కరోనా మొదటగా దాడి చేసేది వాటిపైనే..   | Corona Virus Strong Effect On Lungs In Second Wave | Sakshi
Sakshi News home page

కరోనా మొదటగా దాడి చేసేది వాటిపైనే..  

Published Thu, May 20 2021 1:31 AM | Last Updated on Thu, May 20 2021 1:31 AM

Corona Virus Strong Effect On Lungs In Second Wave - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి ప్రధానంగా ఊపిరితిత్తులపై అధిక ప్రభావం చూపిస్తోంది. ఫస్ట్‌ వేవ్‌తో పోలిస్తే రెండోదశలో లంగ్స్‌పై వైరస్‌ అధిక ప్రభావం చూపుతుండటంతో ఊపిరితిత్తులు దెబ్బతినడంతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కరోనా సోకిన తర్వాత తొలుత ప్రభావితమయ్యేది ఊపిరితిత్తులేనని, శ్వాసకోశ వ్యవస్థలోని కణాలపై వైరస్‌ దాడి చేస్తుందని అమెరికన్‌ లంగ్‌ అసోసియేషన్‌ కూడా స్పష్టం చేసింది. లంగ్‌ ఫైబ్రోసిస్‌ సమస్యల వల్ల ఆక్సిజన్‌ లెవెల్స్‌ పడిపోయిన వారికి 24 గంటల పాటు ప్రాణవాయువు ఇవ్వాల్సి వస్తోంది. కొన్ని కేసుల్లో లంగ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ కూడా చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వాటి రక్షణే కీలకమని పేర్కొంది. 

అందుకే అధిక ప్రభావం.. 
‘మన కణాల్లోకి వైరస్‌ ప్రవేశానికి ఆంజియోటెన్సిన్‌ కన్వర్టింగ్‌ ఎంజైమ్స్‌ (ఏసీఈ–2) రిసెప్టార్స్‌ కీలకంగా వ్యవహరిస్తాయి. ఇతర అవయవాలతో పోలిస్తే ఊపిరితిత్తుల్లో ఈ రిసెప్టార్స్‌ అధికంగా ఉన్నందున  కరోనా వైరస్‌ అధికంగా లంగ్స్‌పై ప్రభావితం చూపుతోంది. సెకండ్‌వేవ్‌లో యూత్‌ ఎక్కువగా దీని బారిన పడుతోంది. కరోనాకు సంబంధించిన ఆలోచన తీరు, తమకేమీ కాదన్న భావన కారణంగా వైరస్‌ సోకి తీవ్రరూపం దాల్చాకే  ఆస్పత్రుల్లో చేరుతున్నారు. వీరంతా సమాజంలో చురుకుగా తిరుగాడుతున్నందున యాక్టివ్‌ స్ప్రెడర్స్‌గా మారారు. గతంలో న్యూమోనియా ప్రొగెషన్‌ 7, 8 రోజుల్లో కనిపించగా, ఇప్పుడు 3,4 రోజుల్లో ఆక్సిజన్‌ ఆవశ్యకతతో పాటు సీటీ స్కోర్స్‌  పెరిగిపోతున్నాయి.

దీనికి వైరస్‌ రూపాంతరం చెందాక వచ్చిన మ్యుటేషన్లే ప్రధాన కారణం. యువతలో డయాబెటిస్‌ వచ్చిన విషయం తెలియకపోవడం వల్ల అధిక చక్కెర శాతాలతో ఐసీయూల్లో చేరుతున్నారు. వీరికి సాధారణ మోతాదులో స్టెరాయిడ్స్‌ ఇస్తున్నా ఫంగల్‌ ఇన్‌ ఫెక్షన్లు వస్తున్నాయి. డబ్ల్యూహెచ్‌వో ప్లాస్మా థెరపీ వద్దని చెప్పింది.  కొందరికే రెమిడెసి విర్‌ పనిచేస్తోంది. సెకండ్‌వేవ్‌లో పల్మొనరీ ఫైబ్రోసిస్, న్యూమో థోరక్స్‌ కేసులు, పల్మొనరీ ఎంబాలిజం, డీబీటీస్‌ ఈసారి ఇన్‌ పేషెంట్ల ఊపిరితిత్తుల్లో ఎక్కువగా వస్తున్నాయి. దేశంలో ఎక్కడా ఎక్మో మెషీన్లు దొరకని పరిస్థితి ఏర్పడింది.  ఫైబ్రోసిస్‌ కారణంగా లంగ్స్‌ దెబ్బతినడంతో ఊపిరితిత్తుల మార్పిడి చేయాల్సిన కేసులు పెరుగుతున్నాయి. కరోనా నుంచి కోలుకున్నాక ‘పోస్ట్‌ కోవిడ్‌ కాంప్లికేషన్స్‌’ కేసులు పెరగనున్నందున దీనికి అవసరమైన చికిత్సకు క్లినిక్‌లు ఇప్పుడు సిద్ధమై ఉండాలి.’ 
– డా.హరికిషన్‌ గోనుగుంట్ల, చీఫ్‌ ఇంటర్వెన్షనల్‌ పల్మనాలజిస్ట్, యశోద ఆస్పత్రి 

వైరల్‌ న్యూమోనియా కారణం.. 
’కరోనాకు వైరల్‌ న్యూమోనియా కారణమవుతోంది. దగ్గు, జలుబు లక్షణాలు లేకుండా నేరుగా ఊపిరితిత్తులను చేరుకోవడంతో స్వల్పంగా జ్వరం, ఒళ్లునొప్పులు, నీరసంగానే వారికి అనిపిస్తోంది. వైరస్‌ నేరుగా లంగ్స్‌ను చేరుకుని రెట్టింపు అవుతోంది. గతంలో ఊపిరితిత్తులపై ప్రభావం తక్కువగా ఉండేది. ఇప్పుడు ఆ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఇన్‌ ఫెక్షన్‌ సోకిన వారికి ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గుతున్నాయి. దీంతో ఆస్పత్రి పాలవుతున్నారు. కరోనా తగ్గాక మళ్లీ బ్యాక్టీరియల్‌ న్యూమోనియా కారణంగా మరణాలు నమోదు అవుతున్నాయి. పేషెంట్లు ఇళ్లకు వెళ్లాక కూడా ఆయాసం పెరిగితే కరోనా వల్లే అనుకుని స్టెరాయిడ్స్‌ ఉపయోగించొద్దు. చాలామందిలో బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లతో రక్తపోటు పడిపోయి షాక్‌కు గురవుతున్న వారున్నారు. భారత్‌లో 30 శాతం మందికి  సైలెంట్‌ టీబీ ఇన్‌ ఫెక్షన్లు ఉన్నాయి. వారిలో తగిన ఆహారం తీసుకోని వారికి, స్టెరాయిడ్స్‌ తీసుకున్న వారికి, బయోలాజికల్స్‌ వాడే వారిలో టీబీ రియాక్టివేట్‌ అవుతోంది. మ్యుకార్‌మైకోసిస్‌ కేసులు ఊపిరితిత్తులను సైతం ప్రభావితం చేస్తున్నాయి. స్టెరాయిడ్స్‌ అధికంగా ఉపయోగించినవారు, ఐరన్‌ లెవల్స్‌ ఎక్కువగా ఉన్న వారికి బ్లాక్‌ ఫంగస్‌ సోకుతోంది. ఆక్సిజన్‌ ఉపయోగిస్తున్నందున డిస్టిల్డ్‌ వాటర్‌ పెట్టేటప్పుడు దాని ద్వారా కూడా ఫంగల్‌ ఇన్‌ ఫెక్షన్‌ వచ్చే అవకాశమున్నందున ఈ విషయంలో జాగ్రత్త వహించాలి.’ 
– డా.విశ్వనాథ్‌ గెల్లా, పల్మనాలజీ, స్లీప్‌ డిజార్డర్స్‌ విభాగం డైరెక్టర్, ఏఐజీ ఆసుపత్రి  

లంగ్స్‌లో 5 ప్రధాన వ్యాధులు
ఊపిరితిత్తులకు సంబంధించి ఆస్తమా, క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌ (సీవోపీడీ), అక్యూట్‌ రెస్పిరేటరీ డిస్ట్రెస్‌ సిండ్రోం (ఏఆర్‌డీఎస్‌), లంగ్‌ కేన్సర్, టీబీ వంటి ఐదు శ్వాసకోశ వ్యాధులు ఫోరం ఫర్‌ ది ఇంటర్నేషనల్‌ రెస్పిరేటరీ సొసైటీ 2017లో గుర్తించింది. కరోనా ఉధృతి పెరిగాక ప్రపంచవ్యాపంగా లంగ్‌ కేన్సర్‌ మినహా మిగతా ఊపిరితిత్తులతో ముడిపడిన ఈ సమస్యలు గణనీయంగా పెరిగాయి. కరోనా నుంచి తప్పించుకునేందుకు వ్యాక్సినేషన్‌ ఒక్కటే మార్గం. అంతవరకు వైరస్‌ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 
►న్యూమోనియా, ఏఆర్‌డీఎస్,  సెప్సిస్‌ల ద్వారా ఊపిరితిత్తులు, గుండె సంబంధిత జబ్బులు, రక్తం గడ్డకట్టడం, మూత్రపిండాలు, ఇతర అవయవాలపై దీర్ఘకాలం దుష్ప్రభావాలు ఉంటాయి. 
►కోవిడ్‌తో లంగ్స్‌ తీవ్రంగా ప్రభావితమైనా సరైన పద్ధతుల్లో చికిత్స, పేషెంట్‌ తీసుకునే జాగ్రత్తల ఆధారంగా ఊపిరితిత్తులకు నష్టం జరగకుండా చేయొచ్చు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement