తన అరవై మూడేళ్ళ జీవితాన్ని మనుషుల పట్ల ప్రేమతో, మాటల మృదుత్వంతో, సున్నిత మానవీయ సంస్పందనతో వెలిగించినవారు ఎండ్లూరి సుధాకర్. కవిగా ఎంత భావుక త్వంతో, కళా నియమాలతో ఉంటారో– సామా జిక వాస్తవాల పట్ల అంత స్పష్టంగానూ ఉంటారు. ప్రాచీన సాహిత్యాన్ని దాని స్థలకాల సందర్భాల నుంచి అంచనా వేస్తూ విస్తృతంగా చదివిన అరుదైన ఆధు నిక కవి. గతాన్ని పట్టు కొని వేలాడే గబ్బిలం కాదాయన, వర్తమాన సామాజిక చేతనా కవి. చుండూరు మీదుగా కవితా భాషణ మొద లుపెట్టి వర్గీకరణ దండోరా మోగిస్తూ తానే ఉద్యమమై నడి చారు.
కనుకనే ‘‘ఓ నా చండాలికా!/నీ వెండి కడియాల నల్ల కాళ్ళముందు/వెయ్యేళ్ళ కావ్య నాయికలు వెలవెల బోతున్నారు’’ అంటూ దళిత శ్రామిక స్త్రీ సౌందర్యాన్ని ఉత్పత్తి సాధ నాల, క్రియా కలాపాలతో అనుసంధానం చేసి ఆవిష్కరించారు. మాదిగ మహా జీవన సంస్కృ తికి ‘మల్లెమొగ్గల గొడుగు’ పట్టారు. ‘దుఃఖై ర్లాంజీ’ అయి నిలువునా కరిగిపోయారు. ఎడ బాసిన సహచరిని తలచుకొంటూ రోజుకొక స్మృతి గీతమయ్యారు.
ఎండ్లూరి సహచరి పుట్ల హేమలత. 2010లో ప్రారంభమైన ప్రజాస్వామిక రచయి త్రుల వేదిక ప్రయాణంలో చురుకుగా పాల్గొన్న రచయిత్రి. భార్యగా ఆమె కోణంనుండి ఆయన పట్ల ఏ ఫిర్యాదూ పదేళ్ల సహయానంలో మేము వినలేదు. మూడేళ్ళ కిందట తన సహచరి చివరి క్షణాల్లో ఆమె పట్ల ఆయన చూపిన ప్రేమ ప్రకటన ఒక గొప్ప కావ్యం. ప్రరవే తరపున హేమలత సంపాదకత్వం వహించిన బోల్షివిక్ విప్లవ స్ఫూర్తి వ్యాస సంకలనాన్ని పసిబిడ్డని ఎత్తుకున్నంత అపురూపంగా తీసుకువచ్చి ఆమె తలాపున పెట్టారు. సాహిత్యమే తన నినాదం అయినప్పటికీ హేమలత చివరి ఊరేగింపులో తాను ముందు నిలబడి ‘విప్లవం వర్ధిల్లాలి’ అని నినదించారు.
తను చెప్పాలనుకున్న మాటలు దూరం నుంచి చెప్పే అలవాటు లేదాయనకి. ఈ వివక్ష తప్పు అని మనిషిని దగ్గరకి తీసుకుని చెపుతారు కనుకనే వేలమంది విద్యార్థులకి, సాహిత్య ప్రేమికులకి ఆయనంటే అపరిమితమైన ఇష్టం. ప్రేమతో పోరాటంతో, అక్షరంతో వాక్కుతో భిన్నవర్గాల మధ్య సంభాషణకి తానొక వంతెన అయ్యారు. సాహిత్య సామాజిక బోధనా రంగాల్లో తన అవసరం మరింతగా ఉన్న కాలంలో ఎండ్లూరి సుధాకర్ కన్ను మూయడం విషాదం.
– కె.ఎన్. మల్లీశ్వరి, కాత్యాయనీ విద్మహే
ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక
Comments
Please login to add a commentAdd a comment