Lungs disease
-
చలిగాలిలో వాకింగ్: ఊపిరితిత్తులు జాగ్రత్త!
'చలిగా ఉండే ఈ సీజన్లో ఎంత వ్యాయామం చేసినా వెంటనే చెమట పట్టనందున ఎంతసేపైనా ఎక్సర్సైజులు చేసుకోవచ్చు అనేది ఫిట్నెస్ ఫ్రీక్ల ఆసక్తి. అయితే ఈ సీజన్లో ‘గ్రౌండ్ లెవల్ ఓజోన్’ తాలూకు ప్రభావం ఉంటుంది. అంతేకాదు.. చలికాలంలో ‘ఇన్వర్షన్’తో పాటు ఈ ‘గ్రౌండ్ లెవల్ ఓజోన్’ల ప్రభావంతో ఊపిరితిత్తుల మీదా, ఆ అంశం ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపే అవకాశాలుంటాయి. అందుకే చలిలో చెమట పట్టదనీ, అలసట రాదనీ వ్యాయామాలు చేసేవాళ్లూ, అలాగే చల్లటి వాతావరణంలో హాయిగా ఆరుబయట తిరగాలనుకునే వాళ్లు ఊపిరితిత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ ‘ఇన్వర్షన్’, ‘గ్రౌండ్లెవల్ ఓజోన్’ ప్రభావమేమిటో, అది ఊపిరితిత్తులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో, దాని నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపే కథనమిది.' రోడ్డు మీద పొగలు చాలా ఎక్కువగా వెలువరుస్తూ వాహనాలు వెళ్లాక.. చాలాసేపటివరకు ఆ పొగ చెదిరిపోదనే విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు.. ఆ పొగనుంచి పయనించే వాహనదారులంతా కాసేపు ఉక్కిరిబిక్కిరి అవుతుండటం కూడా సహజమే. మామూలుగానే ఉండే ఈ పరిస్థితికి తోడు.. శీతకాలంలోని చలివాతావరణంలో ఈ పొగ మరింత ఎక్కువ సేపు అలముకుని ఉంటుంది. ఇందులో పొగమంచూ, కాలుష్యం కలిసిపోయి ఉండటం వల్ల ‘స్మాగ్’ అనే కాలుష్య మేఘం చాలాసేపు కొనసాగుతూ.. ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపుతుంది. ‘ఇన్వర్షన్’, ‘గ్రౌండ్ లెవల్ ఓజోన్’లనే వాతావరణ అంశాలు ఈ ‘స్మాగ్’ను, దాంతో సమస్యలనూ మరింత తీవ్రతరం చేస్తాయి. ఇన్వర్షన్ అంటే.. మామూలుగా ఎత్తుకుపోయిన కొద్దీ క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుతాయన్నది తెలిసిందే. ఎత్తులకు వెళ్లినకొద్దీ నిర్ణీతమైన రీతిలో ఉష్ణోగ్రతలు తగ్గడాన్ని ‘ల్యాప్స్ రేట్’ అని కూడా అంటారు. ఇది వాతావరణ సహజ నియమం. కానీ కొన్నిసార్లు దీనికి వ్యతిరేకమైన ప్రభావం చోటు చేసుకుంటుంది. అంటే.. నేలమీదనే బాగా చల్లగా ఉండి, పైభాగంలో వేడిమి ఎక్కువగా ఉంటుంది. సహజ వాతావరణ నియమానికి భిన్నంగా ఉండటం వల్లనే.. ఈ ప్రక్రియకు ‘ఇన్వర్షన్’ అని పేరు. కాలుష్యమేఘంతో ఊపిరితిత్తులూ, ఓవరాల్ ఆరోగ్యంపై దుష్ప్రభావాలు ఇలా.. ముక్కు ముందుగా ఓ ఏసీ యూనిట్లా పనిచేస్తుంది. అతి చల్లటి గాలి నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా తొలుత ముక్కులోకి వెళ్లిన గాలి కాస్తంత వేడిగా మారి, దేహ ఉష్ణోగ్రతకు కాస్త అటు ఇటుగా సమానంగా ఉండేలా మారాకే ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. అంత చల్లటిగాలి ఊపిరితిత్తులకు నష్టం చేయకుండా ఉండేందుకే ముక్కు ఈ పనిచేస్తుంది. కానీ గాల్లోని రసాయనాల వల్ల తొలుత ముక్కులోని సున్నితమైన పొరలపై దుష్ప్రభావం పడుతుంది. దాంతో ముక్కులో మంటగా అనిపిస్తుంది. అలర్జీలూ కనిపిస్తాయి. అటు తర్వాత గాలిని ఊపిరితిత్తుల్లోకి తీసుకెళ్లే ట్రాకియా, బ్రాంకియాలో ఇరిటేషన్ రావచ్చు. కాలుష్యాలను ముక్కు చాలావరకు వడపోసినప్పటికీ, కొన్ని లంగ్స్‌లోకి వచ్చేస్తాయి. వాటిని బయటకు పంపేందుకు ఊపిరితిత్తుల్లో మ్యూకో సీలియరీ ఎస్కలేటర్స్ అనే నిర్మాణాలు కొవ్వొత్తి మంటలా కదులుతూ కాలుష్యాలను పైవైపునకు నెడుతుంటాయి. సీలియరీ ఎస్కలేటర్స్ పని మాత్రమే కాకుండా.. అక్కడ కొన్ని స్రావాలు (మ్యూకస్) ఊరుతూ, అవి కూడా కాలుష్యాలను బయటకు నెడుతుంటాయి. సీలియా చుట్టూ ఉండే స్రావాలలో ఇమ్యునోగ్లోబ్యులిన్స్, తెల్లరక్త కణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవన్నీ బ్యాక్టీరియా, వైరస్‌లనుంచి మాత్రమే కాకుండా కాలుష్యాల బారి నుంచీ చాలావరకు కాపాడుతుంటాయి. సన్నటి వెంట్రుకల్లాంటి కదులుతూ ఉండే ఈ సీలియాలు అలల్లా వేగంగా కదలడం ద్వారా శ్వాస వ్యవస్థలోకి చేరిన కాలుష్య పదార్థాలు, వ్యర్థాలు, బ్యాక్టీరియా, ఇతర కణాలను బయటకు నెట్టేస్తూ ఉంటాయి. ఈ సీలియా సమర్థంగా పనిచేయడానికి వీటి చుట్టూ ఉత్పత్తి అయ్యే మ్యూకస్‌తో శరీరంలో రోజు 15–20 మి.లీ. మ్యూకస్ (ఫ్లెమ్) తయారవుతూ ఉంటుంది. ఇలా ఊపిరితిత్తుల నుంచి ముక్కు వరకు చేరిన మ్యూకస్ ఎండిపోతూ, గాలికి రాలిపోతూ ఉంటుంది. కాలుష్యాల వల్ల ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు గళ్ల/తెమడలా పడటం, కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు అది నల్లగా ఉండటం మనలో చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయమే. ఈ సీజన్లో ఊపిరితిత్తులతో పాటు ఆరోగ్య రక్షణ కోసం చేయాల్సినవి.. కాలుష్యాల నుంచి దూరంగా ఉండాలి. అందుకోసం వీలైనంతవరకు సూర్యుడు బాగా పైకొచ్చి చలి తగ్గే వరకు ఇంట్లోంచి బయటకు రాకపోవడం మంచిది. తప్పనిసరై బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ముక్కు అడ్డుగా మాస్క్ లేదా మఫ్లర్ లేదా పరిశుభ్రమైన గుడ్డను కట్టుకోవాలి. ఈ సీజన్లో వాకింగ్, ఇతర వ్యాయామాలను కాలుష్యం లేని చోట మాత్రమే చేయాలి. లేదా చలికాలంలో కేవలం ఇన్డోర్ వ్యాయామాలకు పరిమితమైతే మేలు. ఊపిరితిత్తుల రక్షణ వ్యవస్థలో భాగంగా సీలియాలు సమర్థంగా పనిచేయడానికి గాలిలో తేమ బాగా తోడ్పడుతుంది. ఇందుకోసం చలి వాతావరణంలో ఆవిరి పట్టడం మేలు చేస్తుంది. ఊపిరితిత్తుల్లో స్రావాలు ఎక్కువగా చేరినా, శ్వాసకు ఇబ్బంది అయినా తొలుత ఆవిరిపట్టడం, అప్పటికీ తగ్గకపోతే డాక్టర్ సలహా మేరకు మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. తెమడ / గళ్ల (స్పుటమ్)ను బయటకు తెచ్చేందుకు దోహదపడే దగ్గును మందులతో అణచకూడదు. మందులు వాడాల్సివస్తే డాక్టర్ సలహా మేరకు క్రమంగా దగ్గును తగ్గించేలా చేసే మందులు వాడాలి. దగ్గుతో పాటు కఫం పడుతున్నప్పుడు.. ఆ కఫం తేలిగ్గా బయట పడేందుకు కఫాన్ని పలచబార్చే మందుల్ని డాక్టర్ సలహా మేరకు వాడాలి. ఈ చలికాలంలో కాలుష్యాలు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడం వల్ల ప్రధానంగా సీవోపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్), ఆస్తమా వంటి మరికొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో డాక్టర్‌ను సంప్రదించి సమస్యకు అనుగుణంగా మందులు వాడాల్సి ఉంటుంది. గ్రౌండ్ లెవల్ ఓజోన్ అంటే.. వాతావరణం పైపొరల్లో ఓజోన్ లేయర్ ఉంటుందనీ, అది ప్రమాదకరమైన రేడియేషన్ నుంచి సమస్త జీవజాలాన్ని రక్షిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే.. భూమి మీదా ఓజోన్ ఉంటుంది. దీన్ని ‘స్మాగ్ ఓజోన్’ లేదా ‘గ్రౌండ్ లెవల్ ఓజోన్’ అంటారు. ఇది వాతావరణంలోని కొన్ని వాయువులతో పాటు మరికొన్ని రసాయనాల చర్యల వల్ల ఆవిర్భవిస్తుంది. కొంతమేర సూర్యరశ్మి కూడా ఈ కాలుష్యమేఘం ఆవరించేందుకు దోహదపడుతుంది. ఫలితంగా.. పొగ, మంచు (ఫాగ్ ప్లస్ స్మోక్) కలిసి ఉండే స్మాగ్‌తో పాటు ఈ గ్రౌండ్ లెవల్ ఓజోన్ కూడా కలసిపోతుంది. దీనికి తోడు వాతావరణంలోని నల్లటి నుసి, ధూళి కణాలు (సస్పెండెడ్ ఎయిర్ పార్టికిల్స్), పుప్పొడీ.. ఇవన్నీ కలగలసి దట్టమైన కాలుష్య మేఘం ఏర్పడుతుంది. వాతావరణంలోని ఇన్వర్షన్తో ఏర్పడ్డ చల్లదనం కారణంగా ఈ కాలుష్యమేఘం చాలాసేపు అక్కడే స్థిరంగా ఉండిపోతుంది. ఈ కాలుష్యంలోంచి ప్రయాణాలు చేసేవారిలో.. తొలుత అక్కడి కాలుష్య రసాయనాలో ముక్కులో ఇరిటేషన్, ఆ తర్వాత ఊపిరి తిత్తులూ దుష్ప్రభావానికి లోనవుతాయి. ముక్కు, శ్వాసమార్గంలో మంట, ఊపిరి తేలిగ్గా అందకపోవడం, శ్వాసకోశ వ్యవస్థలో ఇన్ఫ్లమేషన్ వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా ఛాతీలో నొప్పి, దగ్గు, గొంతులో మంట, ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో చిన్నపిల్లలూ, వృద్ధుల్లో కొంతమేర ప్రాణాపాయం కలిగే అవకాశాలూ లేకపోలేదు. మరికొన్ని సందర్భాల్లో క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీవోపీడీ) వంటి ప్రమాదకరమైన జబ్బులకు దారితీయడం లేదా ఆస్తమా ఉన్నవారిలో ఇది అటాక్‌ను ట్రిగ్గర్ చేయడం వంటి అనర్థాలు సంభవిస్తాయి. - డా. రమణ ప్రసాద్, సీనియర్ పల్మునాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్ ఇవి చదవండి: మావాడు ఎవరితోనూ కలవడండీ -
ఊపిరితిత్తులు భద్రం.. పోస్ట్ కోవిడ్‌తో ఎన్నో సమస్యలు.. వీరికి రిస్క్ ఎక్కువ!
మనిషి శ్వాస తీసుకుంటేనే ప్రాణాలతో ఉంటాడు. శ్వాస తీసుకునేందుకు ఊపిరితిత్తులు ఎంతో కీలకం. మనిషి సాధారణంగా ఒక్క రోజులో దాదాపు 25,000 సార్లు ఊపిరి తీసుకుంటాడు. మనం పీల్చే గాలిలో ఆక్సిజన్, నత్రజని, తక్కువ మొత్తంలో ఇతర వాయువులు, తేలియాడే బ్యాక్టీరియా, వైరస్, వాతావరణంలో వివిధ రకాల కాలుష్య కారకాలు ఉంటాయి. ఊపిరితిత్తులు ఆక్సిజన్‌ను శరీరం అంతా పంపిణీ చేస్తాయి. ఆధునిక జీవనశైలి వల్ల ఊపిరితిత్తుల సమస్యలు ఉత్పన్నమై ఊపిరి తీసుకోవడం కష్టమైపోతూ కొంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబరు నెలను ‘హెల్థీ లంగ్స్ మంత్’గా నిర్ణయించి ఊపిరితిత్తుల వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. - గుంటూరు మెడికల్ బాధితులు అధికమే.. గుంటూరు జిల్లాలో 40 మంది పల్మనాలజిస్టులు (ఊపిరితిత్తుల స్పెషాలిటీ వైద్య నిపుణులు) సేవలందిస్తున్నారు. ఒక్కో డాక్టర్ వద్దకు ప్రతి రోజూ 15 నుంచి 20 మంది ఊపిరితిత్తుల సమస్యలతో చికిత్స కోసం వస్తున్నారు. కరోనా సమయంలో ఊపిరితిత్తుల సమస్యలకు చికిత్స చేసే పల్మనాలజిస్ట్‌ల పాత్ర బాగా పెరిగింది. కోవిడ్–19 వచ్చి కోలుకున్న పిదప తిరిగి కొంత మందికి పోస్ట్‌కోవిడ్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి. ఇలాంటి వారికి పల్మనాలజిస్ట్లు సకాలంలో మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు రక్షిస్తున్నారు. ఊపిరితిత్తుల వ్యాధులు గుర్తించడం ఎలా? ఎక్కువగా దగ్గు, ఆయాసం, పిల్లికూతలు, చాతి పట్టివేయడం లాంటి లక్షణాలు కనిపిస్తే అది సీఓపీడీ వ్యాధిగా గుర్తించాలి. తరచూ జలుబు చేయడం, దురద, కళ్లు మంటలు, కొన్ని రకాల ఆహార పదార్థాలు, వాసనలు సరిపడకపోవడం వంటి లక్షణాలను ఎలర్జిగా గుర్తించాలి. జ్వరం, కళ్లెతో కూడిన దగ్గు, శ్వాస తీసుకునేటప్పుడు చాతి నొప్పి ఉంటే దానిని నిమోనియా వ్యాధిగా భావించాలి. రెండు వారాలకు మించి దగ్గు, సాయంత్రం వేళల్లో జ్వరం, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే ఊపిరితిత్తులకు వచ్చే క్షయ వ్యాధిగా గుర్తించాలి. దగ్గుతున్నప్పుడు రక్తం పడటం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం లంగ్ క్యాన్సర్ లక్షణాలు. పొడి దగ్గు, ఆయాసం, కీళ్ల నొప్పులు ఉంటే ఊపిరితిత్తులకు వచ్చే ఐఎల్‌డీ వ్యాధిగా గుర్తించాలి. వీరికి రిస్క్ ఎక్కువ.. ధూమపానం చేసేవారు, పొగతో కూడిన ప్రాంతాల్లో పనిచేసేవారు, పొగాకు ఉత్పత్తులు వినియోగించేవారు, ఫ్యాక్టరీల్లో పనిచేసేవారు, వడ్రంగి పనులు చేసేవారు, పొగతో కూడిన వాహనాలను రిపేర్లు చేసేవారు, చిన్న పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఊపిరితిత్తుల వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. ముందస్తు జాగ్రత్తలతో నివారణ ఊపిరితిత్తుల వ్యాధులను ముందస్తు జాగ్రత్తలతో చాలా వరకు నివారించవచ్చు. గుట్కా, పాన్‌పరాగ్, ఖైనీ, పొగతాగడం విడనాడాలి. దుమ్ము, ధూళి ప్రాంతాల్లో పనిచేసేవారు మాస్క్‌లు ధరించడం ద్వారా ఊపిరితిత్తులకు ఇబ్బంది కలగకుండా చూడవచ్చు. మంచి ఆహారపు అలవాట్లు కలిగిఉండాలి. అలర్జీ పదార్థాలకు దూరంగా ఉండాలి. 60 ఏళ్లు పైబడిన వారంతా క్రమం తప్పకుండా ఫ్లూ, నిమోనియా వ్యాక్సిన్లు వేయించుకోవడం వల్ల ఊపిరితిత్తుల జబ్బుల బారిన పడకుండా ఉండవచ్చు. పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు, ప్రతి రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం, ప్రాణాయామం చేయడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చు. డాక్టర్ బి.దుర్గాప్రసాద్, పల్మనాలజిస్ట్, గుంటూరు చదవండి: Brain Stroke: పురుషులకే స్ట్రోక్ రిస్క్ ఎక్కువా? అపోహలు- వాస్తవాలు.. ఈ ఆహారం తీసుకున్నారంటే.. Custard Apple: సీజనల్ ఫ్రూట్ సీతాఫలం.. తరచూ తింటున్నారా? ఇందులోని బయోయాక్టివ్ అణువుల వల్ల -
Hypersensitivity Pneumonia: పిట్ట రెట్టలతోనూ ప్రమాదమే.. జర భద్రం..!
మనలో చాలామందికి నిమోనియా గురించి తెలుసు. ‘హైపర్సెన్సిటివిటీ నిమోనైటిస్’ అనే మాట కొత్తగా అనిపించవచ్చు. కానీ ఒక రకంగా చెప్పాలంటే ఇది అనేక నిమోనియాల సమాహారం అని అనుకోవచ్చు. రైతులు గరిసెల్లో వడ్లూ, ధాన్యాలూ నిల్వ చేసేటప్పుడూ, గడ్డి వామి పేర్చే సమయంలో వచ్చే వాసనలు పడనప్పుడు ఒక రకం నిమోనియా వస్తుంది. దాన్ని ‘ఫార్మర్స్ లంగ్’ అంటారు. పౌల్ట్రీ రైతులకు కోళ్ల గూళ్ల దగ్గర మరో రకం వాసన వస్తుంటుంది. అది సరిపడనప్పుడు ‘బర్డ్ ఫ్యాన్సియర్స్ లంగ్’ అంటూ మరో ఆరోగ్య సమస్య ఎదురవుతుంది. అంతేకాదు... పెద్దసంఖ్యలో పక్షులు పెంచుకునేవాళ్లలో, పావురాల రెట్టలతోనూ ఇది రావచ్చు. గాలిలో, వాతావరణంలో, పరిసరాల్లో వ్యాపించే మనకు సరిపడని అనేక రేణువులూ, వాసనలూ, వస్తువులతో వచ్చే ఊపిరితిత్తుల సమస్యే ‘హైపర్ సెన్సిటివిటీ నిమోనైటిస్’. తాజాగా ఇప్పుడు తొలకరి కూడా మొదలైంది. దాంతో గడ్డి తడిసి ఒకరకమైన వాసన వచ్చే ఈ సీజన్లో ఈ ముప్పు మరింత ఎక్కువ. ఈ సమస్యపై అవగాహన కలిగించేందుకే ఈ కథనం. వృత్తి కారణంగానో లేదా ఇల్లు మారడం వల్లనో ఓ కొత్త వాతావరణంలోకి వెళ్లాం అనుకొండి. అప్పుడు అకస్మాత్తుగా ఊపిరి అందకపోవడం, ఆయాసపడటం జరగవచ్చు. అందుకు కారణం అక్కడ తమకు అలర్జీ కలిగించే రేణువులూ, వాసనలూ, అతి సన్నటి పదార్థాలు ఉండటం. అవి ఊపిరితిత్తుల (లంగ్స)పై కలిగించే దుష్ప్రభావం వల్ల వచ్చే సమస్యే ‘హైపర్ సెస్సిటివిటీ నిమోనైటిస్’. ఇది కొందరిలో తక్షణం సమస్యగా కనిపించి... ఆ పరిసరాల నుంచి దూరంగా రాగానే తగ్గవచ్చు. మరికొందరిలో దీర్ఘకాల సమస్యగానూ పరిణమించవచ్చు. ఇదెంత సాధారణమంటే మన సమాజంలోని ఐదు శాతం మందిలో ఇది కనిపిస్తుంటుంది. ఎందుకొస్తుంది? మన పరిసరాల్లోని దాదాపు 300 రకాల పదార్థాలు, రేణువులు ‘హైపర్ సెన్సిటివిటీ నిమోనియా’కు కారణం కావచ్చు. కొంతమందికి కొన్నింటితో అలర్జీ కలగడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఆ అలర్జెన్స్‌ను స్థూలంగా వర్గీకరించినప్పుడు నాలుగు రకాలుగా రావచ్చు. అవి... ఫార్మర్స్ లంగ్ : ఇది ముఖ్యంగా రైతుల్లో కనిపిస్తుంది. పంట కోశాక ధాన్యాన్ని గరిసెల్లో (గాదెల్లో) నిల్వ చేయడం, వాటిల్లోకి దిగి ధాన్యాన్ని పైకి తోడాల్సి రావడం, బయట గడ్డివాముల్లాంటివి పేర్చాల్సిరావడం వంటి అంశాలతో రైతుల్లో ప్రధానంగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని ‘ఫార్మర్స్ లంగ్’ అంటారు. బర్డ్ ఫ్యాన్సియర్స్ లంగ్: కొందరు జీవనోపాధి కోసం... అంటే ముఖ్యంగా పౌల్ట్రీ రంగంలో పనిచేసేవారు కోళ్లూ, బాతుల వంటి పక్షుల్ని పెంచుతుంటారు. మరికొందరు హాబీగా పక్షుల్ని పెంచుతారు. ఇంకొందరు సరదాగా పక్షులకు ఆహారం వేస్తుంటారు. వాటి వాసనతోనూ, విసర్జకాలతో ఈ సమస్య వస్తుంది కాబట్టి దీన్ని ‘బర్డ్ ఫ్యాన్సియర్స్ లంగ్’ అంటారు. హ్యుమిడిఫయర్స్ లంగ్ : కొందరు వృత్తిరీత్యా బాగా తేమతో కూడిన వాతావరణంలో ఉండాల్సిరావచ్చు. ఆ తేమ కారణంగా అక్కడ పెరిగే ఫంగస్తోనూ, వాటి స్పోరులతో (అవి వ్యాప్తి చెందడానికి పండించే గింజలవంటివి) సరిపడనప్పుడు ఇది వస్తుంది. నిత్యం ఎయిర్కండిషనర్లో ఉండేవారి కొందరికి ఆ చల్లటివాతావరణం సరిపడక కూడా రావచ్చు. అందుకే దీన్ని ‘హ్యుమిడిఫయర్స్ లంగ్’ అంటారు. హాట్ టబ్ లంగ్ : కొందరు హాబీగా లేదా ఆరోగ్యం కోసం ‘స్పా’ల వంటి చోట్ల నీటి తొట్టెల్లో స్నానాలు చేస్తుంటారు. మరికొందరు ఇన్హెలేషన్ థెరపీ పేరిట మంచి సువాసన ద్రవ్యాలతో కూడిన నీటి ఆవిర్లను పీలుస్తుంటారు. అయితే ఆ నీరు నిల్వ ఉండటం లేదా ఆ పాత్రను సరిగా కడగకపోవడంతో అపరిశుభ్రంగా ఉండటం, తొట్టిస్నానాల విషయంలో... వాటిని సరిగా శుభ్రం చేయకపోవడం, అక్కడ అలర్జెన్స్ పెరగడంతో ఈ సమస్య వస్తుంది కాబట్టి దీన్ని ‘హాట్ టబ్ లంగ్’ అంటారు. లక్షణాలు ఈ సమస్య ఏదో ఒక సమయంలో (అక్యూట్‌గా)నైనా రావచ్చు. అంటే సరిపడని వాతావరణంలోకి వెళ్లినప్పుడు లక్షణాలు కనిపించవచ్చు. లేదా మరికొందరిలో దీర్ఘకాలంపాటు (క్రానిక్‌గా) బాధించవచ్చు. ∙ ఊపిరి అందకపోవడం ∙తీవ్రమైన ఆయాసం ∙జ్వరం ∙చలితో వణకడం ∙ఒళ్లునొప్పులు ∙తలనొప్పి ∙కొందరిలో తీవ్రమైన దగ్గు వంటివి కనిపిస్తాయి. కఫం ఉండవచ్చు లేదా లేకపోవచ్చు. ఉంటే తెల్లగా, పసుపురంగులో ఒక్కోసారి రక్తపు చారికతోనూ కనిపించవచ్చు. ∙గాలి పీలుస్తున్నా అది లోపలికి వెళ్లదు. కారణం...గాలికి గమ్యం అయిన గాలిసంచిలో అడ్డంకులు (ఎగ్జుడస్) ఉండవచ్చు. కాబట్టి అక్కడికి ఆక్సిజన్ చేరదు. దాంతో శరీరానికి అవసరమైనంత ఆక్సిజన్ అందదు. ఫలితంగా ఊపిరితిత్తులు తమ పని తాము చేయలేని పరిస్థితికి వస్తాయి. దీన్నే ‘హైపాక్సిక్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్’ అంటారు. ∙ఊపిరి అందకపోవడంతో నుదుట చెమటలు పట్టడం, ముఖం మారిపోవడం, కంగారుగా ఉండటం, అయోమయం, గుండె స్పందన వేగం పెరగడం, డీలా పడిపోవడం, బీపీ పడిపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అలర్జెన్లకు కొద్దిగా ఎక్స్పోజ్ కాగానే ఈ లక్షణాలు తీవ్రమై 4 నుంచి 12 గంటల పాటు వేధించవచ్చు. ఆ వాతావరణం నుంచి బయటకు రాగానే... కొందరిలో అది తగ్గవచ్చు. లేదా జన్యుపరమైన సమస్యలున్నవారికి అలర్జెన్స్ కారణంగా ఎడతెరిపిలేకుండా లక్షణాలు బాధించవచ్చు. నిర్ధారణ పరీక్షలు ∙తొలుత స్టెతస్కోప్‌తో సాధారణమైన శబ్దాలు కాకుండా ఏవైనా అసాధారణమైన శబ్దాలు వినిపిస్తున్నాయా అని పరీక్షిస్తారు. lఛాతీ ఎక్స్–రే, అవసరమనుకుంటే సీటీ స్కాన్ తీస్తారు. ∙శ్వాసప్రక్రియ సరిగా ఉందా అని లేదా ఊపిరితిత్తుల పనితీరు తెలుసుకోడానికి ‘లంగ్ ఫంక్షన్ టెస్ట్’ చేస్తారు. ∙ఏవైనా అలర్జెన్స్ కారణంగా అలర్జీ ఉందేమో తెలుసుకోడానికి యాంటీబాడీస్ రక్తపరీక్ష చేస్తారు. ∙బ్రాంకోస్కోప్ సహాయంతో నోటి నుంచి లేదా ముక్కు నుంచి లంగ్స్‌కు గాలి వెళ్లే దారులను పరీక్షిస్తారు. ఇది వోకల్ కార్డ్స్, విండ్‌పైప్ వంటి చోట్లకు వెళ్లి అక్కడేమైనా అసాధారణతలు ఉన్నాయా అని పరీక్షిస్తుంది. ∙ అవసరమైనప్పుడు ఊపిరితిత్తులనుంచి చిన్నముక్క సేకరించి ‘సర్జికల్ లంగ్ బయాప్సీ’ లేదా... ‘కైరో లంగ్ బయాప్సీ’ (దీన్ని కార్డియోథొరాసిక్ సర్జన్ నిర్వహిస్తారు) లేదా ‘వాట్స్ గైడెడ్ లంగ్ బయాప్సీ నిర్వహించే అవకాశం ఉంది. ఊపిరితిత్తులకు ఎలాంటి నష్టం జరుగుతుందంటే...? ఈ సమస్యతో ఊపిరితిత్తులపై దుష్ప్రభావం పడుతుంది. దాంతో వాటి సామర్థ్యం తగ్గుతుంది. అంతేకాదు... పరిస్థితి తీవ్రమైనప్పుడు ఊపిరితిత్తులపై గాయం కలిగినట్లుగా గాట్లవంటివి రావచ్చు. దీన్నే ‘స్కారింగ్’ అంటారు. ఇక అవి తమ స్వాభావిక సాగేగుణాన్ని కోల్పోయే ప్రమాదమూ ఉంది. దీన్నే ‘పల్మునరీ ఫైబ్రోసిస్’గా పేర్కొంటారు. నివారణ ∙సమస్య నిర్ధారణ అయినప్పుడు అసలు ఏయే అలర్జెన్ కారణంగా ఇబ్బందులు కలుగుతున్నాయో వాటి నుంచి బాధితులను పూర్తిగా దూరంగా ఉంచాలి. ∙సమస్య వచ్చిన రైతులు ధాన్యం నిల్వ చేసే గరిసెలు, గాదెలు, గిడ్డంగులతో పాటు గడ్డివాములు, పశువుల కొట్టాల్లో గడ్డి వేసే చోట్లకూ, పశువులు తినివదిలేసిన వృథా గడ్డిని పడేసే పెంటకుప్ప/ పేడదిబ్బ / ఎరువు దిబ్బలకు దూరంగా ఉండాలి. ∙పౌల్ట్రీరంగంలో పనిచేసేవారు కోళ్లగూళ్లకు వెళ్లకుండా జాగ్రత్తపడాలి. ∙సరదగా పక్షులు పెంచుకునేవారు వాటి నుంచి దూరంగా ఉండాలి. వాటికి దాణా వేయకుండా ఉండటం, అవి రెట్టలేసే ప్రదేశాలకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు పాటించాలి. ∙çపరిసరాలను పూర్తిగా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇళ్లలో / ఆఫీసుల్లో / కార్యక్షేత్రాల్లో గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ∙ఇండ్ల పరిసరాల్లో కుళ్లుతున్న / కుళ్లడానికి ఆస్కారం ఉన్న పదార్థాలను (అంటే కుళ్లుతున్న పండ్లు, ఖాళీచేసిన కొబ్బరిబొండాల వంటివి) పడవేయకూడదు. ∙తేమగా ఉండి, ఫంగస్ పెరిగేందుకు ఆస్కారం ఉండే పరిసరాల నుంచి దూరంగా ఉండాలి. ∙ఏసీలో ఉండేవారు తరచూ ఫిల్టర్లను శుభ్రం చేయించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ∙స్థోమత, అవకాశం ఉన్నవారు వీలైతే గాలిలో తేమను తెలుసుకునే ఉపకరణం ‘హైగ్రోమీటర్’ను కొనుగోలు చేసి, తామున్న ప్రదేశంలో 50 శాతానికి మించి తేమ ఉంటే అక్కడికి దూరంగా వెళ్లిపోవాలి. ∙నిల్వనీళ్లలో తొట్టిస్నానం వద్దు. ∙సువాసన ద్రవ్యాలు కలిపిన నీటి ఆవిర్లను పీల్చడం వంటివి చేయకూడదు. ∙నిల్వ ఉన్న నీళ్లు ఇంటిలోకి లీక్ అవుతూ ఉంటే, ప్లంబర్ల సహాయంతో వెంటనే రిపేరు చేయించాలి. ∙పరిసరాలెప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఇంటి గోడలు తడిగా, తేమతో లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. lపొగతాగే అలవాటు / ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి. చికిత్స ∙అవసరమైన మోతాదుల్లో కార్టికో స్టెరాయిడ్స్ ఇవ్వాల్సి రావచ్చు. lయాంటీ హిస్టమైన మందులను ఇవ్వాల్సి రావచ్చు. ∙ఊపిరి అందేలా ఊపిరితిత్తుల్లోని నాళాలను వెడల్పు చేసేందుకు ‘బ్రాంకోడయలేటర్స్’ ఇవ్వాల్సి రావచ్చు. ∙జన్యుపరమైన కారణాలతో సమస్య వస్తుంటే దేహంలో ఇమ్యూన్ వ్యవస్థ తీవ్రతను తగ్గించడానికి ‘ఇమ్యూనో సప్రెసివ్ మందులు’ ఇవ్వాల్సి రావచ్చు. ∙రక్తంలో ఆక్సిజన్ మోతాదులు తగ్గితే, అవసరాన్ని బట్టి ఆక్సిజన్ పెట్టాల్సి రావచ్చు. తీవ్రతను బట్టి మందుల్ని స్వల్పకాలం కోసం లేదా ఒక్కోసారి మూడు నెలలు, సమస్య మరింత తీవ్రంగా, జటిలంగానూ ఉన్నప్పుడు సుదీర్ఘకాలం పాటు మందులు వాడాల్సి రావచ్చు. ఒక్కోసారి ఊపిరితిత్తులపై స్కార్ వచ్చి, పీచులాగా (ఫైబ్రస్) అయిపోతే ఊపిరితిత్తుల మార్పిడి (లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్) మాత్రమే చివరి ఆప్షన్ కావచ్చు. -
తెలంగాణ: వచ్చేవారంలో పతాకస్థాయికి ఒమిక్రాన్.. తగ్గేది మాత్రం అప్పుడే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ వచ్చే వారం నాటికి తీవ్రస్థాయికి చేరుకుంటుందని కాంటినెంటల్ ఆసుపత్రుల చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వచ్చే వారం తర్వాత తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. దేశంలో రెండు మూడు వారాల్లో పీక్కు చేరుకుంటుందని చెప్పారు. ఫిబ్రవరి చివరి నాటికి తగ్గుముఖం పడుతుందన్నారు. మానవుడి పుట్టుక తర్వాత ఇంత వేగంగా విస్తరించిన వైరస్ లేదని, ఇదే మొదటిసారి అని తెలిపారు. ప్రస్తుతం కరోనా వైరస్ తీవ్రత, వ్యాప్తి, చికిత్స, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై డాక్టర్ గురు ఎన్ రెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. 80 శాతం మందికి వైరస్... మీజిల్స్ వైరస్ తీవ్రంగా విస్తరిస్తుంది అనుకున్నాం. కానీ ఒమిక్రాన్ దానిని మించిపోయింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా 80 శాతం మంది వైరస్ బారినపడతారు. 50 నుంచి 80 శాతం వేగంతో విస్తరిçస్తున్నందున త్వరగా ఇన్ఫెక్ట్ చేస్తుంది. దగ్గు, జలుబు తుంపర్ల ద్వారా ఇది విస్తరిస్తుంది. మాస్క్ లేకుండా ఉంటే మరింత వేగంగా విస్తరిస్తుంది. ఇళ్లలో ఒకరికి వస్తే ఇతరులకూ వ్యాపిస్తుంది. (చదవండి: ఆటలు వద్దు.. సూచనలు జారీ చేసిన విద్యాశాఖ కమిషనర్) ఊపిరితిత్తులను ఇన్ఫెక్ట్ చేయదు ఒమిక్రాన్ సోకినప్పుడు ఎక్కువ కేసుల్లో లక్షణాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు ఉంటాయి. గొంతులో ముక్కులో ఉండే వైరస్ ఇది. ఊపిరితిత్తులను ఇన్పెక్ట్ చేయదు. డెల్టా మందులు పనికిరావు డెల్టాకు వాడే మందులు ఒమిక్రాన్‌కు పనికిరావు. డెల్టాకు స్టెరాయిడ్స్, రెమిడిసివిర్, మోనొక్లోనాల్ యాంటీబాడీస్ ఉపయోగించాం. కానీ ఒమిక్రాన్‌కు ‘మాన్లువిరపిర్’అనే మాత్ర వేసుకోవాలి. ఇది ఎం తో సురక్షితమైంది. మొదటి రెండ్రోజులు జ్వరం అ లాగే ఉంటే ఈ మందు వేయొచ్చు. కానీ గర్భిణిలు, త్వరలో ప్రెగ్నెన్సీ వచ్చే వారికి ఇవ్వకూడదు. ఈ మందు తీసుకున్న ఆరు నెలల వరకు ప్రెగ్నెన్నీ కో సం ప్రయత్నించకూడదు. కొందరు అనుభవం లేని డాక్టర్లు ఇప్పటికీ అనవసరంగా క్లోరోక్విన్, ఐవర్‌మెక్టిన్, యాంటీబయోటిక్ మందులు ఇస్తున్నారు. డెల్టానా, ఒమిక్రానా తెలుసుకోవచ్చు ఎస్ జీన్ ఆర్టీపీసీఆర్ కోవిడ్ టెస్ట్చేస్తే అందులో ఒమిక్రానా లేదా డెల్టా అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఈ పరీక్షలు ప్రభుత్వంలో అందుబాటులో లేవు. ప్రైవేట్ పరీక్ష కేంద్రాల్లో కొన్నిచోట్ల చేస్తున్నారు. మేము మా ఆస్పత్రిలో రూ.1,200 తీసుకుని ఔట్ పేషెంట్లకు, అవసరమైన వారికి కూడా చేస్తున్నాం. డోలో వేసుకుంటే చాలు: ఒమిక్రాన్‌లో జ్వరం వస్తే డోలో వేసుకుంటే సరిపోతుంది. ఏడు రోజులు ఐసోలేషన్‌లో ఉండి, చివరి 24 గంటల్లోపు జ్వరం లేకుంటే సాధారణ జీవనంలోకి రావొచ్చు. డోలో వేసుకున్నా రెండు మూడు రోజుల్లో జ్వరం తగ్గకపోతే అప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి. ఇది సోకితే భవిష్యత్తులో కోవిడ్ రాదు ఒమిక్రాన్ వచ్చిపోయిన వారికి దీర్ఘకాలిక రోగనిరోధక శక్తి వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అది ఏళ్లపాటు ఉంటుందంటున్నారు. మళ్లీ భవిష్యత్తులో కోవిడ్ రాకుండా కాపాడుతుందని అంటున్నారు. ఒమిక్రాన్ వచ్చినవారికి డెల్టా వేరియంట్ వచ్చే అవకాశం ఉండదు. కానీ డెల్టా వచ్చిన వారికి ఒమిక్రాన్ వస్తుంది. బూస్టర్‌తో మెరుగైన రక్షణ రెండు వ్యాక్సిన్ల తర్వాత బూస్టర్ తీసుకోవాలని సూచిస్తున్నాం. మూడు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారికి పూర్తిస్థాయి భద్రత ఉంటుంది. ఒమిక్రాన్ వచ్చినా 90 శాతం మందికి ఐసీయూకు వెళ్లే ప్రమాదం ఉండదు. మరణాలు ఉండవు. అలసట, తలనొప్పి ఉంటాయి ఒమిక్రాన్ వచ్చి తగ్గిన తర్వాత మూడు నాలుగు వారాల వరకు అలసట, తలనొప్పి, ఆందోళనతో కూడిన మానసిక స్థితి ఉంటుంది. ఒమిక్రాన్ వైరస్ వెన్నెముక ద్రవంలోకి చేరుకొని, తర్వాత మెదడుకు చేరుకొని అక్కడ వాపు తీసుకొస్తుంది. దీనివల్ల నాలుగైదు వారాలు పై సమస్యలు వస్తాయి. నిద్ర సరిగా పట్టక పోవడం ఉంటుంది. పిల్లలు తట్టుకుంటున్నారు పిల్లలు ఒమిక్రాన్‌ను తట్టుకుంటున్నారు. ఎవరికీ ఏమీ కావట్లేదు. తల్లిదండ్రులు భయపడి పిల్లల్ని ఆస్పత్రులకు తీసుకొచ్చి చూపిస్తున్నారు. 10% కంటే తక్కువ ఐసీయూ ఆక్యుపెన్సీ హైదరాబాద్‌లో మాలాంటి ఐదారు పెద్దాసుపత్రుల్లోని ఐసీయూల్లో 10 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ ఉంది. కొందరు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలని కోరుకుంటూ వస్తున్నారు. కొందరు కొత్త మందుల కోసం వస్తున్నారు. మన ప్రభుత్వాలను అభినందించాలి మన దేశంలో వ్యాక్సినేషన్ బాగా జరగడం వల్ల మరణాలు పెద్దగా లేవు. మరణించేవారిలో 90 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోనివారే. వ్యాక్సినేషన్‌తో ఎంతో ప్రయోజనం చేకూరింది. తెలంగాణ , ఏపీల్లో పీహెచ్‌సీల్లో సైతం వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచిన ప్రభుత్వాలను అభినందించాలి. (చదవండి: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. హాఫ్ హెల్మెట్‌కు బై బై?) -
నిమోనియా వ్యాధితో జరభద్రం..
నిమోనియాతో జరభద్రం నిమోనియా అన్నది ఊపిరితిత్తులకు వచ్చే ఇన్ఫెక్షన్ అనే విషయం తెలిసిందే. గతంలో వచ్చిన నిమోనియాలతో పోలిస్తే 2020, 2021ల్లో వచ్చిన నిమో నియాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. గతేడాదీ, ఈ ఏడాదీ కోవిడ్ విజృంభించి చాలామంది ప్రాణాలు తీసింది. నిజానికి కరోనా ఆ ప్రాణాలను బలిగొనలేదనీ, కోవిడ్ కారణంగా సెకండరీ ఇన్ఫెక్షన్గా వచ్చిన నిమోనియా అనేక మంది ఉసురు తీసిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఈ నెల (నవంబరు) 12న ‘ప్రపంచ నిమోనియా డే’ సందర్భంగా ఆ ఆరోగ్య సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం. ఇన్ఫెక్షన్ల విషయంలో అన్నింటికంటే ఎక్కువ ప్రాణాలు తీసేది ‘నిమోనియా’. 2019లో అది 25 లక్షల మంది ప్రాణాలను బలిగొంది. అందులో 6.72 లక్షలు చిన్నారులు కావడం విషాదం. పైగా ఇందులోనూ చాలా ఎక్కువ మంది ఐదేళ్ల వయసు కంటే తక్కువ చిన్నారులే. అగ్నికి ఆజ్యంలా... కోవిడ్ తోడుకావడంతో ఒక్క గతేడాది లెక్కలే చూస్తే... ఎప్పుడూ నమోదయ్యే నిమోనియా మృతులకు అదనంగా 19 లక్షల మరణాలు ఎక్కువగా నమోదయ్యాయని ఓ అంచనా. నిమోనియాని పూర్తిగా నయం చేసేలా ఖచ్చితమైన చికిత్స అందుబాటులో ఉన్నప్పటికీ ఇన్ని మరణాలు నమోదవుతున్నాయంటే పైన పేర్కొన్న గణాంకాలతో దాని తీవ్రత తేటతెల్లమవుతోంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), యూనిసెఫ్ తమదైన ఓ లక్ష్యంతో ఒక కార్యచరణ ప్రణాళిక రూపొందించాయి. ప్రతి దేశంలోనూ 2025 నాటికి నిమోనియా మరణాల సంఖ్యను ప్రతి వెయ్యి మంది చిన్నారుల్లో కేవలం ముగ్గురికి తగ్గించాలన్నదే ఆ గ్లోబల్ యాక్షన్ ప్లాన్ లక్ష్యం. వ్యాధి నిర్ధారణ ►రోగిలో కనిపించే లక్షణాలతో ►సీబీపీ, సీఎక్స్ఆర్ వంటి పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. ►ఒక్కోసారి వ్యాధి తీవ్రతను బట్టి, అవసరాన్ని బట్టి ఛాతీ సీటీ స్కాన్, కళ్లె/గల్ల/తెమడ పరీక్ష వంటి పరీక్షలూ అవసరం కావచ్చు. నివారణ... ►పిల్లలకు చిన్నతనంలో ఇచ్చే బీసీజీ, పెర్టుసస్‌లతో పాటు నిమోకోకల్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల చిన్నారుల్లో దీన్ని నివారించవచ్చు. ►పొగతాగే అలవాటును తక్షణం మానేయాలి. ఆల్కహాల్ కూడా. ►పొగ వాతావరణానికి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. ►ఆస్తమా రోగులు, బ్రాంకైటిస్ ఉన్నవారు వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి. ►క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. ఫలితంగా నిమోనియా వంటి ఇన్ఫెక్షన్లు అంత త్వరగా రావు. ►పోషకాలన్నీ ఉండేలా సమతులాహారం తీసుకోవాలి. దాంతో రోగనిరోధకశక్తి పెరుగుతంది. అది నిమోనియాతో పాటు అనేక రకాల ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి కూడా రక్షిస్తుంది. నిమోనియాకు తక్షణం చికిత్స అవసరం... లేదంటే... పైన పేర్కొన్న అనేక కారణాల్లో దేని వల్ల నిమోనియా వచ్చినప్పటికీ చికిత్స తీసుకోకపోతే బాధితుడి పరిస్థితి సంక్లిష్టంగా మారుతుంది. ఫలితంగా ఇతర కాంప్లికేషన్లు వస్తాయి. ఉదాహరణకు... మూత్రపిండాలు దెబ్బతినడం, పక్షవాతం, సెప్టిసీమియా (అంటే రక్తానికి ఇన్ఫెక్షన్ సోకి, అది విషపూరితంగా మారడం), రక్తపోటు పడిపోవడం, మెదడుపై దుష్ప్రభావం వంటి కాంప్లికేషన్లు రావచ్చు. ఒక్కోసారి మరణం సంభవించడం కూడా నిమోనియా కేసుల్లో తరచూ కనిపిస్తుంటుంది. అన్ని వయసుల వారిలోనూ... చిన్న పిల్లలు మొదలుకొని, వృద్ధుల వరకు నిమోనియా ఏ వయసు వారిలోనైనా రావచ్చు. చిన్నారులూ, వృద్ధుల్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువ కాబట్టి వారిలో ఇది కనిపించడం చాలా సాధారణం. ఈ సమస్యలుంటే మరింత అప్రమత్తత తప్పదు ►ఝఝసీఓపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ – బ్రాంకైటిస్, ఎంఫసీమా) ఉన్నవారు గుండె సమస్యలు ఉన్నవారు ►స్పీన్ తొలగించిన వాళ్లు ►పొగతాగేవారు ►ఇక క్యాన్సర్ కారణంగా కీమోథెరపీ తీసుకుంటున్నావారు, ఎయిడ్స్ రోగులు, ఆస్తమా ఉన్నవారిలో నిమోనియా రావడం మిగతావాళ్ల కంటే కాస్తంత ఎక్కువే. అలాగే సాధారణంగా గర్భవతుల్లో నిమోనియాను గుర్తించాక, సరిగా వైద్య చికిత్స అందివ్వకపోతే, వారిలో అది మరెన్నో సమస్యలకు దారితీసే ముప్పు పొంచి ఉంటుంది. చికిత్స నిమోనియాకు తగిన యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేయాల్సి ఉంటుంది. దాని మోతాదును జాగ్రత్తగా నిర్ణయించి డాక్టర్ల పర్యవేక్షణలో ఇవ్వాలి. ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల్లో... మూడు రోజులకు పైబడి జ్వరం, ఛాతీనొప్పి, ఊపిరి సరిగా తీసుకోకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే. వారు వీలైనంత త్వరగా ఫిజీషియన్/మెడికల్ స్పెషలిస్ట్‌ను సంప్రదించి, వారి సలహా మేరకు అవసరమైన అన్ని పరీక్షలూ చేయించుకోవాలి. ఇవీ కారణాలు ఇటీవల విస్తరించిన, ఈ ఏడాది కూడా రెండోవేవ్‌తో స్వైరవిహారం చేసిన కరోనా వైరస్ ఓ ప్రధానమైన కారణమే అయినప్పటికీ... ఇది మాత్రమేగాక నిమోనియాకు ఎన్నో కారణాలుంటాయి. వాటిలో ప్రధానమైన కొన్ని ఇవే... ►బాక్టీరియా వల్ల – స్టెఫలోకాకస్ బ్యాక్టీరియా, హీమోఫీలస్ (మొదటిది పెద్దల్లో, రెండోది పిల్లల్లో నిమోనియాకు కారణమవుతుంది). అవే కాకుండా... గ్రామ్‌నెగెటివ్, అనరోబిక్, టీబీ బ్యాక్టీరియా మొదలైన బ్యాక్టీరియాల వల్ల. ►ఫంగస్ వల్ల ►కొద్ది ప్రదేశంలోనే ఎక్కువమంది ఉండటం (ఓవర్ క్రౌడింగ్). ఇప్పుడు వ్యాప్తి చెందే కరోనా, ఇంకా అన్ని వైరస్‌లతో పాటు, నిమోనియాకి కూడా ఓవర్ క్రౌడింగ్ ఓ ప్రదాన కారణం. అందుకే గుంపుల్లోకి వెళ్లడం నివారించాలి. ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాల్సివస్తే మాస్క్ తప్పదు. ►మైక్రో యాస్పిరేషన్ – ఒక్కోసారి తినే, తాగే సమయాల్లో మనకు తెలియకుడానే కొన్ని పదార్థాలూ, ద్రవాలు గొంతునుంచి శ్వాసనాళంలోకి జారిపోతుంటాయి. ఆ ప్రక్రియనే మైక్రోయాస్పిరేషన్ అంటారు. ►ప్రతివ్యక్తి గొంతులో బ్యాక్టీరియా ఉంటుంది. దీన్నే ఓరోఫ్యారింజియల్ ఫ్లోరా అంటారు. ఆ బ్యాక్టీరియా గొంతు నుంచి శ్వాసనాళాల ద్వారా గాలిగదుల వరకు పోవడం వల్ల కూడా నిమోనియా రావచ్చు. ►ఆల్కహాల్ – దీనితో మనుషుల్లో రోగనిరోధక శక్తి (డిఫెన్స్ మెకానిజం) తగ్గుతుంది. ఉదాహరణకు మత్తులో దగ్గడం కూడా తక్కువే. దాంతో ఊపిరితిత్తుల్లో ఉన్న మనకు సరిపడని పదార్థాలు అక్కడే ఉండిపోవడం వల్ల కూడా నిమోనియా రావచ్చు. నిమోనియా లక్షణాలివే... ►దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులు, చలిగా అనిపించటం, కొందరిలో ఆకలి లేకపోవడం ►కఫం పడవచ్చు లేదా పడకపోవచ్చు. పడితే అది... తెల్లగా, పసుపురంగులో ఒక్కోసారి రక్తపు చారికతోనూ కనిపించవచ్చు. ►నిమోనియా తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే ఆయాసం రావచ్చు. ►నిమోనియా ఊపిరితిత్తి పొర (ప్లూరా)కు చేరినప్పుడు ఛాతినొప్పి కూడా రావచ్చు. ఇంటస్టిషియల్ నిమోనియాలో అనే తరహా రకంలో దగ్గు ఉండదు. కాని ఆయాసం మాత్రం ఉంటుంది. దాంతోఒక్కోసారి శ్వాసప్రక్రియ పూర్తిగా ఆగిపోవచ్చు కూడా. ►ఆస్తమాలో పిల్లికూతలు ఉంటాయి. నిమోనియాలో ఉండవు. గాలి పీలుస్తున్నా అది లోపలికి వెళ్లదు. కారణం... గాలి చేరాల్సిన ప్రదేశమైన గాలిసంచిలోని ‘ఎగ్జుడస్’ అనే వ్యర్థాల అడ్డంకి ఉంటుంది. కాబట్టి అక్కడికి ఆక్సిజన్ చేరదు. దాంతో దేహానికి అవసరమైనంత ఆక్సిజన్ అందదు. దాంతో ఊపిరితిత్తులు పని చేయలేని పరిస్థితికి వస్తాయి. దీన్నే ‘హైపాక్సిక్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్’ అంటారు. ►ఊపిరి అందకపోవడంతో చెమటలు పట్టడం, కంగారుగా ఉండటం, గుండె వేగం పెరగడం, బీపీ పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని ‘సివియర్ నిమోనియా’ అంటారు. డాక్టర్ తపస్వి కె. సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ -
పరదాల మాటు నుంచి ప్రమాదాలు!
ఇళ్లలో ఇటు తలుపులకూ, అటు కిటికీలకు పరదాలు (డోర్ అండ్ విండో కర్టెన్స్) అమర్చుకోవడం ప్రైవసీని ఇస్తూనే ఒక రకంగా అందాన్ని ఇనుమడింపజేసే అంశం. మంచి కర్టెయిన్లతో ఇళ్లకు అందునా ప్రధానంగా హాల్స్‌కు ఓ రాజసపు రిచ్ లుక్ కూడా వస్తుంది. అందుకే రంగురంగుల ఆకర్షణీయమైన కర్టెన్స్ అమర్చడం అన్నది బాగా ధనవంతుల ఇళ్ల మాదిరిగానే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాల్లోనూ పెరిగిపోయింది. దీనికి తోడు కొన్నిసార్లు ఇంటి పై సజ్జా (అటక) వంటి చోట్ల పాత సామాన్ల వంటి తరచూ ఉపయోగించిన సామగ్రి ఉంచినప్పుడు, వాటికి అడ్డంగా కూడా నెలల తరబడి అవే కర్టెన్లు వాడటమూ కొన్ని ఇళ్లలో సాధారణంగా చోటు చేసుకునే విషయమే. బట్టతో చేసిన పరదాల(క్లాత్/ఫ్యాబ్రిక్ కర్టెన్స్) నిర్వహణ జరిగా లేకపోతే, వాటితో నాలుగు రకాల హాని చేకూరే ప్రమాదం ఉంది. 1. ఫ్యాబ్రిక్ కర్టెన్లలో అలర్జెన్లూ, డస్ట్‌మైట్స్: కర్టెన్లు మన ఇళ్లలోకి వేడిమి, చలి రాకుండా చేయడంతో పాటు దుమ్మూ, ధూళిని సైతం నిరోధిస్తాయన్న అంశం తెలిసిందే. ఈ క్రమంలో మన తలగడల్లో, పక్కబట్టల్లో చేరినట్టే పరదాల మాటున సైతం డస్ట్‌మైట్స్ మాటు వేస్తాయి. ఒక అంచనా ప్రకారం 30 గ్రాముల దుమ్ములో కనీసం 14,000 డస్ట్‌మైట్స్ ఉంటాయి. ఒక చదరపు గజం విస్తీర్ణంలో కనీసం 1,00,000 (లక్ష) వరకు ఉండవచ్చు. ఒక్కో డస్ట్‌మైట్ తన జీవితకాలంలో 300 మిల్లీగ్రాముల విసర్జకాలను వెలువరిస్తుంది. ఈ విసర్జకాల్లోని ప్రోటీన్స్ మనుషులు శ్వాసించేటప్పుడు ముక్కులోకి వెళ్లి అలర్జీ కలిగిస్తుంది. కేవలం డస్ట్‌మైట్స్ మాత్రమే కాకుండా అనేక రకాల అలర్జెన్స్ సైతం కర్టెన్లలో చోటు సంపాదిస్తాయి. అవి కలిగించే అలర్జీ కారణంగా దగ్గడం, ఎడతెరిపి లేకుండా తుమ్ములు రావడం, అదేపనిగా ముక్కుకారడం, కళ్లెర్రబడటం వంటి రియాక్షన్స్ కనిపిస్తాయి. 2. మౌల్డ్స్, మిల్డ్యూ లాంటి ఫంగస్ చేరడం: కర్టెన్లలో మౌల్డ్స్, మిల్డ్యూ వంటి ఫంగల్ జాతికి చెందిన అతి సూక్ష్మమైన జీవులు చేరతాయి. ఇవి బూజు లాంటివి అనుకోవచ్చు. అవి కలిగించే అలర్జిక్ రియాక్షన్ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. 3. సూక్ష్మజీవులకు నెలవు అత్యంత హానికరమైన అనేక రకాల సూక్ష్మజీవులు (జెర్మ్స్) సైతం పెద్దసంఖ్యలో కరెన్లలో చేరి, అవి కూడా ఆరోగ్యానికి హాని చేస్తాయి. 4. దుమ్ము కణాలు అత్యంత సూక్ష్మమైన దుమ్ము కణాలు కూడా అలర్జీలకు తెచ్చి పెడతాయి. దుమ్ము కణాలు పెద్ద సంఖ్యలో ఉన్నప్పుడు అవి ఊపిరితిత్తులను దెబ్బతీసే విషయం మనకు తెలిసిందే. ప్లాస్టిక్ కర్టెన్ల విషయంలో... మొదట్లో అన్ని ఇళ్లలో, నివాస ప్రదేశాల్లో కేవలం క్లాత్ కర్టెయిన్లు మాత్రమే ఉపయోగించేవారు. కానీ ఇటీవల ఉపయోగాలూ, ఫ్యాషన్ దృష్ట్యా ప్టాస్టిక్తో తయారైనవీ వాడుతున్నారు. ఇక బాత్రూమ్ల విషయానికి వస్తే... అక్కడ అవి నీళ్ల వల్ల పాడైపోకుండా ఉండటం కోసం పూర్తిగా వాటర్‌ప్రూఫ్ మెటీరియల్‌తో తయారయ్యేవే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అవి బట్టలాగే ఎటు పడితే అటు వంగేందుకు వీలుగా వాటిని ‘థాలేట్’ అనే పదార్థంతో తయారు చేస్తారు. దీన్నే వాల్పేపర్లు, ఫ్లెక్సీల్లో కూడా వాడతారు. ఈ తరహా ప్లాస్టిక్ కర్టెన్లలోని హానికర/విష (టాక్సిక్)పదార్థాలు కేవలం అలర్జీలను ప్రేరేపించడం, శ్వాససంబంధ సమస్యలను తెచ్చిపెట్టడం మాత్రమే కాకుండా హార్మోన్ల వ్యవస్థపైన ప్రభావం చూపి, ప్రత్యుత్పత్తి వ్యవస్థను దెబ్బతీస్తాయి. గర్భవతులపై కూడా ప్రతికూలంగా పనిచేయడం వల్ల పుట్టబోయే పిల్లలకు ఏడీహెచ్‌డీ (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ అటెన్షన డిజార్డర్) వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కర్టెన్ల అలర్జీలను నివారించడం ఇలా... ∙డోర్, విండో కర్టెన్ల కోసం వీలైనంతవరకు బట్టతో చేసిన పరదాలు (ఫ్యాబ్రిక్ కర్టెయిన్స్) వాడటమే మంచిది. ∙షవర్ కర్టెన్ల కోసం కూడా ఫ్యాబ్రిక్ మెటీరియల్ వాడటం మంచిదే అయినా... అది తడిసే అవకాశాలు ఎక్కువ కాబట్టి అక్కడ పీవీసీ మెటీరియల్ కంటే... హానికరంకాని అలర్జీ ఫ్రెండ్లీ బ్లైండ్స్ వంటివి వాడటం మేలు. ∙కర్టెన్లు ఫ్యాబ్రిక్ లేదా ప్లాస్టిక్ మెటీరియల్‌తో చేసినవైనా పూర్తిగా మాసిపోయే వరకు ఆగకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచడం అవసరం. ఫ్యాబ్రిక్ మెటీరియల్‌తో తయారైన కర్టెన్స్‌ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉతికి, పూర్తిగా పొడిబారే వరకు ఆరబెట్టడం... అదే విధంగా ప్లాస్టిక్ మెటీరియల్‌తో తయారైన వాటిని డిస్ఇన్ఫెక్టెంట్స్తో తరచూ శుభ్రపరచడం అనివార్యం. ఇలా ప్లాస్టిక్‌తో తయారైనవి వాడాల్సి వచ్చినప్పుడు హైపోఅలర్జెనిక్ వాషబుల్వి వాడాలి. దాంతో వాటిని కూడా సబ్బుతో కడిగినట్టే కడిగే అవకాశం ఉంటుంది. అలర్జీలు వస్తే... కర్టెన్లు లేదా ఇతరత్రా కూడా అలర్జీలు వచ్చినప్పుడు ‘రేడియో అలర్జో సార్బెంట్ టెస్ట్’ (ర్యాస్ట్) అనే ఓ రక్తపరీక్ష ద్వారా అలర్జీ ఉందా, దాని తీవ్రత ఎంత అని తెలుసుకుంటారు. అటు తర్వాత తీవ్రతను బట్టి డాక్టర్ల పర్యవేక్షణలో యాంటీహిస్టమైన్స్ వాడాల్సి ఉంటుంది. తీవ్రత మరీ ఎక్కువగా ఉన్న సందర్భాల్లో డాక్టర్లు చాలా నిశితంగా పరిశీలిస్తూ, అవసరమైన స్టెరాయిడ్స్ మోతాదులతో జాగ్రత్తగా చికిత్స అందిస్తారు. -
ఊపిరితిత్తుల సమస్య.. చండీగఢ్ టూ చెన్నై
సాక్షి, చెన్నై(తమిళనాడు) : ఊపిరితిత్తుల వ్యాధితో అక్క చనిపోయింది, చెల్లెలూ కన్నుమూసింది. అదేరకమైన వ్యాధితో మరణం తప్పదని భయపడిన ఒక యువకుడు చండీగఢ్ నుంచి చెన్నైకి చేరుకున్నాడు. దాదాపు అంపశయ్యకు చేరుకున్న అతడు అరుదైన శస్త్రచికిత్సతో కోలుకున్నాడు. రోగికి శస్త్రచికిత్స చేసిన ఫోర్టీస్‌మలర్ (వడపళని) వైద్యులు డాక్టర్ గోవిని బాలసుబ్రమణియన్ గురువారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.. ‘‘ చండీఘడ్‌కు చెందిన 34 ఏళ్ల కేవల్‌సింగ్ ఊపిరితిత్తుల సమస్య తీవ్రమై సుమారు రెండేళ్లుగా ఇంటి నుంచి బయటకు రాకుండా 24 గంటలూ ఆక్సిజన్ సహాయంతోనే జీవిస్తున్నారు. ఈక్రమంలో 70 కిలోల బరువు ఉండాల్సిన వ్యక్తి 44 కిలోల బరువుకు క్షీణించిపోయాడు. తన సోదరీమణులిద్దరూ ఇదేరకమైన రుగ్మతతో మరణించడంతో భీతిల్లిన అతడు ఆరునెలల క్రితం మా ఆసుపత్రికి వచ్చాడు. ఊపిరితిత్తుల ట్రాన్స్‌ప్లాంట్ చేయడం మినహా మరో మార్గం లేదని నిర్ధారించుకున్నాం. అయితే కరోనా రోజుల్లో అవయవదానం చేసేవారు దొరకడం కష్టమైంది. అదృష్టవశాత్తు మదురైకి చెందిన వ్యక్తి నుంచి సేకరించాం. సుమారు ఏడు గంటలపాటూ శస్త్రచికిత్స చేసి రెండు ఊపిరితిత్తులు కేవల్‌సింగ్‌కు అమర్చిన తరువాత కోలుకుంటున్నాడు..’’ అని తెలిపారు. కాగా సాధారణంగా కాలుష్యం, వంశపారంపర్యం వల్ల ఊపిరితిత్తులు చెడిపోతాయని.. కానీ.. ఈ కేసులో వంశపారం పర్యమే కారణమని వివరించారు. ఆయనతోపాటు ఆసుపత్రి జోనల్ డైరక్టర్ డాక్టర్ సంజయ్ పాండే మీడియా సమావేశంలో పాల్గొన్నారు. చదవండి: వండలూరు జంతు ప్రదర్శనశాలలో ‘వైరస్’ కలకలం.. -
రెండు రోజులకు ఒక సిలెండర్.. ఊపిరితిత్తులకు రంధ్రాలు..
సాక్షి, అర్వపల్లి (సూర్యాపేట) : సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లికి చెందిన లింగంపల్లి లింగమ్మ(60)కి ఊపిరితిత్తులకు రంద్రాలు పడి ఆయసంతో రోజులు వెళ్లదీస్తుంది. అయితే ఆక్సిజన్ పెడితేనే ఆమె బతుకుతుందని వైద్యులు తేల్చడంతో ఆమె కుటుంబీకులు రెండు రోజులకు ఒక సిలిండర్ తెచ్చి పెడుతున్నారు. ఒక సిలిండర్ ఆక్సిజన్ రెండు రోజులపాటు వస్తుంది. ఒక్క సిలిండర్‌కు రూ. 2500 ఖర్చు చేస్తున్నారు. అంటే రోజుకు రూ.1250 చొప్పున ఖర్చు అవుతుంది. కుటుంబీకులు కూలినాలి చేసి ఆమెను బతికిస్తున్నారు. ఆమెకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ఏర్పాటు చేస్తే ఆక్సిజన్ అవసరం ఉండదని.. దాతలు సాయమందించి ఆక్సిజన్ కాన్సంట్రేటర్‌ను అందించాలని ఆమె కుమారుడు సీతారాములు కోరుతున్నారు. ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ మిషన్‌కు రూ. 50వేలు ఖర్చు అవుతుందని తెలిపారు. చదవండి: విషాదం: కరోనా వ్యాక్సిన్‌కు భయపడి యువకుడు.. -
కరోనా వైరస్ ప్రధాన లక్ష్యం మనిషిలోని ఆ భాగాలే..
లండన్: కరోనా వైరస్ ప్రధాన లక్ష్యం మనిషి ఊపిరితిత్తులే. ఈ వైరస్ వల్ల చనిపోతున్న వారిలో ఎక్కువ మందికి ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకింది. వైరస్ బారినపడి, చికిత్సతో కోలుకున్న తర్వాత కూడా 3 నెలలపాటు ఊపిరితిత్తులు దెబ్బతినే ఉంటాయని యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లోని షెఫీల్డ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకుల సంయుక్త అధ్యయనంలో తేలింది. కొన్ని కేసుల్లో ఈ వ్యవధి మరింత ఎక్కువ కాలం.. 9 నెలల వరకూ కొనసాగే ప్రమాదం ఉంటుందని వెల్లడయ్యింది. అంటే కరోనా నుంచి కోలుకున్నాక లంగ్స్ పూర్తిగా సాధారణ స్థితికి చేరాలంటే 3 నెలలకు పైగానే సమయం పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అప్పటిదాకా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. కరోనా అనంతరం ఊపిరితిత్తులకు కొనసాగుతున్న నష్టాన్ని సాధారణ సీటీ స్కాన్, క్లినికల్ పరీక్షల ద్వారా గుర్తించలేమని పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని గుర్తించడానికి పరిశోధకులు ఇమేజింగ్ అనే ఆధునిక విధానాన్ని ఉపయోగించారు. కరోనా బారినపడినప్పటికీ ఆసుపత్రిలో చేరకుండా ఇంట్లోనే చికిత్స పొందినవారిలో దీర్ఘకాలం శ్వాస సమస్య ఉంటే వారి ఊపిరితిత్తులు ఇంకా కోలుకోనట్లే భావించాలని వారు వెల్లడించారు. అయితే, దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందని అంటున్నారు. ఈ స్టడీ వివరాలను రేడియాలజీ జర్నలిజంలో ప్రచురించారు. హైపర్‌పోలరైజ్డ్ జినాన్ ఎంఆర్ఐ (జిఎంఆర్‌ఐ) పరీక్ష ద్వారా ఊపిరితిత్తుల్లో అపసవ్యతలను తెలుసుకోవచ్చని పరిశోధకులు సూచించారు. -
కరోనా సోకిన వారిలో ఆకస్మిక మరణాలకు కారణాలెన్నో..
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం సెకండ్ వేవ్‌లో వైరస్ వ్యాప్తి చాలావేగంగా ఉన్న నేపథ్యంలో కోవిడ్‌తో ఊపిరితిత్తులతో పాటు గుండె సంబంధ సమస్యలు కూడా గణనీయంగా పెరిగినట్లు ప్రముఖ కార్డియాలజిస్ట్ డా.డి.శేషగిరిరావు వెల్లడించారు. గుండెకు సంబంధించి ఈ వైరస్ నేరుగా హార్డ్ కవరింగ్స్, కండరాలు, గుండెకు వెళ్లే రక్తనాళాలు, పరోక్షంగా ఊపిరితిత్తులపై ప్రభావంతో దాని పనితీరు మందగించి గుండెపై ఒత్తిడి పెరిగి హార్ట్ ఫెయిల్యూర్‌కు దారితీస్తోందన్నారు. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డ కట్టి, బీపీ పెరిగి గుండె వైఫల్యానికి దారి తీస్తుందని పేర్కొన్నారు. మొదటి దశలోనూ ఈ పరిస్థితి ఉందని గుర్తు చేశారు. కోవిడ్ తీవ్రత–గుండెపై ప్రభావాలు, ఎదురయ్యే సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ’సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డా.శేషగిరిరావు చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. గుండెకు సంబంధించి అన్నీ ప్రభావితం.. కరోనాతో గుండెకు సంబంధించిన అన్ని అంశాలు, వ్యవస్థలు ప్రభావితమౌతున్నాయి. పెరికార్డియంగా పిలిచే హార్ట్ కవరింగ్, గుండె కండరాలు, గుండెలోని ఎలక్ట్రికల్ కండక్టింగ్ సిస్టం, గుండెకు రక్తాన్ని పంపించే నాళాల్లో రక్తం గడ్డ కడుతుంది. గుండెలోని కుడిభాగం నుంచి చెడు రక్తాన్ని ఊపిరితిత్తుల్లోకి పంపించే పైప్లైన్లు బ్లాక్ అవుతున్నాయి. మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే నాళాలు, కాళ్ల నుంచి చెడు రక్తాన్ని ఊపిరితిత్తుల్లోకి తీసుకెళ్లే సిరల్లో రక్తం గడ్డకట్టడం.. ఇలా రక్త ప్రసరణ వ్యవస్థ ప్రభావితం అవుతోంది. లంగ్స్‌లో సమస్యలతోనూ.. కోవిడ్ కారణంగా ఊపిరితిత్తుల్లో ఫైబ్రోటిక్ ప్యాచేస్ ఉండిపోవడంతో లంగ్ ఫైబ్రోసిస్ రావడం వల్ల ఆయాసం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తగ్గడం లేదు. కొద్దిసేపు నడిచే సరికి ఆయాసం వచ్చేస్తోంది. ఊపిరితిత్తుల పనితీరు మళ్లీ మామూలు స్థాయికి చేరుకోకపోవడంతో బీపీ పెరిగి గుండెపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో గుండెపై ఒత్తిడి పెరిగి హార్ట్ ఫెయిల్యూర్‌కి దారితీయొచ్చు. కాళ్లలోని సిరల్లో ఏర్పడిన బ్లడ్క్లాట్లు పైకి చేరుకుని లంగ్స్‌కు వెళ్లే రక్తనాళాలను బ్లాక్ చేయడంతో పల్మొనరీ త్రాంబో ఎంబాలిజం తరచుగా రిపీట్ అయితే లంగ్స్‌లో బీపీ పెరుగుతుంది. రక్తంలోని కో ఆగ్జిలేషన్ ఫ్యాక్టర్స్ ఎక్కువ కావడంతో గుండె, లంగ్స్, మెదడు ఇలా ఎక్కడైనా రక్తం గడ్డకట్టి స్ట్రోక్‌కు దారితీయొచ్చు. ఇలా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇతర అవయవాలపైనా ప్రభావం పడుతుంది. ఆకస్మిక మరణాలకు కారణాలెన్నో.. వైరస్ కారణంగా మయోకార్డైటిస్ ఏర్పడి గుండె కొట్టుకోవడం ఒక్కసారిగా 200, 300 వెళ్లిపోయి కార్డియాక్ అరెస్ట్‌తో అకస్మాత్తుగా మరణాలు సంభవించే అవకాశాలున్నాయి. దీంతోపాటు లంగ్స్‌కు వెళ్లే రక్తనాళాలు బ్లాక్ కావడం, కాళ్లలోని సిరల్లో ఏర్పడిన రక్తం గడ్డలు లంగ్స్‌లో బ్లాక్ కావడంతో ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది. మెదడుకు వెళ్లే ప్రధానమైన రక్తనాళం సడన్‌గా బ్లాక్ అయితే, మెదడు కేంద్రమైన మెడుల్లా అబ్లాంగేటాకు రక్తప్రసారం తగ్గినా పేషెంట్ కుప్పకూలుతారు. రక్తం గడ్డ కడుతుందిలా.. కోవిడ్ పేషెంట్ల రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టే గుణాన్ని వైరస్ పెంచుతుంది. రక్తనాళంలోని మెత్తని లైనింగ్‌ను డ్యామేజీ చేయడం వల్ల రక్తం గడ్డకట్టే గుణం పెరుగుతుంది. శరీరంపై వైరస్ దాడి చేసినప్పుడు కొన్ని ‘న్యూరో హ్యూమరల్ సబ్ స్టాన్సెస్’రక్త ప్రసరణలోకి వచ్చి వైరస్‌ను అదుపు చేసేందుకు రక్షణ వ్యవస్థగా ఉపయోగపడతాయి. శరీరంలోని న్యూట్రోఫిల్స్ కణాలు వైరస్‌పై దాడి చేసేటప్పుడు కొంత మేర వాస్క్యులర్ ఎండో థీలియంను కూడా డ్యామేజీ చేస్తాయి. ఇలా రక్తం గడ్డకట్టడానికి అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. కరోనా నుంచి కోలుకున్నాక కూడా రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు కొంతకాలం కొనసాగుతాయి. కోవిడ్‌తో గుండెపోటుకు కారణాలెన్నో.. రక్తం గడ్డకట్టడం వల్ల గుండె కండరం డామేజీ కావడంతో హార్ట్ అటాక్‌కు దారి తీస్తుంది. ఇదేకాకుండా గుండె కండరపై వైరస్ డైరెక్ట్‌గా ప్రభావం చూపిస్తుంది ఈ కారణంగా మయో కార్డియారిటీస్ వచ్చి గుండెకు బ్లడ్ పంపింగ్ బలహీనమై లేదా గుండె బలహీనంగా కొట్టుకుని సడన్‌గా హార్ట్ ఫెయిల్యూర్‌కు దారితీస్తుంది. గుండెకు రక్తం ద్వారానే ఆక్సిజన్, గ్లూకోజ్ సరఫరా అవుతున్నందున అది తగ్గిపోతే కణాలు చనిపోయి గుండెపోటుకు కారణమవుతుంది. యంగ్ పేషెంట్స్‌పై ప్రభావం అధికం.. వైరస్ వేరియెంట్లు, మ్యుటేషన్లలో వచ్చిన మార్పులు, కొత్త స్ట్రెయిన్లు తదితర కారణాలతో పాటు యువతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈసారి వారిపై అధిక ప్రభావం పడింది. మొదటి దశ తర్వాత వీరు ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా పబ్‌లు, సినిమాలు, షికార్లలో నిమగ్నమయ్యారు. ఈ సారి వైరస్ లోడ్ ఎక్కువగా ఉండటంతో పాటు కరోనా లక్షణాలు ఆలస్యంగా బయటపడ్డాయి. దీంతో తమకేమి కాదన్న ధీమాతో ఉండటంతో తేరుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒకదానికి మరొకటని పొరబడొద్దు.. ఛాతీ బరువెక్కడం, సరిగ్గా ఊపిరి తీసుకోలేకపోవడం వంటివి వచ్చినప్పుడు అవి ఊపిరితిత్తుల సమస్య అని, గుండెకు సంబంధించినవని నిర్లక్ష్యం చేసినా ప్రమాదమే. ఇలాంటివి వచ్చినప్పుడు వెంటనే సంబంధిత డాక్టర్ల సంప్రదించి తగిన టెస్ట్‌లు చేయించుకోవాలి. కఠిన లాక్డౌన్ మంచిదే.. మరికొన్ని రోజులు కఠినమైన లాక్డౌన్ అమలుతో పాటు వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్లు వేయాలి. ఇప్పటికే వ్యాక్సిన్ వేసుకున్న వారిలో వైరస్ తీవ్రత ఉండట్లేదు. ఇన్ ఫెక్షన్ సోకినా బ్లడ్ క్లాటింగ్, ఆక్సిజన్ తగ్గుదల వంటి మేజర్ కాంప్లికేషన్స్ వారిలో తక్కువగానే ఉంటున్నాయి. ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం కూడా తగ్గుతోంది. గుండెజబ్బు ఉన్న వాళ్లందరూ తమ మందులను యథావిధిగా కొనసాగించాలి. కాగా, వెంటిలేటర్‌పై పెట్టినా పరిస్థితి మరింత విషమించే పేషెంట్లకు ఎక్మో ద్వారా చికిత్స అందించాలి. ఇది ఖరీదైన ట్రీట్మెంట్ అయినా ఇటీవల వీటి వినియోగం బాగానే పెరిగింది. దీనిద్వారా ఊపిరితిత్తులు కొంత కోలుకునే అవకాశముంటుంది. ఇది పెట్టాక నెల తర్వాత కూడా కోలుకోకపోతే గుండె, ఊపిరితిత్తులు మార్పిడి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. -
కరోనా మొదటగా దాడి చేసేది వాటిపైనే..
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి ప్రధానంగా ఊపిరితిత్తులపై అధిక ప్రభావం చూపిస్తోంది. ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే రెండోదశలో లంగ్స్పై వైరస్ అధిక ప్రభావం చూపుతుండటంతో ఊపిరితిత్తులు దెబ్బతినడంతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కరోనా సోకిన తర్వాత తొలుత ప్రభావితమయ్యేది ఊపిరితిత్తులేనని, శ్వాసకోశ వ్యవస్థలోని కణాలపై వైరస్ దాడి చేస్తుందని అమెరికన్ లంగ్ అసోసియేషన్ కూడా స్పష్టం చేసింది. లంగ్ ఫైబ్రోసిస్ సమస్యల వల్ల ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయిన వారికి 24 గంటల పాటు ప్రాణవాయువు ఇవ్వాల్సి వస్తోంది. కొన్ని కేసుల్లో లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ కూడా చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వాటి రక్షణే కీలకమని పేర్కొంది. అందుకే అధిక ప్రభావం.. ‘మన కణాల్లోకి వైరస్ ప్రవేశానికి ఆంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్స్ (ఏసీఈ–2) రిసెప్టార్స్ కీలకంగా వ్యవహరిస్తాయి. ఇతర అవయవాలతో పోలిస్తే ఊపిరితిత్తుల్లో ఈ రిసెప్టార్స్ అధికంగా ఉన్నందున కరోనా వైరస్ అధికంగా లంగ్స్పై ప్రభావితం చూపుతోంది. సెకండ్‌వేవ్‌లో యూత్ ఎక్కువగా దీని బారిన పడుతోంది. కరోనాకు సంబంధించిన ఆలోచన తీరు, తమకేమీ కాదన్న భావన కారణంగా వైరస్ సోకి తీవ్రరూపం దాల్చాకే ఆస్పత్రుల్లో చేరుతున్నారు. వీరంతా సమాజంలో చురుకుగా తిరుగాడుతున్నందున యాక్టివ్ స్ప్రెడర్స్‌గా మారారు. గతంలో న్యూమోనియా ప్రొగెషన్ 7, 8 రోజుల్లో కనిపించగా, ఇప్పుడు 3,4 రోజుల్లో ఆక్సిజన్ ఆవశ్యకతతో పాటు సీటీ స్కోర్స్ పెరిగిపోతున్నాయి. దీనికి వైరస్ రూపాంతరం చెందాక వచ్చిన మ్యుటేషన్లే ప్రధాన కారణం. యువతలో డయాబెటిస్ వచ్చిన విషయం తెలియకపోవడం వల్ల అధిక చక్కెర శాతాలతో ఐసీయూల్లో చేరుతున్నారు. వీరికి సాధారణ మోతాదులో స్టెరాయిడ్స్ ఇస్తున్నా ఫంగల్ ఇన్ ఫెక్షన్లు వస్తున్నాయి. డబ్ల్యూహెచ్‌వో ప్లాస్మా థెరపీ వద్దని చెప్పింది. కొందరికే రెమిడెసి విర్ పనిచేస్తోంది. సెకండ్‌వేవ్‌లో పల్మొనరీ ఫైబ్రోసిస్, న్యూమో థోరక్స్ కేసులు, పల్మొనరీ ఎంబాలిజం, డీబీటీస్ ఈసారి ఇన్ పేషెంట్ల ఊపిరితిత్తుల్లో ఎక్కువగా వస్తున్నాయి. దేశంలో ఎక్కడా ఎక్మో మెషీన్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఫైబ్రోసిస్ కారణంగా లంగ్స్ దెబ్బతినడంతో ఊపిరితిత్తుల మార్పిడి చేయాల్సిన కేసులు పెరుగుతున్నాయి. కరోనా నుంచి కోలుకున్నాక ‘పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్’ కేసులు పెరగనున్నందున దీనికి అవసరమైన చికిత్సకు క్లినిక్‌లు ఇప్పుడు సిద్ధమై ఉండాలి.’ – డా.హరికిషన్ గోనుగుంట్ల, చీఫ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, యశోద ఆస్పత్రి వైరల్ న్యూమోనియా కారణం.. ’కరోనాకు వైరల్ న్యూమోనియా కారణమవుతోంది. దగ్గు, జలుబు లక్షణాలు లేకుండా నేరుగా ఊపిరితిత్తులను చేరుకోవడంతో స్వల్పంగా జ్వరం, ఒళ్లునొప్పులు, నీరసంగానే వారికి అనిపిస్తోంది. వైరస్ నేరుగా లంగ్స్‌ను చేరుకుని రెట్టింపు అవుతోంది. గతంలో ఊపిరితిత్తులపై ప్రభావం తక్కువగా ఉండేది. ఇప్పుడు ఆ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఇన్ ఫెక్షన్ సోకిన వారికి ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతున్నాయి. దీంతో ఆస్పత్రి పాలవుతున్నారు. కరోనా తగ్గాక మళ్లీ బ్యాక్టీరియల్ న్యూమోనియా కారణంగా మరణాలు నమోదు అవుతున్నాయి. పేషెంట్లు ఇళ్లకు వెళ్లాక కూడా ఆయాసం పెరిగితే కరోనా వల్లే అనుకుని స్టెరాయిడ్స్ ఉపయోగించొద్దు. చాలామందిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో రక్తపోటు పడిపోయి షాక్‌కు గురవుతున్న వారున్నారు. భారత్‌లో 30 శాతం మందికి సైలెంట్ టీబీ ఇన్ ఫెక్షన్లు ఉన్నాయి. వారిలో తగిన ఆహారం తీసుకోని వారికి, స్టెరాయిడ్స్ తీసుకున్న వారికి, బయోలాజికల్స్ వాడే వారిలో టీబీ రియాక్టివేట్ అవుతోంది. మ్యుకార్మైకోసిస్ కేసులు ఊపిరితిత్తులను సైతం ప్రభావితం చేస్తున్నాయి. స్టెరాయిడ్స్ అధికంగా ఉపయోగించినవారు, ఐరన్ లెవల్స్ ఎక్కువగా ఉన్న వారికి బ్లాక్ ఫంగస్ సోకుతోంది. ఆక్సిజన్ ఉపయోగిస్తున్నందున డిస్టిల్డ్ వాటర్ పెట్టేటప్పుడు దాని ద్వారా కూడా ఫంగల్ ఇన్ ఫెక్షన్ వచ్చే అవకాశమున్నందున ఈ విషయంలో జాగ్రత్త వహించాలి.’ – డా.విశ్వనాథ్ గెల్లా, పల్మనాలజీ, స్లీప్ డిజార్డర్స్ విభాగం డైరెక్టర్, ఏఐజీ ఆసుపత్రి లంగ్స్‌లో 5 ప్రధాన వ్యాధులు ఊపిరితిత్తులకు సంబంధించి ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీవోపీడీ), అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోం (ఏఆర్డీఎస్), లంగ్ కేన్సర్, టీబీ వంటి ఐదు శ్వాసకోశ వ్యాధులు ఫోరం ఫర్ ది ఇంటర్నేషనల్ రెస్పిరేటరీ సొసైటీ 2017లో గుర్తించింది. కరోనా ఉధృతి పెరిగాక ప్రపంచవ్యాపంగా లంగ్ కేన్సర్ మినహా మిగతా ఊపిరితిత్తులతో ముడిపడిన ఈ సమస్యలు గణనీయంగా పెరిగాయి. కరోనా నుంచి తప్పించుకునేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం. అంతవరకు వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ►న్యూమోనియా, ఏఆర్డీఎస్, సెప్సిస్ల ద్వారా ఊపిరితిత్తులు, గుండె సంబంధిత జబ్బులు, రక్తం గడ్డకట్టడం, మూత్రపిండాలు, ఇతర అవయవాలపై దీర్ఘకాలం దుష్ప్రభావాలు ఉంటాయి. ►కోవిడ్‌తో లంగ్స్ తీవ్రంగా ప్రభావితమైనా సరైన పద్ధతుల్లో చికిత్స, పేషెంట్ తీసుకునే జాగ్రత్తల ఆధారంగా ఊపిరితిత్తులకు నష్టం జరగకుండా చేయొచ్చు. -
కరోనాతో ఊపిరి సమస్యలే కాదు.. మరో పెనుముప్పు కూడా!
న్యూఢిల్లీ: కోవిడ్–19.. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. ఈ వైరస్ ప్రధానంగా గురిపెట్టేది ఊపిరితిత్తుల పైనేనని, దీనివల్ల శ్వాస సంబంధ సమస్యలొస్తాయని, ఊపిరాడక మరణాలు సంభవిస్తున్నాయని ఇప్పటిదాకా భావిస్తున్నాం. నిజానికి కరోనా వైరస్ సోకితే కేవలం ఊపిరితిత్తులు దెబ్బతినడమే కాదు, శరీరంలో రక్తం గడ్డకడుతుందని, కొందరిలో ఇది ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవయవాలను కాపాడాలంటే రక్తం గడ్డలను తక్షణమే తొలగించాల్సి ఉంటుందని చెబుతున్నారు. కరోనా బారినపడి ఆసుపత్రుల్లో చేరిన బాధితుల్లో 14–28 శాతం మందిలో హెచ్చు స్థాయిలో రక్తం గడ్డకట్టినట్లు (డీప్ వీన్ థ్రాంబోసిస్–డీవీటీ), 2–5 శాతం మందిలో స్వల్ప స్థాయిలో (ఆర్టీరియల్ థ్రాంబోసిస్) రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు. కరోనాతో ఉపిరితిత్తుల తరహాలోనే రక్త నాళాలు కూడా దెబ్బతింటున్నాయి. ప్రతివారం సగటు ఐదారు కేసులు ఇలాంటివి వస్తున్నాయని ఢిల్లీలోని సర్ గంగారాం హాస్పిటల్‌కు చెందిన ఎండోవాస్క్యులర్ సర్జన్ అంబరీష్ సాత్విక్ చెప్పారు. టైప్–2 డయాబెటీస్‌తో కరోనా బారినపడిన వారిలో ఈ ముప్పు మరింత ఎక్కువ అని ఢిల్లీలోని ఆకాశ్ హెల్త్‌కేర్ వైద్యుడు అమ్రీష్ కుమార్ తెలిపారు. చదవండి: (చైనాకు కలిసొస్తున్న కరోనా..!) (కోవిడ్ సంక్షోభం మన స్వయంకృతం) -
పసిబిడ్డను కాపాడుకోవాలి.. సహాయం చేయగలరా? (స్పాన్సర్డ్)
ప్రసవం తర్వాత బిడ్డను అపురూపంగా హత్తుకొని లాలించాలని ఏ తల్లి మాత్రం అనుకోదు? కానీ ఆ దంపతులకు నిరాశే ఎదురైంది. పుట్టినప్పటి నుంచి బిడ్డను ఒక్కసారి కూడా ఎత్తుకోలేని దుస్థితి ఏర్పడింది. చిన్నారిని తమ చేతుల్లోకి తీసుకొని మురిసిపోయే అదృష్టం లేకుండా పోయింది. చాలా తక్కువ బరువుతో కనీసం ఊపిరి కూడా సరిగా తీసుకోలేని స్థితిలో ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఆర్థికంగా స్థోమత లేని ఆ దంపతులు నిస్సహాయులుగా ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కెటో (ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్) చికిత్స కోసం డబ్బులు లేని ఎంతో మందికి సాయం అందిస్తోంది. ఆ చిన్నారి సమస్య గురించి ఆ తల్లి ఏం చెబుతుందో ఒక్కసారి తెలుసుకుందాం. నేను, నా భర్త అబ్దుల్ ఎన్నో ఆశలతో నా చిన్నారిని ఈ ప్రపంచంలోకి స్వాగతించాం. చిన్నారి రాక కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూశాం. కానీ మా ఆశలన్నీ అడియాశలయ్యాయి. డెలీవరీ తర్వాత ఒక్కసారి కూడా నా బిడ్డను ఎత్తుకోలేదు. బిడ్డ పుట్టిన కొద్ది సేపటికే తనను ఎన్ఐసీయూ (NICU)కు తరలించారు. ఆ సమయానికి కనీసం నేను స్పృహలో కూడా లేను. ప్రసవం తర్వాత చిన్నారిని ఒక్కసారి కూడా ఎత్తుకొని మురిసిపోలేని దౌర్భాగ్యం వచ్చింది. 700 గ్రాముల బరువున్న నా బిడ్డ శ్వాస తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. కృత్రిమ శ్వాస అందిస్తూ చిన్నారి శరీరం మొత్తం సూదులు, పైపులతో నిండి ఉన్న దృశ్యం చూసి ఎంతటి నరకం అనుభవిస్తున్నామో మాటల్లో చెప్పలేను. పాపం నా బిడ్డకు ఆ నొప్పి భరించలేక పడుతున్న వేదనను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. మరో ఆరు వారాల పాటు చిన్నారిని ఐసీయూలోనే ఉంచాలని డాక్టర్లు, ఇందుకోసం దాదాపు 4.5 లక్షలు అవుతుందని చెప్పారు. డబ్బుల కోసం మేం అన్ని విధాల ప్రయత్నించాము. కానీ ఎక్కడ మాకు డబ్బు దొరకలేదు. మా పేదరికం కారణంగా బాబుకు ఏదైనా జరిగితే మమల్ని మేం ఎప్పటికీ క్షమించుకోలేము. మీరు దయతో ఇచ్చే మొత్తం మా బాబును కాపాడగలవు. దయచేసి మా చిన్నారిని కాపాడండి. కెటో ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్ ద్వారా డబ్బులు లేని చిన్నారులెందరికో చికిత్స అందజేస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా మీ చేతనైనంతా సాయం కెటో ద్వారా విరాళంగా అందించండి. (అడ్వర్టోరియల్) -
రామానాయుడికి అంతిమ వీడ్కోలు
గుంటూరు మెడికల్, న్యూస్‌లైన్: విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తండ్రి లగడపాటి వెంకటరామానాయుడు (75) సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గుంటూరులో నివాసముంటున్న రామానాయుడు అస్వస్థతకు లోనవడంతో నెలరోజుల క్రితం హైదరాబాద్ ఆస్పత్రిలో చేర్పించారు. ఊపిరితిత్తుల్లో నిమ్ముచేరి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. వెంకటరామానాయుడు భౌతిక కాయాన్ని సోమవారం మధ్యాహ్నం గుంటూరు మంగళగిరిరోడ్డులోని సీతారామనగర్ మూడోలైన్లోని స్వగృహంలో సందర్శనార్ధం ఉంచారు. రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసభ సభ్యుడు కె.వి.పి.రామచంద్రరావు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, తెలుగుభాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరి, జిల్లా జడ్జి ఎస్.ఎం.రఫీ, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అవినాష్, ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, కేశినేని నాని, నరేంద్ర చౌదరి, గజల్ శ్రీనివాస్ తదితరులు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఎంపీ లగడపాటిని, కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అనంతరం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమ యాత్రలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, పెద్దసంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. పెద్దకుమారుడు ఎంపీ లగడపాటి అంత్యక్రియలు నిర్వహించారు. వెంకటరామానాయుడుకు భార్య రామలక్ష్మమ్మ, ఓ కుమార్తె, ముగ్గురు కుమారులున్నారు. కుమార్తె పద్మ భర్త భాస్కరరావు ల్యాంకో గ్రూప్ వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. లగడపాటి రాజగోపాల్ ఎంపీగా, లగడపాటి శ్రీధర్ సినీనిర్మాతగా కొనసాగుతున్నారు. మూడో కుమారుడు మధుసూదన్ ల్యాంకో మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు.