జ్యోత్స్న ఫణిజ... తెలుగమ్మాయి.
ఢిల్లీ... ఏఆర్‌ఎస్‌డీలో అసిస్టెంట్ ప్రోఫెసర్.
దేశవిదేశాల్లో అవార్డులందుకున్న కవయిత్రి
మిస్ కాలేజ్... బెస్ట్ హాఫ్ శారీ విజేత.
ర్యాంప్ వాకరే కాదు... మారథాన్ రన్నర్ కూడా.
కర్ణాటక, హిందుస్థానీ సంగీత గాయని...
చిన్న వయసులో డాక్టరేట్ అందుకున్న చదువరి.
స్క్రైబ్ సహాయంతో పరీక్షలు రాసిన జ్యోత్స్న...
ఆత్మస్థయిర్యం... ఆత్మవిశ్వాసమే నా కళ్లు అంటోంది.
జ్యోత్స్న ఫణిజ సొంతూరు ఆంధ్రప్రదేశ్, కృష్ణాజిల్లా, కైకలూరు. ఆమె పుట్టినప్పుడు ఆమెలోని జన్యు సమస్యను డాక్టర్లు గుర్తించలేకపోయారు. కంటి సమస్య గురించి ఆరు నెలలకు తెలిసింది. మేనరికపు వివాహం కారణంగా ఇలా జరిగిందని, వైద్యచికిత్సలతో ప్రయోజనం లేదన్నారు ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ డాక్టర్‌లు. అమ్మాయి చదువు కోసం నర్సాపురంలో ఉన్న స్పెషల్ స్కూలు గురించి కూడా వాళ్లే చెప్పారు. ఊహ తెలిసినప్పటి నుంచి తన జీవనప్రయాణాన్ని సాక్షితో పంచుకున్నారు జ్యోత్స్న ఫణిజ.
అంతులేని ఆప్యాయత
‘‘నా సమస్య తెలిసిన తరవాత ఇంట్లో అందరూ నా గురించి ప్రత్యేక శ్రద్ధ చూపించారు. నా చదువు కోసం అమ్మమ్మ నర్సాపురంలో ఇల్లు తీసుకుని ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు సంరక్షించింది. అమ్మ సాహిత్యాభిలాష్. నన్ను సాహిత్యానికి దగ్గర చేయడానికి కథలు, హిందీ పాటల క్యాసెట్‌లు తెచ్చేది. నాకు అనేక ప్రదేశాలు తెలియడం కోసం తరచూ టూర్‌లకు తీసుకెళ్లేవారు. వాళ్లు కళ్లతో చూసినవన్నీ పూసగుచ్చినట్లు వివరిస్తుంటే నేను మనోనేత్రంతో చూసేదాన్ని. డిగ్రీ వరకు బ్రెయిలీలో చదివాను. డిగ్రీ విజయవాడలోని మేరిస్ స్టెల్లా కాలేజ్‌లో చదివాను. బ్రెయిలీలో త్వరగా పేజీ నిండిపోతుంది.
లెక్చరర్‌లు నోట్స్ డిక్టేట్ చేసేటప్పుడు నన్ను గమనిస్తూ నాకు పేపర్ మార్చుకునే విరామం ఇచ్చేవారు. పరీక్ష రాయడానికి కొన్నిసార్లు లెక్చరర్‌లే స్క్రైబ్‌గా సహకరించేవారు. ఎగ్జామ్ రాయడానికి నాకు మామూలు వాళ్లకంటే ఎక్కువ సమయం ఇచ్చేవారు. నా పరీక్ష పూర్తయ్యే వరకు నా ఫ్రెండ్స్ నా కోసం వెయిట్ చేసేవాళ్లు. క్లాస్ మేట్స్ నుంచి క్లాస్ లీడర్, లెక్చరర్‌లు, ప్రిన్సిపల్ అందరూ ఆప్యాయంగా చూశారు.
వారందరి సహకారం వల్లే ఇప్పుడు ఈ స్థాయికి చేరగలిగాను. హైదరాబాద్‌లో ఇఫ్లూలో ఎం.ఏ ఇంగ్లిష్ లిటరేచర్, పీహెచ్‌డీ చేశాను. పీజీకి వచ్చిన తర్వాత మొత్తం బ్రెయిలీలో రాయడం కుదరదని టైపింగ్ నేర్చుకున్నాను. దాంతో కంప్యూటర్ ఆపరేట్ చేయడం సులువైంది. చదువుతోపాటు కర్ణాటక, హిందూస్థానీ సంగీతం నేర్చుకుని టీవీ ్రపోగ్రాముల్లో పాటలు పాడాను. కాలేజ్‌లో బ్యూటీ కాంటెస్ట్‌లు, ఫ్యాషన్ ర్యాంప్ వాక్ చేశాను. ఇప్పుడు ఢిల్లీలో కూడా మారథాన్‌లు చేస్తున్నాను. దేనికీ ‘నో’ చెప్పను. అందరూ చర్మచక్షువులతో చూస్తే నేను మనోనేత్రంతో చూస్తాను. రన్‌లో మాత్రం హెల్పర్‌ల సహాయం తీసుకుంటాను.
పాఠాలు... పేపర్‌లు
ఢిల్లీలో ఏఎస్‌ఆర్‌డీ కాలేజ్‌లో ఉద్యోగం వచ్చింది. ఇక్కడ కూడా సహోద్యోగులు, ప్రిన్సిపల్, స్టూడెంట్స్ ఎంతగా స్నేహపూర్వకంగా ఉంటారో చెప్పలేను. పాఠాలు చెప్పడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ స్టూడెంట్స్ పేపర్‌లు దిద్దడంలో మాత్రం మా వారి సహకారం తీసుకుంటాను. రొటేషన్‌లో భాగంగా ఇంగ్లిష్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ బాధ్యతలు వచ్చాయి. అప్పుడు కొలీగ్స్ ‘చేయలేనని చెప్పకు.
అది కెరీర్‌లో పెద్ద అడ్డంకి అవుతుంది. బాధ్యతలు తీసుకో, మేమున్నాం’ అన్నారు. ఆ భరోసాతో అడ్మినిస్ట్రేషన్బాధ్యతలు తీసుకున్నాను. ‘నువ్వు పేరుకి ఉంటే చాలు, పని మేము చేసి పెడతాం’ అన్నారు. కానీ నా మనసే అంగీకరించలేదు. టైమ్‌టేబుల్ సెట్టింగ్ నుంచి స్టూడెంట్స్ ఎన్‌రోల్‌మెంట్ వరకు స్వయంగా చేశాను. పేపర్ వర్క్ అయితే కష్టమయ్యేదేమో, టెక్నాలజీతో అప్‌డేట్ అవుతుంటాను కాబట్టి మొత్తం డిజిటల్‌గానే చేయగలిగాను.
రాష్ట్రపతి పురస్కారం
ఇంగ్లిష్ పాఠాలు చెప్పడం నా వృత్తి అయితే, ఇంగ్లిష్ సాహిత్యం నా ప్రవృత్తి అని చెప్పవచ్చు. తెలుగులో నాకు నచ్చిన సాహిత్యాన్ని ఇంగ్లిష్‌లోకి అనువాదం చేస్తున్నాను. నెల్లూరులో పెన్నా రైటర్స్ అసోసియేషన్‌కు చెందిన ప్రముఖ రచయిత మోపూరు పెంచల నరసింహం గారి ఎర్రదీపం రచనను క్రిమ్‌సన్ ల్యాంప్ పేరుతో, రాతిపాటను స్టోన్‌సాంగ్ పేరుతో అనువదించాను.
వివిధ సామాజికాంశాల మీద జర్నల్స్‌లో 12 వ్యాసాలు రాశాను. రచయితల సదస్సుకు హాజరవుతుంటాను. రచయితల నుంచి ‘దృష్టిలోపం’ అనే ఇతివృత్తం ఆధారంగా రచనలను ఆహ్వనించి ప్రచురించడం, కలకత్తా రైటర్స్ వర్క్‌షాప్‌లో పోయెట్రీ కలెక్షన్‌ను ప్రచురించడంలో కీలకంగా పని చేశాను. డిసెంబర్ మూడవ తేదీ ఇంటర్నేషనల్ డిజేబులిటీ డే సందర్భంగా 2017లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌గారి చేతుల మీదుగా ‘రోల్‌మోడల్’ జాతీయ పురస్కారం అందుకోవడం, ప్రధానమంత్రి నుంచి ప్రశంసాపూర్వకమైన అధికారిక ఉత్తరం అందుకోవడం మాటల్లో చెప్పలేని ఆనందం.
ఏడు కవితలకు అవార్డులు వచ్చాయి. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్, నాటా సభలకు ఆహ్వనం, దర్భంగా, మైథిలీ రీజియన్‌లో కుల అణచివేత, ఆదివాసీ సాహిత్యం, దళితుల సమస్యల మీద రాయడం... వంటివి నేను నా జీవితాన్ని ఆదర్శవంతంగా జీవిస్తున్నాననే సంతోషాన్ని కలిగించిన సందర్భాలు. స్ట్రీట్ చిల్డ్రల్డన్ గురించి రాసిన ‘వీథిచుక్క’ రచనకు తెలుగు వాళ్ల నుంచి అందుకున్న ప్రశంసలకు లెక్కలేదు.
అందమైన కుటుంబం
కుటుంబం విషయానికి వస్తే... డిగ్రీ కాగానే పెళ్లయింది. మా వారు బంధువులబ్బాయే. ఆయనది ఫైనాన్స్ సెక్టార్. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో కాపురం ఉన్నాం. అప్పుడు పీజీ, పీహెచ్‌డీ చేశాను. నాకు ఢిల్లీలో ఉద్యోగం రావడంతో ఇద్దరు పిల్లలతో ఢిల్లీలో ఉంటున్నాం. ఇక్కడకు వచ్చిన తర్వాత ఫ్రెంచ్‌లో అడ్వాన్స్‌డ్ డిప్లమో చేశాను. నిత్యం చదువుతూ, రాస్తూ ఉండడం ఇష్టం. అలాగే పిల్లలకు కథలు చెప్పడం ఇంకా ఇష్టం’’ అన్నారు జ్యోతి ఫణిజ. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment