Pulmonology
-
కనిపించని శత్రువు.. ముందే గుర్తిస్తే మందులతో నయం!
ఎలా సోకుతుంది....? వంశపారంపర్యంగా... దుమ్ము,ధూళిలో ఎక్కువగా ఉండేవారికి పని ప్రదేశాలలో శుభ్రత లేకపోతే ఎలర్జీ, జీవన విధానం లక్షణాలు శరీరంలో గాలిగొట్టాలు ముడుచుకుపోవడం పిల్లికూతలు ఊపిరి ఆడనంతగా ఆయాసం ఎడతెరపిలేకుండా దగ్గు రావడం పెదవాల్తేరు (విశాఖతూర్పు): ప్రపంచంలో పూర్తిగా నయమయ్యే వ్యాధులలో ఆస్తమా ఒకటి. చైనాలో క్రీస్తుపూర్వం 2,600 సంవత్సరంలో ఒక వ్యక్తి దగ్గు, ఆయాసంతో బాధపడడంతో తరువాతి కాలంలో ఇది ఆస్తమా అని వైద్యనిపుణులు గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇచ్చిన పిలుపు మేరకు 1993 సంవత్సరం నుంచి ప్రపంచ దేశాలన్నీ ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని ఏటా మే 3వ తేదీన జరుపుకుంటున్నారు. ఇది అంటువ్యాధి కాకపోవడంతో రోగుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. చినవాల్తేరులోని ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో దాదాపుగా 500 మంది ఆస్తమా రోగులు చికిత్స పొందుతున్నారు. ఈ ఏడాది కేంద్ర ఆరోగ్యశాఖ ఆస్తమా దినోత్సవాన్ని ‘క్లోజింగ్ గేప్స్ ఇన్ ఆస్తమా కేర్’ నినాదంతో జరుపుకోవాలని పిలుపు ఇచ్చింది. ఆస్తమా వ్యాధి సాధారణంగా రెండేళ్ల వయసు నుంచి 78 సంవత్సరాల వయసు గల వ్యక్తులలో కనిపిస్తుంది. రెండు వారాలకు మించి దగ్గు, ఆయాసం వుంటే వెంటనే పల్మనాలజిస్టును సంప్రదించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఇది దీర్ఘకాలిక వ్యాధి కాదని వారు స్పష్టం చేస్తున్నారు. భారతదేశంలో 10 నుంచి 15 శాతం మంది ఆస్తమాతో బాధపడుతున్నారని అంచనా. ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో మొత్తం 288 పడకలు వుండగా, సూపరింటెండెంట్ పర్యవేక్షణలో నలుగురు ప్రొఫెసర్లు, ముగ్గురు అసోసియేట్, పది మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 45మంది పీజీలు, ఏడుగురు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు విధులు నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధి గిరిజనులకు ఎక్కువగా సోకుతుండడం విచారకరం. చికిత్స ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో ఆస్తమా రోగులకు సాధారణంగా రెండునుంచి మూడు వారాల పాటు చికిత్స అందిస్తారు. ఈ రోగులు ఇన్హేలర్, కొన్నిరకాల మాత్రలు వాడాల్సి వుంటుంది. ఆస్తమా సోకితే ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో గుండెజబ్బులకు దారితీసే ప్రమాదం వుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒక్కోసారి వైటల్ ఆర్గానిక్స్, కిడ్నీపై కూడా ప్రభావం చూపే అవకాశం కూడా వుంటుంది. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఆస్తమా రోగులకు అన్నిరకాల చికిత్స ఉచితంగానే అందిస్తున్నారు. తీవ్రమైన ఆస్తమాతో బాధపడే రోగులకు వెంటిలేటర్లపై చికిత్స చేస్తారు. ఏరో థెరపీ, ఇన్హీలర్థెరపీ, నిబ్యులైజేషన్ చికిత్సలతో రోగులకు ఇట్టే నయం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాలనుంచి దిగుమతి చేసుకున్న వైద్య పరికరాలతో చికిత్స అందుబాటులో ఉండడం విశేషం. చాలాకాలంగా ఆస్తమా రోగుల్లో మరణాలు నమోదు కాకపోవడం సంతోషకరం. ఓపీలో సేవలు స్థానిక ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో రోజూ ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటలు, తిరిగి 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ఓపీ విభాగంలో వైద్యసేవలు అందిస్తున్నారు. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో గతనెలనుంచి ఛాతీ ఆస్పత్రిలో మళ్లీ సాధారణ వైద్యసేవలు అన్నీ అందుబాటులోకి వచ్చాయి. ఓపీ విభాగంలో రోజూ 120 మంది వరకు రోగులు వైద్యం పొందుతున్నారు. అవగాహన సదస్సు ప్రపంచ ఆస్తమా దినోత్సవం పురస్కరించుకుని ఆస్పత్రిలో మంగళవారం ఉదయం 10 గంటలనుంచి అవగాహన సదస్సు జరుగింది. వైద్యనిపుణులు ఆస్తమాపై అవగాహన కల్పించి, రోగుల సందేహాలకు సమాధానాలిచ్చారు. ఎయిర్‌కూలర్లు, ఏసీ ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. ఆస్తమాని త్వరగా గుర్తిస్తే చికిత్సతో పూర్తిగా నయం అవుతుంది. అంతర్జాతీయ వైద్యనిపుణుల సూచనలతో ఆధునిక చికిత్స చేస్తున్నాం. –డాక్టర్ ఆర్.సునీల్‌కుమార్, సూపరింటెండెంట్, ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రి, చినవాల్తేరు -
కరోనా మొదటగా దాడి చేసేది వాటిపైనే..
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి ప్రధానంగా ఊపిరితిత్తులపై అధిక ప్రభావం చూపిస్తోంది. ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే రెండోదశలో లంగ్స్పై వైరస్ అధిక ప్రభావం చూపుతుండటంతో ఊపిరితిత్తులు దెబ్బతినడంతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కరోనా సోకిన తర్వాత తొలుత ప్రభావితమయ్యేది ఊపిరితిత్తులేనని, శ్వాసకోశ వ్యవస్థలోని కణాలపై వైరస్ దాడి చేస్తుందని అమెరికన్ లంగ్ అసోసియేషన్ కూడా స్పష్టం చేసింది. లంగ్ ఫైబ్రోసిస్ సమస్యల వల్ల ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయిన వారికి 24 గంటల పాటు ప్రాణవాయువు ఇవ్వాల్సి వస్తోంది. కొన్ని కేసుల్లో లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ కూడా చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వాటి రక్షణే కీలకమని పేర్కొంది. అందుకే అధిక ప్రభావం.. ‘మన కణాల్లోకి వైరస్ ప్రవేశానికి ఆంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్స్ (ఏసీఈ–2) రిసెప్టార్స్ కీలకంగా వ్యవహరిస్తాయి. ఇతర అవయవాలతో పోలిస్తే ఊపిరితిత్తుల్లో ఈ రిసెప్టార్స్ అధికంగా ఉన్నందున కరోనా వైరస్ అధికంగా లంగ్స్పై ప్రభావితం చూపుతోంది. సెకండ్‌వేవ్‌లో యూత్ ఎక్కువగా దీని బారిన పడుతోంది. కరోనాకు సంబంధించిన ఆలోచన తీరు, తమకేమీ కాదన్న భావన కారణంగా వైరస్ సోకి తీవ్రరూపం దాల్చాకే ఆస్పత్రుల్లో చేరుతున్నారు. వీరంతా సమాజంలో చురుకుగా తిరుగాడుతున్నందున యాక్టివ్ స్ప్రెడర్స్‌గా మారారు. గతంలో న్యూమోనియా ప్రొగెషన్ 7, 8 రోజుల్లో కనిపించగా, ఇప్పుడు 3,4 రోజుల్లో ఆక్సిజన్ ఆవశ్యకతతో పాటు సీటీ స్కోర్స్ పెరిగిపోతున్నాయి. దీనికి వైరస్ రూపాంతరం చెందాక వచ్చిన మ్యుటేషన్లే ప్రధాన కారణం. యువతలో డయాబెటిస్ వచ్చిన విషయం తెలియకపోవడం వల్ల అధిక చక్కెర శాతాలతో ఐసీయూల్లో చేరుతున్నారు. వీరికి సాధారణ మోతాదులో స్టెరాయిడ్స్ ఇస్తున్నా ఫంగల్ ఇన్ ఫెక్షన్లు వస్తున్నాయి. డబ్ల్యూహెచ్‌వో ప్లాస్మా థెరపీ వద్దని చెప్పింది. కొందరికే రెమిడెసి విర్ పనిచేస్తోంది. సెకండ్‌వేవ్‌లో పల్మొనరీ ఫైబ్రోసిస్, న్యూమో థోరక్స్ కేసులు, పల్మొనరీ ఎంబాలిజం, డీబీటీస్ ఈసారి ఇన్ పేషెంట్ల ఊపిరితిత్తుల్లో ఎక్కువగా వస్తున్నాయి. దేశంలో ఎక్కడా ఎక్మో మెషీన్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఫైబ్రోసిస్ కారణంగా లంగ్స్ దెబ్బతినడంతో ఊపిరితిత్తుల మార్పిడి చేయాల్సిన కేసులు పెరుగుతున్నాయి. కరోనా నుంచి కోలుకున్నాక ‘పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్’ కేసులు పెరగనున్నందున దీనికి అవసరమైన చికిత్సకు క్లినిక్‌లు ఇప్పుడు సిద్ధమై ఉండాలి.’ – డా.హరికిషన్ గోనుగుంట్ల, చీఫ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, యశోద ఆస్పత్రి వైరల్ న్యూమోనియా కారణం.. ’కరోనాకు వైరల్ న్యూమోనియా కారణమవుతోంది. దగ్గు, జలుబు లక్షణాలు లేకుండా నేరుగా ఊపిరితిత్తులను చేరుకోవడంతో స్వల్పంగా జ్వరం, ఒళ్లునొప్పులు, నీరసంగానే వారికి అనిపిస్తోంది. వైరస్ నేరుగా లంగ్స్‌ను చేరుకుని రెట్టింపు అవుతోంది. గతంలో ఊపిరితిత్తులపై ప్రభావం తక్కువగా ఉండేది. ఇప్పుడు ఆ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఇన్ ఫెక్షన్ సోకిన వారికి ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతున్నాయి. దీంతో ఆస్పత్రి పాలవుతున్నారు. కరోనా తగ్గాక మళ్లీ బ్యాక్టీరియల్ న్యూమోనియా కారణంగా మరణాలు నమోదు అవుతున్నాయి. పేషెంట్లు ఇళ్లకు వెళ్లాక కూడా ఆయాసం పెరిగితే కరోనా వల్లే అనుకుని స్టెరాయిడ్స్ ఉపయోగించొద్దు. చాలామందిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో రక్తపోటు పడిపోయి షాక్‌కు గురవుతున్న వారున్నారు. భారత్‌లో 30 శాతం మందికి సైలెంట్ టీబీ ఇన్ ఫెక్షన్లు ఉన్నాయి. వారిలో తగిన ఆహారం తీసుకోని వారికి, స్టెరాయిడ్స్ తీసుకున్న వారికి, బయోలాజికల్స్ వాడే వారిలో టీబీ రియాక్టివేట్ అవుతోంది. మ్యుకార్మైకోసిస్ కేసులు ఊపిరితిత్తులను సైతం ప్రభావితం చేస్తున్నాయి. స్టెరాయిడ్స్ అధికంగా ఉపయోగించినవారు, ఐరన్ లెవల్స్ ఎక్కువగా ఉన్న వారికి బ్లాక్ ఫంగస్ సోకుతోంది. ఆక్సిజన్ ఉపయోగిస్తున్నందున డిస్టిల్డ్ వాటర్ పెట్టేటప్పుడు దాని ద్వారా కూడా ఫంగల్ ఇన్ ఫెక్షన్ వచ్చే అవకాశమున్నందున ఈ విషయంలో జాగ్రత్త వహించాలి.’ – డా.విశ్వనాథ్ గెల్లా, పల్మనాలజీ, స్లీప్ డిజార్డర్స్ విభాగం డైరెక్టర్, ఏఐజీ ఆసుపత్రి లంగ్స్‌లో 5 ప్రధాన వ్యాధులు ఊపిరితిత్తులకు సంబంధించి ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీవోపీడీ), అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోం (ఏఆర్డీఎస్), లంగ్ కేన్సర్, టీబీ వంటి ఐదు శ్వాసకోశ వ్యాధులు ఫోరం ఫర్ ది ఇంటర్నేషనల్ రెస్పిరేటరీ సొసైటీ 2017లో గుర్తించింది. కరోనా ఉధృతి పెరిగాక ప్రపంచవ్యాపంగా లంగ్ కేన్సర్ మినహా మిగతా ఊపిరితిత్తులతో ముడిపడిన ఈ సమస్యలు గణనీయంగా పెరిగాయి. కరోనా నుంచి తప్పించుకునేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం. అంతవరకు వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ►న్యూమోనియా, ఏఆర్డీఎస్, సెప్సిస్ల ద్వారా ఊపిరితిత్తులు, గుండె సంబంధిత జబ్బులు, రక్తం గడ్డకట్టడం, మూత్రపిండాలు, ఇతర అవయవాలపై దీర్ఘకాలం దుష్ప్రభావాలు ఉంటాయి. ►కోవిడ్‌తో లంగ్స్ తీవ్రంగా ప్రభావితమైనా సరైన పద్ధతుల్లో చికిత్స, పేషెంట్ తీసుకునే జాగ్రత్తల ఆధారంగా ఊపిరితిత్తులకు నష్టం జరగకుండా చేయొచ్చు. -
కరోనా: అంతా ఓకే ఆనుకోవద్దు
కరోనా మహమ్మారి రెండో దశలో కేసులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులపై ఇది ఎక్కువగా ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో కోవిడ్ నుంచి ఊపిరితిత్తులను ఎలా కాపాడుకోవాలి ? కరోనా సోకిన బాధితుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వ్యాధి తీవ్రతకు చేరుకునే దశలో ఎలా అప్రమత్తంగా వ్యవహరించాలి? ఏయే అంశాలపై ఎక్కువ దృష్టిపెట్టాలి తదితర అంశాలపై ఏఐజీ ఆస్పత్రి పల్మనాలజీ విభాగం డైరెక్టర్ డా. విశ్వనాథ్ గెల్లా ‘సాక్షి’ఇంటర్వ్యూలో స్పందించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... – సాక్షి, హైదరాబాద్ ‘స్వల్ప లక్షణాలు ఉన్నప్పటి నుంచే ఇళ్లలోనే ఆయా అంశాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించుకోవాలి. శరీర ఉష్ణోగ్రతలు నియంత్రణలోనే ఉంటే మల్టీ విటమిన్స్ మాత్రలు తీసుకుంటే సరిపోతుంది. లక్షణాలున్నా ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగెటివ్ వచ్చినంత మాత్రాన ఏమీ కాదని రిలాక్స్ కావొద్దు. తమకు కరోనా లేదని ఎవరికివారే నిర్ధారణకు వచ్చేసి, డాక్టర్ల సలహా తీసుకోకుండా.. జ్వరం, జలుబు, ఆక్సిజన్ ఇతర అంశాలను సైతం మానిటరింగ్ చేయకపోవడం వంటి అంశాలు చేటు తెస్తాయి. వ్యాధి ముదిరి లంగ్స్ ప్రభావితమయ్యాక ఆస్పత్రులకు పరిగెత్తేసరికి అవి సీరియస్ కేసులుగా మారుతున్నాయి. తొలిదశలో స్టెరాయిడ్స్ ప్రమాదకరం... జ్వరం 3,4 రోజులకు కూడా తగ్గకపోతే డోలో–650 మాత్రలు తీసుకోవాలి. ఇక మొదటివారంలోనే స్టెరాయిడ్స్ వాడకం చేటుచేస్తోంది. ఈ విషయంలో కొందరు డాక్టర్లు సైతం ప్రారంభ దశల్లోనే స్టెరాయిడ్స్ ఇంకా ఏవేవో మందులు వాడేస్తున్నారు. స్వల్ప లక్షణాలున్నపుడు అధిక ప్రభావం చూపే మందులు వాడకపోవడమే మంచిది. 6 నిమిషాల నడక పరీక్ష.. ‘ఆరు నిమిషాల నడక పరీక్ష’ద్వారా మన ఊపిరితిత్తుల పనితీరును తెలుసుకోవచ్చు. ఇందులో భాగంగా ఆరు నిమిషాలపాటు వేగంగా నడవాలి. అనంతరం పల్స్ ఆక్సీ మీటర్‌తో చెక్ చేసుకుంటే ఆక్సిజన్ స్థాయి 95 కంటే ఎక్కువే ఉండాలి. ఒకవేళ 93 కంటే తక్కువ ఉంటే మాత్రం స్టెరాయిడ్స్ చికిత్స చేయాల్సి ఉంటుంది. విశ్రాంతి తీసుకునేటపుడు కూడా ఆక్సిజన్ స్థాయిల్లో తగ్గుదల ఉంటే వీటిని వాడాలి. మొదటి వారంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గితేనే స్టెరాయిడ్స్ తీసుకోవాలి. ప్రభుత్వం ఇస్తున్న మెడికల్ కిట్‌లో స్టెరాయిడ్స్ మందులున్నా, వాటిని రెండోవారంలోనే డాక్టర్ల సలహాపై వాడాల్సి ఉంటుందని అందరూ గమనించాలి. యాంటీబాడీ కాక్టెయిల్ చికిత్స.. ప్రస్తుతం యాంటీబాడీ కాక్టెయిల్ చికిత్స అందుబాటులోకి వచ్చింది. తొలిదశల్లో అదికూడా షుగర్, బీపీ, గుండె జబ్బు ఇతర కోమార్బిడ్ కండిషన్ ఉన్న వారికి మాత్రమే ఉపయోగించాలి. వ్యాధి తీవ్రస్థా యికి వెళ్లకుండా ఇది ఉపయోగపడుతుంది. సెకండ్ వేవ్‌లో కొంతమంది పేషెంట్లు చాలా త్వరగా 3, 4 రోజుల్లోనే వ్యాధి తీవ్రతకు లోనవుతున్నారు. చిన్న వయసు వారు కూడా ప్రభావితమౌతున్నారు. చికిత్స కంటే పర్యవేక్షణే కీలకం రెండోవారంలో కరోనా తీవ్రస్థాయికి చేరుకోవడానికి ముందే మన శరీరంలో వస్తున్న మార్పులు ఎలా ఉంటున్నాయి? ఎలాంటి ప్రభావం చూపుతున్నాయనే విషయాలపై పర్యవేక్షణ కీలకంగా మారింది. డాక్టర్ల నుంచి చికిత్స తీసుకోకపోయినా మొదటి 2, 3 రోజుల్లో పారాసిటమాల్ తీసుకుంటే సరిపోతుంది. ఏదో జరిగిపోతుందనే భయంతో ముందే ఆ మందులు, ఈ మందులు వాడితే నష్టం జరుగుతుంది. ప్రారంభ దశలో మల్టీ విటమిన్స్, డోలో–650 తీసుకుంటే చాలు. ఆక్సిజన్ లెవెల్స్ సరిగ్గానే ఉంటే స్టెరాయిడ్స్ వాడకూడదు. అప్పటికీ జ్వరం, ఇతర లక్షణాలు కొనసాగడం లేదా ఎక్కువ కావడం వంటివి జరిగితే చికిత్స తీసుకోవాలి. ప్రాణాయామంతో మేలు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల్లో కొంతమేర భయం ఏర్పడింది. ఎక్కువగా మాస్కులు పెట్టుకుంటున్నారు. అయితే వాటిని సరిగా ధరించడంతో పాటు భౌతికదూరం పాటించడం గతంలో కంటే ఇప్పుడే ఎక్కువ ముఖ్యం. హ్యాండ్ శానిటైజేషన్ తప్పనిసరిగా కొనసాగించాలి. మల్టీ విటమిన్స్ సప్లిమెంట్స్. బ్రీథింగ్ ఎక్సర్సైజులు, ప్రాణాయామం వంటి వాటితో శ్వాస తీసుకునే తీరులో గుణాత్మక మార్పులొస్తాయి. ఇవి ఊపిరితిత్తులకు మంచి చేస్తాయి. అంతా వ్యాక్సిన్ వేసుకోవాలి.. అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. టీకా కోసం వెళ్లినపుడు ఎన్–95 మాస్కులు ధరించాలి. అవి అందుబాటులో లేకపోతే డబుల్ క్లాత్ మాస్కు లు తప్పకుండా వాడాలి. ప్రస్తుతం వ్యాధి వ్యాప్తి, ప్రభావం తీవ్రంగా మారుతున్న తరుణంలో మాస్కులు పెట్టుకోవడం అత్యంత అవసరం’. -
నా భార్య నన్ను తీవ్రంగా అనుమానిస్తోంది..
సైకియాట్రి కౌన్సెలింగ్ నాకు హోదాకు, డబ్బుకు ఏ లోటూ లేదు. మా పిల్లలిద్దరూ యూఎస్‌లో చదువుకుంటున్నారు. నా వయసు 51. నాకున్న సమస్యల్లా ఒకటే. నా భార్య నన్ను తీవ్రంగా అనుమానిస్తోంది. అయిదేళ్ల క్రితం ఒక ఫ్యామిలీ ఫంక్షన్‌కి వెళ్లినప్పుడు మా బంధువొకామె పూర్వ పరిచయం కొద్దీ నాతో కొంచెం చనువుగా మెలిగింది. అప్పటినుంచి ఆమెలో అనుమానం మొదలైంది. దాంతో మానసికంగా, శారీరకంగా నన్ను దూరం పెట్టేసింది. ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నా సరే, తనతోనే మాట్లాడుతున్నానని అనుమానిస్తోంది. కనీసం నేను తనని పొగిడినా కూడా మనసులో ఆమెను ఊహించుకుంటూ పైకి నన్ను పొగుడుతున్నారు అంటుంది. తీవ్రమైన డిప్రెషన్లో ఉండి, తను ఇబ్బంది పడుతూ, నన్ను ఇబ్బంది పెడుతోంది. మేమిద్దరం కలిసి తనని చంపడానికి పన్నాగాలు పన్నుతున్నామని తన భయం. నిజానికి నాది కానీ, నా భార్య అనుమానిస్తున్న ఆమెది కానీ అటువంటి స్వభావం కాదు. చాలా సున్నితమైన మనస్కులం. ఎవరితో చెప్పుకోవాలో, ఎలా చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియడం లేదు. దయచేసి సలహా ఇవ్వండి. - సురేష్ చంద్ర, విజయవాడ మీరు చెబుతున్న విషయాలను బట్టి మీ భార్య చాలా తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతోందని అర్థమవుతోంది. దీనిని మెడికల్ పరిభాషలో పీడీడీ అంటారు. అంటే పర్సిస్టెంట్ డిల్యూజనల్ డిజార్డర్ అని అర్థం. దీనిలో ఉన్న ప్రమాదకరమైన కోణం ఏమిటంటే పేషెంట్ పైకి మామూలుగానే కనిపిస్తారు. అన్ని పనులూ చేసుకోగలుగుతారు. సమస్యల్లా ఒక్కటే... వాళ్లు నమ్ముతున్న ఒకే విషయంపై చాలా బలంగా ఉంటారు. ఎవరు ఎంతగా నచ్చజెప్పినా పట్టించుకోరు. బోడితలకూ మోకాలికీ ముడివేసినట్లుగా తమ అనుమానానికి అర్థంపర్థంలేని ఆధారాలను వెతకడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కుటుంబ పెద్దలెవరైనా వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించినప్పుడు మరింతగా రెచ్చిపోతారు. ఒక్కోసారి అందరూ కలిసి ఏకమై తమను హత్య చేసేందుకు పథకం వేస్తున్నారేమో అన్నంతగా అనుమానిస్తారు. ఆత్మహత్యకు కూడా ప్రయత్నించే ప్రమాదం ఉంది. అయితే ఇది చాలా సాధారణమైన సమస్యే. మీరేమీ అందోళన పడనక్కరలేదు. మీరిద్దరూ కలసి ఒక ఫ్యామిలీ కౌన్సెలర్ వద్ద మ్యారేజ్ కౌన్సెలింగ్ తీసుకోవాలి. ఆ తర్వాత సైకియాట్రిస్ట్‌ను సంప్రదించాలి. సైకియాట్రిస్ట్ కౌన్సెలింగ్, మందులతో వైద్యం చేస్తారు. సమస్య తీవ్రతను బట్టి ఆమె తిరిగి మామూలుగా అవడానికి కొంత సమయం పట్టవచ్చు. డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ లూసిడ్ డయాగ్నస్టిక్స్ బంజారాహిల్స్ హైదరాబాద్ పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా పాపకు హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. డాక్టర్ కొన్ని పరీక్షలు చేయించమన్నారు. వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయించాలని కూడా అన్నారు. రిపోర్టులు మీకు పంపుతున్నాం. మా పాపకు ఉన్న సమస్య తీవ్రత చెప్పండి. అలాగే మాకు తగిన పరిష్కారం చూపండి. - బి. ప్రకాష్, విశాఖపట్నం మీరు చెప్పిన విషయాలు, రిపోర్టులు పరిశీలించాక మీ పాపకు ట్రంకస్ ఆర్టరియోసిస్ అనే పుట్టుకతో వచ్చే గుండె జబ్బు ఉందని చెప్పవచ్చు. ఇది కాస్త తీవ్రమైన, ఒకింత అరుదైన సమస్య. అన్ని రకాల గుండె సమస్యలలో ఇది 1.4 శాతం మాత్రమే. ఈ సమస్య ఉన్న పిల్లల్లో మూడు నుంచి ఆర్నెల్ల లోపు ఆపరేషన్ చేయించకపోతే పరిస్థితి విషమించే అవకాశం చాలా ఎక్కువ. ఈ కండిషన్‌కు - కొన్ని అదనపు సదుపాయాలు, నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్న కొన్ని ఆసుపత్రులలో మాత్రమే చికిత్స చేయించడానికి వీలవుతుంది. మీ పాపకు కాండ్యూట్ (ఆపరేషన్‌లో ఉపయోగించే ఒక ట్యూబ్) అమర్చడం లేదా అత్యాధునికమైన కోర్ మ్యాట్రిక్స్ అనే పదార్థాన్ని ఉపయోగించి ఆపరేషన్ చేయించాల్సిరావడం అవసరమవుతుంది. కాబట్టి ఇది కొంత ఖర్చుతో కూడుకున్న వైద్యమే. ఇప్పుడు మీ పాప ఆపరేషన్ చేసే స్థితిలో ఉందా, లేదా అన్నది కూడా చూడాలి. ఎందుకంటే ఊపిరితిత్తులు సహకరించకపోతే ఆపరేషన్ కొంత కష్టమవుతుంది. ఈ ఆపరేషన్ సదుపాయం హైదరాబాద్‌లో కూడా పీడియాట్రిక్ కార్డియాలజీ అనే ప్రత్యేక విభాగం ఉన్న చోట్ల మాత్రమే లభ్యమవుతుంది. ఇక ఖర్చు విషయానికి వస్తే ఆరోగ్యశ్రీ వంటి పథకాల కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయం అందించే వీలుంది. అది మీకు వర్తిస్తుందా, లేదా అన్నది చూడండి. మీరు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పీడియాట్రిక్ కార్డియాక్ స్పెషాలిటీ సెంటర్ ఉన్న ఆసుపత్రిలో ఒకసారి సంప్రదించండి. మా పాపకు ఈ నెలతో ఆర్నెల్లు నిండుతాయి. పిల్లలకు ఆర్నెల్లు దాటాక ఎలాంటి ఆహారం ఇవ్వాలో తెలియజేయండి. - అడుసుమల్లి మంజూష, హైదరాబాద్ చిన్నపిల్లలకు ఆర్నెల్లు దాటాక తల్లిపాలతో పాటు అన్నం, గోధుమల వంటి గింజధాన్యాలు (సిరియెల్స్), ఆపిల్, సపోటా వంటి పళ్లు, పప్పుధాన్యాలు (దాల్స్), కూరలలో క్యారట్, బాగా ఉడికించిన దుంపలు వంటివి ఇవ్వవచ్చు. పిల్లలకు ఆర్నెల్ల వయసు వచ్చాక మంచినీళ్లు తాగించడం అవసరం. ఈ వయసు పిల్లలకు పళ్లను జ్యూస్ రూపంలో ఇవ్వడం సరికాదు. పిల్లల ఆహారం తయారీకి కుదరని, అత్యవసర సమయాల్లో మాత్రమే - మార్కెట్లో దొరికే పిల్లల ఆహార పదార్థాలు (రెడీమేడ్ సిరియెల్ బేస్డ్ ఫుడ్స్) ను ఇవ్వవచ్చు. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ పల్మనాలజీ కౌన్సెలింగ్ నా వయసు 46 సంవత్సరాలు. గత వారం రోజుల నుండి విపరీతమైన దగ్గు, శ్లేష్మం పడటం, ఊపిరి పీల్చడంలో కష్టం, నాలుగడుగులు నడిస్తే ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలుంటే డాక్టర్‌ను కలిశాను. ఆయన పరీక్షలు నిర్వహించి, నేను సీవోపీడీ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. దయచేసి దీనికి చికిత్స మార్గాలు తెల్పగలరు. - పరమేశం, విజయనగరం సీవోపీడీ అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. అంటే మీ ఊపిరితిత్తులలో కొంత అవరోధాలు కలిగించే వ్యాధి అన్నమాట. ఈ వ్యాధికి దీర్ఘకాలిక చికిత్స అవసరమవుతుంది. ఈ అవరోధమనేది మీ ఊపిరితిత్తులలో లోనికి , బయటకి గాలిని సరఫరా చేసే వాయునాళాలలో ఏర్పడుతుంది. మీ వాయు నాళాలు సన్నబడతాయి. అందుచేత వాటిగుండా వెళ్లగల గాలి పరిమాణం కూడా తగ్గిపోతుంది. ఇంకా, గాలి మీ ఊపిరితిత్తుల ద్వారా బయటికి సరిగా వెళ్లదు. ఈ కారణంగా మీ ఊపిరితిత్తులు బరువుగానూ, మీ ఛాతీ పట్టేసినట్లుగానూ ఉండి, మీకు శ్వాస ఆడనట్లు అనిపిస్తుంది. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటంటే మీరు పొగ తాగుతున్నట్లయితే వెంటనే స్మోకింగ్ మానేయాలి. మీ ఊపిరితిత్తులకు మీరు సహాయం చేయాలనుకుంటే ఇదే అతి ముఖ్యమైన పని. మీ డాక్టర్‌గారు చెప్పిన విధంగా పరీక్షలు చేయించుకోండి. వాయునాళాలని వెడల్పు చేసే మందులని బ్రాంకోడైలేటర్స్ అంటారు. మీ ఊపిరితిత్తుల్లో గల వాయునాళాల చుట్టూ ఉన్న చిన్న చిన్న ఖండాలను గట్టిపరిచే చర్యలను అవ రోధించి, ఇంకా వెనక్కి మళ్లించడం ద్వారా ఈ మందులు పనిచేస్తాయి. ఈవిధంగా ఇవి మీ వ్యాధికి కొంత ఉపశమనం కల్పిస్తాయి. తద్వారా మీరు కాస్త సులువుగా శ్వాస తీసుకునేలా చూస్తాయి. వ్యాధి పూర్తిగా నయమయ్యేవరకు క్రమం తప్పకుండా మందులు వాడాలి. ఇన్ఫెక్షన్ వచ్చినా, ఆయాసం, దగ్గు పెరిగినా వెంటనే హాస్పిటల్‌కు వెళ్లాలి. ఇలాంటి పరిస్థితుల్లో యాంటీబయోటిక్స్, కృత్రిమ ఆక్సిజన్, అవసరమైన మందులు ఇచ్చి చికిత్స చేస్తారు. దీర్ఘకాలికంగా ఆయాసంతో బాధపడేవారు ఊపిరితిత్తుల రిహాబిలిటేషన్ వ్యాయామాలు చేయాలి. ఇందుకోసం పల్మనాలజిస్ట్, రెస్పిరేటరీ టెక్నిషియన్ సూచనలు తీసుకోవడం అవసరం. డాక్టర్ సందీప్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్ నాంపల్లి హైదరాబాద్