‘పది’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ చల్లా విజయమోహన్ ఆదేశించారు.
- జిల్లా కలెక్టర్ విజయమోహన్
కర్నూలు సిటీ: పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ చల్లా విజయమోహన్ ఆదేశించారు. శుక్రవారం పది పరీక్షల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. విద్యార్థులు.. పరీక్ష కేంద్రాలకు సరైన సమయానికి చేరుకునేందుకు అవసరమైన బస్సులు నడపాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. 144 సెక‌్షన్‌ను పకడ్బందీగా అమలు చేయాలన్నారు.
తాగు నీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు. ఈ నెల 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరుగనున్న పరీక్షలకు జిల్లాలో 240 కేంద్రాలను ఎంపిక చేశామని, మొత్తం 51,462 మంది విద్యార్థులు హాజరుకానున్నారని ఇన్‌చార్జీ డీఈఓ తాహెరా సుల్తానా.. కలెక్టర్‌కు వివరించారు. ఉత్తమ ఫలితాలు సాధించకుంటే సంబంధిత స్కూల్ ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే ఫిర్యాదులు చేసేందుకు కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశామన్నారు. 08518–277309కు ఫోన్ చేయవచ్చన్నారు. సమావేశంలో చీఫ్ సూపరెండెంట్స్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.