కవిత - 2014 కోన్ని పద్యాలు వెలిగాయి | some telugu poems established in last year | Sakshi
Sakshi News home page

కవిత - 2014 కోన్ని పద్యాలు వెలిగాయి

Published Fri, Jan 23 2015 10:59 PM | Last Updated on Sat, Sep 2 2017 8:08 PM

కవిత - 2014  కోన్ని పద్యాలు వెలిగాయి

కవిత - 2014 కోన్ని పద్యాలు వెలిగాయి

తెలుగు కవి ఏమరుపాటుగానే ఉన్నాడు. స్పందించవలసిన సమయంలో స్పందిస్తూనే ఉన్నాడు. ఉద్యమప్పుడు చెలరేగి, ఉద్యమం ముగిశాక కాపలాదారుగా మారి, బయట దారుల్లో తోడు నిలిచి, లోపలి సంఘర్షణలకు దారి కనుక్కొని తెలుగు కవి ఎప్పటిలాగే నిత్య యవ్వనంతో ఉన్నాడు. సీతాకోకచిలుకల్లా ఎగిరిన పద్యాలు, దీపాల్లా వెలిగిన పద్యాలు, కొన్ని సంపుటాలు, అశ్రువులతో కలసి ఉప్పగా మారిన కొన్ని కవితా పాదాలు, ఇక సెలవంటు వీడ్కోలు తీసుకున్న ఆత్మీయకలాలు...  వెరసి 2014లో వచ్చిన కవిత్వంపై ఒక విహంగ వీక్షణం ఇది.  ఇక్కడ ప్రస్తావించినవి కొన్నే.... ప్రస్తావించదగినవి మరెన్నో....
 
బహుశా గడచిన రెండు మూడు సంవత్సరాలతో పోల్చి చూసినపుడు తెలుగుభాషలో కవిత్వం అత్యధికంగా వెలుగు చూసిన సంవత్సరం 2014. ఒకవైపు దిన, వారపత్రికలలో, బులెటిన్‌లలో... మరొకవైపు అంతర్జాల వేదికలపైనా ఎక్కడ చూసినా విరివిగా కవిత్వం. వీటికి తోడు వెలుగు చూసిన అనేక కవితా సంపుటులు, సంకలనాలు! కవిత్వం కళకళలాడిన సంవత్సరం ఇది.
 ఇంతకీ 2014 నిండా పరుచుకున్న కవిత్వం ఏమిటి? చాలా ఉంది.

2013లో- అంతకుముందూ- తెలంగాణ కవి ఉద్యమ కవిత్వంలో మునిగిపోయాడు. అయితే 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత అతడు సహజంగానే సంబరపడ్డాడు.
పన్నెండు వందల ప్రాణాలు ధార వోయంగ
దుక్క సముద్రమైన తెలంగానం
అమరులకు జోహార్ అనుకుంట
రానే వొచ్చింది (అన్నవరం దేవేందర్) అని సంబురపడుతున్నాడు. మరొక వైపు ఈ ఉద్యమాలు మిగిల్చిన గోడును కూడా గుర్తు చేసుకుంటున్నాడు
రజాకార్లకు తాత బలైపాయే  
నక్సలైట్లకు నాయిన బాయె  
ఉద్దెమంల కొడుకులు ఊడ్సుక పోయే
మా బతుకులు కొమ్మాల జాతర్ల ప్రభలాయే...
(బండారి రాజ్‌కుమార్)
అంతేకాదు, ఉద్యమం ఉధృతంగా సాగిన రోజులలో  కనీసం అటువైపు తొంగి కూడా చూడక ఇవాళ తెలంగాణ రాగానే పదవుల కోసం ప్రభువుల ప్రాపకం కోసం వెంపర్లాడుతున్న వాళ్ళని పిల్లితో పోల్చి పరిహసిస్తున్నాడు.
‘ఇవ్వాళ్ల అందరికన్నా ముందు
 నేనంటే నేనని నిలబడింది’....
(జూకంటి జగన్నాథం)
మరొక అడుగు ముందుకువేసి తెలంగాణవచ్చాక  కూడా ఆగని రైతుల ఆత్మహత్యలను చూసి-
తెలంగాణకు లోహాల తళతళలు అక్కర్లేదు
ఇది మట్టి తెలంగాణ
ఇక్కడ మట్టి బతికితే చాలు (దర్భశయనం శ్రీనివాసాచార్య) అని ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఇదే సమయంలో అటు ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని నిర్మాణం కోసం అక్కడి గ్రామాలు ధ్వంసమైపోవడాన్ని చూసి  
ఒక నిర్మాణం కోసం
సామూహిక జీవన సూత్రం ధ్వంసం కావడం
వ్యవస్థీకృత విషాదం (ఏమ్వీ రామిరెడ్డి) అని బాధపడే సీమాంధ్ర కవి కనిపిస్తాడు.
ఇంతకూ మనం ఎందుకు యుద్ధం     
చేస్తున్నామో  నీకేమైనా జ్ఞాపకం వున్నదా?
నా కోసం కాదు నీ కోసం కాదు
మరెందు కోసం
మట్టి కోసమా గోడల కోసమా? (హెచ్చార్కే) అని నిరసన తెలిపే తెలుగు కవి కూడా కనిపిస్తాడు.

 తెలంగాణ వస్తువు కేంద్రంగా వెలువడిన కవిత్వం ఇట్లా వుంటే చుండూరు సంఘటన పైన కోర్టు తీర్పు వెలువడిన అనంతరం తెలుగు కవి అగ్రవర్ణాల కొమ్ము కాసే రాజ్యం ఆగడాలని నిలదీస్తూ
 అవునొరే ఇక్కడో కోర్టు వున్న జ్ఞాపకం
 ఇక్కడో ఐ.పి.సి అమ్మోరు వున్న జ్ఞాపకం (పైడి తెరేష్ బాబు) అని వెటకారం చేస్తూ కనిపిస్తాడు.
 ఈ కాలంలోనే ఉత్తరాంధ్ర జిల్లాలను హుద్ హుద్ తుఫాను చుట్టుముట్టింది. అది సృష్టించిన విధ్వంసాన్ని చూసి కవి స్పందించకుండా ఉంటాడా?
 తానిప్పుడు కెరటాల
 విచ్చుకత్తులతో విరుచుకుపడ్డా సరే
 నీ మీద ప్రేమ చావదని ఒకసారి చెప్పిరావాలి (ప్రసాదమూర్తి) అని విశాఖలోని సముద్రం పైన తన ప్రేమని చెప్పుకున్నాడు కవి. అయితే, తుఫాను తదనంతర సాయాల గురించి ఎవరెన్ని గంభీరమైన మాటలు చెప్పినా అవి దళితుల దాకా చేరకపోవడాన్ని కవి గమనించాడు.
గజం స్థలం మొన మీద
అడుగు పెట్టనీయని ఔదార్యం గురించి
ఏ గజపతులకు మొరపెట్టుకోవాలి (తుల్లిమల్లి విల్సన్ సుధాకర్) అని గోడు చెప్పుకొన్నాడు.
ఒక్క తన నేలపైనే కాదు ఎప్పట్లాగే తెలుగు కవి పరాయి దేశాలలో పెల్లుబికిన విషాదాలను కూడా తన విషాదంగా పలికాడు. గాజాలో దయలేని సైన్యాలు పసిపిల్లల్ని సైతం హతమార్చిన సంఘటనల్ని నిరసిస్తూ
వాడు అమ్మతో నాన్నతో అర్ధాంగితో కన్నబిడ్డతో
ముచ్చటగా తీసుకున్న
అపురూప ఛాయాచిత్రాన్నయినా
చూపించండిరా (అరుణ్ సాగర్) అని వేడుకునే కవిత్వంతో మనం కరగకుండా ఉండగలమా? అంతేకాదు, ఎవరి పక్షం వహించాలో గ్రహించకుండా ఉండగలమా?
ఆలీవ్ కొమ్మల్నే కాదు
ఆయుధాల్ని సైతం పట్టుకోగల పాలస్తీనా
మేము నిన్ను ప్రేమిస్తున్నాము (విమల)
 
యుద్ధాలు ఎవరు చేసినా మొదట బలైపోయేది స్త్రీలు, పసిపిల్లలే! పాకిస్తాన్‌లో ఉగ్రవాదుల దాడులలో స్కూలులోని అమాయక పిల్లలు అసువులు బాయడం చూసిన తెలుగు కవి ‘తుపాకులు తుమ్మెదల మీద ఎక్కుపెట్టరాదు’ (ఎండ్లూరి సుధాకర్) అంటూ ప్రాధేయపడతాడు. ‘మీరు పొరపడ్డారు... శవపేటికలు మొత్తం 786 కాదు’ (అనంతు చింతపల్లి) అని పసిపిల్లల ప్రాణాలను బలిగొన్నవాళ్లకు చాలా తీవ్రంగా చురకలు వేశాడు.
 ఠి    ఠి    ఠి
 2014 సంవత్సరంలో ‘అరుణతార’, ఇతరేతర పత్రికలలో వొచ్చిన విప్లవ కవిత్వం కొత్త నడకలతో, కొత్త ఇమేజరీలతో వెలువడిన సంగతిని స్పష్టం చేశాయి. ముఖ్యంగా మలయాళ భాషలో వొచ్చిన విప్లవ కవిత్వాన్ని తెలుగులో తీసుకురావడం వంటి ప్రయత్నాలు మరిన్ని జరగవలసిన అవసరాన్ని గుర్తు చేశాయి.
 మొత్తంగా 2014లోని కవిత్వాన్ని చూసినపుడు తెలుగు కవి కొన్ని సంఘటనలకు స్పందించి రాసిన కవిత్వం కన్నా తన గురించీ, తన సంబంధాల గురించీ, తన విషాదాల గురించీ, తన ఏకాకితనాల గురించీ అర్థం చేసుకునే క్రమంలో రాసిన కవిత్వమే ఎక్కువగా కనిపిస్తుంది. మనుషులలో క్రమంగా పేరుకుపోతున్న ఈ ఒంటరితనాల గురించి-

 హరప్పా మొహెంజదారో శిథిలాల్లో
 నీ చిరునామా దొరికింది
  నాగరికతా పరిణామంలో
 ఒంటరితనమే నీకు మిగిలింది (ఎన్.గోపి) అని  వాపోయే కవి కనిపిస్తాడు. అంతే కాదు ‘చెంపల మీది బిందువుల్లా రోజులు జారి పడిపోతున్న చప్పుడు’ (మామిడి హరికృష్ణ)ని చూసి గుండెలు బాదుకుంటాడు.
 కదిలీ కదలని దారొకటి కొండచిలువలా
 కాళ్ళకు చుట్టుకొని పడుకుంటే
 తాబేటి చిప్పలలో శరీరాల్ని దాచుకుని
 పయనిస్తున్నామనే అనుకుంటాము
 (నరేష్కుమార్) అని ఇంకోకవి మనిషి ప్రయాణంలోని భ్రమలని పటాపంచలు చేస్తాడు.
 ఇప్పుడు ఒక్కొక్క వాక్యమూ తడిని కోల్పోయే
 రాతి నాలుకతో పొడిబారిపోతోంది
 (కేక్యూట్‌వర్మ) అని ఒక కవి తనను తాను నిందించుకుంటే
 చీకటి నా మనసెరిగిన ఏకైక చెలికాడు...
 నా చిరకాల నేస్తం... నా జిగ్రీ దోస్త్
 (స్కై బాబా) అనేంత దూరం ఈ నైరాశ్యం పేరుకుపోయింది.

 మనిషికీ మనిషికీ నడుమ కరువవుతున్న మాటలే మనిషి లోపలి ఈ విషాదానికీ, విధ్వంసానికీ కారణమా? ‘మాటలు లేకపోవడం బాధే...మాటలు వొద్దనుకోవడమే విషాదం’ (బండ్లమూడి స్వాతీకుమారి) అని కవి ఎందుకు అంటున్నాడు? ‘ప్రతి యిద్దరి నిస్తంత్రీ సంభాషణలో వీచే వడగాడ్పుకి చిన్నారి పొన్నారి పిచ్చుకలు కూడా అదృశ్యం’ (నామాడి శ్రీధర్) అనడం ఎంత పెను విషాదం! అందుకే కవి-
 
తాకలేమా మరికాస్త కోమలంగా ఒకరినొకరం
 చేరలేమా మరికాస్త సమీపంగా ఒకరినొకరం (బి.వి.వి. ప్రసాద్) అని కోరుతున్నాడు. కాని అత్యాధునిక కమ్యూనికేషన్ సాధనాలు మనుషుల్ని దాదాపుగా మట్టుపెట్టేశాయి.
 శబ్ద చలనాలే తప్ప
 కరచాలనాలూ ఆలింగనాలూ లేని చోట
 నువ్వెప్పుడూ ఏదో ఒక టవర్ చుట్టూ
 ప్రవహిస్తుంటావు (బండ్ల మాధవరావు) అనేది కనిపిస్తున్న సత్యం.

 బహుశా ఇట్లాంటి కాలంలోనే గతం వైపు చూడాలి. జీవితాన్ని గొప్ప ఆశతో, గొప్ప ధైర్యంతో గడిపిన మన అమ్మల వైపు చూడాలి - ఇప్పటికీ ఆ కన్నుల్లో నైరాశ్యపు జాడ లేదు (కె.శ్రీకాంత్) అన్న రహస్యం ఏదో తెలుసుకోవాలి. లౌకిక వేదనాంతరంగాల్ని విస్మృతిలోకి నెట్టుకోవడం (దాట్ల దేవదానంరాజు) సాధన చేయగలమేమో చూడాలి. లేక అమ్మలాంటి ప్రకృతిలో... అమ్మ ఫొటో లాంటి పడవల రేవు అమృత స్మృతిలో (శిఖామణి) లీనమై పోగలమేమో చూడాలి. లేదా ఒక ఆనందాన్ని సముద్రంలా కప్పుకున్నప్పుడు... అలల వలల్లో తుళ్లిపడే ఒంటరి చేపవు (పసునూరి శ్రీధర్ బాబు) ఐనా కావాలి!

 ఆకాశం చివరంచులదాకా వెళ్లి
 పైలంగా తిరిగొచ్చిన పతంగి
 పిల్లోడిచేతిలో మళ్లీ పుట్టి పరవశించినట్టు (రవి వీరెల్లి) పరవశించాలి! అందుకే 2014లో కవి చాలా జాగరూకతతో అన్నాడు-
 కవిత్వం రాయడమంటే
 కత్తితో సహజీవనం చేయడం
 మొద్దుబారడానికి వీల్లేదు
 మోడుగా మిగలడానికి వీల్లేదు (కె.శివారెడ్డి)

 2014వ సంవత్సరంలో విరివిగా కవిత్వం వెలువడడమే కాదు - కవితా సంపుటులు కూడా విరివిగానే వెలువడ్డాయి. మరిక విశేషం ఏమిటంటే 2014లో యువకవుల కవితా సంపుటులతో పాటుగా లబ్ధప్రతిష్టులైన కవుల కవితా సంపుటులు కూడా వెలువడడం! సీనియర్ కవులైన వరవరరావు ‘బీజభూమి’, నిఖిలేశ్వర్ ‘కాలాన్ని అధిగమించి’ కవితా సంపుటులు ఈ సంవత్సరంలోనే వెలువడ్డాయి. ‘ప్రతి జననం భూగోళం మీది తొలి జననంతో సమానం కదా’ అని తన ‘యాబై ఏళ్ల వాన’ సంపుటితో కొప్పర్తి వొస్తే, యాకూబ్ ‘చాలా చోట్లకి వెళ్లలేకపోవడం నేరమే.. ముఖ్యంగా నదీ మూలం లాంటి యింటికి’ అని తన ‘నదీమూలం లాంటి ఇల్లు’ సంపుటిలో పలకరించాడు. చినవీరభద్రుడు ‘స్ఫురించవలసిన శబ్దం కోసం ఒక జాలరి లాగా.. తెప్ప వేసుకుని ప్రతిరోజూ సముద్రాన్ని శోధిస్తూ’ అని తన ‘నీటి రంగుల చిత్రం’ సంపుటి వెలువరించాడు. ఇంకొక వైపు

 చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు
 చెరువులానైన వుండాలె
 చేపలానైన వుండాలె

 ప్రొక్లైనర్ వలే ఉండొద్దన్నం అని సిధారెడ్డి తన ‘ఇక్కడి చెట్ల గాలి’ సంపుటిలో స్పష్టంగా చెబితే ‘విప్పారిన కళ్ళతో పూలూ పిల్లలూ ఏమి మాట్లాడుకుంటారో’ అని ముకుంద రామారావు తన ‘ఆకాశయానం’ సంపుటిలో అచ్చెరువొందాడు.
 ఈ కవితాసంపుటులతో పాటుగా ప్రసాదమూర్తి ‘పూలండోయ్ పూలు’, అన్నవరం దేవేందర్ ‘పొక్కిలి వాకిళ్ళ పులకరింత’, బండ్ల మాధవరావు ‘అనుపమ’, క్రాంతి శ్రీనివాసరావు ‘సిక్స్త్ ఎలిమెంట్’, మోహన్ రుషి ‘జీరో డిగ్రీ’, బాలసుధాకర మౌళి ‘ఎగరాల్సిన సమయం’, మొయిద శ్రీనివాసరావు ‘సముద్రమంత చెమటచుక్క’, కాశీరాజు ‘భూమధ్య రేఖ’, శంషాద్ ‘ఈ కిటికీ తెరుచుకునేది ఊహల్లోకే’, యింద్రవెల్లి రమేష్ ‘వెల్లడి’ తదితర కవితా సంపుటులు కూడా 2014లోనే విడుదలయ్యాయి.
 అయితే 2014  మురిసిపోయిన ఒక సందర్భం - పదవ తరగతి చదువుతున్న రక్షిత సుమ అనే అమ్మాయి ‘దారిలో లాంతరు’ పేరుతో తన కవితల సంపుటిని వెలువరించడం! ఈ సందర్భంలో గత కొద్దికాలంగా తెలుగు కవిత్వలోకంలో ఒక ఉత్సవ వాతావరణాన్ని నింపేందుకు ప్రయత్నిస్తోన్న ‘కవి సంగమం’ కృషిని కూడా అభినందించాలి!

 2014వ సంవత్సరం వెళుతూ వెళుతూ తెలుగు కవిత్వానికి కొన్ని విషాదాలని కూడా మిగిల్చింది. ఆధునిక తెలుగు కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి అవసరమైన తూనికరాళ్ళను తెలుగు కవిత్వ విమర్శకు అందించిన ‘చేరాతల’ చేకూరి రామారావు గారు, దళిత కవిత్వానికి పదునైన నిరసన గొంతుకని అందించిన కవి గాయకుడు తెరేష్ బాబు, ‘లాల్ బానోగులామీ ఛోడో- బోలో వందేమాతరం’ కవిత ద్వారా రెండు మూడుతరాల యువకుల్ని ప్రభావితం చేసిన ఎన్‌కే, ‘తెగిన దారానికి విలవిలలాడే గాలిపటాన్ని... కేరింతలతో వినోదించడం జీవితపరమార్థం అనుకుంటాం’ అని 2014 తొలి రోజుల్లో జీవిత రహస్యాన్ని విప్పి చెప్పిన కవి జాన్‌హైడ్ తదితరులంతా 2014లోనే తెలుగు సాహిత్య లోకం నుండి శాశ్వతంగా సెలవు తీసుకున్నారు.

 చివరిగా తెలుగు కవులందరూ 2014లో విమల రాసిన ఈ కవితా వాక్యాలని ఒకసారి చదువుకోవాలి -
 కవీ! విర్రవీగకు!
 నీ కొన్ని పద్యాలు మాత్రమే ఎగురుతాయి
 పక్షుల వలే సీతాకోకచిలుకల వలే కొన్నాళ్ళు
 రెక్కలు తెగిపోయాక అవి కూడా
 ఎక్కడో అనామకంగా నేలరాలిపోతాయి
 ఏవో కొన్ని పద్యాలు మాత్రమే
 దారిలో చిరుదీపాల్లా వెలుగుతాయి....
 - కోడూరి విజయకుమార్
 83309 54074
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement