Katyayani Vidmahe
-
అనువాదాలు అవసరమైన సామాజిక సందర్భాలు
సృజన సాహిత్యానికి ఉన్నట్లు అనువాదానికి ఒక సామాజిక సాంస్కృతిక సందర్భం ఉంటుందా? ఉంటుంది అనే చరిత్ర చెబుతున్నది. బౌద్ధ జైన మత సంస్కృతులను అభావం చేస్తూ ‘వర్ణాశ్రమ ధర్మ పరి రక్షణ’, ‘మను మార్గ వర్తన’ ప్రధానంగా గల వైదిక మత స్థాపన నాటి మత సాంస్కృతిక అవసరంగా ముందుకు వచ్చినపుడు తెలుగు సమాజానికి సంస్కృతం నుండి మహాభారత అనుసృజన అవసరమైంది. జాతీయోద్యమ నిర్మాణానికి భారతదేశపు భిన్న ప్రాంతాల, భాషల ప్రజా సమూహాల మధ్య ఐక్యతా భావాన్ని అభివృద్ధి చెయ్య వలసిన సందర్భం నుండి అనువాదం ప్రాధాన్యం లోకి వచ్చింది. దేశాల సరిహద్దులతో నిమిత్తం లేకుండా మానవ సమూహమంతా ఉన్నవాళ్లు, లేనివాళ్లు అని రెండు వర్గాలుగా విడిపోయివుందనీ, బ్రిటన్‌లోని పారిశ్రామికాభివృద్ధి నేపథ్యంలో పెట్టు బడిదారీ సమాజం అభివృద్ధి చెందిన విధానాన్ని గుర్తించి, కార్మికవర్గ అంతర్జాతీయ ఐక్యతను సంభావించిన మార్క్స్, ఎంగెల్స్ విశ్వమానవుల మధ్య సంభాషణకు తలుపులు తెరిస్తే సాహిత్య రంగంలో అది అనువాదాలకు దారితీసింది. 1917 రష్యా విప్లవ విజయం తరువాత భారత దేశంలోని కార్మిక కర్షక పోరాటాలకు స్ఫూర్తి ఇవ్వటానికి ‘అమ్మ’ (మాక్సిమ్ గోర్కీ) వంటి నవలలు తెలుగులోకి అనువాదం కావడం గమ నించవచ్చు. 1930వ దశకంలో ప్రారంభమై 1950ల వరకు సాగిన అభ్యుదయ సాహిత్యోద్యమం... ప్రపంచంలో భూస్వామ్య పెట్టుబడిదారీ ఆధిపత్యాల మీద జరిగిన తిరుగుబాట్ల చరిత్రను భిన్న దేశాల సాహిత్యం నుంచి అనువాదం చేసుకొన్నది. మరొక వైపు దేశంలోనే భిన్న ప్రాంతాలలో భూస్వామ్య పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలు వస్తువుగా వచ్చిన సాహిత్యాన్ని అనువాదం చేసుకొన్నది. మొత్తంగా ఇవన్నీ దేశం మీద జరుగుతున్న పీడితుల పోరాట చరిత్రకు నైతిక మద్దతు కూడగట్టడంలో కీలకపాత్ర పోషించాయి. అలాగే విప్లవోద్యమ అవసరాల నుండి చైనా విప్లవోద్యమం, లాటిన్ అమెరికా, ఆఫ్రికన్ దేశాలు, అమెరికా సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలకు సంబం ధించిన కథనాలు అనేకం తెలుగులోకి అనువాదం అయ్యాయి. ఈ రకమైన అనువాద చరిత్రను స్త్రీల కోణం నుండి అధ్యయనం చేయటం స్త్రీల సాహిత్య, సాంస్కృతిక చరిత్ర నిర్మాణం దృష్ట్యా అవసరం. ఇది రెండు రకాలుగా జరగాలి. ఒకటి: స్త్రీల జీవన సమస్యలను, సంఘర్షణలను చిత్రించిన సైద్ధాంతిక సృజన విమర్శన సాహిత్యాన్ని ఎంతగా తెలుగులోకి తెచ్చుకున్నాం? అందువల్ల తెలుగు సమాజ తాత్విక భావధార ఎంత పదునెక్కింది? అన్న ప్రశ్నలతో తరచి చూడటం. రెండు: అనువాదకులుగా తెలుగు స్త్రీల అభిరుచులు, ఆసక్తులు, చైతన్యం ఎటువంటివి? వారు చేసిన అనువాదాల సందర్భశుద్ధి ఎటువంటిది? వంటి ప్రశ్నలతో మదింపు చేయటం. ఇతర భాషలలోని స్త్రీల రచనలు, తెలుగులో స్త్రీలు చేసిన అనువాదాలు తెలుగు సమాజంలో మహిళా సమస్యల గురించిన అవగాహనను పదునెక్కించటంలో నిర్వహించిన పాత్రను ప్రత్యేకంగానూ, సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక సందర్భాలకు అనువాదాల ద్వారా స్త్రీలు సమకూర్చిన శక్తిని మొత్తంగానూ అర్థం చేసుకొనటాన్ని ఉద్దేశించి ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ‘అనువాద సాహిత్యం – స్త్రీ సందర్భం’ అనే అంశంపై ఆరవ మహాసభను జూలై 9, 10 తేదీలలో గుంటూరులో నిర్వహించ తలపెట్టింది. ఈ సదస్సులో పాల్గొనవలసిందిగా అందరినీ ఆహ్వాని స్తున్నది. (క్లిక్: తరతరాలనూ రగిలించే కవి) - కాత్యాయనీ విద్మహే జాతీయ కార్యదర్శి, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక -
మల్లెమొగ్గ లాంటి మనిషి
తన అరవై మూడేళ్ళ జీవితాన్ని మనుషుల పట్ల ప్రేమతో, మాటల మృదుత్వంతో, సున్నిత మానవీయ సంస్పందనతో వెలిగించినవారు ఎండ్లూరి సుధాకర్. కవిగా ఎంత భావుక త్వంతో, కళా నియమాలతో ఉంటారో– సామా జిక వాస్తవాల పట్ల అంత స్పష్టంగానూ ఉంటారు. ప్రాచీన సాహిత్యాన్ని దాని స్థలకాల సందర్భాల నుంచి అంచనా వేస్తూ విస్తృతంగా చదివిన అరుదైన ఆధు నిక కవి. గతాన్ని పట్టు కొని వేలాడే గబ్బిలం కాదాయన, వర్తమాన సామాజిక చేతనా కవి. చుండూరు మీదుగా కవితా భాషణ మొద లుపెట్టి వర్గీకరణ దండోరా మోగిస్తూ తానే ఉద్యమమై నడి చారు. కనుకనే ‘‘ఓ నా చండాలికా!/నీ వెండి కడియాల నల్ల కాళ్ళముందు/వెయ్యేళ్ళ కావ్య నాయికలు వెలవెల బోతున్నారు’’ అంటూ దళిత శ్రామిక స్త్రీ సౌందర్యాన్ని ఉత్పత్తి సాధ నాల, క్రియా కలాపాలతో అనుసంధానం చేసి ఆవిష్కరించారు. మాదిగ మహా జీవన సంస్కృ తికి ‘మల్లెమొగ్గల గొడుగు’ పట్టారు. ‘దుఃఖై ర్లాంజీ’ అయి నిలువునా కరిగిపోయారు. ఎడ బాసిన సహచరిని తలచుకొంటూ రోజుకొక స్మృతి గీతమయ్యారు. ఎండ్లూరి సహచరి పుట్ల హేమలత. 2010లో ప్రారంభమైన ప్రజాస్వామిక రచయి త్రుల వేదిక ప్రయాణంలో చురుకుగా పాల్గొన్న రచయిత్రి. భార్యగా ఆమె కోణంనుండి ఆయన పట్ల ఏ ఫిర్యాదూ పదేళ్ల సహయానంలో మేము వినలేదు. మూడేళ్ళ కిందట తన సహచరి చివరి క్షణాల్లో ఆమె పట్ల ఆయన చూపిన ప్రేమ ప్రకటన ఒక గొప్ప కావ్యం. ప్రరవే తరపున హేమలత సంపాదకత్వం వహించిన బోల్షివిక్ విప్లవ స్ఫూర్తి వ్యాస సంకలనాన్ని పసిబిడ్డని ఎత్తుకున్నంత అపురూపంగా తీసుకువచ్చి ఆమె తలాపున పెట్టారు. సాహిత్యమే తన నినాదం అయినప్పటికీ హేమలత చివరి ఊరేగింపులో తాను ముందు నిలబడి ‘విప్లవం వర్ధిల్లాలి’ అని నినదించారు. తను చెప్పాలనుకున్న మాటలు దూరం నుంచి చెప్పే అలవాటు లేదాయనకి. ఈ వివక్ష తప్పు అని మనిషిని దగ్గరకి తీసుకుని చెపుతారు కనుకనే వేలమంది విద్యార్థులకి, సాహిత్య ప్రేమికులకి ఆయనంటే అపరిమితమైన ఇష్టం. ప్రేమతో పోరాటంతో, అక్షరంతో వాక్కుతో భిన్నవర్గాల మధ్య సంభాషణకి తానొక వంతెన అయ్యారు. సాహిత్య సామాజిక బోధనా రంగాల్లో తన అవసరం మరింతగా ఉన్న కాలంలో ఎండ్లూరి సుధాకర్ కన్ను మూయడం విషాదం. – కె.ఎన్. మల్లీశ్వరి, కాత్యాయనీ విద్మహే ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక -
కళ్లు తెరిపించే కథా రచయిత్రి
సమకాలీన తెలుగు సాహిత్యంలో రచయిత్రిగా పి.సత్యవతి స్థానం ప్రత్యేకమైనది. కథలు, నవలలు, సాహిత్య సమీక్ష వ్యాసాలు వ్రాశారు. అనువాదాలు కూడా చేశారు. ఏ ప్రక్రియ చేపట్టినా, స్త్రీ జీవితమే ప్రధానంగా రచనలు చేస్తూ వచ్చారు. ఆమె వ్రాసిన ‘ఇల్లలకగానే’ కథ తెలుగు కథాసాహిత్యంలోనే మైలురాయిగా నిలిచిపోతుంది. రచయిత్రిగా పలు అవార్డులు, సత్కారాలు పొందిన పి.సత్యవతికి ఇటీవల ‘కువెంపు జాతీయ పురస్కారం’ లభించింది. ఈ సందర్భంగా ‘సాక్షి’ పాఠకుల కోసం ఆమెను ప్రముఖ రచయిత్రి కాత్యాయనీ విద్మహే ప్రత్యేకంగా చేసిన ఇంటర్వ్యూ... పి. సత్యవతి ప్రధానంగా కథా రచయిత్రి. నవలలు వ్రాశారు. అనువాదాలు చేశారు. సాహిత్య సమీక్షా వ్యాసాలు ప్రచురించారు. ప్రక్రియ ఏదైనా స్త్రీ జీవితమే అన్నిటికీ కేంద్రబిందువు. కుటుంబం మొదలుకొని ప్రపంచీకరణ సంస్కృతి వరకు స్త్రీల జీవితాన్ని హింసామయం చేస్తున్న వ్యవస్థలను గుర్తించి గురిచూడటమే ఆమె సాహిత్యతత్వం. తల్లి చదువుకోటానికి లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు తీసుకొచ్చే అలవాటు, తండ్రి శిక్షణ హైస్కూల్ చదువులనాటికే ఆమెలో సాహిత్య అధ్యయన ఆసక్తులు స్థిరపడటానికి కారణం అయ్యాయి. మాలతీ చందూర్, కొడవటిగంటి కుటుంబరావు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి వంటి రచయితలను ఇష్టంగా చదువుకొన్నారు. హైదరాబాద్‌లో మేనమామగారింట ఉండి చదువుకొన్న కాలంలో ఇంగ్లీష్ సాహిత్య అధ్యయనం పెరిగింది. నిరంతర అధ్యయనం వల్ల ఏర్పడిన కొత్త చూపు, తన జీవితంతో సహా చుట్టూ జీవితాలను నిశితంగా పరిశీలించే గుణం వల్ల సాంద్రమైన అనుభవ కోణం ఆమె కథా బలం. జీవితం, ఘటనలు, మనుషులు, ప్రవృత్తులు, ప్రవర్తనలు, పరిణామాలు ఒత్తిడి పెడితే తప్ప వ్రాయని రచయిత కనుక ఆమె కథలలో గాఢత ఉంటుంది. జీవితాన్ని ప్రేమించే మనిషి కనుక కథను నిర్మించటంలో, నిర్వహించటంలో సున్నితత్వం ఉంటుంది. జీవితం ఎంత కష్టభూయిష్టం అయింది అయినప్పటికీ మంచికి దానిని మార్చుకొనే చేవ పొందటానికి మనుషులు ఎవరి పరిధిలో వాళ్ళు ప్రయత్నపరులు కావాలనే సందేశాన్ని ఇస్తుంటాయి అవి. ఇరవైఏళ్ల వయసులో ప్రారంభమైన సత్యవతి సాహితీ సృజన శక్తుల విన్యాసం షష్టిపూర్తి వేళ కూడా నవయౌవన ఆరోగ్యంతో తళతళ లాడుతూనే ఉంది. అప్పటికి ఎనిమిదేళ్లుగా మహిళా జనజీవన సమస్యల అధ్యయన, ఆచరణ మార్గంలో నడుస్తున్న నేను 1990 ఇల్లలకగానే కథ చదివి సహజంగానే సత్యవతి గారితో ప్రేమలో పడ్డాను. ఆ తరువాత మంచి స్నేహితులమూ అయ్యాము. స్త్రీ తనను తాను తెలుసుకొని తనను తాను నిర్వచించుకొనే స్వీయ సత్తా సంపాదించు కొనాలనే విషయం పట్ల అవగాహన కలిగించటానికి ఎన్ని సభలలో , ఎన్ని తరగతి గదులలో ఇల్లలకగానే కథను పాఠంగా చెప్పానో లెక్కలేదు. తెలుగు కథా సాహిత్యంలో అది ఒక మాగ్నమ్ ఓపస్. ఈ కథకు ముప్ఫయి ఏళ్ల ముందు ముప్ఫయి ఏళ్ల తరువాత సత్యవతి కథా ప్రపంచం విస్తరించి ఉంది. ప్రతిష్ఠాత్మక కువెంపు జాతీయ పురస్కారం అందుకొంటున్నవేళ ‘సాక్షి’ పక్షాన ఆమెతో స్నేహ సంభాషణ నాకు సంతోషకరం. సత్యవతిగారూ నమస్కారమండీ హృదయపూర్వక శుభాకాంక్షలు. దాదాపు ఆరు దశాబ్దాల సాహిత్య జీవితం మీది. ఈ కృషికి గాను మీరు ఇదివరకు ఎన్నో పురస్కారాలను అందుకొన్నారు. ఇప్పుడు కువెంపు జాతీయ పురస్కారం వరించిన సందర్భంలో మీ అనుభూతి ఏమిటి? చాలా సంతోషం కలిగింది. ఈ సందర్భంగా కువెంపు గారు సంచరిచిన ప్రదేశం చూడడం, అక్కడి గాలి పీల్చడం నా కొచ్చిన అద్భుతమైన అవకాశంగా భావిస్తునాను. ఒక గొప్ప కవి పేరుమీద పురస్కారం అందుకోడం చాలా ఆనందం కదా! వ్యక్తిగతం అంతా రాజకీయమే అన్న స్త్రీవాద సూత్రం తెలిసి రాసినట్లు ఉంటాయి మీ కథలు. స్త్రీవాదం మీ కథల చోదకశక్తి ఎప్పటినుండి అయింది? ఎలా? ముందు నుంచి నేను స్త్రీ కేంద్రక కథలే ఎక్కువ వ్రాశాను. నాకు తెలిసిన, నేను చూసిన స్త్రీల అనుభవాలు కథలుగా రాశాను. అయితే స్త్రీవాదం నాకు సిద్ధాంతంగా తెలిసి వచ్చింది మాత్రం ఆంధ్ర దేశంలో అంటే తెలుగు లో స్త్రీ వాద సాహిత్యం ఒక అలలాగా వచ్చిన 80 వ దశకంలోనే. నేను ఆ కవితలనీ కథలనూ చదివి స్త్రీవాద సిద్ధాంతాలను అధ్యయనం చెయ్యడం మొదలు పెట్టాను. అప్పటి నుంచి నేను స్త్రీల జీవితాల మీద దృష్టి పెట్టాను. సమస్యల మూలాలను తెలుసుకోడం మొదలు పెట్టాను. స్త్రీల జీవితాన్ని హక్కుల స్పృహతో కథా వస్తువును చేయటానికి మిమ్మల్ని ప్రభావితం చేసినది స్త్రీవాదమే కదా! స్త్రీవాదంతో మీ పరిచయం ఎప్పటినుండి? అది మిమ్మల్ని ఎలా ప్రభావితం చేసింది? ఇందాక చెప్పినట్లు స్త్రీ వాదంతో నా పరిచయం అధ్యయనం 80ల తరువాతే. అయితే 90లో నేను ద సెకండ్ సెక్స్ చదివాను. ఆ తరువాత వరుసగా సెకండ్ వేవ్ ఫెమినిజంలో ప్రఖ్యాతమైన పుస్తకాలు కొనుక్కుని చదివాను. సెకండ్ సెక్స్ చాలా ప్రభావవంతమైన పుస్తకం. ఇప్పుడు ఫెమినిజం ఆ స్థాయిలన్నీ గడిచింది. ఇంటర్ సెక్షనాలిటీ మొదలైన అంశాలన్నీ ముందుకొచ్చాయి. ఏది ఏమైనా హక్కులతో పాటు తనను గురించిన బాధ్యత కూడా తను తీసుకోగల స్థాయికి స్త్రీలు ఎదగడానికి పోరాడాలి. తనను తను ప్రేమించుకోవాలి, గౌరవించుకోవాలి. ఇల్లలకగానే కథ ద సెకండ్ సెక్స్ చదివాక వ్రాశారా? సెకండ్ సెక్స్ ప్రభావవంతమైన పుస్తకం అన్నారు. ఆ ప్రభావశీలత గురించి కాస్త వివరిస్తారా? ఈ కథ నిజానికి చదవక ముందు వ్రాసినదే. అనేకమంది స్త్రీలను చూసి వ్రాసినది. 90లో వచ్చింది. మీ కథలలో స్త్రీవాదానికి ప్రాతినిధ్య కథలు ఏవని మీరనుకొంటారు? ఇల్లలకగానే, సూపర్ మామ్ సిండ్రోం, దమయంతి కూతురు, గాంధారి రాగం ఇట్లా ... మధ్యతరగతి స్త్రీ కేంద్రంగా భిన్న వ్యాసార్ధాలతో గీసిన చైతన్య వృత్తాలు మీ కథలు అనిపిస్తుంది. ఆ దృష్ట్యా వాటిలో మీరు ఉత్తమం అనుకొనేవి ఏవి? నేను నాకు తెలిసిన జీవితాలనే నాకున్న పరిధి మేరకే వ్రాశాను. స్థల కాలాలకు అతీతంగా వ్రాయలేదు. పాఠకులు ఎక్కువగా కనెక్ట్ అయిన కథే నాకూ బాగా నచ్చిన కథ. ప్రత్యేకంగా ఇదీ అని చెప్పలేను. ఎవరి కథలు వారికి ముద్దు కదా? మీ కథలు కొన్నిటిలో శ్రామిక వర్గ స్త్రీల జీవితాలు కనిపిస్తాయి. వాటికి అవి స్వతంత్రాలా లేక మధ్యతరగతి స్త్రీల జీవిత సాపేక్షతలో భాగమా? వాటికి అవి ప్రత్యేకమే. స్వర్ణ అనే అమ్మాయి ప్రధాన పాత్రగా వ్రాసిన కథలన్నీ శ్రామిక వర్గానికి చెందినవే . సమాజంలో ఒక వర్గం ఎప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు సాగకుండా వుంటుంది. అనేక పథకాలు వున్నా ఆ వర్గపు ఆడపిల్లల జీవితం మెరుగు పడటం లేదు. అందుకు కర్ణుడి చావుకున్నన్ని కారణాలున్నాయి. కొన్ని అంటే, సీపురు, సప్తవర్ణ సమ్మిశ్రితం లాంటివి మధ్యతరగతి జీవిత సాపేక్షతలో భాగం కావచ్చు. మీరు ఏడు నవలలు వ్రాశారు కదా? వాటిలో గొడుగు నవలను తప్ప మరి దేనినీ మీరు ఓన్ చేసుకోరు అన్న మాట ఎక్కడో చదివాను. అది నిజమేనా? ఎందువల్ల? కాస్త వివరిస్తారా? ఆ నవలలన్నీ 90ల ముందువి. నవలా రచన గురించి ఏ మాత్రం తెలుసుకోని సందర్భం... వాటిని ఇంకా బాగా వ్రాయొచ్చు అనిపిస్తుంది. గొడుగు నవల కూడా 1990 కి ముందుదే కదా! అవును. 1978 లో వచ్చింది. గొడుగు కూడా ఇప్పుడు వ్రాస్తే ఇంకొంచెం మంచిగా వ్రాయగలనేమో! అప్పటికి ఆ వస్తువు, ఆ జీవితం నేను దగ్గరగా చూసినది కనుక ఆ నవలన్నా అందులో ప్రధాన పాత్ర అన్నా నాకు చాలా ఇష్టం. స్త్రీల జీవితాలలోని అసంతృప్తుల ఒత్తిడి , వాటి నుండి విముక్తికి వెతుక్కొనే దోవలు, వేసే తప్పటడుగులు, అన్నీ తెలిసి పరువు కోసం నిలుపుకొనే కాపురాలు ఎన్నో ఉన్నాయి. అవి కావ్యవస్తువు కాలేకపోయాయి. గొడుగు నవలలో దానిని చూపించగలిగాను. 1990ల తరువాత కూడా దాని ప్రాసంగికత వుంది అనిపిస్తుంది. అప్ప టికీ ఇప్పటికీ స్త్రీలు కొంచమైనా మారారు. సమాజంలో కూడా మార్పు వచ్చింది. నాకు క్లుప్తత అలవాటు. అందుకే కథ వ్రాయడం సులువు. నవల వ్రాయలేను. మీరు ఇస్మత్ చుగ్తాయ్, ఒక హిజ్రా ఆత్మకథ వంటి అనేక అనువాదాలు చేశారు. ప్రపంచ వ్యాపిత స్త్రీవాద సిద్ధాంతకర్తలను తెలుగువాళ్ళకు సరళ సుందరంగా పరిచయం చేశారు. సాహిత్య విమర్శలు వ్రాశారు. ఇలా భిన్నప్రక్రియలలో అభినివేశం మీ ఆంగ్ల అధ్యాపక వృత్తి లక్షణమా కాక నిర్దిష్ట సాహిత్య ప్రయోజన లక్షితమా ? అనువాదాలు ఇష్టపడి చేశాను. ఆంగ్ల అధ్యాపక వృత్తికీ నా సాహిత్య సృజనకీ సంబంధం లేదు. మొదటినుంచీ నాకు ఇంగ్లీష్ అంటే ఇష్టం. నేను నా మేనమామ ఇంట్లో వుండి చదువుకున్నాను. ఆయన ఇంగ్లీష్ అధ్యాపకుడు. మంచి చదువరి. అప్పటినుంచీ నేను ఇంగ్లీష్ నవలలు అవీ ఎక్కువ చదివేదాన్ని. స్త్రీవాద సాహిత్య గ్రంథాలు చదినప్పుడు అవి మన పాఠకులకి పరిచయం చెయ్యాలనిపించింది. భూమిక పత్రికలో వరుసగా వ్రాశాను. సరళంగా చెబితేనే అర్థం అవుతాయని ఆ ప్రత్యేకమైన పరిభాష వాడలేదు. మీరు స్త్రీవాద సిద్ధాంత రచనలు పరిచయం చేయటమే కాదు. తెలుగులో కథలు నవలలు వ్రాసిన స్త్రీలను పరిచయం చేస్తూ వ్యాసాలు కూడా వ్రాసారు.ఇదంతా ‘సిస్టర్ హుడ్’ భావన ను ఆచరణాత్మకం చేయటం అనవచ్చా? మీ కథలలో కూడా అది అంతర్భాగమే కదా! అవును. స్త్రీలమధ్య సహకారం స్నేహం వుండాలని నా ఆకాంక్ష. స్త్రీల మధ్యే కాదు, స్త్రీ పురుషుల మధ్య కూడా. పతిభక్తి కథలో మతం, ఆచారాలు స్త్రీల మీద ఎంత బరువై కూర్చుంటున్నాయో అలవోకగా చెప్పారు. జెండర్ అణచివేతలో కులం, మతం వహిస్తున్న పాత్ర గురించి కాస్త వివరిస్తారా? ఈ కోణం నుండి వ్రాయవలసిన కథల గురించి కూడా సూచించండి. ఇళ్ళల్లో సంప్రదాయపరంగా జరిగే క్రతువుల గురించి కూడా స్త్రీలే భారం వహించాలి. సంప్రదాయాలంటూ ఇంకా వాళ్ళమీద అనేక బాధాకరమైన ఆచారాలు రుద్దుతున్నారు. ఇందులో స్త్రీలు కూడా పాత్ర వహించడం చూస్తే వాళ్ళ మెదళ్ళు ఎంతగా నియంత్రించబడ్డాయో అర్థమౌతుంది. ఈ మధ్య ప్రవచనాల పేరిట మతపరమైన నమ్మకాలని బాగా ఎక్కిస్తున్నారనిపిస్తున్నది. స్త్రీలు, అందునా మధ్య తరగతి, ఆపై తరగతి స్త్రీలు చేసే వేడుకలు, బాగా ఖర్చుపెట్టి చేసే పెళ్ళిళ్ళూ, అలంకరణలు చూసినప్పుడు, జాతకాలూ జ్యోతిష్యాల వెనక పడుతున్నప్పుడు ఇన్ని వ్రాసిన, ఇంత పోరాడిన అన్ని తరాల స్త్రీల కష్టం తలచుకుంటే బాధ అనిపిస్తుంది. ఈ మాయ నుంచి ఎలా బయట పడతారా అనిపిస్తుంది. మాయపొరలు చీల్చేందుకు ఎన్ని కథలైనా రావాల్సే ఉంది. సత్యవతిగారూ పితృస్వామ్య మాయ దగ్గరనుండి, ప్రపంచీకరణ మాయను, వస్తువినిమయ మాయను, హిందుత్వ మాయను బద్దలు కొట్టటానికి నిరంతర కథా దీప ధారులైన మీతో ఈ సంభాషణ ఎంతో బాగుందండి. మీ సమయాన్ని ‘సాక్షి’ పాఠకుల కోసం ఇచ్చినందుకు ధన్యవాదాలు. - కాత్యాయనీ విద్మహే -
ఒక ఆకాంక్ష ఒక విలువ
1910 నుండి మార్చి 8 అంటే అంతర్జాతీయంగా స్త్రీల సామాజిక సామూహిక శక్తికి సంకేతం. మహిళల అస్తిత్వం, వ్యక్తిత్వం, ఆకాంక్షలు, విజయాలు ఏ స్థాయికి చేరాయో చూసుకొని వాటికి అవరోధంగా ఉన్న సమస్త అధికార శక్తుల నుండి విముక్తికి పునరంకితం కావటానికి కావలసిన ఉత్సాహ శక్తిని పుంజుకొనవలసిన సందర్భం ఇది. స్త్రీ పురుషులు సంఖ్యలోనే కాదు, శక్తిసామర్థ్యాలలో, అవకాశాలలో, అభివృద్ధిలో, నిర్ణయాలలో, నిర్మాణంలో సమానంగా ఉండే ప్రపంచం నిస్సందేహంగా శక్తిమంతమైన ప్రపంచమే. అయితే అలాంటి ప్రపంచాన్ని నిర్మించుకొనటం ఆకాంక్షగా, ఆదర్శంగా మిగిలిపోతున్నదే తప్ప ఆచరణ వాస్తవం కావటంలేదు. ఎందువల్ల? భారతదేశంలోనైతే స్వాతంత్య్రం వచ్చిన పాతికేళ్లకే స్త్రీ పురుష సమానత్వం సాధించబడలేదన్న ఎరుక కలి గింది కదా! సమానత్వ దిశగా తొలి అడుగులు మాత్రమే పడుతున్నాయి అని అనుకున్న (Towards equality report) 50 ఏళ్ళ తరువాత వెనుదిరిగి చూస్తే ఆ అడుగులు సాగిన జాడ లేక అక్కడే కూరుకు పోయాయా ఏమిటి? అని ఆందోళన కలగక మానదు. ఇది మనదేశపు స్థితే కాదు. సాపేక్షంగా చూస్తే చాలా దేశాలు మనకన్నా పైస్థాయిలో ఉండవచ్చు కానీ ప్రపంచమంతటా ప్రజాస్వామ్యాన్ని, శాస్త్ర సాంకేతిక రంగాలలో సాధించిన అభివృద్ధిని హేళన చేస్తూ స్త్రీపురుష అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. అందువల్లనే ప్రతి ఒక్కరూ సమానత్వం కోసం అని ఈ మార్చ్ 8న మళ్ళీ పిలుపును ఇయ్యవలసిన అంతర్జాతీయ అక్కర వచ్చింది. స్త్రీల హక్కులను వాస్తవానుభవంలోకి తేవటంగురించి నొక్కి చెప్పాల్సి వచ్చింది. మహిళా సాధికారత అనే భావనను ముందుకు తెచ్చిన బీజింగ్ సదస్సు జరిగిన పాతికేళ్ల తరువాత పరిస్థితి ఇది. ఆడపిల్లను పుట్టకుండానే ఆపివేసే లింగనిర్ధారణ పరీక్షలు, గర్భస్థ శిశుహత్యలు చట్ట ప్రకారం నేరమే అయినా ఈ రోజున అది వైద్యరంగంలో కోట్లాది రూపాయల అక్రమ వ్యాపారం అయి పొయింది. విద్యాఉద్యోగాలలో 33 శాతం స్త్రీల ప్రాతినిధ్యం చట్టబద్ధంగా అమలవుతున్నది, స్త్రీలు సాఫ్ట్ వేర్ రంగంలో సైతం ప్రతిభను చాటుకుంటున్నారు, కంపెనీ సీఈఓలుగా అత్యున్నత స్థాయికి ఎదిగారు అని మురిసినంత సేపు పట్టదు ఈ నాటికీ హైస్కూల్ స్థాయి విద్యలో అర్ధంతరంగా చదువులు ఆపేసి వెళ్తున్న ఆడపిల్లలు 63.5 శాతం (2015) ఉన్నారని తెలిసి దిగులు పడటానికి. పేదరికము, తాగివచ్చి తండ్రి ఇంట్లో చేసే యాగీ, బడిలో టాయిలెట్ వంటి వసతులు లేకపోవటం, పెళ్లిచేసి పంపియ్యాలన్న తొందర.. కారణాలు ఏమైతేనేమి వీళ్లంతా విద్యాఉద్యోగ అవకాశాలకు దూరం చెయ్యబడుతున్నవారే. పెద్దపెద్ద ప్రాజెక్టుల వల్ల, ప్రత్యేకఆర్ధిక మండలుల వల్ల అటవీ వనరుల మీద, భూముల మీద హక్కులు, జీవనోపాధిమార్గాలు, ఆహారభద్రత కోల్పోతున్నారు అనే కమంది మహిళలు. అదే 33 శాతం ప్రాతినిధ్యం పంచాయతీ రాజ్ వ్యవస్థలో వుంది కనుక స్త్రీలు కిందిస్థాయిలో రాజకీయ భాగస్వామ్యాన్ని అయితే పొందుతున్నారు గానీ స్వతంత్రంగా ఎంతవరకు పనిచెయ్యగలుగుతున్నారు అంటే మిగిలేది నిరాశే. చట్టసభలలో స్త్రీల రిజర్వేషన్ బిల్లు ఎప్పుడో తుంగలో తొక్కేశాం. ఇప్పుడు రాజకీయరంగంలో ఉన్న స్త్రీలకు కూడా ప్రోత్సాహకరమైన వాతావరణం ఏమీ లేదని 2019 ఎన్నికల సందర్భంగా 95 మంది మహిళా రాజకీయనాయకులపై మిలియన్‌కు పైగా ట్విట్టర్ మొదలైన మాధ్యమాలలో అసభ్యంగా, అవమానకరంగా–వాళ్ళ శరీరాన్ని, రంగును, దుస్తులను, కులాన్ని హీనపరుస్తూ వచ్చిన స్క్రోలింగుల గురించి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన నివేదిక చెప్తున్నది. ఇక మహిళా సాధికారత ఎక్కడ ? ఇళ్ల దగ్గర నుండి వసతి గృహాల వరకు ఆడపిల్లలను లైంగిక అవసరాలకు వాడుకొనే వికృతి వ్యాపించింది. అత్యాచారం, అక్రమ రవాణా, హత్య సాధారణ విషయాలు అయిపోయాయి. తాగుడు, మాదకద్రవ్యాల వినియోగం ఈ నేరాలకు తక్షణ కారణాలైతే, స్త్రీలను లైంగిక వస్తువుగా తప్ప చూడలేని మానసిక వికృతిని మప్పిన సిని మాలు, అశ్లీల చిత్రాలు వాటికి మరింత బలం చేకూర్చేవి. స్త్రీపట్ల మగవాడి దృష్టిని ఈ విధంగా నిర్మిస్తూ వచ్చిన తరతరాల పితృస్వామిక అధికార సంస్కృతిది అసలు నేరమంతా.. ఈ అన్ని నేరాలను పట్టించుకోకుండా స్త్రీల కట్టుబొట్టు వ్యవహార సరళి పురుషులను రెచ్చగొట్టేవిగా ఉండటమే స్త్రీలపై అత్యాచారాలకు కారణమంటూ బాధితులనే నేరస్తులుగా చేసే రాజకీయం ఈనాడు కొనసాగుతున్నది. వీటిని వేటినీ ప్రశ్నించకుండా, సంస్కరించకుండా ‘ప్రతిఒక్కరూ సమానత్వం కోసం’ అనే మాటకు అర్ధం ఉంటుందా? మంత్రాలకు చింతకాయలే రాలవు అని మనకు తెలిసిందే. మరి సమానత్వం ఎలా సాధ్యం? సాధ్యం కాదని ఈనాడు స్త్రీలు గ్రహిస్తున్నారు. కుటుంబం, కులం,మతం, సంపద, సంస్కృతి, రాజ్యం వంటి సంస్థల వర్గ వర్ణ లింగ పాక్షిక దృష్టి స్త్రీల సమానతకు ఎప్పుడూ అవరోధమే అని వాళ్లకు తెలుసు. అందువల్లనే వాళ్ళు ఈ నాడు పోరాటశక్తులుగా ఎదుగుతున్నారు. విస్తరిస్తున్నారు. ఈ పాక్షిక దృష్టి సగభాగమైన స్త్రీలను నిర్వీర్యం చేయటంవల్ల సమాజాన్ని పక్షవాతానికి గురిచేస్తుందని గుర్తుచేస్తున్నారు. తక్షణ పరిష్కారాలతో నేరాలను అరికట్టలేము, నేర కారణాల నిర్మూలనపై దృష్టిపెట్టవలసిన అవసరాన్ని నొక్కి చెబుతున్నారు. నేరరహిత సమాజంతో ముడిపడి స్త్రీల హక్కులు అనుభవ వాస్తవం అవుతుందని నమ్ముతున్నారు. అందుకే ఈనాడు స్త్రీలు తమ హక్కుల కోసం, అవకాశం కోసం మాట్లాడుతున్నదానికంటే ఎక్కువగా తమలాగే హక్కులు అవకాశాలు కోల్పోతున్న దళిత ఆదివాసీ మైనారిటీ మత సమూహాలకోసం మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడటం, వాళ్ళ పక్షాన పనిచేయటం అసమానతలు లేని ఒక మానవీయ సమాజ నిర్మాణంకోసమే. స్త్రీలంటే తల్లులు కదా! బిడ్డలైనా, సమాజమైనా, దేశమైనా పాడై పోతుంటే వూరికే ఉండలేరు. అట్లా ఉండకపోవటం కుటుం బంలో అయితే అవిధేయత. సమాజంలో అయితే బరితెగించటం. రాజ్యం దృష్టిలో అయితే ద్రోహం. అందుకు ఫలితం బహిష్కరణలు లేదా జైళ్లు. అయినా ‘ప్రతి ఒక్కరూ సమానత్వం కోసం’ ఆలోచించే సంస్కారాన్ని పెంచుకొనే దిశలో మానవీకరించబడటం కోసం స్త్రీలు అందుకు సిద్ధమవుతున్నారు. షాహిన్ బాగ్ దానికి ఒక సంకేతం. వేలాది లక్షలాదిమంది ముస్లిం మహిళలు ఒక సమానత్వ విలువ కోసం వీధుల్లోకి వచ్చారు. ఐదారేళ్ళ పిల్లలనుండి అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళు కూడా ఆజాదీ అని గొంతెత్తి నినదిస్తున్నారు. ఆ ఆకాంక్ష , ఆ విలువ మొత్తం సమాజాన్నీ ఉన్నతీకరించే దిశగా స్త్రీలను మరింత సంఘటితం చేస్తుంది అన్న ఆశ కలుగుతున్నది. కాత్యాయనీ విద్మహే వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి, కాకతీయ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ -
కళ్యాణలోవని కాపాడుకుందాం
భవన నిర్మాణాన్ని సౌందర్యవంతం చేయటానికి వాడే గ్రానైట్ ప్రజల జీవనాధారాలను, అవసరాలను, సంస్కృతిని, పర్యావరణాన్ని కొల్ల గొట్టే విధ్వంసంలో ఉంటోందని కల్యాణలోవ రిజర్వాయర్ పరీవాహక ప్రాంతాల పర్యటన మొహంమీద చరిచి మరీ చెప్పింది. విశాఖపట్నానికి 68 కిలోమీటర్ల దూరంలో దేముని కొండ సోమాలమ్మకొండకు మధ్య 1975లో కల్యాణలోవ రిజర్వాయర్ నిర్మించారు. ఒకవైపు ఆ రిజర్యాయర్‌కు ఎగువన సౌందర్యభరితంగా కనిపించే పరీవాహక ప్రాంతపు ప్రజాజీవనం, మరొకవైపు దిగువన 5 వేల ఎకరాల ఆయకట్టు ప్రాంత సన్నకారు సాగుదార్ల జీవనం, నాలుగైదేళ్లుగా క్వారీల ప్రవేశంతో కల్లోలకడలిగా మారిపోయింది. అక్కడి ప్రజల పోరాటస్వరాలని సమన్వయం చేస్తున్న పి.ఎస్. అజయ్ కుమార్ పిలుపు మేరకు సామాజిక సాహిత్య కార్యకర్తలం అక్టోబర్ 18, 19 తేదీల్లో రిజర్వాయర్ పరిసరాలు, కొత్తకోట, జెడ్. జోగిం పేట, రొచ్చుపణుకు, అజయ్ పురం గ్రామాలు చూసి, ప్రజల అభిప్రాయాలు విన్న తరువాత సమస్య తీవ్రత, విస్తృతి తెలుసుకున్నాం. మూడు గ్రానైట్ మైనింగ్ కంపెనీలు కల్యాణలోవ రిజర్వాయర్ పరీవాహక గ్రామాలలో తవ్వకాలు చేపట్టాయి. రెవెన్యూ అధికారులతో వచ్చి ఇంటికి ఒక ఉద్యోగం, భూములకు పట్టాలు, రోడ్లు, వాటర్ ట్యాంక్, కమ్యూనిటీ హాల్ నిర్మాణమనే ఆశలు చూపించి, బెదిరించి, అంగీ కార పత్రాలు రాయించుకొని ఏదీ నెరవేర్చకుం డానే వాటిపని అవి చేసుకుపోతున్నాయి. జెడ్.జోగింపేటకు కిలోమీటర్ లోపలే ఉన్న సోమాలమ్మకొండ మీద 2016 నుండి, పొట్టిమెట్ట కొండ మీద 2018 నుండి గ్రానైట్ తవ్వకాలు జరుగుతున్నాయి. ఆ రెంటి మధ్య అజయ్ పురం వుంది. ఆ ఊళ్లో ఇళ్లు బ్లాస్టింగ్‌కు అదిరి బీటలు వారాయి. బాంబుల శబ్దాలకు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఊటలు, గెడ్డలు బ్లాస్టింగ్ వ్యర్ధాలతో మూసుకుపోయి, మైళ్ళదూరం కొండలు, లోయలు ఎక్కిదిగి నీళ్లు మోసుకు రావలసి వస్తున్నదని ఏ వూళ్లోనైనా ఆడవాళ్లు ఏకకంఠంతో చెప్పినమాట. చల్లకొండకు 100 మీటర్ల దూరంలోని గ్రామం రొచ్చుపణుకు. అక్కడ ఒకటి నుండి అయిదు తరగతుల వరకు చదివే 35మంది పిల్లలతో వున్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల 2016లో మూతబడిపోయింది. బ్లాస్టింగ్ ధ్వనులకు, భారీవాహనాల రాకపోకలకు, ఎగసిపడే రాయిపిండికి జడిసి ఆదివాసీలు పిల్లలను బడికి పంపటం మానేశారు. పిల్లలు లేరన్న కారణంగా రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వం ఆ బడిని రద్దుచేసింది. పచ్చటికొండల మధ్య, పసిపిల్లల లేత నవ్వులను, జిలిబిలి మాటలను ప్రతిధ్వనించిన ఒకనాటి పాఠశాల ఈనాడొక శిథిల శూన్యగృహం. అమాయకపు పిల్లల భవిష్యత్తు, మైనింగ్ వ్యర్థాల కింద అణగిపోయిన సహజ నీటి ఊటగెడ్డల వలే ఆవిరైపోవలసినదేనా? ఆదివాసీల నీటివాడకం హక్కులకు, విద్యాహక్కులకు, ప్రశాంతంగా జీవించే హక్కులకు భంగం కలిగించటమే కాక వాళ్ళ లౌకిక జీవిత సంస్కృతిని హైందవీకరించే దుర్మార్గానికి దిగుతున్నాయి ఈ కంపెనీలు. కల్యాణలోవ రిజర్వాయర్ రక్షణకు బాధ్యత వహించవలసిన ఇరిగేషన్ విభాగం ప్రమేయమే లేకుండా ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని, పరీవాహక ప్రాంతాన్ని ‘నో మైనింగ్ జోన్’గా ప్రకటించి ఆదివాసీల సహజ హక్కులను, జాతి సంపద అయిన కల్యాణలోవ రిజర్వాయర్ని కాపాడాలని అక్కడి ప్రజలిప్పుడు నినదిస్తున్నారు. కాత్యాయనీ విద్మహే వ్యాసకర్త కార్యదర్శి , ప్రరవే తెలంగాణ katyayani.vidmahe@gmail.com -
అవార్డు వెనక్కి ఇచ్చేసిన రచయిత్రి కాత్యాయిని విద్మహే
ప్రముఖ రచయిత, కళాకారుడు ఎం. భూపాల్ రెడ్డి బాటలోనే మరో తెలుగు రచయిత్రి కాత్యాయతి విద్మహే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును వెనక్కి ఇచ్చేశారు. అసమానతలకు వ్యతిరేకంగా రచనలు చేస్తున్న తాను... భావ ప్రకటన స్వేచ్ఛపై దాష్టికానికి నిదర్శనగా రచయితలు హత్య లకు గురికావడం బాధించిందని.. అందువల్లే అవార్డును వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ఆమె శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా.. సాహిత్యాకాశంలో సంగం అనే సాహిత్య విమర్శ వ్యాస సంపుటికి 2013లో కాత్యాయని విద్మహే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. తనకు రాజ్యాంగం పట్ల గౌరవం ఉందని, ఎటువంటి మినహాయింపులు లేకుండా.. రాజ్యంగం పౌరులకు వాగ్దానం చేసిన హక్కులను సంపూర్ణంగా అమలు చేయాలని కాత్యాయని విద్మహే డిమాండ్ చేశారు. భావ ప్రకటనా స్వేచ్చను నిరోధిస్తున్న దుష్ట సామాజిక సంస్కృతి పట్ల మౌనం సరైంది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. సాహిత్య అకాడమీ, రాజ్యానికి వ్యతిరేకంగా నిరసిస్తున్న తోటి రచయితలతో, కళాకారులతో గొంతు కలపటం గౌరవంగా భావిస్తున్నానని కాత్యాయని తెలిపారు. -
విమర్శకు పట్టం
జాతీయ పురస్కారం సుప్రసిద్ధ విమర్శకురాలు, ప్రజాస్వామికవాది, అధ్యాపకురాలు అయిన కాత్యాయనీ విద్మహేకు సాహిత్య అకాడెమీ పురస్కారం ప్రకటించిన సందర్భంగా... ‘ఉత్తముల మహిమ నీరు కొలదీ తామర సుమ్మీ’ అన్నాడొక ప్రాచీన కవి. తమ విద్యని ఎదుటివారు ఎంత వరకు గ్రహించగలరో అంత వరకే ప్రకటిస్తారట పండితులు. అది ఎట్లా ఉంటుందంటే సరస్సులో నీరు ఎంత వరకు ఉంటే తామర అంతవరకు పెరిగినట్లుగా... 2007లో ఆంధ్ర విశ్వకళా పరి షత్తులోని ఒక పురాతన సభా మందిరంలో మొదటిసారి కాత్యాయనీ విద్మహేని చూశాను, విన్నాను. ఆరోజు ఆమె కట్టిన నెమలిపురి కంటి రంగు చీర గురించి, అది ఆమెకిచ్చిన హుందాతనపు మెరుపు గురించి వినవచ్చిన ప్రశంసాఝంకారాల రొద నుంచి నన్ను నేను ఏకాంత పరుచుకుని మరీ విన్నాను. ఆ తర్వాత కలిసి పని చేసే క్రమంలో వరంగల్, హైదరాబాద్, కడప, గుంటూరు, నరసాపురం, విశాఖ వేదికల మీదా విన్నాను. సాహిత్య సభలూ, క్షేత్ర పర్యటనలు, సాహిత్య సంస్థల నిర్మాణ సందర్భాల్లోనూ విన్నాను. ఆడంబరమూ పలుచదనమూ లేని ఉత్తముల మహిమలాంటి ఆమె రచనల సారమే తన ఉపన్యాస సారంగా, జీవన సారంగా అర్థం చేసుకున్నాను. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి గురించి ఇపుడు మాట్లాడుకోడానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఒక సందర్భం మాత్రమే. వేలాది కవులూ రచయితలూ కొద్దిమంది విమర్శకుల నిష్పత్తిలో నుంచి గత మూడున్నర దశాబ్దాలుగా తెలుగు విమర్శాకాశంలో నిండుగా వెలుగుతున్నారు కాత్యాయని. ఒక రచనపై మన భావోద్వేగాలే ప్రామాణిక విమర్శగా దబాయింపు సత్యాలు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లోనూ తనని తాను ఆవల బెట్టుకుని లోచూపుకి సాధనాలు సమకూర్చుకున్నారు. కొ.కు, రావిశాస్త్రిల దృక్పథం గురించీ, కన్యాశుల్కం, రాబందులూ- రామచిలుకలు లాంటి మంచి పుస్తకాల గురించి, అస్తిత్వ సాహిత్యం, ప్రపంచీకరణల సంక్లిష్టతల గురించి విస్తృతాధ్యయనపు ఫలితాలను ప్రకటిస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా సంప్రదాయ సాహిత్యాన్ని స్త్రీవాద దృష్టికోణపు సాయంతో పునర్నిర్మించే పనిని నిలకడగా చేస్తుండటం విమర్శారంగానికి ఒక చేర్పు. ‘ఉనికిలో ఉన్న సామాజిక నిర్మాణాన్ని మార్చగల కార్యక్రమం లేకపోవడం వల్ల స్త్రీవాదం తరచుగా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దానిని అధిగమించడానికి విశాలమయిన, పునాది మార్పుకు సంబంధించిన చైతన్యం కలిగిన రాజకీయార్థిక పోరాటాలతో సమన్వయం సాధించాల్సి ఉంది’ అన్నది కాత్యాయని అవగాహన. 1980ల తర్వాత వెల్లువెత్తిన అనేక అస్తిత్వ చైతన్యాల మధ్య మార్క్సిస్ట్ ఫెమినిస్ట్‌గా తనని తాను స్థిరపరుచుకున్నారు. ఈ ఆచరణలో భాగంగా స్త్రీల సాహిత్య పోరాటాలను సామాజిక పోరాటాలతో అనుసంధానం చేసే లక్ష్యంతో ఏర్పడిన ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక నిర్మాణంలో కీలక భాగస్వామి అయ్యారు. ప్రజాస్వామిక ఉద్యమాల పట్ల సహానుభూతితో స్పందిస్తూ తన కలాన్నీ, గళాన్నీ పదును పెట్టుకున్నారు. తోటివారితో కలిసి పని చేయడంలో కాత్యాయనిది ఒక ప్రత్యేక వ్యాకరణం. సామూహికత ఒక్కటే సమాపకం. ప్రొఫెసర్లు, స్కాలర్లు, కొత్త రచయితలు, గొప్ప రచయితలు, మేధావులు, కార్యకర్తలు ఎవరితో కలిసి పని చేయడమయినా అసమాపకం. 1982లో రూపొందించకున్న స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ ద్వారానూ, జ్యోతీరాణి, శోభ, గిరిజారాణి, బుర్రారాములు వంటి వారితో కలిసి సామాజిక స్థితిగతులను అధ్యయనం చేయడం ద్వారానూ తన కార్యక్షేత్రాన్ని విస్తరింప చేసుకున్నారు. తాను నిత్య విద్యార్థిగా ఉండటం ద్వారా తన విద్యార్థులను ప్రభావితం చేశారు. ఓరుగల్లు ఆకాశంలో అందుకోలేని ఎత్తులో ఎగిరే కాకతీయ తెలుగు శాఖ పతాకపు రెప రెపలు విన్నపుడల్లా మనసులో ఒక స్పర్థ. విశ్వవిద్యాలయం కల్పించే ఏ చిన్న అవకాశాన్నీ వదలుకోకుండా సభలూ, సమావేశాలూ, అధ్యయన యాత్రలూ, ప్రాజెక్టులూ, పరిశోధనలూ పుస్తక ప్రచురణలూ అన్నింటి వెనుకా చోదకశక్తి వలే పని చేసిన విద్యావేత్త కాత్యాయని. ఈ పురస్కార సందర్భం కొందరికయినా ఎందుకు పండగ సందర్భం కావాలి? కాత్యాయని జిజ్ఞాస కలిగిన విమర్శకురాలయినందుకు కావొచ్చు. ప్రజాస్వామికవాది అయినందుకు, తెలంగాణని హత్తుకున్నందుకు కావొచ్చు. సమూహంలో తనని తాను నిలబెట్టుకున్నందుకూ మంచి ఉపన్యాసకురాలయినందుకు కూడా కావొచ్చు. మగవారి సత్యాలకే చెల్లుబాటు ఉన్న విమర్శారంగంలో నిక్కచ్చి స్వరం వినిపిస్తున్న స్త్రీ అయినందుకు మరీ మరీ కావొచ్చు. సామాజిక దుర్భిక్షాలకి సాహిత్యమొక నివారణోపాయం. వానలతో ఎడతెగక పారే జీవనది సాహిత్యం. ముంతతో వెళితే ముంతెడు నీళ్లు, కడవతో వెళితే కడివెడు నీళ్లు తెచ్చుకోవచ్చు. పరిశోధనా దాహం మెండుగా ఉన్న కాత్యాయని బహుశా ఒక నదీపాయని తన జ్ఞానంతో అనుసంధానం చేసుకుని ఉంటారు... చిరకాలం సారవంతమైన విమర్శాఫలాలను వాగ్దానం చేస్తూ... - కె.ఎన్.మల్లీశ్వరి -
కాత్యాయినీ విద్మహేకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
హైదరాబాద్: ప్రముఖ రచయిత్రి కాత్యాయినీ విద్మహేకు 2013 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. సాహిత్యాకాశంలో సగం అనే ఆమె వ్యాసాలకు సాహిత్య అకాడమీ ఈ అవార్డు ప్రకటించింది. కేంద్ర సాహిత్య అకాడమీ ప్రతి సంవత్సరం 22 భారతీయ భాషలలో ఈ అవార్డులు ఇస్తుంది. గత సంవత్సం తెలుగులో ఈ అవార్డు పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథా సంకలనానికి లభించింది.