tenth
-
త్వరలోనే విద్యా కమిషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యా రంగ సమస్యలను ఎప్పటికప్పుడు పరిశీలించి, పరిష్కరించేందుకు త్వరలోనే విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి తెలిపారు. పాఠశాలల్లో సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పా రు. టెన్త్‌లో పదికి పది జీపీఏ వచ్చిన విద్యార్థుల కు ఇంటర్లో ఫీజుల్లేకుండా అడ్మిషన్లు కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో వందేమాతరం ఫౌండేషన్ నేతృత్వంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది.సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరై.. టెన్త్‌లో పది జీపీఏ సాధించిన విద్యార్థులకు వందేమాతరం ఫౌండేషన్ తరపున ప్రతిభా పురస్కారాలు అందించారు. అనంతరం రేవంత్ మాట్లాడారు. మౌలిక వసతులు తక్కువగా ఉన్నా.. కార్పొరేట్ స్కూళ్లతో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు పోటీపడటం అభినందనీయమని చెప్పారు. ఇప్పుడున్న సివిల్ సర్విస్ అధికారుల్లో చాలా మంది ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారేనని.. తనతోపాటు ప్రముఖ రాజకీయ నాయకులు కూడా సర్కారీ స్కూల్లోనే చదివామని రేవంత్ చెప్పారు.విద్యార్థులు లేరని స్కూళ్లు మూసేయబోం..రాష్ట్రంలో ప్రతీ గ్రామం, తండాకు విద్యను తీసుకెళ్లాలన్నదే తమ లక్ష్యమని, అందుకోసమే మెగా డీఎస్సీ నిర్వహించబోతున్నామని రేవంత్ చెప్పారు. విద్యార్థులు లేరంటూ స్కూళ్లు మూసేసే పరిస్థితి ఉండబోదని పేర్కొన్నారు. శిథిలావస్థలో ఉన్న సర్కారీ స్కూల్ భవనాల మరమ్మతుల కోసం రూ.2 వేల కోట్లు వెచ్చించనున్నట్టు చెప్పారు. రెసిడెన్షియల్ పాఠశాలలతో తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య సంబంధాలు బలహీనపడుతున్నాయని ఒక స్టడీ రిపోర్ట్ వచ్చిందన్నారు. ఈ క్రమంలో ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ ఇస్తూ.. సెమీ రెసిడెన్షియల్‌గా మార్చాలన్న ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు.ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ బాధ్యతను అమ్మ ఆదర్శ కమిటీలకే ఇస్తున్నామన్నారు. సరికొత్త రీతిలో బడిబాట చేపట్టి స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని సూచించారు. విద్య మీద వెచి్చంచేది ఖర్చు కాదని, పెట్టుబడి అని పేర్కొన్నారు. టెన్త్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులు ఇంటర్‌లోనూ మంచి ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్య కమిషనర్ దేవసేన, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, యశోద ఫౌండేషన్ చైర్మన్ రవీందర్రావు, వందేమాతరం ఫౌండేషన్ అధ్యక్షుడు టి.రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
సాక్షి, అమరావతి: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 2023–24 విద్యా సంవత్సరంలో ఫెయిలైన మొత్తం 1,61,877 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసుకున్నట్టు పదో తరగతి పరీక్షల విభాగం ప్రకటించింది. వీరిలో 96,938 మంది బాలురు కాగా.. 64,939 మంది బాలికలు ఉన్నారు. శుక్రవారం నుంచి జూన్ 3వ తేదీ వరకు మొత్తం 9 రోజులపాటు జరిగే పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 685 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. రెగ్యులర్ పరీక్షల మాదిరగానే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయని పరీక్షల విభాగం డైరెక్టర్ డి.దేవానందరెడ్డి తెలిపారు.పర్యవేక్షణకు 685 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 685 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 6,900 మంది ఇని్వజిలేటర్లతో పాటు 86 ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను నియమించామన్నారు. అన్ని పరీక్షా కేంద్రాలను ‘నో ఫోన్ జోన్’గా ప్రకటించామని, ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని ప్రకటించారు. డీఈవోల ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్షలు ముగిసేవరకు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్షల డైరెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, పరీక్షలపై ఎలాంటి సందేహాలున్నా 0866–2974540 నంబర్లో సంప్రదించాలని దేవానందరెడ్డి సూచించారు.పరీక్షల షెడ్యూల్ ఇదీ.. 24–5–2024 తెలుగు 25–5–2024 హిందీ 27–5–2024 ఇంగ్లిష్ 28–5–2024 లెక్కలు 29–5–2024 ఫిజికల్ సైన్స్ 30–5–2024 బయలాజికల్ సైన్స్ 31–5–2024 సోషల్ స్టడీస్ 01–6–2024 ఓఎస్ఎస్సీ పేపర్–1 03–6–2024 ఓఎస్ఎస్సీ పేపర్–2 -
టెన్త్, ఇంటర్లో భారీగా ‘రీ అడ్మిషన్లు’
సాక్షి, అమరావతి: గత విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ ఫెయిలైన విద్యార్థులకు ప్రభుత్వం కల్పించిన ‘రీ అడ్మిషన్’ అవకాశాన్ని భారీ సంఖ్యలో వినియోగించుకున్నారు. సుమారు 1,93,251 మంది తిరిగి ఆయా తరగతుల్లో ప్రవేశాలు పొందారు. వీరికి ఈ విద్యా సంవత్సరంలో చేరిన రెగ్యులర్ విద్యార్థులతో సమానంగా అన్ని అవకాశాలు కల్పించనున్నారు. రాష్ట్రంలో నూరు శాతం గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) సాధనలో భాగంగా 10వ తరగతి, ఇంటర్ తప్పినవారికి రాష్ట్ర ప్రభుత్వం పునర్ ప్రవేశ అవకాశం కల్పించింది. గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా సర్వే చేసి, ఆయా విద్యార్థులను తిరిగి ఎన్రోల్ చేశారు. దాంతో 2022–23 విద్యా సంవత్సరంలో పదో తరగతి తప్పిన 1,23,680 మందిలో 1,03,000 మంది, ఇంటర్లో 90,251 మంది ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. సాధారణంగా పరీక్ష తప్పినవారు తిరిగి ఫీజు కట్టి పరీక్షలు రాస్తే (సప్లిమెంటరీ) వారిని ‘ప్రైవేటు’ విద్యార్థులుగా పరిగిణిస్తారు. కానీ.. రీ అడ్మిషన్ తీసున్న వారిని ‘రెగ్యులర్’ విద్యార్థులుగానే పరిగణిస్తారు. ఎక్కువ మార్కులే పరిగణనలోకి.. ఆయా తరగతుల్లో రీ అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఫెయిలైన సబ్జెక్టులు మాత్రమే కాకుండా రెగ్యులర్ విద్యార్థులతో సమానంగా పబ్లిక్ పరీక్షల్లో అన్ని పేపర్లు రాయాల్సి ఉంటుంది. అయితే, విద్యార్థులు గత విద్యా సంవత్సరంలో సాధించిన మార్కులు, ప్రస్తుత విద్యా సంవత్సరంలో మార్కులను పరిశీలించి, ఆయా సబ్జెక్టుల్లో ఏ విద్యా సంవత్సరంలో ఎక్కువ మార్కులు వస్తే వాటినే అంతిమంగా లెక్కలోనికి తీసుకుంటారు. ఉదాహరణకు ఓ విద్యార్థి 2022–23 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫెయిలై, ఇప్పుడు రీ అడ్మిషన్ తీసుకుంటే.. గతేడాది మ్యాథ్స్ పేపర్లో 70 మార్కులు వచ్చాయనుకుంటే.. ఈ ఏడాది పరీక్షల్లో అదే పేపర్ 30 మార్కులే వస్తే.. గత ఏడాది వచ్చిన 70 మార్కులనే పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే.. అన్ని సబ్జెక్టులు పాసైన రీ అడ్మిషన్ విద్యార్థుల సర్టీఫికెట్లపై ప్రైవేట్/కంపార్ట్మెంటల్/స్టార్ గుర్తు వంటివి లేకుండా ‘రెగ్యులర్’ అని గుర్తింపు ఇస్తారు. వీరికి కూడా ప్రభుత్వం నుంచి వచ్చే జగనన్న విద్యాకానుక, అమ్మ ఒడి వంటి అన్ని పథకాలు వర్తింపజేశారు. ఒక్కసారే అవకాశం ఓ విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ ఫెయిలైన వారికి మరుసటి సంవత్సరం మాత్రమే రీ అడ్మిషన్‌తో పాటు అన్ని రెగ్యులర్ ప్రభుత్వ పథకాలు పొందే అవకాశం కల్పిస్తారు. ఈ విద్యార్థులు రెండో ఏడాదీ ఫెయిలైతే వారికి మరో అవకాశం ఉండదు. వారు ప్రైవేటుగానే పరీక్షలు రాయాల్సి ఉంటుంది. 2022–23లో ఇంటర్మీడియెట్, పదో తరగతి ఫెయిలై తిరిగి రెగ్యులర్ గుర్తింపు పొందిన 1,93,251 మంది విద్యార్థులు 2023–24 విద్యా సంవత్సరానికి గాను వచ్చే మార్చిలో పరీక్షలు రాయనున్నారు. వీరు ఈ విద్యా సంత్సరంలో అన్ని సబ్జెక్టులు పాసైతే ‘రెగ్యులర్’ సర్టీఫికెట్ అందుకుంటారు. ఫెయిలైతే తిరిగి సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సిందే. -
ఏపీలో మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు
-
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్, పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల..ఇంకా ఇతర అప్డేట్స్
-
శతశాతమే 'లక్ష్యం'
సాక్షి, హైదరాబాద్: టెన్త్ పరీక్షల్లో వందశాతం ఫలి తాలు సాధించాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. పాఠ శాల విద్య డైరెక్టరేట్ కార్యా లయం ఈ మేరకు జిల్లా అధికారులకు దిశానిర్దేం చేస్తూ..‘లక్ష్య’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని కార్యాచరణలోకి తెచ్చింది. ప్రతీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులంతా ఉత్తీర్ణులయ్యేలా చూడటం దీని ఉద్దేశం. ఎన్నిక లు కూడా ముగియడంతో ఉన్నత పాఠశాలల ఉపా ధ్యాయులు టెన్త్ విద్యార్థులపై శ్రద్ధ పెట్టాలని డీఎస్ ఈ సూచించింది. వెనుకబడ్డ సబ్జెక్టులపై ప్రత్యేక బోధన చేపట్టాలని ఆదేశించింది. వీలైనంత త్వర గా సిల బస్ పూర్తి చేసి, జనవరిలో పునశ్చరణకు వెళ్లాలని పేర్కొంది. లక్ష్యం సాధించిన పాఠశాలల కు అవార్డు లిచ్చే అంశాన్ని కూడా ఉన్నతాధికారులు పరిశీలిస్తు న్నారు. టెన్త్ పరీక్షలు మార్చి, ఏప్రిల్ నెల లో జరుగుతాయి. ప్రైవేటు పాఠశాలలు ఇప్పటికే సిలబస్ పూర్తి చేసి, పరీక్షలకు సన్నద్ధమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలపై మరింత దృష్టి పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లపైనే..: రాష్ట్ర ప్రభుత్వ పాఠశా లలు, స్థానిక సంస్థల పాఠశాలల్లో టెన్త్ ఫలితాలు తక్కువగా నమోదవుతున్నాయి. 2023లో జెడ్పీ పా ఠశాలల నుంచి 1,39,922 మంది టెన్త్ పరీక్షకు హా జరైతే, 1,10,738 మంది మాత్రమే ఉత్తీర్ణుల య్యా రు. అంటే 79.14 శాతం రిజల్ట్ నమోదైంది. ప్రభు త్వ స్కూళ్లలో 21,495 మంది పరీక్ష రాస్తే, 15,561 (72.39 శాతం) మంది పాసయ్యారు. ప్రభుత్వ రెసి డెన్షియల్ స్కూళ్లలో 98 శాతం, గురుకు లాల్లో 95 శాతం ఫలితాలొచ్చాయి. ఇది ప్రైవేటు పాఠశాలక న్నా ఎక్కువ. అయితే ప్రభుత్వ, జెడ్పీ స్కూళ్లల్లో ఫలితాలపై ఈసారి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆ సబ్జెక్టులపైనే దృష్టి: ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఎక్కు వగా మేథ్స్, సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో ఎక్కువగా ఫెయిల్ అవుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ సబ్జెక్టులపై ప్రత్యేక బోధనకు ప్లాన్ చేశారు. టెన్త్ విద్యార్థులకు ఉదయం గంట అదనంగా క్లాసులు తీసుకుంటారు. వారంలో 3 సబ్జెక్టులు రోజుకు ఒకటి చొప్పున చేపట్టాలని నిర్ణయించారు. ఇది కూడా సంబంధిత సబ్జెక్టులో కఠినంగా ఉండే చాప్టర్లను ఎంపిక చేసుకోవాలని పాఠశాలలకు సూచిస్తున్నారు. జనవరి ఆఖరివారం లేదా ఫిబ్రవరి నుంచి సాయంత్రం కూడా అదనంగా మరో గంట ప్రత్యేక బోధన చేపట్టాలని నిర్ణ యించారు. దీనివల్ల టెన్త్‌లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించడం సాధ్యమనేది అధికారుల ఆలోచన. -
కుటుంబం దుఃఖంలో ఉంటే ఇంత నీచ రాజకీయం చేస్తావా
-
టెన్త్ టాపర్లకు సీఎం వైఎస్ జగన్ బొనాంజా..
సాక్షి, అమరావతి: టెన్త్ టాపర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బొనాంజా ప్రకటించారు. నియోజకవర్గాల్లోని టాపర్లకూ ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. గవర్నమెంటు స్కూళ్లలో టెన్త్‌లో టాప్ విద్యార్థులకు ప్రోత్సాహకాలను విస్తరించనున్నారు. రాష్ట్ర, జిల్లాస్థాయి టాపర్లకే కాకుండా నియోజకవర్గాల వారీ టాపర్లరూ ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. నియోజకవర్గంలో 1,2,3 స్థానాల్లోని విద్యార్థులకు వరుసగా రూ.15వేలు, రూ.10వేలు, రూ.5వేలు చొప్పున నగదు ప్రోత్సాహకాలు అందించనున్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పెరిగాయి. టెన్త్, ఇంటర్ ఫలితాలే అందుకు నిదర్శనం. ఈ విద్యా సంవత్సరం పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను సన్మానించనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: గేరు మార్చి.. స్పీడ్ పెంచి.. సీఎం జగన్ బలం అదే.. ఇదీ లెక్క..! నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులను అవార్డులు, నగదు పురస్కారాలతో సత్కరించనున్నారు. జడ్పీ, ప్రభుత్వ, మున్సిపల్, ఏపీ మోడల్, బీసీ రెసిడెన్షియల్, ఏపీ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, జీటీడబ్ల్యూ ఆశ్రమ స్కూళ్లు, కేజీబీవీ విద్యార్థులకు ఈ అవకాశం కల్పించినట్లు తెలిపారు. మార్కుల ఆధారంగా టెన్త్, ఇంటర్లో 2,831 మంది విద్యార్థులను సత్కరించనున్నట్లు మంత్రి చెప్పారు. -
ఏపీలో ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు
-
టెన్త్ పరీక్ష ఫీజు 125 రూపాయలే
సాక్షి, కదిరి: పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం నెల క్రితమే షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల10లోగా చెల్లించవచ్చు. అన్ని సబ్జెక్టులకు కలిపి కేవలం రూ.125 చెల్లిస్తే సరిపోతుంది. పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా పరీక్ష ఫీజు పెంచలేదు. ఇదే మొత్తాన్ని వసూలు చేస్తోంది. అపరాధ రుసుంతో... రూ.50 అపరాధ రుసుంతో డిసెంబర్ 20 వరకూ పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. డిసెంబర్ 25 వరకూ అపరాధ రుసుం రూ.200తో , ఆ తర్వాత అంటే డిసెంబర్ 26 నుంచి డిసెంబర్ 30లోగా రూ.500 అపరాధ రుసుంతో పరీక్ష ఫీజు చెల్లించే వెసులుబాటు ఉంది. వృత్తి విద్యా కోర్సులు అభ్యసించే వారు రూ.125తో పాటు ప్రాక్టికల్స్ కోసం అదనంగా మరో రూ.60 చెల్లించాలి. గతంలో టెన్త్ ఫెయిలైన విద్యార్థులు మూడు లేదా అంతకన్నా తక్కువ సబ్జెక్టులకు రూ.110, అంతకన్నా ఎక్కువ సబ్జెక్టులుంటే రెగ్యులర్ విద్యార్థులతో సమానంగా రూ.125 చెల్లిస్తే సరిపోతుంది. హెచ్‌ఎంలదే కీలక బాధ్యత.. 10వ తరగతి పరీక్షల ఫీజు విషయంలో ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులదే కీలక బాధ్యత ఉంటుంది. విద్యార్థుల పరీక్ష ఫీజుకు సంబంధించిన నామినల్ రోల్స్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే విద్యార్థులు నష్టపోతారు. పూర్తి చేసిన నామినల్ రోల్స్‌కు పాఠశాల లాగిన్‌లోని లింక్ ద్వారా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. చలానా లేదా సీఎఫ్ఎంఎస్ ద్వారా ఫీజు చెల్లిస్తే ఉపయోగం ఉండదు. 10 పరీక్షలకు సంబంధించిన మ్యానివల్ నామినల్ రోల్స్ (ఎంఎన్ఆర్)ను డిసెంబర్ 21 నుండి 31 లోగా డీఈఓ కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది. 23,758 మంది రెగ్యులర్ విద్యార్థులు.. జిల్లాలో 2022–23 విద్యా సంవత్సరంలో జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో 11,782 మంది, మున్సిపల్ స్కూల్స్‌లో 1,803, కస్తూర్బా స్కూల్స్‌లో 1,115 మంది, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 783 మంది, సోషల్ వేల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో 540 మంది, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్‌లో 220 మంది ఉన్నారు. అలాగే ఏపీఆర్ఈఐ సొసైటీ స్కూల్స్‌లో 88 మంది, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ స్కూల్స్‌లో 35 మంది, మోడల్ స్కూల్స్‌లో 796 మంది, నవోదయ విద్యాలయాల్లో 83 మంది, ప్రైవేటు/కార్పొరేట్ స్కూల్స్‌లో 5,603 మంది, సీబీఎస్సీ వారు 178 మంది, బీసీ వెల్ఫేర్ స్కూల్స్‌లో 724 మందితో పాటు గవర్నమెంట్ స్కూల్స్‌లో మరో 8 మంది అంధ విద్యార్థులతో కలిపి బాలురు 12,450 మంది, బాలికలు 11,308 మంది మొత్తం 23,758 మంది రెగ్యులర్ విద్యార్థులు ఈసారి పది పరీక్షకు హాజరు కానున్నారు. ఈసారి ఆరు పేపర్లే.. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించి.. నాణ్యమైన విద్యా బోధనే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చింది. పది పబ్లిక్ పరీక్షల్లో 11 పేపర్లకు బదులు 6 పేపర్లు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించింది. కోవిడ్ కారణంగా గత ఏడాది పది పబ్లిక్ పరీక్షల్లో 7 పేపర్లు నిర్వహించారు. కరోనా తీవ్రత నేపథ్యంలో 2019–20 అలాగే 2020–21 విద్యాసంవత్సరాల్లో 10 పబ్లిక్ పరీక్షలు నిర్వహించలేదు. సమ్మేటివ్ పరీక్షల్లో వచ్చిన మార్కులను ప్రామాణికంగా తీసుకొని టెన్త్ పాస్ చేసిన విషయం తెలిసిందే. ఈసారి సీబీఎస్ఈ తరహాలోనే టెన్త్‌లో ఆరు పేపర్లే ఉంటాయి. ప్రైవేటు స్కూళ్లలో ఫీ‘జులుం’.. 10వ తరగతి పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు ముగుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను తీవ్ర మానసిక వేదనకు గురి చేస్తున్నాయి. స్కూల్ఫీజు, ట్యూషన్ ఫీజు, ట్రాన్స్‌పోర్టు ఫీజు ఇలా బకాయి ఉన్న ఫీజులన్నీ చెల్లిస్తే గానీ పరీక్ష ఫీజు తీసుకునేది లేదని మెలిక పెడుతున్నారు. ఇంకొన్ని చోట్ల కోవిడ్ సమయంలోని పెండింగ్‌లో ఉన్న ఫీజులు కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఫలానా తేదీకి ఫీజు మొత్తం క్లియర్ చేస్తామని విద్యార్థుల తల్లిదండ్రులతో హామీ పత్రాలు తీసుకుంటున్నారు. వాస్తవంగా పరీక్ష ఫీజు అన్ని సబ్జెక్టుకు కలిపి ప్రభుత్వం కేవలం 125 మాత్రమే నిర్దేశించింది. కానీ చాలా కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో రూ.500 నుంచి రూ.1500 దాకా వసూలు చేస్తున్నట్లు సమాచారం. అధిక ఫీజు వసూలు చేస్తే చర్యలు 10వ తరగతి పరీక్ష ఫీజు కన్నా అధిక మొత్తంలో వసూలు చేసిన పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తాం. అలాగే పరీక్ష ఫీజుకు పాఠశాల ఫీజులకు మెలిక పెడితే శాఖాపరమైన చర్యలు తప్పవు. నామినల్ రోల్స్ విషయంలో అజాగ్రత్త వహిస్తే సంబంధిత హెచ్ఎంలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. – మీనాక్షి, డీఈఓ -
టెన్త్ పరీక్షలు రాస్తున్నారా? సక్సెస్‌బాట పట్టించే సూచనలు తెలుసుకోండి
పదోతరగతి పరీక్షలు సమీపిస్తున్న వేళ విద్యార్థులు ఓ వైపు ఒత్తిడి, మరోవైపు వారిలో ఆందోళనను నివృత్తి చేసేందుకు వారికి ఉపాధ్యాయులు, అధికారులు పలు సూచనలు చేశారు. మైలార్‌దేవ్‌పల్లి (హైదరాబాద్): ఏకాగ్రత, ప్రణాళిక బద్ధంగా చదివితేనే విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఒత్తిడికి గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు స్పష్టం చేశారు. పలు సూచనలు.. ► పరీక్షా సమయంలో సెల్‌ఫోన్, టీవీ, కంప్యూటర్ల వైపు దృష్టి మరలకుండా చూసుకోవాలి. ప్రతి రోజు విద్యార్థి నిర్ధేశించుకున్న టైమ్ టేబుల్ ప్రకారం చదువుకోవాల్సి ఉంటుంది. ► ఉపాధ్యాయులు, స్నేహితులు, సీనియర్ల ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలి. ఆత్మ విశ్వాసంతో పరీక్షలకు సిద్ధమైతేనే విజయం మరింత సులభమవుతుంది. ► ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు ముఖ్యంగా విద్యార్థులకు పరీక్ష సమాయాల్లో ఇంట్లో చక్కటి వాతావరణం కల్పించాలి. ► విద్యార్థిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు కృషి చేయడంతో పాటు అవసరమైన ధైర్యాన్ని అందించాలి. ► ఒత్తిడిని తగ్గించేందుకు వారికి సహకారం అందిస్తే అధిక సమయం చదువుకే కేటాయిస్తారు. ► తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానుకూలంగా విద్యార్థికి తగిన ఆహారం అందించాలి. ► విద్యార్థులు సమయానికి తగినట్లుగా నిద్రపోయేలా కుటుంబసభ్యులు చూసుకోవాలి. రెండు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదోతరగతి విద్యార్థులను పరీక్షలకు పూర్తి సన్నద్ధం చేశాం. ఇప్పటికే రెండు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించి వారికి మనోధైర్యాన్ని కల్పించాం. గణితం, సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులలో మంచి మార్కులు వచ్చేలా ఎప్పటికప్పుడు తరగతులు నిర్వహిస్తున్నాం. మే 23 నుంచి జూన్ 1 వరకు పరీక్షలను నిర్వహిస్తున్నాం. –రామిరెడ్డి, ఎంఈఓ రాజేంద్రనగర్ సొంతంగా రాసిన జవాబులకే అధిక మార్కులు ఉపాధ్యాయులు ఇచ్చిన మెటీరియల్‌ను విద్యార్థులు చదువుకుని పాఠ్య పుస్తకాలపైనే దృష్టిసారించాలి. సమయాన్ని వృధా చేయకుండా పరీక్షలకు సిద్ధం కావాలి. సొంతంగా రా సిన జవాబులకే అధిక మార్కులు వేసే అవకాశం ఉంటుంది. –ఎన్.మాణిక్యంరెడ్డి, ఉపాధ్యాయుడు ఖాళీ కడుపుతో వెళ్లకూడదు విద్యార్థులు పరీక్షలకు వెళ్లే సమయంలో మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. పరీక్షలకు వెళ్లే ముందు తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. ప్రశ్నా పత్రాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న తర్వాతే జవాబులు రాయాలి. –డాక్టర్ సుభాష్, మైలార్‌దేవ్‌పల్లి 10 జీపీ సాధిస్తామనే నమ్మకం ఉంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఎలాంటి ఒత్తిడి లేదు. తరగతి గదుల్లో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా వింటూ ఉపాధ్యాయులు ఇచ్చిన నోట్స్‌ను ఇప్పటికే చదివేశాం. పదికి పది జీపీ సాధిస్తామన్న విశ్వాసం ఉంది. –స్వాతి, పదో తరగతి విద్యార్థిని -
టెన్త్, ఇంటర్ ఫలితాలపై దృష్టి సారించాలి: మంత్రి సురేష్
సాక్షి, అమరావతి: టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు నేపథ్యంలో ఇక ఫలితాల వెల్లడిపై దృష్టి సారించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. త్వరితగతిన ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వారం రోజుల్లో ఫలితాలు ప్రకటించేలా చూడాలన్నారు. ఇక పాఠశాలలు తెరిచే అంశాన్ని పరిశీలించాలన్నారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సూచనల మేరకు తేదీ నిర్ణయించాల్సి ఉంటుందన్నారు. 2021-22 అకడమిక్ క్యాలెండర్ తయారు చేసి విద్యాబోధన దిశగా తరగతులు నిర్వహణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశాలన్నింటిపై కార్యాచరణ రూపొందించాలని అధికారులను మంత్రి సురేష్ ఆదేశించారు. చదవండి: విద్యాభివృద్ధికి ‘సాల్ట్’ పథకం: మంత్రి ఆదిమూలపు సురేష్ ఏపీ: పంటల రవాణాపై ఆంక్షలు లేవు.. -
ఏపీ: టెన్త్, ఇంటర్ పరీక్షలపై విద్యాశాఖ కీలక ప్రతిపాదనలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. కరోనా అదుపులోకి వస్తుండటంతో పరీక్షల నిర్వహణకు నిర్ణయం తీసుకుంది. నేడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకు ప్రతిపాదనలు తీసుకెళ్లనుంది. టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై ముఖ్యమంత్రి నేడు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. జులై 7 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఇంటర్‌బోర్డ్ కొన్ని ప్రతిపాదనలు చేసింది. రోజు విడిచి రోజు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి.11 పేపర్లకు బదులు 7 పేపర్లకు పరీక్షలు నిర్వహించనుంది. సెప్టెంబర్ 2 లోపు టెన్త్ ఫలితాలు విడుదల కానున్నాయి. -
సమ్మేటివ్–1 పరీక్షలు ప్రారంభం
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని అన్ని యాజమాన్యాల కింద పని చేస్తున్న ఉన్నత పాఠశాలల్లో 6–10వ తరగతి విద్యార్థులకు సమ్మేటివ్–1 (సంగ్రహణాత్మక మదింపు) పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సంవత్సరం నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఏ) విధానం అమలు చేస్తుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ప్రశ్నపత్రం ఉంటుంది. గతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఈసారి విద్యాశాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు చెబుతోంది. అన్ని మండలాల్లోనూ ఎమ్మార్సీ కేంద్రాల్లో ప్రశ్నపత్రాలు భద్రపరిచారు. పరీక్ష ప్రారంభానికి గంట ముందు అక్కడి నుంచి పాఠశాల కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నారు. దూరప్రాంతాల్లో ఉన్న స్కూళ్లకు సీఆర్పీల ద్వారా పంపుతున్నారు. దీంతో కాస్త దూరంగా ఉన్న స్కూళ్లకైతే కేవలం 5 నిముషాల ముందు ప్రశ్నపత్రాలు చేరాయి. డీఈఓ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ముఖ్యంగా ప్రశ్నపత్రాలు తరలింపు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. కొన్ని స్కూళ్లకు ప్రశ్నపత్రాలు కొరత వచ్చిన సంగతి వాస్తవమేననీ, అయితే బఫర్ స్టాకు నుంచి సర్దామన్నారు. ఇక ఈనెల 18న పరీక్షలు ముగుస్తాయనీ, 19 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఉంటాయని ఆయన వెల్లడించారు. -
డబుల్ ధమాకా!
– టెన్త్, సీసీఈ రెండు పాయింట్లూ వినియోగించుకున్న అయ్యవార్లు – డీఈఓ కార్యాలయ సిబ్బంది సహకారంతోనే అక్రమాలు – ఉపాధ్యాయుల బదిలీల్లో కొనసాగుతున్న లీలలు అనంతపురం ఎడ్యుకేషన్: బదిలీ కౌన్సెలింగ్‌లో ఒక పాయింటు అదనంగా వచ్చినా సీనియారిటీ జాబితాలో 50–60 మంది కంటే ముందుకు వెళ్లొచ్చు. అదే నాలుగైదు పాయింట్లు అప్పనంగా వచ్చి పడితే వారికి అన్ని విధాలా సౌకర్యవంతమైన స్థానాలు ఖచ్చితంగా దక్కుతాయి. పాయింట్లు ఎలాగొచ్చాయనేది కాదు.. ఎంత మంచి స్థానం వచ్చిందనేది ముఖ్యం అనే ధోరణిలో కొందరు ఉపాధ్యాయులు వెళ్తున్నారు. ఈ క్రమంలో అడ్డదారుల్లో పాయింట్లు పొందేందుకు వెనుకాడడం లేదు. సమాజానికి మార్గదర్శకంగా నిలవాల్సిన గురువులే అక్రమాలకు పాల్పడుతుండడం సిగ్గుచేటు. అర్హత లేదని తెలిసికూడా పాయింట్లు పొందేందుకు వక్రమార్గం ఎన్నుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు టీచర్లు పదో తరగతి, సీసీఈ పాయింట్లు రెండు వేసుకుంటూ ‘డబుల్ ధమాకా’ కొడుతున్నారు. ‘దొరికితే దొంగ దొరక్కపోతే దొర’ అనే ధోరణిలో పాయింట్లు వేసుకుంటున్నారు. అధికారులు గుర్తిస్తే రద్దు చేసుకుందాం లేదంటే పాయింట్లు వస్తాయనే దురాలోచనతో ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఒకటికే పాయింట్లు వేసుకోవాలి ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు పదో తరగతి బోధించిన పాయింట్లు కాని, సీసీఈ పాయింట్లు కాని ఏవైనా ఒక్కటే వేసుకోవాలి. పదో తరగతి పాయింట్లు ఉత్తీర్ణత శాతాన్ని బట్టి 2–5 వరకు వస్తాయి. అదే సీసీఈ పాయింట్లు కూడా ఆ స్కూల్ విద్యార్థులకు నిర్వహించిన వివిధ పరీక్షల్లో వచ్చిన ఉత్తీర్ణత శాతం ఆధారంగా 2–5 పాయింట్లు వస్తాయి. అయితే టీచరు వారి సౌలభ్యాన్ని పట్టి ఎక్కువ పాయింట్లు వచ్చే వాటిని ఉపయోగించుకుంటారు. అయితే కొందరు టీచర్లు రెండిటిలోనూ పాయింట్లు వేసుకున్నారు. గణితం ‘లెక్క’ తప్పింది గణితం టీచర్లకు సంబంధించిన ప్రొవిజనల్ సీనియారిటీ జాబితాను ఆన్లైన్లో ఉంచారు. జిల్లాలో 827 మంది గణితం టీచర్లతో జాబితాను రూపొందించారు. అయితే జాబితాను ఒకసారి పరిశీస్తే లీలలు కనిపిస్తున్నాయి. 32వ సీరియల్ నంబర్ టీచరుకు పదో తరగతి పాయింట్లు 5, సీసీఈ పాయింట్లు 4 పాయింట్లు నమోదయ్యాయి. 34వ నంబర్ టీచరుకు పదోతరగతి పాయింట్లు 5, సీసీఈ పాయింట్లు 3 వచ్చాయి. 61వ సీరియల్ నంబర్ టీచరుకు పదో తరగతికి 2, సీసీఈకి 2 పాయింట్లు వచ్చాయి. 85వ నంబర్ టీచరుకు పదో తరగతి 1 పాయింటు, సీసీఈకి 3 పాయింట్లు వేశారు. 147, 479, 560 సీరియల్ నంబర్ టీచర్లు పదో తరగతి 3, సీసీఈకి 3 పాయింట్లు వేసుకున్నారు. 544 నంబర్ టీచరు పదో తరగతికి 2.5, సీసీఈకి 2 పాయింట్లు వేసుకున్నారు. ఇవి ఉదాహరణకు మాత్రమే. ప్రతి సబ్జెక్టు, ప్రతి కేడరులోనూ ఇదే పరిస్థితి. డీఈఓ కార్యాలయ సిబ్బంది సహకారంతోనే అక్రమాలు పాయింట్లు ఇష్టానుసారంగా నమోదు చేయడంలో కొందరు డీఈఓ కార్యాలయ సిబ్బంది చక్రం తిప్పుతున్నారు. కొందరు ఒక గ్రూపుగా ఏర్పడి వారికి అనుకూలమైన టీచర్లందరికీ ఇలా అక్రమార్గాన పాయింట్లు వచ్చేలా సహకారం అందిస్తున్నట్లు తెలిసింది. కౌన్సెలింగ్ ప్రక్రియలో ‘మిడిల్ బాస్’గా వ్యవహరిస్తున్న ఓ అధికారి నేతృత్వంలోనే అక్రమాల తంతు జరుగుతున్నట్లు సమాచారం. లబోదిబోమంటున్న టీచర్లు నిజాయితీగా రావాల్సిన పాయింట్లు మాత్రమే వేసుకుని బదిలీకి దరఖాస్తు చేసుకున్న టీచర్లు అడ్డదారుల్లో పాయింట్లు పొందుతున్న అయ్యవార్లతో బెంబేలెత్తుతున్నారు. తమకు అన్యాయం జరుగుతోందంటూ అబోదిబోమంటున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అర్హత లేకుండా పాయింట్లు వేసుకున్న టీచర్లకు ఆ పాయింట్లు తొలిగించి తమకు న్యాయం చేయాలని అభ్యర్థిస్తున్నారు. -
నేటి నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు
- జిల్లాలో 22 కేంద్రాలు - పరీక్షలకు 4260 మంది విద్యార్థులు కర్నూలు సిటీ: పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జిల్లా విద్యాధికారి తరఫున ఏడీ కె.సరోజినిదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 28 వరకు జరిగే పరీక్షలకు జిల్లాలో 22 కేంద్రాలు ఎంపిక చేశామన్నారు. విద్యార్థులు ఉదయం 9 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. హాల్‌టికెట్ లేని పక్షంలో అనుమతించబోమని తెలిపారు. పరీక్షలకు జిల్లా నుంచి 4260 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. -
ప్రభుత్వ బడి.. ఫలితాల జడి!
- పదిలో ప్రతిభ చూపిన ప్రభుత్వ పాఠశాలలు – 149 ప్రభుత్వ స్కూళ్ళలో 100 శాతం ఫలితాలు – సీసీఈ విధానం వల్లే ఉత్తమ ఫలితాలు కర్నూలు సిటీ: సాధారణంగా ప్రభుత్వ స్కూళ్లు అంటే అందరికీ చిన్నచూపు ఉంటుంది. అక్కడ సరైన వసతులు ఉండవు, టీచర్లు సక్రమంగా చదువు చెప్పరని చాలా మంది విద్యార్థులు తల్లిదండ్రుల భావన. ఈ కారణంతోనే గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ స్కూళ్ళల్లో విద్యార్థుల సంఖ్య ఏడాకేడాది తగ్గుతూ వస్తుంది. అయితే పరీక్షల ఫలితాల్లో కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రాణిస్తున్నాయి. ప్రభుత్వ స్కూళ్లకు చెందిన విద్యార్థులకు సైతం మంచి గ్రేడ్లు వస్తున్నాయి. నిరంతర సమగ్ర ముల్యాంకనం (సీసీఈ) విధానంతో ఈ ఏడాది మంచి ఫలితాలు వచ్చాయి. కలిసొచ్చిన సీసీఈ విధానం! జిల్లాలో మొత్తం 898 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 2016–17 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి పరీక్షలు సీసీఈ విధానంలో నిర్వహించారు. ఈ విధానంలో మొదటిసారి పరీక్షలు రాస్తుండడంతో ఫలితాలపై ప్రభావం పడుతుందనే ఆందోళన నెలకొంది. ఈ ఆందోళనకు కారణం ప్రభుత్వ స్కూళ్లలో ప్రయోగాత్మకమైన భోధనకు అవసరమయిన సదుపాయలు లేకపోవడమే. అయితే ఎస్సీఈఆర్టీ సూచనలు, సలహాలతో సీసీఈ విధానంపై ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం, డీసీఈబీలు ముందస్తుగా నమూనా ప్రశ్న పత్రాలను తయారు చేసి అన్ని ఉన్నత పాఠశాలలకు ఇవ్వడంతో మెరుగైన ఫలితాలు సాధించారు. జిల్లాలో 149 వివిధ ప్రభుత్వ యాజమాన్యా స్కూళ్లు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. జెడ్పీ పాఠశాల్లో 91.20 శాతం ఉత్తీర్ణత...! జిల్లా పరిషత్ యాజమన్యా పరిధిలోని స్కూళ్లకు చెందిన విద్యార్థులు 20,763 మంది విద్యార్థులు పరీక్షలు హాజరుకాగా, 18,936 మంది ఉత్తీర్ణలు అయ్యారు. మొత్తంగా 91.20 ఉతీతర్ణ శాతం నమోదైంది. అలాగే 94 సూళ్లు 100 శాతం సాధించాయి. 8.5 నుంచి 9.5 పాయింట్ల మధ్య అత్యధిక మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. జిల్లాలో మొత్తం 80 ప్రభుత్వ యజమాన్య స్కూల్స్ ఉన్నాయి. వీటిలో 2,865 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అవ్వగా, 2381 మంది ఉత్తీర్ణత సాధించారు. వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలకు చెందిన 1470 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 1403 మంది ఉత్తీర్ణులై..95.44 శాతం ఉత్తీర్ణత శాతం నమోదు చేశారు. సీసీఈ విధానం వల్లే ఉత్తమ ఫలితాలు – ఎస్.తాహెరా సుల్తానా, డీఈఓ పదో తరగతి పరీక్షలు ఈ ఏడాది నిరంతర సమగ్ర ముల్యాంకనం(సీసీఈ)లో జరిగాయి. ఈ విధానం వల్లే ప్రభుత్వ యాజమన్యాల కింద ఉన్న పాఠశాలకు చెందిన విద్యార్థులు అత్యధిక మంది ఉత్తీర్ణులు అయ్యారు. టీచర్లు సైతం మెరుగైన ఫలితాల కోసం కష్టపడ్డారు. వచ్చే ఏడాది ఇంకా మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేస్తాం. -
బాలికలదే హవా
పది ఫలితాల్లో జిల్లాకు 7వ స్థానం – జీపీఏ పాయింట్లలో 5వ స్థానం – స్వల్పంగా తగ్గిన ఫలితాల శాతం – సీసీఈ విధానంలోనూ మెరుగైన ప్రతిభ – అభినందనలు తెలిపిన కలెక్టర్ కర్నూలు(సిటీ): పదవ తరగతి ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. మొట్టమొదటి సారిగా నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) విధానంలో నిర్వహించిన పరీక్షల్లోనూ జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. జిల్లాలో మొత్తం 870 ఉన్నత పాఠశాలలకు చెందిన 49,604 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 46,329 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 93.4 శాతం ఉత్తీర్ణత సాధించగా.. గత ఏడాది 94.20 శాతం కంటే 0.80 శాతం తగ్గింది. అయితే గత ఏడాది రాష్ట్రస్థాయిలో 8వ స్థానంలో ఉన్న జిల్లా ఈ ఏడాది ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని 7వ స్థానంలో నిలిచింది. ఫలితాల్లో బాలికల హవా జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపాలిటీ, ఏపీ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఏపీ మోడల్ స్కూల్, ఎయిడెడ్, ప్రైవేటు అన్ ఎయిడెడ్, కస్తూర్బా, బీసీ వెల్ఫేర్ యాజమాన్యాల కింద జిల్లాలో 870 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 49,604 మంది విద్యార్థులు ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో బాలురు 27,204 మందికి గాను 25,241 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 2015–16 విద్యా సంవత్సరంలో బాలురు 90 శాతం ఉత్తీర్ణత సాధించగా, 2016–17 విద్యా సంవత్సరంలో 92.71 శాతానికి పెరిగింది. బాలికలు 22,400 మంది పరీక్షలకు హాజరు కాగా 21,080 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 2015–16 విద్యా సంవత్సరంలో బాలికలు 94.43 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, 2016–17 విద్యా సంవత్సరంలో 94.14 శాతం ఉత్తీర్ణులై స్వల్పంగా తగ్గింది. అయితే మొత్తంగా ఈ ఏడాది పరీక్షలకు హాజరైన విద్యార్థుల ఉత్తీర్ణత శాతంలో బాలికలదే పైచేయిగా కనిపిస్తోంది. జీపీఏ పాయింట్లలో మెరుగైన ఫలితాలు పదవ తరగతి పరీక్షల్లో గ్రేస్ పాయింట్ల విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత అత్యధికంగా జీపీఏ పాయింట్లు సాధించిన విద్యార్థులు ఈ ఏడాది గత రెండేళ్ల కంటే మూడింతలు పెరిగారు. 2014–15 విద్యా సంవత్సరంలో 429 మంది విద్యార్థులు 10/10 పాయింట్లు సాధించగా, 2015–16 విద్యా సంవత్సరంలో జీపీఏ పాయింట్ల సంఖ్య తగ్గింది. 379 మంది విద్యార్థులు మాత్రమే 10/10 పాయింట్లు సాధించారు. అయితే ఈ ఏడాది నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) విధానంలో పరీక్షలు నిర్వహించినా 1,372 మంది విద్యార్థులు 10/10 పాయింట్లు సాధించగా.. రాష్ట్రంలోనే జిల్లా 5వ స్థానంలో నిలిచింది. అయితే ఈ స్థాయిలో జీపీ పాయింట్లు సాధించడానికి సీసీఈ విధానంలో నిర్వహించిన ఇంటర్నల్ పరీక్షల్లోని మార్కులు కూడా ఒక కారణమని తెలుస్తోంది. విద్యాశాఖ అధికారులకు కలెక్టర్ అభినందన పదవ తరగతి ఫలితాల్లో గత ఏడాది కంటే స్వల్పంగా ఉత్తీర్ణత శాతం తగ్గినా స్థానాన్ని మెరుగుపరచుకోవడం పట్ల విద్యా శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అభినందించారు. ఇక ముందు మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు. -
టెన్త్ స్పాట్ కేంద్రం పరిశీలన
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): మాంటిస్సోరి పాఠశాలలోని పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాన్ని శనివారం గుంటూరు ఆర్జేడీ, స్పాట్ ప్రత్యేక పరిశీలకుడు శ్రీనివాసరెడ్డి పరిశీలించాడు. ఉపాధ్యాయులకు మూల్యాంకనంలో సలహాలు, సూచనలు ఇస్తూ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఆదివారంతో(16వతేదీ) స్పాట్ వాల్యుయేషన్ ముగుస్తుందన్నారు. మే మొదటి వారంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. ఆయన వెంట డీఈఓ తహెర సుల్తానా, పలువురు డీవైఈఓలు ఉన్నారు. -
కదం తొక్కిన ఉపాధ్యాయులు
సమస్యలపై పోరుబాట పదోతరగతి మూల్యాంకనం బహిష్కరణ పలువురి అరెస్టు, విడుదల భానుగుడి (కాకినాడ) : దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాలు సంఘటితంగా పోరుబాటపట్టాయి. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఒకే గొంతుతో నినదించిన ప్రతినిధులు తమ సమస్యల పరిష్కారం కోసం మళ్లీ గళమెత్తారు. ఉపాధ్యాయ సంఘాలు ఫ్యాప్టో, జాక్టోల ఆధ్వర్యంలో వందలాది మంది ఉపాధ్యాయులు కాకినాడ పీఆర్జీ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదోతరగతి మూల్యాంకన కేంద్రాన్ని మంగళవారం ముట్టడించి, విధులను అడ్డుకున్నారు. గంట పాటు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నేతలు మాట్లాడుతూ సీపీఎస్ విధానం, బదిలీల్లో వెబ్ కౌన్సెలింగ్ విధానం, ఫెర్ఫార్మెన్స్ పాయింట్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 8, 9 తరగతుల బాహ్య మూల్యాంకన రద్దు చేయాలని, ప్రధానోపాధ్యాయులకు డీవైఈఓలుగా పదోన్నతులు కల్పించాలని, 100 నెలల పీఆర్సీ అరియర్స్, బకాయి పడిన డీఏలు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. విధులకు ఆటంకం కల్పిస్తున్నరన్న కారణంతో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులను త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు స్టేషన్లో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులను జేఏసీ అధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం పరామర్శించారు. అరెస్టు చేసిన నాయకులను పూచీకత్తుపై విడుదల చేశారు. పోలీసులు తమను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ వారు పోలీస్ స్టేషన్ వద్ద కొద్దిసేపు నిరసన తెలిపారు. ఈ ఆందోళనలో ఎస్టీయూ అ«ధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేవీ శేఖర్, డీ వెంకట్రావు, యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే రాఘ«వులు, కామేశ్వరరావు, పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీఎన్‌వీవీ ప్రసాద్, చింతాడ ప్రదీప్‌కుమార్, ఏపీటీఎఫ్ నాయకులు వెంకట్రాజు, సుబ్రహ్మణ్యం, ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీవీ సత్యనారాయణ, చెవ్వూరి రవి, పీఈటీల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లంక జార్జి తదితరులు పాల్గొన్నారు. -
నేడు టెన్త్ స్పాట్ బహిష్కరణ
కర్నూలు సిటీ: ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనలకు నిరసనగా నేడు ఫ్యాప్టో, జాక్టో సంఘాల ఆధ్వర్యంలో టెన్త్ స్పాట్‌ను బహిష్కరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు పాయింట్లు, వెబ్ కౌన్సెలింగ్ ద్వారా చేపడుతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పాయింట్ల ఆధారిత విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్లపై ఉపాధ్యాయ సంఘాలు నిరసన తెలుపనున్నాయి. -
పది స్పాట్ ప్రారంభం
- సోషల్ టీచర్ల కొరత కర్నూలు సిటీ: పదవ తరగతి స్పాట్ వాల్యుయేషన్ సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈ నెల 16వ తేది వరకు నిర్వహించే స్పాట్‌కు 1,987 మంది టీచర్లును కేటాయించారు. అయితే సోషల్ సబ్జెక్టుకు సంబంధించిన టీచర్లు తక్కువగా ఉన్నారు. ఉన్న వారు కూడా వయస్సు భారం, అనారోగ్య కారణాల వల్ల రాలేమని డీఈఓకు విన్నివించారు. అయితే స్పాట్‌కు ఆర్డరు ఇచ్చిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా మంగళవారం నాటికి విధుల్లో చేరాలని డీఈఓ తాహెరా సుల్తానా ఆదేశించారు. స్పాట్ జరుగుతున్న మాంటిస్సోరి స్కూల్లోని కేంద్రాన్ని డీఈఓ తనిఖీ చేశారు. ముల్యాంకనంలో పొరపాట్లకు తావు లేకుండా వ్యవహరించాలని సూచించారు. -
టెన్త్ స్పాట్ వాల్యుయేషన్‌కు ఏర్పాట్లు
- నేటి నుంచి 16 వరకు మూల్యాంకనం - స్పాట్ అధికారులతో డీఈఓ సమావేశం కర్నూలు సిటీ: పదవ తరగతి స్పాట్ వాల్యుయేషన్ సోమవారం ప్రారంభం కానుంది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గత నెల17వ తేదీన మొదలైన పరీక్షలు 30తో ముగిశాయి. ఈ క్రమంలో వెంటనే స్పాట్ వాల్యుయేషన్ మొదలెట్టి వీలైనంత తొందరగానే ఫలితాలు విడుదల చేయాలని ప్రభుత్వం ఇప్పటీకే అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు ఆదేశాలు ఇచ్చింది. స్కూల్ విద్యార్థులకు సవరణాత్మకమైన బోధన జరుగుతోంది. ఇందుకు ఇబ్బందులు లేకుండా స్పాట్‌కు సిబ్బందిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆదే అంశంపై ఆదివారం డీఈఓ తాహెరా సుల్తానా తన ఛాంబర్లో స్పాట్ అధికారులతో సమావేశమయ్యారు. మూల్యాంకనానికి మొత్తం 1987 మందిని నియమించామని తెలిపారు. 19 మంది ఏసీఓలు, 236 మంది సీఈలు, 1651 మంది ఏఈలు, 336 మంది స్పెషల్ అసిస్టెంట్లు పని చేస్తారన్నారు. ముల్యాంకనంలో అవకతవకలు చోటు చేసుకోకుండా పగద్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు రెమ్యునరేషన్ ఇస్తామన్నారు. ఈనెల16వ తేదీ వరకు స్పాట్ వాల్యుయేషన్ జరుగుతుందన్నారు. సమావేశంలో డీసీఈబీ సెక్రటరీ ఓంకార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన పది పరీక్షలు
– చివరి రోజున 233 మంది విద్యార్థులు గైర్హాజరు – వచ్చే నెల 3నుంచి స్పాట్ మొదలు అయ్యే అవకాశం కర్నూలు సిటీ: పదో తరగతి పరీక్షలు ఈ నెల 17 నుంచి మొదలై.. గురువారం సోషల్ పేపర్–2తో ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఏడాది సీసీఈ విధానంలో పరీక్షలు జరిగాయి. కొత్త విధానం అయినా.. ఎక్కడా పెద్దగా ఆందోళనలు జరగక పోవడంతో విద్యాశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రెగ్యులర్ డీఈఓ లేకపోవడంతో ఏవిధంగా పరీక్షలు నిర్వహిస్తారోననే ఆందోళన ఉన్నా ఇంచార్జీ డీఈఓ, డిప్యూటీ ,ఈఓలు, సీనియర్ హెచ్ఎంల సహకారంతో ప్రశాంతంగా నిర్వహించారు. చివరి రోజున 50,079 మంది విద్యార్థులకుగాను 49,846 మంది విద్యార్థులు హాజరు కాగా.. 233 మంది గైర్హాజరైయ్యారు. డీఈఓ తాహెరా సుల్తానా ఐదు కేంద్రాలు, ఎస్సీఈఆర్టీ నుంచి జిల్లా అబ్జర్వర్‌గా వచ్చిన లక్ష్మీవాట్స్ ఏడు కేంద్రాలను తనిఖీ చేశారు. వచ్చే నెల 3నుంచి స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. -
పారదర్శకంగా పదో తరగతి పరీక్షలు
-మాస్ కాపీయింగ్ నిరోధానికి పటిష్ట చర్యలు -డీఈఓ అబ్రహం మామిడికుదురు : జిల్లాలో పదో తరగతి పరీక్షలు పారదర్శకంగా జరుగుతున్నాయని డీఈఓ ఎస్.అబ్రహం తెలిపారు. ఆయన సోమవారం మామిడికుదురు, మొగలికుదురు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. మొగలికుదురు పరీక్షా కేంద్రంపై పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆ కేంద్రాన్ని స్వయంగా పరిశీలించానని, అక్కడ ఏవిధమైన మాస్ కాపీయింగ్ జరగడం లేదని చెప్పారు. నిరంతర సమగ్ర మూల్యాంకన వి«ధానం వల్ల విద్యార్థులు ఏ విధమైన ఇబ్బందులూ పడడం లేదన్నారు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణతా శాతం పెరిగేందుకు పలు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. ప్రత్యేక తరగతుల నిర్వహణ, వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చదివించామన్నారు. ఈ ఏడాది జిల్లాలో ఉత్తీర్ణత శాతం కూడా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలో ఇంత వరకు ముగ్గురు విద్యార్థులను డీబార్ చేశామని, ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డీఓ, ఆరుగురు ఇన్విజిలేటర్లపై చర్యలు తీసుకున్నామని తెలిపారు.