పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించండి
పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించండి
Published Mon, Feb 27 2017 10:49 PM | Last Updated on Tue, Sep 5 2017 4:46 AM
- పరీక్ష కేంద్రాల్లో వసతులు కల్పించాలి
- 144 సెక‌్షన్ అమలు చేయాలి
- పది పరీక్షల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష
కర్నూలు సిటీ: వచ్చేనెల 17వ తేదీ నుంచి జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చల్లా విజయమోహన్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం పది పరీక్షల ఏర్పాట్లపై కలెక్టర్ ఆయా శాఖల అధికారులతో సమీక్షించించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి పరీక్ష కేంద్రంలో కూడా అన్ని వసతులు కల్పించాలన్నారు. విద్యార్థులు కేంద్రాలకు సరైన సమయానికి చేరుకునేందుకు అవసరమైన బస్సు సదుపాయాలు కల్పించాలని, రవాణా విషయంలో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్రాల దగ్గర మెడికల్ కిట్లు ఏర్పాటు చేసి, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ప్రశ్న పత్రాలను ఆయా కేంద్రాలకు సమీపంలో ఉన్న పోలీస్‌స్టేషన్ నుంచి స్కూళ్లకు చేర్చే సమయంలో బందోబస్త్‌తో వెళ్లాలన్నారు. ఎక్కడ కూడా విద్యార్థులకు వసతులు లేవనే ఫిర్యాదులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పరీక్ష కేంద్రం దగ్గర 144 సెక‌్షన్ అమలు చేయాలని, మాస్‌కాపింగ్‌కు అవకాశమే లేకుండా చూడాలన్నారు. పరీక్ష జరుగుతున్నంత సేపు నిరంతరంగా కరెంట్ సరఫరా ఉండేలా చూడాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. సమస్యాత్మకమైన కేంద్రాల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖకు సూచించారు. వచ్చే నెల17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్షలకు జిల్లాలో 240 కేంద్రాలను ఎంపిక చేశామని, మొత్తం 51462 మంది విద్యార్థులు హాజరుకానున్నారని ఇన్‌చార్జ్ డీఈఓ తాహెరా సుల్తానా కలెక్టర్‌కు వివరించారు. అన్ని రకాల సదుపాయలు ఉండే స్కూళ్లనే కేంద్రాలుగా ఎంపిక చేశామన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ గంగాధర్‌గౌడ్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
Advertisement