నా భార్య నన్ను తీవ్రంగా అనుమానిస్తోంది..
సైకియాట్రి కౌన్సెలింగ్
నాకు హోదాకు, డబ్బుకు ఏ లోటూ లేదు. మా పిల్లలిద్దరూ యూఎస్‌లో చదువుకుంటున్నారు. నా వయసు 51. నాకున్న సమస్యల్లా ఒకటే. నా భార్య నన్ను తీవ్రంగా అనుమానిస్తోంది. అయిదేళ్ల క్రితం ఒక ఫ్యామిలీ ఫంక్షన్‌కి వెళ్లినప్పుడు మా బంధువొకామె పూర్వ పరిచయం కొద్దీ నాతో కొంచెం చనువుగా మెలిగింది. అప్పటినుంచి ఆమెలో అనుమానం మొదలైంది. దాంతో మానసికంగా, శారీరకంగా నన్ను దూరం పెట్టేసింది. ఎవరితో ఫోన్‌లో మాట్లాడుతున్నా సరే, తనతోనే మాట్లాడుతున్నానని అనుమానిస్తోంది.
కనీసం నేను తనని పొగిడినా కూడా మనసులో ఆమెను ఊహించుకుంటూ పైకి నన్ను పొగుడుతున్నారు అంటుంది. తీవ్రమైన డిప్రెషన్‌లో ఉండి, తను ఇబ్బంది పడుతూ, నన్ను ఇబ్బంది పెడుతోంది. మేమిద్దరం కలిసి తనని చంపడానికి పన్నాగాలు పన్నుతున్నామని తన భయం. నిజానికి నాది కానీ, నా భార్య అనుమానిస్తున్న ఆమెది కానీ అటువంటి స్వభావం కాదు. చాలా సున్నితమైన మనస్కులం. ఎవరితో చెప్పుకోవాలో, ఎలా చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియడం లేదు. దయచేసి సలహా ఇవ్వండి. - సురేష్ చంద్ర, విజయవాడ
మీరు చెబుతున్న విషయాలను బట్టి మీ భార్య చాలా తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతోందని అర్థమవుతోంది. దీనిని మెడికల్ పరిభాషలో పీడీడీ అంటారు. అంటే పర్సిస్టెంట్ డిల్యూజనల్ డిజార్డర్ అని అర్థం. దీనిలో ఉన్న ప్రమాదకరమైన కోణం ఏమిటంటే పేషెంట్ పైకి మామూలుగానే కనిపిస్తారు. అన్ని పనులూ చేసుకోగలుగుతారు. సమస్యల్లా ఒక్కటే... వాళ్లు నమ్ముతున్న ఒకే విషయంపై చాలా బలంగా ఉంటారు. ఎవరు ఎంతగా నచ్చజెప్పినా పట్టించుకోరు. బోడితలకూ మోకాలికీ ముడివేసినట్లుగా తమ అనుమానానికి అర్థంపర్థంలేని ఆధారాలను వెతకడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కుటుంబ పెద్దలెవరైనా వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించినప్పుడు మరింతగా రెచ్చిపోతారు. ఒక్కోసారి అందరూ కలిసి ఏకమై తమను హత్య చేసేందుకు పథకం వేస్తున్నారేమో అన్నంతగా అనుమానిస్తారు. ఆత్మహత్యకు కూడా ప్రయత్నించే ప్రమాదం ఉంది.
అయితే ఇది చాలా సాధారణమైన సమస్యే. మీరేమీ అందోళన పడనక్కరలేదు. మీరిద్దరూ కలసి ఒక ఫ్యామిలీ కౌన్సెలర్ వద్ద మ్యారేజ్ కౌన్సెలింగ్ తీసుకోవాలి. ఆ తర్వాత సైకియాట్రిస్ట్‌ను సంప్రదించాలి. సైకియాట్రిస్ట్ కౌన్సెలింగ్, మందులతో వైద్యం చేస్తారు. సమస్య తీవ్రతను బట్టి ఆమె తిరిగి మామూలుగా అవడానికి కొంత సమయం పట్టవచ్చు.
డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి
కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్
లూసిడ్ డయాగ్నస్టిక్స్
బంజారాహిల్స్
హైదరాబాద్
పీడియాట్రిక్ కౌన్సెలింగ్
మా పాపకు హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. డాక్టర్ కొన్ని పరీక్షలు చేయించమన్నారు. వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయించాలని కూడా అన్నారు. రిపోర్టులు మీకు పంపుతున్నాం. మా పాపకు ఉన్న సమస్య తీవ్రత చెప్పండి. అలాగే మాకు తగిన పరిష్కారం చూపండి.
- బి. ప్రకాష్, విశాఖపట్నం
మీరు చెప్పిన విషయాలు, రిపోర్టులు పరిశీలించాక మీ పాపకు ట్రంకస్ ఆర్టరియోసిస్ అనే పుట్టుకతో వచ్చే గుండె జబ్బు ఉందని చెప్పవచ్చు. ఇది కాస్త తీవ్రమైన, ఒకింత అరుదైన సమస్య. అన్ని రకాల గుండె సమస్యలలో ఇది 1.4 శాతం మాత్రమే. ఈ సమస్య ఉన్న పిల్లల్లో మూడు నుంచి ఆర్నెల్ల లోపు ఆపరేషన్ చేయించకపోతే పరిస్థితి విషమించే అవకాశం చాలా ఎక్కువ. ఈ కండిషన్‌కు - కొన్ని అదనపు సదుపాయాలు, నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్న కొన్ని ఆసుపత్రులలో మాత్రమే చికిత్స చేయించడానికి వీలవుతుంది.
మీ పాపకు కాండ్యూట్ (ఆపరేషన్‌లో ఉపయోగించే ఒక ట్యూబ్) అమర్చడం లేదా అత్యాధునికమైన కోర్ మ్యాట్రిక్స్ అనే పదార్థాన్ని ఉపయోగించి ఆపరేషన్ చేయించాల్సిరావడం అవసరమవుతుంది. కాబట్టి ఇది కొంత ఖర్చుతో కూడుకున్న వైద్యమే. ఇప్పుడు మీ పాప ఆపరేషన్ చేసే స్థితిలో ఉందా, లేదా అన్నది కూడా చూడాలి. ఎందుకంటే ఊపిరితిత్తులు సహకరించకపోతే ఆపరేషన్ కొంత కష్టమవుతుంది. ఈ ఆపరేషన్ సదుపాయం హైదరాబాద్‌లో కూడా పీడియాట్రిక్ కార్డియాలజీ అనే ప్రత్యేక విభాగం ఉన్న చోట్ల మాత్రమే లభ్యమవుతుంది. ఇక ఖర్చు విషయానికి వస్తే ఆరోగ్యశ్రీ వంటి పథకాల కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయం అందించే వీలుంది. అది మీకు వర్తిస్తుందా, లేదా అన్నది చూడండి. మీరు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పీడియాట్రిక్ కార్డియాక్ స్పెషాలిటీ సెంటర్ ఉన్న ఆసుపత్రిలో ఒకసారి సంప్రదించండి.
మా పాపకు ఈ నెలతో ఆర్నెల్లు నిండుతాయి. పిల్లలకు ఆర్నెల్లు దాటాక ఎలాంటి ఆహారం ఇవ్వాలో తెలియజేయండి. - అడుసుమల్లి మంజూష, హైదరాబాద్
చిన్నపిల్లలకు ఆర్నెల్లు దాటాక తల్లిపాలతో పాటు అన్నం, గోధుమల వంటి గింజధాన్యాలు (సిరియెల్స్), ఆపిల్, సపోటా వంటి పళ్లు, పప్పుధాన్యాలు (దాల్స్), కూరలలో క్యారట్, బాగా ఉడికించిన దుంపలు వంటివి ఇవ్వవచ్చు. పిల్లలకు ఆర్నెల్ల వయసు వచ్చాక మంచినీళ్లు తాగించడం అవసరం. ఈ వయసు పిల్లలకు పళ్లను జ్యూస్ రూపంలో ఇవ్వడం సరికాదు. పిల్లల ఆహారం తయారీకి కుదరని, అత్యవసర సమయాల్లో మాత్రమే - మార్కెట్‌లో దొరికే పిల్లల ఆహార పదార్థాలు (రెడీమేడ్ సిరియెల్ బేస్‌డ్ ఫుడ్స్) ను ఇవ్వవచ్చు.
డాక్టర్ రమేశ్‌బాబు దాసరి
సీనియర్ పీడియాట్రీషియన్,
రోహన్ హాస్పిటల్స్,
విజయనగర్ కాలనీ,
హైదరాబాద్
పల్మనాలజీ కౌన్సెలింగ్
నా వయసు 46 సంవత్సరాలు. గత వారం రోజుల నుండి విపరీతమైన దగ్గు, శ్లేష్మం పడటం, ఊపిరి పీల్చడంలో కష్టం, నాలుగడుగులు నడిస్తే ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలుంటే డాక్టర్‌ను కలిశాను. ఆయన పరీక్షలు నిర్వహించి, నేను సీవోపీడీ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. దయచేసి దీనికి చికిత్స మార్గాలు తెల్పగలరు. - పరమేశం, విజయనగరం
సీవోపీడీ అంటే క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. అంటే మీ ఊపిరితిత్తులలో కొంత అవరోధాలు కలిగించే వ్యాధి అన్నమాట. ఈ వ్యాధికి దీర్ఘకాలిక చికిత్స అవసరమవుతుంది. ఈ అవరోధమనేది మీ ఊపిరితిత్తులలో లోనికి , బయటకి గాలిని సరఫరా చేసే వాయునాళాలలో ఏర్పడుతుంది. మీ వాయు నాళాలు సన్నబడతాయి. అందుచేత వాటిగుండా వెళ్లగల గాలి పరిమాణం కూడా తగ్గిపోతుంది.
ఇంకా, గాలి మీ ఊపిరితిత్తుల ద్వారా బయటికి సరిగా వెళ్లదు. ఈ కారణంగా మీ ఊపిరితిత్తులు బరువుగానూ, మీ ఛాతీ పట్టేసినట్లుగానూ ఉండి, మీకు శ్వాస ఆడనట్లు అనిపిస్తుంది. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటంటే మీరు పొగ తాగుతున్నట్లయితే వెంటనే స్మోకింగ్ మానేయాలి. మీ ఊపిరితిత్తులకు మీరు సహాయం చేయాలనుకుంటే ఇదే అతి ముఖ్యమైన పని. మీ డాక్టర్‌గారు చెప్పిన విధంగా పరీక్షలు చేయించుకోండి.
వాయునాళాలని వెడల్పు చేసే మందులని బ్రాంకోడైలేటర్స్ అంటారు. మీ ఊపిరితిత్తుల్లో గల వాయునాళాల చుట్టూ ఉన్న చిన్న చిన్న ఖండాలను గట్టిపరిచే చర్యలను అవ రోధించి, ఇంకా వెనక్కి మళ్లించడం ద్వారా ఈ మందులు పనిచేస్తాయి. ఈవిధంగా ఇవి మీ వ్యాధికి కొంత ఉపశమనం కల్పిస్తాయి. తద్వారా మీరు కాస్త సులువుగా శ్వాస తీసుకునేలా చూస్తాయి. వ్యాధి పూర్తిగా నయమయ్యేవరకు క్రమం తప్పకుండా మందులు వాడాలి. ఇన్ఫెక్షన్ వచ్చినా, ఆయాసం, దగ్గు పెరిగినా వెంటనే హాస్పిటల్‌కు వెళ్లాలి. ఇలాంటి పరిస్థితుల్లో యాంటీబయోటిక్స్, కృత్రిమ ఆక్సిజన్, అవసరమైన మందులు ఇచ్చి చికిత్స చేస్తారు. దీర్ఘకాలికంగా ఆయాసంతో బాధపడేవారు ఊపిరితిత్తుల రిహాబిలిటేషన్ వ్యాయామాలు చేయాలి. ఇందుకోసం పల్మనాలజిస్ట్, రెస్పిరేటరీ టెక్నిషియన్ సూచనలు తీసుకోవడం అవసరం.
డాక్టర్ సందీప్
కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్
కేర్ హాస్పిటల్స్
నాంపల్లి
హైదరాబాద్