కాళ్లతో పరీక్షలు రాసి టెన్త్‌లో 54%
ఠాణే: అన్ని అవయవాలు సక్రమంగానే ఉన్నా పనులు చేసుకోవడానికి మరొకరి సాయం అవసరమవుతున్న ఈ రోజుల్లో పుట్టుకతోనే చేతులు లేని ఆ బాలుడు కాళ్లతో పరీక్షలు రాసి టెన్త్‌లో 54 శాతం మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. జిల్లాలోని నందోరి గ్రామంలో ఉన్న గిరిజన కుటుంబంలో పుట్టిన వసంత్ రావుత్ ఈ ఫీట్ సాధించి అందరి మన్ననలను పొందుతున్నాడు. ఈ సందర్భంగా స్థానిక జీవన్ వికాస్ పాఠశాల విద్యార్థి అయిన రావుత్ మీడియాతో మాట్లాడుతూ..‘ ఎంఎఫ్ హుస్సేన్ సాబ్ అంత పెద్ద ఆర్టిస్ట్‌ను కావాలనేది నా జీవితాశయం.
ఇంటర్ పూర్తికాగానే ముంబైలోని జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో సీటు సంపాదించేందుకు కృషిచేస్తా. పుట్టుకనుంచి చేతులు లేకపోవడంతో కాళ్లతోనే రాయడం నేర్చుకున్నా. టెన్త్‌లోనూ నా పరీక్షలు రాయడానికి వేరే ఎవరినైనా పెట్టుకోమని మా సార్లు నాకు సలహాఇచ్చారు. అయితే నాపై నాకున్న నమ్మకమే నేను టెన్త్ 54 శాతంతో పాసయ్యేలా చేసింది. నిజానికి ఈసారి టెన్త్ పాసవ్వనేమోననే అనుమానముండేది. కంప్యూటర్ సబ్జెక్ట్ అంటే నాకు చాలా భయముండేది. అయితే మా కంప్యూటర్ సార్ నాకు సబ్జెక్ట్‌పై భయం పోగొట్టడంతో పరీక్ష బాగా రాశాను.
అలాగే చిత్రలేఖనంపై నా ఆసక్తిని గమనించి మా ఆర్ట్స్ టీచర్ నాపై ప్రత్యేక శ్రద్ధ చూపించి కాలితో బొమ్మలు ఎలా వేయాలో నేర్పించారు. రోజూ నేను స్కూలుకు వచ్చేందుకు నా స్నేహితుడు జయంత్ దుమాడే చాలా సహకరించాడు. మేం ఇద్దరం పాఠశాల మంజూరు చేసిన ఆటో రిక్షాలో రోజూ స్కూల్‌కు వస్తుండేవాళ్లమ’ని చెప్పాడు.ఎంఎఫ్ హుస్సేన్ అంతటి చిత్రకారుడిని కావాలనేది తన చిరకాల వాంఛ అని ముక్తాయించాడు.