
గత ఆర్థిక సంవత్సరం కన్నా చంద్రబాబు పాలనలో భారీగా తగ్గిన రెవెన్యూ రాబడి
స్పష్టం చేసిన కాగ్.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు బడ్జెట్ గణాంకాల వెల్లడి
2023–24తో పోలిస్తే రెవెన్యూ రాబడుల్లో రూ.11,450 కోట్లు తగ్గుదల
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, అమ్మకం పన్నుల రాబడి సైతం తిరోగమనమే..
కేంద్రం నుంచి గ్రాంట్లు రాబడిలోనూ భారీగా తగ్గుదల
బడ్జెట్‌లో చెప్పినదానికి మించి భారీగా అప్పులు చేస్తున్న కూటమి సర్కారు
2024–25లో ఫిబ్రవరి నాటికే రూ.90,557 కోట్ల అప్పు
ఇంత అప్పు చేసినా మూలధన వ్యయం కేవలం రూ.13,303 కోట్లే
బడ్జెట్ అంచనాలను మించి భారీగా పెరిగిన రెవెన్యూ, ద్రవ్యలోటు
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్ర ఆదాయం తిరోగమనంలో ఉందని కాగ్ తేల్చేసింది. ఒకవైపు రెవెన్యూ రాబడి తగ్గిపోతుండగా.. మరోవైపు అప్పులు భారీగా పెరిగిపోతున్నాయని స్పష్టంచేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు బడ్జెట్ రాబడులు, వ్యయాలకు సంబంధించిన గణాంకాలను కాగ్ గురువారం వెల్లడించింది.
సంపద పెంచేస్తానని ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన చంద్రబాబు... తీరా అధికారంలోకి వచ్చాక అస్తవ్యస్త పాలనతో ఉన్న సంపదను సైతం ఆవిరి చేసేస్తున్నారు. కొత్తగా సంపద సృష్టించడం దేవుడెరుగు... గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయాన్ని కూడా నిలబెట్టలేక పోతున్నారు. ఇందుకు ప్రధాన కారణం కక్ష సాధింపులు, రెడ్‌బుక్ పాలనపైనే దృష్టి సారించి, సుపరిపాలనను గాలికొదిలేయడమేనని స్పష్టం అవుతోంది.
భారీగా తగ్గిన రెవెన్యూ రాబడులు.. పన్నులు
⇒ ఎటువంటి ఆర్థిక సంక్షోభాలు లేనందున సాధారణంగా అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రాబడులకన్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడులు పెరగాలి. అందుకు పూర్తి విరుద్ధంగా 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు వచ్చిన రెవెన్యూ రాబడుల కన్నా.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు వచ్చిన రెవెన్యూ రాబడుల్లో రూ.11,450కోట్ల మేర తగ్గుదల నమోదైంది. అంటే చంద్రబాబు పాలనలో సంపదలోనూ, వృద్ధిలోనూ రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
⇒ అమ్మకం పన్నుతోపాటు స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ ఆదాయం కూడా తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ఫిబ్రవరి వరకు అమ్మకం పన్ను ఆదాయం రూ.1,068 కోట్లు తగ్గినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా రూ.721 కోట్లు తగ్గిపోయింది. అమ్మకం పన్ను ద్వారా వచ్చే ఆదాయం తగ్గడం అంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడమేనని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.
భారీగా పెరిగిన అప్పులు... తగ్గిన కేంద్రం గ్రాంట్లు
⇒ 2024–25 బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్న దానికంటే రాష్ట్ర అప్పులు భారీగా పెరిగినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకే బడ్జెట్ పరిధిలోనే రూ.90,557 కోట్లు అప్పు చేసినట్లు కాగ్ వెల్లడించింది. ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.70 వేల కోట్లు అప్పు చేస్తామని బడ్జెట్‌లో పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో నెల ఉండగానే అదనంగా రూ.20 వేల కోట్లు అప్పు చేశారు.

⇒ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లు కూడా భారీగా తగ్గిపోయాయి. గత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఆర్థిక ఏడాదిలో ఫిబ్రవరి వరకు గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధుల్లో రూ.16,766 కోట్ల తగ్గుదల నమోదైంది.

జగన్ పాలనలో కన్నా రూ.10వేల కోట్లు తక్కువగా మూలధన వ్యయం
⇒ అప్పు చేసిన నిధులను ఆస్తుల కల్పన కోసం మూలధన వ్యయంపై ఖర్చు పెట్టాలని ఇటీవలే చంద్రబాబు విలేకరుల సమావేశంలో నీతులు చెప్పారు. అయితే, ఆచరణలో మాత్రం మూలధన వ్యయంలో కోతలు విధించారు.
⇒ జగన్ సీఎంగా ఉండగా 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నాటికి మూలధన వ్యయం కింద రూ.23,251 కోట్లు ఖర్చు చేశారు. నీతులు చెబుతున్న చంద్రబాబు మాత్రం ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు కేవలం రూ.13,303 కోట్లే మూలధన వ్యయం చేశారు.
⇒ ఈ ఏడాది బడ్జెట్ అంచనాలకు మించి ద్రవ్యలోటు, రెవెన్యూలోటు పెరిగిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లుగా బడ్జెట్‌లో పేర్కొనగా.. అది ఫిబ్రవరి నాటికే ఏకంగా రూ.76,292 కోట్లకు చేరింది.
⇒ ఈ ఏడాది బడ్జెట్ అంచనాల్లో ద్రవ్యలోటు రూ.68,763 కోట్లుగా పేర్కొన్నారు. ఫిబ్రవరి నాటికే ద్రవ్యలోటు రూ.90,047 కోట్లకు చేరింది.
⇒ రెవెన్యూ రాబడులు తగ్గుతున్నా.. రాష్ట్ర వృద్ధి రేటు పెరిగిపోతోందంటూ సీఎం చెప్పడం.. కేవలం అప్పులు ఎక్కువగా చేయడానికేనని అధికారవర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment