రాష్ట్ర పోలీసు అకాడెమీలో 1200 మందికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో సన్నాహక యోగ శిక్షణ
సాక్షి, హైదరాబాద్: సమాజంలో అనేక నేరాలు, సామాజిక రుగ్మతలకు మానసిక ఒత్తిడి కారణం అనే విషయం మనకు తెలుసు. ఖైదీలకు యోగ శిక్షణ ఇవ్వటం ద్వారా వారిలో సత్ప్రవర్తనను మెరుగుపరవచ్చని అనేక సందర్భాలలో రుజువైంది. అదే సమయంలో నేరాలను అరికట్టే క్రమంలో పోలీసు సిబ్బందికి సైతం మానసిక ఒత్తిడి సమస్యలు ఎదురౌతూ ఉంటాయి. వీటిని అధిగమించేందుకు కూడా యోగా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ విషయాన్ని గుర్తించిన తెలంగాణా పోలీసు ఉన్నతాధికారులు పోలీసు సిబ్బందికి యోగా శిక్షణను ప్రోత్సహిస్తూ వస్తున్నారు.
ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగతున్న సందర్భంగా తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జైళ్ళు, కార్యాలయాలో ఖైదీలకు, సిబ్బందికి విడివిడిగా యోగశిక్షణను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు నాందిగా ప్రముఖ యోగా, ఆధ్యాత్మిక, సామాజిక సేవా సంస్థ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సహకారంతో తెలంగాణ పోలీస్ అకాడమీలో 1200 మంది పోలీసు సబ్-ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు ఒక గంట పాటు యోగసాధనకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు, మానవతావాది పరమపూజ్య శ్రీశ్రీ రవిశంకర్ స్వరంతో కూడిన ధ్యానంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణా పోలీసు అకాడెమీ డైరెక్టర్ జనరల్ అభిలాషా బిస్త్ మాట్లాడుతూ, కేవలం ఒక యోగా మ్యాట్ లేదా దుప్పటి, కొద్దిపాటి ఖాళీ స్థలం ఉంటే చాలు యోగ సాధన చేయవచ్చని, ఖరీదైన ఉపకరణాలేవీ లేకుండా ఆరోగ్యాన్ని పొందగలిగే ప్రక్రియ యోగ అని అన్నారు. “ఈ రోజుల్లో పని, హోదాలతో సంబంధం లేకుండా, పోలీసు సిబ్బంది సహా అందరికీ ఏదో ఒక రూపంలో మానసిక ఒత్తిడి ఉంటోంది. మన మనసులో కలిగే ఆలోచనలకు మనం బాధ్యత తీసుకున్నపుడు, రోజూ కొంచెం సేపు యోగా, ప్రాణాయామం, ధ్యానం చేసినపుడు మన మనసును, ఒత్తిడిని మనం అదుపు చేయగలుగుతాం. ఈ దిశలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ చేస్తున్న సేవలు అత్యంత ప్రశంసనీయం.” అని ఆమె పేర్కొన్నారు. శ్రీమతి అభిలాషా బిస్త్ స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని యోగ సాధన చేయటం ద్వారా సిబ్బందిలో ఉత్తేజాన్ని, స్ఫూర్తిని నింపారు.
“మానవాళి అంతరంగ వికాసానికి తోడ్పడేందుకు భారతదేశం అందించిన ఈ ప్రాచీన కళను, ప్రపంచవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉంది.” అని శ్రీశ్రీ రరవిశంకర్ అభిలషించారు. “గత కొద్ది సంవత్సరాలుగా యోగాకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం లభిస్తోంది. యోగాలో ఆసనాలు అనేవి ఆరంభ సూచిక మాత్రమే. యోగాలోని విజ్ఞానం చాలా లోతైనది. మనసును సమత్వంగా, భిన్న పరిస్థితులలో తొణకకుండా స్థిరంగా ఉంచటానికి, చేసే పనిపై ధ్యాసను, ఏకాగ్రతను పెంపొందించడానికి యోగా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఏమిటి? అనే ప్రశ్న విజ్ఞానశాస్త్రానికి మూలమైతే, నేను ఎవరు? అనే ప్రశ్న ఆధ్యాత్మికతకు మూలం.” అని గురుదేవ్ తన సందేశంలో పేర్కొన్నారు.
తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా 100కు పైగా ప్రదేశాలలో 55వేల మందికి పైగా యోగ సాధకులు, ఔత్సాహికులు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనబోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తెలంగాణాలోని 30 జిల్లాలలో 65కు పైగా సంస్థలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నాయి. తెలంగాణా పోలీస్ అకాడెమీ, వివిధ పోలీసు బెటాలియన్లు, శిక్షణా కేంద్రాలు, సి.ఆర్.పి.ఎఫ్ దళాలు, రైల్వే కార్యాలయాలు, ఉద్యోగులు ఈ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment