భయం వీడితే..‘పది’లమే
భయం వీడితే..‘పది’లమే
Published Wed, Mar 1 2017 11:21 PM | Last Updated on Tue, Sep 5 2017 4:56 AM
సమయం చాలా కీలకం
విద్యార్థులు ఆహార నియమాలు పాటించాలి
తల్లితండ్రుల పాత్ర కీలకమే
విజయం..పరాజయం రెండింటిదీ దగ్గరి సంబంధమే. ఒకటి దూరమైతే ఇంకోటి దరిచేరుతుంది. దీనికి సంబంధించి మరొకటుంది..అదే భయం..! దీని చుట్టూ జయాపజయాలుంటాయి. భయపడితే పరాజయం పలకరిస్తుంది. భయం వీడితే విజయం వరిస్తుంది. విజేతలుగా నిలుపుతుంది. తొమ్మిదేళ్ల పాటు వార్షిక పరీక్షలకు హాజరై.. తొలిసారి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న పదో తరగతి విద్యార్థుల్లో కాస్త భయం..ఇంకాస్త ఆందోళన ఉండడం సహజం. అయితే ఈ భయం..ఆందోళనలను వీడడం చాలా సులభం. అలా చేస్తే మంచి ప్రతిభ చూపడం సులువే. విద్యార్థి ప్రగతికి పదో తరగతి తొలి మెట్టు వంటిది. ఇక్కడ రాణిస్తే భవిష్యత్‌లో వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి ఉండదు. మరో 16 రోజుల్లో (ఈ నెల 17 నుంచి) పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు తీసుకునే జాగ్రత్తలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
- రాయవరం
టెన్షన్ వదలాలి..
విద్యార్థులు టెన్షన్ వదిలి అటెన్షన్‌గా ఉండాలి. సరైన రీతిలో పరీక్షలకు ప్రిపేరవ్వడం ఎంత కీలకమో అదే సమయంలో చదివిన ప్రశ్నలను గుర్తుంచుకుని రాయడం కూడా అంతే ముఖ్యం. చదువుతో పాటు పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలి. మానసిక ప్రశాంతతను అలవర్చుకోవాలి. పరీక్షలు సమీపించిన ఈ సమయంలో కేవలం రివిజన్‌కు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. గతంలో చదివిన ప్రశ్న, జవాబులను మరోసారి పునఃశ్చరణ చేసుకోవాలే కాని కొత్త పాఠ్యాంశాల జోలికి వెళ్లకూడదు. పరీక్షలకు వెళ్లే విద్యార్థులు ముఖ్యంగా ఐదు ‘సి’లు విడనాడాలి. సినిమా, కేబుల్‌టీవీ, క్రికెట్, సెల్‌ఫోన్‌తో పాటుగా ఛాటింగ్‌ను విడనాడాలి. అదే సమయంలో పోజిటివ్ థింకింగ్, ప్లానింగ్, ప్రిపరేషన్, ప్రివ్యూ, ప్రజంటేషన్‌ను అలవర్చుకోవాలి. వీటితో పాటు పరీక్ష ముందు రోజు తగినంత నిద్ర పోవాలి. నిద్ర మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. నేను బాగానే రాయగలను అనే ఆత్మవిశ్వాసంతో పరీక్షా కేంద్రానికి వెళ్లాలి. ముందుగా బాగా వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాసిన అనంతరం కష్టతరమైన ప్రశ్నలకు జవాబులు రాసే ప్రణాళిక అలవర్చుకోవాలి. రేపటి పరీక్షను చక్కగా రాస్తున్నట్లుగా ఊహను మనస్సులో పొందుపర్చుకుంటూ సంసిద్ధంగా ఉండాలి. కొత్త వాతావరణంలో పరీక్షలు రాస్తున్నామనే భయాన్ని విడనాడాలి. జవాబు పత్రంలో ఎక్కువుగా కొట్టివేతలు, దిద్దివేతలు లేకుండా చక్కటి దస్తూరీతో సమాధానాలు రాస్తే మంచిది.
తల్లితండ్రుల పాత్ర కూడా కీలకమే..
పరీక్షల్లో తల్లితండ్రుల పాత్ర కూడా కీలకమే. పరీక్షల సమయంలో వారికి తరచుగా మార్కులు ఎక్కువుగా తెచ్చుకోవాలంటూ ఒత్తిడి తేవద్దు. ఇతర పిల్లలతో పోలుస్తూ సరిగ్గా చదవడం లేదనడం, గత పరీక్షల్లో మార్కులు సరిగ్గా రాలేదనడం, ఇతర పిల్లలతో పోల్చి మాట్లాడడం చేయకూడదు. చదవడం కలిగే ఉపయోగాలు..సమాజంలో లభించే గౌరవాన్ని అర్ధమయ్యేలా..సున్నితంగా తెలియజెప్పాలి. పరీక్షలకు వెళ్లే ముందు ఐదు నుంచి పది నిమిషాలు టీవీ చూడడం మంచిదే. కామెడీ, సినిమా పాటల ఛానల్స్‌ను చూస్తే మనస్సు రిలాక్స్ అవుతుంది.
విద్యార్థులు ఇవి పాటిస్తే మంచిది...
జవాబు పత్రంలో ఒక్కో పేజీపై 16 నుంచి 18 లైన్లకు మించకుండా సమాధానాలు రాయాలి. ముఖ్యమైన అంశాల కింద గీత ఉండేటట్లు(అండర్‌లైన్) చూసుకోవాలి. గణితంలో అంకెలు స్పష్టంగా వేసుకోవాలి. తెలుగులో అక్షరాల తలలపై తలకట్టు, ఒత్తులు, దీర్ఘాలు స్పష్టంగా కనబడేటట్లుగా రాయాలి. బ్లూపెన్ను, బ్లాక్ పెన్ను మాత్రమే వినియోగించాలి. రెడ్ పెన్ను వాడకూడదు.
ఆత్మవిశ్వాశాన్ని కోల్పోవద్దు
విద్యార్థులు ఆత్మవిశ్వాశాన్ని కోల్పోకూడదు. పరీక్ష ముగిసిన తర్వాత సమాధానాలు సరిపోల్చుకోకూడదు. అలా చేస్తే మరుసటి రోజు పరీక్షపై దాని ప్రభావం ఉంటుంది.
- డాక్టర్ కర్రి రామారెడ్డి, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు, రాజమహేంద్రవరం
ఏడు గంటల నిద్ర తప్పనిసరి
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు రోజుకు కనీసం ఏడు గంటల నిద్ర అవసరం. విద్యార్థులు పరీక్షలను సమర్ధవంతంగా ఎదుర్కోవాలంటే ముందుగా ఆరోగ్యంగా ఉండాలి.
- డాక్టర్ తేతలి నవీన్‌రెడ్డి, కేవీఆర్ హాస్పిటల్స్, రాయవరం
Advertisement
Advertisement