
బోగస్ ఓట్ల తొలగింపు వ్యవహారం మా పరిధిలోనిది.. దానిపై మాకు చెప్పకుండా మీరెలా సిట్ వేస్తారు?
దీన్ని మేం ఎంత మాత్రం తేలిగ్గా తీసుకోలేం
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగిన కేంద్ర ఎన్నికల సంఘం
సిట్ ఏర్పాటు జీవోను ఉపసంహరించుకున్నాం
హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం
దీంతో ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదన్న ధర్మాసనం
సాక్షి, అమరావతి : గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో బోగస్ ఓట్ల తొలగింపు అభ్యర్థనతో అసలైన ఓట్ల తొలగింపు కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు దాఖలు చేయడం వెనుక ఉన్న నిజానిజాలను తేల్చే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తమను సంప్రదించకుండానే సిట్‌ను ఏర్పాటు చేయడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా తప్పుబట్టింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామంది. సిట్ ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీవో ఇచ్చారని, ఇలా చేయడం తమ అధికార పరిధిలో జోక్యం చేసుకోవడమేనని కేంద్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ హైకోర్టుకు వివరించారు.
ఈ వ్యవహారాన్ని తాము ఎంత మాత్రం తేలిగ్గా తీసుకునేది లేదన్నారు. తమ అధికార పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటున్నా చూస్తూ ఊరుకుంటే.. రేపు ప్రతి రాష్ట్రం ఇలాగే వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఏకపక్ష తీరుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులిచ్చి వివరణ కోరామన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తీరును అభిశంసించాలని ఆయన కోర్టును కోరారు. సిట్‌ను ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవోను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం మరో జీవో ఇచ్చిందని, ఆ జీవోలో ఉపయోగించిన భాష కూడా సరిగా లేదని తెలిపారు.
బేషరతుగా జీవోను ఉపసంహరించుకోకుండా ఎన్నికల సంఘం చట్ట నిబంధనలకు లోబడి తాము చర్యలు తీసుకుంటామని చెప్పడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తమ పరిధిలో జోక్యం చేసుకుంటామన్న సందేశాన్ని ఇచ్చినట్లయిందన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. సిట్ ఏర్పాటు జీవోను ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో తాము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమంది. సిట్ ఏర్పాటును సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని పరిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి గురువారం ఉత్తర్వులిచ్చారు.
మా అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకుంది
ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపించారు. ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణ, ఎన్నికల నిర్వహణ తదితరాలన్నీ తమ పరిధిలోని వ్యవహారాలని చెప్పారు. వీటిలో ఏవైనా పొరపాట్లు గానీ, లోటుపాట్లు గానీ ఉన్నా వాటిని సరిచేయాల్సింది కేంద్ర ఎన్నికల సంఘంగా తాము మాత్రమేనన్నారు.
ఇందులో జోక్యం చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. సిట్ ఏర్పాటు ద్వారా ప్రభుత్వం తమ అధికారాలను లాగేసుకుందని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై తాము ఆరోపణలను నమోదు చేసి, ఆయనకు ఖర్చులు విధించాలని కోర్టును కోరారు. ఇలా తాము కోరినట్లు కూడా రికార్డ్ చేయాలని అభ్యర్థించారు. ప్రభుత్వం తరఫున సహాయ ప్రభుత్వ న్యాయవాది అజయ్ వాదనలు వినిపిస్తూ.. సిట్ ఏర్పాటు జీవోను ఉపసంహరించుకుంటూ ఈ నెల 19న మరో జీవో ఇచ్చినట్టు కోర్టుకు వివరించారు.
సిట్ ఏర్పాటుపై పిటిషన్
గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పర్చూరు నియోజకవర్గంలో బోగస్ ఓట్ల తొలగింపు అభ్యర్థనతో అసలైన ఓట్ల తొలగింపు కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు (ఫాం 7) దాఖలయ్యాయంటూ పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చారు. దీంతో ఫాం 7 దాఖలుపై విచారణ నిమిత్తం ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 3న జీవో 448 జారీ చేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ బాపట్లకు చెందిన గుండపనేని కోటేశ్వరరావు, మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్ సుబ్బారెడ్డి విచారణ జరిపారు.
Comments
Please login to add a commentAdd a comment