public exams
-
పబ్లిక్ పరీక్షల బిల్లుకు వైఎస్సార్సీపీ మద్దతు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే పబ్లిక్ పరీక్షల్లో అవతకవకలకు పాల్పడే వారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు–2024కు వైఎస్సార్సీపీ మద్దతు తెలిపింది. బిల్లుపై లోక్‌సభలో మంగళవారం జరిగిన చర్చలో వైఎస్సార్సీపీ ఎంపీ చింతా అనూరాధ మాట్లాడుతూ.. పబ్లిక్ పరీక్షలు, ఉద్యోగ నియామకాల పరీక్ష పత్రాల లీక్ కారణంగా నష్టపోయిన కోట్లాది మంది యువత ఈ తరహా బిల్లు కోసమే ఎదురు చూస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పరీక్ష పత్రాలు లీక్‌చేసే వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లలో ఓబీసీల చేర్పు అభినందనీయమని ఎంపీ చింతా అనూరాధ పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ స్థానిక సంస్థల చట్టాల బిల్లుకు వైఎస్సార్సీపీ తరఫున మద్దతు ప్రకటించారు. ఏకలవ్య పాఠశాలలు అత్యవసరం గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు అత్యవసరమని వైఎస్సార్సీపీ ఎంపీ గొడ్డేటి మాధవి అన్నారు. జమ్మూ కశ్మీర్ షెడ్యూల్డ్ కులాల, తెగల ఆర్డర్ సవరణ బిల్లులు–2024కు వైఎస్సార్సీపీ తరఫున మద్దతు ప్రకటించారు. వేగివాడలో డీఎస్పీ పశ్చిమ గోదావరి జిల్లా వేగివాడలో ‘డిమాన్స్ట్రేషన్ కం సీడ్ ప్రొడక్షన్ ఫారం’ (డీఎస్పీ) ఏర్పాటు చేసినట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా తెలిపారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఎంపీ బీశెట్టి వెంకట సత్యవతి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జవాబిచ్చారు. విశ్వవిద్యాలయాల్లో ఫ్రీ కోచింగ్ అంబేడ్కర్ ఫౌండేషన్ (డీఏఎఫ్)’, అంబేడ్కర్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (డీఏసీఈ) ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం ఉచిత కోచింగ్ స్కీమ్ నిర్వహిస్తున్నట్టు కేంద్ర సహాయ మంత్రి ఎ.నారాయణస్వామి తెలిపారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ మార్గాని భరత్ అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు. ఏపీలో 24 కృషి విజ్ఞాన కేంద్రాలు రైతులు వ్యవసాయ రంగంలో నూతన సాంకేతికతలను అవలంభించేందుకు ఏపీలో 24 కృషి విజ్ఞాన కేంద్రాల(కేవీకేల)ను ఏర్పాటు చేసినట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా తెలిపారు. ఎంపీలు పీవీ మిథున్‌రెడ్డి, గోరంట్ల మాధవ్, కోటగిరి శ్రీధర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జవాబిస్తూ.. అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, వైఎస్సార్ జిల్లాల్లో రెండేసి చొప్పున, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒకటి చొప్పున కేవీకేలు ఉన్నట్టు వివరించారు. మిల్లెట్, ఎర్రపప్పు, బెంగాల్ చిట్రా, కదిరి, వేరుశనగ వంటి పంటల ఉత్పత్తి కోసం కరువు ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు మొబైల్ సందేశాలతో రైతులకు అవగాహన కల్పిస్తున్నట్టు వివరించారు. -
రాత మారితే తలరాత మారుతుంది.. సులువైన ఈ టిప్స్ పాటిస్తే చాలు!
బాలానగర్/హైదరాబాద్: అందమైన చేతిరాతతో ఏ పబ్లిక్ పరీక్ష అయినా మంచి మెరుగైన మార్కులు సాధించడానికి ఉపమోగపడుతుందని చేతి రాత నిపుణులు అంటున్నారు. అక్షరాలను ముత్యాల్లాగా రాసేవారికి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చెబుతున్నారు. పరీక్ష ఏదైనా విద్యార్థులు మంచి మార్కులు సాధించాలంటే చేతిరాత ఓ ఆయుధం అని ఉపాధ్యాయులు సైతం పేర్కొంటున్నారు. విద్యార్థులకు రాతతో పాటు పరీక్ష రాసే విధానంపై నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. పాటించాల్సిన మెలకువలు... చదవండి👉🏻 300 మందికి పైగా ఔట్సోర్సింగ్ జేపీఎస్‌లకు ఉద్వాసన ► ప్రశ్నకు జవాబు రాసే తీరు పరీక్ష పేపర్ దిద్దడానికి ఇబ్బంది పెట్టే విధంగా ఉండరాదు. విద్యార్థులు రాసే సమాధానాలు ఉపాధ్యాయుడికి తెలుసన్న సంగతి గుర్తుంచుకోవాలి. ► జవాబు పత్రాలు ఆకట్టుకోవాలంటే పేజీకి 18 నుంచి 19 లైన్ల వరకు మించి రాయకూడదు. ► మెదటి లైను రాసే సమయంలో మార్జిన్ చేస్తూ సమాంతరంగా రాయకపోతే మిగతా లైన్లు క్రమపద్ధతిలో రావు. ► వరుస ముగింపులోని పదం పూర్తిగా ఉండేలా చూసుకోవాలి. అలా కాకుండా ఒక అక్షరం ఒక వరుసలో వచ్చి మిగిలిన అక్షరాలు మరో వరుసలో రాయకూడదు. అలా రాస్తే పరీక్ష పత్రాన్ని దిద్దేవారికి పూర్తి పదం త్వరగా అర్ధం కాకపోవచ్చు. ► అంకెలు రాసేటప్పుడు స్పష్టత లేకపోతే ఉపాధ్యాయుడు అర్ధం చేసుకోలేక మార్కులు వేయకపొవచ్చు. ► సైన్స్ (సామాన్య శాస్త్రం)లో బొమ్మలు గీస్తే ఆ బొమ్మల్లోని భాగాలు గుర్తించడంలో ఒక క్రమ పద్ధతిని పాటించాలి. ► కొన్ని పాఠశాల్లో విద్యార్థులు గీతల పేజీల నోట్‌బుక్‌లో జవాబులు రాస్తుంటారు. అటువంటి విద్యార్థులు తప్పనిసరిగా తెల్ల కాగితాలపై సాధన చేయాలి. ► జవాబు పత్రం పైభాగంలో అంగుళం స్థలం వదలాలి. ఎడమ వైపు అదే స్థాయిలో మార్జిన్ విడిచిపెట్టాలి. కుడివైపున అర అంగుళం ఖాళీ విడిచి రాయాలి. ► గణితంకు సంబంధించి అంకెలు సక్రమంగా రాయాలి. ► వ్యాకరణ దోషాలు లేకుండా జాగ్రత్తపడాలి. జవాబులు రాయడం మెదలు పెట్టిన స్థలం నుంచి చివరి వరకు సమాంతరంగా రాయాలి. అక్షరాలు పైకి లేదా కిందికి రాయకూడదు. ఒక వరుస ఎలా రాస్తే మిగిలిన వరుసలు కూడా అలానే రావడంతో పాటు జవాబు పత్రం కూడా చూడ ముచ్చటగా చాలా ఆకర్షణీయంగా కనపడుతుంది. పదం పదం మధ్యలో తగిన ఖాళీ ఉండాలి. చదవండి👉 మనీషా సాబూ ఉన్నత పదవి ఉపాధ్యాయుడి సూచనతో చదువు, చేతి రాతపై దృష్టి సారించా.. అక్షరాలు నీటిగా రాస్తే మీ చేతిరాత మార్కులను తెచ్చిపెడుతుందని మా ఉపాధ్యాయులు శ్రీశైలం అంటూండే వారు. ఆయన మాటలు నమ్మిన నేను పదో తరగతిలో కాస్లు ప్రారంభం నుంచే చేతిరాత మీద దృష్టి సారించా. ప్రతి రోజు హిందీ, తెలుగు, ఇంగ్లిష్ ఒక్కో పేపర్ చొప్పున రాస్తుండే వాడిని. ఇప్పుడు నా చేతి రాత నాకే చాలా అందంగా కనిపిస్తోంది. ఇది వరకు నాకే అర్థమయ్యేది కాదు. నా రాతను చూసి మా ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు మెచ్చుకుంటున్నారు. పదో తరగతి పరీక్షల్లో మంచిగా చదవడంతో పాటు నా చేతి రాతతో మంచి మార్కులు సాధిస్తా. – రవిశంకర్, విద్యార్థి, బాలానగర్ చేతి రాతతోనే ఎన్నో అంశాలు గుర్తుండిపోతాయి ఎవరైనా ఏదైనా అంశాన్ని పదిసార్లు చదివిన దానికంటే ఒకసారి రాస్తే చాలు గుర్తుండిపోతుంది. అందుకే నేను ప్రతి రోజూ చేతి రాతను ప్రాక్టీస్ చేస్తున్నా. ఉపాధ్యాయులు పెట్టే పరీక్షల్లో మంచి మార్కులు వస్తుండేవి. అంతే కాకుండా వేగంగా రాయడం అలవాటైంది. మా ఉపాధ్యాయులు నా కృషికి తగ్గ విధంగా గతంలో కంటే ఇప్పుడే మంచి మార్కులు వేస్తున్నారు. నా చేతి రాత బాగుంటుందని మెచ్చుకుంటున్నారు. – గౌతమి, బాలానగర్ చదువుతో పాటు చేతి రాత కూడా ముఖ్యమే.. ప్రతి విద్యార్థికి చదువుతో పాటు అందమైన చేతి రాత కూడా ముఖ్యమే. అందుకు సంబంధించిన ప్రాథమిక సూత్రాలు పాటించాలి. చేతి రాతే భవిష్యత్‌లో ప్రభావం చూపుతుంది. మంచి మార్కులు రావటానికి దోహదపడుతుంది. అందుకే నేను నా విద్యార్థులకు ముందుగా చదువుకంటే మీరు పరీక్షల్లో రాసే జవాబులు అర్థమయినప్పుడే ఉపాధ్యాయులకు మన మీద మంచి భావం ఏర్పడుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ చేతి రాతను మంచిగా నేర్చుకొనేందుకు చేయూత అందిస్తున్నా. – ఎం.శ్రీశైలం, చేతి రాత నిపుణులు, బాలానగర్ -
అంతా మా ఇష్టం..!... పబ్లిక్ పరీక్షల ఫీజు పై సైతం బాదుడు
సాక్షి హైదరాబాద్: కరోనా కష్టకాలంలో విద్యా సంస్థలు పబ్లిక్ పరీక్ష ఫీజుపై సైతం బాదేస్తున్నాయి. తాజాగా పదవ తరగతి పబ్లిక్ పరీక్ష ఫీజుపై అదనపు వసూళ్ల ప్రక్రియ బహాటంగా కొనసాగడం విస్మయానికి గురిచేస్తోంది. ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలతో పాటు సర్కారు బడుల్లో సైతం ప్రధానోపాధ్యాయుల అండదండలతో పరీక్షల విభాగం బాధ్యులు నిబంధనలకు విరుద్ధంగా నిర్ణీత ఫీజు కంటే అధికంగా బలవంతంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ఇటీవల 2021–22 విద్యాసంవత్సరం టెన్త్ పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో ఫీజు చెల్లింపు షెడ్యూలును ఎస్ఎస్సీ బోర్డు జారీ అయింది. తొలుత గత నెల 29 వరకు ఫీజు గడువును నిర్ధారించగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సంక్రాంతి సెలవులను పొడిగించడంతో ఫీజు గడువును ఈ నెల 14 వరకు బోర్డు పొడిగించింది. రూ.50 ఆలస్య రుసుంతో 24 వరకు, రూ. 200 ఆలస్య రుసుముతో మార్చి 4 వరకు. రూ.500 ఆలస్య రుసుంతో మార్చి 14 వరకు పరీక్ష ఫీజు చెల్లించే విధంగా బోర్డు వెసులుబాటు కల్పించింది. పరీక్ష ఫీజు రూ.125 మాత్రమే.. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు పేరిట అడ్డగోలు వసూళ్లు వివాదాస్పదంగా తయారయ్యాయి. నిబంధనల ప్రకారం పదవ తరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు బోర్డు ప్రకటించిన నిర్ణీత గడువులోగా రూ. 125 ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.అయితే ప్రైవేటు విద్యా సంస్థలు ఇష్టానుసారంగా వసూళ్ల కు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ప్రైవేటు స్కూల్స్‌లో పరీక్ష ఫీజు పేరుతో కనీసం రూ.1000 నుంచి రూ.2000 వరకు వసూళ్లకు పాల్పడుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరి కొన్ని యాజామాన్యాలు పాత బకాయి ఫీజులు మొత్తం చెల్లిస్తేనే పబ్లిక్ పరీక్షల ఫీజు కట్టుకుంటామనితేల్చి చెబుతుండటంతో తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సర్కారు బడుల్లో సైతం... ప్రైవేటుకు దీటుగా సర్కారు బడుల్లో సైతం పబ్లిక్ పరీక్షల ఫీజు పై అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. కొన్ని ప్రాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు సహకారంతో ఎగ్జామినేషన్ బ్రాంచ్ బాధ్యులు రూ.125 బదులు రూ.200నుంచి 500 వరకు పరీక్ష ఫీజు వసూలు చేస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిలదీస్తే మాత్రం నిర్వహణ ఖర్చులను సాకుగా చూపించడం విస్మయానికి గురిచేస్తోంది. వాస్తవంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు తమ కుటుంబ యజమాని వార్షిక ఆదాయం రూ.25 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు రూ.20 వేల లోపు ఉన్నట్లు ఆదాయ ధ్రువీకరణ పత్రం తీసుకొస్తే పరీక్ష ఫీజులో సైతం రాయితీ లభిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అంత తక్కువ ఆదాయ ధ్రువీకరణ పత్రం జారీ అయ్యే అవకాశం లేకపోవడంతో రూ.125 ఫీజు కట్టేందుకు ఆసక్తి చూపుతున్నా..అదనపు చెల్లింపులు తలకు మించిన భారంగా తయారైంది. కరోనా కష్టకాలంలో పరీక్ష ఫీజుపై అదనపు వసూళ్ల ప్రక్రియ కొనసాగుతున్నా.. విద్యా శాఖాధికారులు ప్రేక్షక పాత్ర పోషించడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
మారిన ప్రీ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్
రాయవరం (మండపేట): పదో తరగతి విద్యార్థులకు పరీక్షల ఫీవర్ ప్రారంభమైంది. ఇప్పటికే విద్యార్థులను సన్నద్ధం చేసే పనిలో ఉపాధ్యాయులున్నారు. అలాగే జిల్లా విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. పది పబ్లిక్ పరీక్షలకు సన్నాహకంగా నిర్వహించే ప్రీ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్లో మార్పు చోటు చేసుకుంది. ఈ నెల 15 నుంచి 22వ తేదీ వరకు ప్రీ పబ్లిక్ పరీక్షలు నిర్వహించేందుకు ముందుగా ప్రభుత్వ పరీక్షల విభాగం షెడ్యూల్ విడుదల చేసింది. అయితే పరీక్షల షెడ్యూల్‌ను మార్పు చేసి, కొత్త షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఫిబ్రవరి 18 నుంచి ప్రీ పబ్లిక్ పరీక్షలు ఈ నెల 18వ తేదీ నుంచి మార్చి రెండో తేదీ వరకు పదో తరగతి విద్యార్థులకు ప్రీ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వ విడుదల చేసింది. ముందు షెడ్యూల్లో రోజుకు రెండు పరీక్షలు నిర్వహించేందుకు నిర్ణయించ గా, మారిన షెడ్యూల్లో రోజుకు ఒక పరీక్ష నిర్వహిం చాలని నిర్ణయించారు. 18న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–1, కాంపోజిట్ కోర్సు, 19న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–2, కాంపోజిట్ కోర్సు పేపర్–2, 20న హిందీ, 21న ఇం గ్లిషు పేపర్–1, 22న ఇంగ్లిషు పేపర్–2, 23న గణితం పేపర్–1, 25న గణితం పేపర్–2, 26న జనరల్ సైన్స్ పేపర్–1, 27న జనరల్ సైన్స్ పేపర్–2, 28న సోషల్–1, మార్చి ఒకటిన సోషల్–2, మార్చి 2న ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–2 పరీక్ష నిర్వహిస్తారు. కొత్త షెడ్యూల్‌పై అసంతృప్తి ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసిన కొత్త షెడ్యూల్‌పై పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రోజుకొక పరీక్ష నిర్వహిస్తే విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు సమయం తక్కువుగా ఉంటుందని భావిస్తున్నారు. అలాగే జిల్లా కార్యాచరణ ప్రణాళికలకు కొంత అవరోధం ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. 68,778 మంది విద్యార్థులు జిల్లాలో జిల్లా పరిషత్, ప్రభుత్వ, మున్సిపల్ తదితర యాజమాన్యాలకు సంబంధించిన 1,285 పాఠశాలలకు చెందిన 68,778 మది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు. వీరంతా ప్రీ పబ్లిక్ పరీక్షలకు హాజరవుతారు. ఇప్పటికే సమ్మెటివ్ పరీక్ష ఆధారంగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ముఖ్యంగా సీ,డీ గ్రేడ్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. మార్చి 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ప్రతి రోజు ఒక మార్కు ప్రశ్నలు, బిట్ బ్యాంక్‌పై పరీక్షలు నిర్వహించనున్నారు. దీని కోసం జిల్లా విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. రేపటి నుంచిఫార్మేటివ్–4 పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఫార్మేటివ్–4 పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. గురువారం తెలుగు, గణితం, 8వ తేదీ ఉదయం ఆరు నుంచి పది తరగతుల విద్యార్థులకు హిందీ, మధ్యాహ్నం ఆరు, ఏడు తరగతుల విద్యార్థులకు జనరల్ సైన్స్, ఎనిమితి, పది విద్యార్థులకు ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్ పరీక్షలు, 11వ తేదీ ఉదయం ఇంగ్లిషు, మధ్యాహ్నం సోషల్ పరీక్షలు జరగనున్నాయి. 6,7,8 తరగతులకు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు, తొమ్మిది, పది విద్యార్థులకు ఉదయం 11.30 నుంచి 12.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 3.30 నుంచి 4.30 వరకు ఫార్మేటివ్ పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లా కామన్ ఎగ్జామ్ బోర్డు నుంచి పరీక్షా పేపర్లు ఎమ్మార్సీ కార్యాలయాలకు చేరుకున్నాయి. షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తాం ప్రభుత్వ పరీక్షల విభాగం అందించిన షెడ్యూల్ ప్రకా రం పరీక్షలు నిర్వహిస్తాం. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల్లో ఉన్న పాఠశాలలకు ప్రీ పబ్లిక్, ఫార్మేటివ్ పరీక్షల షెడ్యూల్‌ను అందజేశాం. – డి.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి,డీసీఈబీ, కాకినాడ పబ్లిక్ పరీక్షలుగానే భావించాలి ప్రీ పబ్లిక్ పరీక్షలను పబ్లిక్ పరీక్షలగానే భావించి వి ద్యార్థులను ఉపాధ్యాయులు సన్నద్ధం చేయాలి. ప్రీ పబ్లిక్ పరీక్షలకు సీరియస్‌గా సన్నద్ధమైతే పబ్లిక్ పరీక్షలు సులువుగా ఎదుర్కొనేందుకు వీలుంటుంది. – ఎస్.అబ్రహాం, డీఈఓ, కాకినాడ -
5, 8 తరగతులకు పబ్లిక్ పరీక్షలు
చెన్నై యూనిర్సిటీలోని ఆరోగ్య విభాగం డీన్ రాము మణివణ్ణన్ అధ్యక్షతన సుమారు పది మంది విద్యార్థులు వేలూరు కన్నియంబాడిలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న వనమూలికల తోటను పరిశీలించి వాటి ఉపయోగాలపై పరిశోధన చేసేందుకు మొక్కలు తీసుకెళ్లారు. వీరిలో ఇన్ఫోకాఫ్స్ డైరెక్టర్ అర్జున్, డాక్టర్ రిషి ఉన్నారు. చెన్నై , టీ.నగర్: 5, 8వ తరగతులకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించేందుకు చట్ట సవరణను కేంద్ర గెజిట్‌లో విడుదల చేశారు. దీనికి సంబంధించిన వివరాలు శుక్రవారం వెల్లడయ్యాయి. ఉచిత, నిర్బంధ విద్యా చట్టంలో మార్పులు చేసి, ఐదు, ఎనిమిదో తరగతులకు పరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన చట్ట సవరణను ఇటీవల ప్రవేశపెట్టింది. ఈ సవరణ చట్టం ప్రస్తుతం ప్రభుత్వ గెజిట్‌లో విడుదలైంది. ప్రస్తుతం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు అందరు విద్యార్థులు కచ్చితంగా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంది. దీంతో విద్యార్థుల విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నట్లు, ఐదో తరగతి, ఎనిమిదో తరగతులకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలంటూ, కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా తెలుపుతూ వచ్చింది. దీని గురించిన ప్రకటనను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ విడుదలచేశారు. అయినప్పటికీ ఈ పద్ధతి ద్వారా గ్రామీణ విద్యార్థుల విద్యకు ఆటంకం ఏర్పడుతుందని, అనేక మంది పిల్లలు విద్యను అర్ధాంతరంగా మానేసే పరిస్థితులు ఏర్పడతాయని, కొన్ని రాష్ట్రాలు అభిప్రాయం వెలిబుచ్చాయి. అదే సమయంలో ఉచిత, నిర్బంధ విద్య అమల్లో ఉన్న తమిళనాడు ఈ కొత్త మార్పును చేపట్టరాదంటూ ఎనిమిది తరగతి వరకు ఉచిత విద్యను అందించాలని తెలిపింది. అయినప్పటికీ కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఎనిమిదో తరగతి వరకు కచ్చితంగా ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన వల్ల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు దెబ్బతింటాయన్నారు. దీంతో ఎనిమిదో తరగతికి పబ్లిక్ పరీక్షను తప్పనిసరి చేయాలని తెలిపారు. ఈ వ్యవహారంపై గత 11వ తేదీన కేంద్ర ప్రభుత్వ గెజిట్‌లో ఈ సమాచారం విడుదలైంది. అందులో ఐదు, ఎనిమిది తరగతులకు సంవత్సరాంతంలో కచ్చితంగా పరీక్ష నిర్వహించాలని, ఇందులో ఫెయిల్ అయిన వారికి మళ్లీ అవకాశం కల్పించే విధంగా ఫలితాలు వెల్లడైన రెండు నెలల్లో మళ్లీ పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. -
నేటి నుంచి టెన్త్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు (కొన్ని సబ్జెక్టులు 12:45 గంటల వరకు) జరుగుతాయి. విద్యార్థులు ఉదయం 8:45 గంటల కల్లా పరీక్ష కేంద్రంలోకి చేరుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత సమయం 9:30 గంటల తర్వాత ఐదు నిమిషాల వరకే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 2,542 కేంద్రాల్లో 5,38,867 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులందరికీ ఇప్పటికే హాల్‌టికెట్లు జారీ చేసినట్లు విద్యాశాఖ తెలిపింది. హాల్‌టికెట్లు అందని వారు www.bse.telangana.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు.. రాష్ట్రవ్యాప్తంగా 26 సమస్యాత్మక కేంద్రాలతో పాటు మరో 405 పరీక్ష కేంద్రాల్లో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్లపైనా చర్యలు తీసుకోనున్నట్లు విద్యాశాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. అదేవిధంగా ఎంఈవో, డీఈవోలు కూడా ఇందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది. పరీక్షలకు సంబంధించి టోల్ ఫ్రీ నంబర్‌ను కూడా ఏర్పాటు చేశారు. సమస్యలు, సందేహాల నివృత్తికి 1800–4257462కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. -
వాళ్లేం పాపం చేశారు!
వచ్చే నెలలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు. వాటిలో మంచి మార్కులు తెచ్చుకునేందుకు స్టడీ మెటీరియల్ దోహదపడుతోంది. ఎందుకో మరి విద్యాశాఖ ఆ మెటీరియల్ తెలుగు, ఇంగ్లిషు మీడియం విద్యార్థులకు మాత్రమే అందజేసి ఉర్దూ, కన్నడ మాధ్యమం విద్యార్థులకు మొండిచేయి చూపించింది. కారణమేమిటంటే ముద్రణ సమస్య, భాష బదలాయింపు అని చేతులు దులుపుకుంది. విద్యార్థులు మాత్రం స్టడీ మెటీరియల్ లేకుండా పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలని ఆందోళన చెందుతున్నారు. కర్నూలు సిటీ: పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు బట్టీ విధానానికి స్వస్తి చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నుంచి నిరంతర సమగ్ర ముల్యాంకనాన్ని(సీసీఈ) అమలు చేస్తోంది. ఈ విధానంలో విద్యార్థులు సమాధానాలను గైడ్లు, పుస్తకాల్లో చదివి కాకుండా ప్రశ్నను అవగాహన చేసుకుని రాయాల్సి ఉంటుంది. ఇందులో 100 శాతం ఫలితాలు సాధించేలా వారిని సన్నద్ధం చేసేందుకు ఎస్సీఈఆర్టీ మాదిరి ప్రశ్నల పుస్తకాన్ని ఆధారం చేసుకున్నారు. అందులో భాగంగా ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉన్న సబ్జెక్టు టీచర్లతో ప్రతి ఏటా స్టడీ మెటీరియల్ తయారు చేయించి డీసీఈబీ ద్వారా ఇస్తున్నారు. దీంతో చదువులో వెనుకబడిన విద్యార్థి సైతం ఈ స్టడీ మెటీరియల్ చదివి సులువుగా పాస్ అయ్యేందుకు అవకాశం ఉంది. గతేడాది నిధుల కొరత.. ఈసారి ముద్రణ సాకు జిల్లాలో ఉర్దూ పాఠశాలలు 17, కన్నడ మీడియం పాఠశాలలు 11 ఉన్నాయి.వీటిలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు వెయ్యిమందికి పైగా ఉన్నారు. గతేడాది నిధుల కొరత పేరుతో మెటీరియల్ ఇవ్వలేదు. ఈ ఎఫెక్ట్ ఫలితాల్లో కొంత చూపింది. ఈసారి అయినా మెటీరియల్ ఇస్తారనుకుంటే ముద్రణ సమస్య అని సాకు చూపి విద్యాశాఖ చేతులు ఎత్తేసింది. మార్చిలో జరిగే పబ్లిక్ పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో తెలియక ఉర్దూ, కన్నడ భాష విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు విద్యాసంవత్సరం ప్రారంభమైన రెండున్నర నెలల తర్వాత పాఠ్యపుస్తకాలు ఇచ్చినట్లు వారు వాపోతున్నారు. కన్నడ, ఉర్దూ మీడియం చదివే వారు తక్కువగా ఉంటారనే విద్యాశాఖ నిర్లక్ష్య ధోరణే దీనికంతటికి కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్టడీ మెటీరియల్ ఇవ్వాలని కోరాం జిల్లాలో ఉర్దూ మీడియంలో చదువుతున్న విద్యార్థులకు డీసీఈబీ ద్వారా తెలుగు, ఇంగ్లిషు మీడియం వారికి ఇచ్చినట్లు మెటీరియల్ ఇవ్వాలని అధికారులను కోరాం. అయితే ట్రాన్స్లేషన్ సమస్యతో ఇవ్వలేకపోతున్నామని చెబుతున్నారు. – దాదాపీర్, ఏపీ ఉర్దూ ఉపాధ్యాయుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి -
భయం ఉంటేనే వ్యవస్థ బాగుంటుంది
సాక్షి, హైదరాబాద్: పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ పెద్ద ఎత్తున జరుగుతుండటంపై ఉమ్మడి హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మాస్ కాపీయింగ్ నేపథ్యంలో విద్యా ప్రమాణా లు పడిపోతున్నాయంది. మాస్ కాపీయింగ్‌కు సహకరించే ఉపాధ్యాయులు విద్యార్థులకు దేవుళ్లుగా, సహకరించనివారు దెయ్యాల్లా కనిపి స్తున్నారని వ్యాఖ్యానించింది. తక్కువ మార్కు లు వచ్చినా పర్వాలేదు.. నిజాయితీగా ఆ మార్కులు తెచ్చుకోవాలని ఆశిస్తున్న తల్లిదం డ్రులు ఎంతమంది ఉన్నారని ప్రశ్నించింది. మాస్ కాపీయింగ్‌కు అందరూ బాధ్యులేనంది. గతేడాది 10వ తరగతి పరీక్షల సందర్భంగా మాస్ కాపీయింగ్‌కు సంబంధించి తెలంగాణలో 4 కేసులు, ఏపీలో ఓ కేసు మాత్రమే నమోదవడంపై విస్మయం వెలిబుచ్చింది. పబ్లిక్ పరీక్షల చట్టం–1997 కింద కేసులు నమోదు చేయడంతోపాటు ప్రాసిక్యూషన్ చేస్తేనే పరిస్థితులు దార్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ‘‘భయం ఉంటేనే వ్యవస్థ బాగుపడుతుంది. ఫెయిలైతే ఏమవుతుంది.. ఓ సంవత్సరం లేటవుతుంది.. ఇందుకోసం అడ్డదార్లు తొక్కా ల్సిన అవసరమేముంది?’’ అని వ్యాఖ్యానిం చింది. మాస్ కాపీయింగ్ జరగకుండా ఏదో ఒకటి చేయాల్సిన అవసరముందంటూ ఇందు కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపా లని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయ మూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఉభయ రాష్ట్రాల్లోని మాస్ కాపీయింగ్, పుస్తకాలు పెట్టి రాస్తున్న రాతల్ని అడ్డుకోవడంలో విద్యాశాఖాధి కారులు దారుణంగా విఫలమవు తున్నారని, మాస్ కాపీయింగ్‌ను అడ్డుకునేందుకు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి పర్యవేక్షించేలా ఆదేశాలివ్వాలంటూ ఏలూరుకు చెందిన ప్రొఫెసర్ శ్రీనివాస్ గుంటుపల్లి ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీన్ని ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఏపీ న్యాయవాది పేర్కొంటూ విచారణను సంక్రాంతి సెలవుల తర్వాత చేపట్టాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.. మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన ఘటనల్లో ఎన్ని కేసులు నమోదు చేశారు.. ఎంతమందిని ప్రాసిక్యూట్ చేశారో చెప్పాలంది. ఏపీలో ఓ కేసు, తెలంగాణలో నాలుగు కేసులు నమోదు చేసినట్లు తెలుసుకున్న ధర్మాసనం విస్మయం వెలిబుచ్చింది. చట్టాన్ని ఎందుకు సక్రమంగా అమలు చేయట్లేదని ప్రశ్నించింది. సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి నిర్వహణ పెద్ద ఆర్థిక భారమేనని, కాబట్టి ఈ ఆర్థిక భారాన్ని మోయాలని ప్రభుత్వాలను ఆదేశించే అధికారం తమకెక్కడుందో చెప్పాలని పిటిషనర్‌ను కోరింది. మాస్ కాపీయింగ్ నిరోధానికి ఏం చేస్తే బాగుంటుందో సలహాలివ్వాలని కోరింది. -
ముగిసిన ఎస్సెస్సీ పరీక్షలు
ఆదిలాబాద్‌టౌన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు గురువారంతో ముగిశాయి. సంవత్సరంపాటు పుస్తకాలతో కుస్తీ పట్టి చివరి రోజు పరీక్ష రాసిన విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు తోటి స్నేహితులతో ముచ్చటిస్తూ సంతోషంలో మునిగి తేలారు. పరీక్షలు ఎలా రాశావు అంటూ విద్యార్థులు ఒకరినొకరు పలుకరించుకున్నారు. తోటి విద్యార్థుల చిరునామా తీసుకుని ఇంటిముఖం పట్టారు. వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు వారి స్వగ్రామాలకు బయలుదేరారు. విద్యార్థులతో బస్టాండ్ కిటకిటలాడింది. మొత్తం మీద పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో విద్యాశాఖ అధికారులు ఉపిరి పీల్చుకున్నారు. గురువారం జరిగిన సాంఘిక శాస్త్రం పరీక్షకు మొత్తం 9,991 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 9,871 మంది హాజరయ్యారని డీఈవో లింగయ్య తెలిపారు. అన్ని పరీక్షల్లో కలిపి ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో ఒక విద్యార్థి మాత్రమే డిబార్ అయ్యాడు. ఏప్రిల్ 3 నుంచి మూల్యాంకనం పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 3 నుంచి 14 వరకు నిర్వహించనున్నట్లు డీఈవో లింగయ్య తెలిపారు. స్పాట్ కేంద్రాన్ని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసఫ్ కాన్వంట్ స్కూల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. వివిధ జిల్లాల నుంచి మూల్యాంకనం కోసం 6 లక్షల జవాబు పత్రాలు వచ్చాయని తెలిపారు. ఇందు కోసం మొత్తం 2,300 ఉపాధ్యాయులకు విధులు కేటాయించామని అన్నారు. 500 మంది స్పెషల్ అసిస్టెంట్లు, 300 మంది సీఈలు, 1500 మంది ఏఈలను నియమించినట్లు పేర్కొన్నారు. స్పాట్ విధులు కేటాయించిన ఉపాధ్యాయులు తప్పకుండా విధులకు హాజరుకావాలని ఆదేశించారు. సౌకర్యాలు అంతంతే.. ఇదిలా ఉంటే ఎక్సైజ్ శాఖ స్టేషన్లలో అసౌకర్యాలు వేధిస్తున్నాయి. కొన్నేళ్లుగా ఎలాంటి సౌకర్యాలు లేకుండా కొనసాగిన డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఇటీవలే టీచర్స్ కాలనీలోని మరో అద్దె ఇంట్లోకి మార్చారు. ఇలా చాలా చోట్ల ఎక్సైజ్ స్టేషన్ల అవసరాల కోసం ఎలాంటి నిధులు ఇవ్వడం లేదు. కనీస సౌకర్యాలు కూడా తీర్చుకోలేకపోతున్నారు. దీనికితోడు టీఏ, డీఏ బిల్లులు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. నిర్మల్, ఆసిఫాబాద్‌లలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిబ్బందికి కనీసం వాహనాలు కూడా లేవు. ఉమ్మడి జిల్లాలోని భోరజ్, భైంసా, లక్ష్మీపూర్, గన్పూర్, వాంకిడి చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేసేందుకు రోజం తా ఉన్నప్పటికీ అక్కడ గదులు లేకపోవడంతో చెట్ల కింద పడిగాపులు కాయాల్సి వస్తోందని పేర్కొం టున్నారు. కోట్లలో ఆదాయం ఇస్తున్నప్పటికీ తమకు కనీ సం సదుపాయాలు కల్పించడం లేదని సిబ్బంది వా పోతున్నారు. సొంత భవనాలు ఏర్పాటు చేయడంతోపాటు ఎక్సైజ్స్టేషన్ల నిర్వహణ ఖర్చుల కింద రూ.50వేల చొప్పున కేటాయించాలని కోరుతున్నారు. -
పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించండి
- పరీక్ష కేంద్రాల్లో వసతులు కల్పించాలి - 144 సెక్షన్ అమలు చేయాలి - పది పరీక్షల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష కర్నూలు సిటీ: వచ్చేనెల 17వ తేదీ నుంచి జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చల్లా విజయమోహన్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం పది పరీక్షల ఏర్పాట్లపై కలెక్టర్ ఆయా శాఖల అధికారులతో సమీక్షించించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి పరీక్ష కేంద్రంలో కూడా అన్ని వసతులు కల్పించాలన్నారు. విద్యార్థులు కేంద్రాలకు సరైన సమయానికి చేరుకునేందుకు అవసరమైన బస్సు సదుపాయాలు కల్పించాలని, రవాణా విషయంలో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్రాల దగ్గర మెడికల్ కిట్లు ఏర్పాటు చేసి, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రశ్న పత్రాలను ఆయా కేంద్రాలకు సమీపంలో ఉన్న పోలీస్‌స్టేషన్ నుంచి స్కూళ్లకు చేర్చే సమయంలో బందోబస్త్‌తో వెళ్లాలన్నారు. ఎక్కడ కూడా విద్యార్థులకు వసతులు లేవనే ఫిర్యాదులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పరీక్ష కేంద్రం దగ్గర 144 సెక్షన్ అమలు చేయాలని, మాస్‌కాపింగ్‌కు అవకాశమే లేకుండా చూడాలన్నారు. పరీక్ష జరుగుతున్నంత సేపు నిరంతరంగా కరెంట్ సరఫరా ఉండేలా చూడాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. సమస్యాత్మకమైన కేంద్రాల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖకు సూచించారు. వచ్చే నెల17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్షలకు జిల్లాలో 240 కేంద్రాలను ఎంపిక చేశామని, మొత్తం 51462 మంది విద్యార్థులు హాజరుకానున్నారని ఇన్చార్జ్ డీఈఓ తాహెరా సుల్తానా కలెక్టర్‌కు వివరించారు. అన్ని రకాల సదుపాయలు ఉండే స్కూళ్లనే కేంద్రాలుగా ఎంపిక చేశామన్నారు. సమావేశంలో డీఆర్ఓ గంగాధర్‌గౌడ్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
నడవలేకున్నా.. పరీక్షలు రాస్తా....
లేపాక్షి: పట్టుదల ముందు ఎటువంటి ఆటంకాలు, అవరోధాలైనా తలవంచాల్సిందేనని అనంతపురం జిల్లాకు చెందిన ఓ బాలిక నిరూపించింది. నడవలేని స్థితిలో ఉన్నా... విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినా... విద్యా సంవత్సరాన్ని కోల్పోరాదనే ఉద్దేశంతో పరీక్షలకు హాజరవుతోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా లేపాక్షి మండలం కల్లూరు గ్రామానికి చెందిన శ్రావణి పదో తరగతి చదువుతోంది. ఆరు నెలల సైకిల్‌పై పాఠశాలకు వెళుతూ కిందపడడంతో కాలు విరిగింది. వైద్యులు శస్త్రచికిత్స చేసి కాలి లోపల స్టీల్ రాడ్ వేశారు. అయితే, దురదష్టవశాత్తూ శ్రావణి మరోసారి కిందపడడంతో రెండోసారీ శస్త్రచికిత్స చేసిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. కానీ, ఎంత కష్టమైనా సరే పదో తరగతి వార్షిక పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్న శ్రావణి... తండ్రి సహాయంతో లేపాక్షిలోని వివేకానంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్షలు రాస్తోంది. -
టెన్త్ పరీక్షలు పూర్తి...
సంగారెడ్డి మున్సిపాలిటీ: మెదక్ జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి వార్షిక పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. విధుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఇన్విజిలేటర్లను పరీక్షల విధుల నుంచి తొలగిస్తూ క్రమశిక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 200 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారు. రెగ్యులర్ విద్యార్థులు 42,169 మందికి గాను 42,059 హాజరుకాగా 110 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు. ప్రైవేట్ పరీక్షలకు గాను 1459 మందికి గాను 1369 మంది హాజరుకాగా 90 మంది పరీక్షలకు హాజరుకాలేకపోయారు. బుధవారం జరిగిన పరీక్షలను రాష్ట్ర పరిశీలకులు బృగుమాహర్షి బీహెచ్‌ఇఎల్‌లోని జ్యోతి విద్యాలయంలోని రెండు పరీక్ష కేంద్రాలను, బెల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని, సెయింట్ ఆంథోని హైస్కూల్ అర్సి పురం పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. జ్యోతి విద్యాలయంలోని పరీక్ష కేంద్రంలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇన్విజిలేటర్‌ను విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. సంగారెడ్డిలోని సెయింట్ ఆంథోని హైస్కూల్, జిల్లా పరిషత్ బాలికల పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నాత బాలుర పాఠశాలలోని పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ రావు పరిశీలించారు. సెయింట్ ఆంధోని హైస్కూల్ పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్ సమిల్ నిబంధనలకు విరుద్ధంగా సెల్‌ఫోన్‌ను పరీక్ష కేంద్రంలోని తీసుకొచ్చినందుకు గాను విధుల నుంచి తొలగిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని జిల్లా పరిషత్ బాలిక విద్యాలయంలో పాఠశాల భవనం పనులు నిర్వహిస్తుండడంతో విద్యార్థులకు ఇబ్బందులకు గురవుతున్నారని అందుకు పనులు నిలిపివేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కాంట్రాక్టర్‌కు సూచించగా తాను పనులు నిలిపేది లేదన్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్ష సమయంలో పనులు నిర్వహించడం వల్ల విద్యార్థులు పరీక్ష రాసేందుకు ఇబ్బందిగా ఉంటుందని తెలిపినా పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్‌తో విద్యార్థుల తల్లిదండ్రులు వాదనకు దిగారు. ఒక దశలో కాంట్రాక్టర్‌పై దాడికి ప్రయత్నించారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్‌రావు సమాచారం అందించడంతో వెంటనే పనులు నిలిపివేయాలని ఆదేశించడంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారు. పలు పరీక్ష కేంద్రాలలో ఇన్విజిలేటర్లకు జిల్లా విద్యాశాఖ ద్వారా జారీ చేసిన గుర్తింపు కార్డులపై ఫొటోలు పెట్టుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బెస్టాఫ్ లక్..
సాక్షి, సిటీబ్యూరో: పదో తరగతి విద్యార్థులకు బుధవారం నుంచి పబ్లిక్‌పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల లోపే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు విద్యార్థులకు సూచించారు. హైదరాబాద్, రంగారెడ్డి జంట జిల్లాల్లో మొత్తం 1,74,710 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మొత్తం 792 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా పరీక్షల పరిశీలకునిగా మోడల్ స్కూల్స్ జాయింట్ డెరైక్టర్ మస్తానయ్యను నియమించారు. విద్యార్థుల కోసం 300 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జయరావు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల సందేహాల నివృత్తికి, సూచనలు, సల హాలకు ప్రత్యేకంగా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కంట్రోల్ రూం నంబరు: 040 - 65537350 -
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
కర్నూలు(జిల్లా పరిషత్): ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షలు రాసేందుకు ఆధార్ నెంబర్ సేకరణ, పరీక్షల అనంతరం విద్యార్థులకు ఇచ్చే మార్కుల జాబితాలో ఆధార్ నెంబర్ నమోదు, సమస్యాత్మక కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా సీసీ కెమెరాల మధ్య పరీక్షల నిర్వహణ.. ఇలా ఈ యేడాది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు బుధవారం నుంచి మొదలు కానున్నాయి. గురువారం నుంచి సెకెండియర్ విద్యార్థులకు పరీక్షలుంటాయి. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి 8.30 గంటలకే చేరుకావాల్సి ఉంటుంది. 9 గంటల వరకు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. 9 గంటలు దాటితే అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. జిల్లాలో మొదటి సంవత్సరం విద్యార్థులు 37,533 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 39,391 మంది.. మొత్తం 76,926 మంది పరీక్షలు రాయనున్నారు. జిల్లా మొత్తంగా 110 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణకు ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్‌ను, డిపార్ట్మెంట్ ఆఫీసర్లను నియమించారు. ఆయా కేంద్రాల అవసరాన్ని బట్టి ఇన్విజిలేటర్ల నియామకం చేస్తారు. ప్రధాన పరీక్షలు 26న, వొకేషనల్ పరీక్షలు 31వ తేదీన ముగియనున్నాయి. ఆళ్లగడ్డలో సీసీ కెమెరాల ఏర్పాటు జిల్లాలో ఆళ్లగడ్డ, ఎర్రగుంట్ల, నందికొట్కూరు, ఎమ్మిగనూరు, కోసిగి, హోళగుంద కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా అధికారులు గుర్తించారు. ఇందులో ఆళ్లగడ్డ పరీక్ష కేంద్రంలో ప్రయోగాత్మకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. అసౌకర్యాల మధ్యే పరీక్షలు ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు పైకి చెబుతున్నా చాలా చోట్ల ఫర్నిచర్ సమస్య వెక్కిరిస్తోంది. ప్రధానంగా ఆస్పరి, హోళగుంద, డోన్, ఆలూరు తదితర మండలాల్లోని పలు పరీక్షా కేంద్రాల్లో అసౌకర్యాలు నెలకొన్నాయి. కొన్నేళ్లుగా ఈ కేంద్రాల్లో విద్యార్థులు నేలపైనే పరీక్షలు రాస్తున్నా చర్యలు శూన్యం. ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి ఇంటర్ మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్ఐవో సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలిపారు. అన్ని కేంద్రాల్లో ఫర్నిచర్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రథమ సంవత్సరంలో కామర్స్, ఎకనామిక్స్, హిస్టరీ సబ్జక్టులకు, ద్వితీయ సంవత్సరంలో తెలుగు, అరబిక్ సబ్జక్టులకు పాత, కొత్త ప్రశ్నపత్రాలు ఉంటాయన్నారు. ఫర్నిచర్ కొరత ఉన్న చోట సమీప కేంద్రాల నుంచి తెప్పిస్తామన్నారు. విద్యుత్, తాగునీరు వంటి సౌకర్యాలు పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 60 శాతం కంటే హాజరు తక్కువుంటే రూ.500 ఇంటర్ మీడియట్ ఆర్ట్స్ సబ్జక్టులు చదివే విద్యార్థులు 60 శాతం కంటే హాజరు తక్కువగా ఉంటే వారు రూ.500లు డీడీ రూపంలో చెల్లించి, వారి ప్రిన్సిపల్‌కు అందజేయాలని ఆర్ఐవో తెలిపారు. ప్రిన్సిపాళ్లు సైతం ఇలాంటి వారికి మినహాయింపు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. అయితే 60 శాతం హాజరు తక్కువగా ఉండే సైన్స్ విద్యార్థులకు హాల్‌టికెట్ ఇవ్వకూడదన్నారు. -
‘టెన్’షన్..!
కర్నూలు(జిల్లా పరిషత్): త్వరలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ అధికారులు కృషి చేస్తున్నారు. కొత్త సిలబస్ నేపథ్యంలో ఈసారి ఆశించిన ఫలితాలు రాకపోవచ్చనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. గత ఏడాది జిల్లాలో 93 శాతం పదోతరగతి ఫలితాలు నమోదయ్యాయి. ఈసారి 60 శాతం మించితే గగనమని విద్యాధికారులు బాహాటంగా చర్చించుకుంటున్నారు. జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మోడల్ స్కూల్, కస్తూరిబాగాంధి, ఎయిడెడ్, ప్రైవేటు స్కూళ్లు కలిపి 799 ఉన్నాయి. మార్చి 26 నుంచి జరిగే టెన్త్ పరీక్షలకు రెగ్యులర్ 49,187 మంది, ప్రైవేటుగా రాసే విద్యార్థులు 2,824, వొకేషనల్ విద్యార్థులు 1,792 మంది కలిపి మొత్తం ఈసారి 53,803 మంది హాజరుకానున్నారు. గత విద్యాసంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది పదో తరగతి పరీక్షల నిర్వహణ గందరగోళంగా మారిందనే చెప్పొచ్చు. నూతన సిలబస్, సీసీఈ మెథడ్‌లో విద్యాబోధన.. ఉపాధ్యాయులను, విద్యార్థులను అయోమయానికి గురిచేసింది. ఎక్కడైనా కొత్త సిలబస్, కొత్త విధానంలో విద్యాబోధన మొదలు పెట్టాలంటే ముందుగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. వేసవి సెలవుల్లోనే ఈ తంతు ముగించాలి. కానీ సమైక్యాంధ్ర ఉద్యమం పేరుతో గత ఏడాది కొత్త సిలబస్ ప్రవేశపెట్టినా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వలేదు. పాఠశాలల ప్రారంభమయ్యాక నెలరోజుల తర్వాత మొక్కుబడిగా టెలికాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ ఇచ్చారు. హడావుడి శిక్షణ 80 శాతం ఉపాధ్యాయులకు అర్థం కాలేదనే విమర్శలు ఉన్నాయి. ఇదే తరుణంలో సీసీఈ విధానంలో విద్యాబోధన చేయాలని ఒకసారి, అవసరం లేదని మరోసారి చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం గందరగోళానికి దారి తీయించింది. క్వార్టర్ల, హాఫ్ఇయర్లీ పరీక్షలు నిర్వహించేందుకు సైతం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. దీనికితోడు డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు(డీసీఈబీ)ని రద్దు చేసి విద్యాశాఖను మరింత ఇరకాటంలో పడేసింది. ఈ కారణంగా పరీక్షలను ఉపాధ్యాయులే సొంత ఖర్చుతో నిర్వహించుకోవాల్సి వచ్చింది. చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులు తరగతి బోర్డులో చాక్‌పీస్‌తో ప్రశ్నలు రాసి హాఫ్ ఇయర్లీ పరీక్షలు నిర్వహించారంటే పరిస్థితి ఏ స్థితికి వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. చేతుల కాలాక ఆకులు పట్టుకున్న చందంగా నష్టనివారణలో భాగంగా ప్రభుత్వం మళ్లీ డీసీఈబీని పునరుద్ధరించింది. అయితే దానికి నిధులు విడుదల చేయకుండా బాధ్యతలు మాత్రం అప్పగించింది. -
నేటి నుంచి ‘పది’ పరీక్షలు
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 250 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. సెంటర్లలో నంబర్లు వేయడం, ఇతర ప్రాథమిక ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలో పరీ క్షలకు హాజరవుతున్న 53,044 మంది విద్యార్థుల్లో రెగ్యులర్ విద్యార్థులు 48562 మంది ఉండగా 4482 మంది ప్రైవేట్ అభ్యర్థులున్నారు. అరగంట ముందే సెంటర్‌కు చేరుకోవాలి రోజూ ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులు నిర్ణీత సమయానికంటే అర్ధగంట ముందే సెంట ర్కు చేరుకోవాలి. పరీక్షల షెడ్యూల్ ప్రకారం ఒకేషనల్, తరగతి స్పెషల్ సబ్జెక్టుల వారికోసం ఏప్రిల్ 15వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. కానీ జిల్లా నుంచి హాజరయ్యే విద్యార్థులంతా సాధారణ సబ్జెక్టుల వారే కావడం వల్ల ఏప్రిల్ 11వ తేదీన జరిగే సోషల్ పేపర్-2తో పరీక్షలు పూర్తవుతాయి. 14 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు 14 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశారు. 250 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 250 మంది డిపార్టుమెంటల్ అధికారులు, ఐదుగురు అదనపు డీఈఓలు, 118 మంది స్టోరేజీ పాయింట్ కస్టోడియన్లు, 28 మంది పేపర్ కస్టోడియన్లు, 4600 మంది ఇన్విజిలేటర్లు పరీక్షల నిర్వహణలో భాగస్వాములవుతున్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల కోసం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తినా, ఫిర్యాదులు, సలహాల కోసం 08682-244208కు ఫోన్ చేయవచ్చు. సహాయకుల ఏర్పాటు జిల్లాకేంద్రంలో అంధులు, శారీరక వైకల్యంతో రాయలేని వారి కోసం 20 మంది స్క్రైబ్స్ (సహాయకులు)ను విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇతర చోట్ల ఎవరైనా అంధులు, శారీరక వికలాం గులు ఉన్నట్లయితే సంబంధిత కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్లను సంప్రదించి సహాయకులను ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే సహాయకులుగా తొమ్మిదో తరగతి వారిని మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. -
పదికి పక్కా ఏర్పాట్లు
వైవీయూ, న్యూస్‌లైన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అ న్ని పోలీస్ స్టేషన్లలోనూ పదో తరగతి పరీక్షా పేపర్లు సిద్ధంగా ఉన్నా యి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను విద్యాశాఖ చేసింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 33,232 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో అమ్మాయిలు 16,223 మంది, అబ్బాయిలు 17,009 మంది ఉన్నారు. వీరితో పాటు 1769 మంది అభ్యర్థులు ప్రైవేటుగా పరీక్షలకు హాజరవుతారు. 292 మంది అంధులు, వైకల్యం ఉన్న అభ్యర్థులకు సహాయకులను ఏర్పా టు చేశారు. రెగ్యులర్ విద్యార్థుల కోసం 145, ప్రైవేటు అభ్యర్థుల కోసం 11 కేంద్రాలను ఏర్పాటు చేశా రు. పరీక్షలను పరిశీలించేందుకు రెవె న్యూ, విద్యా, పోలీస్ శాఖలతో కూడి న పది బందాలను ఏర్పాటు చేసింది. పరీక్షల సమయంలో విద్యుత్ కోత లేకుండా ట్రాన్స్‌కో అధికారులతో చర్చించారు. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ప్రత్యేక బస్సులు నడపాలని కోరారు. ప్రత్యేక జాగ్రత్తలు విద్యార్థులు వడదెబ్బకు గురి కాకుండా ఉండేందుకు పరీక్ష కేంద్రా ల్లో ఓఆర్ఎస్ పాకెట్లను అందుబాటు లో ఉంచారు. ఏఎన్ఎంలను నియమించేలా చర్యలు తీసుకున్నారు. ఫలితాల కోసం ప్రత్యేక కసరత్తు గత విద్యా సంవత్సరం రాష్ట్ర స్థాయి లో మూడో స్థానంలో, అంతకు ముం దు సంవత్సరం రెండో స్థానంలో నిలిచిన జిల్లాను ఈసారి మొదటి స్థానంలో తెచ్చేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేపట్టారు. కనీసం ఉన్న స్థానాన్ని నిలబెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా రు. సమైక్యాంధ్ర ఉద్యమంతో విద్యాబోధన జరగక్క, విద్యార్థులు తమ విలువైన సమయాన్ని కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. అయినా కలెక్టర్ కోన శశిధర్ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వచ్చారు. పరీక్షల నిర్వహణపై డీఈఓ సమీక్ష వైవీయూ, న్యూస్‌లైన్: పదో తరగతి పరీక్షలపై డీఈఓ సమీక్షించారు. కడపలోని జిల్లా విద్యాశాఖ కార్యాల యంలో గల తన చాంబర్లో స్వ్కాడ్ బృందాలు, రూట్ ఆఫీసర్లతో మంగళవారం సమీక్షించారు. ఏర్పాట్లపై చర్చించారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేం ద్రాలకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు. పరీక్షల రాష్ట్ర పరిశీలకురాలు గీత మాట్లాడారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు ఆమె పలు సలహా, సూచనలు ఇచ్చారు. పరీక్ష కేంద్రాల వద్ద నిషేదాజ్ఞలు కడప అర్బన్, న్యూస్‌లైన్: జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించినట్లు ఎస్పీ అశోక్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు పూర్తయ్యేంత వరకు నిషేదాజ్ఞలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. పరీక్షలకు విఘాతం కలిగించే వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని స్పష్టం చేశారు.