అవయవ దానకర్ణులమవుదాం...! | Organ Donation Information Process Types | Sakshi
Sakshi News home page

అవయవ దానకర్ణులమవుదాం...!

Published Sun, Nov 24 2024 11:09 AM | Last Updated on Sun, Nov 24 2024 12:01 PM

Organ Donation Information Process Types

బాగా డబ్బుంటే ఎన్ని రకాల దానాలైనా చేయడం సాధ్యమే. కానీ అవయవదానం అలాకాదు. ఎంతో పెద్దమనసుంటే తప్ప అది సాధ్యం కాదు. అది అనేక మందికి కొత్త జీవితాల్ని ప్రసాదిస్తుంది. ఆ జీవిపై ఆధారపడ్డ అనేక మంది జీవితాలను నిలబెడుతుంది. ఇలా ప్రత్యక్షంగా ఒక్కళ్ల బతుకునే కాకుండా పరోక్షంగా ఎన్నో జీవితాలను కాపాడుతుంది. 
ఎన్నో జీవితాల్ని కాపాడే అవయవదానంపై అవగాహన కోసం ఈ ప్రత్యేక కథనం. 

అవయవ దానాలు రెండు విధాలుగా చేయడం సాధ్యం.  మొదటిది దాతలు బతికుండగానే ఇవ్వగలిగేవీ, రెండు మృతి చెందాక మాత్రమే సాధ్యమయ్యేవి. జీవించి ఉండగానే ఇవ్వదగ్గ దానాల్లో తేలిగ్గా చేయగలిగేది రక్తదానం. దాతలు రక్తదానం చేసిన 24 గంటల్లోపే మళ్లీ ఆ రక్తం తిరిగి భర్తీ అవుతుంది. ఇలా కేవలం ఒక రోజులో తిరిగి భర్తీ అయ్యే రక్తాన్ని ఇవ్వడానికే దాతలు ఒకపట్టాన ముందుకురారు. ఇక అవయవదానం అంటే ఎంత మంది ముందుకొస్తారో ఎవరికైనా ఊహకు తట్టే విషయమే. 

మన దేశంలోని వివిధ సాంస్కృతిక నేపథ్యాల కారణంగా అవయవ దానాలు చాలా తక్కువ. వీటికి తోడు చాలామంది చదువుకున్నవాళ్లలోనూ ఉన్న మూఢనమ్మకాల వల్ల అవయవదానం అంత విస్తృతంగా జరగడం లేదు.  

బతికి ఉండగానే ఇవ్వగలిగేవి...
జీవించి ఉండగానే ఇవ్వగలిగిన దానాల్లో ప్రధానమైనది రక్తం. దాదాపు 120 సీ.సీ. రక్తం కేవలం 24 గంటల్లోనే తిరిగి మళ్లీ దాతల ఒంట్లో భర్తీ అవుతుంది. అయితే రక్తంలోని ఇతర కణాలూ, అంశాలూ మళ్లీ పుట్టడానికి ఎనిమిది వారాల సమయం పడుతుంది. అందుకే ఒకసారి రక్తదానం చేసినవారు కనీసం మూడు నెలల తర్వాతే ఇవ్వమని డాక్టర్లు సూచిస్తారు. కాలేయంలో కొంత ముక్క తొలగించినా మళ్లీ పూర్తిగా యథారూపానికి పెరుగుతుంది కాబట్టి కాలేయం వంటి కొన్నింటిని దాత జీవించి ఉండగానే ప్రదానం చేయవచ్చు. 

ఇక రెండు మూత్రపిండాల్లో ఒక కిడ్నీని బతికి ఉండగానే ఇవ్వడం సాధ్యమే. అయితే ఈ మూత్రపిండాల దానం విషయంలో అనేక అక్రమాలు, అవయవదానం స్వీకరించేవారి నుంచి ప్రలోభాలూ, కిడ్నీ అవసరమైనవారికి అక్రమంగా కట్టబెట్టడానికి అవినీతితో కూడిన వ్యాపారాలూ... అలాంటి అనేక అనుచితమైన విధానాలూ, మోసాలూ వెలుగులోకి రావడంతో ఈ దానంపై సర్కారు అతి కఠినమైన ఆంక్షలు విధించింది. చాలా కట్టుదిట్టమైన నిబంధనల పరిధిలోనే, అందునా రక్తసంబంధీకుల మధ్యనే కిడ్నీ దానాలు జరిగేలా ప్రభుత్వం కట్టడి చేస్తోంది. ఇవేగాక జీవించి ఉండగానే మరికొన్ని అవయవదానాలూ చేయడానికి అవకాశముంది. వాటిలో ఇవి కొన్ని... 

చర్మం (ఉదాహరణకు అగ్ని ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడ్డవారికి గ్రాఫ్టింగ్‌ కోసం  చర్మం ఉపయోగపడుతుంది) 

ఎముకలోని మూలుగ (బోన్‌మ్యారో) మూలకణాలు తిరిగి ఆవిర్భవించేలా చేయడానికి బొడ్డుతాడులోని రక్తం 

రక్తంలోని అంశాలైన ప్లేట్‌లెట్లు, ప్లాస్మా (ఇందులో ప్లేట్‌లెట్లు ప్రధానంగా డెంగీ కేసుల్లోనూ, ప్లాస్మా అనే రక్తాంశం అగ్నిప్రమాదాల్లో గాయపడ్డవారికి పనికి వస్తాయి) 

ఎముకల్లోని కొంత భాగం పేగుల్లోన్ని కొంత భాగం ప్రాంక్రియాటిక్‌ (క్లోమ) గ్రంథిలో కొంతభాగం. జీవన్మృతుల నుంచి సేకరించగలిగే అవయవాలు

కళ్లు / కళ్లలోని నల్లగుడ్డు (కార్నియా) 

మూత్రపిండాలు (జీవన్మృతుల నుంచి రెండు కిడ్నీలూ సేకరించి అవసరమైన మరో ఇద్దరికి అమర్చడం ద్వారా రెండు ప్రాణాలు కాపాడవచ్చు) 

కాలేయం 

ఊపిరితిత్తులు 

గుండె 

గుండె కవాటాలు (వాల్వ్స్‌) 

పేగులు  ప్రాంక్రియాస్‌ (క్లోమ గ్రంథి) 

అవయవ ప్రదానాల్లో మన దేశం...
భారత పార్లమెంట్‌లో 1994లో ‘‘ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ ఆర్గాన్స్‌ అండ్‌ టిష్యూస్‌ యాక్ట్‌ – 1994’’ అనే చట్టం రూ΄పొందినప్పటి నుంచి మన దేశంలో అవయవదానాలకు అవకాశం సమకూరింది. ఇక నేషనల్‌ ఆర్గాన్‌ అండ్‌ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్‌ ఆర్గనైజేషన్‌ (ఎన్‌ఓటీటీఓ) అనేది అవయవాల సేకరణ, పంపిణీల విషయంలో మన దేశంలో ఉన్న అత్యున్నత సంస్థ.   చట్టబద్ధంగా అనుమతి ఉన్నప్పటికీ ఆరోగ్యమంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం జీవన్మృతుల నుంచి జరిగిన అవయవదానాల సంఖ్య 2014లో 6,916 కాగా 2022 నాటికి ఈ సంఖ్య 16,041కి పెరిగింది. 

ఇలా ఈ సంఖ్య అంతో ఇంతో పెరుగుతూ వచ్చినప్పటికీ...పాశ్చాత్య దేశాలైన యూఎస్, స్పెయిన్‌ వంటి వాటితో పోలిస్తే ఇప్పటికీ మనదేశం ఎంతో వెనకబడి ఉంది. అంటే 2019 గణాంకాల ప్రకారం... స్పెయిన్‌లో ప్రతి పదిలక్షల మందికి 35.1 (పీఎంపీ... అంటే పర్‌ మిలియన్‌ పాప్యులేషన్‌), యూఎస్‌లో ప్రతి పది లక్షల మందికి 21.9 (పీఎంపీ) అవయవదానాలు చేస్తుండగా మన దగ్గర ఆ సంఖ్య ప్రతి పదిలక్షల మందికి కేవలం 0.65 (పీఎంపీ) గా మాత్రమే ఉంది. (ఒకప్పుడు ఈ సంఖ్య కేవలం 0.34 పీఎంపీ మాత్రమే).

యూఎస్‌ తర్వాత మన దేశంలోనే ఎక్కువగా అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరగడం కొంతలో కొంత ఆనందించాల్సిన అంశం. దేశంలో కేవలం 13 రాష్ట్రాల్లో మాత్రమే అవయవదానాలు ఓ మోస్తరుగా జరుగుతున్నాయి. మన దేశంలో అవయవదానాల్లో ముందున్న రాష్ట్రాల్లో మొదటిది తెలంగాణ రాష్ట్రం కాగా... తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోనూ అత్యధికంగా అయవయదానాలు జరుగుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణభారత రాష్ట్రాల్లోనే అవయవదానాలు ఎక్కువ.  మన దేశంలో అవయవాలు కావలసిన వాళ్లు చాలా ఎక్కువ కాగా... ఆ అవయవాల లభ్యత చాలా చాలా తక్కువ.

దాంతో అవయవాలకు భారీ డిమాండు ఉంది.  అవయవదానం కోసం ఎదురుచూస్తూ జీవితకాలంలో అవి దొరకనందున  కన్నుమూసేవారి సంఖ్య మనదేశంలో చాలా ఎక్కువ. జీవన్మృతుల నుంచి అవయవాలు సేకరించి వాటిని అవసరమైన వారికి అందించడం అనే సమన్వయ కార్యకలాపాలు నిర్వహణలో ‘జీవన్‌దాన్‌’ అనే సంస్థ కార్యాలయాలు మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ కృషిచేస్తున్నాయి.   

ఇవి మృతి తర్వాతే..
ఇక దేహంలోని కొన్ని కీలకమైన అవయవాలను కేవలం మృతిచెందాక మాత్రమే ప్రదానం చేయడం సాధ్యమవుతుంది. తాము జీవించి ఉండగానే తమ మరణానంతరం అవయవాలను ప్రదానం చేస్తామంటూ కొందరు ప్రతిన (ప్లెడ్జ్‌) బూనడం వల్ల ఈ దానాలు సాధ్యమవుతాయి. అలాగే రోడ్డు లేదా ఇతరత్రా ప్రమాదాలకు గురైన కొంతమందిని కొంతమంది నిపుణుల ఆధ్వర్యంలో హాస్పిటల్‌లో బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటిస్తారు. యాక్సిడెంట్‌లో తలకు లేదా ఇతరత్రా తీవ్రమైన గాయాలు కావడం దాంతో మెదడు పూర్తిగా దెబ్బతినడం/ మెదడులో రక్తస్రావం కావడం వంటి కొన్ని పరిస్థితుల్లో శరీరంలోని అవయవాలు జీవించి ఉన్నప్పటికీ వారి మెదడు మృతిచెందుతుంది. 

ఎలాంటి చికిత్సలతోనూ వీరు  తిరిగి జీవించే అవకాశం లేనందున వారి బంధువుల అనుమతితో బ్రెయిన్‌డెడ్‌ వ్యక్తుల అవయవదానం సాధ్యమవుతుంది. ఇలాంటి జీవన్మృతుల్లో సైతం కొద్దిసేపు శరీరం బతికి ఉన్నప్పుడే అవయవాలను సేకరించగలగాలి. లేకపోతే క్రమంగా శరీరమూ... తర్వాత లోపలి అవయవాలూ మృతిచెందడం మొదలైపోతుంది. ఈలోపే సేకరణ ప్రక్రియ జరగాలి.  

డా. చంద్రశేఖర్‌ రెడ్డి, సీనియర్‌ న్యూరో ఫిజీషియన్‌ 

(చదవండి: నోటిలో నాటే ఇంప్లాంట్స్‌...)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement