‘సామాజిక’ సాహిత్యం | Today is World Poetry Day | Sakshi
Sakshi News home page

‘సామాజిక’ సాహిత్యం

Published Fri, Mar 21 2025 5:52 AM | Last Updated on Fri, Mar 21 2025 5:52 AM

Today is World Poetry Day

అనువైన వేదికలు కల్పిస్తున్న సాహితీ సంస్థలు 

సామాజిక వేదికల ద్వారా దేశ విదేశాలను ఏకం చేస్తూ సాహిత్య కార్యక్రమాలు 

యువతలోనూ పెరుగుతున్న రచనా కాంక్ష 

నేడు ప్రపంచ కవితా దినోత్సవం

సాక్షి, అమరావతి: ‘వడగాడ్పు నా జీవితం.. వెన్నెల నా కవిత్వం’ అన్నారు గుర్రం జాషువా. ఆకలి కవిత్వం.. ఆలోచనే కవిత్వం.. కదిలించే ఘటనలు.. కవ్వించే ప్రతినలు.. కవితకు ప్రాతిపదికలు అంటూ కవిత్వం స్వరూపాన్ని వివరించారు శ్రీశ్రీ. రచనలతో సంస్కృతి, సంప్రదాయాల సంపదను, మన దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో కవుల పాత్ర గొప్పది. 

వారు సాహిత్యానికి, తద్వారా సమాజ ఉన్నతికి చేస్తున్న కృషి వెలకట్టలేనిది. వారి కవిత్వానికి గుర్తింపునిస్తూ ఏటా మార్చి 21న ప్రపంచ కవితా దినోత్సవం జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి సామాజిక మాధ్యమాల ద్వారా సాహిత్యం కొత్తపుంతలు తొక్కుతోంది. 

పడిలేచిన కెరటం:   కాలంతో పాటు సాహిత్యకారులకు ఆదరణ కరువైంది. కరోనా మహమ్మారి ఈ పరిస్థితిలో కాస్త మార్పు తెచి్చంది. సామాజిక మాధ్యమాల ద్వారా రచయితలకు తిరిగి పూర్వ వైభవం వస్తోంది. అక్షర జ్ఞాన ప్రదర్శనకు అనువైన వేదికలు కల్పించే సాహిత్య సంస్థలు ఆవిర్భవిస్తున్నాయి. సామాజిక వేదికల ద్వారా దేశ విదేశాలను ఏకం చేస్తూ సాహిత్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. 

అనుభవజు్ఞల నుంచి అప్పుడే అడుగులు వేస్తున్న వారికీ ఇక్కడ గుర్తింపు దక్కుతోంది. సమాజంలోని ప్రస్తుత పరిస్థితులు, పరిణామాలనే ఇతివృత్తంగా కవితలు, కథల పోటీలు నిర్వహిస్తుంటే, గెలుపొందిన వారితో పాటు పాల్గొన్న వారికీ ప్రోత్సాహక బహుమతులు, పురస్కారాలు లభిస్తున్నాయి. దీంతో యువతరంలోనూ క్రమంగా సాహిత్య రచనా కాంక్ష పెరుగుతోంది.    

ఎన్నో మార్గాలు :     అభ్యుదయ కవిత్వం, భావ కవిత్వం, కాల్పనిక కవిత్వం అంటూ ఎవరు ఏం రాసినా పూర్వం పత్రికలు, మ్యాగజైన్లలో ప్రచురిస్తేగానీ ఎవరికీ తెలిసేది కాదు. ఇప్పుడు వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక గ్రూపులు ఏర్పాటయ్యాయి. ప్రతిలిపి, పాకెట్‌ ఎఫ్‌ఎం, పాకెట్‌ నవల్‌ వంటి ఆన్‌లైన్‌ యాప్‌లో కథలు, కవితలు వినడం, చదడం వంటి సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి.

కవులు పెరిగారు 
సోషల్‌ మీడియా వేదికగా సాహిత్యానికి పెద్ద ప్లాట్‌ఫాం ఏర్పడింది. కరోనా తర్వాత ఆన్‌లైన్‌ వేదికలు రావడంతో ఎంతోమంది కవులు మారారు. కవులకు సరైన  సాహిత్య మార్గ నిర్దేశకం అవసరం. అందుకే ప్రత్యేక వేదికలు కల్పిస్తున్నాం. – కత్తిమండ ప్రతాప్, రచయిత, శ్రీశ్రీ కళా వేదిక నిర్వాహకుడు 

సామాన్యులకు అర్థం అవుతోంది 
ఒకప్పుడు కవిత్వం రాసేవారిని వెతకాల్సి వచ్చేది. కరోనా తరువాత ప్రతి వంద మందిలో 10 మంది కవులు ఉంటున్నారు. ఏ కాలంలోనూ ఇంతమంది కవులు లేరు.  – నిమ్మగడ్డ కార్తీక్, రచయిత, తపస్వి మనోహరం సాహిత్య వేదిక నిర్వాహకుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement