పాదాలు కదలడం లేదా? అయితే గులియన్‌ బ్యారీ సిండ్రోమ్‌!  | Guillain-Barre Disease Symptoms And Treatment | Sakshi
Sakshi News home page

పాదాలు కదలడం లేదా? అయితే గులియన్‌ బ్యారీ సిండ్రోమ్‌! 

Published Sun, Jan 9 2022 10:26 PM | Last Updated on Sun, Jan 9 2022 10:53 PM

Guillain-Barre Disease Symptoms And Treatment - Sakshi

కొంతమందిలో కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు వచ్చి తగ్గాక... ఎందుకోగానీ.... వారి సొంత వ్యాధినిరోధక శక్తే వాళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అలాంటి ఓ రుగ్మతే ‘గులియన్‌ బ్యారీ సిండ్రోమ్‌’. ఇందులో బాధితుడు చూడ్డానికి అంతా బాగానే కనిపిస్తుంటాడు. కానీ అతడి దేహం కాళ్ల దగ్గర్నుంచి అచేతనం కావడం మొదలై క్రమంగా పైపైకి పాకుతూ ఉంటుంది. గతంలో చాలా అరుదుగా మాత్రమే కనిపించే ఈ రుగ్మత ఇటీవల చాలామందిలో కనిపిస్తోంది. సంక్షిప్తంగా ‘జీబీ సిండ్రోమ్‌’ అని పిలిచే... ‘గులియన్‌ బ్యారీ సిండ్రోమ్‌’  గురించి తెలిపే కథనమిది. 

ఓ చిన్న కేస్‌స్టడీ ద్వారా గులియన్‌ బ్యారీ సిండ్రోమ్‌ తీవ్రత ఎలా ఉంటుందో చూద్దాం. జీవన్‌ టాయిలెట్‌కు వెళ్లాడు. పనిపూర్తయ్యాక లేచి నిలబడి ఎప్పటిలాగే బయటకు వచ్చేద్దామనుకున్నాడు. కానీ ఎంత ప్రయత్నించినా పాదాలు కదలడం లేదు. అత్యంత కష్టంగా బయటకు వచ్చాడు. కాళ్లెందుకు స్వాధీనంలో లేవో తెలియలేదు. దాంతో హాస్పిటల్‌లో చేరాడు. తొలుత పాదాలూ, కాళ్లే కాదు... క్రమంగా నడుమూ... అటు తర్వాత  చేతులు, మెడ... ఇలా దేహంలోని అన్ని అవయవాలూ అచేతనమైపోవడం మొదలైంది. బయటకు కనిపిస్తున్న ఆ లక్షణాలను గమనించిన డాక్టర్లు దాన్ని ‘గులియన్‌ బ్యారీ సిండ్రోమ్‌’గా భావించారు.  
కారణం... 

మనకు ఏవైనా వైరస్‌ల వల్ల జ్వరం/ఇన్ఫెక్షన్‌ వచ్చినప్పుడు మనలోని రోగనిరోధక శక్తి యాంటీబాడీస్‌ను ఉత్పత్తి చేసి, ఆ జ్వరానికి/ఇన్ఫెక్షన్‌కు కారణమైన వైరస్‌ను తుదముట్టిస్తుంది. కరోనా సోకినప్పుడు కూడా యాంటీబాడీస్‌ ఆ వైరస్‌ను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తాయి. ఈ క్రమంలో ఒక్కోసారి అది నరాలనూ దెబ్బతీసే అవకాశముంది. అలా జరిగినప్పుడు ‘గులియన్‌ బ్యారీ సిండ్రోమ్‌’ కనిపించవచ్చు. అయితే నరాలు ఏ మేరకు దెబ్బతిన్నాయన్న విషయం మనలో తయారైన యాంటీబాడీస్‌ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది.

గులియన్‌ బ్యారీ సిండ్రోమ్‌ వచ్చిన 70 శాతం మందిలో సాధారణంగా రెండు వారాల్లో వారు నడవలేని పరిస్థితికి చేరుకునే అవకాశాలు ఎక్కువ. దాదాపు ఒక నెల రోజులు మొదలుకొని ఆర్నెల్ల తర్వాత వారు కోలుకుని పూర్తిగా నార్మల్‌ కాగలరు. అయితే 10 శాతం మందిలో మాత్రం సమస్య మరింత ముదిరి శ్వాస తీసుకోడానికి ఉపయోగపడే కండరాలు కూడా చచ్చుబడిపోతాయి. దాంతో ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఇలాంటి వారు మింగే శక్తిని కూడా కోల్పోతారు. మెడలను నిలపలేరు. బాధితులు ఇలాంటి దశకు చేరుకుంటే మాత్రం వెంటిలేటర్‌ పెట్టి చికిత్స అందించాలి. ఇక మిగతా 20 శాతం మందిలో ప్రభావం పెద్దగా ఉండదు. 

ఎందుకిలా జరుగుతుందంటే...? 
మన మెదడు... దేహంలోని ప్రతి అవయవాన్నీ నియంత్రిస్తూ ఉంటుందన్న విషయం తెలిసిందే. మెదడు నుంచే నరాల ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకూ, కండరాలకు ఆదేశాలూ, సమాచారాలూ అందుతూ ఉంటాయి.  ఈ నరాలన్నింటిపైనా ‘మైలీన్‌’ అనే పొర (మైలీన్‌ షీత్‌) ఉంటుంది. వాస్తవానికి ఈ పొర కారణంగానే ‘కదలిక’లకు సంబంధించిన సమాచారమంతా ఎలక్ట్రికల్‌ సిగ్నల్స్‌ రూపంలో అయా అవయవాలకు అందుతూ ఉంటుంది. 

ఒక్కోసారి మన వ్యాధినిరోధకతకు దోహదపడే యాంటీబాడీస్‌... ఏ కారణం వల్లనో ఈ ‘మైలీన్‌’ పొరను దెబ్బతీస్తాయి. ఫలితంగా మెదడు నుంచి అందే ఎలక్ట్రిక్‌ సిగ్నల్స్‌ ప్రసారానికి అంతరాయం కలుగుతుంది. దాంతో కండరాలను కదిలించడం సాధ్యం కాదు. ఆ విధంగా మైలీన్‌ పొర దెబ్బతిన్న ప్రతి కండరమూ అచేతనమవుతుంది. 

తీవ్రత స్థాయులు 
వ్యాధి తీవ్రత చాలా స్వల్పం మొదలు కొని అత్యంత తీవ్రం వరకు ఉండవచ్చు.  స్వల్పంగా ఉంటే నడవడం కష్టం కావచ్చు. కానీ సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే  బాధితుడు పూర్తిగా మంచానికే పరిమితమవుతాడు. తీవ్రత మరింత ఎక్కువగా ఉంటే  కాళ్లూ, చేతులకు తిమ్మిర్లు, స్పర్శ తెలియకపోవడం జరగవచ్చు. సాధారణంగా కాళ్లూచేతులు కదిలించడం అన్న పనులు మన ప్రమేయంతో మనమే చేసేవి. చాలా సందర్భాల్లో జీబీ సిండ్రోమ్‌లో మన ప్రమేయం లేకుండా జరిVó  కీలక కార్యకలాపాలు చాలా అరుదుగా ప్రభావితమవుతాయి. ఒకవేళ అలా జరిగినçప్పుడు కొందరిలో గుండె స్పందనల వేగం తగ్గడం, బీపీ హెచ్చుతగ్గులకు గురికావడం, ముఖంలోంచి వేడి ఆవిర్లు వస్తున్నట్లుగా అనిపిసించడం, తీవ్రంగా చెమటలు పట్టడం జరగవచ్చు. కాస్తంత అరుదుగా మూత్రం కండరాలపైనా పట్టుకోల్పోవడయూ జరగవచ్చు. 
ఒకసారి వ్యాధి  కనిపించడం మొదలయ్యాక అది ఏడు నుంచి పద్నాలుగు రోజుల్లో  క్రమంగా పెరుగుతూ, తీవ్రమవుతూ పోవచ్చు. బాధితులు కొంతకాలం అచేతనంగా ఉండి... ఆ తర్వాత మళ్లీ కోలుకోవడం మొదలుకావచ్చు. అయితే కొంతమందిలో శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించిన  సిగ్నల్స్‌ అందకపోవడం జరిగితే... అది ప్రమాదకరమైన పరిస్థితికి దారితీవయచ్చు. 

చికిత్స : గులియన్‌ బ్యారీ సిండ్రోమ్‌ వచ్చిన రోగులు నడవలేని పరిస్థితుల్లో ఉన్నా, ఊపిరి తీసుకోడానికి ఇబ్బంది పడుతున్నా, బీపీలో హెచ్చుతగ్గులు, గుండె స్పందనల్లో లయ తప్పుతున్నా (అటనామిక్‌ న్యూరోపతి ఉన్నా) వాళ్లకు జీబీ సిండ్రోమ్‌కు ఇవ్వాల్సిన ప్రత్యేక చికిత్స అవసరం పడుతుంది. ప్రస్తుతం బాధితులకు రెండు రకాల ప్రధాన చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. అవి...  
ఇమ్యూనోగ్లోబ్యులిన్‌ చికిత్స: బాధితుడి బరువు ఆధారంగా నిర్ణయించిన మోతాదు ప్రకారం...అతడికి ఐదు రోజుల పాటు ఇమ్యూనోగ్లోబ్యులిన్‌ ఇంజెక్షన్లను ఇవ్వడం ఒక చికిత్స ప్రక్రియ. ఇవి  మన దేహంలోని యాంటీబాడీస్‌ను బ్లాక్‌ చేయడం ద్వారా పరిస్థితిని చక్కబరుస్తాయి. తద్వారా నరాల పైన ఉండే మైలీన్‌ పొర మరింత ధ్వంసం కాకుండా చూస్తాయి. 
ప్లాస్మా ఎక్స్‌ఛేంజ్‌ చికిత్స: ఈ చికిత్సలో శరీరంలో జబ్బుకు కారణమైన యాంటీబాడీస్‌ను తొలగించే ప్రయత్నం చేస్తారు. ఇందులో భాగంగా బాధితుడి  శరీరం బరువును పరిగణనలోకి తీసుకుని...  ప్రతి కిలోగ్రాముకూ 250 ఎమ్‌ఎల్‌ ప్లాస్మాను రక్తం నుంచి తొలగిస్తారు. ఇది దశలవారీగా.... అంటే దాదాపు నాలుగు నుంచి ఆరు విడతలుగా ఈ చికిత్స చేస్తారు. రోజు విడిచి రోజు చేసే ఈ చికిత్సలో తొలగించిన ప్లాస్మాను సెలైన్, ఆల్బుమిన్‌లతో భర్తీ చేస్తారు. 
ఇమ్యూనోగ్లోబ్యులిన్‌ చికిత్స చాలా ఖరీదైనది. దానితో పోలిస్తే ప్లాస్మా ఎక్స్‌ఛేంజ్‌ చికిత్స... దాదాపు సగం ఖర్చులోనే పూర్తవుతుంది. ఈ రెండూ ఇంచుమించూ సమానమైన ఫలితాలనే ఇస్తాయి.  
రోగి కోలుకునే అవకాశాలు : 
►జీబీ సిండ్రోమ్‌ వచ్చిన రోగుల్లో చాలామంది పూర్తిగా కోలుకునే అవకాశాలే ఎక్కువ. అయితే 3 శాతం నుంచి 5 శాతం రోగుల్లో మాత్రం మంచి చికిత్స ఇప్పించినప్పటికీ ప్రయోజనం ఉండకపోవచ్చు. ఇక పది శాతం మందిలో చెప్పుకోదగ్గ పురోగతి ఉండదు. ఈ గణాంకాలు  మినహాయించి మిగతా అందరిలోనూ కోలుకునే అవకాశాలు ఎక్కువే ఉండటం ఓ సానుకూల అంశం. 
►వయసు పైబడిన రోగులతో పోలిస్తే వయసులో ఉన్నవారు, యుక్తవయస్కులు చాలా త్వరగా కోలుకుంటారు. 
►చచ్చుబడ్డ అవయవాలు పూర్తిగా పనిచేయడం ప్రారంభించి మళ్లీ నార్మల్‌ కావడం అన్న అంశం రోగి నుంచి రోగికి మారుతుంది. 
►ఐదు శాతం మందిలో మాత్రం జీబీ సిండ్రోమ్‌ వచ్చినవారికే మళ్లీ వచ్చే అవకాశాలుంటాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement