
వలస బాటలో పదవ తరగతి విద్యార్థులు
వ్యవసాయ కూలీలుగా మారి పబ్లిక్ పరీక్షలకు దూరం
కరువు సీమలో ‘తల్లికి వందనం’ ఇవ్వని ఎఫెక్ట్
పది పబ్లిక్ పరీక్షల్లో పెరిగిన గైర్హాజరు శాతం
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రమాదంలో పేద విద్యార్థుల భవితవ్యం
మంత్రాలయం: బతుకుదెరువులో భాగంగా ఎంతో మంది పదవ తరగతి విద్యార్థులు పేదరికంతో పరీక్షలకు దూరమై చదువులకు వీడ్కోలు పలుకుతున్నారు. పనికోసం వలస (సుగ్గి) బాటలోనే విలువైన జీవితాలను పణంగా పెడుతున్నారు. తల్లిదండ్రులకు చదివించుకోవాలన్న ఆశ ఉన్నా, పేదరికం శాపంగా మారింది. పూట గడవని జీవులకు బతుకే ఓ పోరాటమైంది.
జీవితమే ఓ పరీక్షగా మారింది. ఇదివరకెన్నడూ లేనంతగా ఈ ఏడాది పెద్ద సంఖ్యలో 10వ తరగతి విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరు కావడం గమనార్హం. విద్యార్థులు చదువులకు దూరమవుతున్నా కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. పేద కుటుంబాల విద్యార్థుల చదువులకు భరోసా ఇవ్వకుండా వేడుక చూస్తోంది. ఒక్క కర్నూలు జిల్లాలోనే ఈ ఏడాది 32,130 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు.
అందులో మొదటి రోజు తెలుగు, ఉర్దూ, కన్నడ సబ్జెక్టు పరీక్షలకు 700 మంది గైర్హాజరయ్యారు. వీరిలో మంత్రాలయం నియోజకవర్గం వారు 79 మంది, ఆదోనివారు 37 మంది ఉన్నారు. కోసిగి మండలం చింతకుంటకు చెందిన చిన్నారి పరీక్షకు హాజరు కాలేదన్న విషయం ఓ పత్రికలో చదివి తెలుసుకున్న విద్యా శాఖ మంత్రి లోకేశ్.. సదరు చిన్నారిని గురువారం స్వగ్రామానికి పంపారు.
రెండు సబ్జెక్టుల పరీక్షలు ముగిసిన తర్వాత ఆమెను ఇంటికి రప్పించారు. ఈ బాలిక మిగతా పరీక్షలకు హాజరైనా, మొదటి రెండు పరీక్షల్లో ఫెయిల్ కాకతప్పదు. ఇలాంటి విద్యార్థులు వందల సంఖ్యలో ఉన్నారు. మరి వారందరి పరిస్థితి ఏమిటన్నది మంత్రి లోకేశ్ సెలవివ్వాలి. పేపర్లో వస్తేనే స్పందించే బదులు తొలుతే అందరూ పరీక్షలకు హాజరయ్యేలా చర్యలు తీసుకుని ఉంటే బావుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రెండు సబ్జెక్టులకు దూరమైన చిన్నారి
⇒ ఈ విద్యార్థిని పేరు సన్నక్కి చిన్నారి. కోసిగి మండలం చింతకుంట గ్రామానికి చెందిన మారయ్య, కమలమ్మ దంపతుల రెండవ కుమార్తె. కోసిగి బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదవుతోంది. గుంటూరు జిల్లా కేంద్రం సమీపంలో మిరప కోతలకు తల్లిదండ్రులతోపాటు జనవరిలో వెళ్లింది.
చిన్నారి కుటుంబానికి సెంటు భూమి కూడా లేదు. కూలికి వెళితేనే నాలుగు మెతుకులు. ఈసారి కూలి పనులు లేకపోవడంతో మారయ్య ఇంటిల్లిపాది పని కోసం వలస పట్టారు. పదవ తరగతి పరీక్షలు ప్రారంభమైనా చిన్నారిని మాత్రం పరీక్షలకు పంపలేదు. తోటి వారు వారించడంతో రెండు సబ్జెక్టుల పరీక్షలు అయిపోయాక తల్లి చిన్నారిని వెంటబెట్టుకుని ఊరు చేరుకుంది.
వీరేంద్ర పరీక్షకు తండ్రి జబ్బు శాపం
⇒ ఈ ఫొటోలోని విద్యార్థి పేరు వీరేంద్ర. మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడబూరు మండలంలోని చిన్నకడబూరు గ్రామానికి చెందిన భీమయ్య, ఉసేనమ్మ కుమారుడు. ప్రస్తుతం ఈ విద్యార్థి తండ్రికి జబ్బు చేసి స్వగ్రామంలోనే ఉండిపోగా.. తల్లితోపాటు వీరేంద్ర పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని గడితండా గ్రామంలో మిరప కోతలకు వెళాడు.
పదవ తరగతి పరీక్షలు రాసేందుకు వెళ్తానని వీరేంద్ర మొర పెట్టుకున్నా, అమ్మ ఒప్పుకోలేదు. నాన్న అనారోగ్యంగా ఉండటంతో ఇల్లు గడవడం కష్టంగా ఉందని, పైగా పోయిన సంవత్సరాల్లాగా అమ్మ ఒడి కూడా రాలేదని వీరేంద్రను వారించడంతో మనసు చంపుకొని పనికి వెళ్లాడు. రెండు నెలలుగా అక్కడే పనులు చేసుకుంటున్నారు.
పూట గడవని మాకు పరీక్షలెందుకని?
⇒ ఈ ఫొటోలోని భార్యాభర్తల పేర్లు సులువాయి నరసింహులు, నీలమ్మ. వీరిది కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలంలోని పల్లెపాడు గ్రామం. పచ్చ రంగు చొక్కా ధరించిన బాలుడు ఉరకుందు పదవ తరగతి, క్రీం కలర్ షర్టు ధరించిన బాలుడు వీరేంద్ర ఎనిమిదవ తరగతి చదువుతున్నారు. ప్రస్తుతం పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే రెండు సబ్జెక్టులు పూర్తయ్యాయి.
బతుకుదెరువు కోసం తల్లిదండ్రులతోపాటు ఉరుకుందు సుగ్గి (పని కోసం వలస)కి వెళ్లడంతో పరీక్షలకు హాజరు కాలేదు. పూట గడవని తమకు పరీక్షలు ఎందుకనుకున్నారేమో తల్లిదండ్రులు పిల్లలను సైతం తమ వెంట తీసుకొని ప్రకాశం జిల్లా పురిమెట్లలో మిరప కోతలకు వెళ్లారు. తల్లిదండ్రుల పేదరికం ఈ విద్యార్థికి శాపంగా మారడం విచారకరం. వీరికి ఎకరా భూమి ఉంది. వానొస్తేనే పొలంలో కాసింత పచ్చదనం కనిపిస్తుది. లేదంటే బీడుగా వదిలేసి సుగ్గి బాట పట్టాల్సిందే.
తల్లికి వందనం లేనందునే..
ఇలా ఒక్క పదవ తరగతి విద్యార్థులే కాదు.. ఇతర తరగతులు చదివే విద్యార్థుల్లో చాలా మంది వలస వెళ్లారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో దాదాపు 16 వేల మంది వరకు విద్యార్థులు వలస వెళ్లినట్లు అంచనా. గత ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి పథకం అమలుతో విద్యార్థులు వలస వెళ్లిన దాఖలాలు చాలా తక్కువ.
ఈసారి మాత్రం తల్లిదండ్రులతోపాటు విద్యార్థులు అత్యధిక సంఖ్యలో తరలి వెళ్లడం గమనార్హం. తల్లికి వందనం పథకం అమలు చేసి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని స్థానికులు వాపోతున్నారు. అంతేగాక సీజనల్ హాస్టళ్ల ఏర్పాటులోనూ కూటమి ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడం కూడా వలసలకు ఓ కారణం.
నాగలక్ష్మికి పేదరికమే అడ్డు
⇒ ఈ అమ్మాయి పేరు నాగలక్ష్మి. పెద్దకడబూరు మండల కేంద్రానికి చెందిన లింగమ్మ, భీమేష్ దంపతుల కుమార్తె. నాగలక్ష్మి తల్లితోపాటు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం కేంద్రం సమీపంలో మిరప కోతల్లో ఉండిపోయింది. మూడు నెలలుగా అక్కడ పొలం పనులకు వెళ్తోంది.
ఈ బాలిక పెద్దకడబూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. పబ్లిక్ పరీక్ష రాసేందుకు సైతం హాజరు కాలేదు. సెంటు భూమి లేని నాగలక్ష్మి కుటుంబానికి కూలి పనులే శరణ్యం. గ్రామంలో పనులు ముగియడంతో తల్లితో కలిసి వలస వెళ్లడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment