
విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్‌ను రద్దు చేసిన కేంద్రం
కూటమి సర్కార్ ప్రోద్బలంతో ఏపీ హజ్ కమిటీ ఇచ్చిన లేఖ వల్లే ఈ నిర్ణయం
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ముస్లింలు
రాష్ట్రం నుంచి హజ్‌కు వెళ్లే ముస్లింల సౌకర్యార్థం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పట్టుదలతో సాధించిన ఎంబార్కేషన్
పాయింట్‌ను కూటమి ప్రభుత్వం రద్దు చేయించింది. విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ రద్దుకు వీలుగా ఏకంగా ఏపీ హజ్ కమిటీతో లేఖ రాయించింది. దీంతో విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అరూప్ బర్మన్ ఈ నెల 18న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అలోక్‌సింగ్‌కు రాసిన లేఖలో స్పష్టం చేశారు. – సాక్షి, అమరావతి
వైఎస్ జగన్ కృషితో సాకారం..
భారత్ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం ఆయా రాష్ట్రాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఎంబార్కేషన్ పాయింట్‌కు కేంద్ర పౌర విమానయాన, విదేశీ వ్యవహారాలు, మైనార్టీ తదితర శాఖలు సమీక్షించి అనుమతి ఇస్తాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చే వరకు హైదరాబాద్, బెంగళూరు విమానాశ్రయాల నుంచి హాజీలు వెళ్లేవారు. ఈ పరిస్థితిని గుర్తించిన వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి.. విజయవాడ(గన్నవరం) విమానాశ్రయానికి ఎంబార్కేషన్ పాయింట్ కోసం అనుమతి సాధించింది.
అలాగే ఇక్కడి నుంచి ప్రయాణించే వారిపై పడిన అదనపు చార్జీలను సైతం వైఎస్ జగన్ సర్కార్ భరించింది. ఈ విషయంలో విదేశీ వ్యవహారాల శాఖ, పౌర విమానయాన, కేంద్ర హజ్ కమిటీలతో వైఎస్సార్‌సీపీ ఎంపీలు అనేక పర్యాయాలు సంప్రదించారు. కేంద్రానికి అప్పటి సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధతో లేఖ కూడా రాసి ప్రతినిధి బృందాన్ని పంపించి మాట్లాడించారు.
అయినా సానుకూల ఫలితం లేకపోవడంతో గన్నవరం విమానాశ్రయం నుంచి వెళ్లే హాజీలపై రూ.80 వేల చొప్పున పడుతున్న అదనపు చార్జీల భారాన్ని అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే భరించింది. వైఎస్సార్‌సీపీ హయాంలో గత రెండేళ్లలో ఏకంగా 2,495 మంది విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి హజ్‌కు వెళ్లారు. 1,813 మందికి చార్జీల భారం లేకుండా రూ.14.50 కోట్లకు పైగా అందించింది.
ముస్లిం సమాజాన్ని మోసం చేశారు
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముస్లింల ప్రయోజనాలను కాపాడటంలో ఘోరంగా విఫలమైంది. ఇప్పటికే వక్ఫ్ సవరణ బిల్లు వంటి వాటిలో టీడీపీ డబుల్ గేమ్ ఆడింది. తాజాగా ఎంబార్కేషన్ పాయింట్ పోయేలా లేఖ ఇప్పించి.. ముస్లిం సమాజాన్ని మోసం చేసింది. ఇది ముమ్మాటికి ముస్లింలను అవమానపర్చడమే. సీఎం చంద్రబాబు ఇప్పటికైనా స్పందించి ఎంబార్కేషన్ పాయింట్‌ను తిరిగి సాధించాలి. – షేక్ మునీర్ అహ్మద్, ముస్లిం జేఏసీ కన్వినర్
ఇది చంద్రబాబు మార్క్ కుట్ర..
హజ్ యాత్రకు విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ రద్దు కచ్చితంగా చంద్రబాబు మార్క్ కుట్ర. ఏపీకి చెందిన ఎంపీ కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నా.. ఎంబార్కేషన్ పాయింట్ రద్దు చేస్తుంటే ఏం చేస్తున్నారు? సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నట్లు? రూ.లక్ష హామీని ఎగవేసేందుకే ఇలా కుట్ర చేశారా? – షేక్ నాగుల్ మీరా, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు
జగన్ తీసుకువస్తే.. బాబు నాశనం చేశారు
పొరుగు రాష్ట్రాల్లో ఏపీకి చెందిన హాజీలు అవస్థలు పడకూడదని అప్పటి సీఎం వైఎస్ జగన్.. పట్టుదలతో ఎంబార్కేషన్ పాయింట్ సాధించారు. మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలో విమాన టికెట్ ధరలు ఎక్కువగా
ఉంటే ఆ భారాన్ని కూడా భరించారు. అలాంటి సౌలభ్యాన్ని చంద్రబాబు నాశనం చేశారు. – దస్తగిరి, ముస్లిం దూదేకుల జేఏసీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment