జ్వాలాముఖి
చరిత్రలో రెండురకాల కవులు, కళాకారులు మనకు గోచరిస్తారు. ప్రభు వర్గాలను, పాలకవర్గాలను కీర్తిస్తూ వారి దోపిడీ, పీడనలను సమర్థిస్తూ వారి అడుగులకు మడుగులొత్తే కవులు, కళాకారులు ఒక కోవకు చెందినవారు. కాగా దానికి భిన్నంగా పాలకవర్గాలను, వారి దోపిడీని వ్యతిరేకిస్తూ ప్రజల, పీడితుల పక్షం వహించి తమ గళాన్ని, కలాన్ని ప్రజల ప్రయోజనాలకోసం సంధించే కవులు, కళాకారులు రెండోకోవకు చెందుతారు. తన జీవితం చివరిక్షణం వరకు పాలకవర్గాలపై, దోపిడీవ్యవస్థపై నిప్పులు కురిపిస్తూ తన ప్రతిభాపాటవాలను, శక్తిసామర్థ్యాలను ప్రజలకోసం ధారపోసిన జ్వాలాముఖి రెండోకోవకు చెందిన కవులలో ప్రముఖుడు.
జ్వాలాముఖి 1938 ఏప్రిల్ 12న హైదరాబాదులోని సీతారాంబాగ్ దేవాలయంలో జన్మించారు. చిన్నతనంలోనే తాను నివాసముండే దేవాలయ ప్రాంగణంలోని పేద అర్చకుల ఇండ్లస్థలాల సమస్యపై పోరాటం చేసి పేద ప్రజల ప్రేమకు పాత్రుడయ్యారు. ఎన్నో రుగ్మతలకు ఆలవాలమైన నేటి దోపిడీ వ్యవస్థపై ‘దిగంబరకవి’గా తిరుగుబాటు బావుటాను ఎగురవేశారు. క్రమంగా తన నిరంతర అధ్యయనం, పరిశీలన ద్వారా నేటి సమాజంలోని ప్రజల కడగండ్లకు దేశంలో కొనసాగుతున్న భూస్వామ్య, సామ్రాజ్యవాద దోపిడీ వ్యవస్థే మూలకారణమని గ్రహించుకున్నారు. భారత విప్లవోద్యమ నాయకులు తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావుల సాంగత్యంతోను; వారి బోధనలు, రచనలతోను ప్రభావితులయ్యారు. భారతదేశంలో అనుసరించవలసిన విప్లవమార్గం పట్ల స్పష్టతను ఏర్పరచుకున్నారు. అప్పటినుంచి తాను నమ్మిన విప్లవ ఆశయాలకోసం జీవితాంతం అంకితమై కృషిచేశారు. (చదవండి: జీవితంలో సాహిత్యాన్ని దర్శించిన విమర్శకుడు)
ఒక మానవుడు మరో మానవున్ని దోచుకోవటానికి వీలులేని వ్యవస్థకు బాటలువేసే సోషలిస్టు సమాజంకోసం జ్వాలాముఖి పరితపించారు. ‘బాల్యానికి శిక్షణ, యవ్వనానికి క్రమశిక్షణ, వృద్ధాప్యానికి రక్షణలేని దేశం ఒక దేశమేనా?’ అని ప్రశ్నిస్తూ వచ్చారు. ప్రజలందరికీ ఇటువంటి మౌలిక సౌకర్యాలు సోషలిస్టు సమాజంలోనే సాధ్యపడతాయని, అటువంటి సమాజం కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని నొక్కి చెప్పేవారు. (చదవండి: మాలపల్లి నవల: నూరేళ్ల... విప్లవాత్మక సృజన)
జ్వాలాముఖి చక్కటి వక్త. తన కంచుకంఠంతో శ్రోతలను ఉర్రూతలూగించి వారిలో విప్లవోత్తేజం కల్గించి చెరగని ముద్రవేసేవారు. తన వాగ్ధాటిద్వారా, తనదైన శైలిలో పాలకవర్గాలపై నిప్పులు కురిపిస్తూ ప్రజలను, విద్యార్థులను, యువకులను నిరంతరం చైతన్యవంతులను చేసేవారు. క్లిష్టసమస్యలపై సరైన అవగాహనను సాధారణ ప్రజలకు, విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో అనేక ఉపమానాలతో, కథలతో జోడించి చెప్పేవారు. ఆయన ఉపన్యాసాలు ఉత్తేజకరంగా, విజ్ఞానదాయకంగా ఉండటమేగాక ప్రజలను విప్లవకర్తవ్యోన్ముఖులను చేసేవిగా వుండేవి. అన్నిరంగాల ప్రజల హృదయాలలో విప్లవభావాలను గుదిగుచ్చటంలో ఆయనమేటి.
విద్యార్థులను, యువకులను భావి భారతదేశపు ఆశాకిరణాలుగా జ్వాలాముఖి అభివర్ణించేవారు. నేటి భూస్వామ్య, సామ్రాజ్యవాద దోపిడీ వ్యవస్థ వెదజల్లే అరాచక, అశ్లీల సంస్కృతి ప్రభావంలో పడకుండా విద్యార్థులు, యువకులు నిరంతరం అప్రమత్తంగా వుండాలని, చైతన్యశీలురు కావాలని ఆయన నిత్యం ప్రబోధించేవారు. పురాణాలలోని, ఇతిహాస కథలలోని, స్వాతంత్య్ర పోరాటంలోని వీరుల త్యాగాలను తరచుగా ఉటంకిస్తూ ఆయన నేటి విద్యార్థులు, యువకులు అటువంటి వీరులనుండి ప్రేరణ, స్ఫూర్తిని పొంది దేశంలో మౌలికమార్పుల కోసం, మంచి సమాజ స్థాపనకోసం కృషిచేయాలని ప్రబోధించేవారు. భారత సమాజంలోని సమస్యలన్నింటికీ మౌలిక పరిష్కారమార్గాన్ని చూపిన దేవులపల్లి, టియన్‌ల విప్లవకర జీవితాలనుండి స్ఫూర్తిని పొందాలని చెప్పేవారు. ‘డివి, టియన్‌లు భారత విప్లవోద్యమంలో కృష్ణార్జునులవంటివారు’ అని ఆయన అభివర్ణించేవారు. (చదవండి: Mannu Bhandari: రాలిన రజనీగంధ)
పేదరికం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం మొదలగు అనేక సమస్యలు చుట్టుముట్టినా లెక్కచేయకుండా జ్వాలాముఖి విప్లవ ఆశయాల కోసం జీవితాంతం పోరాడారు. ఆయన విప్లవకర జీవితం నుండి స్ఫూర్తిని, ప్రేరణనుపొంది తాను ఆశించిన నూతన సమాజస్థాపన కోసం కృషిచేయటమే నేటి ప్రజల ముఖ్యంగా విద్యార్థుల, యువజనుల కర్తవ్యం. ఆ విప్లవ తపస్వికి మనమందించే ఉత్తమమైన నివాళులు ఇవే. 2008 డిసెంబరు 14వ తేదీన కన్నుమూసిన జ్వాలాముఖికి అరుణారుణ జోహార్లు.
– సి. భాస్కర్, యుసిసిఆర్‌ఐ (యంయల్)
నేడు (డిసెంబరు 14) ప్రముఖ విప్లవకవి జ్వాలాముఖి వర్ధంతి
Comments
Please login to add a commentAdd a comment