కోలుకున్న రోగితో వైద్యబృందం
సాక్షి, చెన్నై(తమిళనాడు) : ఊపిరితిత్తుల వ్యాధితో అక్క చనిపోయింది, చెల్లెలూ కన్నుమూసింది. అదేరకమైన వ్యాధితో మరణం తప్పదని భయపడిన ఒక యువకుడు చండీగఢ్ నుంచి చెన్నైకి చేరుకున్నాడు. దాదాపు అంపశయ్యకు చేరుకున్న అతడు అరుదైన శస్త్రచికిత్సతో కోలుకున్నాడు. రోగికి శస్త్రచికిత్స చేసిన ఫోర్టీస్‌మలర్ (వడపళని) వైద్యులు డాక్టర్ గోవిని బాలసుబ్రమణియన్ గురువారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.. ‘‘ చండీఘడ్‌కు చెందిన 34 ఏళ్ల కేవల్‌సింగ్ ఊపిరితిత్తుల సమస్య తీవ్రమై సుమారు రెండేళ్లుగా ఇంటి నుంచి బయటకు రాకుండా 24 గంటలూ ఆక్సిజన్ సహాయంతోనే జీవిస్తున్నారు.
ఈక్రమంలో 70 కిలోల బరువు ఉండాల్సిన వ్యక్తి 44 కిలోల బరువుకు క్షీణించిపోయాడు. తన సోదరీమణులిద్దరూ ఇదేరకమైన రుగ్మతతో మరణించడంతో భీతిల్లిన అతడు ఆరునెలల క్రితం మా ఆసుపత్రికి వచ్చాడు. ఊపిరితిత్తుల ట్రాన్స్‌ప్లాంట్ చేయడం మినహా మరో మార్గం లేదని నిర్ధారించుకున్నాం. అయితే కరోనా రోజుల్లో అవయవదానం చేసేవారు దొరకడం కష్టమైంది. అదృష్టవశాత్తు మదురైకి చెందిన వ్యక్తి నుంచి సేకరించాం.
సుమారు ఏడు గంటలపాటూ శస్త్రచికిత్స చేసి రెండు ఊపిరితిత్తులు కేవల్‌సింగ్‌కు అమర్చిన తరువాత కోలుకుంటున్నాడు..’’ అని తెలిపారు. కాగా సాధారణంగా కాలుష్యం, వంశపారంపర్యం వల్ల ఊపిరితిత్తులు చెడిపోతాయని.. కానీ.. ఈ కేసులో వంశపారం పర్యమే కారణమని వివరించారు. ఆయనతోపాటు ఆసుపత్రి జోనల్ డైరక్టర్ డాక్టర్ సంజయ్ పాండే మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment