్చేవారు. ఇది గమనించిన ప్రభుత్వాధికారులు ఆయన్ని ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు హెచ్చరించారు. దీంతో హనుమంతు ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి పాటలతో నిజాం రాక్షస పాలనపై రణభేరి మోగించాడు. 1944లో 11వ ఆంధ్ర మహాసభ సమావేశాలు భువనగిరిలో జరిగాయి. హనుమంతు వాలంటీర్‌గా పని చేశారు. ఆ సమావేశాల్లో నాయకుల ప్రసంగాలను విని హనుమంతు పోరాట మార్గాన్ని ఎంచుకుని తన కలానికి గలానికి మరింత పదును పెట్టాడు. ఆంధ్ర మహాసభ ఇచ్చిన పిలుపునందుకుని ప్రతి గ్రామంలో సంఘం పెట్టడానికి ప్రజలను చైతన్యవంతం చేశాడు. నిజాం పాలనకు వ్యతిరేకంగా 1946–51 మధ్య జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో హనుమంతు కమ్యూనిస్టు పార్టీ సాంస్కృతిక దళానికి నాయకత్వం వహించారు. ‘వెట్టిచాకిరి విధానమో రైతన్న /ఎంత జెప్పిన తీరదో కూలన్న’ అంటూ దుర్మార్గమైన వ్యవస్థను సుద్దాల హనుమంతు తన పాటల్లో వర్ణించాడు. ‘పల్లెటూరి పిల్లగాడ!/ పసులగాసే మొనగాడా!/పాలు మరిసి ఎన్నాళ్ళయిందో’ అంటూ వెట్టి చాకిరీతో నలిగిపోతున్న తెలంగాణ బాల్యాన్ని హనుమంతు ప్రపంచానికి పరిచయం చేశాడు. ‘సంఘం వచ్చిందరో రైతన్న మనకు బలం తెచ్చిందిరో కూలన్న‘ అంటూ ఆయన పాడుతూ ఉంటే ప్రజలకు ఎక్కడ లేని ధైర్యం వచ్చేది. ఏయే దొర కబంధ హస్తాల్లో ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయో వివరాలను సేకరించి... దొరల భూ అక్రమాలను పల్లె సుద్దుల రూపంలో చెబుతూ ప్రజలను చైతన్యపరిచారు. ఆయన పాటలు తెలంగాణ జనం నాలికల మీద నాట్యం చేసేవి. నాటి తెలంగాణ పోరాటంలో హనుమంతు రాసిన పాటలు పాడని గ్రామం లేదు. ఆయన ప్రజల భాషలో యాసలో, శైలిలో ప్రజాపయోగమైన ఎన్నో పాటలు రాసి, పాడి పలు ప్రదర్శనలు ఇచ్చారు. హనుమంతు బుర్రకథ చెబితే గడ్డిపోచ కూడా యుద్ధానికి సిద్ధమవుతుందనీ, ఫిరంగిలా పేలుతుందనేంతగా ఆనాటి ప్రజల అభిప్రాయం. రాజంపేట మండలం రేణిగుంటలో కమ్యూనిస్టు గ్రామసభలో ‘మాభూమి’ నాటకం గొల్ల సుద్దుల ప్రదర్శనలు చేస్తున్న సమయంలో నిజాం మూకలు వస్తున్నాయని తెలిసి చెట్టుకొక్కరు పుట్టకొకరుగా జనం పారిపోతున్న క్రమంలో... ఓ ముసలావిడ కర్రను హనుమంతు తీసుకొని భూమిపై కర్రతో కొడుతూ ‘వేయ్ వేయ్ దెబ్బకు దెబ్బ’ అంటూ ప్రజల్లో మనోధైర్యాన్ని నింపి నిజాం సైన్యాన్ని ఊరి పొలిమేర వరకు తరిమికొట్టారు. ఈ ఘటన తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక ఘట్టం. 1982 అక్టోబర్ 10న క్యాన్సర్ వ్యాధి కారణంగా తన జీవన ప్రస్థానాన్ని ముగించిన హనుమంతు చరిత్రను జాగ్రత్తగా భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. – అంకం నరేష్ యూఎఫ్ఆర్టీఐ తెలంగాణ కో–కన్వీనర్ -
30 రోజుల్లో రచయిత
సమాజంలో భౌతికంగా మనిషి ఎదగగలిగే ఎన్నో హోదాలున్నాయి. కానీ ‘రచయిత’ కావడం అనేది వేరే లెవెల్. రాయడం వల్ల వచ్చే ‘రిటర్నులు’ ఏమిటనేవి ఇదమిద్దంగా ఎవరూ చెప్పలేరు. అయినాకూడా కొందరు రాస్తూనేవుంటారు. రాయడం అనేది వారికి గాలి వీచినంత, పూవు పూచినంత, ప్రవాహం సాగినంత సహజం. రచయిత అనే ట్యాగ్ మనం ఊహించలేనంత పెద్దది. రచయిత అనగానే ఒక మేధావి, ఒక ఆలోచనాపరుడు, జీవితంలో అన్నీ చూసినవాడు అనే ఇమేజ్ కదలాడుతుంది. ఆటోమేటిగ్గా అది ఒక ప్రత్యేక గౌరవానికి కారణం అవుతుంది. అయితే రాసేవాళ్లకు కొన్ని సమస్యలు ఉన్నాయి. చదివేవాళ్లు తగ్గిపోయారు, పుస్తకాలు అమ్ముడు కావడం లేదు, అసలు ఎవరికైనా కాంప్లిమెంటరీ కాపీ ఇచ్చినా దాన్ని ఆసాంతం చదువుతారన్న ఆశ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత స్థితప్రజ్ఞుడైనా కొంత నిరాశ పడక తప్పదు. మరి ఇలాంటప్పుడు ఎవరైనా ఎందుకు రాయాలి? అసలు ఏ రచయితకైనా తన పుస్తకాన్ని పాఠకులు చదవాలి, పుస్తకం అమ్ముడు కావాలి అని అంత పట్టింపు ఎందుకు? అని ఎదురు ప్రశ్నిస్తారు దీపక్ విలాస్ పర్బత్. ‘వెల్ డన్! యు ఆర్ హైర్డ్’, ‘ఎ మాంక్ ఇన్ సూట్’ లాంటి రచనలు చేసిన దీపక్, అచ్చయ్యే పుస్తకాల్లో 60–70 శాతం చదవనివే ఉంటాయంటారు. అందుకే అమ్మడానికి బదులుగా ఫ్రీ గిఫ్ట్‌గా ఇవ్వడం ద్వారా పుస్తకానికి వచ్చే ఆ వందో, రెండు వందలో ఖరీదు కంటే కూడా ఎక్కువ సంపాదించవచ్చని చెబుతారు. ‘‘ఒక మోటివేషనల్ స్పీకర్‌గా మనం ఒక కాలేజీకి వెళ్లి ప్రిన్సిపాల్‌కు ఏ విజిటింగ్ కార్డో, బ్రోషరో ఇస్తే– మనం అక్కడినుంచి వచ్చిన మరుక్షణం అది చెత్తబుట్టలో పడిపోవచ్చు. పైగా అలాంటివి ఎన్ని ఇచ్చినా మన గురించి వాళ్లకు ఒక సరైన అంచనా రాకపోవచ్చు. అదే ఒక పుస్తకం ఇస్తే? బ్రోషర్ కంటే తక్కువ ఖర్చుతో ప్రింటయ్యే పుస్తకం మన గురించిన అత్యుత్తమ పరిచయ పత్రం అవుతుంది. ఆయన చదవకపోవచ్చు, ఊరికే ర్యాకులో పెట్టేయొచ్చు; కానీ ఇచ్చివెళ్లినవాడు ఒక రచయిత అనే ఇమేజ్ పనిచేస్తుంది. ఆ సైకాలజీతోనే మనం ఆడుకోవాలి,’’ అంటారు. ఆ కారణంగానే పుస్తకాన్ని మీ ఎదుగుదలకు ఒక పెట్టుబడిగా వాడుకోండి అని సలహా ఇస్తారు కైలాశ్ సి.పింజానీ. ‘డేట్ యువర్ క్లైంట్స్’, ‘క్యాచ్ ద షార్క్’ లాంటి రచనలు చేసిన కైలాశ్... ఏ ఫీల్డ్ వాళ్లయినా ఎదగడానికి పుస్తకాన్ని ఒక ఆయుధంగా మలుచుకోవచ్చునంటారు. ‘‘ఉజ్జాయింపుగా సమాజంలో తొంభై తొమ్మిది శాతం మంది రచయితలు కాలేరు. కాబట్టి, ఆ రాయగలిగేవాళ్లు అమాంతం ఆ ఒక్క శాతం బ్రాకెట్లోకి వచ్చేస్తారు. ఆ గుర్తింపే మిమ్మల్ని ప్రత్యేకంగా ఉంచుతుంది. మీరు రాకెట్ అనుకుంటే, పుస్తకం మీకు రాకెట్ లాంచర్ అవుతుంది,’’ అని చెబుతూ అర్జెంటుగా ఒక పుస్తకం రాసేయమని సలహా ఇస్తారు. అంత అర్జెంటుగా ఎలా రాసేయడం? ముప్పై రోజుల్లో పుస్తకం ఎలా రాయాలో ఈ ఇరువురు సహచరులు ‘సూపర్ ఫాస్ట్ ఆథర్’ పేరుతో శిక్షణ ఇస్తుంటారు. ‘‘పుస్తకం నూటాయాభై పేజీలకు మించకూడదు. ఏ మనిషైనా రాయగలిగేవి మూడు ఏరియాలు: సొంతం జీవితంలోని డ్రామా, వృత్తిపరమైన అనుభవాలు, ప్రత్యేక ఇష్టాయిష్టాలు. పెద్దగా రీసెర్చ్ అవసరం లేని టాపిక్ ఎంచుకోండి. దాన్ని పది అధ్యాయాలుగా విభజించుకోండి. ప్రతి అధ్యాయానికీ పది ముఖ్యమైన ప్రశ్నలు వేసుకోండి. ఒక ప్రశ్నను ఒక పేరాగా విస్తరించండి. దానికి జవాబును మూడు పేరాల్లో రాయండి. అంటే పది అధ్యాయాల్లో వంద ప్రశ్నలకు నాలుగు వందల పేరాలు అవుతాయి. రోజుకు ఐదు ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. ఇరవై రోజుల్లో వంద ప్రశ్నలు పూర్తవుతాయి. ఐదు రోజులు రీసెర్చ్‌కు వదిలేస్తే, ఇంకో ఐదురోజుల్లో మార్పులు చేర్పులు, కరెక్షన్స్ చేయండి. ముప్పయ్యో నాటికి ఫస్ట్ డ్రాఫ్ట్ రెడీ! ఎగ్జామ్ హాల్లో ఇచ్చే మూడు గంటల సమయంలో మనకు ఇష్టం లేని పాఠాల మీద ఎన్నో అడిషనల్ పేపర్లు రాసివుంటాం. అలాంటప్పుడు మనకు ఇష్టమైన టాపిక్ మీద రాయడం ఎంత సులభం?’’ అంటారు కైలాశ్. ఇలా మ్యాగీ నూడుల్స్‌లా వండే రచనలు ఎలా ఉంటాయో తెలీదు. బాగుండొచ్చు కూడా. అయితే కొందరు తెలుగు కవులు, రచయితలకు ఇవి కొత్త చిట్కాలు కాకపోవచ్చు. వాళ్లు ఇంతకంటే వేగంగా రాయగలరు; ఇంతకంటే బాగా ప్రమోట్ చేసుకోగలరు. తేడా అల్లా దీపక్, కైలాశ్ లాంటివాళ్లకు తమ విషయంలో ఒక పారదర్శకత ఉంది; మనవాళ్ల విషయంలో అదీ కనబడదు. కేవలం నెమ్మదిగా రాయడం వల్లే ఒక రచన గొప్పదైపోదు. తన రాత మీద రచయిత ఎంత ప్రాణం పెడతాడన్నది ముఖ్యం. ‘యుద్ధము–శాంతి’ మహానవలను టాల్‌స్టాయ్ తొమ్మిదిసార్లు తిరగరాశాడట. ‘కరమజోవ్ బ్రదర్స్’ చదువుతున్నప్పుడు దోస్తోవ్స్కీ ఒక ఆధ్యాత్మిక జ్వర పీడితుడిలా కనబడతాడు. వాక్యంలో పెట్టాల్సిన ఒక్క కామా గురించి కూడా ఆస్కార్ వైల్డ్ తల బద్దలుకొట్టుకునేవాడట. యావజ్జీవితం సాహిత్యమే ఊపిరిగా బతికాడు చలం. జీవితకాలం రాసిన మొత్తం కూడా గట్టిగా ఒక పుస్తకానికి మించనివాళ్లు ఉన్నారు. వాళ్లు నిజంగా రచయితలు. కానీ ఇప్పుడు పుంఖానుపుంఖంగా వస్తున్న పుస్తకాలు కొన్ని చెట్ల ప్రాణాలు తీయడానికి తప్ప పనికిరావు. కాబట్టి రాసేవాళ్లందరూ రచయితలు కారు. వచ్చిన ప్రతిదీ పుస్తకం కాదు. దాన్ని వేరు చేసుకోగలగడమే పాఠకుల విజ్ఞత. -
ఎస్. త్రిపాఠీ నిరాలా / 1897–1961 కాలాతీత కవి
సాహిత్యం ముందుగా ఊహించి జోస్యం చెప్పే రంగం కానప్పటికీ సూర్యకాంత్ త్రిపాఠీ నిరాలాలో సామాన్య జనాలను కదిలించే శక్తి ఎప్పటికీ ఉంటుందని చెప్పవచ్చు. ఆయన కవిత్వంలోను, వచనంలోను కొత్త తరం అర్థాలను కనుక్కోవచ్చు. కడచిన శతాబ్దంలో మనం కనిపెట్టలేకపోయిన లేదా విస్మరించిన విశేషాలను వెలికి తీయవచ్చు. నిరాలా భావ కవి. అదే సమయంలో ఆయన రష్యన్ భావ కవి అలెగ్జాండర్ పుష్కిన్ మాదిరిగా విప్లవాత్మక వాస్తవికతావాది. ఆయన సృజన సారాంశం ఎలా ఉంటుందంటే, అది ఒక కవితలో ఒక వృత్తాకారాన్ని పూర్తి చేసుకున్నట్లుగా కనిపిస్తుంది. ఆ తరువాతి కవితలోనే, పూర్తిగా కొత్త దిశలు అన్వేషిస్తూ, అది ఆ వలయాన్ని ఛేదించుకుంటుంది. నిరాలా గణనీయమైన రీతిలో కొత్త పుంతలు తొక్కే సృజనాత్మక వచన రచయిత. ఆయన ఆధునిక వచనం కళాఖండాల స్థాయిని సంపాదించుకుంది. నిరాలా రచనాతత్వం గురించి ఆయన సమకాలీన కవి సుమిత్రా నందన్ పంత్ చెప్పిన మాటలు బహుశా ఆయన మొత్తం సారాన్ని పట్టిస్తాయనిపిస్తుంది. ఛంద్ కే బం«ద్ తథా రూహియోంకే బంధన్.. అంటే చందస్సుతో పాటు మూఢ విశ్వాసాల బంధనాలను ఆయన ఛేదించారని పంత్ అంటారు. గత శతాబ్దంలో మూడవ దశాబ్దం నుంచి ఆరవ దశాబ్దం వరకు విస్తరించిన సాహితీ వ్యాసంగంలో వస్తువు, భాష రెండింటి విషయంలోనూ అంతటి వేగవంతమైన మార్పులు తీసుకొచ్చిన మరొక కవిని కనుక్కోవడం కష్టం. తొలిదశలో ఆయన కవితల్లో తరచు వచ్చే చిహ్నం మేఘం. దానిని ఆయన విప్లవానికి ప్రతీకగా తీసుకున్నారు. ఆధునిక భారతదేశపు మహోన్నత కవులలో నిరాలా ఒకరు. ఆయన ప్రాంతాలకు, కాలానికి అతీతమైన కవి. నిరాలా బెంగాల్‌లోని మిడ్నాపూర్‌లో జన్మించారు. ఆయన తండ్రి పండిట్ రామసహాయ త్రిపాఠీ. నిరాలా తల్లి అతడు బాగా చిన్నగా ఉన్నప్పుడే కన్నుమూశారు. మొదట బెంగాలీ మీడియంలో చదువుకున్న నిరాలా, తండ్రి పూర్వీకుల స్వస్థలమైన లక్నో వెళ్లాక.. రామకృష్ణ పరమహంస, స్వామీ వివేకానంద, రవీంద్రనాథ్ టాగూర్ వంటి మహనీయుల నుంచి స్ఫూర్తి పొందారు. ఇక అతడు ప్రఖ్యాత హిందీ కవి అయేందుకు కారకులైన వారి గురించి మనం తప్పక తెలుసుకోవాలి. వారు నిరాలా భార్య మనోహరా దేవి. ఆమె ప్రోద్బలం వల్లనే నిరాలా తన 20 ఏళ్ల వయసులో హిందీ నేర్చుకున్నారు. అనంతరం హిందీ కవిగా అవతరించారు. – కేదార్నాథ్ సింగ్, హిందీ కవి, విమర్శకులు (చదవండి: ఎయిర్‌పోర్ట్‌కి శంకర్ పేరు) -
మహోజ్వల భారతి: ‘నల్లదొరతనం’ పై రాయనన్న దేశభక్తుడు
సహాయ నిరాకరణోద్యమ స్ఫూర్తితో గరిమెళ్ల సత్యనారాయణ వీరావేశంతో ఉద్యమంలోకి దూకారు. ‘మాకొద్దీ తెల్లదొరతనము..’ అంటూ గొంతెత్తి పాడుతూ రాజమండ్రి వీధి వీధినా తిరిగారు. ఎక్కడికక్కడ జనం ఆయన చుట్టూ చేరి ఆయనతో పాటే గొంతు కలిపారు. ఆనాటి రోజుల్లో ఆ పాట నకలు ప్రతులు ఒక్కొక్కటీ పన్నెండు పైసలకు అమ్ముడు పోయాయంటే, గరిమెళ్ల పాట ఎంతలా జనాలను ప్రభావితులను చేసిందో అర్థం చేసుకోవచ్చు. బ్రిటిష్ కలెక్టర్‌కు తెలుగుభాష రాకపోయినా, గరిమెళ్ల చేత ఈ పాట పాడించుకుని విన్నాడు. తనకు భాష అర్థం కాకపోయినా, ఈ పాట జనాలను ఏ స్థాయిలో ఉద్రేకపరచగలదో ఊహించగలనంటూ గరిమెళ్లకు ఏడాది కఠిన కారాగార శిక్ష విధించాడు. అంతటి మనిషికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన పాలకుల వల్ల ఎలాంటి మేలూ జరగలేదు. స్వాతంత్య్రోద్యమ కాలంలో జనాలను ఉర్రూతలూగించే పాట రాసినందుకైనా ఆయనకు ఎలాంటి ప్రభుత్వ సత్కారాలూ దక్కలేదు. చివరి దశలో ఆయనకు ఒక కన్నుపోయింది. పక్షవాతం వచ్చింది. ఏ పనీ చేయలేని దయనీయమైన పరిస్థితుల్లో ఆయన యాచనతో రోజులను వెళ్లదీశారంటే, ఆయన పట్ల మన పాలకులు ఏ స్థాయిలో నిర్లక్ష్యం ప్రదర్శించారో అర్థం చేసుకోవచ్చు. స్వాతంత్య్రానంతరం దేశంలో ప్రబలిన అవినీతికి విసిగి వేసారిన గరిమెళ్ల మిత్రుల్లో కొందరు ఆయనను ‘మాకొద్దీ నల్లదొరతనము..’ అంటూ కొత్త పాట రాయాల్సిందిగా కోరారు. అయితే, నరనరానా దేశభక్తిని జీర్ణించుకున్న ఆయన అందుకు అంగీకరించలేదు. దుర్భర దారిద్య్ర పరిస్థితులతో పోరాడుతూనే ఆయన 52 ఏళ్ల వయసుకే తుదిశ్వాస విడిచారు. నేడు గరిమెళ్లవారి జయంతి. 1893 జూలై 14న ఆయన శ్రీకాకుళంలోని నరసన్నపేటలో జన్మించారు. -
‘పచ్చి కడుపు వాసన’కు ‘ఉమ్మడిశెట్టి సత్యాదేవి’ అవార్డు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ కవి యార్ల గడ్డ రాఘవేంద్రరావు రాసిన ‘పచ్చి కడుపు వాసన’ కవిత్వం 34వ ‘ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు–2021’కు ఎంపికైంది. యార్లగడ్డ కలం నుంచి వచ్చిన ఆరో సంపుటి ‘పచ్చి కడుపు వాసన’. నిజామాబాద్ జిల్లాకు చెందిన రాఘవేంద్రరావు సీనియర్ జర్నలిస్టు. 13 ఏళ్లుగా ఓ పత్రిక జర్నలిజం కళాశాల ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ అవార్డు న్యాయ నిర్ణేతలుగా కె. శివారెడ్డి, శీలా సుభద్రాదేవి, దర్భశయనం శ్రీనివాసాచార్య వ్యవహరించారు. -
సోదరుడు దోస్తోవ్స్కీ
‘‘అమ్మా, నా బంగారం! నిజానికి మనం అంతా అందరికీ బాధ్యులమే. కానీ ఈ సత్యం మానవాళి గుర్తించటం లేదు. గుర్తించిననాడు భూమి స్వర్గంగా మారిపోతుంది.’’ (కరమజోవ్ సోదరులు)తెలుగు సాహిత్యం వరకూ గతేడాది చివర్లో ఒక అద్భుతం సంభవించింది. అది రష్యన్ మహానవల ‘బ్రదర్స్ కరమజోవ్’కు తెలుగు అనువాదం రావడం! ఆ నవల సృష్టికర్త, ఈ పదాన్ని దాని అక్షరమక్షరంతో నిజం చేసిన ఫ్యోదర్ దోస్తోవ్స్కీ (1821–1881) ద్విశతాబ్ది జయంతి కూడా గతేడాదే(నవంబర్ 11) కావడం మరో విశేషం. ఆ సందర్భాన్ని ఉత్సవం చేయడం కోసమే ‘రష్యన్ సాహిత్యాభిమాన వేదిక’ ఈ బృహత్ కార్యానికి పూనిక వహించింది. తొమ్మిది వందల పేజీల ఈ నవలను ‘సాహితి’ ప్రచురించింది. దీని అనువాదకురాలు అరుణా ప్రసాద్ ఒక జీవితకాలానికి సరిపడా ప్రేమకు అర్హురాలు! ఇంత ఊరించిన తర్వాత దీన్ని చదవడానికి పాఠకుడు ఆతృత పడితే దెబ్బతినొచ్చు. మొత్తంగా పుస్తకంలో ఏం ఉందో(‘పితృహత్య’) మొదటే తెలిసిపోతుంది. కాబట్టి, ఆ క్షణంలో ఏం మాట్లాడుకుంటున్నారో అదే ముఖ్యం. రంగస్థలంపై పాత్రలు వచ్చి, అంతరంగాన్ని ‘ఏకపాత్రాభినయం’లా ఎలా ఆవిష్కరించుకుంటాయో ఇవీ అలాగే చేసినట్టుగా తోస్తుంది. కానీ ఆలోచిస్తే అంత అవాస్తవం ఏమీ అనిపించదు. ఒక ఉద్వేగంలోకి వెళ్లిన మనిషి ఎలా వదరుతాడో ఇక్కడా అంతే! అయితే సంభాషణల్లో జీవితపు మౌలిక ప్రశ్నల్ని ఎలా వెతుక్కుంటారన్నది ముఖ్యం. ఎన్ని చిత్తవృత్తులు, ఎన్ని వృత్తాంతాలు, ఎన్ని ఒప్పుకోళ్లు, ఎన్ని వేడుకోళ్లు! ఇందులో ప్రతి ఒక్కరూ ‘పాపం’ చేసినట్టే ఉంటారు. దానికి తగిన ‘శిక్ష’ అనుభవిస్తూనే ఉంటారు. అల్పులు, ఉన్మత్తులు, మొరటు మనుషులు, ఏ పెద్దరికమూ నిలుపుకోలేని హాస్యగాళ్లు... అసలు ‘నీచుడు’ అనుకునేవాడిలోనూ అత్యంత సున్నితపు పొరలు ఉంటాయని తెలుస్తున్నప్పుడు ఆనంద బాష్పాలు కారుతాయి. తను చచ్చేంత డబ్బు అవసరంలో ఉన్నా, ఆ డబ్బు కోసం అవసరమైతే తండ్రినే చంపేంత కోపంగా ఉన్నా, అదే డబ్బు అడిగితే తనకు కాత్యా ఇస్తుందని తెలిసినా, ఆమెను కాదని గృషెంకాను ప్రేమిస్తున్నప్పడు, కాత్యాను ఆ డబ్బు అడగలేకపోయానని ద్మిత్రీ విచారణలో చెప్పడం మానవాంతరంగపు లోతుకు అద్దం. ఇంతే లోతైన మరో ఘట్టం– ‘ఎల్డర్’ జోసిమా దగ్గర తన తప్పును ఒప్పుకున్న ‘రహస్య అతిథి’... ఆయన ముందు నైతికంగా తగ్గిపోయానని భావించి తిరిగి ఆయననే చంపాలనుకోవడం! మన మూలమూలలా ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ, రచయిత ఎంత సూక్ష్మాంశాల దగ్గరికి వెళ్తాడంటే ఇంత సున్నితమైన నవల మరొకటి ఉందా అనిపిస్తుంది. ఒకే అమ్మాయి (గృషెంకా) కోసం తండ్రీ కొడుకులు ఫ్యోద్ర్, ద్మిత్రీ పోటీ పడటం; ఒకే అమ్మాయి(కాత్యా) కోసం అన్నాదమ్ములు ద్మిత్రీ, ఇవాన్ బరిలో ఉన్నట్టనిపించడం... జీవితపు చేదు వాస్తవం. ఇందులో ముగ్గురు సోదరులైన ద్మిత్రీ ఒక మృగంలానూ, ఇవాన్ మేధావిలానూ, అల్యోషా ఆధ్యాత్మిక జీవిగానూ కనబడతారు. అయితే దోస్తోవ్స్కీకి మృగాల పట్ల తక్కువ అభిప్రాయం లేదు. ‘మృగాలెప్పుడూ, ఎన్నటికీ మానవుడంత క్రూరంగా ఉండజాలవు’. బహు గొంతులు, సూక్ష్మంలోనూ సూక్ష్మం దోస్తోవ్స్కీని అనితర సాధ్యమైన రచయితగా నిలబెడతాయి. ప్రతి పాత్రలోనూ రచయిత ఎంతగా పరకాయ ప్రవేశం చేస్తాడంటే, అదింక ఇంకోలా మాట్లాడే వీలున్నట్టు కనబడదు. చిన్న పాత్రలైన గ్రిగొరీ, మేడమ్ హోలకోవ్, లిజి, కొల్యాకు కూడా ఇది వర్తిస్తుంది. ఆఖరికి, తుంటరి పిల్లాడు ఇల్యూష గుండుసూదిని గుచ్చిన రొట్టెను విసరడంతో తిని చనిపోయిన కుక్క జుట్చ్‌కా కూడా ఒక ‘వ్యక్తి’గా దర్శనమిస్తుంది. అదే మథనంతో మరణానికి చేరువైన ఇల్యూషా కూడా అంతే నొప్పి పుట్టిస్తాడు. జీవితాన్ని చివరికంటా శోధించి, అందులోని సర్వ వికారాల్నీ తడుముతూ కూడా అది ప్రేమకు అర్హమైనదే అని చాటడం దోస్తోవ్స్కీ లక్ష్యం! అందుకే దేవుడి సృష్టిలోని సకల దుర్మార్గాలనూ పరిపరి విధాలుగా ఇవాన్ ఎత్తి చూపినప్పుడు కూడా దానికి స్పందనగా– తనను నిర్బంధించిన మహా ధర్మాధికారి పెదవులను క్రీస్తు ముద్దాడిన కథనాన్ని పునర్జీవిస్తూ – అల్యోషా, అన్న పెదవుల మీద ముద్దు పెట్టుకుంటాడు. ఆధ్యాత్మిక రాజ్యస్థాపన ద్వారానే నిజమైన సోదర భావం నెలకొంటుందని దోస్తోవ్స్కీ విశ్వాసం. అరెస్టయ్యి, గంటలకొద్దీ సాగిన విచారణ తర్వాత, అలసటతో నిద్రపోయినప్పుడు... తనకు తలగడ పెట్టే దయ చూపినవారెవరని ద్మిత్రీ కదిలిపోతాడు. అదెవరో రచయిత చెప్పడు. కానీ ఎంతటి నిరాశలోనైనా ఒక దయగల చేయి ఎప్పటికీ ఉంటుందని చాటుతాడు. ‘అటువంటి ఒక్క జ్ఞాపకం ఉన్నా అది కూడా మనను కాపాడటానికి ఉపయోగపడుతుంది’ అని ముగింపులో వీడ్కోలు చెబుతూ పిల్లలకు అల్యోషా చెప్పేది ఇందుకే. అసలు హంతకుడు ఎవరో బయటపడేప్పటికి ఈ నవల కాస్తా సస్పెన్స్ థ్రిల్లర్ రూపు తీసుకుంటుంది. కానీ దీని విస్తృతి రీత్యా ఆ వర్గానికి పరిమితం చేయడం దీన్ని సరైన అంచనా కట్టకపోవడమే అవుతుంది. ఇది సమస్త మానవాళి పశ్చాత్తాపాల చరిత్ర! జీవన మధువును నింపుకోవడానికి ప్రతి ఒక్కరూ పడే తహతహ. పాపభీతితో కుమిలిపోయే ఎందరో జీవన్మృతుల వ్యథ. 1880లో ఈ నవల వచ్చిన 4 నెలలకు దోస్తోవ్స్కీ మరణించాడు (ఈ ఫిబ్రవరి 9న 140వ వర్ధంతి.) ఆ లెక్కన ఇది ఒక మహారచయిత చివరి వీలునామా కూడా! ‘అద్భుతాలను’ ఆశిస్తాడు మనిషి. కానీ అద్భుతం వల్ల కాక మామూలుతనం వల్ల దాని విలువ పెరగాలి. ఈ పుస్తకం ఎంత మామూలుదంటే, ఆ మామూలుతనమే అద్భుతంగా తోస్తుంది. -
‘గిన్నిస్‌బుక్’ పరిశీలనలో ‘భారతవర్ష’
తెనాలి: విజయవాడకు చెందిన బహుభాషా కోవిదుడు వెంకట్ పూలబాల రచన ‘భారతవర్ష’కు అరుదైన గౌరవం లభించింది. తెలుగు వారి సంప్రదాయ, సాంస్కృతిక అంశాలతో గద్య పద్య కావ్యంగా 1,265 పేజీల్లో వెలువడిన ఆధ్యాత్మిక శృంగార కావ్యం భారతవర్ష. అమెరికాలోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం ఈ నెల 16న వెబినార్‌లో ఈ గ్రంథాన్ని ఆవిష్కరించనుంది. డబ్బు కన్నా విలువైనవి మానవ సంబంధాలని, గుణగుణాలు ప్రగతికి సోపానాలనే మరపురాని ఇతివృత్తంతో, మనసుకు హాయి గొలిపే భాషతో, ఉదాత్తమైన పాత్రలతో మనోరంజకంగా మలచిన కావ్యం. తెలుగు అకాడమీ చైర్పర్సన్ డాక్టర్ నందమూరి లక్ష్మీ పార్వతి అభినందనలు అందుకున్న భారతవర్ష, విడుదల కాకుండానే గిన్నిస్‌బుక్ పరిశీలనలో ఉండటం మరో విశేషం. వెయ్యి పేజీలు మించిన నవల రచనకు మిట్చెల్ అనే ఇంగ్లిష్ రచయిత్రికి పదేళ్లు పట్టింది. ‘జూరాసిక్ పార్క్’ రచనకు క్రోక్టర్ అనే అమెరికన్ రచయిత అంతే సమయం తీసుకున్నారు. ఫ్రెంచ్ రచయిత విక్టర్ హ్యుగోల్కు ‘మిజరబుల్’ అనే నవలకు పన్నెండేళ్లు పట్టింది. పూలబాల తన వృత్తపద్యాలతో గ్రాంధిక తెలుగులో భారతవర్ష గ్రంథాన్ని కేవలం ఎనిమిది నెలల్లోనే రచించారు. తెలుగులో తొలి ఫ్రెంచి నవల తెలుగులో తొలి ఫ్రెంచి నవల రాసిన రచయితగా గుర్తింపు పొందిన పూలబాల బహుభాషాకోవిదుడు. ఆరు విదేశీ భాషలు తెలిసిన పూలబాల, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సెంటర్లో బోధించారు. పేజీ మేకర్‌కు బదులుగా మైక్రోసాఫ్ట్ వర్డ్‌పై గ్రంథాన్ని నేరుగా కంపోజ్ చేయటం, ట్రాన్స్లిటరేషన్ ద్వారా 1,265 పేజీలు తెలుగు నవల టైపు చేయడమనే అంశాలు గిన్నిస్ బుక్ పరిశీలనలో ఉన్నాయి. -
కవిత యువత
‘శీతకాలం కోత పెట్టగ కొరడు కట్టీ ఆకలేసీ కేకలేశానే’ అని రాశాడు శ్రీశ్రీ. ‘జయభేరి’ పేరుతో ‘మహాప్రస్థానం’లో ఉన్న ఆ కవిత రాసే సమయానికి శ్రీశ్రీకి 23 ఏళ్లు. ‘పద్దెనిమిదేళ్లు దాటేస్తున్నాను. ఇంకా ఒక మంచి కవిత రాయలేదే’ అని బాధ పడతాడు మహాకవి జాన్ మిల్టన్. అతడు తన మాగ్నమ్ ఓపస్ ‘ప్యారడైజ్ లాస్ట్’ ప్రచురించే సమయానికి అరవై ఏళ్లు రాక తప్పలేదు. ‘సర్రియలిజం’ను సాహిత్యంలో ప్రవేశపెట్టిన ఝంఝామారుత ఫ్రెంచ్ కవి ఆర్థర్ రాంబో టీనేజ్లోనే రాయవలసిందంతా రాసేసి 20వ ఏటకు రిటైర్ అయిపోయాడు. అంటే 20 తర్వాత రాయాల్సింది ఏమీ లేదని అనుకున్నాడు. 80 ఏళ్ల వరకూ జీవించిన ఇంగ్లిష్ కవి విలియమ్ వర్డ్స్‌వర్త్ లేటు వయసులో అమెరికా వెళితే కుర్రవాళ్లు అతని పద్యాలను చదవడం మొదలుపెట్టారట. వర్డ్స్‌వర్త్ వారిని ఆపి ‘ఈ మధ్య రాసినవి చదవొద్దు. నా తొలి రోజుల్లో రాసినవి చదవండి. అవే నాకు ఇష్టం’ అన్నాడట. కవిత్వానికి యువరక్తానికి గట్టి సంబంధం ఉంది. ఒంట్లో కండరాలు గట్టిపడి, నరాల్లో నెత్తురు ఉత్సాహంగా దౌడు తీస్తూ, కళ్లు చురుగ్గా చూస్తూ, గుండె సరైన కారణాలకు కొట్టుకుంటూ, స్పందించే సమయాలలో నాలుక పిడచగడుతూ ఉంటే గనక బహుశా కవిత్వమే వస్తుంది. టి.ఎస్. ఇలియట్ మాస్టర్ పీస్ ‘ది వేస్ట్ ల్యాండ్’ పాతికేళ్ల లోపలే రాసినా, జాన్ కీట్స్ అత్యుత్తమమైన కవిత్వమంతా పాతికేళ్ల లోపే రాసి మరణించినా వయసు తాలూకు తాజా స్పందన కవిత్వంలో ప్రవహించడమే కారణం. ‘నూనూగు మీసాల నూత్న యవ్వనమున శాలివాహన సప్తశతి నుడివితిని’ అని శ్రీనాథుడు రాసుకోవడం వల్లే అతడు చేసిన కవన కృషి మనకు తెలిసింది. ‘ఎమోషనల్ ఫెర్వర్ ఉన్నంత కాలం మంచి కవిత్వం వస్తుంది’ అంటాడో పాశ్చాత్య కవి. యవ్వనంలో ఉండే దూకుడు, నిలదీత, ఆగ్రహం, తిరుగుబాటు, అరాచకత్వం, బేఫర్వా, అమరత్వ అభిలాష... కవికి భావోద్వేగాల ఆవేశాన్ని ఇస్తాయి. కవిత్వం ఉబుకుతుంది. ధార అవుతుంది. స్వచ్ఛదనం దానికి సజీవత్వం ఇస్తుంది. తెలుగులో భావ, అభ్యుదయ, విప్లవ కవులు, ఆ తర్వాత స్త్రీవాద, దళిత, మైనారిటీ, బహుజన కవులు ఐతే ఆ ఉద్యమాల యవ్వనంలో లేదా తాము యవ్వనవంతులుగా ఉన్నప్పుడో రాసిన కవిత్వంలోని పదును, వాక్యం తాకి చూస్తే చీరుకునే వాదర ఆ తర్వాతి స్థిర పంక్తులలో కనిపించవు. ఈ ఒక్క గుణం చేతనే కవిత్వం ఎప్పటికప్పుడు యువ మునివేళ్లను వెతుక్కుంటూ వెళ్లి ప్రతి తరంలోనూ మరుజన్మ పొందుతూ ఉంటుంది. ‘వత్తి జేసి నూనె బోసి బతుకును వెల్గించినందుకు కొడుకు ఈ అమ్మదీపాన్ని గాలికి పెట్టి పోయిండు’ అని రాస్తాడు తగుళ్ల గోపాల్. మహబూబ్ నగర్ నుంచి కవిత్వం రాస్తున్న ఇతడు ‘దండ కడియం’ పేరుతో కవిత్వం వెలువరించాడు. ‘టేబుల్‌పై ఎన్ని కూరలున్నా మాటల్ని కలుపుకుని తిన్నప్పుడే కడుపు నిండా తిన్నట్టుంటుంది’ అంటాడు ‘నాలుగు గిన్నెల కూడలి’ కవితలో. మరో కవి పల్లిపట్టు నాగరాజు ‘దూడ మూతి వాసన’ కవితలో ‘మనలా మనుషులైతే కులం వాసనో మతం వాసనో వచ్చేదేమో కసువు తినే బిడ్డలు కదా... కవుడూ కుచ్చడం తెలీని మూగజీవాల ప్రేమ వాసన’ అని రాస్తాడు. ఇతనిది చిత్తూరు జిల్లా. ‘యాలై పూడ్సింది’ ఇతని పుస్తకం. ‘ఇవ్వాళంతా వాన కురిసింది. నువ్వు లాలనగా తాకినట్టు గాలి. నువ్వు కోపంతో తోసినట్టు వరద. నువ్వు నిదానంగా కూర్చున్నట్టు ఊరు’ అని రాస్తాడు నంద కిశోర్ తన కవిత్వ పుస్తకం ‘యథేచ్ఛ’లో. ఇతనిది వరంగల్. మొన్న ప్రకటించిన ‘సాహిత్య అకాడెమీ యువ పురస్కారం– 2021’కి తుది పోటీలో నిలిచిన ఎనిమిది పుస్తకాలూ కవిత్వానివే కావడం చూస్తే కవిత్వం యువ కవులను అంటి పెట్టుకునే ఉన్నది అనిపిస్తుంది. గత యాభై ఏళ్లలో అక్షరాస్యత తాకిన వర్గాల నుంచి, గత రెండు మూడు దశాబ్దాలలో తాగునీరు, సాగునీరు చూసిన పల్లెల నుంచి వస్తున్న ఇటీవలి కవులు తమ ప్రాంతాల, నేపథ్యాల, జీవనాల గాథలు గాఢంగా కవిత్వంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ‘ట్యాక్స్ పేయర్స్ డబ్బుతో నిర్మితమైన ఉపగ్రహాలు అడవుల గర్భంలో దాగున్న ఖనిజాలను లొకేట్ చేస్తాయి... ఆదివాసీ నవ్వు పువ్వులను చిదిమేస్తాయి’ అని రాస్తాడు సురేంద్రదేవ్ చెల్లి తన ‘నడిచే దారి’ పుస్తకంలో. ఇతనిది యానాం. తండ హరీష్ గౌడ్, బండారి రాజ్‌కుమార్, రమేశ్ కార్తిక్ నాయక్, జాని తక్కెడ శిల... వీరంతా ఈ పురస్కారం కోసం చివరి పట్టికలో నిలిచినవారిలో ఉన్నారు. పోటాపోటీగా ఢీకొన్నారు. యువ సాహిత్యకారులను ప్రోత్సహించడానికి అకాడెమీ ‘యువ పురస్కారం’ ప్రకటించిన గత కొన్నేళ్ల నుంచి యువతీ యువకులు ఉత్సాహంగా చేయదగ్గ కృషి చేస్తున్నారన్నది వాస్తవం. చిన్న వయసులో గుర్తింపు దక్కితే పొంగిపోతున్నారన్నదీ వాస్తవం. అయితే ఆ తర్వాతి కొనసాగింపు గురించే కొందరికి చింత ఉన్నది. చిన్న వయసులో ఎక్కువ గుర్తింపు వస్తే సృజన క్షుద్బాధ తీరి ఒడ్డున కూర్చుంటారని హెచ్చరించే పెద్దలు ఉన్నారు. ఇప్పటివరకూ యువ పురస్కారం పొందిన వారు ఆ పురస్కారం పొందాక ఏ మేరకు కృషిని హెచ్చింపు చేసుకున్నారో పరిశీలించుకోవాల్సి ఉంది. పెద్ద గీత గీయాల్సి ఉంది. యువకులే భావి సాహిత్య నిర్మాతలు. ఆశలు వారిపైనే! కాకపోతే ప్రవాహాన్ని వీడ వద్దని, తెడ్డు వదల వద్దని, ఈత వచ్చేసిందని పొగడ్తల సుడిలో దూకేయవద్దని హితవు!! యువ కవులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. -
కువెంపు కోడలు రాజేశ్వరి కన్నుమూత
సాక్షి, శివాజీనగర(కర్ణాటక): జాతీయ కవి కువెంపు కోడలు, కవి కే.పీ.పూర్ణచంద్ర తేజస్వి సతీమణి రాజేశ్వరి (84) బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మంగళవారం ఉదయం కన్నుమూశారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న రాజేశ్వరి అనారోగ్యంతో మూడు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు. చికిత్స ఫలించకపోవడంతో మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆమె కోరిక మేరకు దేహాన్ని ఓ ఆస్పత్రికి దానం చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చదవండి: డిజిటల్ కరెన్సీకి తుది మెరుగులు!.. సెబీకి అప్పగిస్తే ఏం చేద్దాం? -
హక్కుల ఉద్యమకారిణి కమలా భాసిన్ కన్నుమూత
-
హక్కుల ఉద్యమకారిణి కమలా భాసిన్ కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ మహిళా హక్కుల ఉద్యమకారిణి, రచయిత్రి కమలా భాసిన్(75) మృతిచెందారు. ఆమె చాలా రోజులుగా కేన్సర్‌తో పోరాడుతున్నారు. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. భారత్‌తోపాటు దక్షిణాసియా దేశాల్లో మహిళా ఉద్యమాల్లో కమల చురుగ్గా పాల్గొన్నారు. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లో పుట్టిన తేదీ న్యూఢిల్లీ: మీరు కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారా? విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అలాగైతే మీ పుట్టిన తేదీ, నెల, సంవత్సరం పూర్తిగా ముద్రించిన వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను మీరు పొందొచ్చు. ప్రస్తుతం ఈ సర్టిఫికెట్లలో వయస్సు మాత్రమే ఉంటోంది. దీనివల్ల విదేశాలకు వేళ్లేవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే వచ్చే వారం నుంచి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లలో లబ్ధిదారుల పుట్టిన తేదీ, నెల, సంవత్సరాన్ని ముద్రించనున్నట్లు అధికారులు వెల్లడించారు. చదవండి: కాంగ్రెస్‌లోకి కన్హయ్య, జిగ్నేష్.. ముహుర్తం ఖరారు -
జీవితం ఏ నిర్వచనానికి లొంగనిది..!
‘తాతగారు, మీరు పెద్దగా చదువుకోలేదు. అయినా, ఎంతో ఆనందంగా ఉంటారు. అమ్మ నాన్నలు పెద్ద చదువులు చదివారు. పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు కానీ సంతోషంగా ఉండరు. ఎందుకని?‘ అమాయకంగా తన పదేళ్ల మనవడడిగిన ప్రశ్నకు పెద్దగా నవ్వేశారా తాతగారు. ‘నానీ, నేను జీవితాన్ని జీవిస్తున్నాను. వాళ్ళు బతుకుతున్నారు. అంతే’ అన్నారాయన. ప్రశ్న అమాయకమైనదే కానీ, సమాధానం ఎంతో లోతైనది. వేదాంతులు, తాత్వికులు చెప్పేటంత, చెప్పినంత సాంద్రమైనది. గాఢమైనది. అనేకానేక అనుభవాల పొరలను తనలో ఇముడ్చుకుని, తమాయించుకుని, తెప్పరిల్లి జీవితార్ణవపు సుఖ దుఃఖాల ఆటుపోట్లను సమంగా తీసుకోగలిగిన స్థితప్రజ్ఞత ధ్వనిస్తోంది ఆ సమాధానం లో. ఆ తాతగారి జీవితానంద ఆస్వాదనకు, కొడుకు, కోడలి ఆందోళనకు, ఆశాంతికి భేదమదే. జీవితాన్ని జీవించాలి. అంటే..? జీవితంలోని సుఖాలను ఎలా హాయిగా అనుభవిస్తున్నామో, దుఃఖాలనూ అలాగే స్వీకరించగలగాలి. జీవితం పట్ల ఒక అవగాహన ఏర్పరుచుకోవాలి. హిమం ఒక వాతావరణంలో కరిగిపోవటం, మరొక వాతావరణంలో ఘనీభవించటం, సూర్యోదయ సూర్యాస్తమాయాలు ఏర్పడం ఎంత సహజమో /జీవితంలోని ఎత్తు పల్లాలు అంతే. మనిషికి ఆలోచనా శక్తి, ఒక మనస్సు దానికి స్పందన ఉన్నాయి. సుఖాన్ని తీసుకున్నంత హాయిగా ఆహ్లాదంగా మనస్సు దుఃఖాన్ని తీసుకోలేదు. రెండిటిని సమానంగా తీసుకోవాలని బుద్ధికి తెలుస్తుంది. కాని మనస్సుకు తెలియదు. బుద్ధి అనంతమైన భావాలకు / ఆలోచనలకు ఆవాసం. వాటికి స్పందించేది మనస్సు. అది దాని లక్షణం. సుఖదుఖాల భావన రెండిటికి సమానంగా తెలియాలి. అపుడే జీవితంలోని ఆహ్లాద ఘటనలను, జీవితాన్ని అతలాకుతలం చేసే అనూహ్య సంఘటనలను అక్కున చేర్చుకోగలం. ఆ స్థితికి చేరుకున్నప్పుడే జీవితాన్ని జీవించగలం మనోస్థైర్యంతో. అంతటి కుదురైన మనస్సు మన జీవిత కుదుళ్లను పెకలించలేదు. అన్ని వేళలా మనస్సును స్థిరంగా ఉంచుకోవటమే స్టితప్రజ్ఞతంటే. ఆ తాతగారికి ఉన్న గొప్ప లక్షణం అదే. కొంతమందికది సహజాభరణం. కొందరు ప్రయత్నించి సాధిస్తారు. ఇంకొందరికి జీవితం నేర్పుతుంది. కొందరికి జీవితంలో ఒంటపట్టదు. మనిషి వివేచనను, విచక్షణలను సంయోగం చేయగలిగితే చాలు. అది చిక్కుతుంది. ఒక మనిషి జీవితంలో పైకి రావటమనేది అతని తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. ఒక మార్గాన్ని ఎంపిక చేసుకుని దానిలో పయనించి తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలడు. అది ఒక ఉద్యోగం కావచ్చు లేదా వ్యాపారం కావచ్చు. జీవితంలో చక్కగా స్థిరపడి, ఆర్థికం గా పరిపుష్టుడై సమాజంలో గౌరవం, గుర్తింపు తెచ్చుకుంటాడు. అయినా ఇతనికి తృప్తి లేనట్లయితే ఆశాంతికి లోనవుతుంటాడు. దీనికి భిన్నంగా అంతే తెలివితేటలున్న మరొక వ్యక్తి మంచి ఆవకాశాలు రాక సాధారణ జీవితం గడుపుతూ ఉండచ్చు. సమాజం అతన్ని అసమర్థుడుగా భావించవచ్చు. కాని, ఈ వ్యక్తి తనలోని అద్భుత గుణమైన తృప్తితో తనకున్న దానితో, తను గడుపుతున్న జీవితంతో ఆనందంగా ఉండచ్చు. ఈ ఆనందమే మనిషిని జీవితాన్ని ప్రేమించేటట్లు చేసి నిజంగా జీవించేటట్టు చేస్తుంది. మొదటి వ్యక్తి అంత సాధించినా తృప్తి అనే గుణం లేనందువల్ల ఆశాంతికి గురవుతాడు. మనసు కు ఓ స్థిరత్వం ఉన్నప్పుడే తృప్తి అనే గుణం మనిషి వ్యక్తిత్వంలో ఒదిగిపోతుంది. అది ఉన్నవారే జీవితాన్ని ఆనందంగా గడపగలరు. చాలామంది తమ జీవితాన్ని ఇతరుల జీవితం తో పోల్చుకుంటారు. ఒకింత స్ఫూర్తికి, అలా తామూ ఎదగాలనే భావన లేదా/ ఆలోచనకు, అది అవసరం. అదీ ఒక స్థాయి వరకు మాత్రమే అభిలషణీయం/ హర్షదాయకం. కానీ అనుచితమైన పోలిక మన ప్రశాంత చిత్తమనే నదిలో పడ్డ రాయి లాంటిది. జీవితాన్ని ఆనందంగా గడపాలంటే చిన్న, చిన్న విషయాలను ఆస్వాదించటం అలవరచుకోవాలి. నారింజ రంగులో ఉండే సూర్యోదయం, అరుణ వర్ణపు సూర్యాస్తమయం, సప్తవర్ణ శోభిత హరివిల్లు, మంచు బిందువులు ముద్దిస్తున్న పుష్పాలు, ఎంత పని ఒత్తిడిలో ఉన్నా కుటుంబంతో కొంత సమయాన్ని గడపటం, ఒక పుస్తకం చదవటం, మొక్కలకు నీళ్లు పోయటం ఒకరి దప్పికను తీర్చటం, ఒకరి ఆకలిని తీర్చటం... వీటిలో ఏదైనా కావచ్చు. మరేవైనా వారి వారి అభిరుచిని బట్టి అలవాటు చేసుకోవచ్చు. ఇదీ మన జీవితాన్ని ఆనందభరితం చేస్తుంది. ఇవే మనల్ని నిజంగా జీవింప చేస్తాయి. బాహ్య చక్షువులతోపాటు ఆనందం, ఆస్వాదన అనే మనో నేత్రాలు కావాలి. మనమే వాటిని పొందాలి/ సంపాదించుకో వాలి. అప్పుడు జీవితాన్ని ఎంత మనోజ్ఞంగా ఉంటుందో అనుభవంలోకి వస్తుంది. ఎంతోమంది రుషులు, వేదాంతులు, తత్త్వ వేత్తలు, మహానుభావులు జీవితాన్ని నిర్వచించారు. దాని లోతుపాతులు శోధన చేసి, సాధన చేసి తమ జీవితానుభావాన్ని జోడించి జీవితమంటే ఇది అని చెప్పారు. వాస్తవానికి అది వారి భావన, వారి దార్శనికత. వారి శక్తి, ప్రతిభా వ్యుత్పత్తుల మనోదారుఢ్యం మీద జీవితం/ జీవితపు కొలతలు ఆధారపడి ఉంటాయి. సామాన్యులు వాటిని అర్థం చేసుకోవటానికి వారి జిజ్ఞాసకు కృషి, సాధనల తోడు తప్పనిసరిగా కావాలి. వీరే కాక ప్రతి ఒక్కరు జీవితం అంటే ఇది, ఇదే అంటూ ఎన్నో మాటలు చెపుతుంటారు. ఇక్కడే మనం అప్రమత్తం కావాల్సింది ఉంటుంది. మన ఇంగిత జ్ఞానమూ ఉపయోగించాలి. ఈ ప్రతి నిర్వచనం వారి వారి జీవిత నేపథ్యం నుండి వచ్చింది. ఆ నిర్వచనాన్ని మన జీవితాలకు అన్వయించుకునే ముందు మనకా నేప«థ్యం ఉందా లేదా అని తెలుసుకోవాలి. ఒకవేళ ఉన్నా, ఆ పరిస్థితులలో ఆ వ్యక్తులు చూపిన గుండె నిబ్బరం, తెగువ, శక్తులు మనకున్నాయో లేదో అంచనా వేసుకోవాలి. అపుడే వాటిని స్వీకరించాలి. అయితే, అన్ని జీవిత నిర్వచనాలలో ఉండే సామ్యత చూడగలగాలి. మన జ్ఞానవివేకాలను సంయోగం చేసి ఎంతవరకు మన జీవితాలకు ఉపయోగించుకోవచ్చో నిర్ణయించుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఈ పరిశీలనకు మన చదువుల సారాన్ని కలపాలి. జీవితాన్ని ప్రేమించాలి. మనకు లభించిన జీవితాన్ని చక్కగా, హాయిగా జీవించాలి. ఈర్ష్య, అసూయలకు, అహంకారానికి, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లనే భావనకు, అసంతృప్తికి, అనవసరపు ప్రాధాన్యతలకు, ఆడంబరాలకు దూరంగా ఉండగలగాలి. ఆ స్థితికి మనం చేరుకున్న క్షణం మనస్సు ఎంతో నిర్మలమవుతుంది. అదే మనలను స్థిరచిత్తులను చేస్తుంది. ఆ దశలో కష్టసుఖాలను సమానంగా తీసుకునే మానసిక శక్తి సహజంగా ఒనగురుతుంది. ఈ పరిపక్వత కోసమే మనం తపించి, సాధించ గలగాలి. అపుడే జీవిత వజ్రాయుధ ఘాతాలను తట్టుకుని నిబ్బరించుకోగలం. జీవితం ఉల్లాసం గా జీవించగలం. జీవితాన్ని జీవించటమంటే అదే. ఆ తాతగారు తన మనవడికి చెప్పిన మాటలు అందరకు శిరోధార్యమే. – బొడ్డపాటి చంద్రశేఖర్. అంగ్లోపన్యాసకులు -
‘ఝాన్సీ కీ రాణి’.. ఈ పాఠం రాసింది ఈమెనే!
విషయం ఎంతటి సంక్లిష్టమైనది అయినా సరే.. వివరణ సరళంగా ఉంటేనే ఎక్కువ మందికి అర్థం అయ్యేది. ఆ సూత్రాన్ని ఒడిసిపట్టి తన కవితలతో ఎందరిలోనో బ్రిటిష్ వ్యతిరేక పోరాట స్ఫూర్తిని నింపింది సుభద్ర కుమారి చౌహాన్. మధ్య తరగతి కుటుంబానికి చెందిన సుభద్ర.. స్వాతంత్ర సంగ్రామంలో అరెస్ట్ కాబడ్డ మొదటి మహిళా సత్యాగ్రహి!. ఈరోజు(ఆగష్టు 16న) ఆమె జయంతి. అందుకే గూగుల్ డూడుల్‌తో ఆమెను గుర్తు చేస్తోంది గూగుల్. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల స్కూల్ సిలబస్ పుస్తకాల్లో కనిపించే పాఠం.. ‘ఝాన్సీ కీ రాణి’. వీరనారి ఝాన్సీ లక్ష్మి భాయ్(మణికర్ణిక) పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే కవిత్వం అది. ఆ హిందీ కవితను రాసింది ఎవరో కాదు.. సుభద్ర కుమారి చౌహాన్. ప్రముఖ హిందీ కవయిత్రిగా, స్వాతంత్ర సమర యోధురాలిగా ఆమె పేరు భారత చరిత్రలో సుస్థిరంగా నిలిచింది. అరెస్టైన మొదటి సత్యాగ్రహి 1904, ఆగష్టు 16న యూపీ ప్రయాగ్‌రాజ్ నిహల్పూర్ గ్రామంలో ఓ రాజ్‌పుత్ కుటుంబంలో పుట్టింది సుభద్ర కుమారి చౌహాన్. స్కూల్ విద్య కొనసాగించిన సుభద్ర.. తొమ్మిదేళ్లకే ‘నీమ్’ కవితతో సాహిత్య ప్రపంచంతో ‘చిచ్చురపిడుగు’ బిరుదు అందుకుంది. పదిహేనేళ్ల వయసులో థాకూర్ లక్క్ష్మణ్ సింగ్ చౌహాన్‌ను వివాహం చేసుకుని.. జబల్పూర్కు కాపురం వెళ్లింది. ఆపై భర్త ప్రోత్సాహంతో కవిత్వాలు రాస్తూ.. బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమంలో చురుకుగా పాల్గొంది. నాగ్‌పూర్‌లో బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా జరిపిన నిరసన ప్రదర్శనకు గానూ ఆమెను అరెస్ట్ చేయమని నాగ్‌పూర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ టైంలో ఆమె గర్భవతి కావడంతో కొన్నాళ్లపాటు జైళ్లో నుంచి వదిలేశారు. ఆపై 1941లో సుభద్ర కుమారి భర్త థాకూర్, మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమంలో పాలుపంచుకున్నాడు. ఆ సమయంలో ఐదుగురు పిల్లలున్నా.. భర్తతో పాటు ఆమె కూడా ఉద్యమంలో చురుకుగా పాల్గొంది. ఈ క్రమంలో 1942లో ఆమె రెండోసారి అరెస్ట్ అయ్యారు. అంతేకాదు అంటరానీతనం, కుల వ్యవస్థ, పర్దా పద్ధతులకు వ్యతిరేకంగా ఆమె పోరాడింది కూడా. పిల్లలకు సైతం అర్థం అయ్యేలా.. హిందీ కవిత్వంలో ఆమెది ఎంతో సరళమైన శైలి. మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాలను, ముఖ్యంగా పిల్లలను దృష్టిలో పెట్టుకుని ఆమె తన రచనలు చేసేది. వీరనారి ఝాన్సీ రాణి పోరాటాన్ని పొగుడుతూ రాసిన కవిత్వం ‘ఝాన్సీ కీ రాణి’.. హిందీ సాహిత్యంలో సుస్థిరంగా నిలిచింది. ‘జలియన్ వాలా బాగ్ మే వసంత్’, ‘వీరోన్ కా కైసా హో బసంత్’, ‘రాఖీ కీ చునౌతీ’, ‘విదా’ తదితర కవిత్వాలు స్వాతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించాయి. ఆమె రాసిన చిన్నకథలు పిల్లలను బాగా ఆకట్టుకునేవి. ఆపై సెంట్రల్ ప్రావిన్స్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమె.. 1948, ఫిబ్రవరి 15న అసెంబ్లీ సమావేశాలకు నాగ్‌పూర్ వెళ్లి జబల్పూర్కు తిరిగి వస్తుండగా సియోని(మధ్యప్రదేశ్) వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. గూగుల్ డూడుల్స్ గౌరవం సుభద్ర కుమారి చౌహాన్ మరణాంతరం ఎన్నో గౌరవాలు దక్కాయి. ఇండియన్ కోస్ట్‌గార్డ్ షిప్‌కు ‘ఐసీజీఎస్ సుభద్ర కుమారి చౌహాన్’ పేరు పెట్టారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం జబల్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. 1976లో భారత పోస్టల్ శాఖ.. ఓ పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసింది. ఈ ఏడాది 117వ పుట్టినరోజు సందర్భంగా గూగుల్ ఇండియా.. గూగుల్ డూడుల్‌తో గౌరవించింది. ఆమె కూతురు సుధా చౌహాన్‌ను భర్త ఎవరో కాదు.. లెజెండరీ రైటర్ ప్రేమ్ చంద్ కొడుకు అమృత్ రాయ్. తల్లిదండ్రుల జీవిత చరిత్ర ఆధారంగా సుధా ‘మిలా తేజ్ సే తేజ్’ అనే పుస్తకం రాసింది. సుధా-అమృత్‌ల కొడుకు అలోక్ రాయ్ ఇంగ్లీఫ్ ప్రొఫెసర్.. ప్రస్తుతం ఆయన భారత రాజకీయాలు, కల్చర్ మీద కాలమ్స్ రాస్తున్నారు. -
మరాఠా మనసు గెలిచిన తెలుగోడు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: మహారాష్ట్రలో మన తెలుగు రచయిత గంటేడ గౌరునాయుడుకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన రాసిన గేయం మరాఠాల మనసులను హత్తుకుంది. తొమ్మిదో తరగతి తెలుగు వాచకంలో ఆయన రాసిన ‘పాడుదమా స్వేచ్ఛాగీతం’కు అక్కడి ప్రభుత్వం మొదటి పాఠ్యాంశంగా చోటు కల్పించింది. విజయనగరం జిల్లా కొమరాడ మండలం దళాయిపేటకు చెందిన గంటేడ గౌరునాయుడు గిరిజన ఆశ్రమ పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు. స్థానిక అంశాలకు యాస, భాషలను జోడించి వందలాది కవితలు, కథలు, గేయాలను రాశారు. తాను పనిచేస్తున్న పాఠశాల విద్యార్థులకు ఏటా గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా ఆలపించేందుకు కొత్త పాటను పరిచయం చేయాలని సంకల్పించుకున్నారు. ఆ ప్రయత్నంలో ఆయన కలం నుంచి జాలువారిందే.. ‘పాడుదమా స్వేచ్ఛాగీతం.. ఎగరేయుదమా జాతిపతాకం’ అనే దేశభక్తి గేయం. ఈ గీతాన్ని ఆయన గుమ్మలక్ష్మీపురం మండలం రేగిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినుల కోసం 1990లో రచించారు. మూడు దశాబ్దాలుగా మార్మోగుతున్న గేయం స్వాతంత్రోద్యమ ఘటనలను, అందులోని సమరయోధులను గుర్తు చేస్తూ.. నాటి సన్నివేశాలు కళ్లముందు కదలాడుతున్నట్టుగా ఈ గేయాన్ని రాశారు. అప్పట్లో ఈ పాట విన్న అనంతపురం జిల్లా కలెక్టర్ లెనిన్‌బాబు అనే గాయకుడితో పాడించి రికార్డింగ్ చేయించారు. దీనికి ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి సూర్యనారాయణరావు వాద్య సహకారాన్ని అందించారు. అనంతరం జనవిజ్ఞానవేదిక, ప్రజానాట్యమండలి తదితర సంస్థలు, సంఘాలు ప్రారంభ గీతంగా దీన్ని వినియోగించుకున్నాయి. ఇలా గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాల్లో మూడు దశాబ్దాలుగా ఈ గేయం మార్మోగుతోంది. దేశం గొప్పతనం గురించి చెప్పే గేయం మా రాష్ట్రంలోని తెలుగు వాచకంలో మీరు రాసిన ‘పాడుదమా స్వేచ్ఛాగీతం’ అనే దేశభక్తి గేయం పాఠ్యాంశంగా చేర్పించాలనుకుంటున్నాం.. ఇందుకు మీ అనుమతి కావాలంటూ మహారాష్ట్ర తెలుగు విభాగం ప్రత్యేక అధికారి తులసి భరత్ భూషణ్ అడిగేసరికి ఎంతో సంతోషం కలిగింది. దేశం గొప్పతనం గురించి చెప్పే చాలా మాటలు, కథలు, గేయాలు వచ్చాయి. కానీ, గురజాడ మాటల్లో.. దేశమంటే మట్టికాదు మనుషులు. అందుకే నా రచనలో దేశం కోసం మనుషులు చేసిన వీరోచిత పోరాటాలను భావితరాలకు అందించాలనిపించింది. ఆ దిశగా ఎన్నో కవితలు, కథలు రాశాను. అందులో పాడుదమా స్వేచ్ఛాగీతం ఒకటి. –గంటేడ గౌరునాయుడు, గేయ రచయిత చదవండి: సీఎం జగన్ నన్ను బతికిస్తున్నాడమ్మా.. ‘వృథా’కు కట్టడి: మూడంచెల వ్యూహం -
‘బజార్’ ను చూపినవాడు..
హైదరాబాద్ నేపథ్యంలో గల్ఫ్‌కు ఆడపిల్లలను అమ్మే కథాంశంతో అద్భుతమైన కళాఖండం ‘బజార్’ తీసిన దర్శకుడు సాగర్ సర్హదీ సోమవారం (మార్చి 22)న కన్నుమూశారు. గొప్ప కథకునిగా, స్క్రీన్‌ప్లే రచయితగా సాగర్ సర్హదీని బాలీవుడ్ గౌరవిస్తుంది. ఆయన స్వయంగా సాహితీకారుడు. ఉర్దూ కథలు అనేకం రాసి యాడ్ ఫీల్డ్‌లో పని చేసి సినిమాలకు వచ్చాడాయన. మరణించేనాటికి వయసు 87 సంవత్సరాలు. ‘సర్హదీ’ అంటే సరిహద్దువాడు అని అర్థం. సాగర్ సర్హదీ అసలు పేరు గంగాసాగర్ తల్వార్. కాని ఆయన సరిహద్దుకు ఆవలివైపు ‘బఫా’ అనే గ్రామంలో జన్మించాడు. కాని దేశ విభజన తర్వాత కుటుంబంతో ఢిల్లీ చేరుకుని కాందిశీకులుగా బతకాల్సి వచ్చింది. ఆ సమయం లోనే ఆయన తన పేరును ‘సాగర్ సర్హదీ’ గా మార్చుకున్నాడు. సొంత ప్రాంతాన్ని కోల్పోయానన్న ఆవేదన, వెలితి ఆయనను సాహిత్యం వైపు మళ్లించింది. ఢిల్లీ తర్వాత ముంబై చేరుకుని నాటకాలు రాయడం మొదలెట్టాడు. ఆ సమయంలోనే దర్శకుడు యశ్ చోప్రా దృష్టి ఆయన పై పడింది. యశ్ చోప్రా దాదాపు తన సినిమాలకు ఆయన చేత పని చేయించుకున్నాడు. ‘కభీ కభీ’, ‘నూరి’, ‘చాందినీ’, ‘సిల్సిలా’ ఈ సినిమాలకు స్క్రీన్‌ప్లే, కథ, డైలాగ్ విభాగాలలో సాగర్ సర్హదీ పని చేశాడు. ఆ తర్వాత తనే సొంతగా దర్శకునిగా మారి ‘బజార్’ సినిమా తీశాడు. ఈ సినిమా క్లాసిక్‌గా నిలిచింది. నసీరుద్దీన్ షా, స్మితాపాటిల్ నటించిన ఈ సినిమాలో ‘కరోగే యాద్‌తో హర్బాత్ యాద్ ఆతీహై’ పాట నేటికీ హిట్‌గా నిలిచింది.సాగర్ సర్హదీ ప్రగతిశీల సాహితీ ఉద్యమంలో పని చేశాడు. ముంబైలోని ఆయన నివాసంలో అతి పెద్ద లైబ్రరీ ఉంది. మరణించే వరకూ కూడా తన సొంత ప్రాంతాన్ని తిరిగి చూడలేకపోయిన బాధను అనుభవించాడాయన. మరో సినిమా దర్శకుడు రమేశ్ తల్వార్ ఈయన మేనల్లుడు. సాగర్ సర్హదీకి జావేద్ అఖ్తర్ వంటి సినీ ప్రముఖులు నివాళి అర్పించారు. -
దేవీప్రియ మృతి పట్ల గవర్నర్ సంతాపం
సాక్షి, అమరావతి: ప్రముఖ కవి, జర్నలిస్టు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దేవీప్రియ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రచయితగా, కార్టూనిస్టుగా, కవిగా సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు ఆయన ఎంతగానో కృషి చేశారని గవర్నర్ అన్నారు. గుంటూరు జిల్లా పల్నాడులోని ఓబులేశునిపల్లెలో జన్మించిన దేవిప్రియ సినీరంగంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించి జర్నలిజంలో స్థిరపడ్డారు. దేవిప్రియ మరణం తెలుగు కవిత్వానికి తీరని లోటని గవర్నర్ అన్నారు. 'గాలి రంగు' రచన ఆయన సాహిత్య ప్రతిభకు మచ్చు తునక అని, కవి, అమ్మచెట్టు వంటి అత్యుత్తమ సంకలనాలు ఆయన కలం నుండి జాలువారాయన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు బిశ్వ భూషణ్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
వామపక్ష రచయిత
ఇక్కడ తటస్థ గాడిద అంటూ ఎవరూ లేరు, అని విస్పష్టంగా తన రాజకీయ దృక్పథాన్ని ప్రకటించుకున్న స్వీడిష్ రచయిత యాన్ మిర్డాల్(1927 – 2020) అక్టోబర్ 30న మరణించారు. 1950 నుంచీ ఆయనకు భారత్‌తో అనుబంధం ఉంది. ఇక్కడ పాత్రికేయుడిగా పనిచేశారు. వివిధ దేశాల మీద, తన అనుభవసారంతో సుమారు 30 పుస్తకాలు రాశారు. ఎడ్గార్ స్నో ‘రెడ్‌స్టార్ ఓవర్ చైనా’ స్ఫూర్తితో దండకారణ్యంలో రెండు వారాలు తిరిగి ‘రెడ్‌స్టార్ ఓవర్ ఇండియా’ రాశారు. దాన్ని ‘భారత్‌పై అరుణతార’ పేరుతో ‘మలుపు’ తెలుగులోకి తెచ్చింది. ఎన్.వేణుగోపాల్ అనువదించిన ఈ పుస్తకంలో పారిస్ కమ్యూన్ నుంచి జనతన సర్కార్ దాకా సాగుతున్న ప్రత్యామ్నాయ ప్రయత్నాలనూ, ప్రజా సంస్కృతి వికాసాన్నీ విశ్లేషించారు. శ్రీశ్రీ, చెరబండరాజు మొదలుకొని అంగడి చెన్నయ్య లాంటివాళ్లు రాసిన ‘అన్న అమరుడురా మన రామనరసయ్య’ లాంటి గేయాల ఉటంకింపులు ఇందులో ఉన్నాయి. ‘వృద్ధాప్యం అనేది భారతదేశంలోనూ, స్వీడన్‌లోనూ ఒకటి కాదు. అది ఒక కొస అయితే, ఇది మరొక కొస’ అని చెబుతూ స్వీడన్లో ఒకప్పుడు పనికిరారని వృద్ధులను ఎలా కొండ మీదినుంచి తోసేసేవారో చెబుతారు. ‘వామపక్ష రచయితలు అనబడేవాళ్ళు’ రాయని ఎన్నో సున్నితమైన శారీరక ఇబ్బందులను సైతం ప్రస్తావించారు. అందువల్లే ‘చైనా ఇవాళ అంతర్జాతీయంగా ఆర్థిక అగ్రరాజ్యంగా మారిపోయింది. కానీ ధనికులకు, పేదలకు మధ్య అత్యంత దారుణమైన ఆర్థిక రాజకీయ విభేదాలు ఉన్నాయి’ అనగలిగారు. సరిగ్గా అదే కారణంగానే దేశీయ రచయితలకు భిన్నంగా ఒక రచయిత తను పెరిగిన సంస్కృతికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలో చెప్పగలిగారు. ఆ భాగం ఇక్కడ: ‘‘మార్క్స్, ఏంగెల్స్ అయినా, నేనయినా చాలా సహజంగా మా సంస్కృతి సంప్రదాయంలో నుంచే మమ్మల్ని మేము వ్యక్తీకరించుకుంటాం. అయితే ఇది సాధారణ సిద్ధాంతాలకు వ్యతిరేకం కాదు. మావో సే టుంగ్ తన కోడలితో మాట్లాడుతున్నప్పుడు సరిగ్గా ఈ విషయమే ప్రస్తావించాడు. ‘వాంగ్ హై జుంగ్‌తో సంభాషణలు 21 డిసెంబర్ 1970’ అనే ఈ ప్రచురిత ప్రతిని« చైనాలో సాంస్కృతిక విప్లవ కాలంలో విస్తృతంగా పంపిణీ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) అధ్యయన పత్రాలలో భాగంగా ఉంది. ‘‘మావో: మీరు మీ పాఠ్యాంశాలలో భాగంగా పవిత్ర బైబిల్‌నూ, బౌద్ధ సూత్రాలనూ అధ్యయనం చేయవలసి ఉంటుందా? హై జుంగ్: లేదు. అవన్నీ మేమెందుకు చదవాలి? మావో: మరి బైబిల్ గానీ, బౌద్ధ సూత్రాలు గానీ చదవకుండా మీరు విదేశీ పుస్తకాలను అనువదించాలన్నా, విదేశీ వ్యవహారాలు నిర్వహించాలన్నా ఎలా చేయగలరు? అంతేకాదు, మావో ఆమెను తూఫూ రాసిన ప్రాచీన చైనా పౌరాణిక కావ్యాలను, ‘డ్రీమ్ ఆఫ్ ద రెడ్ చాంబర్’ వంటి నవలలను చదవమని ప్రోత్సహించాడు. అవి మాత్రమే కాదు, లియావో చాయి వంటి కవులను, ప్రాచీన మింగ్ కింగ్ రాజవంశాల సాహిత్యాలను, పూ సాంగ్ లింగ్ రాసిన దయ్యాల, భూతాల, నక్కల కథలు చదవమని కోరాడు. లియావో చాయి రాసిన కథల్లో నక్కల ఆత్మలు చాలా దయనీయమైనవి. అవి మానవజాతికి స్వచ్ఛందంగా సహకరిస్తూ ఉంటాయి అని ఆయన చెప్పాడు. అదేవిధంగా ఆయన జర్మన్ అయివుంటే సరిగ్గా ఇదేవిధంగా గ్రిమ్మెల్ షాసెన్, గెథే, గ్రిమ్ సోదరులు వంటి రచయితలను సిఫారసు చేసి ఉండేవాడే.’’ -
అడవికి పూచిన మహాకవి
అతను కవిత్వం రాసే వరకు దేశానికి ‘కోసలి’ భాష ఒకటుందని తెలియదు. అతన్ని చూసే వరకు అడవి కూడా ఒక మహాకవిని పుట్టించగలదని తెలియదు. నగ్నపాదాలతో నడిచే అతగాడు పొరలు కప్పుకోని మనిషి కోసం స్వప్నిస్తాడు. ఈ భూప్రపంచాన్ని ఒకే ఇంటిగా మార్చమని ఉద్బోధిస్తాడు. మూడో తరగతి వరకే చదివి, వంటవాడిగా జీవితమంతా కట్టెలు ఎగదోసి ఆ అగ్నిలో నుంచి అతడు తీసిన స్వచ్ఛమైన కవిత్వం ఇవాళ అతనికి గొప్ప ఖ్యాతిని తెచ్చిపెడుతోంది. భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ తో సత్కరించిన మట్టికాళ్ల మహాకవి ‘హల్దర్ నాగ్’ పరిచయం ఇది. ‘ఇదిగో ఉత్తరం వచ్చింది హల్దర్ నాగ్. నీ కోసం ఉత్తరం వచ్చింది. సృష్టిలో గొప్పదైన మానవజాతి నేడు చీకటిలో తడుముకుంటోంది. తన బులబాటం తీర్చుకునేందుకు మందిని బాధలు పెడుతోంది. ఉత్తరం ఇదే చెబుతోంది హల్దర్ నాగ్ ఉత్తరం ఇదే చెబుతోంది’ హల్దర్ నాగ్ కవిత్వం ఇలా ఉంటుంది. అతడు తనకు తానే ఉత్తరం రాసుకుంటూ ఉంటాడు. తాను కనుగొన్న సత్యాలు చెప్పుకుంటూ ఉంటాడు. ‘లోకం శుభ్రపడాలనుకుంటున్నావా... ముందు నిన్ను నువ్వు కడుక్కో. ఇతరులను చేయి పట్టి పైకి లాగాలనుకుంటున్నావా... ముందు నువ్వో ఒకటి రెండు మెట్లకు ఎగబాకు. కష్టాన్ని కూడా తల్లి ఆశీర్వాదం అనుకో. విషం చిమ్మే చోట కచ్చితంగా మధువు ఉంటుంది వెతుకు. అన్ని బరువులు మోసుకుంటూ ప్రవహించే గంగే నీకు అదర్శం. బాధలు నువ్వు ఉంచుకొని సంతోషాన్ని పంచు’ అంటాడు తన కవితలో హల్దర్ నాగ్. ఇప్పుడు అతని కవిత్వం మీద ఎనిమిది పిహెచ్‌డిలు జరుగుతున్నాయి. అతని పేరు మీద ఒరిస్సా ప్రభుత్వం అతని సొంత గ్రామం ‘ఘెన్స్’ లో ‘కోసలి మాండలికం, సాహిత్య పరిశోధనా కేంద్రాలను నెలకొల్పనుంది. భారత ప్రభుత్వం 2016లో అతనిని ‘పద్మశ్రీ’తో గౌరవించింది. కేవలం ఓనమాలు నేర్చిన కవి మహాకవిగా అవతరించినందుకు కలిగిన ఫలితం ఇది. పశ్చిమ ఒరిస్సా అడవిబిడ్డ హల్దర్‌నాగ్‌ది పశ్చిమ ఒరిస్సాలోని బార్‌గర్హ్ జిల్లాలోని ఘెన్స్ అనే చిన్న గ్రామం. ఎగువ ఊళ్ళల్లో కలరా సోకితే అతడి కుటుంబం ఆ ఊళ్లో స్థిరపడింది. అక్కడే ఆఖరి సంతానంగా హల్దర్ నాగ్ 1950లో జన్మించాడు. చర్మకార వృత్తి చేసే తండ్రి పాముకాటుకు చనిపోతే మూడో తరగతిలోనే చదువు ఆపేశాడు. అతని కంటే ముందు పుట్టిన వాళ్లు పెళ్లిళ్లు చేసుకొని వెళ్లిపోవడంతో ఒక్కడుగా మిగిలి ఊళ్లో ఉన్న మిఠాయి దుకాణంలో గిన్నెలూ, వంట పాత్రలు కడిగే పనికి కుదిరాడు హల్దర్. అక్కడే వంట నేర్చుకున్నాడు. ఊరి పెద్దమనిషి అతణ్ణి స్కూల్లో వంటవాడిగా పెట్టాడు. దాదాపు పన్నెండేళ్ళు అక్కడే వంటవాడిగానే బతికాడు. ఆ సమయంలో స్కూల్లో విద్యార్థుల సంఖ్య పెరగడం గమనించాడు. వెయ్యి రూపాయలు చేబదులు తీసుకుని స్కూల్ ఎదురుగానే స్టేషనరీ షాపు, పిల్లలు తినే తినుబండారాలు పెట్టి కూచున్నాడు. ఆ సమయంలోనే అతనిలో ఏదో కవిత్వం పెల్లుబుక సాగింది. కోసలి భాషలో తనకు నచ్చింది రాసుకుని షాపుకి వచ్చేవారికి వినిపించేవాడు. ఆ సమయంలోనే ఆ ప్రాంతంలోని ‘అభిమన్యు సాహిత్య సన్సద్’ అనే గ్రూప్‌తో పరిచయమయ్యింది. వారు ఇతనికి ఒరియా సాహిత్యం పరిచయం చేశారు. ఒరిస్సా సాహిత్యం చదువుతూనే హల్దర్ తన కోసలి భాషలో కవిత్వసృష్టి సాగించాడు. 1990లో అతని తొలి కవిత ‘ధోడో బగ్గాచ్’ (పాత మర్రిచెట్టు) స్థానిక పత్రికలో అచ్చయ్యింది. అది మహాకవి మొదటి అడుగు. నాటి రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంటూ... ఎదురుగానే కవి ఆ ప్రాంతంలో అందరికీ వంటవాడు హల్దర్ తెలుసు. కాని కవి హల్దర్ తెలియదు. ఎవరో కవి అని అందరూ ఆ కవిత్వాన్ని అభిమానించారు. చాలా రోజుల తర్వాత ఆ కవి, ఈ వంటవాడు ఒకడే అని తెలుసుకొని ఆశ్చర్యపోయారు. హల్దర్‌కి జ్ఞాపకశక్తి ఉంది. ఏ పుస్తకంలోని ఏ కవితనైనా చదివి గుర్తు పెట్టుకోగలడు. అంతేకాదు తన కవిత్వాన్ని కాగితం చూడకుండా చెప్పగలడు. అందుకే ప్రజలు అతణ్ణి ‘ఆశు కబి’ అని, ‘లోక కబి రత్న’ అని పిలుస్తారు. కావ్యాంజలి హల్దర్ నాగ్ కవిత్వం మొదట ‘కావ్యాంజలి’ అనే సంకలనంగా వచ్చి పండిత, పామరుల ఆదరణ పొందింది. అతని రెండవ సంపుటం ‘కావ్యాంజలి2’ను సంబల్పూర్ యూనివర్సిటీ విద్యార్థులకు పాఠ్యాంశాలుగా పెట్టింది. అతడి అనేక కవితలు ఇప్పుడు పాఠశాల స్థాయిలో పాఠ్యాంశాలు అయ్యాయి. దేశీయ జానపద శైలి, పురాణ సంకేతాలు, కల్తీ లేని భాష, అప్రయత్న ధాటి హల్దర్ నాగ్ కవిత్వాన్ని జీవంతో, ఆకర్షణతో నింపుతాయి. అతడి రచనలు ఇప్పటి వరకూ దాదాపు 22 పుస్తకాలుగా వచ్చాయి. పాటలూ రాశాడు. సంబల్పూర్ యూనివర్సిటీ అతనికి డాక్టోరల్ డిగ్రీ ఇచ్చి సత్కరించింది. బి.బి.సి అతడిపై డాక్యుమెంటరీ తీసింది. ఒకప్పుడు వంట కాంట్రాక్టు కోసం ఎదురు చూసే హల్దర్ నేడు ఒరిస్సా రాష్ట్రంలో దేశంలో ప్రతిరోజూ సాహిత్య కార్యక్రమాలకు ఆహ్వానింపబడే కవిగా గౌరవం పొందుతున్నాడు. అంతే కాదు 2015లో వచ్చిన ‘కౌన్ కిత్నే పానీ మే’ అనే లఘు చిత్రంలో రాధికా ఆఫ్టే, సౌరభ్ శుక్లా వంటి నటులతో కలిసి నటించాడు. గుల్జార్ మోహం హల్దర్ నాగ్ కవిత్వానికి ప్రఖ్యాత కవి గుల్జార్ అభిమాని. ఆయన హల్దర్ కవిత్వం చదివి 50 వేల రూపాయల డబ్బును కానుకగా పంపాడు. అంతేకాదు, బాలీవుడ్ దర్శకుడు ‘భరత్‌బాల’ తన ‘వర్చువల్ భారత్’ ఫీచర్ కింద హల్దర్ పై తీసిన షార్ట్‌ఫిల్మ్‌కు వ్యాఖ్యానం కూడా అందించాడు. హల్దర్ కవిత్వం భారీగా ఇంగ్లిష్‌లోకి అనువాదం అవుతోంది. ఇప్పటికి 350 సంస్థలు హల్దర్‌ను సత్కరించాయి. ఇంత పేరు వచ్చినా ఇప్పటికీ చెప్పుల్లేకుండా నడుస్తాడు హల్దర్. నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ‘పద్మశ్రీ’ అందుకునేటప్పుడు కూడా చెప్పులు తొడుక్కోలేదు. ‘ఈ మట్టి మీద నడిచేటప్పుడు మొత్తం భూగోళం మీద నడుస్తున్నట్టుగా భావించు’ అంటాడు హల్దర్. అంతే ఈ భూమి మనందరిది. అంటే ప్రతి మనిషి మరో మనిషి కోసమే అని భావిస్తూ ‘మనం’ అనే భావనతో బతకాలని హల్దర్ కోరుతాడు. అతడు అసహ్యించుకునే దుర్గుణాలు ప్రతి మనిషిలో ఉండేవే. కాకుంటే వాటిని వదిలించుకోవడానికి అప్పుడప్పుడు హల్దర్ వంటి మహాకవి పిలుపు అవసరం. ఇప్పుడా పిలుపు వినిపిస్తూ తిరుగుతున్నాడు హల్దర్ నాగ్. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
శేషేంద్ర మేనిఫెస్టో
‘ప్యూర్ పొయెట్రీ కాన్సెప్ట్’ ప్రవేశపెట్టి కవిత్వం ఆస్వాదించేదే గాదు, దానికో లక్ష్యముందని చెప్పారు శేషేంద్ర శర్మ. సామాజిక చైతన్యాన్ని సాహిత్య ప్రగతిగా మార్చే శక్తి కవిది కావాలన్నదే ఆయన అభిమతం. 1977లో ఆయన రచించిన కవిసేన మేనిఫెస్టో ఒక వైజ్ఞానిక ఉద్యమ సిద్ధాంత గ్రంథం. కవిత్వంలో శబ్దం నిర్వహించే పాత్రను విస్మరించరాదన్నారు. సమతా భావాలు, సమాజ శ్రేయస్సు కావ్యసృష్టికి రెండు కళ్లలా ఉండాలన్నారు. విప్లవ కవిత్వం పేర పెడ ధోరణులు పట్టడం, అనుభూతి కవిత్వం పేర సాహిత్య విలువల్ని దిగజార్చడం లాంటి అనారోగ్యం పొడసూపిన తరుణంలో కవులకు నూతనోత్తేజాన్ని నింపారు. విదేశీ కవుల కవితాత్మను అర్థం చేసుకోకుండా అనుకరణలు సృష్టించి కావ్యాత్మను దెబ్బతీయవద్దన్నారు. కవిత్వం ఛందో బంధమైన కళ కాదని, సాహిత్య కళ ప్రజల కోసమని నిర్వచించిన ఉత్తమ విమర్శకుడాయన. ఆయనకింత నిశిత దృష్టిని ప్రసాదించింది మార్క్సిజమే. కావ్యసూత్ర వివేచన చేస్తూ పాతదైందని తోసేయడం, కొత్తదని అనుసరించడం భావ్యం కాదన్నారు. కవిసేన మేనిఫెస్టో రూపొందించడానికి దేశీయ సాహిత్యస్ఫూర్తితో 26 అలంకార గ్రంథాలు, మార్క్సిజం స్ఫూర్తితో 30 సాహిత్య గ్రంథాలను అధ్యయనం చేశారు. అందుకే ఆ గ్రంథం సాహిత్య విమర్శనా దృక్పథాన్ని పదునెక్కించింది. వర్తమాన ప్రపంచానికి ఉపలభ్యమైన ప్రాచీన ప్రాక్పశ్చిమ కావ్యతత్వాన్ని ఇందులో ప్రతిపాదించడం కూడా నవ్యంగా కనిపించే అంశం. తెలుగు సాహిత్య విలువల స్థాపన జరిగినందువల్ల ఉస్మానియా తెలుగు పి.జి.విద్యార్థులకు అది పాఠ్యాంశమైంది. ‘వాక్యం రసాత్మకం కావ్యం’ అని చెప్పిన జగన్నాథుని సిద్ధాంతాన్ని ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ విప్లవ రసస్ఫోరకం చేసిన వారాయన. తండ్రి వారసత్వంగా వచ్చిన సంస్కృత పాండిత్యం, ఆంగ్లభాష పటుత్వం ఆయన్ని మహాకవిగా మల్చాయి. 1947 నుండి 2007 వరకు 11 కావ్యాలు, 12 విమర్శనా గ్రంథాలు రచించడమేగాదు నూతనంగా కావ్యేతిహాస (మహా భారతం) ప్రక్రియను ప్రవేశ పెట్టిన మార్గదర్శి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్న ‘కాలరేఖ’తో తెలుగు విమర్శకు కీర్తి తెచ్చిపెట్టారు. సంప్రదాయ కవిగా రచనా జీవితాన్ని ప్రారంభించి, అభ్యుదయ కవిగా ఎదిగి, విప్లవ కవిగా తన స్థానాన్ని సుస్థిర పర్చుకొన్నారు. -ప్రొఫెసర్ ననుమాస స్వామి (శేషేంద్ర జయంతి సభ: శేషేంద్ర 94వ జయంతి సభ అక్టోబర్ 20న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో జరగనుంది. ననుమాస స్వామి, ఎస్వీ సత్యనారాయణ, కళా జనార్దన మూర్తి, లక్ష్మణ చక్రవర్తి, టి.గౌరీశంకర్, బైస దేవదాస్ పాల్గొంటారు. నిర్వహణ: గుంటూరు శేషేంద్ర శర్మ మెమోరియల్ ట్రస్ట్) -
ఊబర్-కూల్-శ్రీనాథ
శ్రీనాథుని కాలంనాటి సామాజిక, రాజకీయ పరిస్థితుల గురించి నేనేం చదవలేదు గానీ, బ్యూరోక్రసీని, పదవుల్లో ఉండే హెచ్చుతగ్గులనీ ఆయన ఆనాడే ఆడేసుకున్నాడు. ‘శివరాత్రి మహాత్మ్యము’లో శివునికి (సుప్రీమ్ బాసు), యమునికి (సీనియర్ మేనేజర్)కి మధ్య జరిగే ఎపిసోడ్ అలా ఎత్తి ఇలా మేనేజ్మెంటు పుస్తకాల్లో పెట్టొచ్చు. బెంగళూరుకి, మైసూరుకి దగ్గర్లో సోమనాథపురంలో చెన్నకేశవ గుడి ఒకటుంది. ప్రస్తుతం పూజలూ అవీ లేవు. బేలూరు, హళేబీడుకి ఉన్నంత పేరు ఈ గుడికి లేదు. 13వ శతాబ్దంలో హొయ్సళ రాజులు కట్టించారు కాబట్టి శిల్పకళా చాతుర్యం గొప్పగా ఉంటుంది. కానీ ‘‘శిలలపై శిల్పాలు చెక్కినారూ’’ అంటూ మురిసిపోవడానికి ఆ కళను ఆస్వాదించే జ్ఞానం మనకి లేదు గనుక చుట్టూ ఒకసారి తిరిగి ‘భలే ఉన్నాయ్’ అనేసుకుని చకచకా బయటకొచ్చి చెట్టు నీడన పచ్చిక మీద కూర్చుని బోలెడన్ని యాంగిల్స్‌లో సెల్ఫీలు తీసుకుంటే (గుడి కనపడేట్టు), ఆపైన ఇన్‌స్టాగ్రామో, లేటర్గ్రామో చేయడానికి సరిపోయేంతటి సరంజామా – వింటేజ్ సరుకు! శ్రీనాథుడినో, లేదా అసలు పద్యసాహిత్యాన్నో చదవడం కూడా అలాంటి అనుభవానికి దగ్గరగా ఉంటుందని ఊహించాను. శిల్పాల ప్రాముఖ్యతా, వైశిష్ట్యమూ తెలియనట్టే పద్యాలలో సొబగు, సొగసు తెలియకపోయినా వ్యాఖ్యాన–తాత్పర్యాల పచ్చిక మీద కాలు చాపుకుని హాయిగా కూర్చునే వీలుని వదులుకోవడం దేనికి? షేక్స్పియర్ని అంటే నాటక ప్రదర్శనల్లోనో, సినిమాల్లోనో, ఆఖరికి మీమ్స్లోనో కలిగిన పరిచయం వల్ల పలకరింపుగా నవ్వొచ్చు. శ్రీనాథునికోసం కావ్యమే చేతపట్టుకోక తప్పలేదు. ఆశలూ, అంచనాలూ పెద్ద ఏముంటాయ్? ప్రపంచ సాహిత్యాలు చదివి అర్థం చేసుకునే 21వ శతాబ్దానికి చెందిన నాకు ఈ పదిహేనవ శతాబ్దపు కవిగారిని అందరూ ఎందుకు కవి సార్వభౌముడంటారో తెల్సుకోవాలన్న కుతూహలం, ఛందస్సుతో కూడిన పద్యాలను చదువుకోవడం ఎలాగో నేర్చుకోవాలన్న ఆసక్తి మాత్రమే. పదహారణాల existentialist జీట్ట అయిన నాకూ, పరమ శివభక్తుడైన ఆయనకూ మధ్యే మార్గం (middle-ground) సాధ్యం కానప్పుడు, ‘‘ఈ కథ చదివిననూ, వినిననూ సకల ఆరోగ్యైశ్వర్య...’’ లాంటి బేరాలతో కుదరనప్పుడు, స్త్రీపురుష శృంగార క్రీడా వర్ణన నా ప్రాథమిక ఆసక్తి కానప్పుడు, శతాబ్దాల బట్టీ పోల్చుకోలేనంతగా మారిపోయిన తెలుగే మా ఇద్దరి మధ్య మిగిలిన చుట్టరికం. శిల్పాల్లో ఆధునిక ఛాయలున్న ఏ పనిముట్టో, కేశాలంకరణో కనిపించినప్పుడు మన పూర్వీకులపై గర్వం పొంగుకొచ్చి ‘కూల్, యా!’ అని అనుకుంటాముగా, అలాంటివేవో ఆయన రాసినదాంట్లో కనిపించకపోతాయా అనే అంచనా. అంతటి జటిలమైన తెలుగును పూర్తిగా ఆస్వాదించే తాహతు లేకపోయినా దూరంనుండే గుటకలు వేసినా చాలుననుకున్నాను. ‘‘... చింతకాయల కాజ్ఞగాక /యరసిచూడంగ గ్రుక్కిళ్ల కాజ్ఞగలదె’’ (చింతకాయలు తినడానికి ఆజ్ఞ కావాలిగాని గుటకలు వేయడానికి ఆజ్ఞ అవసరం లేదుగా) – అలాగే! హాశ్చర్యం! ప్రకృతి వర్ణనలుంటాయనుకున్నాను గానీ ఆకాశాన వేగంగా ప్రయాణించడం వల్ల కడుపులో తిప్పేసి, ‘‘గ్రక్కెనో నాగ గగనమార్గంబునందు భానుబింబంబు రక్తాతపంబుగాసె’’ – ట్రావెల్ సిక్నెస్ పాపం, సూర్యుడికి. పీకల దాకా తాగిన తామరపూల మధువుని కక్కుకున్నాడు. అందుకే సూర్యాస్తమయం వేళ ఆకాశమంతా ఎరుపు! ‘షో, డోన్ట్ టెల్’ అనే ఫిక్షన్ రైటింగ్ రూల్కి పరాకాష్ట, ఒక రాజ్యపు ప్రహరీ గోడ వర్ణన: ‘‘స్ఫటికమాణిక్యపాషాణ ఘటితమైన/యప్పురముకోట యాకాశమంటి యొప్పు/ వేడ్క బాతాళభువనంబు వెడలి వచ్చి/ చుట్టుచుట్టినయట్టి వాసుకియు బోలె.’’ ఇది చదవగానే చిన్నగా మొదలై ఎక్కే కొద్దీ మలుపులు తిరుగుతూ ఎత్తు పెరిగే కోటగోడలు గుర్తొచ్చాయి, రాజస్థాను ట్రిప్పులో చూసినవి! ఇతరుల మనసుల్లోని మర్మం తెల్సుకోలేకపోవడం గురించి చమత్కారం, దోసకాయల్లా మనసులను పొడిచి చూడలేమని: ‘‘యెదరికోర్కి యెరుంగట యెట్టు కుట్టియా చూడగ దోసకాయలె’’. ఈ పదవిన్యాసానికి ఒక ‘కూల్’ వేసుకున్నా, నన్ను అమితంగా ఆకట్టుకున్నది మాత్రం శ్రీనాథుని కథానిర్మాణం. దేవుళ్ళకీ, మానవులకీ మధ్య కథలు కాబట్టి రెండు లోకాలైనా (ఉదా: కైలాసం, భూమి) ఉంటాయి. ‘శివరాత్రి మాహాత్మ్యము’ (సుకుమారుని చరితం)లో అయితే సుకుమారుడు చనిపోయే వరకూ దేవలోక ప్రస్తావన రానేరాదు. ఇదో భక్తి కథ కాబట్టి, సుకుమారుని పాపపుణ్యాల లెక్కే కథకు కీలకం కాబట్టి పైలోకం నుండి సీసీటీవీ కెమెరా నడుస్తుందనుకున్నాను. తెలుగు భక్తిసినిమాల్లో ప్రతి కీలక సన్నివేశానికీ ముందో, వెనుకో దేవుణ్ణి చూపించినట్టు: మేల్ గేజ్ (male gaze – మగవాని చూపు, ఆడదాన్ని కోరిక తీర్చే వస్తువుగా మాత్రమే చూసేది)లాగా, దేవుని చూపు (divine gaze – మనిషిని కర్మలనుసారంగా వర్గీకరించి చూసేది) ఒకటుంటుందనుకున్నాను. పోనీ కనీసం కవిగారైనా రన్నింగ్ కామెంటరీ చేస్తారనుకున్నాను గానీ ఊహు. ‘హరవిలాసం’లో శివపార్వతులు భక్తుడిని పరీక్షించడానికి కంచి పట్టణం మీద కుంభ వృష్టి సృష్టించమని వరుణవాయు దేవతలకు పని అప్పగిస్తారు. వాళ్ళా పనిచేస్తారు, కానీ కవి దృష్టి మాత్రం ఆకాశంవైపు నుండి కాకుండా భూమి మీద అల్లకల్లోలాన్ని కళ్ళకి కట్టినట్టు వర్ణించడం మీదే ఉంది. ఆ వైపరీత్యంలో సతమవుతున్న సగటు మనిషికి చోటిస్తాడు. నాకివన్నీ ‘సూపర్ కూల్’ అనిపించాయి. శ్రీనాథుని కాలంనాటి సామాజిక, రాజకీయ పరిస్థితుల గురించి నేనేం చదవలేదు గానీ, బ్యూరోక్రసీని, పదవుల్లో ఉండే హెచ్చుతగ్గులనీ ఆయన ఆనాడే ఆడేసుకున్నాడు. ‘శివరాత్రి మాహాత్మ్యము’లో శివునికి (సుప్రీమ్ బాసు), యమునికి (సీనియర్ మేనేజర్)కి మధ్య జరిగే ఎపిసోడ్ అలా ఎత్తి ఇలా మేనేజ్మెంటు పుస్తకాల్లో పెట్టొచ్చు. ఇది చదివుండడం వల్లనేమో ‘హరవిలాసం’లో తపస్సులో ఉన్న శివుడిమీద పూలబాణం వెయ్యమనే పని అప్పజెప్తున్న ఇంద్రుడు, ‘‘ఇది యనన్య సాధారణ మిది యవశ్య/ మిది పరోపకృతి క్రియాభ్యుదయశాలి/ చేయు మిప్పని సంకల్పసిద్ధి గాగ/బాహువిక్రమపారీణ! పంచబాణ’’ అని మన్మథుడిని ఉత్సాహపరుస్తుంటే ఏ మాత్రం వర్కవుట్ అవ్వవని తెలిసీ ప్రాజెక్టులని నెత్తినేసేటప్పుడు మేనేజర్ల అత్యుత్సాహమే కనిపించింది. ఆపైన మన్మథుడు ఏమయ్యాడో తెల్సు కదా! ఇట్లాంటి వాటికి మాత్రం కార్పొరేటు చట్రంలో ఇరుక్కుపోయిన కష్టజీవిగా నేను ‘పరమ వీర కూల్’ అర్పించుకోక తప్పలేదు. ఇలా ఎన్ని చెప్పినా, నన్నడిగితే, ఇవ్వన్నీ కాకుండా కూడా శ్రీనాథుని రచనల్లో ఇంకేదో ఉంది. రాతి శిల్పంలో కంటికి కనిపిస్తున్న భంగిమలకి, ఆభరణాలకి, ముఖ వర్చస్సుకి ఆపాదించలేని, వాటన్నింటి మధ్య తేలాడే అందమేదో ఉన్నట్టు. దాన్ని నేనింకా పట్టుకోలేకపోతున్నాను. బహుశా, ప్రస్తుత రాజకీయ, సామాజిక, సాంఘిక నేపథ్యంలో ఉన్న నేను, నా ఇష్టాన్ని, దాన్ని కలిగిస్తున్న కళాకారుడిని కూడా ‘పొలిటికల్లీ కరెక్ట్’గా నిలబెట్టాల్సి వచ్చే పరిస్థితి ఉన్నందుకేమో. ఉదాహరణకి, భాషని సంస్కృతంతో నింపి, అది మాత్రమే ఒప్పని చలామణి చేయించడం వల్లే తెలుగు అందరికీ కాకుండా పోతుందన్న వాదోపవాదాల్లో శ్రీనాథుని మీద ఇష్టాన్ని నేనెటు వైపు నిలబెట్టాలి? అసలు నిలబెట్టాల్సిన అవసరముందా? ఈ ప్రశ్నలు దొలిచేస్తుంటే స్నేహితునితో మాటల మధ్యలో ఒక ఊతం దొరికింది: ఏ కాలానికైనా ఆ కాలానికే సంబంధించిన మాయ (myth) ఒకటుంటుంది. కవైనా, మామూలు మనిషి అయినా దానికి లోబడే జీవిస్తాడు, సృష్టిస్తాడు. ఎందుకంటే వాళ్ళకి అదోటి ఉందని కూడా తెలీదు కదా, మనకి తెలీనట్టే! ‘తెలుగు కూడు పెట్టదు, ఇంజినీరింగు చేస్తేనే బతుకు బ్రహ్మాండం!’ అన్నది నా జీవితపు మాయ అయ్యి ఉండవచ్చు. కానీ ఆనాటి–ఈనాటి మాయాపొరలని చీల్చుకుని ఏ స్థలకాలాదులలోనైనా మనిషి ప్రవృత్తిని క్షుణ్ణంగా పరిశీలించేందుకు, మనిషికి–దేహానికి, మనిషికి–దైవానికి, మనిషికి–కోరికకు మధ్య సంబంధ బాంధవ్యాలను పరామర్శించడానికి శ్రీనాథుని కావ్యాలు వీలు కలిపిస్తాయని నాకనిపిస్తుంది కచ్చితంగా. అందుకే శ్రీనాథుడు నాకు ‘ఊబర్ కూల్’! ఒకరకంగా చూస్తే ఆయన పెద్దపెద్ద అంగలేసుకుని మిడిల్–గ్రౌండ్‌కి వచ్చేసే ఉంటాడు. నేనే ప్రస్తుతకాలపు చిక్కుముడులు తప్పించుకుని అక్కడికి చేరగలగుతానో లేదో. (అన్నట్టు, శ్రీనాథుడు ఒక వ్యక్తి కాదు, అనేకులు రాసినవి ఈ పేరుకిందకు వచ్చాయని తేలినా, శ్రీనాథుడు ‘‘ఒక విశేష ఘటన’’ అయినా నా పఠనానుభవంలో మార్పు ఉండబోదు.) ‘కవి సార్వభౌముడి’గా తెలుగు సాహిత్య చరిత్రలో ధృవతారగా నిలిచిపోయిన కవిని పట్టుకుని ట్రెండింగ్ హాష్‌టాగ్‌గా మాట్లాడితే సంప్రదాయవాదులకు చిరాకు రావచ్చు. ‘విగ్రహాలను తాకరాదు. శిల్పాలను ముట్టరాదు’ అని రాసుంటుంది పురాతన నిర్మాణాల వద్ద. దానికో ప్రయోజనముంది. ఎక్కువమంది చేతులతో తాకితే రాపిడికి రాయి అరిగిపోతుందని, తర్వాతి తరాలనాటికి బొమ్మల రూపురేఖలు మారిపోతాయనే భయముంటుంది. కావ్యాలు అలాంటివి కాదు కదా, నోళ్ళల్లో ఎంత నానితే అంత మంచిదేగా! మాబోటి వారు ఉచ్చారణా దోషాలతోనే పొడిపొడిగానే పద్యాలు చదువుకున్నా శ్రీనాథుని ఖ్యాతి తగ్గిపోదు కదా! ‘శ్రీనాథుడు ఇన్ 2020’ అంటే, డిజిటిల్ రూపంలో పీడీఎఫ్‌గా డౌన్లోడ్ చేసుకోగలగడం, వాట్సాప్/యూట్యూబుల్లో షికార్లు చేస్తున్న ఆడియోలు వినగలగడం కాదు, కదా? భక్తిపారవశ్యమో, అనితరసాధ్య పద్యరచనా ప్రతిభో మాత్రమే కాదు శ్రీనాథుడంటే. గతించిన తెలుగు సాహిత్య వైభవాన్ని మననం చేసుకోడానికి కాదు చదవాల్సింది. మనకోసం. మన మనుగడలో తడబాటులు, తప్పటడుగులపై అవగాహన పెంచుకోవడం కోసం. గీ. తివుచుచున్నది భవదీయ దృగ్విలాస (లాగేస్తోంది నీకన్నుల అందం) / మెత్తుకొనిపోవుచున్నవి యింద్రియములు /వెనుక ద్రొబ్బుచునున్నాడు మనసిజాతు (మన్మథుడు) /డేమిసేయుదు జెప్పవే యిందువదన. సకల సృష్టికీ ఆధారభూతమైంది ఈ ‘దొబ్బుడే’. ప్రస్తుతకాలంలో మాత్రం కోరికను వ్యక్తీకరించడంలో నిండుదనం, హుందాతనం సాధ్యమని తెలీను కూడా తెలీక, అణగారిన అణచుకున్న కోరికలు వికృత రూపాల్లో బయటపడ్డాక ‘నేరం నాది కాదు, దొబ్బుడిదే’ అన్న వాదనకు ప్రతివాదనగా ‘ఆమోదం’ (consent) అనే చిన్న పదాన్ని ప్రయోగిస్తున్నాం. మాటకు అర్థాన్ని మరో మాటతో చెప్పుకోవచ్చునుగానీ పరమార్థాన్ని జీవితానుభవాలలోనూ, వాటిని ప్రతిబింబించే కళలలోనూ మాత్రమే పట్టుకోగలం. ‘ఆమోదం’ గురించి ‘మాస్టర్ క్లాస్’ ఇచ్చాడు మన పూర్వీకుడొకాయన, ఎన్నో శతాబ్దాల కిందట! నౌ టెల్ మీ, హౌ కూల్ ఈజ్ దట్?! -పూర్ణిమ purnimat07@gmail.com -
బలహీనతను బలంగా వినిపించే కవిత్వం
కవికీ కవిత్వానికీ ఏవో ఉన్నత లక్ష్యాలు ఉండాలన్నదానికి భిన్నంగా తన అస్తిత్వపు వేదననే కవిత్వంలోకి తెస్తున్నారు 77 ఏళ్ల అమెరికన్ కవయిత్రి లూవీస్ గ్లోక్. వ్యక్తి అస్తిత్వాన్ని సార్వజనీనం చేస్తున్నందుకుగానూ ఈ సంవత్సరపు నోబెల్ పురస్కారం ఆమెను వరించింది. -లూవీస్ గ్లోక్ కవి అనే వాడు దేనినైనా ఎదుర్కొనే ధైర్యవంతుడు కావాలా? దేనికైనా రొమ్ము ఎదురొడ్డి నిలిచే సాహసి కావాలా? ఏం, కవి భయస్తుడు కాకూడదా? కవి బలహీనుడు కాకూడదా? ఆకాశం కిందిది ఏదైనా కవిత్వానికి అర్హమైనదే అయినప్పుడు, భయ బలహీనతలు మాత్రం కవితా వస్తువులు కావా? ఈ సంవత్సరపు నోబెల్ పురస్కారం వరించిన అమెరికన్ కవయిత్రి లూవీస్ గ్లో్లక్ కవిత్వమంతా ఇలాంటి వ్యక్తిగత కలవరింతలే, పశ్చాత్తాపపు తలపోతలే. అయితే వ్యక్తి అస్తిత్వాన్ని సార్వజనీనం చేస్తున్నందుకుగానూ ఆమెకు ఈ సర్వోన్నత గౌరవం దక్కింది. సంప్రదాయంగా డిసెంబర్ 10న ఈ పురస్కారాన్ని స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో స్వీకరించాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా అదే రోజు తన ఇంటిలోనే దీన్ని అందుకుంటారు. ఆత్మకథాత్మక కవయిత్రి ఆమె తల్లిదండ్రులు హంగెరీ నుంచి అమెరికాకు బతుకుదెరువు కోసం వచ్చిన యూదులు. 1943లో ఆమె పుట్టకముందే ఒక అక్క చనిపోయింది. తన కంటే ముందు పుట్టిన ఒక ప్రాణి మరణించిన వాస్తవం రక్తంలో ఇంకించుకుని పెరిగింది. దీనికితోడు కౌమారంలో ఎక్కువ బరువు పెరుగుతున్నానేమో అనే అసాధారణ భయం వెంటాడింది (అనరెక్సియా నెర్వోసా). సహజంగానే ఇది చదువుకు ఆటంకం కలిగించింది. ఏడేళ్ళ పాటు వైద్యం తీసుకున్నాక గానీ సాధారణం కాలేకపోయింది. ‘‘జీవితంలో ఒక దశలో నేను చచ్చిపోతున్నాను అని అర్థమైంది. కానీ అంతకంటే స్పష్టంగా, అంతకంటే బలంగా నేను చావాలని అనుకోవడం లేదు అని కూడా అనిపించింది’’ అంటారామె. ఈ జబ్బు కారణంగానే ఎలా ఆలోచించాలో నేర్చుకున్నానంటారు. రచన కూడా ఒక జబ్బు లాంటిదే. కాకపోతే మన వేదనని ఇతరులకు పంపిణీ చేయడం ద్వారా స్వస్థత పొందుతాం. ప్రపంచం మాత్రం ఇలా చేయదా? మరి కవికి మాత్రం ఎందుకు మినహాయింపు? అందుకే గ్లో్లక్ ఎనిమిదో ఏట నుంచే కవిత్వాన్ని తన శోకానికి విరుగుడుగా భావించింది. ఆత్మకథాత్మకంగా రాస్తూ, తీవ్రమైన ఉద్వేగాలను పలి కిస్తూ ఆధునిక జీవితాన్ని చిత్రించింది. పాతికేళ్ల వయసులో 1968లో తన తొలి కవితా సంపుటి ఫస్ట్‌బర్న్ వెలువరిం చింది. దీనికి సానుకూల స్పందన వచ్చినప్పటికీ , అనంతరం సుదీర్ఘమైన రైటర్స్ బ్లాక్ వెంటాడింది. కవిత్వం రాయడం ద్వారా తన వేదన నుంచి బయటపడ్డట్టుగానే, కళాశాలలో చేరి కవిత్వాన్ని బోధించడం ద్వారా రైటర్స్ బ్లాక్ నుంచి బయటపడింది. (చదవండి: అమెరికా కవయిత్రికి నోబెల్) తిరిగి తిరిగి నిలబెట్టుకోవడం 1975లో వచ్చిన తన రెండో కవితా సంపుటి ద హౌజ్ ఆన్ మార్‡్షలాండ్స్ ద్వారా తనదైన ప్రత్యేకమైన గొంతును సాధించింది. ఇక 1980లో వచ్చిన డిసెండెంట్ ఫిగర్ ఆమెను విస్మరించలేని కవయిత్రిగా నిలబెట్టింది. ఇల్లు తగలబడి తన సర్వస్వం కోల్పోయినప్పుడు రాసిన కవిత్వం ద ట్రయంప్ ఆఫ్ ఎకిలీస్ (1985). ఈ సంపుటంలోని మాక్ ఆరెంజ్ కవిత స్త్రీవాద గీతమై నిలిచింది. అయినా తనను స్త్రీవాదిగా, యూదు కవిగా, ప్రకృతిగా కవిగా లేబుల్స్ వేసుకోవడానికి ఆమె ఇష్టపడలేదు. వాటన్నింటికి అతీతమైనదేదో మనిషి అస్తిత్వం అని ఆమె నమ్మకం. తన మరణపు వాస్తవాన్ని గుర్తించడం వల్లే ఎకిలీస్ మరింత మనిషి అయినట్టుగా, ఆమె కూడా జీవితపు క్షణభంగురతను ఈ కాలంలో గుర్తిం చింది. తండ్రి మరణించిన దుఃఖంలోంచి పుట్టిన కవిత్వం అరారత్(1990). 1992లో వచ్చిన వైల్డ్ ఐరిస్, తరువాయి సంపుటం మీడోలాండ్స్(1996), వీటా నోవా(1999), ద సెవెన్ ఏజెస్(2001) అన్నీ తన జీవిత వైఫల్య సాఫల్య క్షణాల పట్టుపురుగులే. వైవాహిక జీవితం విచ్ఛిన్నం కావడం, ఉద్యోగాలు కోల్పోవడం, తిరస్కారాలు పొందడం, ఓటములు ఎదుర్కోవడం, నిలుపుకోలేని బంధాల్లో చిక్కుకోవడం, తనను తాను తిరిగి తిరిగి నిలబెట్టుకోవడమే ఈ కవిత్వం నిండా. (చదవండి: నోబెల్ ఉమెన్) నిశ్శబ్దపు ఉనికి మార్పు కోసం తపన పడుతూ, మళ్లీ అదే మార్పు ఎదురైనప్పుడు విలవిల్లాడుతూ అచ్చం సగటు మనిషిలాగే ఆమె కవిత్వం ఉంటుంది. గ్రీకు పురాణాలన్నా, మొత్తంగా ధార్మిక గాథలన్నా ప్రత్యేకమైన ఇష్టం. కాగితం మీద కలం కదపడంలోనే ఏదో తెలియని ఆనందం ఉందనే 77 ఏళ్ల గ్లోక్ అవిరామంగా రాస్తూనే ఉన్నారు. అవెర్నో(2006), ఎ విలేజ్ లైఫ్(2009), ఫెయిత్ఫుల్ అండ్ విర్చువస్ నైట్(2014)– కవితా సంపుటాలను వరుసగా తెస్తూనేవున్నా దీర్ఘ కాలావధులు తాను ఏమిరాయకుండా ఉండిపోతానని చెబుతారు. విస్తృతంగా రాస్తున్నప్పుడు పునరుక్తి దోషం అంటుకోవచ్చు, తాజాదనం కోల్పోవచ్చు. రోజూ పొద్దున లేచేసరికి అదే మనిషిగా ఉండటంలోని సానుకూలతను గుర్తిస్తూనే, నాది నేనులాగే కవిత్వంలో వినిపించడం ఒక శాపంగానే భావిస్తానంటారు. అందుకే ప్రతీ సంపుటికి గొంతు మార్చి ఆశ్చర్యపరుస్తుంటారు. కవిత్వంలో ఆమె తోటలోని పువ్వులకు కూడా ప్రత్యేక వ్యక్తిత్వం ఉంటుంది. ఆవి వివేకంతో భాషిస్తాయి, సందర్భోచితంగా కవయిత్రి శోకంతో గొంతు కూడా కలుపుతాయి. ప్రపంచపు సంగీ తాన్ని, దైవిక నిశ్శబ్దాన్ని కూడా ఆమె కవితలు వినిపిస్తాయి. పెద్ద పాఠకవర్గానికి చేరడంలో ఆమెకు ఉత్సాహం లేదు. కవిత్వం నోటి నుంచి చెవికి జరిగే సున్నితమైన మార్పిడి అని నమ్ముతారు. కానీ, కవిత్వం స్టేజీ మీద చదవడానికి కూడా ఇష్టపడదు. నోరు, చెవి అనేవి నిజార్థంలో కాకుండా ఒక మనసులో పుట్టిన భావాన్ని స్వీకరించేం దుకు సిద్ధంగా ఉన్న ఇంకో మనసుగా చూస్తారు. వినబడినప్పుడే ఉనికిలో ఉన్నట్టు కాకుండా, నిశ్శబ్దంలో కూడా అస్తిత్వంలో ఉండాలంటారు. – పి.శివకుమార్ -
అమెరికా కవయిత్రికి నోబెల్
స్టాక్‌హోమ్: ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ బహుమతి అమెరికా కవయిత్రి లూయిసీ గ్లుక్(77)కు దక్కింది. ‘ఎటువంటి దాపరికాలు, రాజీలేని గ్లుక్ తన కవితల్లో.. కుటుంబ జీవితంలోని కష్టానష్టాలను సైతం హాస్యం, చమత్కారం కలగలిపి చెప్పారు’అందుకే 2020 సంవత్సరానికి గాను సాహిత్యంలో నోబెల్ పురస్కారానికి ఎంపిక చేస్తున్నట్లు స్టాక్‌హోమ్‌లోని నోబెల్ అవార్డు కమిటీ గురువారం ప్రకటించింది. ‘హృద్యమైన, స్పష్టమైన ఆమె కవితా స్వరం వ్యక్తి ఉనికిని విశ్వవ్యాప్తం చేస్తుంది’అని స్వీడిష్ అకాడమీ శాశ్వత కార్యదర్శి మాట్స్ మామ్ పేర్కొన్నారు. 2006లో గ్లుక్ రచించిన ‘అవెర్నో’కవితా సంకలనం అత్యుత్తమమైందని నోబెల్ సాహిత్య కమిటీ చైర్మన్ ఆండెర్స్ ఒల్సన్ పేర్కొన్నారు. 1901 నుంచి సాహిత్యంలో ఇస్తున్న నోబెల్ బహుమతి ఎక్కువ మంది నవలా రచయితలనే వరించింది.. కాగా, గ్లుక్‌తో కలిపి ఇప్పటి వరకు 16 మంది మహిళలకు మాత్రమే ఈ గౌరవం దక్కింది. స్వీడిష్ అకాడమీ ఈ బహుమానం కింద గ్లుక్‌కు రూ.8.25 కోట్ల (10 మిలియన్ క్రోనార్లు)తోపాటు ప్రశంసా పత్రం అందజేయనుంది. చివరిసారిగా సాహిత్యంలో నోబెల్ గెలుచుకున్న అమెరికన్ బాబ్ డైలాన్(2016). హంగేరియన్–యూదు మూలాలున్న లూయిసీ గ్లుక్ 1943లో న్యూయార్క్‌లో జన్మించారు. కనెక్టికట్‌లోని యేల్ యూనివర్సిటీ ఫ్యాకల్టీగా గ్లుక్ పనిచేస్తున్నారు. ఆమె 1968లో ‘ఫస్ట్‌బోర్న్’ పేరుతో మొట్టమొదటి కవిత రాశారు. అతి తక్కువ కాలంలోనే సమకాలీన అమెరికా సాహిత్యంలో ప్రముఖ కవయిత్రిగా పేరు సంపాదించుకున్నారు. ఆరు దశాబ్దాల్లో డిసెండింగ్ ఫిగర్స్, ది ట్రయంఫ్ ఆఫ్ అచిల్స్, అరారట్ వంటి 12 కవితా సంకలనాలను, రెండు వ్యాస సంకలనాలను ఆమె రచించారు. వివాదాల్లో నోబెల్ ‘సాహిత్యం’ సాహిత్యంలో నోబెల్ బహుమతిని ఈసారి యూరప్, ఉత్తర అమెరికా వెలుపల ఆఫ్రికా, ఆసియా లేదా కరేబియన్ రచయితకు స్వీడిష్ అకాడమీ ప్రకటిస్తుందని చాలా మంది భావించినా అమెరికన్‌కే ప్రకటించింది. సాహిత్యంలో నోబెల్ బహుమతులపై ఇటీవల వివాదాలు, కుంభకోణాలు అలుముకోవడంతో పాటు పాశ్చాత్య దేశాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు సైతం వెల్లువెత్తాయి. నోబెల్ ఎంపిక కమిటీపై 2018లో లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. కొందరు సభ్యులు కమిటీ నుంచి వైదొలిగారు. దీంతో ఆ ఏడాది నోబెల్ సాహిత్యం పురస్కారాన్ని ప్రకటించలేదు. గత ఏడాది సాహిత్య నోబెల్ అవార్డుల ప్రకటన జరిగింది. 2018వ సంవత్సరానికి గాను పోలండ్‌కు చెందిన ఓల్గా టోకార్జక్‌కు, 2019కి ఆస్ట్రియా రచయిత్రి పీటర్ హాండ్కేకు అవార్డులు అందజేస్తున్నట్లు కమిటీ ప్రకటించింది. కానీ, హాండ్కే ఎంపికపై వివాదం తలెత్తింది. 1990లలో జరిగిన బాల్కన్ యుద్ధాల్లో హాండ్కే సెర్బుల మద్దతుదారుగా ఉన్నారని, సెర్బియా యుద్ధ నేరాలను హాడ్కే సమర్థించారని ఆరోపణలు ఉండటం ఇందుకు కారణం. అల్బేనియా, బోస్నియా, టర్కీ తదితర దేశాలు హాండ్కేకు బహుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ అవార్డుల కార్యక్రమాన్ని బహిష్కరించగా కమిటీ సభ్యుడు ఒకరు తన పదవికి రాజీనామా చేశారు. ఈ వివాదాల నేపథ్యంలో 2020 సాహిత్య నోబెల్ అవార్డు ప్రకటన కొంత ప్రాధాన్యం సంతరించుకుంది. లూయిసీకి దక్కిన పురస్కారాలు ► నేషనల్ హ్యుమానిటీ మెడల్(2015) ► అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ గోల్డ్ మెడల్ ► ‘ది వైల్డ్ ఐరిస్’కవితకు పులిట్జర్ ప్రైజ్(1993) ► ‘ఫెయిత్ఫుల్ అండ్ విర్చువస్ నైట్’ కవితకు నేషనల్ బుక్ అవార్డు(2014) ► 2003, 2004 సంవత్సరాల్లో ‘యూఎస్ పోయెట్ లారియేట్’ -
అమెరికన్ కవయిత్రికి సాహిత్యంలో నోబెల్
స్టాక్‌హోం : సాహిత్యంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి ఈ ఏడాది అమెరికా కవయిత్రి లూయిస్ గ్లక్‌కు లభించింది. గ్లక్ తన అద్భుత సాహితీ గళంతో తన ఉనికిని విశ్వవ్యాప్తం చేశారని స్వీడిష్ అకాడమీ ఆమెను ప్రశంసించింది. గ్లక్ తన 1992 కలెక్షన్ ది వైల్డ్ ఐరిస్‌కు గాను ప్రతిష్టాత్మక పులిట్జర్ ప్రైజ్ సొంతం చేసుకోగా 2014లో నేషనల్ బుక్ అవార్డును దక్కించుకన్నారు. లూయిస్ గ్లక్ 1943లో న్యూయార్క్‌లో జన్మించారు. కనెక్టికట్ లోని యేల్ యూనివర్సిటీలో ఆంగ్ల ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. చిరుప్రాయంలోనే కవితలు రాసిన గ్లక్ ఆపై అమెరికాలో ప్రముఖ కవయిత్రిగా ఎదిగారు. కాగా, సాహిత్యంలో నోబెల్ బహుమతిని ఈసారి యూరప్, ఉత్తర అమెరికా వెలుపల ఆఫ్రికా, ఆసియా లేదా కరేబియన్ రచయితకు స్వీడిష్ అకాడమీ అందచేస్తుందని పలువురు భావించినా అమెరికన్ రచయిత్రికే ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందించింది. సాహిత్యంలో నోబెల్ బహుమతులపై ఇటీవల వివాదాలు, కుంభకోణాలు అలుముకోవడంతో పాటు పాశ్చాత్య దేశాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇక 2018లో స్వీడిష్ అకాడమీని లైంగిక వేధింపుల ఆరోపణలు, ఆర్థిక అవకతవకల కుంభకోణాలు చుట్టుముట్టడంతో సాహిత్యంలో నోబెల్ బహుమతిని ప్రదానం చేయలేదు. ఆ మరుసటి ఏడాది పోలండ్ రచయిత ఓల్గా టకార్జక్కు సాహిత్య బహుమతిని అందించారు. చదవండి : నోబెల్ : నూట ఇరవై ఏళ్లలో నలుగురు -
పుట్టిన శిశువు ఆడ, మగ కాకపోయినా సరే..
త్రిస్సూర్: ఇంటర్ సెక్స్ వ్యక్తులు జీవశాస్త్ర పరంగా మగ లేదా ఆడవారు కాదు. జన్యుపరంగా, హార్మోనుల పరంగా, లైంగిక భాగాల తయారీలో తప్పులున్నప్పుడు మగ, ఆడ రెండు లక్షణాలతో జన్మిస్తారు. వీరిలో కొంతమందిలో ఆపరేషనుల ద్వారా, మందుల ద్వారా సరి చేయవచ్చు. అయితే సమాజంలో వీరు ఎంతగానో వివక్షకు గురవుతున్నారు. కొన్నిచోట్ల ఇలాంటి పిల్లలను పురిటిలోనే చంపేస్తున్నారు. దీంతో ఇంటర్ సెక్స్ పిల్లలకు కూడా ప్రేమ పంచాల్సిన అవసరం ఉందంటూ కేరళలోని త్రిస్సూర్‌లో హిజ్రా హక్కుల కార్యకర్త, రచయిత్రి విజయరాజా మల్లిక కవితా ఆల్బమ్‌ను రూపొందించారు. 'ఇది శాపమో, పాపమో కాదు.. నా బంగారు పాప.. నువ్వు నా అదృష్టానివి. నా తొలి చుక్కానవి' అంటూ మలయాళీ భాషలో ఈ కవిత్వం సాగుతుంది. ఇందులో నటి తువ్వాలలో చుట్టుకొన్న బిడ్డను ఎత్తుకొని కన్న మమకారం చూపిస్తూ ప్రేమను కురిపిస్తుంది. (చదవండి:కవి మనసు ఖాళీగా ఉండదు) 'నా రంగుల హరివిల్లా, నువ్వు అబ్బాయి కాకపోయినా, అమ్మాయి అవకపోయినా నీకు నా రొమ్ము పాలు పడతాను' అంటూ సమాజం చూపే వివక్షను అణిచివేస్తూ తల్లిప్రేమను పంచుతుంది. ప్రస్తుతం ఈ పాట అందరి మనసులను కదిలిస్తోంది. విజయరాజా మల్లిక రచించిన ఈ కవిత్వానికి కరీంభుజా సంగీతం అందించగా, శిని అవంతిక మనోహరంగా ఆలపించి పాటగా రూపొందించారు. ఈ వీడియోలో మల్లిక, తన భర్త జషీంతో కలిసి నటించారు. ఈ ఆల్బమ్‌ను డ్యాన్సర్ రాజశ్రీ వారియర్ ఆదివారం ఆన్లైన్లో విడుదల చేశారు. "ఇంటర్‌సెక్స్ పిల్లలను చెత్తకుప్పల్లో పడేసిన ఘటనలు ఉన్నాయి. కానీ ఈ పాటలో ఉన్న తల్లి మాత్రం పుట్టిన బిడ్డ ఆడో, మగో తెలియకపోయినా శిశువును గుండెలకు హత్తుకుంటోంది" అని తెలిపారు. ఇంటర్‌సెక్స్ శిశువులపై మలయాళంలో వచ్చిన తొలి కవిత్వం ఇదేనని పలువురు పేర్కొంటున్నారు. (చదవండి: ఏం చేస్తున్నావు? నేను చూసేశాను!) -
విస్మృత కవి వేణుగోపాలాచార్య
‘పట్నంలో షాలిబండ –పేరైన గోలకొండ ’’–అని జానపద శృంగార భావాలతో రస తరంగాలలో ఓలలాడించిందా కలం ... ’’కౌసల్య తనయ శ్రీ రామ కౌస్తుభాగా ’ –అని తెల తెలవారుతున్న సమయంలో తెలుగు పదచిత్రాలతో గంభీర స్వరంతో శ్రీనివాసునికి మేలుకొలుపు పాడినదా గళం .. అంతేకాదు ’’జయ జయ జయ శ్రీ వెంకటేశా ’ అని శ్రీవెంకటేశ్వర స్వామి అవతార గాథను తేట తెలుగులో వినిపించి దృశ్యమానం చేసిందా స్వరం. ఆలా కవిత్వంలో, పాండిత్యంలో ,వ్యక్తిత్వంలో పరిపూర్ణతను సాధించినా, మబ్బు చాటు చంద్రుని వలె మసక బారిన ప్రతిభా మూర్తి ఆచ్చి వేణుగోపాలాచార్య. 1959–75 మధ్య కాలంలో తెలుగు, హిందీ సినిమాలకు కథ, మాటలు,పాటలు, రాయడమే కాదు కొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా వహించిన వేణుగోపాల్ సంస్కృతం, తెలుగు, హిందీ ఉర్దూ భాషలలో పండితుడు . తెలుగు, సంస్కృతంలలో కథలు, నవలలు, ఖండ కావ్యాలు, భక్తి గీతాలు, బుర్రకథలు, అసంఖ్యాకంగా రాశారు. కానీ అటు సినీ రంగంలో, ఇటు సాహిత్య రంగంలో విస్మృత కవిగా మిగిలి పోయారు. వేణుగోపాలాచార్య 1930 జూన్ 12న హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లో నర్సమ్మ, నరసింహాచార్యులు దంపతుల తొమ్మిదిమంది సంతానంలో రెండవవారుగా జన్మించారు. బాల్యంలోనే రామాయణ, భారత, భాగవతాల్లో పద్యాలూ, సంస్కృత నీతి శ్లోకాలు నేర్చుకున్నారు. 1952లోఉపాధ్యాయునిగా ప్రభుత్వ పాఠశాలలో చేరారు. అలా ఉద్యోగం చేస్తూనే ఎంఏ (తెలుగు, సంస్కృతం ) డిగ్రీ సాధించారు. అలహాబాద్ యూనివర్సిటీ నుంచి’’ హిందీ సాహిత్య రత్న’’, పాసై తదుపరి అదీబ్ మహర్ అలీఘడ్ యూనివర్సిటీ నుంచి ఎం.ఏ. ఉర్దూ కూడా చదివి తన భాషా పిపాసను జ్ఞానతృష్ణను తీర్చుకున్నారు. వేణుగోపాల్ పేరును తారాపథంలోకి తీసుకెళ్లిన చిత్రం ’అమాయకుడు’ (1968). కృష్ణ, జమున నటించిన ఈ సినిమాలో వేణుగోపాల్ రాసిన ’’పట్నంలో షాలిబండ –పేరైన గోలకొండ, సూపించు సూపు నిండా పిసల్ పిసల్ బండ ’ అని రాసిన పాటను బి.శంకర్ స్వరపరచి ఎల్. ఆర్. ఈశ్వరితో పాడించగా అది తెలుగునాట మారుమోగింది. 1970ల్లో పీసీ రెడ్డి పిలుపు మేరకు చెన్నై వెళ్లి కొన్ని చిత్రాలకు కో డైరెక్టర్‌గా పనిచేశారు. 1975 లో సౌభాగ్యవతి చిత్రానికి íపీసీ రెడ్డి నామ మాత్ర దర్శకునిగానే గానే ఉండగా, వేణుగోపాల్ కథ కొన్ని పాటలు రాసి దర్శకత్వం వహించారు. కానీ సినీ రాజకీయాల్లో ఇమడలేకపోయారు. ’’ శ్రీవెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతాన్ని ’’ కౌసల్య తనయ శ్రీ రామ కౌస్తుభాంగ .తూర్పున భానుడుదయించె తోయజాక్ష’’ అంటూ సుమారు 15 పద్యాలు రాయ గా ఘంటసాల గాత్రంలో అవి జనరంజకమయ్యాయి.’’ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’’ కూడా ఆయన రచనే. ఇంకా తిరుప్పావై, శ్రీవినాయక వ్రతకల్పము, శ్రీ గోదా తృష్ణ కృష్ణ , గీతా గోపాలం తదితర గ్రంథాలు రచించారు. తన పూర్వీకుల గ్రామం ప్రస్తుత రాజన్న సిరిసిల్లలోని ఆవునూరుపై ‘‘మావూరు’’ అనే ఖండ కావ్యం రాశారు . తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని చూసి మురిసిన వేణుగోపాల్ 85 ఏట 2015 లో దివంగతులయ్యారు. -డాక్టర్ వి.వి.రామారావు వ్యాసకర్త ఆకాశవాణి ప్రయోక్త -
మలయాళ కవి అక్కితమ్‌కు జ్ఞానపీఠ్
న్యూఢిల్లీ: ప్రముఖ మలయాళ కవి అక్కితమ్ అచ్యుతన్ నంబూద్రి ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికయ్యారు. అక్కితమ్‌ను 55వ జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపిక చేస్తున్నట్లు ఎంపిక కమిటీ శుక్రవారం ప్రకటించింది. ‘అక్కితమ్ అరుదైన సాహితీవేత్త. కలకాలం నిలిచిపోయే ఎన్నో రచనలు చేశారు. ఆయన కవిత్వం అపారమైన కరుణను ప్రతిబింబిస్తుంది. భారతీయ తాత్వికత, నైతిక విలువలకు, సంప్రదాయం, ఆధునికతకు వారధిగా ఆయన కవిత్వం నిలుస్తుంది. వేగంగా మారుతున్న సమాజంలో మానవ భావోద్వేగాలకు ఆయన కవిత్వం అద్దంపడుతుంది’ అని జ్ఞానపీఠ్ ఎంపిక బోర్డు చైర్మన్ ప్రతిభా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మలయాళ సాహితీవేత్తల్లో ప్రముఖుడైన అక్కితమ్ కేరళలో 1926లో జన్మించారు. అక్కితమ్ కవితలతోపాటు నాటకాలు, విమర్శనాత్మక వ్యాసాలు, పిల్లల సాహిత్యం, కథలు, అనువాదాల్లోనూ తనదైన ముద్ర వేశారు. అక్కితమ్ ఇప్పటి వరకు 55 పుస్తకాలు రాశారు. సాహిత్య అకాడమీ అవార్డు, కేరళ సాహిత్య అకాడమీ అవార్డు, కబీర్ సమ్మాన్ వంటి పురస్కారాలు అందుకున్నారు. -
ఒకే చోట రెండు పక్షులు
కాకినాడ ఆంధ్ర సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో 1950 ప్రాంతంలో అప్పటి ప్రముఖ కవులతో ఒక కవి సమ్మేళనం జరిగింది. అందులో గుర్రం జాషువా, దువ్వూరి రామిరెడ్డి, విశ్వనాథ సత్యనారాయణ వంటివారు పాల్గొన్నారు. కవిసమ్రాట్ విశ్వనాథకంటే ముందుగా సభా ప్రాంగణానికి వచ్చిన జాషువా, దువ్వూరి ఒకచోట కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అప్పుడే వచ్చిన విశ్వనాథ వ్యంగ్యంగా రెండు పక్షులూ ఒకచోట చేరాయే అన్నారు. ఇద్దరూ కవికోకిల బిరుదాంకితులే కదా. వెంటనే వారు స్పందిస్తూ ఈ కిరాతుడి కంట పడతామని అనుకోలేదన్నారు. ఆ ప్రాంగణంలో ఉన్నవారంతా వారి సమయస్ఫూర్తికి నవ్వుకున్నారు. -డాక్టర్ పి.వి.సుబ్బారావు -
మానవాన్వేషి.. పాఠక కవి
‘‘అంతర్మథనంలో స్పందించిన నాలుగు రచనల్నీ, గాలిపటాల్లా ఎగరేసి, కాలాన్నీ మామతాన్నీ తట్టుకొని ఎన్ని నిలుస్తవో అన్నదే గమనించాలి ప్రతి పదాన్నీ పాదాన్నీ కాలం వస్త్రకాయితం పడుతుంది’’ – సి.వి.కృష్ణారావు ‘కల్పన’ లోంచి. మృత్యువంచులోని కొస వెలుతురుని కూడా జీవ శ్వాసగా బంధించి అక్షరాల్లోకి వంపుకున్న కవి ఆయన. సత్యనిష్ట కలిగిన కవి. ఆయన రాసిన ప్రతి వాక్యమూ ఆచరణలోంచి, స్వీయానుభవం లోనుంచి పలికిన జీవ కవిత్వం. సాధారణంగా అగుపడే ఆయన కవిత్వమంతా అసాధారణ అనుభవాల చిక్కదనాన్ని ప్రసారం చేసింది. తన వ్యక్తిత్వానికీ, కవిత్వానికీ మధ్య సరిహద్దు రేఖను ఆయన ఎప్పుడో చెరిపివేసుకొని జీవించాడు. ‘వైతరణి’, ‘మాది మీ వూరే మహరాజ కుమారా’, ‘అవిశ్రాంతం’, ‘కిల్లారి’ కవిత్వ సంకలనాలలో తను ఆకాంక్షించిన మానవీయ అస్తిత్వ అన్వేషణ, ఆచరణ దృష్టే పాఠకుల అంతరంగాలను ఆర్ధ్రపరుస్తుంది. స్వభావరీత్యా.. శాంత స్వభావి. సమాజం లోని అన్ని రకాల సామాజిక, సాంఘిక అసమానతల పట్ల తీవ్రమైన ఆగ్రహం ఉంటుంది ఆయన కవిత్వంలో. అయితే, ఆయన ఉగ్రత్వం.. శాంతత్వంలోకి మారువేషం వేసుకొని వచ్చి మనల్ని అస్థిరపరుస్తుంది. ఇదే కృష్ణారావుగారి కవిత్వంలోని ప్రత్యేకత. కృష్ణారావుగారు 1926లో నల్లగొండ జిల్లా రేవూరు గ్రామంలో జన్మించిన తెలంగాణ తొలితరం కవుల్లోని విశిష్ట కవి. లోకంలోని అనేకానేక ప్రశ్నలకు కృష్ణారావుగారి వంటి వారి దగ్గర ఒకటో రెండో సమాధానాలు మాత్రమే ఉంటాయి. అవి అనేక ప్రశ్నలను బ్యాలెన్స్ చెయ్యగలిగినవే అయి ఉంటాయి. రాబోయే తరాల ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పగలిగిన బతుకు సత్తా కలిగినవే అయి ఉంటాయి. జీవితం తాలూకు దెబ్బల్ని తట్టుకొని, దెబ్బదెబ్బకూ బలాన్ని పుంజుకొని బతికిన కవి యోధుడు తను. ఆయనను అందరూ వెన్నెల కృష్ణారావుగారంటారు. నేను కవిగా 1990లో నా దారిని వెతుక్కుంటూ ‘నెలనెలా వెన్నెల’లోకి ప్రవేశించాను. ఇందులో సభ్యత్వమూ సభ్యత్వ రుసుములూ ఉండవు. కవులకూ, పాఠకులకూ ఎజెండాల ఆంక్షలుం డవు. అక్కడ ఏ జెండాల రంగులు పొంగులు ఉండవు. ఏ కవికయినా వారి వారి స్వీయ మానసిక ఎజెండాల రాజకీయాల దృష్టి ఉండొచ్చు. అది తమ కవిత్వాన్ని సాంద్రపరిచి, సునిశితం చేయ గలిగితే చాలు. అక్కడి పాఠకమ్మన్యులు మనసారా అక్కున చేర్చుకుంటారు. అదీ నెలనెలా వెన్నెల ప్రత్యేకత. అటువంటి వేదికకు నిర్వాహకుడు, సేవకుడూ కృష్ణారావుగారు. 90వ దశకంలో అస్తిత్వ ఉద్యమాలు ఊపుగా తెరమీదికి వస్తున్నాయి. అంతే బలంగా మరొక వైపు, తెలుగు సాహిత్యంలో ముఠాల, మఠాల మాఫియా బెదిరింపులు ఎక్కువవుతున్నాయి. కొత్తగా కవిత్వం రాస్తూ బలపడుతున్న కవులను రాజకీయ, అరాజకీయ, స్వరాజకీయ ఎత్తుగడ లతో భయపెట్టేవాళ్లు. కొత్త కవుల్ని.. హైదరాబాద్‌లో ‘రాంపురి చాకుల (సిద్ధాంతాల పేరుతో) వంటి విన్యాసాలతో పొడిచి చంపుతూన్న సంద ర్భం. సరిగ్గా అటువంటి అయోమయంలో నెలనెలా వెన్నెలతో చల్లగా సాయంకాలాల ఇరానీ హోటళ్ల సగం కప్పు జిందగీతనంతో నెనరుగల నాయ నగా, సహృదయుడిగా కొత్త కవుల వేదికతో తెర మీదికి వచ్చారు కృష్ణారావుగారు. అప్పుడు ‘నెలనెలా వెన్నె ల’ది ఉత్తమమైన ఛీజ్ఛ్టీ్చటy ఛిౌn్టటజీbu్టజీౌn అని కూడా నాకు తెలిసి వచ్చింది. దళిత, స్త్రీవాద, బహుజన, మైనార్టీ ప్రాంతీయ అస్తిత్వాలు వేళ్లూనుకొని విస్తరిం చడానికి నెలనెలా వెన్నెలలోని ప్రజా స్వామ్యం ఎంతో దోహదపడింది. ఆయా కవుల తొలి సంకలనాల ఆరంగేట్ర స్థలమ య్యింది. సభల్లో ఛాయ, బిస్కెట్ ‘తెహ జీబ్’ని సాంప్రదాయంగా ముందుకు తెచ్చారు. పైసల ప్రస్తావనే ఉండేది కాదు. ఆయన డిమాండ్ అంతా కవులను కొత్త కవితలు పట్టుకుని రమ్మ నడమే. తను కొత్త కవిత రాయగానే వెంటనే పట్టుకు వచ్చి వినిపించేవారు. ఆయన పాఠకులకు శక్తినీ, సహనాన్నీ ఇవ్వగలిగిన సాహిత్య తత్వ విజ్ఞత ఉన్న గొప్ప మనిషి. తరతరాలు గుర్తుండి పోయే కవి. (ఆదివారం కనుమూసిన ప్రముఖ కవి సి.వి.కృష్ణారావు స్మృతిలో..) – సిద్ధార్థ, ప్రముఖ కవి -
కవ్వించి నవ్వించిన వాడి కథ
ముగ్గురు మహానటులు నటించిన సినిమాలోని దృశ్యాలివీ... ఈ సినిమాపేరేంటో చెప్పుకోండి చూద్దాం...‘‘గుండెల్లో భయంకర అగ్నిగోళాలు బ్రద్దలవుతున్నా ప్రజలను కవ్వించి నవ్విస్తా తల్లీ. అమ్మా... ధన్యోస్మీ... జగదాంబ ధన్యోస్మీ’’ అన్నాడు అతడు.ఆతరువాత భార్యాబిడ్డలతో కలిసి విజయనగరరాజ్యంలోకి ప్రవేశించాడు. ఒక సత్రంలోకి వెళ్లి...‘‘ఏవండీ...దూరం నుంచి వస్తున్నాం. బస వీలవుతుందా?’’ అని అడిగాడు నెమ్మదిగా.‘‘ఆ గదిలో బూజు దులుపుకుని ఉండండి. రెండురోజులు ఉండవచ్చు’’ అన్నాడు సత్రం నిర్వాహకుడు. తనను తాను పరిచయం చేసుకునే క్రమంలో తాను కవిని అనే విషయం చెప్పాడు అతడు.‘కవి’ అనే శబ్దం వినిపించగానే అతడికి అక్కడ అపూర్వమైన గౌరవమర్యాదలు లభించాయి. ఇది చూసి కవిగారు మురిసిపోయి...‘‘యాథారాజా తథాప్రజా అని ఊరకే అన్నారా పెద్దలు. మీ ఆదరణలో అతిథి మర్యాదలు చూస్తుంటే ఏలిన వారికి కవులంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది’’ అన్నాడు.ఆచార్య స్వాముల వారిని కలవాలని ప్రయత్నిస్తున్నారు కవిగారు. అక్కడి సిబ్బంది మాత్రం ఇతడిని బొత్తిగా ఖాతరు చేయడం లేదు.‘‘ఎవరయ్యా నువ్వు?’’ అని గద్దించాడు ఒక ఆస్థాన కవి.‘‘నాకు కవిత్వంలో కొంత ప్రవేశం ఉందండి. వారి అనుగ్రహంతో రాజాశ్రయం పొందాలని వచ్చా!’’ తాను వచ్చిన పని గురించి చెప్పారు కవిగారు.‘‘నాకు కవిత్వంలో ప్రవేశం ఉందండి’’ అనే మాట విని ఈ కవిగారిని ఆస్థాన కవిగారు ఇలా వెటకారం చేశారు...‘‘ఈ కాలంలో కవిత్వం, వైద్యం రానివాడెవ్వడులే’’ అన్నాడు. మహారాజును కలిసే వరకే అతని దురదృష్టం. ఆతరువాత అదృష్టమే ఆ కవి వెంట పరుగులు తీస్తుంది. కాని ఆ అదృష్టఘడియ ఎప్పుడు వచ్చేనో ఎలా వచ్చేనో! రాయలవారి సభ.‘‘ఏమిటి మీ విజ్ఞాపన?’’ గంభీరస్వరంతో అడిగారు మంత్రి.‘‘మా తండ్రిగారి మరణశాసనం ప్రకారం స్థిరాస్తి మాకు పంచబడింది. కాని స్థిరాస్తి మాకు పంచలేకపోతున్నారు మహాప్రభో’’ అన్నాడు రాయలవారి ముందు నిల్చున్న ముగ్గురిలో ఒకరు.‘‘కారణం?’’ అడిగారు రాయలవారు.‘‘మా తండ్రిగారి పదిహేడు ఏనుగులు... సగం పాలు నాకు, మూడో పాలు రెండో వాడికి, అందులో మూడో పాలు మూడోవాడికి రావాలి. ఈ పంపకం చేయలేక వాటిని మీ గజశాలకు తోలించారు. మాకు న్యాయం చేయండి మహాప్రభో’’ అని దీనంగా వేడుకున్నాడు ముగ్గురిలో పెద్దవాడు.రాయలవారు వెంటనే స్పందించారు: ‘‘మా పాలనలో ఎన్నడూ అన్యాయం జరగబోనివ్వం’’ అంటూ ‘‘ఈ సమస్య గురించి మీ అభిప్రాయం?’’ అని ధర్మాధికారులను అడిగాడు.‘‘ఎన్ని విధాల భాగించి చూసినా జంతుహింస చేయకుండా పాలు పంచడం సాధ్యంగా కనిపించడం లేదు మహారాజా’’ అన్నాడు ధర్మాధికారులలో ఒకరు.‘‘మరణించినవాడు మతిలేనివాడు కాదు మహాప్రభో. ప్రతిభవంతుడైనా ప్రభుభక్తిపరాయణుడు. కనుకనే సాధ్యం కాని విభాగాలలో మరణశాసనం రాశాడు. కాబట్టి ఆయన అభిమతాన్ని మన్నించి మీరు ఏనుగుల్ని స్వీకరించడం ధర్మం’’ అన్నాడు మరో ధర్మాధికారి.‘‘ధర్మం కాదు మహాప్రభో’’ బాధగా అన్నారు అన్నదమ్ముల్లో ఒకరు.‘‘ఈ మహాసభ నిర్ణయాన్ని అన్యాయమని ఆక్షేపించేది ఎవరో’’ సభను ఉద్దేశించి గట్టిగా అడిగారు మహామంత్రి.‘‘నేను’’ అంటూ ఎవరో అనామకుడు లోనికి వచ్చాడు.‘‘ఎవరు నువ్వు?’’ గద్దించారు మహామంత్రి.‘‘ఎవడో పిచ్చివాడు’’ సమాధానమిచ్చాడు ఒక పాలనాధికారి.‘‘కాదు మహాప్రభో తమ ఆశ్రితుడిని’’ అన్నాడు ఆ అనామకుడు.‘‘విద్యానగర పౌరుడివేనా?’’ అడిగారు మహామంత్రి.‘‘ప్రభువులు అనుగ్రహిస్తే అవుతాను. నియోగి బిడ్డను, ఎందుకు వినియోగించినా వినియోగపడతాను’’ అని తెలివిగా సమాధానం ఇచ్చాడు అనామకుడు. ‘‘ఎవరివయ్యా నువ్వు?’’ అని అక్కడ ఎవరో అడిగారు.తాను కృష్ణా తీరం నుంచి వచ్చాను అని, తండ్రి పేరు గార్లపాటి రామన్న మంత్రి అని చెప్పాడు ఆ యువకుడు.‘‘నువ్వు ఈ సమస్యను పరిష్కరించగలవా?’’ అడిగారు మహామంత్రి.‘‘తమకు అభ్యంతరం లేకుండా పరిష్కరిస్తాను’’ అని రంగంలోకి దిగాడు రామన్నగారి కుమారుడు.‘‘పదిహేడు ఏనుగు బొమ్మలు తెప్పించండి’’ అని అడిగాడు.అలాగే పదిహేడు ఏనుగు బొమ్మలు అతని దగ్గరకు తెచ్చారు.‘‘ఈ పదిహేడు ఏనుగుల్లో రాజుగారి ఏనుగును చేర్చడానిక మీకు ఏమైనా అభ్యంతరమా?’’ అని అడిగాడు.‘‘చేర్చడానికి వీల్లేదు. పంచేవి పదిహేడే’’ అన్నారు ఒక ధర్మాధికారి.‘‘నేను పంచేది కూడా పదిహేడే స్వామి’’ అన్నాడు యువకుడు.సభాసదులలో ఆసక్తి అంతకంతకూ పెరిగిపోయింది.‘ఇతడు ఏం చేయబోతున్నాడు?!’‘‘ఇక్కడ ఉన్నవి ఎన్ని ఏనుగులు?’’ అని అడిగాడు యువకుడు.‘‘పదిహేడు’’ అన్నాడు అక్కడ ఉన్నవారిలో ఒకడు.‘‘పదిహేడు కాదు రాజుగారి ఏనుగుతో కలిపి, వెరసి పద్దెమినిది. ఇందులో సగం పాలు పెద్దవాడికి...ఈ తొమ్మిది తీసుకో...రెండో వాడికి మూడో వంతు...అనగా ఆరు...మూడో వాడి పాలు రెండు...ఇక మిగిలింది శ్రీవారి ఏనుగు. ఇది వారి పాలు’’ అని జటిలమైన సమస్యను నిమిషాల్లో తీర్చేశాడు ఆ యువకుడు.‘‘శబ్భాష్’’ అన్నారు మెచ్చుకోలుగా రాయలవారు.ఆనందంగా ఇంటికి వచ్చాడు ఆ యువకుడు.‘‘ఆహా, రాయలవారిది ఇంద్రవైభవం కమల’’ అన్నాడు భార్యతో.‘‘ఆదరించారా?’’ అడిగింది ఆమె.‘‘అన్నాక తప్పుతుందా! వారు మహారాజు, మనల్ని కవిరాజుని చేసేశారు. మహామంత్రి అప్పాజీగారు, మా నాన్నగారు ఒకే గురువు శిష్యులట! ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. మనకు మంచి భవనం కూడా ఏర్పాటు చేస్తానన్నారు. రేపటి నుంచి మన కాపురం అక్కడే’’ అని సంతోషంగా చెప్పుకుపోతున్నాడు యువకుడు. -
అన్నంభట్టును ఇవతలకు తెండి!
సాహిత్య మరమరాలు తర్కసంగ్రహం అనే గ్రంథాన్ని సంస్కృతంలో రచించిన ‘మహామహోపాధ్యాయ’ అన్నంభట్టు క్రీ.శ. 17వ శతాబ్దం ఉత్తరార్థంలో జీవించాడు. ఆయన గొప్ప శాస్త్రకారుడు మాత్రమే కాదు, ఆచారపరుడు కూడా! ఆయన ఆ గ్రంథం మొత్తాన్నీ మడి కట్టుకొనే రచించాడు. ఒకరోజున గ్రంథరచన పూర్తి ఐంది. కవి వివరాలను తెలిపే ముగింపు శ్లోకాన్ని వ్రాయవలసి ఉన్నది. ఆయనకు ‘విదుషాన్నంభట్టేన’– పండితుడైన అన్నంభట్టుచే రచించబడిన అనే ఆలోచన వచ్చింది. బాగానే ఉన్నది కానీ అది అనుష్టుప్పు శ్లోకం కనుక, ప్రతి పాదంలోనూ ఎనిమిది అక్షరాలు ఉండాలి. అన్నంభట్టు వ్రాయాలనుకొన్న పాదంలో ఏడు అక్షరాలు మాత్రమే ఉన్నై. ఆ ఎనిమిదవ అక్షరం కోసం నానా తంటాలు పడుతున్నాడు. అంతటి మహాకవికి కూడా గంటలు గడుస్తున్నై కానీ సరియైన రీతి దొరకటం లేదు. ఇంట్లో ఆ పని మీద, ఈ పని మీద అటుగా వచ్చి వెళుతున్న అతని భార్య ఈ పరిస్థితిని చూసింది. ‘సంగతేమిటండీ?’ అని అడిగింది. చెప్పాడు. ఆమె చిరునవ్వు నవ్వింది. ‘దీని కింత ఆలోచన ఎందుకండి? ఆ వైపున ఉన్న అన్నంభట్టును ఈ వైపునకు తీసుకొనిరండి!’ అన్నది. అన్నంభట్టు చూశాడు. తను వ్రాయాలనుకొన్న ‘విదుషాన్నంభట్టేన’ ఇప్పుడు ‘అన్నంభట్టేన విదుషా’ ఐంది. ఎనిమిది అక్షరాలూ సరిపోయినై. భార్య వైపు కృతజ్ఞతగా చూశాడు. - డాక్టర్ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి -
విశిష్టం నోముల సాహితీ వ్యక్తిత్వం
డాక్టర్ నోముల సత్యనారాయణ నల్లగొండ సాహి త్యానికి మాత్రమే కాదు... తెలంగాణ సాహిత్యానికి పెద్ద దిక్కు. ఆయన మరణంతో తెలంగాణ సాహి తీలోకం ఒక తరాన్ని కోల్పోయినట్టయిందని ప్రముఖ సినీ దర్శకుడు బి. నరసింగరావు అన్న మాటలు నూటికి నూరుపాళ్లూ వాస్తవం. పెద్దాయన సామల సదాశివ తరహాలోనే నోముల తెలుగు సాహి త్యానికే మార్గదర్శకుడు. అతి సామాన్య కుటుం బంలో జన్మించి ఎంతో ఇష్టంతో అధ్యాపక వృత్తిని స్వీకరించి సెకండరీ గ్రేడ్ టీచర్‌గా ఉద్యోగంలో చేరి అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగ విరమణ చేశారు. సన్నిహితులందరికీ ఆయన జయహో సార్‌గా ప్రసి ద్ధులు. అధ్యాపక వృత్తితోపాటు సాహిత్య అధ్య యనం నోములను విశిష్ట వ్యక్తిగా నిలిపింది. యువకు నిగా సాహిత్య అధ్యయనం ప్రారంభించి అభ్యుదయ భావాలవైపు ఆకర్షితుడై, ఆ అధ్యయనంలో నేర్చుకున్న విలువలనే జీవితంలోనూ ఆయన పాటించారు. ‘ఎంఏ అర్హత సంపాదించడం కాదు.. మనిషి ‘ఎంఏఎన్’ కావాలి, అప్పుడే చదివిన చదువుకు సార్థకత’ అని చెప్పేవాడు. తానూ అలాగే జీవించాడు. స్వయంకృషితో ఆయన బహు భాషలను నేర్చు కున్నాడు. నేర్చుకోవడమేకాదు.. వాటిపై పట్టు సాధిం చాడు. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ, హిందీ, సంస్కృత భాషల్లో సాహిత్య అధ్యయనం చేశారు. ఆయనకు సంగీతంలోనూ మంచి అవగాహన ఉంది. నోముల రాయడంకోసం కాకుండా, చదవడం కోసం పుట్టాడు. యువ రచయితలనూ, కవులనూ ప్రోత్సహించాడు. తొలినాళ్లలో పద్య కవిత్వం రాసినా అది ఆయనకు సంతృప్తి నివ్వలేదు. అప్పటికే సాహితీ శిఖరాలుగా ఉన్న శ్రీశ్రీ, రావిశాస్త్రి తదితరుల రచనలు చదివి ఉన్నాడు గనుక తన రచనలు తనకు తృప్తినివ్వలేదు. కాబట్టే రాయడంపై ఆసక్తి సన్నగిల్లింది. ప్రయోజ నకర రచనలను సాహితీ అభిమానులకు పరిచయం చేయడానికే ఇష్టపడ్డారు. సాహితీ విమర్శపై దృష్టి పెట్టారు. ప్రసిద్ధ భారతీయ రచనలను విమర్శనాత్మ కంగా పరిచయం చేశారు. వాటిని ‘సామ్యవాద వాస్త వికత’ పేరుతో పుస్తకంగా తీసుకొచ్చారు. ఆయన చేసిన అనువాదాలెన్నో. ప్రసిద్ధ చైనా రచయిత టావ్ చెంగ్ రచనను ‘నా కుటుంబం’ పేరుతో తెలుగులోకి అనువదించారు. అది ఆయనకు తెలుగు పాఠకుల్లో గొప్ప గుర్తింపు తెచ్చింది. నోముల సాహితీ కృషిలో గుర్తించదగింది ‘మరో కొత్త వంతెన’. ఉర్దూ, తెలుగు ద్విభాషా కవిత్వ సంకల నంగా వెలువడిన ఆ గ్రంథంలో చాలా పద్యాలు ఆయన ఉర్దూనుంచి తెలుగులోకి అనువదించినవే. ఉర్దూ నుంచి తెలుగులోకి, తెలుగునుంచి ఉర్దూలోకి అనువదించడంలో డాక్టర్ నోముల సామర్థ్యం ఎంత టిదో ఆ గ్రంథమే చెబుతుంది. సాహిత్య సభలు, సాహితీ బంధువులే లోకంగా నోముల గడిపిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన ఇల్లు సాహితీ కేంద్రంగా భాసిల్లింది. రావిశాస్త్రి, శ్రీశ్రీ, అద్దేపల్లి రామ్మోహన్ రావు వంటి అనేకమంది ప్రముఖులతో ఆయన సాహితీ సమావేశాలు నిర్వహించేవాడు. కొత్త తరానికి మూల నిర్దేశం చేసిండు. డాక్టర్ నోముల మీది అభిమానంతో ఆయన శిష్యులు కొంపెల్ల వెంకట్, కృష్ణమోహన్ శర్మ ’డాక్టర్ నోముల అన్‌హోల్డ్ లెసన్స్’ ప్రకటించారు. నోములతో మాట్లాడుతూ రికార్డు చేసిన పుస్తకం అది. నోముల మౌఖిక రచన. ఇది తెలుగు సాహిత్యంలో విశిష్టమైన పుస్తకంగా గుర్తింపు పొందింది. మరో సాహితీ మిత్రుడు డాక్టర్ పెన్నా శివరామకృష్ణ కూడా ‘నోముల సాహితీ ముచ్చట్లు’ను రికార్డు చేసిండు. కానీ, అది వెలువడటంలో ఆలస్యం జరిగింది. నోముల సాహిత్య వాసనలు ఆయన కుటుంబ సభ్యులకూ అబ్బినాయి. నోముల మీద గౌరవంతో ఆయన కుటుంబ సభ్యులు ‘నోముల సాహిత్య సమితి’ని స్థాపించారు. ఈ సంస్థ ద్వారా తెలుగు కథల పోటీలను నిర్వహించి ప్రతి సంవత్సరం ‘నోముల కథా పురస్కారాలు’ అందించినారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి బహుమతి పొందిన కథలతో ‘నోముల పురస్కార కథలు’ వెలువరించినారు. ఈ సంస్థ ద్వారానే తెలంగాణ సాహిత్యం గర్విం చదగిన పుస్తకాలను వెలువరించినారు. నల్లగొండ కథలు, చాకలి ఐలమ్మ, తెలంగాణ రాష్ట్రం చరిత్ర ఉద్యమాలు వంటి పుస్తకాలు వెలువరించినారు. సాహిత్యమే ఊపిరిగా బతికిన డా‘‘ నోముల సత్యనారాయణ తన 78వ ఏట లోకాన్ని వీడినారు. రాగద్వేషాలు, అసూయ వంటి పదాలు తెలియని నోముల ప్రేమను మాత్రమే అందించి శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. ఒక నడిచే గ్రంథాలయం ఆగి పోయింది. ఒక శిఖరం ఒరిగి పోయింది. ఆయన లేని లోటు తీర్చలేనిది. ఇది ఆక్షర సత్యం. వ్యాసకర్త: ఎలికట్టె శంకరరావు, 85230 56256 -
నవొయా షిగ (గ్రేట్ రైటర్)
జపాన్ కథకుడు, నవలా రచయిత నవొయా షిగ (1883– 1971). ఆయన తాత సమురై. తండ్రి బ్యాంకర్. తాత దగ్గరే ఎక్కువ పెరిగాడు. పదమూడేళ్లప్పుడు తల్లిని కోల్పోయాడు. తండ్రి వెంటనే పునర్వివాహం చేసుకున్నాడు. అప్పటినుంచీ తండ్రీకొడుకుల మధ్య సంబంధం క్షీణిస్తూ వచ్చింది. షిగ ప్రేమ వ్యవహారం తండ్రికి బాధ్యతారాహిత్యంగా కనబడింది. చదువు కూడా గొప్పగా సాగలేదు, దానికితోడు రచయిత అవుతానని కూర్చున్నాడు. ఇదంతా తండ్రికి చిర్రెత్తుకొచ్చింది. ఒక దశలో తండ్రి వారసత్వాన్ని రద్దు చేసుకుంటున్నట్టుగా ప్రకటించాడు. ఇద్దరూ కలవడమూ, విడిపోవడమూ ఆయన రచనల్లో ప్రతిఫలించింది. తన అనుభవాలు, జ్ఞాపకాలు, అపరాధాంగీకారాలు, వీటన్నింటి కలబోతగా షిగ తనకే ప్రత్యేకమైన ‘ఐ–నావెల్’ (నేను–నవల) సాహిత్య ప్రక్రియకు పురుడు పోశాడు. ఆత్మకథాత్మకంగా సాగని, రచయిత తనను తాను వ్యక్తం చేసుకోని రచనల మీద షిగకు ఆసక్తి లేదు. రచన వాస్తవికంగా సాగాలి; అలాగని వివేచనలేని వాస్తవాలు ఏకరువుపెట్టుకుంటూ పోకూడదు. ఈ ధోరణిలోనే జీవితపు మౌలిక స్వభావాన్ని పట్టుకునే ప్రయత్నం చేశాడు. అన్నింటికీమించి అప్రయత్నంగా రాసే ఆయన శైలి వల్ల జపాన్‌లో ఆయన మీద ఒక ప్రత్యేకమైన ఆరాధన మొదలైంది. ఎంతోమంది రచయితలు ఆయన్ని అనుకరించేందుకు విఫలయత్నం చేశారు. చిత్రంగా, తన రచనలు అందరికీ చేరాలనీ, ఎన్నో భాషల్లోకి అనువాదం కావాలనీ షిగ కోరుకోలేదు. సినిమాలకు ఇవ్వడానికి కూడా ఆసక్తి చూపలేదు. అంతెందుకు, సాహిత్యాన్ని జీవితానికి తక్కువరకపు ప్రత్యామ్నాయంగానే చూశాడు. -
జ్వలించే అగ్నిశిఖ జ్వాలాముఖి
నిత్య చైతన్యం, నిప్పులు చిమ్మే ఉపన్యాసం, సంకుచితత్వానికి అతీతమైన సహజ గంభీరం, జీవితమంతా ఉద్వేగంతో మాట లకు మంటలు నేర్పిన వ్యక్తి జ్వాలాముఖి. ఆయన ప్రసంగిస్తుంటే ఊపిరి బిగబట్టాల్సిందే! ఆ మాటల జలపాతంలో దూకేయాల్సిందే! దిగంబర కవిగా, విప్లవ కవిగా, కథకుడిగా, నవలాకారుడిగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా ప్రసిద్ధుడైన ఆ అక్షరయోధుడు దశాబ్దం క్రితం శాశ్వత నిద్రలోకి జారేముందు ప్రజలకోసం ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో! మనుషులపైన అచంచల ప్రేమతో జీవించిన జ్వాలాముఖి ఈ లోకం నుంచి నిష్క్రమించి నేటికి దశాబ్ద కాలం పూర్తికావస్తోంది. సంప్రదాయ శ్రీవైష్ణవ కుటుంబం 18 ఏప్రిల్ 1938లో జన్మించిన వీరవెల్లి రాఘవాచారి సాహిత్య జీవితం ‘మనిషి’ కావ్యం 1958తో ప్రారంభమైంది. స్వీయాత్మక సంస్కరణ వాదంతో గీసిన ఆ భావచిత్రంతో అనుభూతుల అంచులను తాకారు. దిగంబర కవిత్వంతో విశ్వమానవతావాద పతాకను ఎగురవేయడానికి జ్వాలాముఖిగా అవతరించి ‘సూర్యస్నానం’ చేశారు. ఆ ‘సూర్యస్నానం’లోనే ‘కిందపడ్డ నగ్నకళేబరాన్ని ఐరాసకు ‘ఎంబ్లమ్’గా చేయాలనుంద’న్నారు. సమాజంలోని కుళ్లును చూసి, మర్యాదలన్నిటినీ పటాపంచలు చేసి, ఆవేశంతో విరుచుకు పడ్డారు. ఆయనలోని వైరుధ్యాలు, సామాజిక వైరుధ్యాలతో ఢీకొన్నాయి. ‘ఓటమీ తిరుగుబాటు’ ద్వారా నక్సల్బరీని సాక్షాత్కరింపజేశారు. విప్లవకవిగా మారి, విరసం ఆవిర్భావ చోదకశక్తిగా పనిచేశారు. అధ్యాపకుడిగా పాఠాలు చెప్పినా, జీవిత పాఠాలు చెప్పడమే ప్రవృత్తిగా స్వీకరించారు. ఉపన్యాసం జ్వాలాముఖికి జీవలక్షణం. ఆయన పేరులోనే కాదు, ప్రసంగంలోనూ బద్దలవుతున్న అగ్నిపర్వతం కనిపిస్తుంది. ఆ సుదీర్ఘ ధిక్కారస్వరం ఆయన కవిత్వం లోనూ ప్రతిబింబిస్తుంది. సమూహంలో ఉపన్యసించినా, వ్యక్తులతో మాట్లాడినా ఆ వాక్ప్రవాహం తగ్గేదికాదు. కర్ఫ్యూ ఉన్నా ప్రజల్లోకి చొచ్చుకుపోయేవారు. హైదరాబాద్‌లో ఎక్కడ ఘర్షణ జరిగినా అక్కడ వాలేవారు. శాంతియాత్రలు చేశారు. శ్రీశ్రీతో కలిసి పౌరహక్కుల కోసం రాష్ట్రమంతా తిరిగినప్పుడు ‘సెడిషన్ చార్జ్’ పెట్టి జైలులో నిర్బంధించారు. విరసంతో విభేదించి, మిత్రులతో జనసాహితి స్థాపించినా, అందులోనూ చీలికలే. జ్వాలాముఖి ఒక వ్యక్తిగా కాకుండా ఎప్పుడూ తన వాగ్ధాటితో ఒక శక్తిగానే కనిపించేవారు. తన భావజాలంతో విభేదించేవారితో కూడా ఆత్మీయంగా వ్యవహరించేవారు. మనుషులపట్ల ఎల్లప్పుడూ ప్రేమ, ఆత్మీయత ఆయనలో కనిపించేవి. మనుషులతో ఎంతో హుందాగా ప్రవర్తించే ఆయన సాహిత్యానికి, సమాజానికి ఎంతో సేవ చేశారు. జ్వాలాముఖి రాసిన ‘వేలాడిన మందారం’ ఉరిశిక్షపై వచ్చిన తొలి నవల. అదొక దిగులు దొంతర. శరత్‌చంద్రుడి జీవిత చరిత్రను కేంద్ర సాహిత్య అకాడమీ కోసం ‘దేశదిమ్మరి ప్రవక్త’ పేరుతో అనువదించారు. ‘రాంఘేయ రాఘవ’ జీవిత చరిత్రను కూడా అనువదించారు. ‘హత్యలు, ఆత్మహత్యలు వర్గసమాజం దినచర్యలు’ అంటూ నిరసించారు. వర్గాలు లేని మానవ స్వర్గాలను స్వప్నించారు. ‘కోటి స్వరాలు పోరాడందే ఉన్నత సమాజం ఆవిష్కరించదు. లక్ష నక్షత్రాలు రాలందే ఉజ్వల ఉదయం ప్రభవించద’ని స్పష్టం చేశారు. రెండు సార్లు చైనాలో పర్యటించారు. భారత్, చైనా మిత్రమండలి జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉభయ దేశాల మైత్రికి ఎంతో శ్రమించారు. జ్వాలాముఖి రచనలలో ‘భస్మ సింహాసనం’ అత్యుత్తమ కావ్యం. గోద్రా అనంతర అల్లర్ల సందర్భంగా గుజరాత్లో రెండుసార్లు పర్యటించి, అక్కడి బాధితులను ఓదార్చి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. అక్కడి దారుణ సంఘటనలను స్వయంగా విని, కొన్ని దృశ్యాలను కళ్ళారా చూసి చలించిపోయి, ఈ సుదీర్ఘ కవితను ఎంతో ఉద్వేగంగా(2002) రాశారు. ‘నమస్తే సదా హత్యలే మాతృభూమి నిస్సిగ్గు దగ్ధభూమి’/‘తెగిపడిన ఆర్తనాదాలు దయలేని వందేమాతరాలు’ అంటూ ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేశారు. గోద్రా అల్లర్లపై ఎవరూ ఇంత నిక్కచ్చిగా, ఉద్వేగంగా రాయలేదు. ‘పీడిత జన సుఖాయ ప్రజాస్వామ్యం శరణం గచ్ఛామి/ తాడిత జన హితాయ లౌకిక రాజ్యం శరణం గచ్ఛామి/ శోషిత జన శుభాయ సామ్యవాద శరణం గచ్ఛామి/బాధిత జన మోక్షాయ విప్లవ శరణం గచ్ఛామి’ అంటూ ప్రవచించిన విప్లవ స్వాప్నికుడు జ్వాలాముఖి. వ్యాసకర్త : ఆలూరు రాఘవశర్మ, సీనియర్ పాత్రికేయులు ఈ- మెయిల్: alururaghavasarma@gmail.com -
వడిచర్లకు అరుదైన గౌరవం
బొంరాస్‌పేట, బషీరాబాద్: ‘శ్రీపద’ కలం పేరుతో రచనలు చేస్తున్న ప్రముఖ వర్ధమాన తెలుగు కవి, కవిరత్న బిరుదు గ్రహీత వడిచర్ల సత్యం రూపొందించిన ‘మణిపూసలు’ కవితా ప్రక్రియ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. ఈయన రాసిన కవితా ప్రక్రియ ‘మణిపూసలు’ తెలుగు రాష్ట్రాల సాహిత్యంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ క్రమంలో అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డుతో పాటు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ తెలుగు సాహిత్య కళాపీఠం మంగళవారం కవి సత్యంను సన్మానించనుంది. సత్యం తనదైన ముద్రతో తెలుగుభాషకు వర్ధమాన సాహితీప్రియులను పరిచయం చేస్తున్నారు. గురజాడ అప్పారావు అందించిన ‘ముత్యాలసరాలు’ వంటి నూతన మాత్ర చంధస్సు నియమాలతో ‘మణిపూసలు’ అనే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. తాను సృష్టించిన మాత్ర నియమాలు, అంత్యప్రాయలతో కూడిన మణిపూసలపై సామాన్యులు సైతం ఆదరాభిమానాలు చూపుతున్నారు. దీంతో గత మూడు నెలల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 125 మంది మణిపూసలు ఆధారంగా సులభ వ్యాకరణంతో కవితలు, పద్యాలు రాయడంతో ఇది బహుళ ప్రాచుర్యంలోకి వచ్చిం ది. చిక్కడపల్లిలోని లలితకళా వేదిక, త్యాగరాయగాన సభలో జరిగే సత్యం సన్మాన కార్యక్రమానికి రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నర్సింహ్మరెడ్డి, పలువురు తెలుగు సాహిత్య రచయితలు హాజరవనున్నట్లు తెలుగు సాహిత్య పీఠం ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా వడిచర్ల సత్యంకు దక్కిన అరుదైన గౌరవానికి తాండూరు కాగ్నా కళా సమితి ప్రతినిధులు శివకుమార్, కార్యదర్శి మెట్లుకుంట రాములు, పలువురు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. -
లోకయాత్రికుడి విశేషయాత్ర
అటల్ బిహారీ వాజ్‌పేయి. ఆయన పేరుకి అర్థమే లోక యాత్రికుడని. ఐక్యరాజ్యసమితిలో యువ రాజకీయవేత్తగా అత్యద్భుత ప్రసంగం చేసి భారతీయ ప్రతిభను విశ్వవ్యాప్తం చేసినా, అణు పరోక్ష వలసవాదానికి (ఇండైరెక్ట్ నూక్లియర్ కలోనియలిజం) వ్యతిరేకంగా, అమెరికా నిఘా సంస్థలు కనిపెట్టలేని వ్యూహంతో భారతీయ అణు వైజ్ఞానిక రంగాన్ని సాహసోపేతమైన అణు బాంబు పరీక్ష ద్వారా ముందుకు తీసుకు వెళ్లినా.. భిన్నరంగాల్లో జీవన ఆసక్తులు, నైపుణ్యాలు కలి గిన ఈ దేశ రాజకీయవేత్తల తరానికి చెందిన చివరి దార్శనికుడుగా భావించదగిన వాడు. పదవులకు వన్నె తెచ్చిన మానవ శిఖరం ఆయన. తను ప్రధానిగా ఉన్న కాలంలో, అలవి గాని ముఖ్యమంత్రులకు ‘రాజధర్మం’ అంటే ఏమిటో తెలియచెప్పేందుకు సహనశీల ప్రయత్నం చేసినవాడు అటల్ బిహారీ వాజ్‌పేయి. ఆయన ఉన్నత సంస్కారం గల భారతీయ పౌరుడు. భారత మాత పుత్రుడు. వక్త, రచయిత, కవి, భారతీయ సంస్కృతీ జ్ఞాన సంపన్నుడు, ఇటువంటి విశిష్టమూర్తి ప్రస్తుత ఓట్ల, నోట్ల, సీట్ల, ఫీట్ల రాజకీయ రంగంలో కనిపిం చడు. హిందీ కవిగా కూడా ఉత్తర భారత సాహిత్య లోకానికి చిరపరిచితుడు. విలువల రాజకీయాల స్థాపనలో వజ్ర సమానుడు. ఆయన్ని మనం కోల్పోయిన ఈ క్షణాల్లో, విభేదాలకు అతీతంగా భారతీయ పౌరసమాజం, రాజకీయ నాయకులు, ఇతర వర్గాలు, ముక్తకంఠంతో ఈ నవభారత సేనానికి నివాళి ఆర్పిస్తున్న వేళ, కవిగా ఆయన పలికిన వివేక వాణి నుంచి కొన్ని మంచి ముత్యాలు. రెండు రోజులు దొరికాయి ప్రసాదంగా గాయాల ఈ వ్యాపారంలో ప్రతిక్షణం లెక్క చూసుకోనా లేదూ నిధి శేషాన్ని ఖర్చు పెట్టేయనా ఏ దారమ్మట వెళ్ళాలి నేను? పగిలిన కలల వెక్కిళ్లు వినేదెవరు లోలోపలి తెగని వెత కనురెప్పలపై నిలిచింది ఓటమి ఒప్పుకోను, వెనుతిరగను పోరులో కాల కపాలం మీది రాత చెరిపేస్తాను నవగీతం పాడుతాను, నవగీతం పాడుతాను ఎందుకు నేను క్షణ క్షణంగా బతకకూడదు కణ కణంలో అలరిన అందాల్ని తాగకూడదు రేపు రేపంటూ ఉంటే ఇవాళ అన్నీ చేజారుతాయి గతం, భవిత వీటి తలపోతలో ఓడి పోతావు నేడు అనే పందెం నన్ను నేను ఇతరుల అంచనాల్లో చూసుకోగలుగుతున్నాను నేను మౌనంగానూ లేను, పాడడమూ లేదు నిన్న ఉన్నది నేడు లేదు నేడున్నది రేపుండదు ఉండడం, ఉండక పోవడమనే దశ ఇలాగే సాగుతూ ఉంటుంది. నేనున్నాను, నేనుంటాను అనే భ్రమ మాత్రం ఉంటుంది నిత్యం మండుటెండలో కమ్మింది చీకటి సూర్యుడు నీడ చేతిలో ఓడాడు లోలోని స్నేహాలకు ఒత్తిడే దక్కింది ఆరిన దీపాలకు వెలుగిద్దాము రండి మళ్ళీ దివ్వెలు వెలిగిద్దాము మూలం – అటల్ బిహారీ వాజ్‌పేయి రచన – హిందీ నుంచి కవితాపంక్తుల అనువాదం రామతీర్థ, కవి, విమర్శకులు మొబైల్ : 98492 00385 -
చావు ఆయుష్షు ఎంత? రెండు క్షణాలే!
అటల్ బిహారీ వాజపేయి రాజకీయ వేత్తగా కంటే సాహితీ వేత్తగా, కవిగా ప్రాచుర్యం పొందారు. రాజకీయ ప్రత్యర్థులు కూడా ఆయనలోని కవిని గౌరవించేవారు.ఆయన ప్రసంగాలు కూడా కవితాత్మకంగా ఉండటం ఆయనలోని కవితాభినివేశానికి నిదర్శనం.’నువ్వు ఏదో ఒక రోజు మాజీ ప్రధానివి కావచ్చు.అయితే, మాజీ కవివి మాత్రం ఎప్పటికీ కాలేవు.అని వాజ్‌పేయి ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. ఆయనలోని సాహిత్య ప్రతిభను గౌరవిస్తూ అందరూ అటల్జీ అని పిలిచేవారు. తన కవితలు, వ్యాఖ్యల ద్వారా ఆయన ఎందరినో ఉత్తేజితుల్ని చేశారు. మరెందరిలోనో ధైర్య సాహసాలు నింపారు. బుధవారం నాటి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ వాజపేయి వ్యాఖ్యల గురించి ప్రస్తావించారంటే ఆయన దేశ రాజకీయాల్లో కవిగా ఎంత బలమైన ముద్ర వేశారో స్పష్టమవుతోంది.నిరాశావాదాన్ని పారదోలాలని చెబుతూ...’ మధ్యాహ్నాం పూట చీకటి ఆవరించింది, సూర్యుడు తన నీడచేత పరాజితుడయ్యాడు. నీ హృదయం నుంచి తైలం పిండి దీపాన్ని వెలిగించు మరో దీపం వెలిగించేందుకు కదిలిరా... అంటూ పిలుపు నిచ్చారు. మరో సందర్భంలో... ప్రభూ.. నన్నెప్పుడూ అత్యున్నత స్థాయికి చేరనివ్వకు అక్కడుండి ఇతరులను ఇబ్బంది పెట్టలేను అలాంటి పరిస్థితి నుంచి నన్నెప్పుడూ విముక్తుడిని చేయి..అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే వాజపేయి కవితలు జీవిత సత్యాలను వెల్లడిస్తాయి. చట్ట సభల్లో ప్రసంగిస్తున్నప్పుడు కూడా ఆశువుగా కవితలల్లి సభ్యులను రంజిపచేయడం వాజపేయికి వెన్నతో పెట్టిన విద్య. మరణాన్ని కూడా ఆయన కవితాత్మకంగా ఇలా చిత్రించారు. ’చావు ఆయుష్షు ఎంత? రెండు క్షణాలు కూడా ఉండదు జీవితమన్నది ప్రగతిశీలం..అది ఒకటి రెండు రోజుల్లో ముగిసిపోదు’ -
ఆధిపత్య భాషల వెన్నుపోటుకి బలైన తెలుగు
‘తెలుగువారికి సొంత భాష లేదు. తెలుగు నేలమీద చెలామణిలో వున్న సాహిత్యం తెలుగు కాదు. అది సంస్కృత పురాణేతిహాసాలకు అనువాదమే. లేదా వాటికి అనుకరణే. తెలుగు భాషలో మౌలికమైన రచయితలూ కవులూ లేరు. వెయ్యేళ్ళుగా కవులుగా గుర్తింపు గౌరవం పొందుతున్న కవులెవరూ కవులు కారు. మనకున్నది అనువాదకులూ అనుకర్తలు మాత్రమే. నిజానికి మనం రాసే భాషే తెలుగు కాదు. సంస్కృతం ప్రాకృతం ఉర్దూ ఇంగ్లీషు భాషల ప్రభావానికి లోనై అది సహజత్వాన్ని కోల్పోయింది. అందుకే మన భాషలో డెబ్బై శాతం పరాయి భాషా పదాలే కనిపిస్తాయి.పరాయి భాషా పదాల్ని వాడీ వాడీ చివరికి తెలుగు మాటల్ని మరిచిపోయాం అందువల్ల యెంతో భాషా సంపదని కోల్పోయాం, సొంత సంస్కృతికి దూరమయ్యాం’. అరవై యేళ్లకి పూర్వం యెంతో ఆవేదనతో యీ అభిప్రాయాలు వ్యక్తం చేసి తెలుగు భాష దుస్థితికి కారణాలు అన్వేషించిన భాషా శాస్త్రవేత్త బంగారయ్య. చావు బతుకుల్లో ఉన్న భాషల జాబితాలో చేరడానికి తెలుగు సిద్ధంగా ఉందని భాషా వేత్తలు ఇప్పుడు హెచ్చరిస్తున్నారు గానీ ఈ వినాశనానికి బీజాలు వేసినవాడు వాగనుశాసన బిరుదాంకితుడు నన్నయేనని కుండ బద్దలు కొట్టినవాడు బంగారయ్య. వాడుకలో వున్న తెలుగును కాదని భారతానువాదాన్ని డుమువులు చేర్చిన సంస్కృత పదాలతో నింపి పెట్టిన నన్నయ ఆదికవి కాదు తొలి వెన్నుపోటుగాడని ఆయన తీర్మానించాడు. గాసట బీసటగా వున్న తెలుగుని నన్నయ ఉద్ధరించాడు అని చెబుతారుగానీ నిజానికి సంస్కృతంతో కలగాపులగం చేసి భాషని భ్రష్టు పట్టించాడనీ వందల యేళ్ళు అదే కొనసాగిందనీ మనవి కాని ఇతివృత్తాల్నీ మనవి కాని ఛందో రీతుల్నీ స్వీకరించడం వల్ల పరాయి భాషకి దాస్యం చేయడం వల్ల తెలుగు జాతి ఉనికే ప్రశ్నార్థకమైందనీ భాషమీద అలవికాని ప్రేమతో తెలుగు నానుడి కూటమి స్థాపించి తెలుగా ఆంధ్రమా?, నుడి–నానుడి వంటి గ్రంథాల ద్వారా ప్రచారం చేసిన బంగారయ్య అసలు పేరు సత్యానందం. సొంత పేరులో సంస్కృతం ఉందని బంగారయ్యగా మారాడు. ‘కాలా’ సినిమాలో పా. రంజిత్ ప్రతిపాదించిన వర్ణ సిద్ధాంతాన్ని అప్పుడే (1965) ‘నలుపుచేసిన నేరమేమిటి?’ అన్న గ్రంథం ద్వారా ప్రచారం చేశాడు. చనిపోడానికి (1992) కొద్ది కాలం ముందు దళిత అస్తిత్వానికి సంబంధించి అనేక మౌలికమైన ఆలోచనల్ని (chduled castes stabbed, Schduled castes: search for Identity) గ్రంథ రూపంలో ప్రకటించాడు. ఇన్ని చేసీ అనామకంగా అజ్ఞాతంగా ఉండిపోయిన భాషా తాత్వికుడు బంగారయ్య. బంగారయ్య గొప్ప విద్యావేత్త. ప్రజా సమూహాల ఉచ్చారణని ప్రామాణికంగా తీసుకొని సంస్కృ త వర్ణాలు వదిలేస్తే తెలుగు అక్షరమాల సగానికి సగం తగ్గి అమ్మ నుడి నేర్చుకునే పసి పిల్లల మీద భారం తగ్గుతుందని భావించాడు. అందుకు అనుగుణంగా వ్యాకరణం, నుడిగంటులు (నిఘంటువులు) నిర్మించుకొనే పద్ధతులు బోధించాడు. పిల్లలకు వాచక పుస్తకాలు ఎలా ఉండాలో నిర్దేశించాడు. భిన్న ప్రాంతాల మాండలికాలని కలుపుకుంటూ పోయినప్పుడే భాష పెంపొందుతుందని గ్రహించాడు. అరువు తెచ్చుకోకుండా అవసరానుగుణంగా కొత్త పదబంధాలను సొంత భాషలోనే నిర్మించుకోవచ్చని స్వయంగా ఎన్నో పదాల్ని పుట్టించి నిరూపించాడు. వస్తు రూపాల్లో తెలుగుదనం చిప్పిల్లే మూల రచనల కోసం పరితపించాడు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఆజీవితం కృషి చేశాడు. కానీ ఆధిపత్య కులాల వర్గాల భాషా రాజకీయాల కారణంగా ఆయనకు రావలసిన గుర్తింపు రాలేదు. అయితే బంగారయ్య తెలుగు భాష పెంపుదల గురించి రచించిన గ్రంథాల్ని, చేసిన సూచనల్ని జయధీర్ తిరుమలరావు ‘నడుస్తున్న చరిత్ర’ పత్రికా ముఖంగా ప్రకటించడంతో భాషోద్యమకారుల్లో చలనం వచ్చింది. స.వెం. రమేశ్ వంటి రచయితలు అచ్చమైన తెలుగులో కథలు రాసి (కతల గంప) యితర భాషా పదాలు లేకుండా పాపులర్ రచనలకు పాఠకుల మన్నన పొందవచ్చని నిరూపించాడు. హోసూరు మొరసునాడు మొ‘‘ ప్రాంతాల యువ రచయితలు దాన్ని అందిపుచ్చుకున్నారు. కానీ బంగారయ్య నిరసించిన పరభాషా దాస్యం ఇప్పుడు చుక్కలనంటింది. పాలకులు ఒంట బట్టించుకున్న రాజకీయ ఆర్ధిక బానిసత్వం భాషకు సోకింది. ఒకప్పుడు సంస్కృతానికి తలవొగ్గాం, ఇప్పుడు ఇంగ్లిష్‌కి ఊడిగం చేస్తున్నాం. రెండు రాష్ట్రాల్లో ఏలికల చలవ వల్ల తెలుగు మీడియం స్కూళ్ళు మూతబడుతున్నాయి. తెలుగు మాధ్యమంలో బోధనకి కాలం చెల్లిందని చెప్పి ప్రాథమిక స్థాయి నుంచే తెలుగుని ఒక సబ్జెక్టుగా కుదించేసి భాషని ఉద్ధరిస్తున్నామని పాలకులు బుకాయిస్తున్నారు. తెలుగులో చదివితే పనికి రాకుండా పోతామని బెదిరిస్తున్నారు. ఉద్యోగాల పోటీలో నిలవాలంటే ఇంగ్లిష్ మీడియంలోనే చదవాలని ఊదరగొడుతున్నారు. తల్లిభాషను కాపాడుకోవాల్సిన ఇటువంటి తరుణంలో ‘వాగరి’ బంగారయ్య ప్రతిపాదించిన భాషా వాదాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అమ్మ నుడిని నానుడిని రక్షించుకోలేని జాతికి మనుగడ లేదు. ప్రతులకు: అన్ని పుస్తక దుకాణాల్లో లభ్యం (నేడు హైదరాబాదులో ఇందిరాపార్కు సమీపంలోని ఆర్ట్స్ అండ్ లెటర్స్ సమావేశ మందిరంలో బంగారయ్య రచించిన నుడి–నానుడి గ్రంథావిష్కరణ) ఎ.కె. ప్రభాకర్ ‘ మొబైల్ : 76800 55766 -
‘పెండెం’కు కన్నీటి వీడ్కోలు
రామన్నపేట(నకిరేకల్) : బాల కథారచయిత, కా ర్టూనిస్టు పెండెం జగదీశ్వర్ అంత్యక్రియలు బుధవారం అతని స్వగ్రామం రామన్నపేట మండలకేంద్రంలో జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సాహితీవేత్తలు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, బంధుమిత్రులు పెద్దసంఖ్యలో తరలివచ్చి జగదీశ్వర్‌కు కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. మునిపంపుల, కొమ్మాయిగూడెం, చిన్నకాపర్తి ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించా రు. అతని చిత్రపటానికి పూలమాలలు వేసి నివా ళులు అర్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి న జగదీశ్వర్ శిష్యులు గురువుగారితో తమకున్న సాన్నిహిత్యాన్ని చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. సాహితీవేత్తలు జగదీశ్వర్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని బోరున విలపించా రు. చెరుగని చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ, స్ఫూర్తిదాయకంగా ఉండే జగదీశ్వర్ ఆత్మహత్య చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. జగదీశ్వర్ కుమారుడు వికాష్తేజ తం డ్రికి తలకొరివిపెట్టాడు. రోదిస్తున్న కొడుకును ఆపడం ఎవరితరం కాలేదు. రాజకీయ, సాహితీవేత్తల నివాళులు జగదీశ్వర్ భౌతికకాయాన్ని పలువురు రాజకీయ నాయకులు సాహితీవేత్తలు, ఉపాధ్యాయ సంఘా ల నాయకులు సందర్శించారు. మృతదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. కు టుంబ సభ్యులను పరామర్శించారు. వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు. నివాళులర్పించిన వారిలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పాల్వాయి రజనీకుమారి, కాంగ్రెస్ నాయకుడు నలగాటి ప్రసన్నరాజ్, జనవిజ్ఞానవేదిక రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఆదినారాయణ, ఎన్. వెంకటరమణారెడ్డి, స్వాతం త్య్ర సమరయోధుల సంఘం జిల్లా అధ్యక్షుడు వేమవరం మనోహర్‌పంతులు, మధురకవి డాక్టర్ కూరెల్ల విఠలాచార్య, జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పోరెడ్డి రంగయ్య, నేషనల్ బుక్ హౌస్ సహసంపాదకుడు పత్తిపాక మోహన్, సాహితీ మి త్రమండలి అధ్యక్షుడు తండు క్రిష్ణకౌండిన్య, కార్యదర్శి బాసరాజు యాదగిరి, నకిరేకంటి మొగుల య్య, వెంకటేశ్వరాచారి, జెల్ల వెంకటేశం, వనం చం ద్రశేఖర్, రాజశేఖర్, రాములమ్మ, రాపోలు శివరంజని, నర్సింహ, ఏబూషి నర్సింహ, ఆనం ద్, నర్సింహ, రమేష్, సిలువేరు అనిల్‌కుమార్, కోట విజయవెంకన్న తదితరులు ఉన్నారు. -
మలిసంధ్యలో మాడే కడుపుతో..!
మంచిర్యాల సిటీ: ప్రముఖ కవి, దివంగత గూడ అంజయ్య మాతృమూర్తి పరిస్థితి దయనీయంగా మారింది. మలిసంధ్యలో ఉన్న ఆమె అర్ధాకలితో అలమటిస్తోంది. పదెకరాల భూమి ఉన్నా.. ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆమె భిక్షాటన చేయాల్సిన దుస్థితి దాపురించింది. ఇది గమనించిన మాలమహానాడు నాయకులు సోమవారం జాయింట్ కలెక్టర్ వై. సురేందర్‌రావు దృష్టికి తీసుకెళ్లడంతో ఈ విషయం వెలుగుచూసింది. పదెకరాల భూమికి సంబంధించిన వివరాలు ఇస్తే న్యాయం చేస్తానని జేసీ ఆమెకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన లస్మవ్వ విలేకరులతో మాట్లాడుతూ తన గోడును వెళ్లబోసుకున్నది. ‘నాకు పదెకరాల భూమి ఉండేది. దాంతోనే ఆరుగురు కొడుకులను, ఒక బిడ్డను పెంచి పెద్ద చేసిన. వాళ్లకు అన్నీ దగ్గరుండి చూసుకున్న. కొడుకులు చచ్చిపోయిండ్రు. ఒక్క బిడ్డ మాత్రమే ఉన్నది. కొడుకుల పిల్లలు ఉన్నరు. ఆరుగురిలో ఒకడు పదెకరాలను వాని పేరునే చేయించుకున్నడు. అంజయ్య రెండేళ్ల కిందటనే చచ్చిపాయే. అంజయ్య బతికి ఉన్నప్పుడే ఎవరు పట్టించుకోకపాయే. నేను కట్టుకున్న ఇంటిని కూడా వాళ్లే ఉంచుకున్నరు. అక్కడిక్కడ అడుక్కొని యాన్నో ఓ కాడ ఉంటున్న. ఎవలన్న పాపమని బుక్కెడు పెడితే తింటున్న. లేదంటే కడుపు మాడ్చుకొని ఉంటున్న. ఈ వయసులో ఎసంటోళ్లకు కూడా ఇసొంటి తిప్పలు రావద్దు. ఎవరైనా ఎన్ని రోజులు పెడుతరు బిడ్డ. ఎందుకు బతుకుతున్నా అని బాధపడుతున్న. దేవుడు జెప్పన తీసుకపోతే మంచిగుండు..’అంటూ లస్మవ్వ ఆవేదన వ్యక్తం చేసింది. -
అలెగ్జాండర్ పుష్కిన్
సంక్లిష్టమైన పుష్కిన్ కవిత్వాన్ని అనువదించడం చాలా కష్టమని చెబుతారు. అందువల్ల ఆయన అసలైన రచనా ప్రజ్ఞను రష్యనేతరులు అంచనా కట్టడం కష్టమైపోయింది. అయినప్పటికీ అందిన ఆ కొద్దిపాటి వెలుగే ఆయన్ని ప్రపంచ గొప్ప రచయితల్లో ఒకడిగా నిలబెట్టడానికి సరిపోయింది. కవి, నవలాకారుడు, నాటక రచయిత, కథకుడు అయిన అలెగ్జాండర్ పుష్కిన్(1799–1837) రష్యా కులీన వంశంలో జన్మించాడు. పదిహేనేళ్లకే మొదటి కవిత రాశాడు. పట్టభద్రుడయ్యే నాటికే రష్యా సాహిత్య ప్రపంచం ఆయన్ని అబ్బురంగా చూడటం మొదలుపెట్టింది. రష్యా ఆధునిక సాహిత్యానికి మార్గదర్శిగా నిలవబోయే పుష్కిన్ తన ‘ఓడ్ టు లిబెర్టీ’ కవిత చదివినందుకుగానూ మొదటి జార్ అలెగ్జాండర్ చేతిలో దేశ బహిష్కరణకు గురయ్యాడు. గ్రీసులో ఆటోమాన్ పాలనను అంతం చేయడానికి స్థాపించబడిన రహస్య సంఘంలో పనిచేశాడు. దేశ బహిష్కరణ ఎత్తివేశాక కూడా ఆయన తన రాజవ్యతిరేక స్వభావాన్ని వీడలేదు. జార్ గూఢచారులు నిరంతరం ఆయన మీద ఓ కన్నేసి ఉండేవాళ్లు. ‘ద బ్రాంజ్ హార్స్‌మన్’ కవిత, ‘ద స్టోన్ గెస్ట్’ నాటకం, ‘బోరిస్ గొదునోవ్’ నాటకం, ‘యుజీన్ అనేగిన్’ నవల ఆయన ప్రసిద్ధ రచనల్లో కొన్ని. ఆ కాలపు అందగత్తెల్లో ఒకరిగా పేరొందిన నటాలియా గొంచరోవాను పెళ్లాడాడు పుష్కిన్. నలుగురు పిల్లలు కలిగారు. ఆమె మీద కన్నేసిన తోడల్లుడితో ద్వంద్వయుద్ధానికి సవాల్ విసిరిన పుష్కిన్ ఆ కాల్పుల్లో తీవ్రంగా గాయపడి, రెండ్రోజుల తర్వాత తన 37వ యేట అర్ధంతరంగా కన్నుమూశాడు. -
వార్తా శీర్షికలలో చిరంజీవి సినారె
సి.నారాయణ రెడ్డి పాటలు తెలుగు హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి. విద్యాలయాల్లో సారస్వత శాఖలు మూతపడి విద్యార్థులలో భాషాధ్యయనం తగ్గి, కవిత్వం రాసే వాళ్లు తగ్గుతున్న ఒక దశలో భాషాభిమానులు తెలుగు సాహిత్యం క్షీణదశకు చేరిందని ఆవేదన చెందుతున్న సమయంలో ‘కవిత్వం ఎక్కడికి పోతుంది? నిత్యనూతనంగా వర్థిల్లుతూనే ఉంటుంది. ప్రతి రోజూ దినపత్రికల వార్తా శీర్షికల్లో..’ అని సినారె వ్యాఖ్యానించారు. సామాన్య పదబంధాలతో అనన్య సామాన్య భావ సృష్టి చేయడం సినారెకే చెల్లింది. అందువల్లనే పత్రికల వార్తలకు ఆయన పాటలలోని పదాలు చక్కగా అమరేవి. ఎందరో పాత్రికేయులు.. ఎన్నో పత్రికల డెస్కులలో అర్ధరాత్రి వార్తలు, వార్తా కథనాలు ముందు పెట్టుకుని శీర్షికల కోసం తపన పడుతుంటే ముందుగా సినారెనే వారి తలపులోకొచ్చేవారు. ఇలా ఎందరో ఎన్నెన్నో వార్తలను సినారె గీతమాలికలతో అలంకరించారు. నానాటికీ క్షీణిస్తున్న మానవ సంబంధాలపై ఆయన ఆవేదనగా రాసిన పాట పల్లవి ‘అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం’ (తాత మనవడు) ఎన్ని మానవీయ కథనాలకు పత్రికలలో వాడుకున్నారో చెప్పలేం. మూడేళ్ల పాప బొద్దుగా.. ముద్దుగా ఉంది. ఓ తిరుణాలలో తప్పిపోయింది.. ఆ వార్తకు ఓ పాత్రికేయుడు ఇచ్చిన శీర్షిక.. ‘ఎవరో.. ఏవూరో.. ఎవరు కన్నారో..!’ అని ఆత్మబంధువు సినిమా కోసం సినారె రాసిన గీతం. అంతే.. ఆ వార్త చూసిన పాప తల్లిదండ్రులు ఆ పత్రిక కార్యాలయానికి ఉరికారు. పాప ఫొటో చిన్నగా వేయడం వల్ల చూడలేదని, పాటను శీర్షికగా చూసి ఆవార్త చది వామని వారు చెప్పడం విశేషం. అసలు కవిత్వం ఎంతమాత్రమూ సరిపడని సందర్భానికి కూడా సినారె గీతంలోని పదబంధాన్ని తగిలించి కాదేదీ కవిత కనర్హం అనిపించిన సందర్భం ఉంది. పోలీసులు కేసులు పెట్టి సీజ్ చేసిన కొన్ని వందల వాహనాల వల్ల తుప్పు పట్టి నాశనమవుతుంటే, ఓ విలేకరి రాసిన వార్తకు ‘కదలలేవు.. మెదలలేవు.. పెదవి విప్పి పలుకలేవు..’ అని సినారె అమరశిల్పి జక్కన చిత్రంలో రాసిన పాటలోని చరణాలు శీర్షికగా పెడితే పై అధికారులు స్పందించి, వెంటనే ఆ వాహనాలు వేలం వేసి కొన్ని లక్షల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు జమ చేయడం జరిగింది. అలాగే, ఓ ప్రభుత్వ అధికారి ఉండేవారు. ఏ శాఖలో పనిచేస్తున్నా ఆయన మీద ఉద్యోగినులపట్ల అనుచిత ప్రవర్తన ఆరోపణలతో బదిలీ చేసేవారు. ఆయన్ని ఒకసారి ఉద్యానవన శాఖకు బదిలీ చేశారు. ఆ శాఖలో ఎక్కువ మంది మహిళలు పనిచేస్తున్నారట. దీనిపై అక్కడి సిబ్బంది ఆందోళన చెంది ఆయన మాకొద్దు.. వేరేవారిని వెయ్యండని పై అధికారులకు అర్జీ పెట్టుకున్నారట. దీన్ని పసిగట్టి ఇచ్చిన వార్తకు సినారె రాసిన పాట పల్లవి రామబాణంలా పనిచేసింది. ‘తోటలోకి రాకురా.. తుంటరి తుమ్మెదా..’ (బుద్ధిమంతుడు) ఆ పట్టణంలో వార్త వచ్చిన వారం రోజులదాకా పాఠకులు శీర్షికను తలుచుకుంటూనే ఉన్నారు. పై అధికారులు ఆ తుంటరి తుమ్మెదను తూనికలు, కొలతల శాఖకు పంపారు. సమాజంలో అధోగతిలో బతుకుతున్న వేశ్యల జీవితాలపై మానవుడు–దానవుడు సిని మాలో సినారె ఓ పాట రాశారు. ‘ఎవరో కాదు.. వీరెవరో కాదు.. మన రక్తం పంచుకున్న ఆడపడచులు.. మనం జారవిడుచుకున్న జాతి పరువులు..’ చాలా శక్తివంతమైన ఈ పదబంధాలను వేశ్యవాటికల మీద, వారి హృదయవిదారకమైన జీవితాల మీద రాసిన వార్తా వ్యాసాలకు శీర్షికలుగా, ప్రవేశికలుగా ఆరోజుల్లో చాలా పత్రికలు వాడుకున్నాయి. సరిలేరు నీకెవ్వరూ పాట యువతలో సై్థర్యం నింపేది. సినారె చెప్పినట్లు మీడియా వార్తలలో కవిత్వమే కాదు ఆయన కూడా నిత్యనూతనంగా వెలుగొందే చిరంజీవి. (డాక్టర్ సి.నారాయణరెడ్డి తొలి వర్ధంతి సందర్భంగా నేడు హైదరాబాద్‌లోని త్యాగరాజ గానసభలో అచంట కళాంజలి సభ) అచంట సుదర్శనరావు, అధ్యక్షులు, అచంట కళాంజలి ‘ 90005 43331 -
తలవంచని ధిక్కారస్వరం
మూడు వేల సంవత్సరాల అణచివేతను, అవమానాలను, హింసను భరిస్తూ వున్న జాతి.. మొత్తం ప్రపంచానికి మనుషులుగా బతికే పాఠాలు నేర్పాలి అని చెప్పిన మహాకవి కలేకూరి ప్రసాద్. బహుజనుల బతుకుల్లో వెలుగుల కోసమే బతికాడు. నిరంతరం బహుజనుల కోసమే రాశాడు. కవితైనా పాటైనా, వ్యాసమైనా, అనువాదమైనా, విమర్శయినా తన శైలిలో పాఠకుల బుర్రల్లో ఆలోచనల సెగలు పుట్టిస్తూ, కన్నీటి చుక్కల్లో నుంచి చురకత్తుల వీరులు రావాలనీ దళిత తల్లుల గుండెకోతలు, మంటలు మండే ఆవేదనలే రాశాడు కలేకూరి. పిడికెడు ఆత్మగౌరవం కోసం అంటూ దళిత మ్యానిఫెస్టో కవిత రాసీ దేశ దళితుల గాయాల చరిత్రను, ధిక్కార తిరుగుబాటు కవిత్వంలో రికార్డ్ చేశాడు కంచికచర్ల కోటేశు ఘటన, కీలవేణ్మణి, కారంచేడు, నీరుకొండ, చుండూరు దళితులపై దాడులను మొత్తంగా ఈ కవితలో రాశారు. కలేకూరి రాసిన ఒక పాట దేశం మొత్తం మార్మోగింది. ‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వా / విరిసీ విరియని ఓ చిరునవ్వా/కన్నుల ఆశల నీరై కారగ/కట్నపు జ్వాలలో సమిధై పోయావా...’ ఈ పాట తెలియని వారు ఉండరు.ఎక్కడ దళితులపై దాడి జరిగినా తక్షణం స్పందించి పాల్గొంటూ, కవితలు, పాటలు, వ్యాసాలు, ఉపన్యాసాలతో ఆ ఉద్యమపోరాటంలో పాల్గొనేవాడు. అదిగదిగో ఇప్పుడు ‘కలేకూరి ప్రసాద్’ వస్తున్నాడు, ప్రశ్నించడానికీ, ధిక్కరించడానికీ, ‘అదిగదిగో తూర్పున సూర్యుడులా మండుతూ వస్తున్నాడు’ కలేకూరి ‘వస్తున్నాడు’. (మే 17న కలేకూరి ప్రసాద్ 5వ వర్ధంతి సందర్భంగా, చిలకలూరిపేటలో స్మారక సాహిత్య సభ) తంగిరాల–సోని, కంచికచర్ల మొబైల్ : 96766 09234దల -
వే వే వేడుక చేద్దాం!
ఒక కవి అనవేమారెడ్డి కొలువుకు వెళ్లి, ఆయన్ని కీర్తిస్తూ ఈ పద్యం చదివాడట. అనవేమ మహీపాల స్వస్త్వస్తు తవ బాహవే అహవే రిపుదోర్దండ చంద్రమండల రాహవే (శత్రువులను అంతమొందించడంలో అనవేమ ప్రభువు చంద్రమండలంలోని రాహువు లాంటివాడని అర్థం.) రాజు సంతోషించి, కవికి మూడువేల వరహాల బహుమానం ప్రకటించాడు. అప్పుడు కవి, ‘ప్రభూ, మీకు నేను నాలుగు ‘వే’లిచ్చాను. మీరు నాకు మూడు వేలివ్వడం ధర్మమా?’ అన్నాడు. రాజు కవి చమత్కారానికి మళ్లీ సంతోషించి, ‘అయితే నాలుగు వేల వరహాలు పుచ్చుకోండి’ అన్నాడు. ‘నేను మీకిచ్చినంతే మీరు నాకు ఇస్తే మీ గొప్పేమిటి?’ అన్నాడు కవివర్యుడు. రాజు పెద్దగా నవ్వి, బహుమానాన్ని అయిదు వేల వరహాలకు పెంచాడు. దానికి కూడా ఆ కవిపుంగవుడు, ‘నేను ఆరువేల నియోగిని మహాప్రభూ’ అన్నాడట. కవి సమయస్ఫూర్తికి మెచ్చి, ఆరువేల వరహాలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు రాజు. కానీ కవీంద్రడు ఊరుకున్నాడా! ‘నా దగ్గర వున్నదే నాకు ఇస్తే మీ ఘనత ఏమిటి ప్రభూ’ అన్నాడు. కవి యుక్తి రాజుకు నచ్చి, ఏడు వేల వరహాలు చేశాడు బహుమానాన్ని. ఊహూ! ‘ఏడు అంకె శుభసూచకం కాదుగా’ అన్నాడు ఆ కవి. చివరకు అనవేమారెడ్డి అక్షరాలా ఎనిమిది వేల వరహాలతో ఆ కవికేసరిని సత్కరించాడట. (మీకు ఇలాంటి మరమరాలు తెలిస్తే మాకు రాయండి.) -
లక్ష్మీ మందరకు సరస్వతీ కటాక్షం
కొరాపుట్: కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ బ్లాక్ మఝిగుడ గ్రామానికి చెందిన లక్ష్మీ మందర్ అక్షరజ్ఞాన మెరుగని ఆదివాసీ మహిళ. అయితేనేమి ఆశు కవయిత్రిగా ఆమెకు ప్రత్యేకత సాధించింది. గంటల తరబడి అనర్గళంగా, ఆశువుగా పాడగలిగే సామర్థ్యం ఆమె కలిగి ఉంది. ఆశువుగా ప్రకృతి వర్ణనలో ఆమెకు ఆమెసాటి. ఆదివాసీ జనజీవన విధివిధానాలు, సంప్రదాయ పండగలను ఇతి వృత్తాలుగా చేసి పాటలుగా మలిచి అక్కడికక్కడే ఆశువుగా పాడుతూ శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తుంది. ఆదివాసీ జానపద గీతాలాపనకు ఆమె పెట్టింది పేరు. ఆదివాసులు ఆమెను కారణజన్మురాలుగా చూస్తారు. తన నిజ జీవితంలో ఎదురొచ్చిన సమస్యలను లెక్కచేయక, అలుపెరుగని రీతిలో పాటలు పాడడం ఆమె నైజం. ఆశువుగా పాడడం తనకు భగవంతుడిచ్చిన వరమని, కొండ కోనల్లో కర్రలు సేకరిస్తున్నప్పుడు, పశువులను కాస్తున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు, కడకు పరుల పొలాల్లో కూలి పని చేస్తున్నప్పుడు తన నోట పాటలు జాలువారుతాయని, తాను ఏమాత్రం మౌనంగా ఉన్నా తన తోటివారు పాడమని పురమాయించడం పరిపాటి అని తన పాటల ఒరవడిని వివరించింది. గృహయోగం లేదు తన భర్త పేదవాడై దారిద్య్రంలో ఉన్నప్పటికీ, కన్న పిల్లలు పెద్దవారై ఎవరంతట వారు బతుకుతున్నారని, ప్రస్తుతం భర్తతో పాటు ఏ పూటకాపూట కూలి చేస్తూ బతుకు బండి లాగిస్తున్నట్లు ఆమె చెప్పింది. ఉండేందుకు సరైన ఇల్లు లేక ఒక పూరి గుడిసెలో కాపురం చేస్తున్నట్లు చెప్పింది. గ్రామంలో అనేక మంది ఇందిరా ఆవాజ్ యోజన పథకంలో ఇళ్లను పొందారని, తనకు మాత్రం మంచి ఇంట్లో ఉండే యోగాన్ని భగవంతుడు కలిగించలేదని వాపోతోంది. ప్రభుత్వం తనకు అందిస్తున్న రూ.300 వృద్ధాప్య పింఛన్ తనకు ప్రస్తుతం ఆధారమని చెప్పింది. ఇటీవల ఈ నెల 7,8 తేదీలలో కొరాపుట్‌లో జరిగిన జాతీయ స్థాయి కళింగ సాహిత్య ఉత్సవంలో తన ప్రతిభను మెచ్చిన పెద్దపెద్దోళ్లందరు తనకు చేసిన సన్మానం తన జీవితానికి లభించిన పరమార్థమని చెప్పింది. సభికుల కోరికపై ఆమె తనకు జరిగిన సన్మానాన్ని ఆశువుగా పాడి నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపింది. -
కవయిత్రి దీపిక
యాక్టర్ కాకపోయి ఉంటే ఏమై ఉండేవారు? అని ప్రతి యాక్టర్‌కు ఏదో సందర్భంలో ఎదురుపడే ప్రశ్న. డాక్టర్, పైలెట్, ఇంజినీర్ అని ఏదో ఒకటి చెబుతుంటారు. కానీ దీపికా పదుకోన్ మాత్రం ఖచ్చితంగా కవయిత్రి అయ్యి ఉండేవారు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నాం అనుకుంటున్నారా? దీపికా పదుకోన్ ఏడో తరగతిలో రాసిన ‘ఐ యామ్ – ది చైల్డ్ విత్ లవ్ అండ్ కేర్’ అనే కవితను చదివితే ఎవరైనా అలానే అంటారు. ఎప్పుడో రాసుకున్న ఈ కవితను ఇప్పుడు దీపికా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. ‘‘లైఫ్ ఏదో ఒక రోజు ఎండ్ అవుతుంది అని మనందరికీ తెలుసు. అలా అని అది మనం అనుకున్న గోల్స్‌ను రీచ్ కావడాన్ని ఆపకూడదు. మనం కలలు కంటూనే ఉండాలి. మనం కష్టపడుతూనే ఉండాలి, మన బెస్ట్‌నే ఇస్తూనే ఉండాలి, అలాగే.. వెరీ బెస్ట్‌ని ఆశించాలి’’ అనే సారాంశంతో సాగే ఈ పోయమ్‌ను ఏడో తరగతిలోనే అంత మెచ్యూరిటీతో రాశారంటే.. ఒకవేళ యాక్టర్ కాకపోయి ఉంటే కవయిత్రిగా దీపికా రాణించేవారని ఊహించవచ్చు. -
సాహిత్య మరమరాలు
నడిమింటి సర్వమంగళేశ్వర శాస్త్రి– తెలుగు, సంస్కృతాల్లో పండితుడు. ఆయన రాసిన ‘శబ్దమంజరి’ సంస్కృతం నేర్చుకునే విద్యార్థులకు ప్రాథమిక గ్రంథం. ఆయన ఎవరినీ మన్నన చేయడని పేరు. ఆయనోసారి పూసపాటి ఆనంద గజపతి కొలువుకు వెళ్లారు. శాస్త్రి ఇంటిపేరును దృష్టిలో పెట్టుకుని, ‘గురువుగారూ, అటు ముందరి ఇల్లూ కాకుండా, ఇటు వెనక ఇల్లూ కాకుండా నడిమిల్లు ఏమిటండీ చిత్రంగా’ అన్నారు ఆనంద గజపతి వ్యంగ్యంగా. ‘మహారాజా, ఎంత నడిమిల్లు అయినా పూస పాటి చేయదా?’ అని అదే ఇంటిపేరుతో తిప్పికొట్టారు శాస్త్రి. ఇక, ఈయన సభలూ శాస్త్రాలూ అంటూ ఊళ్లు తిరుగుతూవుంటే ఆయన కొడుకే ఇంటినిర్వహణ భారాన్ని వహించేవాడు. అట్లాంటి కుమారుడు హఠాత్తుగా చనిపోయాడు. శవాన్ని మోయడానికి బంధువులు రావాలికదా! ఈయన తేలుకొండి స్వభావం వలన వాళ్లందరూ విరోధులై ఉన్నారు. అందుకే ఎవరూ ముందుకు రాలేదు. అంత బాధలోనూ– ‘మావాడు బతికివున్నప్పుడూ నిర్వాహకుడే; చనిపోయాకా నిర్వాహకుడే’ అన్నారట శ్లేషతో శాస్త్రి. ఇంకంతే, బంధువులు వచ్చి అనంతర కార్యక్రమాల్లో పాల్గొన్నారట. -
కవి మచ్చ ప్రభాకర్ ఆత్మహత్య
సిరిసిల్ల: అభ్యుదయ కవి, తెలంగాణ రచయితల వేదిక జాతీయ కార్యదర్శి మచ్చ ప్రభాకర్(63) ముంబైలో మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోత్గల్కి చెందిన మచ్చ ప్రభాకర్ 1977లో ముంబై వెళ్లి అక్కడే ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా 33 ఏళ్లు పని చేసి ఇటీవల రిటైర్ అయ్యారు. ప్రభాకర్ భార్య పుష్ప(57) 20 రోజుల కిందట జనవరి 2న గుండె పోటుతో మరణించారు. భార్య మరణాన్ని జీర్ణించుకోలేక ప్రభాకర్ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. ప్రభాకర్‌కు కుమారుడు, కూతురు ఉన్నారు. ప్రభాకర్ మృతదేహాన్ని సిరిసిల్లకు బుధవారం తీసుకువస్తున్నట్లు సోదరుడు ఆనంద్ తెలిపారు. -
కొస మెరుపు
నా కోసం ఎవరి కన్నీళ్ళూ వద్దు... మీరెవరు, నా కోసం ఏడవడానికి? మళ్ళీ చెబుతున్నాను వినండి, ఉన్మాది నంటూ ముద్ర వేసి మీరు నన్ను ఒంటరిని చేసిందానికి నాకే కోపతాపాలూ లేవు. మృత్యువు నాహ్వానిస్తూ ముంగిట్లో నుంచున్న నన్ను సర్వ శృంఖలాలూ ఖణేళ్ మంటూ తెగి పడుతున్న ధ్వని ఆలాపనై వెంటాడుతోంది. సంగీతామృత మొకటి మధు సేవనమై జిహ్వ మీది ప్రతి బుడిపెనూ తడుముతోంది. సర్వత్రా విస్తరించిన నిశ్చలత్వం ఈ గ్రీష్మ నిసి వెన్నెట్లో వెల్లువై నాలోకి దూసుకొస్తోంది. ఊహా సహచరి కరచాలనం కోసం ఈ చరమాంకపు మలుపులో ఒక సలుపు నన్ను నలిపేస్తోంది. పునః ప్రారంభానికన్నట్టు యవనికను మూసిన పరదాల మడతలు ఊర్ధ్వగమనం చేస్తున్నాయి. నా ఆఖరి శ్వాసను వీక్షించే జన వాహిని కేరింతలతో నాకు వీడ్కోలు చెబుతోంది! ముసురుకున్న ఒంటరితనాన్ని ఆవలికి విసిరేసి ధీమాగా ముందుకు అడుగేస్తున్నాను! జయధ్వానాలు పలకరేం! (ఆల్బర్ట్ కామూ ‘ది అవుట్‌సైడర్’ చదివాక. కామూ అసంగత తాత్వికత (absurd philosophy) కు అసలు సిసలు చిరునామా. ప్రత్యామ్నాయాలు లేని, వెదకనవసరం లేని జీవిత గత్యంతర రాహిత్యం కామూ రచనల్లో ప్రతి చోటా ద్యోతకమౌతుంది. నవంబర్ 7 కామూ జయంతి.) తిరువాయపాటి రాజగోపాల్ 9573169057 -
ఎస్సెమ్మెస్
కొన్ని అక్షరాలు ఒక టెంప్లేటు ఓ సెండ్ బటన్ కాదు సందేశమంటే గుడ్డి గుడ్నయిట్లు ఎడ్డి గుడ్మార్నింగులు సోది స్టేటస్లు కాదు సందేశమంటే సందేశమంటే ఒక పొద్దుపొడుపు ఒక జననం కోసం మరణం సందేశమంటే సవరణలుండని రాజ్యాంగం జీవన వ్యాకరణం జన్మదిన అభినందనలో పుట్టుక అర్థం ఉండాలి పెళ్లి రోజు శుభాకాంక్షలో దేహాత్మల సంగీతం ఉండాలి రిప్ అంటే కన్నీళ్ల కుప్ప ఉండాలి అధికారం కోసం విపక్షం పెట్టుకునే అర్జీ కాదు సందేశమంటే అస్మాలాగా ఒక అరుపు అరువు దేశాలు పేకమేడల్లా కూల్తాయి మల్లెలవిప్లవాలు చెలరేగుతాయి సందేశాలు శాంతి ప్రపంచాల్ని నిర్మించాలి ఆధిపత్యాల కొమ్ములు విరగ్గొట్టాలి శ్వాసకు ఊపిరి బాటకు నడక దీపానికి కొత్తనూనె... సందేశం రాజ్యాన్ని కూల్చే నినాదం చెమట కోసం పాడే మల్లెల పాట సందేశం దాహానికి చెలిమె ఉక్కకు చలివణుకు సందేశం ప్రభువులు తమను తాము కాపాడుకునే కవచం కాదు సందేశం ఒక ఎస్సెమ్మెస్ కోసం కాలం కలలు కనాలి ఒక ఎస్సెమ్మెస్ మార్కెట్ మత్తుకు మందు కావాలి ఒక ఎస్సెమ్మెస్ దీనజనుల మెడలో దండ కావాలి గూగుల్ ఉసిళ్లపుట్ట మెసేజ్‌ల లింగనపురుగులూ కాదు కావల్సింది సందేశం భగవద్గీత కావాలి సందేశం బతుకు ఉద్యమం కావాలి బతుకు టెంప్లేటై చేయూతే అక్షరమైతే పంచే విశ్వాసమే సెండ్ బటనై ప్రసరించాలి ఒక సందేశం మనుషులందరినీ ఒకే గాటన కట్టేసే ప్రేమదారం కావాలి జూలూరు గౌరీ శంకర్ 9440169896 -
వర్షాకాలపు రాత్రి
ఇంకా పక్షులు కిచకిచమంటూ బహుళ మాండలికాల్లో నీడల వలల్ని ఏరుకుంటున్నాయి పొడవాటి చెట్ల నీడలు జాడలేని అడవి దారుల్లోకి నడుస్తున్నాయి నీడల నాగలి కలల్ని దున్నుతూనే ఉంది సూర్యుడి చుట్టూ యింతవరకూ తచ్చాడిన వింత వర్ణాలన్నీ యిపుడు ఎక్కడకి మాయమయ్యాయి? సాయంత్రపు రుతువు కొండపక్క దారుల్లోకి ఎపుడు మాయమయిందో? తల్లి జోకొడుతుంటే గాఢమయే పసిపిల్లాడి కంటి మీద నిద్రలాగ శబ్దాలన్నీ రాత్రి మౌనంలోకి కరుగుతున్నాయి ఇప్పటివరకు మబ్బుల మధ్యే తిరుగాడిన చంద్రలోలకం ఇపుడు గదిలోకి కూడా ప్రవేశించింది పచ్చి ఆకులు ఒళ్ళంతా పరుచుకున్నట్టు తేమగా, చలిగా తూర్పు సముద్రపు గాలి. అడవి అంచుల్లోంచి చిత్తం చిత్తడిలోకి బరువుగా ఇంకుతూ యీ వర్షాకాలపు రాత్రి... ఆకెళ్ళ రవి ప్రకాష్ -
నయనలో మరో కోణం
తమిళసినిమా: నటి నయనతార అనగానే తనో టాప్ కథానాయకి అన్న విషయం, ఆమె నటన, పారితోషికం, ప్రేమలో పడడం, పెళ్లి విషయంలో ఓడిపోవడం ఇలాంటి వాటి గురించే చాలా మందికి తెలుసు. ఎంతసేపు ఇలాంటి విషయాల గురించే మాట్లాడుకుంటారు. అయితే నాణేనికి బొమ్మా బొరుసులాగా ప్రతి మనిషిలోనూ పలు కోణాలుంటాయి. అలా నయనతారలో మరో కోణం చూస్తే చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. నయనతారలో మంచి చెఫ్ ఉన్నారు. షూటింగ్ లేని సమయాల్లో రకరకాల వంటకాలతో ప్రయోగం చేయడం ఆమె కాలక్షేపాల్లో ఒక అంశం అట. నయనతారలో మరో ముఖ్య అంశం తనలో మంచి కవయిత్రి ఉన్నారట. ఇప్పటికే చాలా కవితలు రాశారట. వాటిని చాలా జాగ్రత్తగా భద్రపరచుకున్నారట. విశేషం ఏమిటంటే తను రాసిన కవితలన్నిటిలోనూ ప్రేమ తొణికిసలాడుతుందట. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న వాళ్లు ఎలా ఉండాలన్న విషయాలు ఆ కవితల్లో చోటు చేసుకుంటాయట. తన రాసిన కవితలను తరచూ చదువుకుంటారట. ఆ కవితలను ³#స్తకంగా ముద్రించాలా లేక సినిమా పాటలుగా ఉపయోగించాలా అన్న విషయం గురించి ఆలోచిస్తున్నారట. నయన కవితలను పుస్తకం రూపంలోనో, పాటల రూపంలోనో త్వరలో చదవడమో, వినడమో చేయబోతున్నామన్న మాట. -
వృత్తి ఇంగ్లిష్ బోధన.. ప్రవృత్తి తెలుగులో రచన..
-‘ఆయ్..మేం గోదారోళ్లమండి’ కవి నూజిళ్ల -ఆ పాటకు సామాజిక మాధ్యమాల్లో అత్యంత ఆదరణ కంబాలచెరువు(రాజమహేంద్రవరం సిటీ) : ఈ మధ్య వాట్సాప్..ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో అత్యంత ఆదరణ పొందిన ‘ఆయ్..మేం గోదారోళ్లమండి..’ పాటను సృష్టించిన కవి రాజమహేంద్రవరానికి చెందిన కవి నూజిళ్ల శ్రీనివాస్. స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఇంగ్లిషు అధ్యాపకుడిగా పనిచేస్తున్న ఆయన ప్రవృత్తి తెలుగులో రచనలు చేయడం. ఇప్పటికి ఆయన 200కి పైగా గేయాలు, ఆరు కథలు, 30 వరకు వ్యాసాలు రాసారు. ఇవి అనేక పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ‘గోదారోళ్ల కితకితలు’ అనే ఫేస్బుక్ పేజీని నిర్వహించే బొమ్మూరుకు చెందిన ఈవీవీ సత్యనారాయణ ఆ గ్రూప్ కోసం సభ్యుడైన నూజిళ్లతో ఈ పాటను రాయించి, వీడియో తీయించాలనుకున్నారు. గ్రూప్ సభ్యురాలితో పాడించి, రికార్డు చేశారు. అయితే వీడియో తీయించే లోగానే ఆ పాట బయటకు వచ్చి వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో హల్చల్ చేయడంతో ఇది అనేకమందికి చేరిపోయింది. దీనిలో గోదావరి యాస, భావాలు ఉండడంతో అందరికీ నచ్చేసింది. తర్వాత నూజిళ్ల శ్రీనివాస్ ఈ పాటను తానే స్వయంగా పాడి పోస్ట్ చేశారు. దీంతో ఆయనను పలువురు అభినందించారు. సంతోషంగా ఉంది.. ‘ఆయ్..మేం గోదారోళ్లమండి’ పాట ఇంత ఆదరణకు నోచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మొన్న పదో తరగతి ఫలితాలు వచ్చినప్పుడు ‘పదికి పదే జీవితం కాదురా చిన్నా’ అంటూ రాసిన గీతం పదో తరగతి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడింది. ఉగాది గీతం కూడా చాలామందికి చేరువైంది. ఈ స్ఫూర్తితో మరిన్ని గీతాలు రాస్తాను. -నూజిళ్ల శ్రీనివాస్ -
స్టార్ స్టార్ సూపర్‌స్టార్ - ఆత్రేయ
-
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - శ్రీ శ్రీ.
-
గోదావరి గట్టున కవయిత్రి మొల్లకు ఆలయం
– ఆంధ్రప్రదేశ్ ఆస్థాన శిల్పి రాజకుమార్ వుడయార్ రాజమహేంద్రవరం కల్చరల్ : వచ్చే ఏడాది కవయిత్రి మొల్ల జయంతి నాటికి గోదావరి గట్టున ఆమెకు ఆలయాన్ని నిర్మిస్తానని ఆంధ్రప్రదేశ్ ఆస్థాన శిల్పి రాజకుమార్ వుడయార్ వెల్లడించారు. సోమవారం నగర శాలివాహన సంఘం ఆధ్వర్యంలో సరస్వతీఘాట్‌లో జరిగిన మొల్ల జయంతి ఉత్సవంలో శిల్పి వుడయార్ రూపుద్దిన విగ్రహాన్ని తాత్కాలికంగా ప్రత్యేక వేదికపై అమర్చారు. శిల్పి వుడయార్ మాట్లాడుతూ మొల్ల రచించిన రామాయణం పండితపామర రంజకంగా అందరినీ అలరిస్తుందన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఫణి నాగేశ్వరరావు మాట్లాడుతూ సహజకవి పోతనామాత్యునికి సాహిత్య వారసురాలిగా మొల్లను పేర్కొన్నారు. మొల్ల తన రామాయణంలో ‘చెప్పమని రామచంద్రుడు చెప్పించిన పల్కు మీర చెప్పెద నేనెల్లప్పుడు..’ అని పేర్కొన్నారని, ఇది పోతనామాత్యుడు ఆంధ్రభాగవత రచనలో చెప్పిన ‘పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట..’ అన్న పద్యంతో సరితూగుతుందన్నారు. ప్రతి తెలుగవాడు మొల్ల రామాయణాన్ని, మొల్ల జీవితచరిత్రను తప్పని సరిగా అధ్యయనం చేయాలని కోరారు. మార్గాని నాగేశ్వరరావు మాట్లాడుతూ సాహిత్యం కొందరి ఏకఛత్రాధిపత్యంలో వెలుగుతున్న రోజుల్లో– స్త్రీవిద్య వెలుగు చూడని సమయంలో మొల్ల తెలుగులో రామాయణం రచించడం విశేషమన్నారు. పేరూరి గంగాధరం మనుమరాలు పేరూరి అలేఖ్య మొల్ల వేషధారణలో కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా సభ్యులు మొల్ల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శ్రీజ్ఞానసరస్వతీపీఠం ట్రస్టీ తోట సుబ్బారావు, డాక్టర్ ఎల్లా అప్పారావు వుడయార్, రాయపూడి శ్రీనివాసరావు, జె.కాళేశ్వరరావు, మార్గాని నాగేశ్వరరావు, శాలివాహన సంఘం సభ్యులు పాల్గొన్నారు. -
పురాణ దృశ్య కావ్యాలు.. పద్య నాటకాలు
– ముగిసిన నంది నాటకోత్సవాలు కర్నూలు(కల్చరల్): నంది నాటకోత్సవాల్లో భాగంగా చివరి రోజు గురువారం స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో వివిధ నాటక సమాజాల కళాకారులు ప్రదర్శించిన పద్యనాటకాలు భారతీయ పురాణ గాథల దృశ్యకావ్యాలుగా నిలిచాయి. రాష్ట్రస్థాయి నంది నాటకోత్సవాలు ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాల్లో నిర్వహించగా.. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలకు సంబంధించిన నాటక సమాజాలకు కర్నూలు వేదికగా నిలిచింది. ఉదయం 10.30 నుండి సాయంత్రం 7.30 గంటల వరకు ప్రదర్శించిన పద్యనాటకాలు పౌరాణిక నాటక ప్రాభవాన్ని చాటిచెప్పాయి. కర్నూలు లలిత కళాసమితి కళాకారులు ప్రదర్శించిన ‘ప్రమీలార్జున పరిణయం’, కోడుమూరు వల్లెలాంబ నాటక కళాసమితి ప్రదర్శించిన ‘దేవుడు’, సావేరి కల్చరల్ అసోసియేషన్ హైదరబాద్వారు ప్రదర్శించిన ‘గంగాంబిక’ పద్య నాటకాలు ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ప్రమీలార్జున ప్రణయ వృత్తాంతానికి అద్దం పట్టిన ప్రమీలార్జున పరిణయం... కర్నూలు లలిత కళాసమితి కళాకారులు గురువారం ఉదయం 10.30 గంటలకు ప్రదర్శించిన ప్రమీలార్జున పరిణయం పద్యనాటకం మహాభారతంలోని ప్రమీలార్జున ప్రణయగాథకు అద్దం పట్టింది. కురుక్షేత్ర యుద్ధానంతరం పాప పరిహారం కోసం ధర్మరాజును అశ్వమేథ యాగం చేయాలని వ్యాసుడు ఆదేశిస్తాడు. ధర్మరాజు అర్జునుడికి అశ్వరక్షకుడిగా పంపిస్తాడు. భీముడు, అర్జునుడు యుద్ధాలలో తమ వీరత్వాన్ని ప్రదర్శిస్తున్నా పేరు, ప్రఖ్యాతులు మాత్రం శ్రీకృష్ణునికే చెందుతున్నాయని బాధపడతారు. ఇది గమనించిన కృష్ణుడు అశ్వమేథ యాగానికి తాను దూరంగా ఉంటానని భీమార్జునులతో చెబుతాడు. అర్జునుడు అశ్వరక్షణకు బయలుదేరి మహిళా సామ్రాజ్య అధినేత్రి ప్రమీల రాణిని చేరుకుంటాడు. స్త్రీ సామ్రాజ్యానికి మహారాణిగా చాటుకున్న ప్రమీల అర్జునుడిని యుద్ధంలో ఓడిస్తుంది. గర్వభంగమైన అర్జునుడు.. కృష్ణుడు తన వెంట లేకపోవడమే తన ఓటమికి కారణమని గుర్తిస్తాడు. ఘటోత్కచుని తనయుడు మేఘవర్ణుడు శ్రీకృష్ణుడిని అశ్వమేథ యాగంలో ప్రవేశపెడతాడు. కృష్ణుడు ప్రమీలకు గర్వభంగం చేసి అర్జునునితో పరిణయం చేయిస్తాడు. నాటకం మధ్యలో భీముడు, మేఘవర్ణుని యుద్ధ సన్నివేశం, కుతూహలం, కోలాహలం అనే పాత్రల మధ్య సాగే హాస్య సరస సంభాషణ ప్రేక్షకులను అలరించాయి. పల్లేటి కులశేఖర్ రచించిన ఈ నాటకానికి పత్తి ఓబులయ్య దర్శకత్వం వహించారు. దైవభక్తి విశిష్టతను చాటిన ‘దేవుడు’... కోడుమూరు వల్లెలాంబ నాటక కళాసమితి కళాకారులు ప్రదర్శించిన ‘దేవుడు’ పద్యనాటకం ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి విశిష్టతను చాటుకుంది. దైవభక్తి మెండుగా కల్గిన మహేంద్రుడనే యువకుడు సన్యాసిగా మారి దేశమంతటా పర్యటిస్తూ ధర్మప్రచారం చేస్తూ సాటి వారిపై ప్రేమానురాగాలు చూపిస్తూ మానవతా దృక్పథాన్ని చాటిచెప్పడమే ఈ నాటకంలోని ప్రధాన ఇతివృత్తం. మహేంద్రుడు ఒక వృద్ధుడిని కాపాడబోయి చేతిలోని శివలింగాన్ని జారవిడుస్తాడు. శివలింగం ముక్కలైపోగా విచారంగా ఇల్లు చేరుకుంటాడు. అతని తండ్రి విశ్వనాథుడు ఆ నింద నుండి విముక్తి పొందడానికి కాళీ మాతని దర్శించమని కోరుతాడు. గంగానది ఒడ్డున ఉన్న కాళీ మాత దర్శనం కోసం వెళ్తూ ఒక పడవ వాడిని, పవిత్ర అనే దేవదాసిని, దళితుడైన లక్ష్మన్నను కలసి మానవత్వం గురించి తెలుసుకుంటాడు. చివరకు బాధితులైన మానవులకు సేవ చేయడంలోనే దైవదర్శనం జరుగుతుందని మహేంద్రుడు గ్రహిస్తాడు. బి.పద్మనాభాచారి ఈ నాటకానికి రచన, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. మానవతా విలువలను చాటిన ‘గంగాంబిక’... సావేరి కల్చరల్ అసోసియేషన్ హైదరబాద్ కళాకారులు ప్రదర్శించిన గంగాంబిక పద్యనాటకం మానవతా విలువలను చాటిచెప్పింది. భూలోకంలో మానవతా విలువలు తగ్గుముఖం పట్టి రాక్షసత్వం పెరిగిపోతున్న నేపథ్యంలో నారదుడు మానవులలో ప్రేమానుబంధాల పట్ల విశ్వాసాన్ని, వర్ణవైశమ్యాలు లేని సమసమాజాన్ని ఏర్పరచమని దేవతలను కోరతాడు. త్రిమూర్తులలో ఒకరైన మహేశ్వరుడు సంగమేశ్వరుడై తన బాధ్యతను గంగా బసవేశ్వర రూపంలో నెరవేరుస్తాడు. గంగా బసవేశ్వరులను భూలోకానికి పంపి భార్యాభర్తల అనుబంధాన్ని, మనిషి మనిషికి మధ్య ఉండాల్సిన మానవీయ బంధాన్ని ఏర్పరచడమే శైవ మత ప్రధాన లక్ష్యమని తెలియజేస్తాడు. తడకమల్ల రామచంద్రరావు రచించిన ఈ నాటకానికి సావేరి భవాని దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. విజయవంతంగా ముగిసిన నంది నాటకోత్సవాలు కర్నూలు టీజీవి కళాక్షేత్రంలో జరిగిన నంది నాటకోత్సవాలు విజయవంతంగా ముగిశాయని, ఈ నాటకోత్సవాల నిర్వహణకు సహకరించిన కళాకారులు, ప్రేక్షకులు, టీజీవి కళాక్షేత్ర నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఎఫ్డీసీ మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక టీజీవి కళాక్షేత్రంలో నంది నాటకోత్సవాల ముగింపు సందర్భంగా గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నంది నాటకోత్సవాల విశేషాలను తెలియజేశారు. 16 రోజులుగా టీజీవి కళాక్షేత్రంలో జరిగిన నంది నాటకోత్సవాల్లో సాంఘిక, బాలల, పౌరాణిక పద్య నాటకాల విభాగాల్లో 61 నాటకాలు ప్రదర్శించారని.. 1300 మంది కళాకారులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారన్నారు. ఈ నాటకోత్సవాల్లో ప్రముఖ సినీ, టీవీ కళాకారులు కోట శంకర్రావు, సుబ్బరాయ శర్మ, మేక రామకృష్ణ, గోవాడ వెంకట్, జబర్దస్త్ మురళి, కృష్ణమోహన్, సురభి ప్రభావతి తదితరులు పాల్గొన్నారన్నారు. సాంఘిక నాటికల విభాగంలో 30 ప్రదర్శనలు, కళాశాల, విశ్వవిద్యాలయ విభాగంలో రెండు ప్రదర్శనలు, బాలల విభాగంలో 7 ప్రదర్శనలు, పద్యనాటక విభాగంలో 22 ప్రదర్శనలు టీజీవి కళాక్షేత్రంలో జరిగాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాల్లో జరిగిన నంది నాటకోత్సవాలలో విజేతలైన కళాకారులకు మార్చి మొదటి వారంలో బహుమతి ప్రదానోత్సవం ఉంటుందన్నారు. ప్రతి విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, 14 వ్యక్తిగత బహుమతులు అందజేస్తామన్నారు. నాటకోత్సవాలకు ఐదుగురు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారన్నారు. పద్య నాటకాలకు ప్రథమ బహుమతిగా రూ.80 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.60 వేలు, తృతీయ బహుమతిగా రూ.40 వేలు పారితోషికంగా అందుతుందన్నారు. సాంఘిక నాటకాలకు ఇదే వరుసలో రూ.70 వేలు, రూ.50 వేలు, రూ.30 వేలు.. నాటికలు, బాలల విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు పారితోషికంగా అందజేస్తామన్నారు. -
ప్రముఖ అష్టావధాని మాచిరాజు శివరామరాజు మృతి
కర్నూలు(కల్చరల్): ప్రముఖ అష్టావధాని మాచిరాజు శివరామరాజు(70) శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో మరణించారు. చాగలమర్రికి చెందిన ఆయన దాదాపు 112 అవధానాలు పూర్తిచేసి ఎంతోమంది శిష్యులను తీర్చిదిద్దారు. గురువారం కర్నూలు టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించిన అష్టావధానంలో ఆయన పాల్గొన్నారు. 24 గంటలు గడవక మునుపే ప్రాణాలు కోల్పోవడం సాహితీ లోకాన్ని కన్నీరు పెట్టిస్తోంది. ఆయన మృతి సాహిత్య రంగానికి తీరని లోటని అవధాని రామ్మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. మాచిరాజు కవితా మాధుర్యాన్ని తెలుగు పాఠకులు ఎన్నటికీ మరిచిపోలేరని మరో ప్రముఖ పద్యకవి బాలన్న అన్నారు. తెలుగు కళాస్రవంతి అధ్యక్షులు డాక్టర్ ఎంపీఎం.రెడ్డి, కార్యదర్శి ఎస్ఎస్ పటేల్, కార్యాధ్యక్షులు ఇనాయతుల్లా, కర్నూలు కవులు మారేడు రాముడు, శ్రీనివాసులు తదితరులు మాచిరాజు మృతి పట్ల సంతాపం ప్రకటించారు. -
దళిత కవిత్వ వీరబాహుడు
‘ఇక ఇప్పుడు చెప్పులు కుట్టిన చేతులు/ చట్టాన్ని కుడుతున్నాయి/ పేడెత్తిన చేతులు/ పాలనకి సమాయత్తమవుతున్నాయి/ ఈ దేశం మా ప్రణాళిక/ ఈ జనం మా వాహిక/ మనిషి మా గమ్యం/ నేల–ఎండ–గాలి–నీరు–నిప్పు మా నినాదాలు/ ప్రశ్న మా మేనిఫెస్టో/ ప్రతిఘటన మా ఆచరణ/ కులాలు లేని దేశం కోసం, వర్గాలు లేని రాజ్యం కోసం/ ధిక్కారం మా ఆయుధం’ ఆధునిక తెలుగు కవిత్వంలో మద్దూరి నగేష్‌బాబు ఒక కలకలం సృష్టించి వెళ్లాడు. కవిత్వం మీద అప్పటి దాకా ఉన్న వేర్వేరు అభిప్రాయాలను మట్టికాళ్లతో తొక్కుకుంటూ నడిచాడు. వెలివాడల దు:ఖాన్ని వాటేసుకుంటూ, ఫ్యూడల్ అహంకారం మీద తిరుగుబాటు చేస్తూ అతడు రాసే అక్షరాల్లోకి కొత్త మెలకువని వాగ్దానం చేస్తూ సాగిపోయాడు. కాస్త ప్రజాస్వామికంగా ఆలోచించేవాళ్ల కోసం ‘కాస్త సిగ్గుపడండి’ అంటూ సున్నితంగా చురకలేసి పోయాడు. సామాజిక అంతరాల మధ్య కుమిలిపోయే లోకం ఒకటి పూడాలనీ, వూరూ, వాడా కలిసి నడిచే అద్భుత సమాజం ఒకటి సాక్షాత్కరించబడాలనీ కోరుతూ ‘విడి ఆకాశం’ కోసం కలవరించాడు. నిస్తబ్దతలో కూరుకుపోయిన దళిత కవిత్వంలోకి అతగాడు వీరబాహుడై కొత్త కల్లుతో రంగప్రవేశం చేసాడు. మొహమాటం లేని కవిత్వంతో పదాల కోసం దేవులాడుకోకుండా దళిత జీవితం చుట్టూ దాగిన అనేక కోణాలను ఆవిష్కరించాడు. వెలివాడ (1995), నిశాని (1995– తెరేష్‌బాబు, ఖాజా, వరదయ్యలతో కలిసి), రచ్చబండ (1996), లోయ(1997), మీరేవుట్లూ(1998), నరలోక ప్రార్థన(2002), గోదావరి(2005) వెలువరించాడు. మద్దూరి మరణం తర్వాత గోదావరి లాంగ్ పొయెమ్ను మానవత ప్రచురణలు పేరుతో ఆత్మకురి చెన్నయ్య సహకారంతో ఖాజా వెలుగులోకి తెచ్చారు. దళిత ఉద్యమం ఏమి కోల్పోయిందో, దాని బలాలు, బలహీనతలు స్పష్టంగా తెలిసిన కవి మద్దూరి. అది ఏ రకమైన మార్పుని బాధ్యతగా స్వీకరించాలో, ఎవరిపై పోరాడి ఏం సాధించాలో అనే అంశాలపై సమగ్ర అవగాహన ఉన్న కవి. రాజకీయంగా, సాంస్కృతికంగా కవి ఎటువైపు ఉండాలనేదాని మీద ఆయనకు నిక్కచ్చితనం ఉంటుంది. ‘వెలివాడల తల్లుల్లారా! ఇక కత్తుల్నే కనండే’ అని దిశానిర్దేశం చేశాడు. (జనవరి 9న సాయంత్రం 5 గంటలకు గుంటూరు ఎ.సి.కాలేజీ ఆవరణలో మద్దూరి నగేష్‌బాబు వర్ధంతి సభ.) డాక్టర్ నూకతోటి రవికుమార్ 9848187416 -
కవి వెంకటసుబ్బారావు కన్నుమూత
చీరాల: ప్రముఖ కవి, విరసం పతాక గేయకవి, నాటక రచయిత విప్లవ సాహిత్యంలో కీర్తి గడించిన వెలుగు వెంకట సుబ్బారావు(80) అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన ఆయన తెలుగు అధ్యాపకుడిగా పనిచేశారు. తెలుగు భాషోద్యమ సమాఖ్యలో కీలకంగా వ్యవహరించడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు ప్రజలకు అనేక సందేశాలిచ్చారు. వెంకట సుబ్బారావు మరణం తెలుగుభాషోద్యమ సమాఖ్యకు, చీరాల ప్రజలకు తీరని లోటని సమాఖ్య చీరాల అధ్యక్షుడు జంపాల గంగాధరరావు పేర్కొన్నారు. సుబ్బారావు మృతదేహాన్నిసమాఖ్య ప్రతినిధులు అన్నంరాజు సుబ్బారావు, శ్రీనివాస్‌గౌడ్, సజ్జా వెంకటేశ్వర్లు తదితరులు సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలిపారు. -
అందెశ్రీకి కాళోజీ ఫౌండేషన్ పురస్కారం
కేయూ క్యాంపస్ : కాళోజీ ఫౌండేషన్ పురస్కారాన్ని 2016 సంవత్సరానికిగానూ ప్రముఖ కవి అందెశ్రీకి ప్రదానం చేయనున్నట్లు కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి తెలిపారు. శనివారం కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ‘కాళోజీ ఎండోమెంట్ లెక్చర్’ సెమినార్లో ప్రసంగిస్తూ ఆయన ఈవిషయాన్ని వెల్లడించారు.కాళోజీ వర్ధంతిని పురస్కరించుకొని నవంబర్ 13న అందెశ్రీకి పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. -
కవిత్వం సామాజిక బాధ్యత
కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శివారెడ్డి గుంటూరు(అరండల్‌పేట): మార్క్సిజం నాకు విశ్వ దర్శనం కావించిందని, అదే నా సాహిత్య మార్గదర్శి అని, కమ్యూనిస్టు ప్రణాళిక అధ్యయనం తర్వాత ఒక సామాజిక బాధ్యతగా కవిత్వాన్ని రాశానని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి కే శివారెడ్డి అన్నారు. గురువారం అరండల్‌పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో ‘నేను–నా కవిత్వం’ అన్న అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన శివారెడ్డి మాట్లాడుతూ ఎక్కడా తేలిపోకుండా, జారిపోకుండా, ఏ గాలికీ కొట్టుకుపోకుండా కవిత్వయాత్ర చేస్తున్నానని తెలిపారు. నా కవిత్వంలో విద్యార్థులు, అనాథలు, జానపదlగాయకులుఏ కళకళలాడేలా చేస్తున్నానన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ, ఐరోపా, ఆఫ్రికా కవుల అధ్యయనాలు తన కవిత్వాన్ని విస్తతం చేశాయని చెప్పారు. ఇప్పటికి 26 కవితా సంపుటిలు వెలువరించానని, వెయ్యి పుస్తకాలకు పీఠికలు సమకూర్చానని తెలిపారు. కార్యక్రమంలో రావెళ్ల సాంబశివరావు, భూసూరుపల్లి వెంకటేశ్వర్లు, బీ వేదయ్య తదితరులు పాల్గొన్నారు. -
కవిత్వానికి కన్నీరద్దిన కవి జాషువ
కవులు మూడు రకాలుగా ఉంటారు. మొదటి రకం వాళ్ళు తాము కవిత్వం రాసిన కాలానికి ప్రాతినిధ్యం వహించి, తర్వాతి కాలంలో తెరమరుగుకు వెళ్ళిపోతారు. భావ కవులు ఇలాంటి వాళ్ళు. రెండవ రకం వాళ్ళు తాము కవిత్వం రాసిన కాలంలో సూర్యతేజంతో వెలిగిపోతారు. తర్వాతి కాలంలో తమ అవ సరం లేకపోయినా, తమవర్గ వారసుల ద్వారా చర్చలో నలు గుతూ ఉంటారు. పౌరాణిక చారిత్రక కవులు ఇలాంటి వాళ్ళు. మూడవరకం వాళ్ళు తాము కవిత్వం రాసిన కాలంలో నిరాదర ణకు, వివక్షకు గురై తర్వాతి కాలంలో తిరుగులేని దీపధారు లుగా వెలుగొందుతారు. గురజాడ, గుర్రం జాషువ ఇలాంటి వారు. (‘‘గురజాడ 1915లో మరణించినా. ఆ తర్వాతనే జీవించడం ప్రారంభించారు’’ అన్న కృష్ణశాస్త్రి మాట జాషు వకు కూడా వర్తిస్తుంది.) గుర్రం జాషువ 19వ శతాబ్దం చివరలో పుట్టిన భారతీయ దళితకవి. సంఘ సంస్కర ణోద్యమం ఉచ్ఛదశలోను, భారత స్వాతంత్య్రోద్యమం పరిణామ దశలోను ఉండగా పుట్టి, నగ్జల్బరీ ఉద్యమం పురుడు పోసుకుంటున్న కాలం దాకా బతికిన కవి (28-9-1895 24-7-1971). భావకవిత్వం తొలిదశలో ఉన్నకాలంలో కలం బట్టి అభ్యుదయ సాహి త్యోద్యమ కాలమంతా గొప్ప రచనలు చేసిన కవి జాషువ. విప్లవ సాహిత్యం మొలకదశలో ఉండగా ఆయన మరణించాడు. 76 ఏళ్ళ జీవితంలో 50 ఏళ్ళకు పైగా సాహిత్య జీవితం గల జాషువ ఆధునిక తెలుగు కవులలో అనేకవిధాలుగా విశిష్టత గల కవి. సంఘ సంస్క రణ, భారత స్వాతంత్య్ర భావ, అభ్యుదయ కవిత్వాల సంగమం ఆయన. సగర మాంధాతాది షట్చక్రవర్తుల సంకీ ర్తన దశ నుంచి కొత్తలోక దర్శనం దాకా పరిణమించిన కవి జాషువ. దేవుడు లేడనే నాస్తికులను హెచ్చరించే దశ నుండి దేవుడినే హెచ్చరించే ధైర్యం చేసిన కవి. పద్య కవిత్వ యుగంలో పుట్టి, గేయం, పాట, వచన కవిత్వ యుగాలలో ప్రధాన రచనలు చేసినా, పద్య కవిగానే స్థిరపడిన కవి జాషువ. చాతుర్వర్ణ వ్యవస్థను వందలేళ్లుగా కీర్తించిన పద్యంతోనే ఆ వ్యవస్థను చీల్చి చెండాడాలన్న పట్టుదల కూడా కావచ్చు. శత్రువు ఆయుధంతోనే శత్రు వును జయించాలన్న లక్ష్యం కూడా కావచ్చు. ఆధునిక భావాలను అభివ్యక్త్తం చేయడానికి కూడా పద్యాన్ని ఉపయోగించవచ్చునని జాషువ నిరూపించాడు. భావకవులలో జాషువ ప్రత్యేకమైన కవి. ఆయన ఊహాలోక విహారి కాదు. వాస్తవ ప్రపంచ సంచారి. కావ్యఖండికలు, ఖండకావ్యాలు స్వీకరించి దైనందిన జీవిత సత్యాలనే చిత్రించాడు. వాటికి కండపుష్టి కలిగించాడాయన. తెలుగు కవిత్వంలో ‘జీవునివేదన’ స్థానంలో ‘జీవన వేదన’కు పీటవేసిన కవి జాషువ. పౌరాణిక, చారిత్రాత్మక, సాంఘిక వస్తువులలో దేనిని స్వీకరించి కవిత్వం రాసినా, అందులో తనదైన దళితానుభవం అంత స్సూత్రంగా ఉంటుంది. భారతదేశ చరిత్రను జాషువ ఎక్కడా అగౌరవపరచలేదు. సామా జిక వ్యవస్థ మీద ఆర్థిక, సాంఘిక, రాజకీయ దృష్టి కోణాలనుంచి విమర్శనాత్మక కవిత్వం రాశాడు. హిందూ, ముస్లిం, క్రైస్తవ వస్తువులన్నిటినీ కవిత్వీకరించాడు. గౌతమ బుద్ధుడు, ఏసుక్రీస్తు, గాంధీ వీరిని ఒక త్రయంగా జాషువ అనేక పర్యా యాలు కీర్తించాడు. అంబేడ్కర్‌ను గురించి జాషువ తక్కువగా పద్యాలు రాసినట్లు కని పిస్తున్నప్పటికీ. ఆయన కవిత్వమంతా అంబేడ్కర్ ప్రచారం చేసిన సౌభ్రాతృత్వ భావన పరచుకొని కనిపిస్తుంది. అంబేడ్కర్ బోధించిన ‘‘బోధించు, పోరాడు.’’ అనే గుణాలు ఆయన మరచిపోలేదు. మార్క్సిజాన్ని జాషువ జీవితావసానదశలో ఆమోదించినట్లు కని పిస్తుందిగాని, ఆయన మొదటి నుంచి శ్రమ దోపిడిని గర్హిస్తూ సమసమాజాన్నే కోరు కున్నాడు. ఈ రకంగా జాషువలో సమకాలీన సమాజంపై ప్రభావం చూపిన మూడు తాత్విక భావజాలాలు సంగమించాయనిపిస్తుంది. సాంఘిక వివక్ష, ఆర్థిక అసమానత, రాజకీయ అవినీతి, తాత్విక మౌఢ్యం ఈ నాల్గింటిపైన జీవిత కాలం యుద్ధం చేసిన విశిష్ట కవి జాషువ. ‘నాది కలికి తెలుగు కులము’ అని గర్వంగా చెప్పుకున్నాడు. స్వాతంత్రం వచ్చిన వెంటనే ‘‘అచ్చముగ భారతీ యుడనైతి నేడు’’ అని ప్రకటించాడు. ‘‘విశ్వనరుడ నేను’’ అని అనేక పర్యాయాలు చాటుకున్నాడు. గుర్రం జాషువ నిబద్ధత గల కవి. ఆయన నిబద్ధత బహుముఖీనమైనది. క్రైస్తవుడని హిందువుల చేత, హిందూకావ్యాలు రాస్తున్నాడని క్రైస్తవుల చేత నిరాదరణకు గురైనజాషువ ముస్లిం సమాధులలో కూర్చొని చదువుకున్నాడని ఆయన జీవిత చరిత్ర కారులు చెబుతారు. ఆయన ఎంతైనా పద్యకవే గదా అని ఆధునికులు, ఆయన సాంఘిక విమర్శను చూసి సంప్రదాయవాదులు జాషువను నిరాదరించినా తనంతట తానుగా విశిష్ట కవిగా ఎదిగాడు. ఆయన కవిత్వం తాను జీవించి రచించిన కాలం నాటికన్నా ఇవాళ ఎక్కువగా ప్రజలకు సన్నిహితమైంది. అదే ఆయన విశిష్టత. అదే ఆయన విజయం. (నేడు గుర్రం జాషువ 45వ వర్ధంతి సందర్భంగా) వ్యాసకర్త ప్రముఖ సాహితీ విమర్శకులు మొబైల్ : 9440222117 - రాచపాళెం చంద్రశేఖరరెడ్డి -
ఆ డ్రాపవుట్ రచనలతో ఐదు పీహెచ్ డీలు
న్యూ ఢిల్లీః అతడు కేవలం పాఠశాల చదువుకూడ పూర్తి చేయలేదు. అయితేనేం రచయితగా అత్యంత ప్రతిభను ప్రదర్శించి రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు. ఒడిషాకు చెందిన ఆయన రచనలు ఐదుగురు పరిశోధనా విద్యార్థులకు ఆధారంగా మారాయి. కోస్లీ భాషా పండితుడు, కవి, 66 ఏళ్ళ హల్దార్ నాగ్ ఎన్నో పురాణాలకు గుర్తుగా పద్యాలు రాసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన రచనలు ప్రస్తుతం సంబల్పూర్ విశ్వవిద్యాలయ సిలబస్ లో భాగమయ్యాయి. హల్దార్ గ్రంథబాలి-2 పేరున విశ్వవిద్యాలయం వాటిని సంగ్రహించింది. హల్దార్ తన రచనలను ప్రేక్షకుల ముందు ప్రదర్శిస్తుంటాడు. తాను వల్లించిన పద్యాలను వల్లెవేస్తుంటాడు. కనీసం రోజుకు మూడు నాలుగు ప్రత్యేక కార్యక్రమాలకు హాజరౌతుంటాడు అంటూ అతడి సన్నిహితుడు, కవి నాగ్ చెప్తున్నారు. హల్దార్ రచించిన కోస్టీ భాషలోని పద్యాలు యువకులను అమితంగా ఆకట్టుకుంటాయని, ప్రతివారు కవులు అయినప్పటికీ.. కొందరు మాత్రమే వాటికి ఓ ప్రత్యేక రూపును ఇవ్వగల్గుతారని అదే వారిలోని కళను ప్రస్ఫుటింప జేస్తుందని హల్దార్ సన్నిహితుడు నాగ్ చెప్తున్నారు. కనీసం కాళ్ళకు చెప్పులు కూడ ధరించని హల్దార్... ఎప్పుడూ తెల్లని పంచె, చొక్కా వేసుకుంటాడని, పైగా అలా వేసుకోవడం తనకిష్టమని చెప్తాడు. ఒరిస్సాలోని బర్ఘర్ జిల్లాలోని ఓ పేద కుటుంబంలో 1950 లో పుట్టిన హర్దార్... కేవలం మూడో క్లాసు వరకే పాఠశాలలో చదువుకున్నాడు. ఆ తర్వాత ఎప్పుడూ అతడు బడికి హాజరు కాలేదు. పదేళ్ళ వయసులో తండ్రిని కోల్పోవడంతో కుటుంభ భారాన్ని నెత్తికెత్తుకున్న అతడు... తప్పని పరిస్థితిలో ఓ మిఠాయి దుకాణంలో పనికి (డిష్ వాషర్) చేరాడు. రెండేళ్ళ తర్వాత ఓ గ్రామపెద్ద అక్కడో హైస్కూలు స్థాపించాడు. అదే గ్రామంలో హల్దార్ పదహారేళ్ళపాటు వంటవాడిగా పనిచేశాడు. ఆ తర్వాత అక్కడ అనేక పాఠశాలలు వెలిశాయి. దీంతో హల్దార్ ఓ బ్యాంకును సంప్రదించి వెయ్యి రూపాయల లోన్ తీసుకొని ఓ చిన్న స్టేషనరీ షాప్ తో పాటు పాఠశాల విద్యార్థులకోసం తినుబండారాల అమ్మకం ప్రారంభించాడు. ఇదే సమయంలో హల్దార్ 'దోడో బర్గాచ్' (పురాతన మర్రిచెట్టు) అంటూ తన మొదటి పద్యాన్ని రాశాడు. 1990 ప్రాంతంలో అతడు రాసిన ఆ పద్యం స్థానిక పత్రికలో ప్రచురించారు. ఆ తర్వాత వరుసగా నాలుగు పద్యాలు రాసి పంపితే అవి కూడ అచ్చయ్యాయి. అనంతరం అతడి పద్యాలకు సమీప గ్రామాల్లోనూ భారీ స్పందన వచ్చింది. అక్కడే అతడి ప్రస్థానం మొదలైంది. ఆ ప్రోత్సాహం నేడు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకునే స్థాయికి చేర్చింది. హల్దార్ నాగ్ ను ఒడిస్పాలో లోక్ కబీ రత్నగా పిలుస్తారు. ఎక్కువగా ప్రకృతి, సమాజం, పురాణాలు, మతం వంటివే అతడి పద్యాలకు ప్రధానాంశాలు. అయితే ఎన్నోసార్లు అతడి రచనలకు సమాజం నుంచి వ్యతిరేకత కూడ ఎదురైంది. నా దృష్టిలో కవిత్వం వాస్తవ జీవితానికి అద్దం పడుతుందని, ప్రజలకు సందేశాన్ని అందించేదిగా ఉండాలని హల్దార్ నాగ్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. -
నయనతారకు మద్దతుగా మరో కవి
న్యూఢిల్లీ : మత విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా అరుదైన పురస్కారాన్ని వెనక్కిచ్చిన రచయిత్రికి ఇపుడో మరో ప్రముఖ కవి జతకలిశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉదాసీన వైఖరికి నిరసనగా సాహిత్య అవార్డును వెనక్కి ఇచ్చి, వార్తల్లో నిలిచిన ప్రముఖ రచయిత్రి, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మేనకోడలు నయనతార సెహగల్ కు ఇపుడు మరో అవార్డు గ్రహీత, ప్రముఖ కవి అశోక్ వాజ్‌పేయి తన మద్దతును తెలియజేశారు. మోదీ మౌన వైఖరికి నిరసనగా తనకిచ్చిన సాహిత్య అకాడమీ అవార్డును కూడా వెనక్కి ఇచ్చివేస్తున్నానని ఆయక ప్రకటించారు. దాద్రి ఉదంతం తనను కలచి వేసిందన్నారు. లలిత కళా అకాడమీ మాజీ అధ్యక్షుడు కూడా అయిన అశోక్ వాజ్‌పేయి కవులు, రచయితలు స్పందించాల్సిన సమయమిది అని వ్యాఖ్యానించారు. మనకి మంచి వాగ్ధాటి గల ప్రధానమంత్రి ఉన్నారు గానీ రచయితలు, అమాయక ప్రజలు హత్యకు గురవుతుంటే మౌనంగా ఉండం సబబు కాదన్నారు. తన సహచర మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యానాలు చేస్తుంటే ప్రధాని మోదీ వాళ్ల నోర్లు ఎందుకు మూయించలేకపోతున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంలో సెహగల్ లాంటి రచయిత్రికి మద్దతు తెలపాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సాహిత్య అకాడమీ, జాతీయ అకాడమీ కూడా స్పందించాలని కోరారు. 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నిలబడిన వారిలో సెహగల్ ప్రముఖులు. పీపుల్స్ యూనియన్ ఆప్ సివిల్ లిబర్టీస్ సంఘం వ్యవస్థాపకుల్లో ఆమె కూడా ఒకరు. అటు ప్రముఖ హేతువాది ఎంఎం కాల్బుర్గి, నరేంద్ర దభోల్కర్ , గోవింద్ పన్సారే హత్యల సందర్భంగా కూడా ఆమె తన విమర్శలను ఎక్కుపెట్టారు. హిందుత్వ భావజాలానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారిని హత్య చేస్తున్న వారిని నిరోధించడంలో పాలకులు విఫలమవుతున్నారని మండిపడుతూ నయనతార సెహగల్ తన పురస్కారాన్ని వెనక్కి ఇస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
‘‘అయితే పోదామా నువ్వూ నేనూ’’ అని పిలిచిన కవితకు నూరేళ్లు
‘‘అయితే పోదామా నువ్వూ నేనూ, మత్తిచ్చిన రోగిలా సంజ నింగిలో పరచుకున్నప్పుడు’’ అని పిలిచిన కవిత పిలుపునకు నూరేళ్లు. ‘‘ద లవ్ సాంగ్ ఆఫ్ జె.ఆల్ఫ్రెడ్ పృఫ్రాక్’’ అంటూ వచన కవిత్వానికి అభివ్యక్తి మంత్రనగరి తలుపులు తీసిన 1915 నాటి కవితకు ఈ నెల శతాబ్ద సందర్భం. కవి టి.ఎస్.ఎలియట్. జూన్ 1915లో ‘పొయెట్రీ’ సాహిత్య పత్రిక ఈ ప్రేమరహిత ప్రేమ గీతికను అచ్చువేసింది. కవి అనామకుడు. అచ్చు కావడం వెనకాల తన మరో కవి సహచరుడు ఎజ్రా పౌండ్ జోక్యం ఉన్నది. తరువాత వచ్చిన సమీక్షలు ఈ కవితను పెద్దగా పట్టించుకోలేదు. పౌండ్ మాత్రం, ఇది ఈ శతాబ్దంలో నిలబడిపోయే కవిత అన్నాడు, శిఖరాయమాన కవితలకు ఆదిలో ఈ చిన్నచూపు తప్పదేమో! ఇంకో 18 ఏళ్ల తరువాత యువకవి శ్రీరంగం శ్రీనివాసరావు విశాఖపట్నంలోని టర్నరు వారి సత్రంలో కూచుని కేవలం కొద్ది నిమిషాలలో రాసి పంపిన ఒక గీతాన్ని ‘భారతి’ పత్రిక తిప్పి పంపింది. ఆ గీతమే మహాప్రస్థానం. ఒక శతాబ్ద సంగీతానికి ఆవాహన గీతం. కానీ ఇవాళ ఈ ‘పృఫ్రాక్ ప్రేమ గీతం’ ఆధునిక సాహిత్యోద్యమానికి ఆదిగీతంగా ప్రపంచమంతా సంభావిస్తున్న సంరభ సందర్భం. ఇందులో మొదలైన నిరాశ, అనిశ్చయ మనస్థితి, ఇరవయ్యో శతాబ్దాన్ని ఒక ఊపు ఊపాయి. చైతన్య స్రవంతి ధోరణుల బీజాలు ఈ కవితలో ఉన్నాయి. తెలుగు సాహిత్యంలో ఎన్నో రచనలలోని పాత్రల మానసిక దశలకు ఆది చిత్రణ ఈ కవితలో దర్శనమిస్తుంది. ప్రపంచంలోని సాహిత్య కళా, మానవ వికాస రంగాలు (ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్) ఈ రచనను పలు రూపాలలో వ్యాఖ్యానిస్తున్నాయి. ‘‘నా జీవితాన్ని కాఫీ స్పూన్లతో కొలుచుకున్నాను’’ అన్నది ఈ కవితలో ఒక ప్రఖ్యాత వాక్యం. దానికి ఒక ఆధునిక చిత్రకారిణి వేసిన గమ్మత్తయిన కాఫీ కప్పు ఎలియట్ బొమ్మ, ఈ తరాల పిల్లలు ఎలా ఎలియట్ కవిత్వాన్ని చదువుతున్నారో తెలియజేస్తున్నది. కారా మాస్టారు తెలిపినట్టు చక్కని కళారూపాలనదగ్గ ఇతివృత్తాలతో శ్రేష్టమైన కథలు మూడు వేలకు పైగా తెలుగులో ఉన్నాయన్న మాటలను చెవిన పెడదాము. వెయ్యేళ్ల కవిత్వ సంప్రదాయం లేని ఆంగ్లభాష సాధిస్తున్న సాంకేతిక ప్రగతితో పోల్చుకుని, మన భారతీయ రచయితలకు, ముఖ్యంగా తెలుగు రచయితలలో దిగ్దంతులకు విశ్వ పాఠక/ ప్రేక్షక రాజ్య పట్టాభిషేకం ఎలా చేయగలమో ఆలోచిద్దాము. ‘‘వర్తమాన కవిత్వమంటే ఏమిటో తెలుసా వరదా, అది భూత భవితవ్యాల మధ్య ట్రాన్స్పరెంట్ పరదా’’, (కవిత్వానికే కాదు వచనానికీ ఇది వర్తిస్తుంది), ‘‘చూశావా ఆరుద్రా ఒక తమాషా, సంప్రదాయం నిలిచే ఉంటుంది హమేషా’’ అన్న శ్రీశ్రీ, ఆరుద్ర, అబ్బూరి వరద రాజేశ్వరరావుల చింతన ‘సాహిత్యోపనిషత్’లో నమోదై ఉంటే, ఇదే భావాల సారాన్ని అంతకన్నా ముందరే పాశ్చాత్య సాహిత్యంలో ధ్వనించిన ప్రపంచ ఆధునిక కవిత్యోద్యమ సారథి ఎలియట్. వారి ‘ప్రేమ గీతానికి’ నూరేళ్లయితే, వారి స్మృతికి ఇది స్వర్ణోత్సవ సంవత్సరం. అలా కూడా మనం ఎలియట్‌ను, శ్రీశ్రీని, రెండు యుద్ధాల మధ్య కాలపు కవులుగా, వారి దేశ, కాల, చైతన్య పరిధుల మేరకు అధ్యయనం చేసేందుకు ఒక అపూర్వ అవకాశం ఇది. అందుకే పిలుస్తున్నది ఎలియట్ కవిత. ఈ కృషి శిఖరాల అధిరోహణకు, ‘‘పోదామా అయితే నువ్వూ నేనూ!’’ - రామతీర్థ, 9849200385 -
తక్కువ తింటే ఎక్కువ లాభం..
కొత్త పరిశోధన ‘తిండి కలిగితె కండ గలదోయ్’ అన్న కవి వాక్కు నిజమే. కండపుష్టి కోసం కావలసినంత తింటే చాలు.. కాస్త తక్కువగా తింటే మరింత మేలు అంటున్నారు నిపుణులు. అప్పుడప్పుడు ఉపవాసాలు ఉండటం లేదా ఒంటిపూట భోజనం చేయడం వంటి పద్ధతులేవైనా కావచ్చు, నెలకు కనీసం ఐదురోజులు శరీరానికి రోజువారీ అవసరమైన కేలరీల్లో సగానికి సగం తగ్గించి తీసుకున్నట్లయితే, చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని అంటున్నారు. ఈ పద్ధతి వల్ల కేన్సర్, గుండెజబ్బులు, మధుమేహం వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గడమే కాకుండా, ఎక్కువ కాలం జీవించే అవకాశాలు ఉంటాయని సౌత్ కరోలినా వర్సిటీ నిపుణులు చెబుతున్నారు. నెలకు కనీసం ఐదు రోజులు ఆహారంలోని కేలరీల్లో 34-54 శాతం మేరకు కోత విధించుకోగలిగితే చాలని అంటున్నారు. ఇదే పద్ధతిలో తాము ఎలుకలపై జరిపిన ప్రయోగం సత్ఫలితాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. ప్రయోగానికి వారు ఎంచుకున్న ఎలుకల ఆహారంలో నాలుగు రోజుల చొప్పున నెలకు రెండుసార్లు కోత విధించగా, అవి మిగిలిన ఎలుకల కంటే ఎక్కువ కాలం బతికాయి. -
పరోపదేశ పాండిత్యం
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసే ప్రబోధాలన్నీ పరులకోసమే కాని తాను మాత్రం పాటించాలన్న స్పృహ ఆయనకు ఏనాడు లేదనిపిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే నారావారిదంతా పరోపదేశ పాండిత్యమే. పొదుపు గురించి, ప్రజాధన సంరక్షణ, నీతి, నిరాడంబరత్వం గురించి పదేపదే పసలేని ప్రసంగాలు చేస్తాడు గానీ వాటిలో ఏ ఒక్కదాన్నీ పాటించే అవసరం ఆయనకు లేనట్లుగానే కనిపిస్తోంది. నిజంగా తాను చెప్పే విషయంపట్ల వారికి చిత్త శుద్ధి ఉంటే తన అభిరుచుల కోసం, వాస్తు పై తన నమ్మకాల కోసం సచివాలయంలో మార్పులు, చేర్పుల కోసం, ఆ పేరుతో హంగులు, ఆర్భా టాల కోసం ఇప్పటివరకూ ప్రజాధనం రూ.81 కోట్లు ఖర్చు పెట్టడు. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అధునాతన సెల్ఫోన్లు బహుమతిగా ఇవ్వవలసిన అవసరం ఏమిటి? వాటిని ఉపయోగించే ప్రాథమిక పరిజ్ఞానం మన ప్రజా ప్రతినిధుల్లో ఎంతమందికి ఉంది? ఇది వృథావ్యయం కాదా? ఇతరులకు ఉపదేశాలు, తనకు మాత్రం స్వప్రయో జనాల నుంచి బాబు బయటపడితే మంచిది. - ఈదుపల్లి వెంకటేశ్వరరావు, ఏలూరు -
అనుకోలేదని ఆగవు కొన్ని...
మే 7 ఆత్రేయ జయంతి ఆత్రేయకు నివాళి అంటే ఆయన పాటను తలచుకోవడమే! జీవితాన్ని అర్థం చేసుకోవడమే... ఆ వైభవాన్ని సెలబ్రేట్ చేసుకోవడమే!! తెలుగు సులువుగా లేకపోతే ఆత్రేయ సులువైన కవి అయి ఉండేవాడు కాదు. సుకవీ అయి ఉండేవాడు కాదు. తెలుగు- ఆత్రేయను గొప్ప కవిని చేసింది. ఆత్రేయ- తెలుగును గొప్ప పాట చేశాడు. ఒక చిన్నపిల్లవాడు ఇంటి నుంచి తప్పిపోయాడు. తల్లిదండ్రుల కనిపించక నిర్మానుష్యమైన ఎడారిలో, ఎండలో, కన్నీళ్లను తాగుతూ, వెక్కిళ్లు పెడుతూ తిరుగుతున్నాడు. ఆ పిల్లవాడు తన వేదనను పాటలో చెప్పాలి. ఏం పాడతాడు? కవిత్వం చెబుతాడా? ప్రాసతో కనికట్టు ప్రదర్శిస్తాడా? స్వచ్ఛమైన పసి దుఃఖం అది. మాటలు కూడా అంతే స్వచ్చంగా ఉండాలి. అమ్మా చూడాలి నిన్నూ నాన్నను చూడాలి నాన్నకు ముద్దులు ఇవ్వాలి నీ ఒడిలో నిద్దుర పోవాలి... ఏ పిల్లాడైనా ఇంతకు మించి ఏం మాటలు కూడగట్టుకోగలడు ఆ కష్టంలో? ఈ పాట రాసేటప్పటికి ఆత్రేయ వయసు 50 ఏళ్లు. కాని రాస్తున్న క్షణాన తొమ్మిదేళ్లు. ఆత్రేయ మాటల మనిషి. ఉత్త మాటల మనిషి కాదు. నెల్లూరు జిల్లాలోని చిన్న పల్లెటూళ్లో పుట్టి, పెరిగి, ప్రజల జీవనాడిగా ఉండే భాషలోని మాటలను పట్టి కలంలో నింపుకున్న మనిషి. వాటిని ఆయన మొదటగా ఉపయోగించింది నాటకాల్లోనే. ‘ఎన్.జి.వో’ నాటకం చాలా పెద్ద హిట్. ‘కప్పలు’ ఇంకా పెద్ద హిట్. నేరుగా, సులభంగా, సూటిగా ఉన్న మాట శక్తి ఆత్రేయకు బాగా తెలుసు. మాటను నాటడం, పర్మినెంట్ మెమరీ చిప్‌గా చేసి మనసులోకి ఎక్కించడం బాగా తెలుసు. పొడుగు పొడుగు సంభాషణలతో కాదు, చిన్న చిన్న పదాలతోనే. ప్రేమ్‌నగర్‌లో హీరో గురించి చెప్పాలి. కాని అతడి గౌరవం పోకుండా చెప్పాలి. అందుకే ఆత్రేయ రాస్తాడు: ‘చినబాబు చెడిపోయాడేమోగాని చెడ్డవాడు మాత్రం కాదమ్మా’. సన్నివేశాన్ని మాత్రమే కాదు, సినిమా సోల్‌ని కూడా నాలుగడుగులు పైకి లేపడం ఆత్రేయకు తెలుసు. అందుకే మూగమనసులు సినిమాలో రాస్తాడు: ‘చావు ఎంతమందినో విడదీస్తుంది. కాని కొంతమందిని కలుపుతుంది’. కేరెక్టర్ని, కేరెక్టర్ డెప్త్‌ని చెప్పే డైలాగ్స్ ఆత్రేయ పాళీ చివర ఉంటాయి. అడిగితే చాలు కాగితం మీద కదులుతాయి. ‘వెలుగు నీడలు’ సినిమాలో ఆ ఫేమస్ డైలాగ్ గుర్తు లేదా? ‘కన్నీరే మనిషిని బతికించగలిగితే అమృతంలాగే అదీ కరవైపోయేది’. ఆత్రేయకు ముందు ‘ఆచార్య’ అనే అలంకారం ఉంది. నిజంగా ఆయన ఆచార్యుడే. మాటల యూనివర్సిటీకి రిటైర్మెంట్ లేని వైస్ చాన్సలర్. ఆత్రేయకు మాటలు తెలుసు. మాటల వల్ల వచ్చే కష్టం తెలుసు. ‘ఇవాళ కాదు. రేపు’, ‘ఇప్పుడేం అవకాశాలు లేవు పో’, ‘నీ ముఖానికి సినిమాలా’... ఇలాంటి మాటలన్నీ పడ్డాడు. ఇంట్లో వెండి చెంబు అమ్మి మద్రాసు చేరుకొని కటిక నేల మీద ఆకలి కడుపుతో నిదురించాడు. తన ప్రాంతం వాడే అయిన హాస్యనటుడు రమణారెడ్డి ‘రావయ్యా రా’ అని పిలిచి నాలుగిడ్లీలు పెట్టిస్తే కారం వల్లో, కృతజ్ఞత వల్లో కళ్లల్లో నీళ్లు కారిపోయేవి. తెల్లవారితే ఎలా అని భయం. రాత్రయితే ఏమిటి దారి అని భీతి. కాని మాట మంచిదైతే ఊరు మంచిదవుతుంది. నెల్లూరు నుంచి వచ్చిన పంతులుగారు బాగా రాస్తారు అని వచ్చింది. సినిమాలు వచ్చాయి. మాటకు మాటా ఇచ్చేవాడు నెగ్గుకు వస్తాడు. అప్పుడైనా ఎప్పుడైనా ఆత్రేయ పాటించింది ఒకటే సూత్రం. జయభేరి సినిమాలో ఆయనే డైలాగ్ రాసినట్టు ‘సామాన్యుడికి అందుబాటులో లేని కళ సంకుచితమై సమసిపోతుంది’ అనేదే ఆ సూత్రం. మాటైనా, పాటైనా సులువుగా ఉండాలి. సామాన్యుడికి అందాలి. ‘మనసు గతి ఇంతే’... రిక్షావాడూ పాడాడు. పండితుడూ గౌరవించాడు. సేయింగ్స్ అనండీ, సామెతలు అనండి, జాతీయాలు అనండి... అలాంటివి వింటే మనిషి వాటిని టక్కున పట్టుకుంటాడు. కంఠోపాఠం చేసుకుంటాడు. ఆత్రేయ తన ప్రతి పాటనూ అలా ఒక సేయింగ్లాగానో, సామెతలాగానో మలిచాడు. పల్లవిలోనో చరణంలోనో ఎక్కడో ఒకచోట ఒక జాతీయంలాంటి మాట రాస్తాడు. మన ఆత్రేయ ఏం చెప్పాడురా అని ప్రేక్షకుడు పట్టుకుంటాడు. గతంలో వేమనకు ఈ గౌరవం దక్కింది. ఆ తర్వాత ఆత్రేయకు. ‘మనసే మనిషికి తీరని శిక్ష’ అనో ‘మమతే మనిషికి బందిఖానా’ అనో ఆత్రేయ అంటే ఒక ఓదార్పు. ‘అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్నీ’ అనంటే తెరిపినపడ్డ భావన. ‘నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి’ అనో ‘ఏ కన్నీళ్లైనా వెచ్చగానే ఉంటాయి’ అనో అనంటే ఈ కష్టం మనకే కాదు అందరూ పడుతున్నారు అందరూ అనుభవిస్తున్నారు దీనిని భరించొచ్చు అనే ధైర్యం. అందుకే ఆత్రేయ ‘నవ్వుతూ బతకాలిరా’ అన్నాడు. ‘సిరిమల్లె పువ్వల్లే నవ్వు’ అని కూడా అన్నాడు. తమిళంలో కణ్ణదాసన్ గొప్ప కవి. తెలుగులో ఆత్రేయ అంతకు ఏమాత్రం తక్కువ కాదు. తమిళంలో హిట్ అయిన తన సినిమాలను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నప్పుడు పాటల కోసం బాలచందర్‌కు ఆత్రేయ తప్ప వేరెవరూ కనిపించలేదు. ‘దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి’, ‘కళ్లలో ఉన్నదేదో కన్నులకే తెలుసు’, ‘అరె ఏమిటి లోకం పలుగాకుల లోకం’, ‘తాళికట్టు శుభవేళ’... అన్నీ ఎమ్.ఎస్. విశ్వనాథన్ బాణీలతో ఆత్రేయ మాటలతో తెలుగువారిని ఆకట్టుకున్నాయి. ఇవన్నీ ఒకెత్తు ‘గుప్పెడు మనసు’ కోసం ఆత్రేయ రాసిన ‘మౌనమే నీ భాష ఓ మూగ మనసా’ పాట ఒకెత్తు. బాలమురళీకృష్ణ గంభీరంగా గానం చేసిన ఈ పాటలో మనసు చేసే మాయలన్నింటినీ ఆత్రేయ చాలా సులభమైన మాటల్లో చూపిస్తాడు. ‘లేనిది కోరేవు... ఉన్నది వదిలేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు’.... ఈ రెండు వాక్యాలతో ఆత్రేయ ఫ్రాయిడ్ సరసన కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. ఆత్రేయ చాలా పాప్యులర్ నంబర్స్ రాశాడు. ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే’... చాలా కోమలమైన గీతాలు రాశాడు ‘నీవు లేక వీణ పలకలేనన్నది’... చాలా ప్రబోధాత్మక గీతాలు రాశాడు ‘భారతమాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు’.. శ్రీశ్రీ మనందరికీ ఇష్టమే. కాని ఆత్రేయ ఆయనను తలపించేలా ‘చలువరాతి మేడలోన కులుకుతావే కుర్రదానా’ అంటూ ‘కారులో షికారుకెళ్లే’.. పాట రాశాడు. శ్రీశ్రీ మాత్రం తక్కువ తిన్నాడా. ఆత్రేయను గౌరవిస్తూ ఆత్రేయ పేటెంట్గా భావించే ‘మనసు’ను మకుటంగా తీసుకుంటూ ‘మనసున మనసై బతుకున బతుకై’ పాట రాసి శ్రోతల తోడుండిపోయాడు. కాలం మారింది. వేటూరి కొండగాలి వచ్చి హీరోయిన్ కోకెత్తుకెళ్లింది. చక్రవర్తి విజృంభించాడు. సినారె స్థిరంగా తన పల్లవులను సారించాడు. ఆత్రేయ కొంచెం వెనుకబడ్డాడు. కాని ఆయన పాట కాదు. ‘సీతారామ కల్యాణం’, ‘అభినందన’ సినిమాలు ఆత్రేయ సిరా పలుచబడలేదనడానికి ఉదాహరణలు. ఆత్రేయ సంపాదించుకున్నాడా పోగొట్టుకున్నాడా ఎవరికి కావాలి? ఆత్రేయ తన పాటలను తెలుగువారికి ఎంత సంపదగా ఇచ్చి వెళ్లాడా కావాలి. ఆత్రేయ గాలిలో తేలే పాత్రల్ని, ఊతం లేని సన్నివేశాలను ఇచ్చి పాట రాయమన్నవారిని రాయక ఏడిపించాడు. తనను కదిలించే చిన్న సన్నివేశానికి కూడా ఆకాశమంత ఎత్తున్న అర్థమున్న రాసి ప్రేక్షకులను ఏడిపించాడు. ఆత్రేయ పాట ద్విముఖి. అది ఒకరికి కన్నీటి చుక్క. మరొకరి ఆనందబాష్పం. ఆ మనసున్న మాటకు మల్లెపూల దోసిలి. - సాక్షి ఫ్యామిలీ ప్రతినిధి ‘‘ఆత్రేయ తన పాండిత్యాన్ని పాటల్లో ప్రదర్శించలేదు. సినిమా పాటను పామరులకు సన్నిహితం చేసిన ఘనత ఆయనదే. ఆయన రాసిన పాటల్లో నాకు బాగా ఇష్టమైనది ‘కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడిదానా’. రొమాన్స్‌లో కమ్యూనిజాన్ని ఈ పాటలో చూపించారు. ఆయన జీవిత చరమాంకంలో బాగా సన్నిహితంగా మసిలే అవకాశం నాకు దక్కింది. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఆయన స్వీయ చరిత్ర రాయడం మొదలుపెట్టి, పూర్తి చేయకుండానే కన్నుమూశారు. అది వచ్చి ఉంటే మనకు ఎన్నో విలువైన విషయాలు తెలిసుండేవి. ఆ విషయంలో మనం దురదృష్టవంతులం.’’ - కోన వెంకట్, రచయిత అసలు పేరు : కిళాంబి వేంకట నరసింహాచార్యులు జననం: 07-05-1921 జన్మస్థలం: నెల్లూరు జిల్లా, సూళ్లూరుపేట తాలుకా మంగళంపాడు స్వస్థలం: సూళ్లూరుపేట తాలుకా ఉచ్చూరు తల్లిదండ్రులు: సీతమ్మ, కృష్ణమాచార్యులు చదువు: ఎస్.ఎస్.ఎల్.సి. వివాహం - భార్య: 1940 - పద్మావతి తొలిచిత్రం - పాట: దీక్ష (1951) - పోరా బాబూ పో పోయి చూడు లోకం పోకడ ఆఖరిచిత్రం - పాట: ప్రేమయుద్ధం (1990) - ఈ మువ్వలగానం మన ప్రేమకు ప్రాణం పాటలు: సుమారు 1400 దర్శకునిగా: వాగ్దానం (1961) నటించిన సినిమా: కోడెనాగు (1974) గౌరవ పురస్కారాలు: వివిధ విశ్వవిద్యాలయాల్లో ఆత్రేయ మీద 12 మంది పరిశోధనలు చేశారు. ‘మనస్విని’ సంస్థ ఆత్రేయ సాహిత్యాన్ని7 సంపుటులుగా 1990లో ప్రచురించింది, ఆయన ‘మనసుకవి’గా ప్రజల మన్ననలు పొందారు. మరణం : 13-09-1989 -
సామరస్య నగరం
జ్ఞాపకం నిఖిలేశ్వర్ - ప్రముఖ కవి ఎక్కడైనా నగరాల విస్తరణ, పురోగమనం అక్కడి అసంఖ్యాక శ్రామికులు చెల్లించే జీవన మూల్యాల ఫలితమే! నగరాలే మానవ నాగరికతా వికాసాన్ని కాలగమనంలో ఆయా దశల్లో ప్రతిఫలించాయి. కొన్ని కాలగర్భంలో కలసిపోతే మరికొన్ని కాలానికి సాక్షిగా నిలిచాయి. అలాంటి నగరమే హైదరాబాద్.. అదే ఒకనాటి భాగ్యనగరం! అంటారు నిఖిలేశ్వర్. కవిగా, ఉపాధ్యాయుడిగా, వ్యక్తిగా నాలుగు వందల ఏళ్లు పైబడిన ఈ మహానగరంతో ఆయన అనుబంధం ఏడు దశాబ్దాలు. ఈనాటికీ కొత్తగా ఉన్న ఆ జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే. ..:: హనుమా నా బాల్యం, యవ్వనం, జీవితం.. అంతా ఇక్కడే. 425 ఏళ్ల చరిత్ర గల ఈ మహానగరానిది దక్కన్ సాంస్కృతిక స్వభావం. మత సామరస్యం, బహుభాషా జీవితాల సహజీవనం ఇక్కడి ప్రత్యేకత. ప్రస్తుతం మెట్రోపాలిటన్ నగరంగా విస్తరిస్తున్నందున సిటీలైఫ్ ఒక కమోడిటీగా మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. మెట్రో రైలు కూతతో జీవితం వేగవంతమై.. మనమంతా ఈ నగరంలోనే పరాయీకరణ చెందే ప్రమాదమూ ఉంది. చుట్టు పక్కల విస్తరిస్తున్న హైటెక్ సిటీతో ఇప్పటికే ‘న్యూ అమెరికన్’ సంస్కృతిలోకి జారిపోయింది. అయితే వలస వచ్చే వారందరికీ ఆశ్రయమివ్వడం ఈ సిటీ ప్రత్యేకత. ఎన్నో పాత్రలు... సిటీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న వీరవల్లి గ్రామంలో పుట్టినా... బాల్యం నుంచి నా జీవితం ఇక్కడే గడిచింది. అబిడ్స్‌లో మా ‘దిగంబర కవులు’ తొలి కవితా సంపుటి ఓ రిక్షావాలా చేత ఆవిష్కరింపజేశాం. కేశవ్ స్మారక విద్యాలయంలో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా 30 ఏళ్లు పనిచేశా. విద్యార్థులతో మమేకమయ్యే అవకాశం దక్కింది. హిందీ, తెలుగు బోధన భాషగా ఉంటేనేం..! మరాఠీ, కన్నడ, ఉర్దూ, హిందీ భాషలు కూడా ఉండేవి. ఇది నగరంలో పరిమళించే మిశ్రమ సంస్కృతికి చక్కని నిదర్శనం. కార్మిక, కర్షక నగరం నా బాల్యం బాకారం, దాయరా, ముషీరాబాద్ బస్తీల్లో సాగింది. పక్కనే ఆజామాబాద్ పారిశ్రామిక ప్రాంతం. ఇక్కడెక్కువ వజీర్ సుల్తాన్ ఫ్యాక్టరీ (వీఎస్టీ), గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ, డీబీఆర్ బట్టల మిల్లు, ఆల్విన్ ఫ్యాక్టరీ కార్మికుల కుటుంబాలుండేవి. అంతటా సామరస్యం వెల్లివిరిసేది. పోలీస్ ఫైరింగ్... 1948లో ‘ఇండియన్ యూనియన్ సైన్యాలు’ హైదరాబాద్‌లోకి ప్రవేశించాయి. సుల్తాన్‌బజార్ రోడ్లపై ఆ సైన్యాన్ని ఆహ్వానించిన వాళ్లలో నేనూ ఉన్నాను. అప్పుడు నా వయసు పదేళ్లు. సైనిక చర్యతో నిజాం ఫ్యూడల్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయి. ముల్కీ సమస్యపై హైదరాబాద్‌లో 1954-55లోనే ఉద్యమం చెలరేగింది. నాన్ ముల్కీ గో బ్యాక్ అంటూ విద్యార్థులమంతా అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగాం. అది తీవ్రరూపం దాల్చడంతో పోలీసులు మొదట లాఠీచార్జి.. తర్వాత ఫైరింగ్ మొదలుపెట్టారు. తప్పించుకోవడానికి నేను నయాపూల్ వంతెన మీదుగా పరిగెత్తిన ఘటన నేటికీ కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. అభ్యుదయ యువక సంఘం 1956 ప్రాంతం.. ముషీరాబాద్ జమిస్తాన్పూర్ హైస్కూల్లో చదివా. అప్పుడక్కడ అంతా ఖాళీ ప్రదేశం. ముషీరాబాద్‌లో ఆనాడు ఉన్న గౌరీశంకర్ గ్రంథాలయం మాకు సాహితీ సౌరభాలను పరిచయం చేసింది. స్థానిక కాంగ్రెస్ నాయకుడైన వెంకటరామయ్య జోషి పంతులు దీన్ని నిర్వహించేవారు. అక్కడ 1959-60లో ‘అభ్యుదయ యువక సంఘం’ స్థాపించి.. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాం. మాడపాటి హనుమంతరావు, పుట్టపర్తి శ్రీనివాసాచార్య (పురాతత్వ శాస్త్రవేత్త), దాశరథి కృష్ణమాచార్యులు, వట్టికోట ఆళ్వార్‌స్వామి, వెంకటావధాని, కాళేశ్వరరావు, కాళోజీ వంటి మహనీయులతో సాహిత్య, సాంస్కృతిక ప్రసంగాలు ఏర్పాటు చేశాం. విరిసిన విరసం 1960-65 మధ్య మేమంతా బూర్గుల రంగనాథ్ (బూర్గుల రామకృష్ణారావు కుమారుడు) ఇంట్లో, కుందుర్తి ఆంజనేయులు ‘ఫ్రీవర్స్ ఫ్రంట్’ సాహిత్య గోష్ఠుల్లో మా రచనలు చదివేవాళ్లం. నేను, మిత్రులు జ్వాలాముఖి, నగ్నముని, చెరబండరాజు, భైరవయ్య, మహాస్వప్న.. ఈ ఆరుగురం ‘దిగంబర కవులు’ మూడు సంపుటాలు రాశాం. మేమంతా కలసి లెనిన్ శతజయంతి సభల్లో పాల్గొన్నాం. అక్కడే ‘విరసం’ అంకురార్పణ జరిగింది. నేను, జ్వాలాముఖి, నగ్నముని, చెరబండరాజు విరసం వ్యవస్థాపక సభ్యులం. హోటళ్లలో చర్చాగోష్టులు అబిడ్స్‌లోని ఓరియంటల్, కింగ్స్ సర్కిల్ హోటళ్లలో తెలుగు, హిందీ, ఉర్దూ రచయితల భేటీలు జరుగుతుండేవి. మగ్దూం మొహియొద్దీన్, టంగుటూరి అంజయ్య, జి.వెంకటస్వామి వంటి కార్మిక నాయకులు కూడా ఈ హోటల్లో సమావేశమయ్యేవారు. సుల్తాన్‌బజార్‌లోని ‘దిల్షాద్ రాయల్ టాకీస్’, అబిడ్స్ ‘జమృద్ మహల్’లో హిందీ సినిమాలు, సికింద్రాబాద్ ‘ప్లాజా, టివోలీ, డ్రీమ్ ల్యాండ్’ థియేటర్లలో ఇంగ్లిష్ సినిమాలు చూసేవాళ్లం. రాజద్రోహం కేసు... ప్రభుత్వానికి వ్యతిరేకంగా రచనలు చేసినందుకు 1971లో నాతోపాటు జ్వాలాముఖి, చరబండరాజులను రాజద్రోహ నేరం కింద అరెస్ట్ చేసి సికింద్రాబాద్ జైల్లో పెట్టారు. ఈ నిర్బంధాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశాం. ‘కలాలకు సంకెళ్లు ఉండరాదు. భావప్రకటనా స్వేచ్ఛ రాజ్యాంగపరమైన హక్కు’ అంటూ హైకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. ఆ తీర్పుతో మేం విడుదలయ్యాం. మహానగరాన్ని నిర్మించిన నిర్మిస్తున్న మనుష్యుల మమతలు తినేసిన ఉప్పు (కల్తీ) గాలి అంతశ్చైతన్యాన్ని అంతం చేసి నవ్వుతున్న నగరం పెరుగుతూంది... నిశ్చయంగా విస్తరిస్తూంది. వాయుగుండంలో సమస్యలు వీచివీచి మహానగరపు వీధుల్లో సుళ్లుసుళ్లుగా దివారాత్రుల శ్రమకి- సౌఖ్యానికి ఘర్షణ దరిద్రానికి- ధనానికి అంతులేని సంఘర్షణ ‘కెలిడోస్కోప్’లోని చిత్రవిచిత్ర రంగులవలే జీవితాల విభిన్న చిత్రాల నూతన సృష్టికి జరుగుతున్న సంచలనం. (నిఖిలేశ్వర్ ‘నాలుగు శతాబ్దాల సాక్షిగా నా మహానగరం’లోని కవిత) -
అక్షర సూర్యుడు అలిశెట్టి
తన కళ ప్రజల కోసమే అని చివరికంటా నమ్మిన ప్రజాకవి అలిశెట్టి ప్రభాకర్. నేడు ఆయన జయంతి వర్థంతి కూడా (12.1.1954 - 12.1.1993). ఆయన జన్మస్థలం కరీననగర్ జిల్లా జగిత్యాల. ఆర్టిస్టుగా ఎదిగిన అలిశెట్టి మొదట్లో జగిత్యాలలో సాహితీ మిత్ర దీప్తి సంస్థ పరిచయంతో కవిత్వ రంగంలోకి ప్రవేశించాడు. జీవిక కోసం ఫొటోగ్రాఫర్‌గా, జీవిత పోరాటంలో కవిగా ఎదిగాడు. ఏనాడూ సంపాదన కోసం ఆరాటపడ లేదు. 1972 నుంచి 1992 వరకు కవిత్వాన్ని ఆశ్వా సిస్తూనే బతికాడు. తన మొదటి కవితా సంకలనం ఎర్రపావురాలు కాగా, మంటల జెండాలు, చురక లు, రక్తరేఖ, ఎన్నికల ఎండమావి, సంక్షోభగీతం, సిటీలైఫ్ అనే కవిత్వ సంకలనాలు అచ్చయ్యాయి. అలిశెట్టి 40 ఏళ్ల స్వల్ప వయ సులోనే కన్నుమూశాడు. జగిత్యాలలోని ఆయన మిత్రులు, సన్ని హితులు నేడు అలిశెట్టి విగ్రహావిష్కరణ తలపెడుతున్నారు. విగ్ర హ ఆవిష్కర్త తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు జయధీర్ తిరుమలరావు. ముఖ్యఅతిథి అల్లం నారాయణ. అందరికీ ఆహ్వానం. (నేడు అలిశెట్టి ప్రభాకర్ 61వ జయంతి, 22వ వర్థంతి సందర్భంగా జగిత్యాలలో విగ్రహావిష్కరణ) - అలిశెట్టి మిత్రులు సన్నిహితులు, జగిత్యాల, కరీంనగర్ -
అనంతకు అన్యాయమే!
కవి, గాయకుడు గోరేటి వెంకన్న అనంతపురం కల్చరల్ : ‘పల్లె కన్నీరు పెడుతోందే.. కనిపించని కుట్రల’ అంటూ పల్లె సంస్కృతిని దెబ్బ తీసిన ప్రపంచీకరణ వైనాన్ని కళ్లకు కట్టినట్టు చెప్పిన కవి, గాయకుడు గోరేటి వెంకన్న. బలహీన వర్గాల పక్షాన బలమైన సాహిత్యంతో గళం విప్పిన ఆయన.. తెలంగాణ , సీమ అంటూ తేడా లేకుండా సుమధుర సాహిత్యంతో ప్రజల గుండెల్లో ప్రత్యేక చోటు సంపాదించుకున్నారు. నగరంలోని ఓ సాహితీ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన వెంకన్న ‘సాక్షి’తో ఆత్మీయంగా ముచ్చటించారు. రాష్ట్ర విభజన తర్వాత తలెత్తిన సమస్యలు, ప్రపంచీకరణ నేపథ్యంలో తగ్గుతున్న పల్లె సంస్కృతి, సినిమా పాటలు, కొత్త తరం రచయితలు, రచయితల బాధ్యత తదితర అంశాలపై ఆయన చెప్పిన సంగతులు ఇలా... సాక్షి : ‘అనంత’తో మీకు ప్రత్యేక అనుబంధం ఉంది కదా... గోరేటి వెంకన్న : ‘అనంత’ ను చూస్తే మా మహబూబ్‌నగర్‌ను చూసినట్లే ఉంటుంది. ‘సీమ’ సాహిత్యం, ఇక్కడి రచయితలతో నాకు విడదీయరాని ఆత్మీయ అనుబంధం ఉంది. చాలా మంది ‘సీమ’ రచయితలు నన్ను ప్రభావితం చేస్తారని నేను సగర్వంగా చెబుతా. సాక్షి : ఎవరితో ఎక్కువ సాన్నిహిత్యముంది.. గో.వె : ఒకరే ంటి? శాంతి నారాయణ, బండి నారాయణస్వామి, చిలకూరి దేవపుత్ర, సింగమనేనని నారాయణ వంటివారే కాకుండా ఇతర జిల్లాల్లోని రాసాని, కేశవరెడ్డి వంటి వారి రచనలు భాషా సాహిత్యాలకు పెద్ద పీట వేశాయి. వారి రచనలంటే నాకు ఎక్కువ గౌరవం. వారి కథలు చదువుతుంటే మా జిల్లాలోని సమస్యలపై కథలు రాసినట్లే ఉంటాయి. ఎందుకంటే అనంత, మహబూబ్‌నగర్, కర్నూలులో దాదాపు ఒకే పరిస్థితులు కన్పిస్తాయి. సాక్షి : సీమ సంసృతి ఎలా ఉంటుందనిసిస్తుంది.. గో.వె : మాది మహబూబ్‌నగర్ కావడంతో చాలా వరకు రాయలసీమతో సన్నిహిత సంబంధాలున్నాయి. కర్నూలుకు కూత వేటంత దూరంలోనే ఉండడంతో భాష, సాహిత్యం, ఆహారపు అలవాట్లు, ఆచార వ్యవహారాలు చాలా వరకు సీమను పోలి ఉంటాయి. భాషలోని చాలా పదాలు కూడా తెలంగాణ యాస కన్నా సీమను ఎక్కువగా పోలివున్నాయి. కాబట్టే మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం దాదాపు ఒకటే అని నా భావన. సాక్షి : రాయలసీమ కరువు మాటేమిటి... గో.వె : నిస్పందేహంగా రాయలసీమలో కరువు కరాళనృత్యం చేసింది. అయితే తెలంగాణలోని మా మహబూబ్‌నగర్ ప్రాంతం కూడా ఏమి తీసిపోలేదు. తెలంగాణకు అన్యాయం జరిగిందని గతంలో ఎలాంటి ఉద్యమాలు జరిగాయో...సీమకు న్యాయం జరగాలని కూడా ఎప్పటి నుంచో ఉద్యమాలు జరిగాయి. కచ్చితంగా ‘సీమ’ వెనుకబడి ఉంది. న్యాయం జరగాలి. ముఖ్యంగా నదీ జలాల కేటాయింపులో ట్రిబ్యునల్ తీర్పుల మేరకు కచ్చితంగా ‘సీమ’కు వాటా దక్కాలి. అదే పరిస్థితుల్లో మహబూబ్‌నగర్ కరువును కూడా జలాలతో తీర్చాలి. సాక్షి : ప్రపంచీకరణ ప్రభావం ఎలా ఉందంటారు.. అభివృద్ధి చెందుతోందా.. గో.వె : ప్రపంచీకరణను నేను తీవ్రంగా వ్యతిరేకించినవాడిని. దాని వల్ల ఎంతో నష్టం జరిగింది. కొద్దిగా మేలు కూడా జరిగింది. ప్రపంచీకరణతో కొద్దిగా ఆర్థిక వెసలుబాటు కల్గినా చాలా భాగం విధ్వంసమే జరిగింది. కుల వృత్తులు నాశనమయ్యాయి. సహజంగా ఉన్న వాతావరణం స్థానంలో కృత్రిమత్వం తాండవిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే తల్లి ఒడిలో హాయిగా ఒదిగే కన్నబిడ్డకు... అద్దె ఆయాల పెంపకంలో పెరిగే పిల్లలకు ఉన్నంత తేడా ఉంది. వెన్నెల వెలుగులో చల్లగాలి ఆనందానికి... ఏసి గదులకు ఉన్నంత తేడా ఉంది. చేత్తో పీకేసి మట్టి తుడుచుకుని తినే వేరుశనగ కాయలకు, హాల్దీరామ్ విత్తనాలకు ఉన్నంత తేడా ఉంది. సాక్షి : పల్లెల్లోని సంస్కృతి, సంప్రదాయాలపై కూడా ఆ ప్రభావం ఉందంటారా? గో.వె : కచ్చితంగా.. సమస్యలు, ప్రాంతీయ అసమానతల నేపథ్యంలో ఉద్యమాలు ఎలా వచ్చాయో.. ప్రపంచీకరణపై కూడా అదే స్థాయిలో ఉద్యమం వస్తుంది. సంస్కృతి విఛ్చిన్నం అవుతోంది. ఇంటర్నెట్లో లభించే నీలి చిత్రాలే ఉదాహరణ. అలాంటి చిత్రాలు అందరూ చూసేలా ఇంటర్నెట్లో ఉంచడం అవసరమా.. అని నా ప్రశ్న. ఇదే తరహాలో ప్రతీ రంగంపై ప్రపంచీకరణ ప్రభావం ఉంది. దాని ప్రభావం భాషపై కూడా పడింది. వీటి ఒడిదుడుకల మధ్య రచనలు తగ్గిపోతున్నాయి. ఇది కూడా భాషపై, భావ వ్యక్తీకరణపై ప్రభావం చూపుతుంది. సాక్షి : మిమ్మల్ని ప్రజాకవి అంటారు.. మీ కవిత్వంలోని ప్రత్యేకత వల్లేనా? గో.వె : నన్ను ప్రజాకవి అంటే వంద శాతం తప్పు అంటాను. కవులందరూ ప్రజాకవులే. నేను ప్రజాకవిని అంటే తక్కిన వారు పాలకుల కవులా? అది కరెక్టు కాదని నేను చాలా సార్లు చెప్పాను. నాలోని కవిత్వానికి ప్రత్యేకంగా గొప్పదనం అంటూ ఏదీ లేదని నేను అనుకుంటాను. ఏ కవికైనా ఏదైనా సందర్భంలో గుండెలో ఉద్భవించిన భావనకు అక్షర రూపం ఇస్తే మంచి కవిత్వం అవుతుంది. పనిగట్టుకుని రాయాలనుకుంటే అందులో ‘ప్రాణం’ కనిపించదు. కవితా ధారలు ప్రవహించడానికి ఆయా సందర్భాలు, అనుభూతులు దోహదపడతాయే కానీ వ్యక్తుల సిద్ధాంతాల వల్ల కాదు. ప్రజా పక్షాన నిలిచే సాహిత్య మార్గాన్ని ఎంచుకున్న కవులంతా సాహితీ సేవకులే. సాక్షి : విభజనతో సీమకు అన్యాయం జరిగిందని భావించడం లేదా.. గో.వె : కొంత వరకు నేను దానితో ఏకీభవిస్తాను. నా వ్యక్తిగత అభిప్రాయం కూడా తెలంగాణకు సామ్యమున్న ‘అనంత’, ‘కర్నూలు’ కలిసి ఉంటే బాగుండేదని నేను కూడా భావించాను. అయితే అనాదిగా తెలంగాణలో జరిగిన అన్యాయం ఉద్యమబాటకు అనివార్యమైంది. ఇప్పుడిప్పుడే తెలంగాణలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఏమైనా భాషా సాహిత్యాల వరకైతే తెలంగాణ, రాయలసీమ భావజాలం ఒకటేనన్నది సత్యదూరం కాని మాట. సాక్షి : కవిత్వంలో భాగమే పాట అనడం సబబేనా.. గో.వె : ఎంతమాత్రం కాదు.. ఎన్నో దశాబ్దాల కిందట గురుజాడ రాసిన గేయాలు సాహిత్యానికి వరమాలగా మారాయి. తర్వాత ఎందరో కవులు, కళాకారులు గేయం, జానపదం, పాట అన్నింటిలో సాహిత్యాన్ని చక్కగా ఒదిగిపోయేలా చేశారు. అందరికి అందుబాటులో ఉండేది..ప్రజాసమస్యలను చిత్రించేది కవిత్వమంటే తప్పు లేదని నా భావం. చివరగా సినిమా అయినా.. భావ కవిత్వమైనా దేనిని రచిస్తున్నా వారందరూ ధన్యులే. ఎక్కువ, తక్కువ భేధాలు లేవన్నది అందరూ అంగీకరించాల్సిన విషయం. సాక్షి :సినిమా పాటలు రాయడంలో బాగా బిజీగా ఉన్నారా! వెంకన్న: గతంలో శ్రీరాములయ్య, ఎన్కౌంటర్, నగరంలో నిద్రపోతున్న వేళ తో పాటు పలు సినిమాలకు రాశాను. ఇప్పుడు కూడా రాజ్యాధికారం, కీచక, బంధుకతో పాటు పది సినిమాలకు రాస్తున్నాను. సినిమాకు నా పాట అవసరం ఉందనుకుంటే తప్పకుండా రాస్తాను. -
అతడి కవిత్వం ఉడికిన అన్నానికి మెతుకు వంటిది.
ఉదయమిత్ర 1968 కన్నా ముందే జడ్చర్లలో ‘కొత్త చిగుళ్లు’ వంటి విద్యార్థుల కవితా సంకలనాల వెలువరింత కోసం కృషి చేసిన కవి. భావుకుడు. ఉద్యమ భావుకుడు. ‘కాలిబాట’ పేరుతో తన రెండవ కవితా సంపుటితో ఇప్పుడు మన ముందుకు వస్తున్నాడు. ‘కాలిబాట’ ఒక ప్రతీక. ఒక సంకేతం. అది ఆయన కవిత్వ సారం. ఆయన ప్రాపంచిక దృక్పథ ప్రకటన. ఆయనే చెప్పినట్టు కాలిబాటలు అడవికీ అడవికీ అడవికీ మైదానానికీ గూడేనికి గూడేనికి మధ్య నిలిచే వారధులు పొలాల పాపిటలు పల్లెల ప్రాణ స్నేహితులు అడవి అల్లికలో సైతం దారులు తీసే పురాతన దిక్సూచికలు... కాలిబాటను సామ్రాజ్యవాద ప్రపంచీకరణ కబళిస్తున్న కాలంలో వెలువడుతున్న ఉదయమిత్ర ‘కాలిబాట’ కవిత్వం ఒక ప్రత్యామ్నాయ మార్గం- భావికి బాట. అంతేకాదు, నూరో డిగ్రీ దగ్గర ఉడికిన అన్నానికి మెతుకువంటిది. ఉదయమిత్ర ఇప్పటికే కథలు, నాటికలు, నాటకాలు, కవిత్వం రాసి రచయితగా లబ్ధప్రతిష్టుడు. నిరంతర సాధకుడు. ఎంత భావుకుడో అంత కృషీవలుడు. పట్టణీకరణ ప్రభావం సోకనీయకుండా గ్రామీణ నిసర్గ స్పందనను, సౌందర్యాన్ని రక్షించుకున్నవాడు. ఒక సంఘటనకు, ఒక స్పర్శకు, ఒక శబ్దానికి, ఒక వార్తకు, ఒక మంచి రచనకు స్పందించే సహజమైన పసి మనసును కప్పకుండా కాపాడుకుంటున్నవాడు. ఆయనలో ఎన్ని సందేహాలున్నాయో అన్ని సమాధానా లున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన హృదయం ఉండవలసిన చోట ఉన్నది. ‘కాలిబాట’లోని కవితలన్నీ 1984-2014 మధ్యకాలంలో అంటే ముప్పై ఏళ్ల కాలంలో రాసినవి. ఒక తరం నుంచి మరొక తరానికి అందిస్తున్న కాగడా ఇది. ఇంకా తాను మోస్తూనే అందిస్తున్న జ్వాలాతోరణం. అయితే ఈ ముప్పై ఏళ్లు దేశాన్ని తెలుగు సమాజాన్ని కదిపేసిన దశ అత్యంత విషాదకరమైంది. అత్యంత విప్లవాత్మకమైంది. అత్యంత విధ్వంసానికి గురైంది. కనుక సహజంగానే నీటి లోపలి చేపలు నీళ్లను నిర్మాణంలోకి తెస్తున్న సంఘటనలు, అడవి ఆయుధాలు ధరించిన చెట్లయి కదిలి వస్తున్న కదలికలు, శ్రమైక జీవులు నిర్మిస్తున్న పోరాట సౌందర్యాలు... ఇవన్నీ పాలమూరు నుంచి పాలస్తీనా దాకా విస్తరించిన వైనమే ఈ కవిత్వం. ఇందులో రెండు వందల పేజీలకు డెబ్బై కవితలకు మించి ఉన్నాయి. ఉదయమిత్ర విస్తృతి ఎంత వైవిధ్య భరితమైనదంటే ఆయన దృష్టికి వచ్చే ఏ మూలనో పత్రికలో ఉండే వార్త మొదలు, పుస్తకంలో ఉండే పాత్ర దాకా ప్రతిదీ కవిత్వమవుతుంది. చత్తీస్‌గఢ్ కొండల, అడవుల, నదుల సౌందర్యం గురించి ఎంత తన్మయుడవుతాడో నూతన మానవావిష్కరణ జరుగుతున్న జనతన సర్కార్‌పై గ్రీన్‌హంట్ ఆపరేషన్ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీభత్సమైన దాడి చేస్తూ ప్రజలపై ప్రకటించిన యుద్ధాన్ని అంతగా ప్రతిఘటిస్తాడు. అంతిమంగా చూస్తే ఉదయమిత్ర కవిత్వం ‘రగిలి రగిలి రక్తంలో ముంచి రాసే కవిత్వం’. - వివి -
కేఐబీఎఫ్‌లో ముంబై కవికి ప్రశంసలు
సాక్షి, ముంబై: కేరళలోని కొచ్చిలో నిర్వహించిన ఈశాన్య దక్షిణాది రాష్ట్రాల కవి సమ్మేళనంలో ముంబైకి చెందిన కవి సంగెవేని రవీంద్ర చదివిన కవిత సభికుల ప్రశంసలను అందుకుంది. గత నెల నవంబరు 27నుంచి డిసెంబరు ఎనిమిదవతేదీ వరకు కొనసాగిన ‘18వ కొచ్చి అంతర్జాతీయ పుస్తకోత్సవాల (కేఐబీఎఫ్)’ కార్యక్రమంలో బాగంగా ఈ కవి సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా, ఇందులో తెలుగు కవితలను విన్పించేందుకు ముంబైకి చెందిన అఖిల భారతీయ తెలంగాణ రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి సంగెవేని రవీంద్రతోపాటు వరంగల్‌కు చెందిన రామా చంద్రమౌళి అనే ఇద్దరు తెలుగు కవులకే అవకాశం లభించింది. ఈ సందర్భంగా రవీంద్ర చదివిన ‘ఊరు కవరేజీ ఏరియాలో లేదు’ అనే కవితకు అందరిని ఆకట్టుకుంది. వివిధ భాషలకు చెందిన కవులు తమ కవిత్వాలను వినేందుకు వేదికగా మారిన ఈ కార్యక్రమాన్ని ప్రముఖ మళయాళి రచయిత ఎం కె సాను ప్రారంభించగా మళయాళి సాహిత్య అకాడమీ సలహదారు, సమితి కన్వీనర్ సి రాధాకృష్ణన్ అధ్యక్షత వహించారు. కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి శ్రీనివాసరావు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఎర్నాకులతప్పంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈశాన్య, దక్షిణాధి బాషలకు చెందిన కవులు, రచయితలు బాషాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.