
మడకశిర కేంద్రంలో పరీక్ష రాస్తున్న విద్యార్థులు
అనంతపురం ఎడ్యుకేషన్ : ముందస్తు సమాచారం లేకుండా గురుకుల పాఠశాలలో ఐదో తరగతి ప్రవేశాలకు ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రం మార్పు చేయడం గందరగోళానికి దారి తీసింది. వివరాల్లోకి వెళ్తే... గురుకుల పాఠశాలల్లో 2018–19 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి ప్రవేశాలకు ఆదివారం పరీక్షలు నిర్వహించారు. అనంతపురం, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, ఉరవకొండ, కదిరి తదితర ప్రాంతాలకు చెందిన 200 మంది విద్యార్థులను గుడిబండ బీసీ గురుకుల బాలికల పాఠశాల కేంద్రంలో పరీక్ష రాసేందుకు హాల్‌టికెట్లను జారీ చేశారు. దీంతో విద్యార్థులు ఆదివారం ఉదయం గుడిబండకు చేరుకున్నారు. ఉదయం 10.30 గంటలకు పరీక్ష ప్రారంభం కావాల్సి ఉంది.
అయితే అక్కడ గురుకుల పాఠశాల లేదనే విషయం తెలుసుకున్న వారంతా గందరగోళానికి గురయ్యారు. గత ఏడాది ఇక్కడి గురుకుల పాఠశాలను మడకశిరకు మార్చినా.. అధికారులు పాత చిరునామాతోనే హాల్‌టికెట్‌లు జారీచేశారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పిల్లలతో మడకశిరకు చేరుకున్నారు. అప్పటికే 11.15 గంటలుకాగా, పరీక్ష రాసేందుకు సిబ్బంది నిరాకరించారు. సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వారు వినకపోవడంతో తల్లిదండ్రులు ఆగ్రహంతో తిరగబడ్డారు. దీంతో ఆలస్యంగా విద్యార్థులను పరీక్షలకు అనుమతించారు.
Comments
Please login to add a commentAdd a comment