Transplant Surgery
-
అవయవ దానకర్ణులమవుదాం...!
బాగా డబ్బుంటే ఎన్ని రకాల దానాలైనా చేయడం సాధ్యమే. కానీ అవయవదానం అలాకాదు. ఎంతో పెద్దమనసుంటే తప్ప అది సాధ్యం కాదు. అది అనేక మందికి కొత్త జీవితాల్ని ప్రసాదిస్తుంది. ఆ జీవిపై ఆధారపడ్డ అనేక మంది జీవితాలను నిలబెడుతుంది. ఇలా ప్రత్యక్షంగా ఒక్కళ్ల బతుకునే కాకుండా పరోక్షంగా ఎన్నో జీవితాలను కాపాడుతుంది. ఎన్నో జీవితాల్ని కాపాడే అవయవదానంపై అవగాహన కోసం ఈ ప్రత్యేక కథనం. అవయవ దానాలు రెండు విధాలుగా చేయడం సాధ్యం. మొదటిది దాతలు బతికుండగానే ఇవ్వగలిగేవీ, రెండు మృతి చెందాక మాత్రమే సాధ్యమయ్యేవి. జీవించి ఉండగానే ఇవ్వదగ్గ దానాల్లో తేలిగ్గా చేయగలిగేది రక్తదానం. దాతలు రక్తదానం చేసిన 24 గంటల్లోపే మళ్లీ ఆ రక్తం తిరిగి భర్తీ అవుతుంది. ఇలా కేవలం ఒక రోజులో తిరిగి భర్తీ అయ్యే రక్తాన్ని ఇవ్వడానికే దాతలు ఒకపట్టాన ముందుకురారు. ఇక అవయవదానం అంటే ఎంత మంది ముందుకొస్తారో ఎవరికైనా ఊహకు తట్టే విషయమే. మన దేశంలోని వివిధ సాంస్కృతిక నేపథ్యాల కారణంగా అవయవ దానాలు చాలా తక్కువ. వీటికి తోడు చాలామంది చదువుకున్నవాళ్లలోనూ ఉన్న మూఢనమ్మకాల వల్ల అవయవదానం అంత విస్తృతంగా జరగడం లేదు. బతికి ఉండగానే ఇవ్వగలిగేవి...జీవించి ఉండగానే ఇవ్వగలిగిన దానాల్లో ప్రధానమైనది రక్తం. దాదాపు 120 సీ.సీ. రక్తం కేవలం 24 గంటల్లోనే తిరిగి మళ్లీ దాతల ఒంట్లో భర్తీ అవుతుంది. అయితే రక్తంలోని ఇతర కణాలూ, అంశాలూ మళ్లీ పుట్టడానికి ఎనిమిది వారాల సమయం పడుతుంది. అందుకే ఒకసారి రక్తదానం చేసినవారు కనీసం మూడు నెలల తర్వాతే ఇవ్వమని డాక్టర్లు సూచిస్తారు. కాలేయంలో కొంత ముక్క తొలగించినా మళ్లీ పూర్తిగా యథారూపానికి పెరుగుతుంది కాబట్టి కాలేయం వంటి కొన్నింటిని దాత జీవించి ఉండగానే ప్రదానం చేయవచ్చు. ఇక రెండు మూత్రపిండాల్లో ఒక కిడ్నీని బతికి ఉండగానే ఇవ్వడం సాధ్యమే. అయితే ఈ మూత్రపిండాల దానం విషయంలో అనేక అక్రమాలు, అవయవదానం స్వీకరించేవారి నుంచి ప్రలోభాలూ, కిడ్నీ అవసరమైనవారికి అక్రమంగా కట్టబెట్టడానికి అవినీతితో కూడిన వ్యాపారాలూ... అలాంటి అనేక అనుచితమైన విధానాలూ, మోసాలూ వెలుగులోకి రావడంతో ఈ దానంపై సర్కారు అతి కఠినమైన ఆంక్షలు విధించింది. చాలా కట్టుదిట్టమైన నిబంధనల పరిధిలోనే, అందునా రక్తసంబంధీకుల మధ్యనే కిడ్నీ దానాలు జరిగేలా ప్రభుత్వం కట్టడి చేస్తోంది. ఇవేగాక జీవించి ఉండగానే మరికొన్ని అవయవదానాలూ చేయడానికి అవకాశముంది. వాటిలో ఇవి కొన్ని... చర్మం (ఉదాహరణకు అగ్ని ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడ్డవారికి గ్రాఫ్టింగ్ కోసం చర్మం ఉపయోగపడుతుంది) ఎముకలోని మూలుగ (బోన్‌మ్యారో) మూలకణాలు తిరిగి ఆవిర్భవించేలా చేయడానికి బొడ్డుతాడులోని రక్తం రక్తంలోని అంశాలైన ప్లేట్లెట్లు, ప్లాస్మా (ఇందులో ప్లేట్లెట్లు ప్రధానంగా డెంగీ కేసుల్లోనూ, ప్లాస్మా అనే రక్తాంశం అగ్నిప్రమాదాల్లో గాయపడ్డవారికి పనికి వస్తాయి) ఎముకల్లోని కొంత భాగం పేగుల్లోన్ని కొంత భాగం ప్రాంక్రియాటిక్ (క్లోమ) గ్రంథిలో కొంతభాగం. జీవన్మృతుల నుంచి సేకరించగలిగే అవయవాలుకళ్లు / కళ్లలోని నల్లగుడ్డు (కార్నియా) మూత్రపిండాలు (జీవన్మృతుల నుంచి రెండు కిడ్నీలూ సేకరించి అవసరమైన మరో ఇద్దరికి అమర్చడం ద్వారా రెండు ప్రాణాలు కాపాడవచ్చు) కాలేయం ఊపిరితిత్తులు గుండె గుండె కవాటాలు (వాల్వ్స్) పేగులు ప్రాంక్రియాస్ (క్లోమ గ్రంథి) అవయవ ప్రదానాల్లో మన దేశం...భారత పార్లమెంట్లో 1994లో ‘‘ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ – 1994’’ అనే చట్టం రూ΄పొందినప్పటి నుంచి మన దేశంలో అవయవదానాలకు అవకాశం సమకూరింది. ఇక నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ (ఎన్ఓటీటీఓ) అనేది అవయవాల సేకరణ, పంపిణీల విషయంలో మన దేశంలో ఉన్న అత్యున్నత సంస్థ. చట్టబద్ధంగా అనుమతి ఉన్నప్పటికీ ఆరోగ్యమంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం జీవన్మృతుల నుంచి జరిగిన అవయవదానాల సంఖ్య 2014లో 6,916 కాగా 2022 నాటికి ఈ సంఖ్య 16,041కి పెరిగింది. ఇలా ఈ సంఖ్య అంతో ఇంతో పెరుగుతూ వచ్చినప్పటికీ...పాశ్చాత్య దేశాలైన యూఎస్, స్పెయిన్ వంటి వాటితో పోలిస్తే ఇప్పటికీ మనదేశం ఎంతో వెనకబడి ఉంది. అంటే 2019 గణాంకాల ప్రకారం... స్పెయిన్‌లో ప్రతి పదిలక్షల మందికి 35.1 (పీఎంపీ... అంటే పర్ మిలియన్ పాప్యులేషన్), యూఎస్‌లో ప్రతి పది లక్షల మందికి 21.9 (పీఎంపీ) అవయవదానాలు చేస్తుండగా మన దగ్గర ఆ సంఖ్య ప్రతి పదిలక్షల మందికి కేవలం 0.65 (పీఎంపీ) గా మాత్రమే ఉంది. (ఒకప్పుడు ఈ సంఖ్య కేవలం 0.34 పీఎంపీ మాత్రమే).యూఎస్ తర్వాత మన దేశంలోనే ఎక్కువగా అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరగడం కొంతలో కొంత ఆనందించాల్సిన అంశం. దేశంలో కేవలం 13 రాష్ట్రాల్లో మాత్రమే అవయవదానాలు ఓ మోస్తరుగా జరుగుతున్నాయి. మన దేశంలో అవయవదానాల్లో ముందున్న రాష్ట్రాల్లో మొదటిది తెలంగాణ రాష్ట్రం కాగా... తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోనూ అత్యధికంగా అయవయదానాలు జరుగుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణభారత రాష్ట్రాల్లోనే అవయవదానాలు ఎక్కువ. మన దేశంలో అవయవాలు కావలసిన వాళ్లు చాలా ఎక్కువ కాగా... ఆ అవయవాల లభ్యత చాలా చాలా తక్కువ.దాంతో అవయవాలకు భారీ డిమాండు ఉంది. అవయవదానం కోసం ఎదురుచూస్తూ జీవితకాలంలో అవి దొరకనందున కన్నుమూసేవారి సంఖ్య మనదేశంలో చాలా ఎక్కువ. జీవన్మృతుల నుంచి అవయవాలు సేకరించి వాటిని అవసరమైన వారికి అందించడం అనే సమన్వయ కార్యకలాపాలు నిర్వహణలో ‘జీవన్‌దాన్’ అనే సంస్థ కార్యాలయాలు మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ కృషిచేస్తున్నాయి. ఇవి మృతి తర్వాతే..ఇక దేహంలోని కొన్ని కీలకమైన అవయవాలను కేవలం మృతిచెందాక మాత్రమే ప్రదానం చేయడం సాధ్యమవుతుంది. తాము జీవించి ఉండగానే తమ మరణానంతరం అవయవాలను ప్రదానం చేస్తామంటూ కొందరు ప్రతిన (ప్లెడ్జ్) బూనడం వల్ల ఈ దానాలు సాధ్యమవుతాయి. అలాగే రోడ్డు లేదా ఇతరత్రా ప్రమాదాలకు గురైన కొంతమందిని కొంతమంది నిపుణుల ఆధ్వర్యంలో హాస్పిటల్లో బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటిస్తారు. యాక్సిడెంట్లో తలకు లేదా ఇతరత్రా తీవ్రమైన గాయాలు కావడం దాంతో మెదడు పూర్తిగా దెబ్బతినడం/ మెదడులో రక్తస్రావం కావడం వంటి కొన్ని పరిస్థితుల్లో శరీరంలోని అవయవాలు జీవించి ఉన్నప్పటికీ వారి మెదడు మృతిచెందుతుంది. ఎలాంటి చికిత్సలతోనూ వీరు తిరిగి జీవించే అవకాశం లేనందున వారి బంధువుల అనుమతితో బ్రెయిన్‌డెడ్ వ్యక్తుల అవయవదానం సాధ్యమవుతుంది. ఇలాంటి జీవన్మృతుల్లో సైతం కొద్దిసేపు శరీరం బతికి ఉన్నప్పుడే అవయవాలను సేకరించగలగాలి. లేకపోతే క్రమంగా శరీరమూ... తర్వాత లోపలి అవయవాలూ మృతిచెందడం మొదలైపోతుంది. ఈలోపే సేకరణ ప్రక్రియ జరగాలి. డా. చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ న్యూరో ఫిజీషియన్ (చదవండి: నోటిలో నాటే ఇంప్లాంట్స్...) -
ప్రపంచంలోనే తొలి తల మార్పిడి..! ఏకంగా హాలీవుడ్ మూవీని తలపించేలా..!
ఇంతవరకు అవయవ మార్పిడులకు సంబంధించి..గుండె, కళ్లు, చేతులు, కిడ్నీ వంటి ట్రాన్స్ప్లాంటేషన్లు గురించి విన్నాం. ఇటీవల జంతువుల అయవాలను మనుషులకు మార్పిడి చేస్తున్న ప్రయత్నాల గురించి కూడా చూశాం. అవి విజయవంతం కాకపోయినా..అవయవాల కొరతను నివారించే దృష్ట్యా వైద్యులు సాగిస్తున్న ప్రయాత్నాలే అవి. ఐతే తాజాగా ఓ మెడికల్ స్టార్టప్ కంపెనీ తొలిసారిగా తల మార్పిడి శస్త్ర చికిత్సను అభివృద్ధిపరిచే లక్ష్యాన్ని చేపట్టింది. ఇది సఫలం అయితే చికిత్సే లేని వ్యాధులతో పోరాడుతున్న రోగుల్లో కొత్త ఆశను అందించగలుగుతాం. ఇంతకీ ఏంటా వైద్య విధానం అంటే..యూఎస్‌లోని బ్రెయిన్‌బ్రిడ్జ్, న్యూరోసైన్స్, బయో మెడికల్ ఇంజనీరింగ్ స్టార్టప్ ప్రపంచంలోనే తొలిసారిగా తల మార్పిడి వ్యవస్థను అభివృద్ధి చేసే లక్ష్యాన్ని చేపడుతున్నట్లు ప్రకటించింది. ఐతే ఈ కంపెనీ ఇంతవరకు రహస్యంగా ఈ ప్రయోగాలు చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడూ ప్రపంచం తాము చేస్తున్న ఈ సరికొత్త వైద్య గురించి మరింతగా తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతో బహిర్గతం చేసింది. ముఖ్యంగా చికిత్స చేయలేని స్థితిలో.. స్టేజ్ 4లో ఉన్న కేన్సర్, పక్షవాతం, అల్జీమర్స్ , పార్కిన్సన్స్ వంటి న్యూరోడెజనరేటివ్ వ్యాధులతో బాధపడుతున్న రోగుల్లో కొత్త ఆశను అందించడమే లక్ష్యంగా ఈ ప్రయోగానికి నాంది పలికినట్లు బ్రెయిన్ బ్రిడ్జ్ స్టార్టప్ పేర్కొంది. చిత్త వైకల్యంతో బాధపడుతున్న రోగి తలను ఆరోగ్యకరమైన బ్రెయిన్‌డెడ్ డోనర్ బాడీతో మార్పిడి చేయడం వంటివి ఈ సరికొత్త వైద్య విధాన ప్రక్రియలో ఉంటుంది. అందుకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేకెత్తించింది.ఈ వీడియోలో రెండు రోబోటిక్ బాడీలపై ఏకకాలంలో శస్త్ర చికిత్స చేస్తున్న రెండు స్వయం ప్రతిపత్త రోబోలు కనిపిస్తాయి. ఇక్కడ ఒకరి నుంచి తలను తీసి మరో రోబోటిక్ శరీరంలోకి మార్పిడి చేస్తారు. ఇది చూడటానికి హాలీవుడ్ రేంజ్ సన్నివేశంలా అనిపిస్తుంది. ఇలాంటి అత్యధునిక శస్త్రచికిత్సపైనే న్యూరబుల్, ఎమోటివ్, కెర్నల్ అండ్ నెక్ట్స్ మైండ్, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేస్ వంటి కంపెనీలు కూడా వర్క్ చేస్తున్నాయి. ఈ క్రమంలో బ్రెయిన్బ్రిడ్జ్లోని ప్రాజెక్ట్ లీడ్ హషేమ్ అల్-ఘైలీ మాట్లాడుతూ..తాము మెదడు కణాల క్షీణతను నివారించేలా అతుకులు లేకుండా తల మార్పిడి చేసేందుకు హైస్పీడ్ రోబోటిక్ సిస్టమ్‌ను వినియోగించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఉన్న అధునాతన ఏఐ అల్గారిథమ్‌లు శస్త్ర చికిత్సలో నరాలు, రక్తనాళాల తోపాటు వెన్నుపాముని కచ్చితంగా తిరిగి కనెక్ట్ చేయడంలో రోబోలకు మార్గనిర్దేశం చేస్తాయని అల్ ఘైలీ చెప్పారు. తాము ఈ కాన్సెప్ట్‌ని విస్తృతమైన శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా రూపొందించమని తెలిపారు.ఇది వైద్య సరిహద్దులను చెరిపేసేలా.. ప్రాణాంతక పరిస్థితులతో పోరాడుతున్న వారికి ప్రాణాలను రక్షించేలా వినూత్న పరిష్కారాలను అందిచగలదని చెప్పారు. 🤖 BrainBridge, the first head transplant system, uses robotics and AI for head and face transplants, offering hope to those with severe conditions like stage-4 cancer and neurodegenerative diseases… pic.twitter.com/7qBYtdlVOo— Tansu Yegen (@TansuYegen) May 21, 2024 (చదవండి: వడదెబ్బకు గురైన నటుడు షారూఖ్! దీని బారిన పడకూడదంటే..!) -
చిత్రకారునికి కొత్త చేతులు.. ఢిల్లీ వైద్యుల అద్భుతం!
ప్రమాదంలో తన రెండు చేతులను కోల్పోయిన ఒక చిత్రకారుడు ఇప్పుడు తన కొత్త చేతులతో బ్రష్ పట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. ఢిల్లీకి చెందిన వైద్యుల బృందం చేసిన ఈ సర్జికల్ ఎక్సలెన్స్ ను అందరూ కొనియాడుతున్నారు. అవయవ దానంతో తన శరీరం నలుగురికి ఉపయోగపడాలని తపనపడిన ఒక మహిళ కలను ఆ వైద్యుల బృందం సాకారం చేసింది. ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్ వైద్యులు 45 ఏళ్ల వ్యక్తికి ద్వైపాక్షిక చేతి మార్పిడి చికిత్సను విజయవంతంగా నిర్వహించారు.. బాధితుడు 2020లో రైలు ప్రమాదంలో తన రెండు చేతులను కోల్పోయాడు. దీంతో అతను ఏ పనీ చేయలేక నిరాశగా కాలం వెళ్లదీస్తున్నాడు. అయితే బ్రెయిడ్ డెడ్‌కు గురైన ఒక మహిళ అతనికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. బ్రెయిన్ డెడ్‌కు చేరిన దక్షిణ ఢిల్లీలోని ఒక పాఠశాల మాజీ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ మీనా మెహతా తన మరణానంతరం అవయవ దానానికి గతంలోనే సమ్మతి తెలిపారు. దీంతో ఆమె శరీరంలోని కిడ్నీ, కాలేయం, కార్నియా ముగ్గురికి కొత్త జీవితాన్ని ప్రసాదించాయి. ప్రమాదంలో చేతులు పోగొట్టుకుని నిస్సహాయంగా బతుకీడుస్తున్న ఒక చిత్రకారుని కుంచె ఇప్పుడు తరిగి అద్భుతాలను చేసేందుకు సిద్ధం అయ్యింది. ఈ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసిన వైద్యుల బృందానికి విశేష ప్రశంసలు అందుతున్నాయి. ఈ శస్త్రచికిత్స చేయడానికి వైద్యులకు 12 గంటలకుపైగా సమయం పట్టింది. ఎట్టకేలకు వైద్యుల కృషి ఫలించింది. ఆ వైద్యుల బృందం చిత్రకారునితో ఒక ఫోటోను క్లిక్ చేసింది. పెయింటర్ విజయోత్సాహంతో తన రెండు చేతులను పైకి ఎత్తడాన్ని ఆ ఫొటోలో మనం చూడవచ్చు. -
ప్రపంచంలోనే తొలిసారిగా కంటిమార్పిడి
న్యూయార్క్: ప్రపంచంలోనే తొలిసారిగా కంటి మార్పిడి శస్త్రచికిత్స అమెరికాలో జరిగింది. న్యూయార్క్‌లోని ఎన్‌వైయూ లాంగాన్ వైద్య సంస్థకు చెందిన వైద్యులు ఈ ఘనత సాధించారు. కరెంట్ షాక్ ప్రమాదంలో ముఖంలో ఎడమ భాగం పూర్తిగా దెబ్బ తిన్న ఆరోన్ జేమ్స్ అనే మాజీ సైనికుడు కంటి మారి్పడి చేయించుకున్న తొలి వ్యక్తిగా రికార్డులకెక్కాడు. ఇందుకోసం వైద్యులు ఏకంగా 21 గంటల పాటు శస్త్రచికిత్స చేశారు. ఇప్పటిదాకా కరోనాను మార్చిన ఉదంతాలున్నాయి గానీ ఇలా పూర్తిగా కంటినే కొత్తగా అమర్చడం మాత్రం ఇదే తొలిసారి. ‘‘మే 21న ఈ ఆపరేషన్ నిర్వహించాం. రోగికి మొత్తం ముఖం ఎడమ భాగమంతటితో పాటు ఎడమ కంటిని కూడా పూర్తిగా కొత్తగా అమర్చాం. మొత్తం ప్రక్రియలో ఏకంగా 140 మంది వైద్య నిపుణుల సేవలు తీసుకున్నాం. అతనికి ఎడమ కంటిలో చూపు రాలేదు. కాకపోతే ఆర్నెల్ల తర్వాత కూడా ఆ కన్ను పూర్తి ఆరోగ్యంతో ఉండటమే ఓ అద్భుతం. రెటీనాకు రక్తప్రసారం బాగా జరుగుతోంది. కంటికి రక్తం తీసుకొచ్చే నాళాల పనితీరు సజావుగా ఉంది. ఇది నిజంగా గొప్ప విషయం. చూపు కూడా ఎంతో కొంత వస్తే ఇంకా అద్భుతంగా ఉండేది’’ అని వైద్య బృందం వివరించింది. అయితే, ‘‘ఇది కేవలం కంటిని పూర్తిగా మార్చడం సాధ్యమేనని నిరూపించేందుకు చేసిన సాంకేతిక ఆపరేషన్ మాత్రమే. అయితే దాత తాలూకు మూల కణాలను, బోన్ మారోను దృష్టి నరంలో చొప్పించాం. కనుక చూపు వచ్చే ఆస్కారాన్నీ కొట్టిపారేయలేం’’ అని చెప్పింది! -
20 ఏళ్ల యువతికి 3డీ ప్రింటెడ్ చెవి
టెక్సాస్: అమెరికా వైద్యులు మొట్టమొదటిసారిగా 3డీ ప్రింటెడ్ సాంకేతికతతో రూపొందించిన చెవిని 20 ఏళ్ల యువతికి విజయవంతంగా అతికించారు. టెక్సాస్‌కు చెందిన 3డీ బయో థెరప్యూటిక్స్ అనే సంస్థ దీనిని రూపొందించింది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. మెక్సికోకు చెందిన అలెక్సా(20)కు కుడి వైపు వెలుపలి చెవి చిన్నదిగా, అక్రమాకారంలో ఉంది. పరిశీలించిన 3డీ బయో థెరప్యూటిక్స్ నిపుణులు ఆమె మరో చెవి నుంచి కణజాలాన్ని సేకరించారు. అచ్చు కుడివైపు చెవిమాదిరిగానే సహజమైందిగా అనిపించేలా ‘ఆరినోవో’అనే 3డీ టెక్నాలజీని వాడి మరో చెవికి రూపం కల్పించారు. టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోకు చెందిన మైక్రోషియా–కాంజెనిటల్ ఇయర్ డిఫార్మిటీ ఇన్స్టిట్యూట్కు చెందిన సర్జన్ డాక్టర్ అర్డురో బొనిల్లా ఈ ప్రక్రియకు నేతృత్వం వహించారు. ఈ చెవిని సర్జరీ ద్వారా ఆమెకు అతికించారు. నెల రోజుల విశ్రాంతి అనంతరం గురువారం అలెక్సా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యిందన్నారు. రోగుల కార్టిలేజ్ కణాలను ఉపయోగించుకుని చెవిని పునర్నిర్మించేందుకు ఈ నూతన టెక్నాలజీని వినియోగించినట్లు డాక్టర్ అర్టురో చెప్పారు. దీని వల్ల కొత్త చెవిని శరీరం తిరస్కరించేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు. ఒకటి లేదా రెండు చెవులు అసంపూర్ణంగా, వెలుపలి భాగాలు లేని మైక్రోషియా అనే లోపంతో ఉన్నవారికి ఈ ఆధునాతన చికిత్స ఎంతో ఉపకారి కాగలదని భావిస్తున్నామని ఆయన అన్నారు. ఇప్పటి వరకు పేషెంట్ పక్కటెముకల నుంచి సేకరించి కణాలను చెవి పునర్నిర్మాణానికి ఉపయోగిస్తున్నారని అన్నారు. -
ఊపిరితిత్తుల సమస్య.. చండీగఢ్ టూ చెన్నై
సాక్షి, చెన్నై(తమిళనాడు) : ఊపిరితిత్తుల వ్యాధితో అక్క చనిపోయింది, చెల్లెలూ కన్నుమూసింది. అదేరకమైన వ్యాధితో మరణం తప్పదని భయపడిన ఒక యువకుడు చండీగఢ్ నుంచి చెన్నైకి చేరుకున్నాడు. దాదాపు అంపశయ్యకు చేరుకున్న అతడు అరుదైన శస్త్రచికిత్సతో కోలుకున్నాడు. రోగికి శస్త్రచికిత్స చేసిన ఫోర్టీస్‌మలర్ (వడపళని) వైద్యులు డాక్టర్ గోవిని బాలసుబ్రమణియన్ గురువారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.. ‘‘ చండీఘడ్‌కు చెందిన 34 ఏళ్ల కేవల్‌సింగ్ ఊపిరితిత్తుల సమస్య తీవ్రమై సుమారు రెండేళ్లుగా ఇంటి నుంచి బయటకు రాకుండా 24 గంటలూ ఆక్సిజన్ సహాయంతోనే జీవిస్తున్నారు. ఈక్రమంలో 70 కిలోల బరువు ఉండాల్సిన వ్యక్తి 44 కిలోల బరువుకు క్షీణించిపోయాడు. తన సోదరీమణులిద్దరూ ఇదేరకమైన రుగ్మతతో మరణించడంతో భీతిల్లిన అతడు ఆరునెలల క్రితం మా ఆసుపత్రికి వచ్చాడు. ఊపిరితిత్తుల ట్రాన్స్‌ప్లాంట్ చేయడం మినహా మరో మార్గం లేదని నిర్ధారించుకున్నాం. అయితే కరోనా రోజుల్లో అవయవదానం చేసేవారు దొరకడం కష్టమైంది. అదృష్టవశాత్తు మదురైకి చెందిన వ్యక్తి నుంచి సేకరించాం. సుమారు ఏడు గంటలపాటూ శస్త్రచికిత్స చేసి రెండు ఊపిరితిత్తులు కేవల్‌సింగ్‌కు అమర్చిన తరువాత కోలుకుంటున్నాడు..’’ అని తెలిపారు. కాగా సాధారణంగా కాలుష్యం, వంశపారంపర్యం వల్ల ఊపిరితిత్తులు చెడిపోతాయని.. కానీ.. ఈ కేసులో వంశపారం పర్యమే కారణమని వివరించారు. ఆయనతోపాటు ఆసుపత్రి జోనల్ డైరక్టర్ డాక్టర్ సంజయ్ పాండే మీడియా సమావేశంలో పాల్గొన్నారు. చదవండి: వండలూరు జంతు ప్రదర్శనశాలలో ‘వైరస్’ కలకలం.. -
నాకు చావాలని లేదు, పోరాడాలని ఉంది.. కానీ
నా పేరు యశ్వంత్. మాది విజయవాడ. పదేళ్ల పిల్లలాగే స్నేహితులతో ఆడుకోవడమంటే ఇష్టం. అయితే గత మేలో జ్వరం వచ్చింది,. అప్పటి నుంచి స్నేహితులతో ఆడుకోవడానికి నాకు వీలుపడటం లేదు. ఇక ముందు కూడా నేను ఆడుకోలేను కావొచ్చు. ఈ ఏడాది వేసవిలో వరుసగా పదిహేను రోజుల పాటు జ్వరం వచ్చింది. ఆ తర్వాత వాంతులు కూడా మొదలయ్యాయి. ఏదీ తిన్నా క్షణాల్లో బయటకి వచ్చేది. దీంత అమ్మానాన్నా భయపడ్డారు. నన్ను పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు రకరకాల పరీక్షలు చేశారు. సిరంజీలతో రక్తం తీసుకున్నారు. ల్యాబ్‌లకు పంపించారు. చివరకు నాకు మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ ఉందంటూ అమ్మానాన్నలకు డాక్టర్లు చెప్పారు. అదేం రోగమో నాతో పాటు అమ్మాన్నాలకు ముందుగా అర్థం కాలేదు. చివరకు అదో రకరమైన బ్లడ్ క్యాన్సర్ అని తెలిసింది. ఎలాగైనా నన్ను బతికించుకోవాలని మా అమ్మానాన్న ఆరాటపడ్డారు. రకరకాల పరీక్షలు చేయించారు. మెడిసిన్స్ ఇప్పించారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. నా శరీరం ఇంకా బలహీనమైపోయింది. ఒంట్లో శక్తి లేకుండా పోయింది. నడవలేని స్థితికి చేరుకున్నాను. చివరకు మందులతో లాభం లేదని డాక్టర్లు తేల్చారు. నా ఆరోగ్యం మెరుగుపడాలంటే ట్రాన్స్‌ప్లాంటేషన్ ఒక్కటే మార్గమంటూ డాక్టర్లు తేల్చి చెప్పారు. అప్పటికే ఏడ్చి ఏడ్చి కళ్లలో నీళ్లు ఇంకిపోయి, బతుకుపై ఆశ వదిలేసుకున్న నాకు, అమ్మానాన్నలకు ఆ మాట వరంలా అనిపించింది. కానీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి దాదాపు రూ.20 లక్షల ఖర్చు అవుతుంది. సాయం చేయాలనుకే వాళ్లు ఇక్కడ క్లిక్ చేయండి మానాన్న రోజువారి కూలీ. నెలంతా కష్టపడితే రూ.6000లకు మించి రాదు. ఇప్పటికే నా ఆస్పత్రి ఖర్చుల కోసమని వాళ్లిద్దరు ఉన్నదంతా అమ్మేశారు. అయినకాడికి అప్పులు తెచ్చారు. నన్ను బతికించుకునేందుకు వాళ్లు చేయాల్సిందంతా చేశారు. సాయం చేయాలనుకే వాళ్లు ఇక్కడ క్లిక్ చేయండి ఇప్పుడీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి అవసరమైన డబ్బులను నా తల్లిదండ్రులు సర్థుబాటు చేసే పరిస్థితి లేదు. అప్పుడే మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజింగ్ చేసే కెట్టో గురించి తెలిసింది. మీరు సాయం చేస్తే ఆపరేషన్‌కి అవసరమైన డబ్బు సర్థుబాటు అవుతుంది. నా ప్రాణాలు నిలబడతాయి. సాయం చేయాలనుకే వాళ్లు ఇక్కడ క్లిక్ చేయండి మాయదారి క్యాన్సర్‌తో రోజురోజుకి నా ఆరోణ్యం క్షీణిస్తోంది. ఒంట్లో శక్తి లేకుండా తగ్గిపోతుంది. కానీ నాకు బతకాలని ఉంది. స్నేహితులతో ఆడుకోవాలని ఉంది. బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం తెచ్చుకుని, మా అమ్మానాన్నలని మంచిగా చూసుకోవాలని ఉంది. అది జరగాలంటే మీ సహకారం అవసరం. నా ఆపరేషన్‌కి మీవంతు సాయం చేయండి. నా ప్రాణాలు కాపాడండి. (అడ్వర్టోరియల్) సాయం చేయాలనుకే వాళ్లు ఇక్కడ క్లిక్ చేయండి -
ఆయువు పోసిన ఆరోగ్యశ్రీ
తాడేపల్లి రూరల్: ఆరోగ్యశ్రీ పథకంలో సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడంతో ఓ చిన్నారి క్లిష్టమైన ఆరోగ్య సమస్య నుంచి బయటపడింది. ఇందుకు సంబంధించిన వివరాలను మణిపాల్ ఆస్పత్రి అంకాలజీ వైద్యుడు డాక్టర్ జి.కృష్ణారెడ్డి, హెమటో అంకాలజీ కన్సల్టెంట్ డాక్టర్ దంతాల మాధవ్ బుధవారం వెల్లడించారు. గుంటూరు జిల్లా నంబూరు గ్రామానికి చెందిన రాణి కుమార్తె సిరిస్పందన (6) ప్రైమరీ రిఫ్రాక్టరీ హడ్కిన్ లింఫోమా అనే వ్యాధితో రెండేళ్లుగా బాధపడుతోంది. వైద్యం నిమిత్తం ఎన్ని ఆస్పత్రులకు తిరిగినా ప్రయోజనం లేకపోయింది. చివరకు మణిపాల్ ఆస్పత్రికి తీసుకురాగా.. అక్కడి వైద్యులు సాల్వేజ్ కీమోథెరపీ జీడీపీతో చికిత్స అందించారు. బాలికకు జబ్బు తగ్గిన తర్వాత బీఈఎం కండిషనింగ్, ఆటోలోగాస్ మూల కణ మార్పిడి చికిత్స అందించారు. బాలిక పూర్తిగా కోలుకుని మంచి బ్లడ్ కౌంట్ సాధించటంతో మూడు వారాల్లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. డాక్టర్ కంటెపూడి సుధాకర్ మాట్లాడుతూ చిన్నారి అన్నిరకాల ఆరోగ్య చిక్కుల నుంచి బయటపడి ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించేందుకు మణిపాల్ వైద్య బృందం చేసిన కృషి అభినందనీయమన్నారు. చిన్నారికి చికిత్స అందించిన క్లినికల్ సర్వీసెస్ చీఫ్ డాక్టర్ మనోజ్‌కుమార్, మెడికల్ అంకాలజీ అసోసియేట్ కన్సల్టెంట్ డాక్టర్ బి.శ్రావణ్‌కుమార్‌ను ఆయన అభినందించారు. బాలిక తల్లి రాణి మాట్లాడుతూ ఈ విధమైన చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చి సీఎం వైఎస్ జగన్ తన బిడ్డకు ప్రాణం పోశారని కృతజ్ఞతలు తెలిపారు. -
మెడికల్ వండర్; రంగు మారింది!
కొచ్చి: ఆసియాలోనే తొలిసారిగా ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా ఓ యువతికి అతికించిన ఓ యువకుడి రెండు చేతుల రంగు మూడేళ్ల తర్వాత ఆమె చర్మం రంగులోకి మారింది. శ్రేయా సిద్ధనగౌడ చేతుల చర్మపు రంగు ఆమె శరీరం రంగు మాదిరిగా మారిపోయిందని డాక్టర్లు తెలిపారు. అయితే ఇందుకు శాస్త్రీయ కారణాలు వివరించడం కష్టమని పేర్కొన్నారు. కొచ్చిలోని అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో 2017లో దాదాపు 13 గంటల పాటు శ్రమించి బ్రెయిన్ డెడ్ అయిన ఓ యువకుడి చేతులను శ్రేయకు డాక్టర్లు అతికించారు. ఇంతకాలానికి అతడి చేతుల బరువు తగ్గిపోయి.. శ్రేయ సొంత చేతుల మాదిరిగానే మారిపోయాయి. అంతేకాదు చేతులపై వెంట్రుకలు కూడా చాలావరకు తగ్గిపోయాయి. బైక్ యాక్సిడెంట్లో తలకు బలమైన గాయాలు తగలడంతో సచిన్ అనే 20 ఏళ్ల కుర్రాడికి బ్రెయిన్ డెడ్ అయింది. అతడి చేతులను దానం చేసేందుకు సచిన్ తల్లిదండ్రులు ముందుకొచ్చారు. దీంతో అమృతా ఆస్పత్రి తల, మెడ సర్జరీ విభాగం హెడ్ డాక్టర్ కె.సుబ్రమణియ అయ్యర్ ఆధ్వర్యంలో 20 మంది సర్జన్లు సహా 36 మందితో కూడిన బృందం శ్రేయకు ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు. ఆమె చేతుల రంగు మారేందుకు స్త్రీ హార్మోన్లు ప్రభావితం చేసి ఉండకపోవచ్చని డాక్టర్లు భావిస్తున్నారు. ‘చర్మం రంగు విషయంలో స్త్రీ హార్మోన్లు ఎలాంటి ప్రభావం చూపవు. కేవలం మెలనిన్ మాత్రమే ఆ పని చేస్తుంది. మెదడు ఉత్పత్తి చేసే మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ నియంత్రిస్తుంటుంది. ఈ హార్మోన్ స్థాయుల ద్వారానే ఆ రంగు మారి ఉంటుంది’ అని అయ్యర్ వివరించారు. చేతులపై వెంట్రుకలు క్రమంగా తగ్గిపోవడానికి కారణం టెస్టోస్టిరాన్ హోర్మన్ లేకపోవడమేనని ఢిల్లీకి చెందిన ప్రముఖ డెర్మటాలిస్ట్ షెహ్లా అగర్వాల్ వెల్లడించారు. చేతులు దానం చేసిన యువకుడు శ్రేయ కంటే సమయం ఎండలో గడపడం వల్లే అతడి చేతులు ముదురు రంగులోకి మారాయని తెలిపారు. శ్రేయకు అతికించిన తర్వాత అతడి చేతులు లేత వర్ణంలోకి మారాయని అభిప్రాయపడ్డారు. (చదవండి: కరోనా తొలి బాధితుడి అనుభవాలు) -
మూలకణ మార్పిడితో ఇద్దరికి పునర్జన్మ
సాక్షి, హైదరాబాద్: మూలకణ మార్పిడి చికిత్సతో ఇద్దరికి పునర్జన్మను ప్రసాదించారు నిమ్స్ వైద్యులు. ఖరీదైన ఈ చికిత్సను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ జాబితాలో చేర్చి ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. నల్లగొండ జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని వి.లక్ష్మీప్రసన్న(21) కొంతకాలంగా రక్తసంబంధ సమస్యతో బాధపడుతోంది. చికిత్స కోసం 8 నెలల క్రితం ఆమె నిమ్స్ హెమటాలజీ విభాగాధిపతి డాక్టర్ ఏఎంవీఆర్ నరేందర్‌ను సంప్రదించింది. ఇదే సమయంలో ఖమ్మం జిల్లాకు చెందిన ఎంఎస్సీ విద్యార్థి రామకృష్ణ(26) కూడా నిమ్స్‌కు వచ్చాడు. వైద్య పరీక్షల్లో వీరిద్దరూ ఎప్లాస్టిక్ ఎనీమియాతో బాధపడుతున్నట్లు గుర్తించారు. మూలకణాల మార్పిడి చికిత్స ఒక్కటే దీనికి పరిష్కారమని సూచించారు. మూలకణాలను దానం చేసేందుకు బాధితుల సోదరులు ముందుకు రావడంతో వారి నుంచి కణాలు సేకరించారు. ప్రాసెస్ చేసిన తర్వాత బాధితులకు ఎక్కించారు. సాధారణంగా ఇలాంటి చికిత్సకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.20 లక్షలకుపైగా ఖర్చవుతుంది. నిమ్స్‌లో 2008 నుంచే మూలకణాల మార్పిడి చికిత్స చేస్తున్నారు. ఇప్పటి వరకు 120 చికిత్సలు చేశారు. అయితే ఆయా వైద్య ఖర్చులను రోగులే భరించాల్సి వచ్చేది. ఆర్థిక స్తోమత లేని నిరుపేదలు చికిత్సకు నోచుకోలేక మృత్యువాతపడుతుండటంతో హెమటాలజీ, మెడికల్ ఆంకాలజీ వైద్యుల సూచన మేరకు తెలంగాణ ప్రభుత్వం ఖరీదైన ఈ సేవలను ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ పథకాల్లో చేర్చింది. దీనిలో భాగంగా రూ.10 లక్షల వరకు వైద్య ఖర్చులు చెల్లిస్తోంది. లక్ష్మీప్రసన్నకు ఈహెచ్ఎస్ స్కీమ్ కింద, రామకృష్ణకు ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స అందించినట్లు డాక్టర్ నరేందర్ స్పష్టం చేశారు. నిమ్స్ ఆస్పత్రిలో ఈ తరహా చికిత్సలు ఉచితంగా చేయడం ఇదే ప్రథమమని ఆయన వెల్లడించారు. -
గ్యాస్ట్రో ఎంటరాలజీ కౌన్సెలింగ్
మద్యంతో లివర్ దెబ్బతింది... చికిత్స సాధ్యమేనా? మా నాన్నకు 48 ఏళ్లు. మద్యపానం అలవాటు వల్ల లివర్ బాగా పాడైపోయిందని డాక్టర్ చెప్పారు. లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ అవసరముంటుందా? దయచేసి తెలపండి. - విజేందర్, వరంగల్ మద్యపానం వల్ల శరీరంలో ముందుగా పాడయ్యేది లివరే. అలవాటుగా రోజూ మద్యం తాగేవారిలో లివర్ దెబ్బతింటుందని గుర్తించడం చాలా అవసరం. మీ నాన్న విషయానికి వస్తే ముందుగా ఆయన లివర్ ఏ మేరకు దెబ్బతిన్నదో చూడాలి. కామెర్లు, ట్యూమర్స్ (గడ్డలు), సిర్రోసిస్, హెపటైటిస్ వంటి కారణాలతో లివర్ దెబ్బతింటుంది. లివర్ పూర్తిగా గట్టిపడిపోయి రాయిలా మారిపోయిన స్థితిలో దానిని క్రానిక్ లివర్ డిసీజ్ అంటారు. లివర్ పూర్తిగా నాశనమైపోయి పనిచేయనప్పుడు మాత్రమే లివర్ మార్పిడి సర్జరీ అనివార్యం అవుతుంది. అయితే దానికంటే ముందుగా దెబ్బతిన్న లివర్‌ను కాపాడేందుకు అనేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మద్యపానం వల్ల లివర్ దెబ్బతిన్న కేసులలో ఓ ఆర్నెల్లపాటు ఆ పేషెంట్‌ను మద్యానికి దూరంగా ఉంచి చికిత్స చేయడం ద్వారా లివర్‌ను కాపాడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీ నాన్న విషయంలో కూడా అది సాధ్యమే. ముందుగా ఆయనచేత వెంటనే మద్యం మాన్పించి దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్టుకు చూపించి చికిత్స ప్రారంభించండి. నా వయసు 40 ఏళ్లు. నేను ఈమధ్య రొటీన్‌గా చేయించుకున్న వైద్యపరీక్షలలో గాల్‌బ్లాడర్ (పిత్తాశయం)లో రాళ్లు ఉన్నట్లు బయటపడింది. కానీ నాకు కడుపునొప్పి వంటి ఎలాంటి లక్షణాలూ కనపడలేదు. ఇప్పుడు రాళ్లను తొలగించడానికి సర్జరీనే ఉత్తమ పరిష్కారం అని డాక్టర్ అంటున్నారు. మీ సలహా ఏమిటి? - జయలక్ష్మి, కర్నూలు లివర్‌కు అనుసంధానమై సంచి మాదిరిగా ఉండే నిర్మాణమే గాల్‌బ్లాడర్. ఇది పైత్యరసాన్ని నిల్వ చేస్తుంది. రకరకాల కారణాల వల్ల గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడతాయి. మీ విషయం తీసుకుంటే మీకు కడుపులో ఎలాంటి నొప్పిలేదు కాబట్టి వీటిని లక్షణాలు కనిపించని గాల్‌స్టోన్స్ అంటారు. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడిన జబ్బుతో బాధపడే కొందరు పేషెంట్లకు ఉదరం కుడివైపు ఎగువభాగాన తీవ్రమైన నొప్పివస్తుంది. అలాగే కామెర్లు, తీవ్రమైన పాంక్రియాటిక్ సమస్యలు ఉత్పన్నమవుతాయి. అలాంటి సందర్భాల్లో కీహోల్ సర్జరీ ద్వారా మొత్తం గాల్‌బ్లాడర్‌ను తీసివేయాలని సూచిస్తాం. మీ విషయానికి వస్తే, మీకు కడుపునొప్పి లాంటి లక్షణాలు ఏవీ కనిపించనందున మీకు అసలు చికిత్స అవసరం లేదు. పిత్తాశయంలో రాళ్లకు సంబంధించి ఎలాంటి లక్షణాలు కనిపించని పేషెంట్లలో కేవలం మూడింట ఒక వంతు మందికి మాత్రమే తర్వాతికాలంలో సర్జరీ అవసరమవుతుంది.