Telugu poet
-
Vemana: లోకకవి మన వేమన!
వానకు తడవని వారూ, ఒక్క వేమన పద్యం కూడా వినని తెలుగువారూ ఉండరని లోకోక్తి. అలతి పదాలతో సమాజంలోని రుగ్మతలను తూర్పార బట్టిన మనో వైజ్ఞానికుడు వేమన. సమకాలీన వ్యవస్థలపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన సంఘసంస్కర్త, విప్లవకారుడు వేమన. 1839లో తొలిసారిగా బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు పుస్తక రూపంలో వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత అనేకమంది ఆయనపై పరిశోధన చేశారు. ప్రముఖ పాత్రికేయులు నార్ల వెంకటేశ్వరరావు కేంద్ర సాహిత్య అకాడమీ వారి సహకారంతో వేమన జీవిత చరిత్రను 14 భాషలలోకి అనువదించడానికి కారకులయ్యారు. ఆంగ్ల, ఐరోపా భాషల్లోకీ; అన్ని ద్రవిడ భాషల్లోకీ వేమన పద్యాలు అనువాదమయ్యాయి. సి.ఇ. గోవర్ వంటి ఆంగ్ల సాహితీవేత్తలు వేమన సాహిత్యానికి ముగ్ధులై ఆయనను లోక కవిగా కీర్తించారు. వేమన 1602–1730 మధ్య కాలానికి చెందిన వాడనీ కొండవీటి రెడ్డి రాజవంశానికి చెందిన వాడనీ అంటారు. జనబాహుళ్యంలో ఉన్న వివరాల ప్రకారం, వేమన అసలు పేరు బెధమ కోమటి చినవేమారెడ్డి. ఈయన అన్న పేరు బెధమ కోమటి పెదవేమారెడ్డి. వేమన జన్మించిన ప్రాంతంపై అనేక రకాల అభిప్రాయాలు ఉన్నప్పటికీ చివ రిగా ఆయన అనంతపురం జిల్లా కదిరి సమీపంలో ఉన్న కటారు పల్లె ప్రాంతానికి చెందిన వారని నిర్ధారించారు. అందుకే ఆ ప్రాంతంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా వేమన జయంతి ఉత్సవాలను జరపడానికి నిర్ణయించుకుంది. వేమన భోగలాలసుడుగా తిరుగుతూ ఒకానొక దశకు వచ్చేటప్పటికి ఓ సాధువు ద్వారా ఆత్మ జ్ఞానం పొంది అన్నింటినీ త్యజించి యోగిలా మారిపోయాడని అంటారు. సంసార బాధలనుండి ఉపశమనం పొందడానికి తనను ఆశ్రయించే అభాగ్యులకు తన పద్యాల ద్వారా తత్వాన్ని బోధించడం మొదలు పెట్టాడు. తన మాటల ద్వారా తనలో జ్ఞానజ్యోతిని మొట్ట మొదటగా వెలిగించిన తన ప్రేయసి విశ్వద పేరును, తనకు కష్ట కాలంలో అండగా నిలిచిన మిత్రుడు అభిరాముడి పేరును తన పద్యాలకు మకుటంలో చేర్చి వారికి శాశ్వత కీర్తిని ప్రసాదించాడు వేమన అనేది కొందరి అభిప్రాయం. అయితే అసలు ఇవన్నీ కూడా ప్రక్షిప్తాలనీ... వేమన చిన్న నాటి నుంచే జ్ఞానశీలి అనీ, తదనంతరం స్నేహితుల ప్రభావంవల్ల దారితప్పి, ఆపై పరివర్తన వచ్చి యోగిగా మారాడనీ అంటారు. ఆయన పద్యమకుటానికి ‘సృష్టి కర్తకు ప్రియమైన వేమా వినుము’ అని పండితులు మరో అర్థాన్ని చెప్పారు. బ్రౌన్ ఈ అర్థాన్నే తీసుకొని వేమన పద్యాలను ఇంగ్లిష్‌లోకి అనువదించారు. వేమన పద్యాలలో ఎక్కువగా లోక నీతులు, సామాజిక రీతులు, సామాజిక చైతన్యానికి సంబంధించిన అంశాలే ఎక్కువగా ఉంటాయి. ఆయన కవిత్వంలో స్పృశించని అంశమే లేదు. కుటుంబ వ్యవస్థలోని లోటుపాట్లు; మతం పేరిట జరుగుతున్న అరాచకాలు, దోపిడీలు, విగ్రహారాధనలోని మౌఢ్యం, కుహనా గురువులు, దొంగ సన్యాసులు... ఒకటే మిటి? కనిపించిన ప్రతి సామాజిక రుగ్మత మీద వేమన తనకలం ఝుళిపించాడు. సామాన్య నీతులను ప్రజల హృదయాలకు హత్తుకునేట్లు వారికి పరిచితమైన భాషలో స్పష్టమైన రీతిలో సూటిగా, తేటగా శక్తిమంతంగా వ్యక్తీకరించారు. వేమన పద్యా లన్నీ ఆటవెలది చందస్సులోనే చెప్పాడు. కవిత్రయం అంటే తిక్కన, వేమన, గుర జాడ అంటాడు శ్రీశ్రీ. ‘వేమన కవిత్వం గాయానికి మందు రాసినట్లు కాక, ఆ గాయం చేసిన కత్తికే ముందు మందు పూసినట్లుంటుంది’ అంటారు రాళ్ల పల్లి అనంత కృష్ణ శర్మ. తన పద్యాలలో సామ్యవాద సిద్ధాంతాన్ని ఎప్పుడో ఎలిగెత్తి చాటిన సామ్యవాద ప్రజా కవి వేమన. (క్లిక్ చేయండి: ఆటవెలది ఈటెగా విసిరిన దిట్ట.. ఛాందస భావాలకు తొలి అడ్డుకట్ట) - పి. విజయబాబు అధికార భాషా సంఘం అధ్యక్షులు, ఏపీ (జనవరి 19 వేమన జయంతి ఉత్సవాల సందర్భంగా) -
Vemana: ఆటవెలది ఈటెగా విసిరిన దిట్ట.. ఛాందస భావాలకు తొలి అడ్డుకట్ట
‘విశ్వదాభిరామ వినుర వేమ’ అనే మాట వినని తెలుగువారు ఉండరు. వానకు తడవనివారు, ఒక వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. అంత ప్రఖ్యాతి గాంచిన మహాకవి యోగి వేమనకు సొంత రాష్ట్రంలో తగిన గౌరవం దక్కటం లేదనే భావన ఇక తొలగిపోనుంది. యోగి వేమన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ఏటా జనవరి 19న అధికారికంగా జరపనుంది. ఈ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 164 జీవోను గత నెల 30న విడుదల చేసింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గల వేమన అభిమానులు ఆనందించే విషయమిది. – గుంటూరు డెస్క్ తెలుగువారికి ఎంతో సారస్వత సేవ చేసిన బ్రిటిష్ అధికారి సీపీ బ్రౌన్తోనే వేమన పద్యాలు వెలుగులోకి వచ్చాయి. పామరులకు కూడా అర్థమయేలా పద్యాలు చెప్పి, మెప్పించిన కవి వేమన. ఆటవెలదిలో అద్భుతమైన కవిత్వం, అనంత విలువలు గల సలహాలు, సూచనలు, తెలుగు సంగతులు ఇమిడ్చిన మహానుభావుడు వేమన. యవ్వనంలో వేశ్యాలోలుడిగా వ్యవహరించినా, కొంతకాలానికి విరక్తి చెంది, తపస్సు చేసి యోగిగా మారారు. సమాజానికి హితబోధ చేస్తూ వేలాది పద్యాలు చెప్పారు. చివరకు కడప దగ్గరి పామూరు కొండ గుహలో శార్వరి నామ సంవత్సరం శ్రీరామనవమి నాడు సమాధి చెందారు. కదిరి తాలూకాలోని కటారుపల్లెలోని వేమన సమాధి ప్రసిద్ధి చెందినది. వేమన జీవితకాలం 1652–1730గా పరిశోధకులు పేర్కొన్నారు. సామాజిక చైతన్య గీతాలు ఆ పద్యాలు... వేమన పద్యాలు లోక నీతులు. పద్యాలన్నిటినీ ఆటవెలది చంధస్సులోనే చెప్పాడు. సామాజిక చైతన్యం ఆ పద్యాల లక్షణం. సమాజంలో ఆయన సృజించని అంశం లేదు. అన్ని సమస్యలను భిన్న కోణాల్లోంచి దర్శించి, ఆ దర్శన వైశిష్ట్యాన్ని తన పద్యాలలో ప్రదర్శించారు. కుటుంబ వ్యవస్థలోని లోటుపాట్లు, మతం పేరిట దోపిడీలను ఎలుగెత్తటమే కాకుండా విగ్రహారాధనను నిరసించారు. కుహనా గురువులు, దొంగ సన్యాసుల దోపిడీలు...ఒకటేమిటి? ప్రతి సామాజిక అస్తవ్యస్తతపైన తన కలాన్ని ఝళిపించారాయన. ఎంతో లోతైన భావాన్ని కూడా సరళమైన భాషలో చక్కటి ఉదాహరణలతో హృదయానికి హత్తుకునేలా చెప్పాడు. సాధారణంగా మొదటి రెండు పాదాల్లోనూ నీతిని ప్రతిపాదించి మూడో పాదంలో దానికి తగిన సామ్యం చూపాడు. ‘అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను/సజ్జనుండు పలుకు చల్లగాను/కంచుమ్రోగినట్లు కనకంబు మ్రోగునా/ విశ్వదాభిరామ వినుర వేమ’ అని చాటారు. మరో పద్యంలో ‘విద్యలేనివాడు విద్వాంసు చేరువ/నుండగానె పండింతుండు కాడు/కొలది హంసల కడ కొక్కెరలున్నట్లు/ విశ్వదాభి రామ వినుర వేమ!’అన్నారు. కొన్ని పద్యాల్లో ముందే సామ్యం చెప్పి, తర్వాత నీతిని చెప్పాడు. అందుకు ‘అనగననగరాగ మతిశయించునుండు/తినగ తినగ వేము తియ్యనుండు/ సాధనమున పనులు సమకూరు ధరలోన/విశ్వదాభిరామ వినుర వేమ’ ఉదాహరణ. పద్యంలో నాలుగో పాదం ‘విశ్వదాభిరామ వినుర వేమ’ అనే మకుటం. విశ్వద అంటే విశ్వకారకుడికి, అభిరామ అంటే ప్రియమైన వాడని, అంటే సృష్టికర్తకు ప్రియమైన వేమా, వినుము–అని ఈ మకుటానికి అర్థం చెప్పారు పండితులు. బ్రౌను మహాశయుడు ఇదే అర్థంతో వేమన పద్యాలను ఇంగ్లిష్‌లోకి అనువదించారు. వేమన కీర్తిని అజరామరం చేశారు... తెలుగువారిలో వేమన కీర్తిని అజరామరం చేయటానికి కృషి చేసినవారు కట్టమంచి రామలింగారెడ్డి. రాష్ట్రంలో పలుచోట్ల వేమన జయంతి ఉత్సవాలు, సంఘాల ఏర్పాటును సాధించారు. కొమర్రాజు వేంకట లక్ష్మణరావు, వేటూరి ప్రభాకరశాస్త్రి వేమనను సంస్కర్తగా ప్రస్తుతించారు. ఆరుద్ర ‘మన వేమన’ పుస్తకాన్ని రచించారు. డాక్టర్ ఎన్.గోపి, బంగోరె వంటి కవులు, రచయితలు వేమన రచనలపై పరిశోధనలు చేశారు. ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావుచే కేంద్ర సాహిత్య అకాడమీ వేమన జీవిత చరిత్రను రాయించి 14 భాషల్లోకి అనువదింపజేసింది. ఆంగ్ల, ఐరోపా భాషలన్నింటిలోకి, అన్ని ద్రావిడ భాషల్లోకి వేమన పద్యాలు అనువాదమయ్యాయి. వేమనకు లభించిన గౌరవం మరే తెలుగు కవికీ లభించలేదు. ఐక్యరాజ్యసమితి–యునెస్కో విభాగం, ప్రపంచ భాషా కవుల్లో గొప్పవారిని ఎంపిక చేసే సందర్భంలో వేమనను ఎన్నుకుని, ఆ రచనలను పలు భాషల్లోకి అనువదింపజేశారు. వేమన జీవిచరిత్ర, యోగి వేమన (1947), యోగి వేమన (1988), శ్రీవేమన చరిత్ర (1986) పేర్లతో సినిమాలుగా ప్రజలను ఆలరించాయి. పౌరాణిక నటుడు గుమ్మడి గోపాలకృష్ణ రూపొందించిన ‘యోగి వేమన’ సీరియల్ టీవీ ఛానల్లో ప్రసారమైంది. ఇంతటి కీర్తిని పొందిన వేమన జయంతికి పొరుగునున్న కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏటా తగిన నిధులను కేటాయిస్తూ, తాలూకా, జిల్లా, రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తోంది. మైసూర్ మహారాజ సంస్థాన్ ఏనాడో వేమన ప్రాశస్త్యాన్ని గుర్తించింది. తెలుగు రాష్ట్రాల్లో వేమనకు, ఆయన సాహిత్యానికి తగిన ప్రచారం, గౌరవాన్ని కల్పించటం లేదనేది నిష్ఠురసత్యం. దీనిని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై 1929 నుంచి వేమన జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న తెనాలి సమీపంలోని మోదుకూరు గ్రామంలోని వేమన జయంతి ఉత్సవ కమిటీ హర్షం తెలియజేసింది. నాడే సాహసోపేత హేతువాది... ఆ కాలం పరిస్థితుల ప్రకారం వేమనను గొప్ప హేతువాదిగా ప్రశసించింది సాహితీలోకం. సమాజంలో ప్రబలంగా పాతుకుపోయిన ఆచారాలు, మూఢనమ్మకాలను ఆ రోజుల్లో అంత నిశితంగా ఎత్తిచూపటానికి ఎంతటి ఆత్మస్థైర్యం, అవగాహన కావాలి. విగ్రహారాధనను విమర్శిస్తూ...‘పలుగు రాళ్లు దెచ్చి/ పరగ గుడులు కట్టి/ చెలగి శిలల సేవ జేయనేల?/ శిలల సేవ జేయ ఫలమేమి కలుగురా?’అని ప్రశ్నించారు. కుల విచక్షణలోని డొల్లతనం గురించి... ‘మాలవానినంటి/ మరి నీట మునిగితే/ కాటికేగునపుడు కాల్చు మాల/ అప్పుడంటినంటు ఇప్పుడెందేగెనో?...’ అనడిగారు. వేమన పద్యాలు వందల సంవత్సరాల వరకు గ్రంథస్థం కాలేదు. కేవలం సామాన్యుల నాల్కలపైనే నడయాడుతూ వచ్చాయి. 1731లో ఫాదర్ లెగాక్ తొలిసారిగా వేమన పద్యాలు సేకరించాడని పరిశోధకుల భావన. 1816లో ఒక ఫ్రెంచి మిషనరీ, తర్వాత ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్‌లు వేమన పద్యాలెన్నింటినో సేకరించారు. తాను వేమనను కనుగొన్నాని బ్రౌన్ సాధికారికంగా ప్రకటించుకొన్నారు. వందలాది పద్యాలను సేకరించి వాటిని లాటిన్, ఇంగ్లిష్ భాషల్లోకి అనువదించారు. అలాగే హెన్నీ బ్లూచాంస్ (1897), విలియమ్ హోవర్డ్ కాంబెల్ (1920), జీయూ పోప్, సీఈ గోవర్ వంటి ఆంగ్ల సాహితీవేత్తలు, వేమనను లోకకవిగా కీర్తించారు. మహాకవి పేరిట విశ్వవిద్యాలయం.. ఆ మహాకవి పేరిట దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కడప జిల్లాలో యోగి వేమన విశ్వవిద్యాలయాన్ని నిర్మించి అనేక కోర్సులతో విద్యను అందించడంతోపాటు వేమన జీవితం మరుగున పడకుండా భావితరాలకు అందించడం గమనార్హం. -
మరపురాని కవిసమ్మేళనం.. అయిదారు సార్లు ‘వహ్వా వహ్వాలు’
జనవరి 9, 10 తేదీల్లో ఢిల్లీలో జరిగిన సర్వభాషా కవిసమ్మేళనానికి హాజరు కావటం జీవితంలో మరచిపోలేని జ్ఞాపకం. ఏటా ఆలిండియా రేడియో – భారత ప్రభుత్వం గుర్తింపు పొందిన 22 భాషల నుంచి 23 మందిని (ఒక్క హిందీ భాష నుంచి మాత్రం ఇద్దరు) సెలెక్ట్ చేసి, ఏదో ఒక నగరంలో ఈ సమ్మేళనం ఏర్పాటు చేస్తుంది. ఈ సంవత్సరం ఢిల్లీలో నిర్వహించిన సర్వభాషా కవిసమ్మేళనానికి తెలుగు భాష నుంచి నా కవిత ‘అమృతోపనిషత్’ ఎన్నికైంది. మొదటిరోజు (9వ తేదీ) ఢిల్లీ ఆకాశవాణి సమావేశ మందిరంలో రిహార్సల్స్ చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రసారభారతి ఉన్నతాధికారులు హాజరై ప్రతి కవినీ జ్ఞాపిక, శాలువాలతో సగౌరవంగా సత్కరించారు. రెండోరోజు (10వ తేదీ) తొలుత మూలభాషలో కవిత చదివించి, వెంటనే హిందీ అనువాదం వినిపించారు. ప్రతి కవినీ ఆహ్వానించే ముందు ఆ కవి గురించి హిందీలో పరిచయం చేశారు. నేను సాహిత్యంలో చేసిన కృషి, ప్రచురించిన పుస్తకాలు, చేస్తున్న ఉద్యోగంతో పాటు... మా నాన్న స్మృత్యర్థం స్థాపించిన ‘మువ్వా చినబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్’ తరఫున నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల గురించి కూడా యాంకర్ స్వచ్ఛమైన హిందీలో చెప్పి నప్పుడు నా భావోద్వేగం తారస్థాయికి చేరుకుంది. ఆ పెద్ద హాలులో తెలుగు తెలిసిన ఒక్కరూ లేకపోయినా, నా మట్టుకు నేను సీరియస్‌గా కవితను (ఆలిండియా రేడియో రికార్డింగ్ కోసం) చదివాను. ఆ తర్వాత డాక్టర్ పుష్పాసింగ్ నా కవితకు హిందీ అనువాదం చదివినప్పుడు, మంచి స్పందన వచ్చింది. అయిదారు సార్లు ‘వహ్వా వహ్వాలు’ సభలో సందడి చేశాయి. ఆమె మంచి ఫ్రెండ్ అయ్యారు. ఈ అరుదైన సందర్భంలో అన్ని రాష్ట్రాల కవులతో పాటు ప్రత్యేకించి గోవా, ఈశాన్య రాష్ట్రాల ప్రతినిధులను కలవటం ప్రత్యేక అనుభూతి. వారి అనుభవాల్ని గ్రహించటం సాహిత్యంలో సరికొత్త పాఠాలు నేర్చుకోవటమే. పంజాబీ కవి గురుతేజ్తో ఎక్కువ సమయం వెచ్చించే అవకాశం దొరికింది. ఇండో–పాక్ బోర్డర్లో ఓ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న సింగ్ అనేక విషయాలు నాతో పంచుకున్నారు. కశ్మీరీ కవి డాక్టర్ గులామ్ నబీ హలీమ్ చలాకీగా తిరుగుతూ అందరినీ అల్లుకుపోయాడు. ఈ ఇద్దరూ నా ఇతర కవితల ఆంగ్లానువాదాలు తమకు పంపమని, వాటిని తమ భాషల్లోకి తర్జుమా చేస్తామని అడిగారు. నేను వేదిక దిగగానే ఢిల్లీకి చెందిన మరో ముగ్గురు మహిళలు కూడా ఇదే అభ్యర్థన చేశారు. ఇవి నాకు సరికొత్త ద్వారాలు. నా రూమ్మేట్ అయిన మరాఠీ కవి అనిల్ సబాలే, పక్క గదిలో దిగిన సంథాలీ కవి గౌరు ముర్ము, పోలీస్ డిపార్ట్మెంటులో పనిచేసే మణిపురి కవి క్షేత్రి రాజన్ తదితరులతో ఎక్కువగా చర్చించే అవకాశం దొరికింది. నా సాహిత్యపు డైరీలో కొత్త మిత్రులు చేరారు. నా కవిత 21 భాషల్లోకి తర్జుమా అవుతుందన్న సంతోషం మరింత కిక్కిచ్చే అంశం. ఈ సర్వ భాషా కవిసమ్మేళనం జనవరి 25వ తేదీ రాత్రి 10 గంటలకు అన్ని రేడియో స్టేషన్ల నుంచి ప్రసారమవుతుంది. (క్లిక్ చేయండి: ప్రెస్ – పిక్చర్ – ప్లాట్‌ఫాం!) – ఎమ్వీ రామిరెడ్డి, రచయిత -
Pingali Lakshmikantham: ఆయన జయంతి, వర్ధంతి.. ఒకేరోజు
ఆధునికాంధ్ర సాహిత్యంలో సుప్రసిద్ధ కవి, ఆచార్యుడు, నటుడు, విమర్శకుడు, ఆకాశవాణి కార్యక్రమాల సలహాదారు ఆయన. అష్టదిగ్గజ కవుల్లో పింగళి సూరన వంశానికి చెందిన పింగళి లక్ష్మీకాంతం బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన 1894 జనవరి 10వ తేదీన కృష్ణాజిల్లా అర్తమూరులో జన్మించారు. పాఠశాల విద్య మచిలీపట్నం హిందూ ఉన్నత పాఠశాలలో అభ్యసించారు. అప్పుడు చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి అక్కడ తెలుగు పండితుడుగా ఉన్నారు. పింగళి, విశ్వనాథ వంటి వారంతా చెళ్లపిళ్ల వారి శిష్యులే. బందర్ నోబుల్ హైస్కూల్లో తెలుగు పండితుడిగా పింగళి కొన్నాళ్లు పనిచేశారు. తర్వాత మద్రాస్ ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీలో పరిశోధకుడిగా పనిచేశారు. 1931లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీఏ ఆనర్స్ కోర్సు ప్రారంభించి పాఠ్య ప్రణాళికను రూపొందించారు. అన్ని విశ్వవిద్యాలయాలకు అదే ప్రామాణికమైన పాఠ్యప్రణాళిక. ఆయన ప్రియమిత్రుడు, సహాధ్యాయి కాటూరి వెంకటేశ్వరరావుతో కలసి తొలి రోజుల్లో శతావధానాలు చేశారు. ఇద్దరూ జంట కవులుగా రచించిన ‘సౌందర నందం’ కావ్యాన్ని తమ గురు వైన చెళ్లపిళ్ల వేంకట శాస్త్రికి అంకితం ఇచ్చారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ ఆచార్యుడిగా 1961–65 మధ్య పని చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 18 సంవత్సరాలు పనిచేసి 1949లో పదవీ విర మణ చేశారు. ఆయన బోధనల నోట్సులు ఆంధ్ర సాహిత్య చరిత్ర, విమర్శకు ప్రామాణి కాలు. తర్వాత వాటిని ఆంధ్ర సాహిత్య చరిత్ర, సాహిత్య శిల్ప సమీక్షలుగా ఆయనే ప్రచురించారు. అవి ఎంతో ప్రసిద్ధి పొందాయి. ఆయన రూపొందించిన సంస్కృత ‘కుమార వ్యాకరణం’ ఎన్నో విశ్వవిద్యాలయాల్లో పాఠ్య గ్రంథంగా ఉంది. ఆయన రేడియో ప్రసంగాలు, గౌతమ వ్యాసాలు విమ ర్శకు నిలువెత్తు నిదర్శనాలు. ఆయన రచించిన మధుర పండితరాజం, గంగాలహరి, తేజోలహరి ప్రసిద్ధి పొందాయి. ఆయన గౌతమ నిఘంటువు (ఇంగ్లీషు–తెలుగు) ప్రామాణికమైంది. పింగళి 1954 నుండి 1961వరకు విజయవాడ ఆకాశవాణి కేంద్రం సలహాదారుడిగా గొప్ప కార్యక్రమాలు రూపొందించారు. నటుడిగా పాండవోద్యగ విజయాల్లో ధర్మరాజుగా, ముద్రారాక్షసం నాటకంలో రాక్షస మంత్రిగా ప్రేక్షకుల మన్ననలు పొందారు. పింగళివారు 1972 జనవరి 10 తేదీన పరమదించారు. సాహితీ ప్రియుల హృదయాల్లో ఆయన చిరస్మర ణీయులు. – డాక్టర్ పీవీ సుబ్బారావు, సాహితీ విమర్శకులు (జనవరి 10 పింగళి లక్ష్మీకాంతం జయంతి, వర్ధంతి) -
Vemana: వేమనకు కొండంత వెలుగు
వేమన పద్యం ఒకటైనా రాని తెలుగువారు ఉండరు. తెలుగు జాతి ఉన్నంతకాలం వేమన పద్యాలు ప్రజల నాలుకలపై నిలిచే ఉంటాయి. తెలుగు నేలపై నడయాడిన వేమన తెలుగు సాహిత్యానికి ఒక కొండగుర్తుగా నిలుస్తారు. భాషలో, భావంలో ప్రజలకు సాహిత్యాన్ని చేరువ చేసిన ఘనత వేమనది. సమాజంలోని అన్ని అసమానతలు పోయి మనుషులు మానవీయంగా ఎదగాలని వేమన కోరు కున్నారు. ఉన్న స్థితి నుండి సమాజం మరో అడుగు ముందుకు సాగాలని తపించారు. ఆటవెలదులనే ఈటెలతో సమాజ సంస్కరణకు పూనుకొన్నారు. ఆ తర్వాత అనేక తరాల కవులకు మార్గ దర్శకంగా నిలిచారు. దేశ విదేశాల పండితులను సైతం వేమన పద్యాలు ఆకర్షించాయి. పాశ్చాత్య భాషలలోనూ అనువాదమయ్యాయి. తెలుగు సమాజానికి వెలుగులు నింపిన వేమనకు కొండంత వెలుగును ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 19న వేమన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్ణయించింది. డిసెంబర్ 30న ఈ విషయమై జీఓ 164ను విడుదల చేసింది. కర్ణాటక ప్రాంతంలో తెలుగువారు స్వచ్ఛందంగా వేమన జయంతిని జరుపుకొనే సంప్రదాయం ఉంది. వందేళ్ళ నాడే కట్టమంచి రామలింగారెడ్డి తదితరుల ప్రోత్సాహం కూడా అందులో ఉంది. ప్రజల ఆకాంక్ష లను గుర్తించి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 2017 డిసెంబర్ 22న వేమన జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. తాలుకా స్థాయిలో రూ. 25,000, జిల్లా స్థాయిలో 50,000, రాష్ట్ర స్థాయిలో రూ.10 లక్షలు... మొత్తం అరవై తొమ్మిదిలక్షల రూపాయలు ప్రతి ఏడాదీ కేటాయిస్తోంది. అన్ని ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా ఇందులో భాగస్వామ్యం అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ధార్వాడ విశ్వ విద్యాలయంలో 1980లలోనే ‘వేమన పీఠం’ ఏర్పాటు చేసిన విషయం కూడా గమనించాలి. ఆంధ్రప్రదేశ్‌లోనూ సాంస్కృతిక శాఖ వేమన జయంతిని కర్ణాటక రాష్ట్రంలో లాగా నిర్వహించాలని 2018 లోనే వేమన సంఘాలు, అభిమానులు కోరడమైంది. అప్పటి మంత్రులు, అధికారులకు వినతిపత్రాలు ఇవ్వడమయింది. వేమన సమాధి ప్రాంతమైన కటారుపల్లి గ్రామం సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ఉంది. స్థానికుల ఒత్తిడితో అప్పటి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ భాష వేమన జయంతి విషయమై 10 సెప్టెంబరు 2019న అసెంబ్లీలో ప్రశ్నించారు. కనీస చర్చ కూడా జరగడానికి సభాపతి అవకాశం ఇవ్వలేదు. సాంస్కృతిక శాఖ కోట్లకు కోట్లు వేరు వేరు సాహిత్య, సాంస్కృతిక ప్రచార కార్యక్రమాలు ఆ రోజులలో చేసింది. అనేకమంది కవుల కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించింది. వేమనపై కనీసం ఒక సదస్సు నిర్వహించమని కోరినా పట్టించుకోలేదు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే సాంస్కృతిక శాఖ పక్షాన వేమన జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ముందుకు రావాలని వేమన సంఘాలు కోరుతూ వచ్చాయి. 2019 నుండి ఈ ప్రక్రియ మొదలై నేడు అది సాకార మైంది. వేమన రాష్ట్ర స్థాయి పండుగ నిర్వహించబోతున్న ఈ సందర్భంలో ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాం. సత్యసాయి జిల్లా, కదిరి నియోజకవర్గంలోని కటారుపల్లి గ్రామంలోని వేమన సమాధి ప్రాంతంలో ప్రారంభ రాష్ట్రస్థాయి కార్యక్రమం నిర్వహించాలి. రాష్ట్రంలోని వివిధ జోన్లలో ఒకో సంవత్సరం ఒకోచోట కార్యక్రమం ఉండేలా చేయాలి. జిల్లా, నియోజక వర్గ, మండల, గ్రామ స్థాయి వరకూ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో 19న కార్యక్రమాలు చేయాలి. విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలలో ప్రత్యేకంగా వేమన పద్యపోటీలు, సదస్సులు నిర్వహించాలి. మాజీ డీజీపీ పర్యాటకశాఖ సంస్థ ఛైర్మన్ చెన్నూరు అంజనేయరెడ్డి 2003లో ప్రత్యేక శ్రద్ధతో కటారుపల్లిలో వేమన సమాధిప్రాంతం, పరిసరాలలో అభివృద్ధి కోసం 3 కోట్లు కేటాయించారు. కోటిన్నర రూపాయల దాకా ఖర్చు జరిగింది. మిగతా నిధులు పూర్తి స్థాయిలో వినియోగించలేదు. తక్షణం నిధులు కేటాయించి పూర్తి స్థాయి పనులు చేపట్టాలి. వేమన సాహిత్యంపై అధ్యయనానికీ, విస్తరణకూ ఒక ప్రత్యేక పరిశోధనా సంస్థనూ, గ్రంథాలయాన్నీ నెలకొల్పాలి. ఆధునిక తరానికి వేమన గురించి తెలిసేలా ప్రత్యేక వెబ్సైట్ నడపాలి. ప్రామాణిక వేమన పద్యప్రతిని రూపొందించడానికి నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలి. పాఠ్య పుస్తకాలలో వేమన పద్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వేమనతో ముడిపడిన కొండవీడు, గండికోట, నల్లచెరువు, పామూరు తదితర స్థలాలకు గుర్తింపు తీసుకురావాలి. జాతీయకవిగా వేమన గుర్తింపునకై కృషి జరగాలి. (క్లిక్ చేయండి: ఆంధ్రీ కుటీరం పేరుతో.. తండ్రి ఆశీస్సులతో..) - డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి కార్యదర్శి; వేమన ఫౌండేషన్, అనంతపురం -
Yennam Satyam: అతడి మరణం ఓ విషాదం!
సత్యం! 30, 35 ఏళ్ల క్రితం కవిత్వం, కథలు రాస్తున్న నాతో తనను తాను పరిచయం చేసుకున్నాడు. క్రమక్రమంగా స్నేహితుడిగా, కవిగా కూడా పరిణామం చెందాడు. నిరంతర అధ్యయనశీలి. శాస్త్రీయ జ్ఞానాన్ని పెంపొందించుకున్న వాడు. అంతేగాక తన మొదటి మూడు పుస్తకాలను ఖగోళ శాస్త్రం, విశ్వ రహస్యాలను ఆధారం చేసుకొని భూమి కేంద్రంగా సూక్ష్మస్థాయిలో సుదీర్ఘ కవితల్ని రచించాడు. అవి సుదీర్ఘ జ్ఞాపకం(1996), శిలా ఘోష (1997), బొంగరం (2004). తనకంటూ తెలుగు కవిత్వ రంగంలో ఒక స్థానాన్ని అప్పుడప్పుడే ఏర్పర్చుకుంటున్న కాలమది. చాలా రోజులు అటు జీవితంలోనూ ఇటు కవిత్వంలోనూ తాయిమాయి తొక్కులాడాడు. 2011లో సూది నానీలు పేరుతో ‘నానీ’ పుస్తకాన్ని వెలువరించాడు. ఆ పుస్తకం ఇన్నర్ టైటిల్లో ‘అగర్ తేరీ గలిమే కోయీ భూకా హైతో లానత్ హై తేరే ఖానే పే’ అనే మహమ్మద్ ప్రవక్త సూక్తి తెలుగు అనువాదం ‘మీ వీధిలో ఎవరైనా పస్తులుంటే నువ్వు తినే అన్నం అధర్మమే’ ముద్రించాడు. తద్వారా సత్యం మరో నూతన తాత్విక లోకంలోకి నిబద్ధతతో, నిమగ్నతతో ప్రవేశించాడు. అన్నట్టు చెప్పలేదు కదూ... అరబ్బీని అనర్గళంగా మాట్లాడడమే కాక చదువుతాడు, రాస్తాడు కూడా. ఇక్కడ కొద్దిగా అతడి వలస బతుకు గురించీ యాది చేసుకోవాలి. దర్జీల కుటుంబంలో పుట్టిన సత్యం... జీవిత ప్రారంభంలో జీవనాధారాన్ని వెతుక్కుంటూ సిరిసిల్ల, ముంబై ప్రాంతాల గుండా అరబ్బు దేశాలకు షర్ట్ మేకర్ కార్మికునిగా వలస పోయి 26 ఏళ్లు గడిపాడు. చివరికి ఇక అరబ్బు దేశానికి పోనవసరం లేదనీ, ఇక్కడ సిరిసిల్లలో నివాసం ఏర్పరచుకున్నాడు. ముగ్గురు బిడ్డల పెళ్లిళ్లు చేశాడు. పేద దర్జీ బతుకులకు నిలువెత్తు నిదర్శనంగా ఉండే నానీలను రాశాడు సత్యం. గుండెలను పిండి వేసే మచ్చుకు రెండు నానీలు... ‘అందరికీ జేబులు కుట్టేవాడు చాయ్ బీడీలకు అప్పు పడ్తడు’ ‘అమ్మకు కన్నీళ్లే కళ్లద్దాలు వాటితోనే కాజాలు కుట్టేది’ అంతా సవ్యంగా సాఫీగా బతుకు బండి నడుస్తుందనుకునేసరికి, మూడేళ్ల క్రితం బ్రెయిన్ క్యాన్సర్ బారిన పడ్డాడు. మూడుసార్లు తలకు ఆపరేషన్ జరిగినప్పటికీ ఆరోగ్యం కుదుట పడలేదు. పైగా చివరి 4 నెలలు ఒక్కొక్క అవయవం కోల్పోయి నానా ఇబ్బందులు పడ్డాడు. యెన్నం సత్యం (58) కవిగా ఎన్నో మెట్లు ఎక్కవలసిన వాడు, ఎన్నో లక్ష్యాలను అధిగమించి, అందరి అంచనాలను బదాబదలు చేయవలసిన వాడు. కానీ ఆరోగ్యం విషమించి ఈనెల 18న (ఆదివారం) తనువు చాలించాడు. సిరిసిల్ల కవి మిత్రులకే గాక... కరీంనగర్ ఉమ్మడి జిల్లా సాహితీ మిత్రులందరికీ ఇదో తీరని లోటు. ఒక విషాద జ్ఞాపకం. సత్య ప్రమాణంగా సత్యం మరువలేని ఉప్పకన్నీళ్ల చేదు యాది! (చదవండి: సాహిత్యకారుల్లో చాతుర్వర్ణాలు.. అవేంటో తెలుసా!) – జూకంటి జగన్నాథం -
Kundurti Anjaneyulu: వచన కవితా మూర్తి
జాషువా, విశ్వనాథల ప్రేరణా ప్రభావాలతో పద్య కవిత రచనకు పూనుకున్నాడు కుందుర్తి ఆంజనేయులు. విశ్వనాథ వారి ప్రౌఢమైన శైలిలో ‘సౌప్తికం’ అనే కావ్యాన్ని రచించాడు. ఆయన 1922 డిసెంబర్ 16వ తేదీన నరసరావుపేట సమీపంలో కోటవారిపాలెంలో పేదకుటుంబంలో జన్మించాడు. నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్లో అనిసెట్టి, రెంటాల, బెల్లంకొండ రామదాస్, మాచిరాజు దేవీ ప్రసాదులు ఆయన సహాధ్యాయులు. మాచిరాజు దేవీప్రసాద్ ప్రేరణతో శ్రీశ్రీ కవిత్వ లాలసుడై వచన కవిత్వం వైపు దృక్పథం మరల్చుకున్నాడు. నవ్యకళా పరిషత్, నరసరావుపేట ఆధ్వర్యంలో ఏల్చూరి, బెల్లంకొండ రామదాసులతో కలసి తెలుగులో తొలి వచనా కవితా సంపుటి ‘నయాగరా’ను 1944లో ప్రచురించాడు. తొమ్మిది కవితల సంపుటి నయాగరాలో కుందుర్తి రచించిన ‘మన్యం లోకి’ కవితలో మన్యం వీరుడు అరి విప్లవాగ్నిని ప్రశంసించాడు. ‘జయిస్తుంది’ కవితలో బ్రిటిష్ వారి దురాగతాలను నిరసించాడు. క్విట్ ఇండియా ప్రభావంతో అసమ సమాజాన్ని ఈసడిస్తూ ‘ఒకవేపున అధికోత్పత్తీ/ మరోవేపు డొక్కల కరువు’ ఇకపై సాగవని హెచ్చరిక చేశాడు. ఆయన కవితలపై శ్రీశ్రీ మరోప్రపంచం గేయం ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ‘పాతకాలం పద్యమైతే / వర్తమానం వచన గేయం’ అంటూ ‘నాలో నినాదాలు’లో కుందుర్తి స్పష్టంగా ప్రకటించాడు. ఎందరో అధునిక కవులను ప్రభావితం చేశాడు. అనిసెట్టి, ఆరుద్ర, దాశరథి, సి. నారాయణ రెడ్డి, రెంటాల వంటి వారు వచన కవితను ఆదరించి వచన కవితా సంపుటాలు ప్రచురించారు. వచనకవితా మూర్తి కుందుర్తికి ఫ్రీవర్స్ ఫ్రంట్ ఊపిరి. ప్రాచీన కవిత్వంపై తిరుగుబాటు చేసి ‘రచనల పూలతోటలో ఛందస్సుల మొక్కలు నాటను’ అని ప్రతిజ్ఞ చేశాడు. ఆధునిక కాలానికి అనువైన ప్రక్రియ వచన కవిత్వ మేనని నిరూపించేందుకు ఎంతో శ్రమపడ్డాడు. ఫ్రీవర్స్ ఫ్రంట్ ఆధ్వర్యంలో వ్యాసాలు, పీఠికల ద్వారా వచన కవితా ప్రచారం ముమ్మరంగా చేసినందున కుందుర్తిని వచన కవితా పితామహుడిగా విమర్శకులు పేర్కొన్నారు. ఆశ, ఆచారిగారి అమ్మాయి, శిక్ష వంటి గేయ నాటికలు రాశాడు. తెలంగాణ, యుగేయుగే, నగరంలో వాన, నాలోని నాదాలు, కుందుర్తి కృతులు పాఠకుల మన్ననలు పొందాయి. ‘హంస ఎగిరిపోయింది’ అనే సతీస్మృతి కావ్యం విశిష్టమైంది. ఆయన కవిత్వంలో అభ్యుదయ దృక్పథం, హేతువాద దృష్టి, ప్రకృతిని సామాజిక స్పృహతో సమన్వయించటం, చమత్కారమైన అధిక్షేపణ, ఆకర్షణీయమైన అంత్యప్రాసలు ఎందరో యువకులను ప్రభావితం చేశాయి. ఆయన 1982 అక్టోబర్ 25వ తేదీన మరణించినా, వచన కవితా పితామహుడిగా ఆధునికాంధ్ర కవిత్వంలో చిరస్మరణీయుడు! (క్లిక్ చేయండి: బాపుయగుట దుష్కరమ్ము సుమ్ము) – డాక్టర్ పీవీ సుబ్బారావు, సాహితీ విమర్శకులు (డిసెంబర్ 16 కుందుర్తి ఆంజనేయులు శత జయంతి ముగింపు) -
Nizam Venkatesham: అరుదైన వ్యక్తి నిజాం వెంకటేశం
సాహితీవేత్త, పుస్తక ప్రేమికుడు నిజాం వెంకటేశం మృతి తెలుగు సాహితీలోకాన్ని కలచివేసింది. అప్పటివరకూ ఆరోగ్యంగా ఉన్న ఆయన హఠాత్తుగా సెప్టెంబర్ 18 సాయంత్రం గుండెపోటుతో అసువులు బాశారు. ఆగస్టు 31న తల్లిని కోల్పోయిన దుఃఖంలో ఉన్న వెంకటేశంను పలకరించి ఓదార్చిన సాహితీ మిత్ర బృందానికి ఆయన అర్ధంతర నిష్క్రమణ దిగ్భ్రాంతిని కలిగించింది. నచ్చిన పుస్తకాన్ని పదుల సంఖ్యలో కొని, పంచి, మురిసిపోయిన అరుదైన వ్యక్తి వెంకటేశం. ఆయన 1948లో సిరిసిల్లాలో జన్మించారు. విద్యుత్ శాఖలో ఇంజినీర్‌గా విధులు నిర్వ హించి 1997లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నప్పుడు ఎన్నో సాహితీ కార్యక్రమాల నిర్వహణకు, పుస్త కాల ప్రచురణకు సహకరించారు. కవిత్వం పట్ల ప్రేమతో 1980 దశకంలో ‘దిక్సూచి’ కవితా సంచి కలు వెలువరించి యువ కవులకూ ప్రోత్సాహాన్ని చ్చారు. అలిశెట్టి ప్రభాకర్ దీర్ఘకవిత ‘నిజరూపం’ అందులోనే వచ్చింది. కరీంనగర్ బుక్ ట్రస్ట్ ఆరంభించి అల్లం రాజయ్య ‘భూమి’ కథలు, బీఎస్ రాములు ‘బతుకు పోరు’ నవలను ప్రచురించారు. 1950 దశకంలో తెలంగాణ మాండలీకంలో వచ్చిన గూడూరి సీతారాం కథలు కొత్త తరానికి పరిచయమయ్యేలా 2010లో పుస్తకరూపంలో రావడానికి తోడ్పడ్డారు. 2013లో అలిశెట్టి సమగ్ర కవితా సంపుటి రాకలో ప్రధానపాత్ర పోషించారు. న్యాయవాది విద్యాసాగర్ రెడ్డి దేశంలో ఆర్థికరంగ మార్పులను సూచిస్తూ రాసిన మూడు ఇంగ్లిష్ పుస్తకాలను తెలుగులోకి అనువదించారు. సేంద్రియ వ్యవసాయ నిపుణులు సుభాష్ పాలేకర్ పుస్తకాన్ని కూడా తెనిగించారు. పుస్తకాన్నీ, రచయితనీ, మంచితనాన్నీ ఏకకాలంలో సమానంగా ప్రేమించిన అరుదైన వ్యక్తి వెంకటేశం. ఆయనకు నివాళి. – బి. నర్సన్ -
Pallipattu Nagaraju: కవిత్వమే ఆయుధమై.. చైతన్య తూటాలను పేల్చి..
జీవితాన్ని కాచి వడబోసిన అనుభవం.. అడుగడుగునా కనిపించే వివక్ష నుంచి రగిలిన అగ్ని కణం.. కనుచూపు మేరలో కనిపించే అణచివేతను కూకటి వేళ్లతో పెకలించాలనే ఆక్రోశం.. పేదల పక్షాన పోరాటమై.. పీడిత జన పిడికిలై.. కవిత్వమే ఆయుధమై.. అక్షర సూరీడయ్యాడు.. నేను, నా కుటుంబం కాకుండా, మనం.. సమాజం అనుకొని ఎక్కుపెట్టిన ఆ కలం చైతన్య తూటాలను పేల్చింది.. నవ సమాజ నిర్మాణానికి తన వంతు బాధ్యతగా అక్షర యుద్ధం చేస్తున్న పల్లిపట్టు నాగరాజును కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం వరించడం.. ఉమ్మడి చిత్తూరు జిల్లా చరిత్రలో ఇదే తొలి పురస్కారం కావడం విశేషం. తిరుపతి కల్చరల్/శాంతిపురం: నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందిన భూలక్ష్మి, రాఘవయ్య దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు పల్లిపట్టు నాగరాజు పాఠశాల విద్యను వెంకటాపురంలో పూర్తి చేసి, సత్యవేడు జూనియర్ కళాశాలలో ఇంటర్, తిరుపతి ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ(స్పెషల్ తెలుగు) చదివారు. కర్నూలు ఐఏఎస్ఈ కాలేజీలో తెలుగు పండిట్ శిక్షణ పొందారు. తిరుపతి ఎస్వీయూలో ఏంఏ తెలుగు ఉత్తీర్ణులై.. ప్రస్తుతం ఆచార్య మేడపల్లి రవికుమార్ పర్యవేక్షణలో విల్సన్ సుధాకర్ రచనలపై పీహెచ్డీ చేస్తున్నారు. 2016 జూన్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం శాంతిపురం మండలంలోని 64.పెద్దూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు. చిన్నప్పటి నుంచే రచనలపై ఆసక్తి తల్లిదండ్రుల కష్టంతోపాటు చుట్టుపక్క ప్రజల జీవన శైలి నాగరాజు రచనలపై ఎనలేని ప్రభావం చూపింది. సమాజంలో సగటు మనిషి బాధలే తన బాధగా కవితలను అక్షరీకరించాడు. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు కావడంతో పీడిత జనానికి తన వంతు బాధ్యతగా ఏదో ఒకటి చేయాలని అక్షరాలనే ఆయుధంగా మలుచుకున్నాడు. శ్రీశ్రీ, తిలక్ రచనల స్ఫూర్తితో తనదైన శైలిలో పల్లె భాషకు జీవం పోస్తూ సామాన్య పదాలతో అసామాన్య కవితలకు జీవం పోశాడు. అవ్వ చెప్పిన ఆ కథలే.. చిన్నప్పుడు అవ్వ మంగమ్మ చెప్పే జానపద కథలు, బుర్ర కథలు, దేవుళ్ల కథలు, దెయ్యాల కథలు, బూతు కథలు, నీతి కథలు, తమాషా కథలు.. నాగరాజు ఊహకు పదునుపెట్టాయి. బహుజనుల శ్రమతత్వం కవితకు ప్రేరణ కలిగించాయి. పాఠశాల స్థాయి నుంచే చిన్న చిన్న కవితలు, పాటలకు పేరడీలు రాసేందుకు సన్నద్ధం చేశాయి. ఏదో చేయాలని.. పోరాటంలో ఒక్కొక్కరిదీ ఒక్కో కోణం. కొందరు తుపాకీ పడతారు, కొందరు శాంతి బాట పడతారు. ఇంకొకరు ఇంకొకటి.. ఇలా నాగరాజు ఎంచుకున్న బాట కవిత్వం. అక్షర శక్తి తెలిసిన వ్యక్తిగా పీడిత జనం పక్షాన నిలిచి అక్షర సేద్యం చేశారు. ఇలా రూపుదిద్దుకున్నదే ‘యాలైపూడ్సింది’. తొలి వచన కవితా సంపుటి 2021, జనవరి 31న కవి సంగమం ప్రచురణల ద్వారా తిరుపతిలో ఆవిష్కృతమైంది. ఈ ఆనందం మాటల్లో చెప్పలేనిది సామాన్య శ్రమజీవుల జీవన విధానాలను అక్షరాలుగా పేర్చి కూర్చిన తొలి పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం మాటల్లో చెప్పలేని ఆనందాన్ని ఇస్తోంది. తొలి రచనకే అనూహ్యంగా యువ పురస్కారం రావటం నా బాధ్యతను తెలియజేస్తోంది. సామాన్యుల కష్టాలు, వారి నిత్య జీవితంలో ఎదురయ్యే పరిస్థితులే కథావస్తువులుగా రచనలు కొనసాగిస్తాం. ఇది నా తల్లిదండ్రుల శ్రమకు తగిన ఫలితం. శ్రమ జీవులు, బహుజనుల జీవితాల సంఘర్షణకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. తల్లిదండ్రులకు ఈ అవార్డును అంకితమిస్తా. – పల్లిపట్టు నాగరాజు -
Cherabanda Raju: తరతరాలనూ రగిలించే కవి
దేశంలో 1965 ప్రాంతానికి నిరక్షరాస్యత, నిరుద్యోగం, దారిద్య్రం, పరాధీనత, కుహనా రాజకీయాలు, మత కలహాలు, సాహిత్య వ్యాపారం, విశృంఖలమైన సెక్స్ రచనలు వంటివి బలం పుంజు కున్నాయి. ఈ నేపథ్యంలో ‘దిగంబర కవిత్వోద్యమం’ వచ్చింది. విదేశీ ప్రభావం లేదని ‘మేము మేముగానే’ వస్తున్నామని దిగంబర కవులు ప్రకటించుకున్నారు. కొత్త పేర్లతో కవితా రంగంలోకి అడుగుపెట్టారు. బద్దం భాస్కరరెడ్డి వారిలో ఒకరు. బహుశా ఈ పేరు చాలా మందికి తెలియదేమో... ‘చెరబండ రాజు’ అంటే టక్కున గుర్తుకు వస్తాడు. చెర బండరాజు ప్రకృతిలోనూ విప్లవ వాదాన్ని చూశాడు. ‘‘పుడమి తల్లి చల్లని గుండెను/పాయలు పాయలుగా చీల్చుకొని/ కాల్వలై ఎవరిదో, ఏ తరం కన్నీరో/గలగలా సుళ్ళు తిరిగి/ మెల్లగా పారుతుంది’ అంటాడు. ఆయన రాసిన ‘వందేమాతరం’ గీతం ఓ సంచలనం. అందులో దేశాన్ని ఉద్దేశించి ‘నోటికందని సస్య శ్యామల సీమవమ్మ’ అన్నాడు. ఆకలిమంటల ఆర్త నాదాల్ని ‘జీవుని వేదన’గా వర్ణించే చెరబండ రాజు సాహిత్యం వేరు, రాజకీయం వేరు అనే కవి కాదు. ఆయన కవిత్వం, గేయాలు వంటివి ఆయన సాధారణ కవి కాదనీ, ‘బొట్టు బొట్టు’గా తన నెత్తుటిని ఈ నేల తల్లి విముక్తి కోసం ‘విత్తనంగా చల్లిన’ వాడనీ చెబుతాయి. బద్దం భాస్కరరెడ్డి 1944 జనవరి మూడవ తేదీన అంకుషాపూర్‌లో జన్మించి, జూలై 2, 1982లో తుదిశ్వాస విడిచాడు. హైదరాబాద్‌లో ఉపాధ్యాయుడిగా పని చేశాడు. ఆలోచన, అక్షరం, ఆచరణల ఐక్యతారూపం ‘బద్దం’. కవితలు, కథలు, గేయాలు అన్ని ప్రక్రియల్లో తను నమ్మిన సిద్ధాంతాలను మాత్రమే ‘అక్షరాలు’గా అగ్ని కురిపించినవాడు చెరబండ రాజు. (క్లిక్: ఆయన పుట్టిన రోజూ, మరణించిన రోజూ ఒక్కటే) – భమిడిపాటి గౌరీశంకర్, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా (జూలై 2 చెరబండ రాజు 40వ వర్ధంతి) -
పద్యశిఖరం ఒరిగిపోయింది!
పద్యం తెలుగువారి ఆస్తి. ఆ ఆస్తిని మరింత పెంచిన కొల్లా శ్రీకృష్ణారావు సోమవారం గుంటూరులోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 94 ఏళ్ల జీవితాన్ని సాహితీ సృజనలో గడిపిన కవితా తపస్వి మృతితో తెలుగు సాహిత్య లోకం... మరో పద్య కవితా శిఖరాన్ని కోల్పోయింది. గుంటూరు జిల్లా పెదకూరపాడులో మహాలక్ష్మి– సూరయ్య రైతు దంపతులకు జన్మించారు శ్రీకృష్ణారావు. బాల్యం నుండి కవిత్వం పట్ల మక్కువ ఉన్న కృష్ణారావు మహా కవులు గుర్రం జాషువా, ఏటుకూరి వెంకట నరసయ్యలను కవితా గురువులుగా ఎంచుకున్నారు. వారి నుంచి తెలుగు పద్యంలోని మెలకువలు గ్రహించారు. ‘విశ్వశాంతి’ కోసం పద్య ‘శంఖారావం’ పూరించారు. ‘రారాజు’ను తెలుగు పద్య సింహాసనంపై కూర్చో బెట్టి పద్యానికి పట్టాభిషేకం చేశారు. పద్యాల ‘పూదోట’లో విహరించారు. విలువైన పద్య కావ్యాలు రాసి పచ్చి పసుపులు పండించారు. ‘కవి బ్రహ్మ’ ఏటుకూరి వారి స్ఫూర్తితో పల్నాటి ‘పౌరుష జ్యోతి’ని వెలిగించారు. రైతు పక్షపాతిగా కర్షక సాహిత్యం వెలయించారు. జాషువాను గుండెలకు హత్తుకుని ‘మన కవి జాషువా’ పేరుతో విలువైన వ్యాస సంపుటిని రచించారు. ‘మఱుగు పడిన మహాకవి తురగా వెంకమరాజు’ అనే వీరి పరిశోధనాత్మక గ్రంథం తెలుగు సాహిత్య చరిత్రకు ఎంతో పనికొచ్చే పుస్తకం. (క్లిక్: నిష్కర్ష విమర్శకుడు!) ‘కవిబ్రహ్మ ఏటుకూరి’ పేరుతో గురువుకు అక్షర దక్షిణ సమ ర్పించారు. ‘నా సాహితీ యాత్ర’ పేరుతో స్వీయ చరిత్రను పాఠక లోకా నికి బహుకరించారు. ఛందో బద్ధ పద్యంలాగే నడకలోనూ, నడతలోనూ... వడీ, వంకా లేని నిరాడంబర జీవనం గడిపారు. ఆయన ఐదు దశాబ్దాలకు పైగా పత్రికా రంగంతో మమేకమయ్యారు. స్వీయ సంపాదకత్వంలో ‘స్వతంత్ర వాణి’, ‘భావ వీణ’ పత్రికలను నడిపారు. అవిశ్రాంత అక్షర తపస్వికి నిండు మనస్సుతో నివాళులు. – డాక్టర్ బీరం సుందరరావు, చీరాల -
పెళ్లాడే బొమ్మా!
మార్చి 20న ఉషశ్రీ జయంతి సందర్భంగా ఆయన 1961లో రాసిన ‘పెళ్లాడే బొమ్మా!’ నవలా లేఖావళి నుంచి మొదటి లేఖ సంక్షిప్తంగా... చిరంజీవినీ – అని నిన్ను సంబోధించడం నాకిష్టం లేదు. అయినా ప్రపంచంలో అన్నీ మనకిష్టమైనవే చేస్తున్నామా! ఇష్టం లేని వాటి మీదనే ఎంతో శ్రద్ధ, ఆప్యాయత. ఔత్సుక్యం ప్రదర్శించడానికి అలవాటు పడిపోయాడు మానవుడు. ఈ విషయంలో పల్లెటూరి వాడి కంటె నాగరికుడు మరీ సామర్థ్యం కనబరుస్తున్నాడు. చదువుకున్న వాడికి ఈ కళలో మంచి ప్రావీణ్యం ఉంది. చదువురాని వాడు ఈ విషయంలో అసమర్థుడేనేమో! చదువుకున్నవాడు చదువుకున్న వాడితో సాగించే ఈ కృత్రిమ వ్యవహారం ఉన్నదే ఇంతకంటె దుర్భరమైనది లేదు. వాస్తవానికి మనిషి కృత్రిమంగా బ్రతకడానికి ఎప్పుడో అలవాటు పడిపోయాడు. అసలు కృత్రిమ శబ్దం ఇక్కడ ఉచితం కాదని నాకు తెలుసు. ఆర్టిఫిషియల్ అనేదానికి తెలుగు రానివాడు రాసిన అనువాదం కృత్రిమం. అందువలన ఒక రకంగా ముసుగులో గుద్దులాట అంటే బావుంటుంది కానీ అదీ సమంజసం కాదు. పచ్చి మోసం అంటే సుఖంగా ఉంటుందేమో అలోచించు. ఇంతసేపూ నీకు నేను అనవసర విషయం మీదనే వ్రాసినట్లున్నాను. ఇది అనవసరమని నాకూ తెలుసు. అసలీ ప్రపంచంలో అవసరమైంది ఏముంది కన్నతల్లీ? అన్నీ అవసరాలే! అనవసరాలనే అవసరాలుగా అంగీకరించి అనుభవించడానికి అలవాటు పడుతున్నాము. పుట్టడం కంటె అనవసరమైనది లేదు. అయినా అది మన చేతుల్లో వున్నదా! అని నువ్వు ప్రశ్నిస్తావు. నిజమేకాని – ఏది మన చేతుల్లో ఉంది. ఊరికే తెలియక కొందరు అమాయకులు అంతా మన చేతుల్లో ఉన్నదంటారు. మరికొందరు ఆకాశంలోని గ్రహాలకు ఈ అధికారం అంటకడుతున్నారు. ఆ గ్రహాలకు ఆ శక్తి ఎలా వచ్చిందంటే ఆగ్రహిస్తారు వారు. అన్నిటికీ అతీతమైన శక్తి ఒకటి ఉందని అంటే హేతువాదులు ఒప్పుకోరు. ఎప్పుడు హేతువాదం, విశ్వాసం కంటె బలీయమైందో అప్పుడే మానవుడు మోసంలో పడిపోయాడు. మోసగించుకొంటున్నాడు. మోసం చేస్తున్నాడు. మోసంలో పడుతున్నాడు. ఇందులో కొంత తెలిసి జరుగుతుంటే కొంత తెలీకుండా జరుపుతున్నాడు. తెలిసినా తెలియకపోయినా ముట్టుకుంటే నిప్పు కాలి తీరుతుంది. అందుచేత ఈ మోసాలకు ప్రాయశ్చిత్తం తప్పదు. అయితే తత్కాలంలో ఇవి వేధించకపోవచ్చు. కాని వీటి పరిణామ రూపమైన ప్రాయశ్చిత్తఫలాన్ని అనుభవించక తప్పదు – అని నేనన్నప్పుడు ‘‘ఈ జన్మలో హాయిగా పోతే చాలు, వచ్చే జన్మ అనేది ఉందో లేదో తెలియనప్పుడు అందులో అనుభవించడమనే అవస్థ ఎక్కడిది?’’ అని నవ్వి పారేశావు. నిజమే! పూర్వజన్మ, పునర్జన్మ, కర్మ అనేవి ప్రత్యక్షమయే విషయాలు కావు. కావు కాని ప్రత్యక్షాంశాలకు హేతువులు దొరకనప్పుడు పై వాటిని స్వీకరించడంలో దోషం కనిపించదు. ఉదాహరణకు నువ్వు బియ్యే చదివావు. నీలానే చదివిన వాళ్లెందరో ఉన్నారు. నీ కంటె గొప్పగా ప్యాసయిన వాళ్లలానే, తక్కువ మార్కులతో ఉత్తీర్ణులయిన వాళ్లూ ఉన్నారు. కానీ – ఈ క్రింది తరగతుల వాళ్లు నీ కంటె మంచి పదవుల్లో ఉండగా ప్రథమ శ్రేణివారు నిరుద్యోగులుగానూ కనిపిస్తున్నారు కదా. ఏమిటి దీనికి కారణం? ఆలోచించవు నువ్వు, అనవసరం అనుకుంటావు. అక్కడే విడుతున్నాం మనం. చిత్రం చూశావా! ఏది నేననవసరమనుకుంటానో అది అందరికీ అవసరంగా కనిపించినట్లే నువ్వ అవసరమనుకునేది మరి కొందరికి అనవసరమవుతుంది. ఇదంతా మన మనస్సుల మీద ఉన్నది. ఈ మనస్సు ఉన్నదే. ఇది బహు ప్రమాదకరమైనది. ప్రమోదానికి ఇదే మూలస్థానం. దీనినే శంకరుడు కోతితో పోల్చాడు. ఉత్త కోతి అన్నాడు మనస్సును. అప్పుడనిపిస్తుంది. మనిషి కోతి నుండి పుట్టాడంటే మనస్సనే కోతిని పెట్టుకు పుట్టాడా అని. నవ్వొస్తుంది నీకు – ఇందుకే కాదు అన్నింటికీ నవ్వడమే అలవాటు నీకు. అదే నీ అదృష్టమేమో జాతక చక్రంలో. ఇంతకూ ప్రపంచంలో... అసలేం వ్రాద్దామనుకున్నానో, ఏం వ్రాయమని నువ్వు అడిగావో అది వ్రాయడమే మరచిపోతున్నానని నువ్వు కాకపోతే నీ పక్కవాళ్లయినా భ్రమపడవచ్చు. అది ఎవరి దోషమూ కాదు. వ్రాసేదాన్ని పూర్తిగా అవగాహన చేసికొని ఆ అక్షర సముదాయం వల్ల ఏర్పడే శబ్దాలిచ్చే అర్థాలతో పాటు ఆ శబ్ద సముదాయం మరే అంశాన్నయినా ధ్వనిస్తున్నదా అని లోచించడం అవసరం అనుకుంటా. ఇలా అన్నందుకు చాలామందికి ఆగ్రహం వస్తుంది. అయినా అందరి ఆగ్రహానుగ్రహాలనూ లక్ష్యం చేస్తూ కూచుంటే మన జీవితాలు సాగవని నువ్వు అనేమాట నేనెరుగుదును. కానీ ఆగ్రహానుగ్రహాల విషయంలో గొప్ప పేచీ ఉంది. ఆ విషయం చాలాసార్లు వివరిద్దామనుకుంటూ మరచిపోతూనే ఉన్నాను. కొన్ని కొన్ని విషయాలు మరిచిపోగలిగితే ఎంత బావుండునూ అనుకుంటాము. కానీ – ఏవి మరచిపోదామనుకుంటామో అవి తరిమి తరిమి వేధిస్తూంటాయి. మనం స్వయంగా చేసిన తప్పులు విష ఫలితాలతో ఎదురయేటప్పుడు మరిచిపోదామనుకుంటాము కాని సాధ్యమా? కాదు, కాదని అటువంటి తప్పులు చేయకుండా ఉండగలమా? తప్పులు చేస్తూండడం, దిద్దుకోవడం... మానవ జీవితానికి నిర్వచనం. చేసిన తప్పులే చేస్తూండడం మేధావులమనుకొనేవారి లక్షణం. ఈ లక్షణానికి మంచి లక్ష్యం ఏమిటో తెలుసా? పెళ్లి – అనుకోలేదు నువ్వు.. ఇంత తొందరగా ఈ అంశంలోకి వస్తానని. నువ్వు ఏమీ అనుకోవు. ఉత్తర దక్షిణాన్ని గురించి ఆలోచనే లేదు నీకు. గతాన్ని స్మరించడమే కిట్టదు. వర్తమానాన్ని మింగుతూ ఉంటావు. ఈ తత్వం అలవరుచుకుంటే వచ్చేది కాదు. జన్మతః సిద్ధిస్తుంది. ఇది జీవితాంతం ఉంటే మంచిదే. కాని అలా భావించడం ఒక పగటి కల. అక్షరాలా పగటి కల. అంటే నీకు కోపం, బాధ, అసహ్యం లాంటివెన్నో కలగవచ్చు. కాని సత్యం సుమీ! అమ్మడూ నేను చెపుతూన్నది. అనాలోచితంగా మానవజాతి చేస్తూన్న పనులలో మొదటిది పెళ్లి. ఎంతో ఆలోచిస్తూ చేస్తూన్నాననుకుంటూ చేసేవాటిలో కూడా ఇదే మొదటిది – భూతభవిష్యద్వర్తమానాలను అనుశీలించి చేస్తున్నామనుకుంటారీ పని. వీరందరూ కూడా ఈ విషయం దగ్గరే భూతాన్ని స్మరించరు. భవిష్యత్తును ఊహించరు. నిజానికి వర్తమానాన్నే స్మరిస్తారు. నిజానికి వర్తమానమే శాశ్వతమై భూతభవిష్యత్తులు లేకపోయినట్లయితే ఎంతో బావుండుననుకుంటాము. నిజానికి గత స్మృతులతో వేగుతూ భవిష్యత్తుకు భయపడుతూ సుఖంగా వర్తమానాన్ని ధ్వంసం చేసుకునే వాళ్ల మీద మనకు సానుభూతి అవసరం లేదు. లేకపోయినా సానుభూతి మానవత్వ లక్షణ శ్రేణిలో మొదటిదని కదా అంటూంటావు. దాన్ని ఆశించనివారు లేరని నీ ఊహ. కాని సానుభూతిని చూపడం ప్రారంభించేవారు, జీవితాంతం దానితోనే ఉండాల్సి వచ్చేసరికి జీవితం విసుగెత్తిపోయి సానుభూతి చూపే వాళ్ల మీద అసహ్యం ఏర్పడుతుంది. దాంపత్యంలో ఉన్న చిక్కే ఇది. సానుభూతి – భర్త భార్య నుంచి తన పరిశ్రమకు సానుభూతిగా చిరునవ్వులు కోరవచ్చు. భార్య భర్త నుండి తన కుటుంబ పరిశ్రమకు సానుభూతిగా చీరలూ, నగలూ వాంఛించవచ్చు. ఈ సానుభూతి పరస్పరాపేక్షితం. అది లభించినట్లయితే వారు చిలకా గోరింకల్లా ఉంటారు. ఒక్కొక్కప్పుడు ఇది ఒకే వైపు నుండి వస్తుంది. రెండవవారు సదా వాంఛించడమే కాని ప్రదర్శించరు. అప్పుడు అవతలివారు దాన్ని ఇస్తూన్నంత కాలం ఇబ్బంది లేదు. అంటే ఒకరెప్పుడూ ఒదిగి ఉండడమే. ఇందులో సుఖం ఉభయులకూ ఉందని నమ్మగలమా, ఉన్నట్టు నటిస్తారు. ఈ నటన చిరకాలం సాగదే. నటన నటనే. ఎప్పుడో ఈ నటన బయటపడుతుంది. అప్పుడు నరకమే కదా. మరో శ్రేణి ఉంది – వారు ఉభయులకూ ఒకరి మీద ఒకరికి సానుభూతి ఉండదు. పులీ – మేకా మొగుడూ పెళ్లాయినట్లుంటుంది సంసారం. ఇంతకూ – ఏది ఎలా జరుగుతున్నా ఒక పురుషుడూ – ఒక స్త్రీ కలిసిమెలసి ఉంటూన్నట్టు నటిస్తూ అయినా బ్రతకక తప్పనిసరి సామాజిక వ్యవస్థలో మనం బ్రతుకుతూ... ఇప్పుడు ఆ నిబంధనలు ముళ్ల కిరీటాలే అయినా ధరించక తప్పదు. (క్లిక్: నూట పాతికేళ్ళ యువకుడు) స్త్రీకి పురుషుడూ, పురుషునికి స్త్రీ ఆహార నిద్రాద్యవసరాలకే ఆవశ్యకం కాదు సుమా. ఈ అవసరాలకే పరిమితం చేసుకున్న భార్యభర్తలు గిల్లికజ్జాలు పెట్టుకుంటూ అయినా సంసారమే సాగిస్తారు. కాని అందుకు కాదుగా నువ్వడిగింది. జీవితంలో సాహచర్యం కోసం కదా! అటువంటప్పుడు నేనేం చెప్పగలను, అని తప్పుకోవడం నన్ను మోసగించుకోవడం అవుతుంది. ప్రయోజనరహితంగా ఈ మోసకారి జీవితాలు గడిపేవారిని నేనెరుగుదును. కానీ ఈ అల్ప విషయం కోసం అబద్ధమాడడం నాకిష్టం లేదు. కొందరితో అయినా యదార్థంగా ఉండడం మంచిది కనుక ఇంత వ్రాస్తున్నాను. ఈ సారి మరికొంత... – ఉషశ్రీ -
మల్లెమొగ్గ లాంటి మనిషి
తన అరవై మూడేళ్ళ జీవితాన్ని మనుషుల పట్ల ప్రేమతో, మాటల మృదుత్వంతో, సున్నిత మానవీయ సంస్పందనతో వెలిగించినవారు ఎండ్లూరి సుధాకర్. కవిగా ఎంత భావుక త్వంతో, కళా నియమాలతో ఉంటారో– సామా జిక వాస్తవాల పట్ల అంత స్పష్టంగానూ ఉంటారు. ప్రాచీన సాహిత్యాన్ని దాని స్థలకాల సందర్భాల నుంచి అంచనా వేస్తూ విస్తృతంగా చదివిన అరుదైన ఆధు నిక కవి. గతాన్ని పట్టు కొని వేలాడే గబ్బిలం కాదాయన, వర్తమాన సామాజిక చేతనా కవి. చుండూరు మీదుగా కవితా భాషణ మొద లుపెట్టి వర్గీకరణ దండోరా మోగిస్తూ తానే ఉద్యమమై నడి చారు. కనుకనే ‘‘ఓ నా చండాలికా!/నీ వెండి కడియాల నల్ల కాళ్ళముందు/వెయ్యేళ్ళ కావ్య నాయికలు వెలవెల బోతున్నారు’’ అంటూ దళిత శ్రామిక స్త్రీ సౌందర్యాన్ని ఉత్పత్తి సాధ నాల, క్రియా కలాపాలతో అనుసంధానం చేసి ఆవిష్కరించారు. మాదిగ మహా జీవన సంస్కృ తికి ‘మల్లెమొగ్గల గొడుగు’ పట్టారు. ‘దుఃఖై ర్లాంజీ’ అయి నిలువునా కరిగిపోయారు. ఎడ బాసిన సహచరిని తలచుకొంటూ రోజుకొక స్మృతి గీతమయ్యారు. ఎండ్లూరి సహచరి పుట్ల హేమలత. 2010లో ప్రారంభమైన ప్రజాస్వామిక రచయి త్రుల వేదిక ప్రయాణంలో చురుకుగా పాల్గొన్న రచయిత్రి. భార్యగా ఆమె కోణంనుండి ఆయన పట్ల ఏ ఫిర్యాదూ పదేళ్ల సహయానంలో మేము వినలేదు. మూడేళ్ళ కిందట తన సహచరి చివరి క్షణాల్లో ఆమె పట్ల ఆయన చూపిన ప్రేమ ప్రకటన ఒక గొప్ప కావ్యం. ప్రరవే తరపున హేమలత సంపాదకత్వం వహించిన బోల్షివిక్ విప్లవ స్ఫూర్తి వ్యాస సంకలనాన్ని పసిబిడ్డని ఎత్తుకున్నంత అపురూపంగా తీసుకువచ్చి ఆమె తలాపున పెట్టారు. సాహిత్యమే తన నినాదం అయినప్పటికీ హేమలత చివరి ఊరేగింపులో తాను ముందు నిలబడి ‘విప్లవం వర్ధిల్లాలి’ అని నినదించారు. తను చెప్పాలనుకున్న మాటలు దూరం నుంచి చెప్పే అలవాటు లేదాయనకి. ఈ వివక్ష తప్పు అని మనిషిని దగ్గరకి తీసుకుని చెపుతారు కనుకనే వేలమంది విద్యార్థులకి, సాహిత్య ప్రేమికులకి ఆయనంటే అపరిమితమైన ఇష్టం. ప్రేమతో పోరాటంతో, అక్షరంతో వాక్కుతో భిన్నవర్గాల మధ్య సంభాషణకి తానొక వంతెన అయ్యారు. సాహిత్య సామాజిక బోధనా రంగాల్లో తన అవసరం మరింతగా ఉన్న కాలంలో ఎండ్లూరి సుధాకర్ కన్ను మూయడం విషాదం. – కె.ఎన్. మల్లీశ్వరి, కాత్యాయనీ విద్మహే ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక -
తెలుగు కవితా దండోరా ఎండ్లూరి
గొప్ప కవి, దళిత కవితాత్మ బంధువు ఎండ్లూరి సుధాకర్ (1959–2022) దీర్ఘ నిద్రలోకి వెళ్ళిపోయాడు. రెండు తెలుగు రాష్ట్రాలలో 80ల తర్వాత వచ్చిన కవులలో ముందు వరుసలో నిలుస్తాడు సుధాకర్. దళితుల్లో తన జాతి హక్కును సాధికారికంగా ప్రశ్నించే కవితను ఆయుధంగా సంధించి తలవంచని వీరుడిగా నిలిచినవాడు. ఎంత సున్నిత మనస్కుడో, అంత తీవ్ర ఉద్వేగం ఉన్నవాడు. ఎంత ప్రాచీన గ్రంథాలతో, ఉర్దూ వంటి ఇతర భాషా సాహితీ పరిజ్ఞానంతో పరిఢవిల్లినవాడో, అంత నవ్యమైన సరళమైన కవి. మంచునిప్పు అతని శైలి. ఆర్థిక స్వావలంబన, ఆత్మగౌరవం రెండు కళ్లుగా ఎండ్లూరి రాసిన ఆత్మకథ కవిత ఒక మేగ్నకార్టాగా నిలిచింది. ‘‘బహిరంగ వేదిక మీద నా సన్మానం మొదలైంది/ ఇప్పుడు నా మెడలో దండలు పడుతుంటే/ నిన్నటి నా గాయాలు వులిక్కి పడు తున్నాయి’’ అంటూ మొదలు పెట్టి, ‘‘ఇప్పటి కొత్త సూర్యుడి వెలుగులో/ కాలం నా ఆత్మకథను/ పాఠ్యగ్రంథంగా చదువుకుం టుంది’’ అన్న ముగింపుతో ఎండ్లూరి చేసిన ఆత్మగౌరవ ప్రకటన దళిత కవులకు నిజంగానే పాఠ్యగ్రంథమైంది. ఆవేదనతో కూడిన విమర్శనాత్మక చమత్కారం, కళాత్మకంగా వ్యక్తం కావడం ఎండ్లూరి కవిత్వ లక్షణం. ఉద్యమావసరాల తర్వాత కూడా అలాంటి కవిత నిలబడిపోతుంది. దళితాగ్రహ ప్రకటనలో నగేష్ బాబుని మించిన వాడు లేడు. దళితాత్మ ప్రకటనలో ఎండ్లూరిని కొట్టిన వాడు లేడు. ‘‘ఓనా చండాలికా/... నీ బంతిపూల కొప్పు మీదనే ఒట్టు/ నిన్ను ఊరి బయటనే నిలబెట్టిన/ ఆకాశమెత్తు ఉట్టిని పగలగొడుతున్నాను.’’ దళిత కవుల శిల్పంలో కూడా అంబే డ్కరిస్టు చూపు ఉందని లక్ష్మీనరసయ్య అన్న మాటకు అర్థం ఎండ్లూరి రాసిన అనేక కవితల్లో దొరుకుతుంది. ఎండ్లూరి నాకు అత్యంత సన్నిహితుడు. నేను తెలుగు యూనివర్సిటీ రాజమండ్రి శాఖలో దళిత కవిత్వం మీద పరిశోధన చేస్తున్న కాలంలో నాకెంతో దగ్గరయ్యాడు. ఎండ్లూరి సున్నిత హృదయాన్నీ, కవిత్వం పట్ల ఆయనకున్న అవ్యాజమైన అను రాగాన్నీ, పదునైన వాక్యాలను పట్టుకునే శక్తినీ కళ్ళారా చెవులారా చూశాను. ఆంధ్రప్రదేశ్ డిగ్రీ కోర్సులో ఆధునిక కవిత పెట్టాలి, ఒక పేరు సూచించండని ఏపీ విద్యాశాఖ వారు అడిగితే... ‘ఇంకెవరు ప్రసాదమూర్తి వున్నాడుగా’ అన్నది ఎండ్లూరే. ఆ విధంగా నా కవిత డిగ్రీ కోర్సుకి ఎక్కింది. అంతటి ప్రేమశీలి. అన్నిటినీ మించి కుల ప్రాంత మతాలకు అతీతంగా మంచి కవిత్వం రాసేవారిని అక్కున చేర్చుకునే గొప్ప మనసున్నవాడు. ఒక దశాబ్దాన్ని కుదిపేసిన దళిత కవిత్వం అనే నా పరిశోధన గ్రంథంలో ఎండ్లూరి కవిత్వాన్ని ఎంతో ఇష్టంగా ఉటంకించాను. తన మాదిగ జాతి హక్కు కోసం ఆయన చేసిన అక్షర పోరాటం సాహిత్య చరిత్రలో ఎవరూ మరచి పోలేనిది. ఎస్సీ రిజర్వేషన్లో ఏబీసీడీ యుద్ధం రాజుకున్నప్పుడు ఎండ్లూరి రాసిన కొత్త గబ్బిలం ఒక సంచలనం. దండోరా సందేశాన్ని కొత్తగబ్బిలం రెక్కల్లో పొదిగి దాన్ని ఆయన భాగ్య నగరానికి సాగనంపుతాడు. తాత జాషువా చూస్తే మనవణ్ణి చూసి మురిసిపోయేవాడే. దండోరాకి దన్నుగా రాశాడే తప్ప అన్న దమ్ముల మధ్య అగ్గి రాజెయ్యడం ఆయన లక్ష్యం కాదు. రాజ మండ్రి నుండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రావడమే సహచరి హేమలత మరణంతో ఆయన్ని దుఃఖం చుట్టేసింది. సగభాగం హేమలత తీసుకుపోయింది. సగభాగం అనారోగ్యం కొరికేసింది. ఎండ్లూరి మరణం తెలుగు సాహిత్యానికి తీరని లోటు. – డా. ప్రసాదమూర్తి, ప్రముఖ కవి మొబైల్: 84998 66699 -
ఆచార్య ఎండ్లూరి సుధాకర్ మృతిపట్ల అరసం సంతాపం
సాక్షి, హైదరాబాద్: సాహితీ వేత్త, కవి, రచయిత, ప్రొఫెసర్ ఎండ్లూరి సుధాకర్ (63) మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం(అరసం) సంతాపం వ్యక్తం చేసింది. ‘‘నన్కొక మొక్కను చేయండి/ మీ ఇంటి ముందు పువ్వునవుతాను/... నన్ను దేవున్ని మాత్రం చేయకండి/ముక్కోటి దేవతలతో విసిగిపోయాను/... నన్నొక పిడికిలి చేయండి/ నలుగురికోసం నినదిస్తాను/.. సీతాకోకచిలుకల రెక్కలు విరిచి స్వేచ్ఛ గురించి మాట్లాడకండి..’’ అంటూ మన వ్యవస్థ గూర్చి చెబుతూ తన అభ్యుదయ భావాలను ప్రకటించిన కవి సాహిత్య విమర్శకులు ఎండ్లూరి సుధకర్ అని అరసం గుర్తు చేసుకుంది. వర్తమానం, కొత్తగబ్బిలం, నల్లద్రాక్ష పందిరి, పుష్కర కవితలు, వర్గీకరణీయం, ‘ఆటా’ జనికాంచె, గోసంగి ఇత్యాది కవితా సంపుటులు, జాషువాపై పరిశోధనా గ్రంథాలు, దళిత సాహిత్యంపై పలు కోణాల నుంచి వ్యాసాలను ఎండ్లూరి సుధాకర్ వెలువరించారని పేర్కొంది.వెస్లీ బాయిస్ హైస్కూల్లో పనిచేశారని పేర్కొంది. ప్రస్తుతం హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ సీనియర్ ప్రొఫెసర్‌గా ఉన్నారని, పలు అవార్డులు పొందారని తెలిపింది. స్నేహశీలి, మృదు స్వభావి, అరసంకు సన్నిహితులైన ఆచార్య ఎండ్లూరి సుధాకర్ కీర్తిశేషులైనందుకు జంట తెలుగు రాష్ట్రాలు అభ్యుదయ సాహితీవేత్తను కోల్పోయిందని తెలిపింది. అందుకు తెలంగాణ రాష్ట్ర అభ్యుదయ రచయితల సంఘం ప్రగాఢ సంతాసాన్ని తెలుపుతోందని అరసం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఆర్వీ రామారావ్, డా.రాపోలు సుదర్శన్ పేర్కొన్నారు. -
Yendluri Sudhakar: ప్రముఖ సాహితీవేత్త ఎండ్లూరి ఇకలేరు
సాక్షి, హైదరాబాద్/నిజామాబాద్ కల్చరల్: ‘నిరుపేద, మధ్యతరగతి నుంచి వచ్చిన అజ్ఞానిని నేను.. కవిని కాదు’అంటూనే ఎన్నో రచనలు చేసిన ప్రముఖ కవి, సాహితీవేత్త ఆచార్య ఎండ్లూరి సుధాకర్ (63) హఠాన్మరణం చెందారు. హైదరాబాద్ గోపన్‌పల్లిలోని స్వగృహంలో నివసిస్తున్న ఆయనకు గురువారం అర్ధరాత్రి దాటాక గుండెపోటు రావ డంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. సుధాకర్‌కు ఇద్దరు కూతుళ్లు మానస, మనోజ్ఞ. ఆయన భార్య డాక్టర్ పుట్ల హేమలత రెండేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. అప్పటి నుంచి ఆయన తీవ్ర మనోవేదనతోనే ఉన్నారు. కరోనా వచ్చి తాను కూడా తన హేమ వద్దకు వెళ్లిపోతే బాగుండునని సన్నిహితుల వద్ద తరచూ ఆవేదన వ్యక్తం చేసేవారు. ‘తారాన్వేషణ’అనే కవితలో తన మనోవేదనను వ్యక్తీకరించారు. ‘...ఏదో ఒక క్రిస్మస్ రాత్రి మన ఇంటి గుమ్మం ముందు దేహధారిత ధ్రువతారలా ఉదయిస్తావు’అంటూ ఆమెను స్మరించుకున్నారు. ఆ కవితను తన స్నేహితులతోనూ పంచుకున్నారు. నారాయణగూడలోని సిమెట్రీలో శుక్రవారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరిగాయి. వీధిబడి చదువులతో ప్రస్థానం... ఆచార్య ఎండ్లూరి సుధాకర్ 1959 జనవరి 21న నిజామాబాద్‌లోని పాములబíస్తీలో ఉన్న అమ్మమ్మ ఇంట్లో జన్మించారు. తల్లిదండ్రులు ఎండ్లూరి దేవయ్య, శాంతాబాయిలకు సుధాకర్ ప్రథమ సంతానం. ఆయనకు ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లు. నిజామాబాద్‌లో తన 12వ ఏట వరకు ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన సుధాకర్... ఆ తర్వాత హైదరాబాద్ నల్లకుంట ప్రాచ్య కళాశాలలో ఒరియంటల్ విద్య, ఓయూలో ఎంఏ, ఎంఫిల్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలంలో పీహెచ్డీ చేశారు. తెలుగు ఉపాధ్యాయుడిగా తన ప్రస్థానం ప్రారంభించారు. రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయంలో విశేష సేవలందజేశారు. ఎంతో మంది విద్యార్థులకు, పరిశోధకులకు మార్గదర్శకులుగా వ్యవహరించారు. ప్రస్తుతం హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని తెలుగు విభాగంలో సీనియర్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ జ్యూరీ సభ్యుడిగా, తెలుగు సలహా మండలి సభ్యుడిగా, తెలుగు అకాడమీ సభ్యుడిగా, ప్రసిద్ధ హిందీ, ఉర్దూ పద్యాల లఘు చిత్రాల అనువాదకుడిగా పనిచేశారు. ఎండ్లూరి రచనలు...: తెలుగు కవితా దిగ్గజంగా సాహితీలోకంలో గుర్తింపు పొందిన ఎండ్లూరి సుధాకర్... వర్తమానం, కొత్త గబ్బిలం, నా అక్షరమే నా ఆయుధం, మల్లెమొగ్గల గొడుగు, నల్లద్రాక్ష పందిరి, వర్గీకరణీయం, గోసంగి, కథానాయకుడు జాషువా, తెలి వెన్నెల వంటి రచనలతో తెలుగు సాహితీ క్షేత్రాన్ని సుసంపన్నం చేశారు. ఇందూరు సాహిత్యంలో తనదైన ముద్ర వేసుకున్న ఆయన... రాజమండ్రి, తిరుపతి, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాల్లో జరిగిన తెలుగు సాహితీ సభల్లో ఇందూరు కీర్తిని చాటారు. ఎండ్లూరి కవిత్వానికి మరణంలేదు: జూలూరి తన రచనలతో దళిత సాహిత్యాన్ని ఉన్నతీకరించిన ఎండ్లూరి సుధాకర్ మృతిపట్ల పలువురు రచయితలు, కవులు, సాహిత్యాభిమానులు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఎండ్లూరి సుధాకర్ కవిత్వానికి మరణం లేదని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ పేర్కొన్నారు. తెలుగు సాహిత్యానికి ఇష్టుడైన గొప్ప కవిని సాహిత్య రంగం కోల్పోయిందని ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. వరించిన పురస్కారాలెన్నో... 2002 అమెరికా తెలుగు అసోసియేషన్, 2011 మారిషస్ ప్రపంచ తెలుగు సదస్సు సిలికాన్ ఆంధ్ర రిసోర్స్ పర్సన్‌గా తెలుగు వైభవాన్ని చాటారు. 1980లో లలితకళా పరిషత్ పురస్కారం, కవికోకిల జాషువా పురస్కారం గరికపాటి సాహిత్య పురస్కారం, తెలుగు వర్సిటీ ధర్మనిది పురస్కారం, సినారె పురస్కారం, అధికార భాషా సంఘం పురస్కారం, ఉగాది విశిష్ట సాహిత్య పురస్కారం, ఎన్టీఆర్ ప్రతిభా పురస్కారం, డాక్టర్ జీఎన్ రెడ్డి మెమోరియల్ అవార్డు, అరుణ్ సాగర్ ట్రస్ట్ మెమోరియల్ అవార్డు వంటివెన్నో ఆయన్ను వరించాయి. ఆయన కుటుంబానికి సైతం తెలుగు సాహిత్యంతో విడదీయరాని సంబంధం ఉంది. సుధాకర్ సతీమణి హేమలత, రచయిత్రి సామాజిక సేవకురాలు. కుమార్తె మానస కథా రచయిత్రి. ఆమె రాసిన కథా సంపుటి ‘మిళింద’కథల సంపుటికి 2020లో కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది. -
Jwalamukhi: సమసమాజ విప్లవ తపస్వి
చరిత్రలో రెండురకాల కవులు, కళాకారులు మనకు గోచరిస్తారు. ప్రభు వర్గాలను, పాలకవర్గాలను కీర్తిస్తూ వారి దోపిడీ, పీడనలను సమర్థిస్తూ వారి అడుగులకు మడుగులొత్తే కవులు, కళాకారులు ఒక కోవకు చెందినవారు. కాగా దానికి భిన్నంగా పాలకవర్గాలను, వారి దోపిడీని వ్యతిరేకిస్తూ ప్రజల, పీడితుల పక్షం వహించి తమ గళాన్ని, కలాన్ని ప్రజల ప్రయోజనాలకోసం సంధించే కవులు, కళాకారులు రెండోకోవకు చెందుతారు. తన జీవితం చివరిక్షణం వరకు పాలకవర్గాలపై, దోపిడీవ్యవస్థపై నిప్పులు కురిపిస్తూ తన ప్రతిభాపాటవాలను, శక్తిసామర్థ్యాలను ప్రజలకోసం ధారపోసిన జ్వాలాముఖి రెండోకోవకు చెందిన కవులలో ప్రముఖుడు. జ్వాలాముఖి 1938 ఏప్రిల్ 12న హైదరాబాదులోని సీతారాంబాగ్ దేవాలయంలో జన్మించారు. చిన్నతనంలోనే తాను నివాసముండే దేవాలయ ప్రాంగణంలోని పేద అర్చకుల ఇండ్లస్థలాల సమస్యపై పోరాటం చేసి పేద ప్రజల ప్రేమకు పాత్రుడయ్యారు. ఎన్నో రుగ్మతలకు ఆలవాలమైన నేటి దోపిడీ వ్యవస్థపై ‘దిగంబరకవి’గా తిరుగుబాటు బావుటాను ఎగురవేశారు. క్రమంగా తన నిరంతర అధ్యయనం, పరిశీలన ద్వారా నేటి సమాజంలోని ప్రజల కడగండ్లకు దేశంలో కొనసాగుతున్న భూస్వామ్య, సామ్రాజ్యవాద దోపిడీ వ్యవస్థే మూలకారణమని గ్రహించుకున్నారు. భారత విప్లవోద్యమ నాయకులు తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావుల సాంగత్యంతోను; వారి బోధనలు, రచనలతోను ప్రభావితులయ్యారు. భారతదేశంలో అనుసరించవలసిన విప్లవమార్గం పట్ల స్పష్టతను ఏర్పరచుకున్నారు. అప్పటినుంచి తాను నమ్మిన విప్లవ ఆశయాలకోసం జీవితాంతం అంకితమై కృషిచేశారు. (చదవండి: జీవితంలో సాహిత్యాన్ని దర్శించిన విమర్శకుడు) ఒక మానవుడు మరో మానవున్ని దోచుకోవటానికి వీలులేని వ్యవస్థకు బాటలువేసే సోషలిస్టు సమాజంకోసం జ్వాలాముఖి పరితపించారు. ‘బాల్యానికి శిక్షణ, యవ్వనానికి క్రమశిక్షణ, వృద్ధాప్యానికి రక్షణలేని దేశం ఒక దేశమేనా?’ అని ప్రశ్నిస్తూ వచ్చారు. ప్రజలందరికీ ఇటువంటి మౌలిక సౌకర్యాలు సోషలిస్టు సమాజంలోనే సాధ్యపడతాయని, అటువంటి సమాజం కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని నొక్కి చెప్పేవారు. (చదవండి: మాలపల్లి నవల: నూరేళ్ల... విప్లవాత్మక సృజన) జ్వాలాముఖి చక్కటి వక్త. తన కంచుకంఠంతో శ్రోతలను ఉర్రూతలూగించి వారిలో విప్లవోత్తేజం కల్గించి చెరగని ముద్రవేసేవారు. తన వాగ్ధాటిద్వారా, తనదైన శైలిలో పాలకవర్గాలపై నిప్పులు కురిపిస్తూ ప్రజలను, విద్యార్థులను, యువకులను నిరంతరం చైతన్యవంతులను చేసేవారు. క్లిష్టసమస్యలపై సరైన అవగాహనను సాధారణ ప్రజలకు, విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో అనేక ఉపమానాలతో, కథలతో జోడించి చెప్పేవారు. ఆయన ఉపన్యాసాలు ఉత్తేజకరంగా, విజ్ఞానదాయకంగా ఉండటమేగాక ప్రజలను విప్లవకర్తవ్యోన్ముఖులను చేసేవిగా వుండేవి. అన్నిరంగాల ప్రజల హృదయాలలో విప్లవభావాలను గుదిగుచ్చటంలో ఆయనమేటి. విద్యార్థులను, యువకులను భావి భారతదేశపు ఆశాకిరణాలుగా జ్వాలాముఖి అభివర్ణించేవారు. నేటి భూస్వామ్య, సామ్రాజ్యవాద దోపిడీ వ్యవస్థ వెదజల్లే అరాచక, అశ్లీల సంస్కృతి ప్రభావంలో పడకుండా విద్యార్థులు, యువకులు నిరంతరం అప్రమత్తంగా వుండాలని, చైతన్యశీలురు కావాలని ఆయన నిత్యం ప్రబోధించేవారు. పురాణాలలోని, ఇతిహాస కథలలోని, స్వాతంత్య్ర పోరాటంలోని వీరుల త్యాగాలను తరచుగా ఉటంకిస్తూ ఆయన నేటి విద్యార్థులు, యువకులు అటువంటి వీరులనుండి ప్రేరణ, స్ఫూర్తిని పొంది దేశంలో మౌలికమార్పుల కోసం, మంచి సమాజ స్థాపనకోసం కృషిచేయాలని ప్రబోధించేవారు. భారత సమాజంలోని సమస్యలన్నింటికీ మౌలిక పరిష్కారమార్గాన్ని చూపిన దేవులపల్లి, టియన్‌ల విప్లవకర జీవితాలనుండి స్ఫూర్తిని పొందాలని చెప్పేవారు. ‘డివి, టియన్‌లు భారత విప్లవోద్యమంలో కృష్ణార్జునులవంటివారు’ అని ఆయన అభివర్ణించేవారు. (చదవండి: Mannu Bhandari: రాలిన రజనీగంధ) పేదరికం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం మొదలగు అనేక సమస్యలు చుట్టుముట్టినా లెక్కచేయకుండా జ్వాలాముఖి విప్లవ ఆశయాల కోసం జీవితాంతం పోరాడారు. ఆయన విప్లవకర జీవితం నుండి స్ఫూర్తిని, ప్రేరణనుపొంది తాను ఆశించిన నూతన సమాజస్థాపన కోసం కృషిచేయటమే నేటి ప్రజల ముఖ్యంగా విద్యార్థుల, యువజనుల కర్తవ్యం. ఆ విప్లవ తపస్వికి మనమందించే ఉత్తమమైన నివాళులు ఇవే. 2008 డిసెంబరు 14వ తేదీన కన్నుమూసిన జ్వాలాముఖికి అరుణారుణ జోహార్లు. – సి. భాస్కర్, యుసిసిఆర్‌ఐ (యంయల్) నేడు (డిసెంబరు 14) ప్రముఖ విప్లవకవి జ్వాలాముఖి వర్ధంతి -
నా జీవితమంతా సంఘర్షణే: నిఖిలేశ్వర్
సాక్షి, న్యూఢిల్లీ: ఆరు దశాబ్దాల సాహిత్య చరిత్రలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న ప్రసిద్ధ కవి, రచయిత, అనువాదకుడు నిఖిలేశ్వర్. సమాజంలో ఉన్న జాడ్యాలకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేలా దిగంబర సాహిత్యానికి అంకురార్పణ చేసిన ఆయన.. విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. యువత సంకుచిత భావాలను పక్కనపెట్టినప్పుడే పురోగతి సాధ్యమని చెప్పే ఆయన.. 83 ఏళ్ల వయసులోనూ చురుగ్గా, వినూత్నంగా ఆలోచిస్తుంటారు. తాను రాసిన అగ్నిశ్వాస కవితా సంపుటి (2015–2017)కిగాను శనివారం ఢిల్లీలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ప్రతినిధితో ప్రత్యేకంగా ముచ్చటించారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పరిణామాలు, ఆధునిక రచనలపై అభిప్రాయాలను, తన అనుభవాలను పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. మూఢ భక్తి, సంకుచిత జాతీయవాదం ప్రమాదకరం ఇప్పుడున్నది రచయితలకు పరీక్షా సమయం. జాతీయతను, దేశభక్తిని ప్రతీవ్యక్తి కోరుకుంటారు. కానీ ప్రజాస్వామిక, లౌకిక విధానాలతో, విలువలతో బ్రతుకుతున్న ఈ దేశంలో.. ప్రస్తుతం కనిపిస్తున్న మూఢ భక్తి, సంకుచిత జాతీయవాదం ప్రమాదకరంగా పరిణమించాయి. పాలకులు అసహనంతో ఉన్నారు. తప్పిదాలను, పొరపాట్లను ఎత్తిచూపితే సహించడం లేదు. అణచిపెట్టి జైలుపాలు చేస్తున్నారు. భీమా కోరేగావ్ మొదలు వరవరరావును జైలులో పెట్టడం దాకా అనేక ఘటనలు దీనికి ఉదాహరణగా నిలుస్తున్నాయి. నేడు స్వేచ్ఛ, స్వాతంత్య్రం, ప్రజల క్షేమం కోరే రచయితలు నిజంగా అగ్నిపరీక్ష ఎదుర్కొంటున్నట్టే. విప్లవమార్గం, ఉద్యమం దెబ్బతిన్నాయి గత 20 ఏళ్లలో ప్రధానంగా అస్తిత్వ పోరాటాల పరిణామం చోటు చేసుకుంది. ప్రతీవారు తమ ఉనికి కోసం, గుర్తింపు కోసం రచనలు చేయాలన్న ఆలోచన పెరిగింది. గుర్తింపుకోసం జరిగిన పోరాటంలో విప్లవ గ్రూపులుగానీ, కమ్యూనిస్టులుగానీ స్త్రీవాదులను, దళితులను పట్టించుకోలేదనే కారణంతో స్త్రీవాదం, దళితవాదం, మైనార్టీవాదం ఏర్పడ్డాయి. ఆయా వర్గాల్లో కొత్త రచయితలు రావడం మంచి పరిణామమే అయినా.. కేవలం వారి వర్గాలపైనే రచనలను కేంద్రీకరించడం వల్ల ప్రధానమైన విప్లవమార్గం, ఉద్యమం దెబ్బతిన్నాయి. దేశంలో ఈ అస్తిత్వ పోరాటాలు, వ్యక్తిత్వవాదుల సంఖ్య పెరిగింది. కార్మిక, రైతాంగ సంక్షేమం దిశగా రచనలు జరగాలి ఆరు దశాబ్దాల సామాజిక జీవిత అనుభవంతో గమనిస్తే.. తర్వాత తెలుగు సాహిత్యం ఇప్పటికీ సజీవంగా ఉందని కనిపిస్తోంది. చాలామంది సీనియర్ కవులు మంచి రచనలు చేస్తున్నారు. అయితే.. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని వ్యక్తివాద, సంకుచితదృష్టి నుంచి, మతవాదం నుంచి, కులతత్వం నుంచి రక్షించాల్సిన అవసరం ఉంది. సువిశాల దృష్టితో కార్మిక, రైతాంగ సంక్షేమం దిశగా రచనలు చేయాల్సి ఉంది. సగంమంది అమ్ముడుపోయారు రచయితల్లో కెరీర్‌పై దృష్టిపెట్టేవారు, డబ్బు కోసం రచనలు చేసేవారు ఎక్కువయ్యారు. నిబద్ధతతో ప్రజా ఉద్యమాలకు, ప్రజలకు గొంతుకగా మారడానికి తక్కువ మందే మిగిలారు. పైగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కొన్నేళ్లుగా చిత్రమైన పరిణామం చోటుచేసుకుంది. రెండు రాష్ట్రాల్లోనూ సగంమంది రచయితలు పాలకవర్గాలకు అమ్ముడుపోయారు. వారి బాకాలుగా మారిపోయారు. బుద్ధిజీవులు, మేధావులు సైతం తమ బాధ్యత మరిచిపోతున్నారు. పదవులకు, అవార్డులకు ఎగబడటం వల్లే ఈ పరిణామం ఏర్పడింది. సాహిత్యంలో ఒక విభజన రేఖ వచ్చేసింది. ఆ సాహిత్యాన్ని అపార్ధం చేసుకున్నారు దిగంబర కవుల పేరిట వచ్చిన మూడు సంపుటాలకు ప్రశంసలు, విమర్శలు రెండూ పొందాం. యువతరం, అభ్యుదయభావాలు ఉన్నవారు.. ఇది సమాజంలో ఒక షాక్ ట్రీట్మెంట్గా ఉందని, తిరుగుబాటు లక్ష్యాన్ని పొందుతుందని ప్రశంసలు ఇచ్చారు. కానీ ఇందులో అశ్లీల పదజాలాన్ని, బూతులు వాడారంటూ సాహితీవేత్తలు అపార్థం చేసుకొన్నారు. వారి విమర్శలను ఈ విషయంపైనే కేంద్రీకరించుకున్నారు. అంతేతప్ప దిగంబర కవుల నిజాయతీని, ధర్మాగ్రహాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఈ భిన్నాభిప్రాయాల వల్ల విమర్శలు ఎదుర్కొన్నాం. జీవితమంతా సంఘర్షణే.. నా జీవితమంతా సంఘర్షణే. చిన్నతనంలోనే నాన్న చనిపోవడంతో మా అమ్మ నగరానికి తీసుకొచ్చి పెంచి పోషించారు. అక్కడి నుంచే నా జీవిత పోరాటం మొదలైంది. హైస్కూల్ దశ దాకా అన్వేషణ, వెతుకులాట, దిశాహీనమైన పరిస్థితులను చూశాను. హైస్కూల్ దశ దాటుతుండగా సాహిత్యం, నిరంతర పఠనం నన్ను కాపాడాయి. కుంభం యాదవరెడ్డి పేరుతో రచనలు మొదలుపెట్టాను. కళాశాలలో చేరినప్పుడు తీసుకున్న ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, ఇంగ్లిష్ లిటరేచర్ సబ్జెక్టులు నా జీవితానికి సాహిత్యపరంగా, అవగాహనపరంగా ఊతమిచ్చాయి. రెండు, మూడు ఉద్యోగాలు మారడం, ప్రేమ వివాహం చేసుకోవడం మరో సంఘర్షణగా మిగిలాయి. గత ఆరు దశాబ్దాల్లో ఎన్నో తీపి, చేదు అనుభవాలు పొందాను. సాహిత్య పఠనం, నిరంతర అధ్యయనం నన్ను రక్షించాయి. నాకు సాహిత్య అకాడమీ అవార్డు వస్తుందని గత పదేళ్లుగా ప్రతి ఏటా నా మిత్రులు భావిస్తూ వచ్చారు. కానీ నేను ఏనాడూ అవార్డుల కోసం ఆశపడలేదు. ఇప్పుడు అవార్డు వచ్చినందుకు ఆనందంగానే ఉంది. ఆ కారణంగానే ‘విరసం’నుంచి బయటికి వచ్చాం దిగంబర కవులుగా 1965, 1967, 1968 సంవత్సరాల్లో మూడు సంపుటాలు వెలువరించాం. అందులోని దిగంబర కవులు నాటి యువతరానికి, వారి ధర్మాగ్రహానికి ప్రాతినిధ్యం వహించారు. ఆ మూడు సంపుటాల్లోనూ తాత్వికమైన, సిద్ధాంతపరమైన పరిణామాన్ని ఎదుర్కొన్నాం. ఈ పరిణామ క్రమంలో యువతరంలో సినిమా రంగం, రాజకీయ రంగాల పట్ల భ్రమలు తొలగిపోయాయి. నిరాశ, నిస్పృహలు, నిరుద్యోగం వల్ల ఆగ్రహం పెరిగింది. 1968–70 సమయంలో అంతర్జాతీయంగా ఉద్యమాలు వచ్చాయి. సహజంగానే నాటి యువ రచయితలు, మిగతావారు రచనలపరంగా, ప్రజలపరంగా మార్పు రావాలని కోరుకున్నారు. విప్లవమే మార్గమని యువత భావిస్తున్న సమయంలో.. నక్సల్బరీ ఉద్యమం, శ్రీకాకుళం గిరిజన తిరుగుబాటు వంటివి ఆశాకిరణంగా కనిపించాయి. యువతరం ఆ వైపు మొగ్గింది. ఆ క్రమంలోనే విప్లవ రచయితల సంఘం ఏర్పడింది. కానీ 1970–75 మధ్య విప్లవానికి ఏ పంథా అవసరం, ప్రజలు ఎలా పాల్గొంటారు, రచయితలు స్వతంత్రంగా రాయగలిగి ప్రజలకు చైతన్య స్ఫూర్తిని ఇవ్వాలే తప్ప పార్టీకి తోకగా మారవద్దన్న ఆలోచన మొదలైంది. దీనితో విరసంలో చీలిక వచ్చి.. 1975లో బయటికి వచ్చేశాం. -
కవిత్వంలా తరలిపోయిన ఆఫీసర్
అనేక అక్షరాలని, రంగులని, రాగాల మధ్య నుంచి నడిచే దారిని జాగ్రత్తగా వెతుక్కుంటూ ఆ యింటి గదుల్లోంచి ఆ టెర్రస్ వెన్నెల మీదకి వస్తే అక్కడ రజనీ పాటలో... చలం గారి సుధో... హిందుస్తానీ సంగీతమో మనల్ని చుట్టుకుంటుంది. వెన్నెలంత నిశ్శ బ్దంగా ఆ రాగాలని నింపుకొంటూ సదాశివరావుగారు. ఆ రోజు ఆ గెట్ టుగెదర్కి వారు ఆహ్వా నించిన కళారంగానికి సంబంధించిన వారెందరో ఆ గానాన్ని శ్వాసిస్తూ... ··· చాలా యేళ్ళ క్రిందట వారు ఫోన్ చేసి ‘నువ్వు వచ్చేయ్, ఫొటోలు తియ్యాలి’ అన్నారు. నా కథాసంపుటి ‘ద లాస్ ఆఫ్ యిన్నొసెన్స్’ ఆవిష్కరణకి వచ్చి నా చేతిలో వో వెడల్పాటి కవర్ పెట్టారు. విప్పి చూస్తే... Pleasant Surprise. దాదాపు 15 యేళ్ళ క్రితం తీస్తానని తీసిన నా ఫొటోలు. భలే దాచారే అనుకున్నా. యెప్పుడు యెక్కడ యెవరికి యే కానుకని యివ్వాలో తెలిసినవారు. ··· యీ విశిష్టమైన చదువరి ‘ఆత్మా ఫేక్టర్’ కథతో తెలుగు సాహిత్య రంగంలోకి రచయితగా అడుగిడి ప్రపంచ కవిత్వం నుండి తాను చేసిన అనువాదాలని యిటీవలే ‘కావ్యకళ’ పేరుతో పుస్తకంగా వెలువరించారు. ‘క్రాస్ రోడ్స్’ కథాసంపుటి, పాలపుంత, ఆత్మా ఫేక్టర్, కావ్యకళ, సైన్స్ ఫిక్షన్ రచయితల పరిచయాలు పుస్తకాలుగా వెలుపడ్డాయి. బ్రిటిష్ కాలానికి సంబంధించిన కొన్ని కథలని వారు యెంతో మమేకతతో రాశారు. యిటీవల నాలుగైదేళ్ళుగా సైన్స్ ఫిక్షన్ మీద ‘పాలపిట్ట’ పత్రికలో రాస్తూ వచ్చిన వ్యాసాలు తెలుగు సాహిత్యంలో అపు రూపమైనవి. ‘సైన్స్ ఫిక్షన్ రచయితలు’ పేరిట నాలుగు సంపుటాలుగా వెలువడ్డ ఆ వ్యాసాల్లో ఆయన చేసిన కృషి అద్భుతం. తెలుగులో మరెవ్వరూ వారి దరిదాపుల్లోకి రాలేరనిపించేట్టు వుండే ఆ వ్యాసాలు తెలుగులో చిర స్థాయిగా నిలిచిపోయే రచన. యెంతో చదువుకొన్నందుకు తెలుగువారికి వారు అందించిన మేలిమి కానుక ఆ వ్యాసాలు. ··· స్నేహశీలి సదాశివరావు గారికి స్నేహితులని కలవ లేదని బెంగ పడటం కంటే, యెలాగైనా వారిని కలవాలి అంతే కానీ టైమ్ లేదనుకో కూడదనుకొంటానని చెప్పారో సందర్భంలో. స్నేహితులని కలుసుకోవటం, సమయాలని రంగులమయం చేసుకోవటాన్ని వారు ప్రేమిస్తారు. వారికి బాపు అంటే బోలెడంత యిష్టం. చిత్రకారులు గోపి గారికి బాపు అవార్డ్ వచ్చిందని సంతోషపడుతూ, యేడవ తేదీ సాయంత్రం తమ యింటికి రమ్మని ఆహ్వానించారు. గోపీ గారు యిల్లు వెతుకుతూ ‘నాలుగేళ్ళ క్రితం వచ్చాను. యిల్లు తెలియటం లేదు’ అని కాల్ చేస్తే, ‘నే వస్తున్నా’ అని గోపిగారిని కలిసి మాట్లాడుతూ వారి యింటి వైపు నడుస్తున్నారు. సడన్‌గా సదాశివరావు గారు ‘‘యేమిటోలా వుంది’’ అని రోడ్డు పక్కనే ఆగి నిలబడలేక అలా పేవ్మెంట్ మీద కూర్చున్నారు. గోపిగారు వారి పక్కనే కూర్చుని సదాశివరావు గారి తలని వొడిలో పెట్టుకున్నారు. రోడ్డు మీద అటూయిటూ వెళ్తున్న వాహనాలు... మను షులు... కొద్ది దూరాన వున్న క్రాస్రోడ్స్కి చేరువగా... సైన్స్ ఫిక్షన్ రాగాల లోకాలకి... తనెంతో ప్రేమించే రంగులు విర జిమ్మే చిత్రకారుని చేతుల్లోనే ఆయన యీ లోకాన్ని విడిచి తరలిపోయారు. ··· ఆ మర్నాడు ధరమ్ కరమ్ రోడ్డులో వారి యింటి ప్రాంగణంలో కుటుంబసభ్యులు, కళాకారులు... వారు పని చేసిన డిపార్ట్మెంట్కి సంబంధించినవారు... యెందరో చెమ్మగిల్లిన మనసులతో. IPS 1967 Batchకి చెందిన సదాశివరావు... కె.వెంకటసుబ్బారావు, చంద్రకాంత పుష్పవేణమ్మ గార్లకు కృష్ణా జిల్లా అత్కురులో 15–7–1943న జన్మించారు. ఎమ్మెస్సీ జియాలజీని వెంకటేశ్వర యూనివర్సిటీలో చదు వుకొన్నారు. 1966లో ప్రమీల గారితో వివాహం జరిగింది. వారికి నలుగురు పిల్లలు... యామిని, హరిత, రంజిత్, వినయ. కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి. కె. సదాశివరావు గారికి వినమ్ర నమస్సులు. వ్యాసకర్త కుప్పిలి పద్మ, కవయిత్రి, రచయిత్రి. మొబైల్ : 98663 16174 kuppilipadma@gmail.com -
విధ్వంసంలో వివేచన
శతాబ్దాలుగా మానవజాతి మనుగడను ప్రశ్నించి, సవాలు విసిరిన మహమ్మారులు చరిత్ర పుటల్లో ఎన్నో ఉన్నాయి. సాంకేతికంగా ఎంతో పురోగతి సాధించిన ఈ ఆధునిక యుగంలో కూడా మానవాళిని కరోనా వణికించింది. ‘‘ఎన్నడూ ఏకంకాని మానవజాతి/ ఇప్పుడు ఒకే శ్రుతిలో స్పందిస్తున్నది’’ అంటారు ఆచార్య గోపి. వారు లాక్డౌన్ కాలంలో రాసిన కవితలను, ‘ప్రపంచీకరణ’, ‘కరోనా’ పదాల మేళవింపుతో ప్రపంచీకరోనా పేరుతో కవితాసంపుటిగా తెచ్చారు. ప్రపంచీకరణ లాభనష్టాలను పక్కనపెడితే, దాని వలన ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్‌గా మారిపోయింది. ‘‘ఒకప్పుడు విదేశీ యాత్రలు/ జ్ఞానాన్ని మోసుకొచ్చేవి/ ఇప్పుడు/ రోగాలను వెంట తెస్తున్నాయి/ వైశ్వీకరణం అంటే ఇదే కాబోలు!’’ అంటారు. ‘గృహమే కదా స్వచ్ఛందసీమ’ కవిత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ‘‘ఇంట్లో ఇంత దుమ్ము పేరుకుందా!/ ఇన్నాళ్లుగా చిన్నబుచ్చుకున్న వస్తుజాలం/ వన్నెచిన్నెలతో బయటపడుతుంది’’ అంటూ అపురూపంగా ఇంట్లోకి తెచ్చుకున్న వస్తువులని చూడలేకపోయిన మన చూపుల పొరలను తొలగిస్తారు. ‘‘బల్లమీద వజ్రవైడూర్యాల్లాంటి పుస్తకాలున్నాయి/ జ్ఞానాన్వయ నైపుణ్యంతో/ కాసేపయినా పుణుకులాడొచ్చు’’ అంటూ కంప్యూటర్ కాలం అని కాలర్ ఎగరేసే కొత్తతరాన్ని ఆలోచింపజేస్తారు. యాత్రికమైన జీవితయానంలో మనం చూడలేకపోయిన ఎన్నో విషయాలను పరిచయం చేస్తూనే– ‘‘ఇవాళ ఇంట్లో కూర్చుంటే/ ఇల్లులేనివాళ్లు గుర్తుకొస్తున్నారు/ తిండికోసం కండలు కరిగించే/ కష్టజీవులు కళ్లలో మెదుల్తున్నారు’’ అని శ్రమజీవులను ఆదుకోవాలనే విశ్వచైతన్యాన్ని కలిగిస్తారు. కవి ఎప్పుడూ ఒంటరి కాదు. ఎన్నో మూగగొంతుకల స్పందనలను తన అక్షరాల్లో పలికిస్తాడు. ‘వైద్యుడికే మన దండం’’కవితలో ‘‘చేతుల్నే కాదు/ మనసుల్నీ కడుక్కొని/ మరోసారి మరోసారి మరోసారి/ ఆ మానవోత్తమునికి/ నమస్కరిద్దాం’’ అంటారు. ‘‘భయంలోనైనా సరే/ నేను కవిత్వమే రాస్తాను/ అదే నా ధైర్యం’’ అంటారు. ఒకానొక కాలంలో ప్రాణాంతకమైన వ్యాధిగా పరిగణింపబడి, ఎన్నో ప్రాణాలను బలితీసుకున్న కలరా నిర్మూలన జ్ఞాపకాలను తన మూలల్లో నిలుపుకొని, సజీవచిత్రంగా మనముందు నిలిచిన ‘చార్మినార్’లాగే, ఈ ప్రపంచీకరోనా కవితాసంపుటి కూడా ఈ కరోనా విపత్తు కాలంలో జనావళి భావచిత్రాలను ముందుతరాలకు అందిస్తుంది. -కుడికాల వంశీధర్ -
స్త్రీవాద సాహిత్య యుగకర్త 'ఓల్గా'
సాక్షి,తెనాలి : తెలుగునాట స్త్రీవాద సాహిత్యాన్ని ఉద్యమ స్థాయికి తీసుకెళ్లేందుకు జీవితాన్ని అంకితం చేసిన ఆచరణశీలి ఓల్గా. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సాధికారికంగా ఉపన్యసించగల వక్త. కొత్త ఆలోచనలపై జరిగే దాడులను నిబ్బరంగా ఎదుర్కోగల సాహసి. మగవారికి మాత్రమే పరిమితమైన తాత్విక సైద్ధాంతిక రంగాల్లో ఒక స్త్రీగా ధీమాతో తిరుగాడిన మేధావి. ఈ సాహిత్య, సామాజిక, వ్యక్తిత్వ ప్రస్థానానికి నేటితో అర్ధ శతాబ్దం నిండింది. ఇదేరోజు ఏడు పదుల వయసులోకి ప్రవేశించటం మరో విశేషం! ఈ అరుదైన సందర్భాన్ని పురస్కరించుకుని ఓల్గా మిత్రులు ‘సాహిత్య సాన్నిహిత్య ఓల్గా ఎట్ 50’ సభను డిసెంబర్ 1న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. నారాయణగూడలోని రెడ్డి ఉమెన్స్ కాలేజీలో జరిగే సభలో కేఎన్ మల్లీశ్వరి సంపాదకత్వంలో తీసుకొచ్చిన ‘సాహిత్య సాన్నిహిత్య ఓల్గా’, ఓల్గా రచించిన ‘చలం–నేను’, ఆమెకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్నిచ్చిన ‘విముక’ కన్నడ అనువాద పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. కలాన్ని కదం తొక్కించి.. ప్రముఖ స్త్రీవాద స్వచ్ఛంద సంస్థ ‘అస్మిత’లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తూ ఓల్గా తన కలాన్ని కదం తొక్కించారు. ‘సహజ’, ‘మానవి’, ‘కన్నీటి కెరటాల వెన్నెల’, ‘ఆకాశంలోసగం’, ‘గులాబీలు’, ‘గమనమే గమ్యం’, ‘యశోబుద’ నవలలు రాశారు. చలం రచనల్లోని ఆరు స్త్రీ పాత్రలతో ‘వాళ్లు ఆరుగురు’ నాటకం రచించారు. ఆమె రాసిన ‘రాజకీయ కథలు’, ‘ప్రయోగం’ సంపుటాలు, స్త్రీ దేహాన్ని కేంద్రంగా చేసుకొని ఆలోచించటం, రాజకీయం చేయటాన్ని ఎండగట్టాయి. భిన్న సందర్భాలు, మృణ్మయనాథం, విముక్త, కథలు లేని కాలం.. వంటివి మరికొన్ని కథా సంపుటాలు. వీటిలో విముక్తకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. పలు అనువాద రచనలు, నృత్యరూపకాలు, సిద్ధాంతవ్యాసాలు రాశారు. అనేక పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. రచనల్లో సీత, అహల్య, శూర్పణఖ వంటి పురాణపాత్రల పేర్లను చేర్చటం, సందేశంతో కూడిన నృత్యరూపకాలను రాయటం, ప్రజలకు దగ్గరయే అంశాలతో స్త్రీవాదాన్ని వారి దగ్గరకు చేర్చటానికే అంటారామె. స్త్రీవాదం అంటే పురుషులకు వ్యతిరేకం కాదని, వారి మైండ్‌సెట్ మారాలనేది ఓల్గా చెప్పే మాట. సినిమా రంగంలోనూ.. అధ్యాపక వృత్తి తర్వాత హైదరాబాద్ వెళ్లిన ఓల్గా ‘భద్రం కొడుకో’, ‘తోడు’, ‘గాంధీ’ (డబ్బింగ్), ‘పాతనగరంలో పసివాడు’, ‘గులాబీలు’, ‘అమూల్యం’ సినిమాలకు స్క్రిప్టు, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా, పాటల రచన, సహాయ దర్శకురాలిగా రకరకాల బాధ్యతలు నిర్వర్తించారు. పలు టెలీఫిలింలు, టీవీ సీరియల్స్‌కూ పనిచేశారు. బీజింగ్‌లో జరిగిన మహిళల సదస్సు, అమెరికాలో ప్రపంచ మానవహక్కుల కాంగ్రెస్ సదస్సుకు హాజరయ్యారు. బంగ్లాదేశ్, బ్యాంకాక్లోనూ పర్యటించారు. పాటకు జాతీయ అవార్డులు ఆమె పాటలు రాసిన ‘భద్రం కొడుకో’ సినిమాకు రెండు జాతీయ అవార్డులొచ్చాయి. ‘తోడు’ సినిమాకు రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు దక్కింది. తనదైన సొంత నిబంధనలు, సిద్ధాంతాలతో వ్యక్తిగత స్వేచ్ఛ, సాధికారత కోసం కృషిచేస్తూ ఎందరో మహిళలకు స్ఫూర్తిని కలిగిస్తున్నారు. అందుకే ఓల్గా మిత్రులు సాహితీ సాన్నిహిత్య సభను ఏర్పాటు చేసి ఓల్గా తన రచనల్లో పదే పదే ప్రస్తావించిన ‘సిస్టర్హుడ్ రిలేషన్షిప్’ స్త్రీల మధ్య నిలిచి ఉందని రుజువు చేయనున్నారు. -
తెలుగుపై మమకారం.. సామాజిక రుగ్మతలపై చైతన్యం
సాక్షి, మహబూబ్‌నగర్ : సామాజిక రుగ్మతలు వెలుగు చూసినా.. అమానవీయ సంఘటన జరిగినా.. వాటి కుళ్లును తన కవితల ద్వారా ఇట్టే కడిగేస్తారు కవి ఖాజామైనొద్దీన్.. తెలుగు భాష కవి సమ్మేళనాలు ఎక్కడ జరిగినా తన కవితాగానంతో భాషాభిమానుల హృదయాలను చూరగొంటున్నారు.. వివిధ రాష్ట్రాల్లో పలు సంస్థలు నిర్వహించే తెలుగు, ఇంగ్లిష్, హిందీ సాహిత్య సభల్లో అనువాదకుడిగా పాల్గొంటూ అందరి ఆదరాభిమానాలు పొందుతున్నారు. జిల్లాకు చెందిన ప్రముఖ కవులు నరసింహమూర్తి, వల్లభాపురం జనార్దన, సోదరుడు మహమూద్‌ల స్ఫూర్తితో కవిగా రాణిస్తున్నాను. మాతృభాష ఉర్దూ అయినప్పటికీ తెలుగు భాషలో ఉన్న మాధుర్యాన్ని చవిచూశాను. సామాజిక మార్పే లక్ష్యంగా రచనలు రావాలి. సాహిత్యరంగం ద్వారా నేటికీ సేవ చేయడం గర్వంగా భావిస్తున్నాను. త్వరలో మరో తెలుగు కవితా సంపుటిని వెలువరిస్తాను. – ఖాజామైనొద్దీన్, కవి కుటుంబ నేపథ్యం.. పెబ్బేరు మండల కేంద్రానికి ఖాజామైనొద్దీన్ తన విద్యాభ్యాసం పెబ్బేరు, వనపర్తి, మహబూబ్‌నగర్‌లో పూర్తి చేసుకున్నారు. బీఎస్సీ పూర్తి చేసిన ఆయన హిందీ విద్వాన్లో పాసై టీటీసీలో శిక్షణ పొందిన అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నియామకమై 2014లో రిటైర్డ్ అయ్యారు. సాహిత్యసేవను ప్రవృత్తిగా మార్చుకొని కవిత్వంపై ఉన్న ఉత్సాహంతో కవిగా, రచయితగా ఎదిగి కవి సమ్మేళనాల్లో పాల్గొని తనదైన బాణిలో కవితాగానం చేస్తూ సాహిత్యాభిమానుల మన్ననలు పొందుతున్నారు. బహుమతులు, సన్మానాలు.. ఖాజామైనొద్దీన్ కవితలు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రసిద్ధి పొందడమే కాకుండా అనేక మ్యాగజైన్లు, పత్రికల్లో ప్రచురించబడ్డాయి. విద్యార్థి దశలో రచించిన కవితలకు నగదు బహుమతులు, ప్రశంసపత్రాలు లభించాయి. పాలమూరు గోస, పాలమూరు కవితలు అనే సంకలనాల్లో కొన్ని చోటు దక్కించుకున్నాయి. 1972లో పాఠశాల స్థాయిలో మినీ కథను రాసి ప్రథమ బహుమతి అందుకున్నారు. 1973లో జూనియర్ కళాశాల స్థాయి మ్యాగజిన్లో మొదటి కవిత ప్రచురణ అయ్యింది. 1977లో డిగ్రీలో ఖాజామైనొద్దీన్ సంపాదకత్వంలో పత్రిక విడుదల చేశారు. 1978లో ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో నిర్వహించిన కవితలలో మొదటి బహుమతి దక్చించుకున్నారు. 2006లో పాలమూరు జిల్లాతోపాటు హైదరాబాద్, కర్నూలు, కృష్ణ, ఖమ్మం, వరంగల్, విజయనగరం, కడప జిల్లాల్లో జరిగిన కవి సమ్మేళనాలకు హాజరై ప్రతిభచాటారు. 2008 హర్యానా రాష్ట్రంలోని అంబాలలో నిర్వహించిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలోనూ పాల్గొన్నారు. 2009 నాగార్జునసాగర్‌లో నిర్వహించిన సజన సంగమం కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే భువనేశ్వర్, వార్దా, చెన్నైలో జరిగిన ఇంటర్నేషనల్ రైటర్స్ ఫెడరేషన్ సదస్సుల్లో పాల్గొన్నారు. డెహ్రడూన్‌లో జరిగిన లాంగ్వేజెస్ ట్రాన్స్లేషన్ సెమినార్ వారి వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో పలు రాష్ట్రస్థాయి తెలుగు సమ్మేళనాల్లో పాల్గొన్నారు. 2014లో ‘చెమట ప్రవాహమై పారినా’ కవితా సంపుటిని రచించారు. హైదరాబాద్‌లో ప్రసిద్ధ రచయిత సినారేచే ప్రశంసాపత్రం అందుకున్నారు. 2016లో చత్తీస్గడ్ రాష్ట్రం దుర్గ్, 2017లో విశాఖపట్నంలో జరిగిన కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. 2017లో కరీంనగర్, అనంతపూర్‌లలో జరిగిన గిన్నిస్ రికార్డు కవి సమ్మేళనాల్లో పాల్గొని కవితాగానాన్ని వినిపించారు. 2018లో హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో, బెంగుళూర్లో జరిగిన ఇండోఏషియన్ అకాడమీ శతాధిక కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ ఏడాదిలో పలుచోట్ల జరిగిన కవి సమ్మేళనాల్లో పాల్గొని కవితలు వినిపించారు. ప్రస్తుతం తెలంగాణ సాహితీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. -
అంతర్జాతీయ స్థాయిలో తెలుగుకవులకు స్థానం
సాక్షి, నెల్లూరు(వీఆర్సీసెంటర్): అంతర్జాతీయ స్థాయిలో ఇద్దరు కవులకు స్థానం లభించడం తెలుగు వారందరికీ గర్వకారణమని సుప్రసిద్ధకవి, జిల్లా వాసి డాక్టర్ పెరుగు రామకృష్ణ పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన దక్షిణాసియా కవిత సంకలనంలో సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతల్లో ఒకరైన శివారెడ్డికి సోమవారం నెల్లూరు నగరంలో పెరుగు రామకృష్ణ సంపాదకీయం వహించి, వెలరించిన ‘దిపొయెట్రి ఆఫ్ సౌత్ ఏసియా’ పుస్తకాన్ని శివారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా పెరుగు మాట్లాడుతూ తొమ్మిది దేశాల కవుల సరసన ఇద్దరు తెలుగు కవులు శివారెడ్డి, పాపినేని శిశంకర్ నిలవడం అభినందనీయమన్నారు. సార్క్ దేశాల కవులు రాసిన 53 కవితల్లో వీరి కవితలు కూడా ఉండడం తెలుగువారందరికీ గర్వకారణమ న్నారు. తెలుగుభాష కన్వీనర్ కూడా అయిన శివారెడ్డి రాసి ప్రచురించిన కవితలతో వారికి తెలుగుకవుల ప్రతిభాపాటవాలు ఇతర భాషా కవులకు తెలియవచ్చిందని పేర్కొన్నారు. -
కవి గోపికి చైనా ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి, ఆచార్య డాక్టర్ ఎన్.గోపికి చైనా నుంచి అరుదైన ఆహ్వానం అందింది. బీజింగ్ నార్మల్ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ రచనా కేంద్రంలో అంతర్జాతీయ సాహిత్యంపై ఈ నెల 21 నుంచి 29 వరకు జరగనున్న కార్యక్రమానికి హాజరవ్వాలని కోరింది. ఈ మేరకు రచనా కేంద్రం కార్యనిర్వాహక డైరెక్టర్ ఝంగ్ కింఘ్వా ఆహ్వాన లేఖలో ఆయనను కోరారు. వివిధ దేశాల సాహిత్య వినిమయం, పరస్పర అవగాహనే కార్యక్రమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. దీనిలో భాగంగా అనువాద శిబిరాలు, కావ్యపఠనాలు, సాహిత్య గోష్టులు తదితర కా ర్యక్రమాల్లో అమెరికా, క్యూబా, జర్మనీ, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, భారత్ నుంచి ఒక్కరు చొప్పున పాల్గొననున్నారు. చైనా నుంచి ఆరుగురు కవులు పాల్గొంటుండగా.. భారత్ నుంచి తెలుగు కవి గోపి ఎంపిక కావడం విశేషం. ఈ నెల 20న హైదరాబాద్ నుంచి ఆయన బీజింగ్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా గోపి ‘సాక్షి’తో మాట్లాడారు. ఆహ్వానం అందడంపై చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో చాలా దేశాలకు వెళ్లి వచ్చానని, ఒక్క చైనా మాత్రమే వెళ్లలేకపోయానని.. అది కూడా ప్రసుత్తం తీరిపోనుందని చెప్పారు. -
ఆధిపత్య భాషల వెన్నుపోటుకి బలైన తెలుగు
‘తెలుగువారికి సొంత భాష లేదు. తెలుగు నేలమీద చెలామణిలో వున్న సాహిత్యం తెలుగు కాదు. అది సంస్కృత పురాణేతిహాసాలకు అనువాదమే. లేదా వాటికి అనుకరణే. తెలుగు భాషలో మౌలికమైన రచయితలూ కవులూ లేరు. వెయ్యేళ్ళుగా కవులుగా గుర్తింపు గౌరవం పొందుతున్న కవులెవరూ కవులు కారు. మనకున్నది అనువాదకులూ అనుకర్తలు మాత్రమే. నిజానికి మనం రాసే భాషే తెలుగు కాదు. సంస్కృతం ప్రాకృతం ఉర్దూ ఇంగ్లీషు భాషల ప్రభావానికి లోనై అది సహజత్వాన్ని కోల్పోయింది. అందుకే మన భాషలో డెబ్బై శాతం పరాయి భాషా పదాలే కనిపిస్తాయి.పరాయి భాషా పదాల్ని వాడీ వాడీ చివరికి తెలుగు మాటల్ని మరిచిపోయాం అందువల్ల యెంతో భాషా సంపదని కోల్పోయాం, సొంత సంస్కృతికి దూరమయ్యాం’. అరవై యేళ్లకి పూర్వం యెంతో ఆవేదనతో యీ అభిప్రాయాలు వ్యక్తం చేసి తెలుగు భాష దుస్థితికి కారణాలు అన్వేషించిన భాషా శాస్త్రవేత్త బంగారయ్య. చావు బతుకుల్లో ఉన్న భాషల జాబితాలో చేరడానికి తెలుగు సిద్ధంగా ఉందని భాషా వేత్తలు ఇప్పుడు హెచ్చరిస్తున్నారు గానీ ఈ వినాశనానికి బీజాలు వేసినవాడు వాగనుశాసన బిరుదాంకితుడు నన్నయేనని కుండ బద్దలు కొట్టినవాడు బంగారయ్య. వాడుకలో వున్న తెలుగును కాదని భారతానువాదాన్ని డుమువులు చేర్చిన సంస్కృత పదాలతో నింపి పెట్టిన నన్నయ ఆదికవి కాదు తొలి వెన్నుపోటుగాడని ఆయన తీర్మానించాడు. గాసట బీసటగా వున్న తెలుగుని నన్నయ ఉద్ధరించాడు అని చెబుతారుగానీ నిజానికి సంస్కృతంతో కలగాపులగం చేసి భాషని భ్రష్టు పట్టించాడనీ వందల యేళ్ళు అదే కొనసాగిందనీ మనవి కాని ఇతివృత్తాల్నీ మనవి కాని ఛందో రీతుల్నీ స్వీకరించడం వల్ల పరాయి భాషకి దాస్యం చేయడం వల్ల తెలుగు జాతి ఉనికే ప్రశ్నార్థకమైందనీ భాషమీద అలవికాని ప్రేమతో తెలుగు నానుడి కూటమి స్థాపించి తెలుగా ఆంధ్రమా?, నుడి–నానుడి వంటి గ్రంథాల ద్వారా ప్రచారం చేసిన బంగారయ్య అసలు పేరు సత్యానందం. సొంత పేరులో సంస్కృతం ఉందని బంగారయ్యగా మారాడు. ‘కాలా’ సినిమాలో పా. రంజిత్ ప్రతిపాదించిన వర్ణ సిద్ధాంతాన్ని అప్పుడే (1965) ‘నలుపుచేసిన నేరమేమిటి?’ అన్న గ్రంథం ద్వారా ప్రచారం చేశాడు. చనిపోడానికి (1992) కొద్ది కాలం ముందు దళిత అస్తిత్వానికి సంబంధించి అనేక మౌలికమైన ఆలోచనల్ని (chduled castes stabbed, Schduled castes: search for Identity) గ్రంథ రూపంలో ప్రకటించాడు. ఇన్ని చేసీ అనామకంగా అజ్ఞాతంగా ఉండిపోయిన భాషా తాత్వికుడు బంగారయ్య. బంగారయ్య గొప్ప విద్యావేత్త. ప్రజా సమూహాల ఉచ్చారణని ప్రామాణికంగా తీసుకొని సంస్కృ త వర్ణాలు వదిలేస్తే తెలుగు అక్షరమాల సగానికి సగం తగ్గి అమ్మ నుడి నేర్చుకునే పసి పిల్లల మీద భారం తగ్గుతుందని భావించాడు. అందుకు అనుగుణంగా వ్యాకరణం, నుడిగంటులు (నిఘంటువులు) నిర్మించుకొనే పద్ధతులు బోధించాడు. పిల్లలకు వాచక పుస్తకాలు ఎలా ఉండాలో నిర్దేశించాడు. భిన్న ప్రాంతాల మాండలికాలని కలుపుకుంటూ పోయినప్పుడే భాష పెంపొందుతుందని గ్రహించాడు. అరువు తెచ్చుకోకుండా అవసరానుగుణంగా కొత్త పదబంధాలను సొంత భాషలోనే నిర్మించుకోవచ్చని స్వయంగా ఎన్నో పదాల్ని పుట్టించి నిరూపించాడు. వస్తు రూపాల్లో తెలుగుదనం చిప్పిల్లే మూల రచనల కోసం పరితపించాడు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఆజీవితం కృషి చేశాడు. కానీ ఆధిపత్య కులాల వర్గాల భాషా రాజకీయాల కారణంగా ఆయనకు రావలసిన గుర్తింపు రాలేదు. అయితే బంగారయ్య తెలుగు భాష పెంపుదల గురించి రచించిన గ్రంథాల్ని, చేసిన సూచనల్ని జయధీర్ తిరుమలరావు ‘నడుస్తున్న చరిత్ర’ పత్రికా ముఖంగా ప్రకటించడంతో భాషోద్యమకారుల్లో చలనం వచ్చింది. స.వెం. రమేశ్ వంటి రచయితలు అచ్చమైన తెలుగులో కథలు రాసి (కతల గంప) యితర భాషా పదాలు లేకుండా పాపులర్ రచనలకు పాఠకుల మన్నన పొందవచ్చని నిరూపించాడు. హోసూరు మొరసునాడు మొ‘‘ ప్రాంతాల యువ రచయితలు దాన్ని అందిపుచ్చుకున్నారు. కానీ బంగారయ్య నిరసించిన పరభాషా దాస్యం ఇప్పుడు చుక్కలనంటింది. పాలకులు ఒంట బట్టించుకున్న రాజకీయ ఆర్ధిక బానిసత్వం భాషకు సోకింది. ఒకప్పుడు సంస్కృతానికి తలవొగ్గాం, ఇప్పుడు ఇంగ్లిష్‌కి ఊడిగం చేస్తున్నాం. రెండు రాష్ట్రాల్లో ఏలికల చలవ వల్ల తెలుగు మీడియం స్కూళ్ళు మూతబడుతున్నాయి. తెలుగు మాధ్యమంలో బోధనకి కాలం చెల్లిందని చెప్పి ప్రాథమిక స్థాయి నుంచే తెలుగుని ఒక సబ్జెక్టుగా కుదించేసి భాషని ఉద్ధరిస్తున్నామని పాలకులు బుకాయిస్తున్నారు. తెలుగులో చదివితే పనికి రాకుండా పోతామని బెదిరిస్తున్నారు. ఉద్యోగాల పోటీలో నిలవాలంటే ఇంగ్లిష్ మీడియంలోనే చదవాలని ఊదరగొడుతున్నారు. తల్లిభాషను కాపాడుకోవాల్సిన ఇటువంటి తరుణంలో ‘వాగరి’ బంగారయ్య ప్రతిపాదించిన భాషా వాదాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అమ్మ నుడిని నానుడిని రక్షించుకోలేని జాతికి మనుగడ లేదు. ప్రతులకు: అన్ని పుస్తక దుకాణాల్లో లభ్యం (నేడు హైదరాబాదులో ఇందిరాపార్కు సమీపంలోని ఆర్ట్స్ అండ్ లెటర్స్ సమావేశ మందిరంలో బంగారయ్య రచించిన నుడి–నానుడి గ్రంథావిష్కరణ) ఎ.కె. ప్రభాకర్ ‘ మొబైల్ : 76800 55766