ఎలా సోకుతుంది....?
వంశపారంపర్యంగా...
దుమ్ము,ధూళిలో ఎక్కువగా ఉండేవారికి
పని ప్రదేశాలలో శుభ్రత లేకపోతే
ఎలర్జీ, జీవన విధానం
లక్షణాలు
శరీరంలో గాలిగొట్టాలు ముడుచుకుపోవడం
పిల్లికూతలు
ఊపిరి ఆడనంతగా ఆయాసం
ఎడతెరపిలేకుండా దగ్గు రావడం
పెదవాల్తేరు (విశాఖతూర్పు): ప్రపంచంలో పూర్తిగా నయమయ్యే వ్యాధులలో ఆస్తమా ఒకటి. చైనాలో క్రీస్తుపూర్వం 2,600 సంవత్సరంలో ఒక వ్యక్తి దగ్గు, ఆయాసంతో బాధపడడంతో తరువాతి కాలంలో ఇది ఆస్తమా అని వైద్యనిపుణులు గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇచ్చిన పిలుపు మేరకు 1993 సంవత్సరం నుంచి ప్రపంచ దేశాలన్నీ ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని ఏటా మే 3వ తేదీన జరుపుకుంటున్నారు. ఇది అంటువ్యాధి కాకపోవడంతో రోగుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. చినవాల్తేరులోని ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో దాదాపుగా 500 మంది ఆస్తమా రోగులు చికిత్స పొందుతున్నారు. ఈ ఏడాది కేంద్ర ఆరోగ్యశాఖ ఆస్తమా దినోత్సవాన్ని ‘క్లోజింగ్ గేప్స్ ఇన్ ఆస్తమా కేర్’ నినాదంతో జరుపుకోవాలని పిలుపు ఇచ్చింది.
ఆస్తమా వ్యాధి సాధారణంగా రెండేళ్ల వయసు నుంచి 78 సంవత్సరాల వయసు గల వ్యక్తులలో కనిపిస్తుంది. రెండు వారాలకు మించి దగ్గు, ఆయాసం వుంటే వెంటనే పల్మనాలజిస్టును సంప్రదించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఇది దీర్ఘకాలిక వ్యాధి కాదని వారు స్పష్టం చేస్తున్నారు. భారతదేశంలో 10 నుంచి 15 శాతం మంది ఆస్తమాతో బాధపడుతున్నారని అంచనా. ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో మొత్తం 288 పడకలు వుండగా, సూపరింటెండెంట్ పర్యవేక్షణలో నలుగురు ప్రొఫెసర్లు, ముగ్గురు అసోసియేట్, పది మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 45మంది పీజీలు, ఏడుగురు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు విధులు నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధి గిరిజనులకు ఎక్కువగా సోకుతుండడం విచారకరం.
చికిత్స
ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో ఆస్తమా రోగులకు సాధారణంగా రెండునుంచి మూడు వారాల పాటు చికిత్స అందిస్తారు. ఈ రోగులు ఇన్‌హేలర్, కొన్నిరకాల మాత్రలు వాడాల్సి వుంటుంది. ఆస్తమా సోకితే ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో గుండెజబ్బులకు దారితీసే ప్రమాదం వుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒక్కోసారి వైటల్ ఆర్గానిక్స్, కిడ్నీపై కూడా ప్రభావం చూపే అవకాశం కూడా వుంటుంది.
డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఆస్తమా రోగులకు అన్నిరకాల చికిత్స ఉచితంగానే అందిస్తున్నారు. తీవ్రమైన ఆస్తమాతో బాధపడే రోగులకు వెంటిలేటర్లపై చికిత్స చేస్తారు. ఏరో థెరపీ, ఇన్‌హీలర్‌థెరపీ, నిబ్యులైజేషన్ చికిత్సలతో రోగులకు ఇట్టే నయం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాలనుంచి దిగుమతి చేసుకున్న వైద్య పరికరాలతో చికిత్స అందుబాటులో ఉండడం విశేషం. చాలాకాలంగా ఆస్తమా రోగుల్లో మరణాలు నమోదు కాకపోవడం సంతోషకరం.
ఓపీలో సేవలు
స్థానిక ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో రోజూ ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటలు, తిరిగి 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ఓపీ విభాగంలో వైద్యసేవలు అందిస్తున్నారు. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో గతనెలనుంచి ఛాతీ ఆస్పత్రిలో మళ్లీ సాధారణ వైద్యసేవలు అన్నీ అందుబాటులోకి వచ్చాయి. ఓపీ విభాగంలో రోజూ 120 మంది వరకు రోగులు వైద్యం పొందుతున్నారు.
అవగాహన సదస్సు
ప్రపంచ ఆస్తమా దినోత్సవం పురస్కరించుకుని ఆస్పత్రిలో మంగళవారం ఉదయం 10 గంటలనుంచి అవగాహన సదస్సు జరుగింది. వైద్యనిపుణులు ఆస్తమాపై అవగాహన కల్పించి, రోగుల సందేహాలకు సమాధానాలిచ్చారు. ఎయిర్‌కూలర్లు, ఏసీ ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. ఆస్తమాని త్వరగా గుర్తిస్తే చికిత్సతో పూర్తిగా నయం అవుతుంది. అంతర్జాతీయ వైద్యనిపుణుల సూచనలతో ఆధునిక చికిత్స చేస్తున్నాం.
–డాక్టర్ ఆర్.సునీల్‌కుమార్, సూపరింటెండెంట్, ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రి, చినవాల్తేరు
Comments
Please login to add a commentAdd a comment