రోజూ కురిసే చీకటికి
కంటి పాదులో పూచే
నిద్ర పూవు వరం.
దాని సమీరాలకి
సకల అవయవాల పరవశమే
అలసటకు ఔషధం.
పగలంతా అలసిన మనసు
రాత్రి చిటికిన వేలుపట్టుకుని,
కల ఇంటికెళ్ళి తలుపుకొట్టి,
కునుకు పరుపుపై
ఎదురుచూసే నిద్ర పూవును
మత్తుగా తురుముకోవడం భాగ్యం.
పడక వీధిలో పరిగెత్తే ఆలోచనలను
మనసు మడతల్లో కళ్ళు నలుపుకునే సంగతులను
కళ్ళు తన కౌగిట్లో పిలుచుకుని
చేసే మర్యాదలో
తీర్చుకునే సేదకు
పొందే తాజాదనం అదృష్టం.
దీర్ఘ మైకంలోనూ
వేకువ పొలిమేర దాకా వచ్చి
వీడ్కోలు పలికే నిద్ర పూవు
ఓ ఆరోగ్య ప్రదాత,
ఓ ఆనంద నౌక,
ఓ అఖండ తేజం!
Comments
Please login to add a commentAdd a comment