‘తెలుగువారికి సొంత భాష లేదు. తెలుగు నేలమీద చెలామణిలో వున్న సాహిత్యం తెలుగు కాదు. అది సంస్కృత పురాణేతిహాసాలకు అనువాదమే. లేదా వాటికి అనుకరణే. తెలుగు భాషలో మౌలికమైన రచయితలూ కవులూ లేరు. వెయ్యేళ్ళుగా కవులుగా గుర్తింపు గౌరవం పొందుతున్న కవులెవరూ కవులు కారు. మనకున్నది అనువాదకులూ అనుకర్తలు మాత్రమే. నిజానికి మనం రాసే భాషే తెలుగు కాదు. సంస్కృతం ప్రాకృతం ఉర్దూ ఇంగ్లీషు భాషల ప్రభావానికి లోనై అది సహజత్వాన్ని కోల్పోయింది. అందుకే మన భాషలో డెబ్బై శాతం పరాయి భాషా పదాలే కనిపిస్తాయి.పరాయి భాషా పదాల్ని వాడీ వాడీ చివరికి తెలుగు మాటల్ని మరిచిపోయాం అందువల్ల యెంతో భాషా సంపదని కోల్పోయాం, సొంత సంస్కృతికి దూరమయ్యాం’.
అరవై యేళ్లకి పూర్వం యెంతో ఆవేదనతో యీ అభిప్రాయాలు వ్యక్తం చేసి తెలుగు భాష దుస్థితికి కారణాలు అన్వేషించిన భాషా శాస్త్రవేత్త బంగారయ్య. చావు బతుకుల్లో ఉన్న భాషల జాబితాలో చేరడానికి తెలుగు సిద్ధంగా ఉందని భాషా వేత్తలు ఇప్పుడు హెచ్చరిస్తున్నారు గానీ ఈ వినాశనానికి బీజాలు వేసినవాడు వాగనుశాసన బిరుదాంకితుడు నన్నయేనని కుండ బద్దలు కొట్టినవాడు బంగారయ్య. వాడుకలో వున్న తెలుగును కాదని భారతానువాదాన్ని డుమువులు చేర్చిన సంస్కృత పదాలతో నింపి పెట్టిన నన్నయ ఆదికవి కాదు తొలి వెన్నుపోటుగాడని ఆయన తీర్మానించాడు. గాసట బీసటగా వున్న తెలుగుని నన్నయ ఉద్ధరించాడు అని చెబుతారుగానీ నిజానికి సంస్కృతంతో కలగాపులగం చేసి భాషని భ్రష్టు పట్టించాడనీ వందల యేళ్ళు అదే కొనసాగిందనీ మనవి కాని ఇతివృత్తాల్నీ మనవి కాని ఛందో రీతుల్నీ స్వీకరించడం వల్ల పరాయి భాషకి దాస్యం చేయడం వల్ల తెలుగు జాతి ఉనికే ప్రశ్నార్థకమైందనీ భాషమీద అలవికాని ప్రేమతో తెలుగు నానుడి కూటమి స్థాపించి తెలుగా ఆంధ్రమా?, నుడి–నానుడి వంటి గ్రంథాల ద్వారా ప్రచారం చేసిన బంగారయ్య అసలు పేరు సత్యానందం. సొంత పేరులో సంస్కృతం ఉందని బంగారయ్యగా మారాడు. ‘కాలా’ సినిమాలో పా. రంజిత్ ప్రతిపాదించిన వర్ణ సిద్ధాంతాన్ని అప్పుడే (1965) ‘నలుపుచేసిన నేరమేమిటి?’ అన్న గ్రంథం ద్వారా ప్రచారం చేశాడు. చనిపోడానికి (1992) కొద్ది కాలం ముందు దళిత అస్తిత్వానికి సంబంధించి అనేక మౌలికమైన ఆలోచనల్ని (chduled castes stabbed, Schduled castes: search for Identity) గ్రంథ రూపంలో ప్రకటించాడు. ఇన్ని చేసీ అనామకంగా అజ్ఞాతంగా ఉండిపోయిన భాషా తాత్వికుడు బంగారయ్య.
బంగారయ్య గొప్ప విద్యావేత్త. ప్రజా సమూహాల ఉచ్చారణని ప్రామాణికంగా తీసుకొని సంస్కృ త వర్ణాలు వదిలేస్తే తెలుగు అక్షరమాల సగానికి సగం తగ్గి అమ్మ నుడి నేర్చుకునే పసి పిల్లల మీద భారం తగ్గుతుందని భావించాడు. అందుకు అనుగుణంగా వ్యాకరణం, నుడిగంటులు (నిఘంటువులు) నిర్మించుకొనే పద్ధతులు బోధించాడు. పిల్లలకు వాచక పుస్తకాలు ఎలా ఉండాలో నిర్దేశించాడు. భిన్న ప్రాంతాల మాండలికాలని కలుపుకుంటూ పోయినప్పుడే భాష పెంపొందుతుందని గ్రహించాడు. అరువు తెచ్చుకోకుండా అవసరానుగుణంగా కొత్త పదబంధాలను సొంత భాషలోనే నిర్మించుకోవచ్చని స్వయంగా ఎన్నో పదాల్ని పుట్టించి నిరూపించాడు. వస్తు రూపాల్లో తెలుగుదనం చిప్పిల్లే మూల రచనల కోసం పరితపించాడు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఆజీవితం కృషి చేశాడు. కానీ ఆధిపత్య కులాల వర్గాల భాషా రాజకీయాల కారణంగా ఆయనకు రావలసిన గుర్తింపు రాలేదు. అయితే బంగారయ్య తెలుగు భాష పెంపుదల గురించి రచించిన గ్రంథాల్ని, చేసిన సూచనల్ని జయధీర్ తిరుమలరావు ‘నడుస్తున్న చరిత్ర’ పత్రికా ముఖంగా ప్రకటించడంతో భాషోద్యమకారుల్లో చలనం వచ్చింది. స.వెం. రమేశ్ వంటి రచయితలు అచ్చమైన తెలుగులో కథలు రాసి (కతల గంప) యితర భాషా పదాలు లేకుండా పాపులర్ రచనలకు పాఠకుల మన్నన పొందవచ్చని నిరూపించాడు. హోసూరు మొరసునాడు మొ‘‘ ప్రాంతాల యువ రచయితలు దాన్ని అందిపుచ్చుకున్నారు.
కానీ బంగారయ్య నిరసించిన పరభాషా దాస్యం ఇప్పుడు చుక్కలనంటింది. పాలకులు ఒంట బట్టించుకున్న రాజకీయ ఆర్ధిక బానిసత్వం భాషకు సోకింది. ఒకప్పుడు సంస్కృతానికి తలవొగ్గాం, ఇప్పుడు ఇంగ్లిష్‌కి ఊడిగం చేస్తున్నాం. రెండు రాష్ట్రాల్లో ఏలికల చలవ వల్ల తెలుగు మీడియం స్కూళ్ళు మూతబడుతున్నాయి. తెలుగు మాధ్యమంలో బోధనకి కాలం చెల్లిందని చెప్పి ప్రాథమిక స్థాయి నుంచే తెలుగుని ఒక సబ్జెక్టుగా కుదించేసి భాషని ఉద్ధరిస్తున్నామని పాలకులు బుకాయిస్తున్నారు. తెలుగులో చదివితే పనికి రాకుండా పోతామని బెదిరిస్తున్నారు. ఉద్యోగాల పోటీలో నిలవాలంటే ఇంగ్లిష్ మీడియంలోనే చదవాలని ఊదరగొడుతున్నారు. తల్లిభాషను కాపాడుకోవాల్సిన ఇటువంటి తరుణంలో ‘వాగరి’ బంగారయ్య ప్రతిపాదించిన భాషా వాదాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అమ్మ నుడిని నానుడిని రక్షించుకోలేని జాతికి మనుగడ లేదు.
ప్రతులకు: అన్ని పుస్తక దుకాణాల్లో లభ్యం
(నేడు హైదరాబాదులో ఇందిరాపార్కు సమీపంలోని ఆర్ట్స్ అండ్ లెటర్స్ సమావేశ మందిరంలో బంగారయ్య రచించిన నుడి–నానుడి గ్రంథావిష్కరణ)
ఎ.కె. ప్రభాకర్ ‘ మొబైల్ : 76800 55766
Published Sun, Jul 29 2018 1:31 AM | Last Updated on Sun, Jul 29 2018 1:31 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment