Psychiatry counseling
-
మనసు మాట విందాం.. మీకు అండగా మేమున్నాం!
‘నాకు బతకాలని లేదు’ ఒక నిస్సహాయ స్వరం. ఆ స్వరానికి ఓ ఆలంబన కావాలి. ‘ఎందుకలా’ అని చేతి మీద చెయ్యి వేసి అడిగే ఓ ఆత్మీయత కావాలి. ‘నీకేం తక్కువ... నువ్వు సాధించినవి తరచి చూసుకో’ అనే ధైర్యవచనం కావాలి. ‘ఉద్యోగంలో కష్టం వస్తే నీ ప్రాణం తీసుకోవడమా!! కాదు.. కాదు... ఉద్యోగం మారాలి’ అని ప్రత్యామ్నాయం చూపించే భరోసా కావాలి. పరీక్ష ఫెయిల్ అయితే ‘ఉందిగా సెప్టెంబరు’ అనే చమత్కారపు స్నేహం కావాలి. మామూలు రోజుల్లో ఈ ఆత్మీయత, స్నేహం, ధైర్యవచనం, ఆలంబన మన పక్కనే ఉండేవి. అవేవీ సమయానికి అందని వాళ్లు మాత్రమే నిస్సహాయంగా మిగిలేవాళ్లు. గడచిన రెండేళ్లుగా కరోనా ప్రపంచాన్ని కబళించేసింది. ఈ మాత్రపు ఆత్మీయవచనం చెప్పే వాళ్లను దూరం చేసింది. ఐసోలేషన్... ఐసోలేషన్... ఐసోలేషన్. కూరగాయల బండి దగ్గర కనిపించిన పక్కింటి వాళ్లను పలకరించాలంటే భయం. మనిషి కనిపిస్తే మాస్కును సరిచేసుకోవడమే దినచర్య అయింది. ఉద్యోగం ఉంటుందో పోతుందోననే భయం. వర్క్ ఫ్రమ్ హోమ్ వరమా శాపమ తెలియని ఆందోళన. ఇంట్లో ప్రతి పని సొంతంగా చేసుకోవాల్సి రావడంతో చిరాకులు. మనసులో సుడులు తిరుగుతున్న భయాలకు, చిరాకులకు అవుట్లెట్ కూడా ఇంట్లో ఒకరికొకరే అయ్యారు. మనుషులు దగ్గరగా ఉన్నారు, మానసికంగా దూరమయ్యారు. దూరమైన సంగతి కూడా తెలియనంతగా దూరమైపోయారు. స్మార్ట్ఫోన్లకు, సోషల్ మీడియాకు బానిసలైపోయారు. మగవాళ్లలో వీటన్నింటితోపాటు ఆల్కహాలు సేవనం ఎక్కువైంది. వయసు మీరిన పెద్దవాళ్లలో తమకేదైనా జరిగితే అంత్యక్రియలు కొడుకులు, కూతుళ్ల చేతుల మీదుగా సవ్యంగా సాగుతాయో లేదోననే బెంగ. పిల్లల్లో బడి గంట మోగితే పాఠాలు ఎలా చదవాలోననే బెరుకు. ఇన్ని ఆందోళనల మధ్య సాగుతోంది జీవనం. మానసిక స్థితిని అదుపులో పెట్టుకోగలిగిన వాళ్లు సంయమనం తో గడపగలిగారు. ఫ్రస్టేషన్‌ను భరించలేని వాళ్లు అరచి గోల చేసి శాంతించారు. ఆ అరుపులను భరిస్తూ, బాధితులైన బలహీనులు ప్రాణాలను బలి తీసుకున్నారు. ఈ బలిదానాలు ఎక్కువగా అల్పాదాయ వర్గాల్లోనే చోటు చేసుకుంటున్నాయి. పని దొరక్కపోవడం ఒక కష్టం, ఉన్న నాలుగు రూపాయలు మద్యానికి ఖర్చు చేయడం, తాగిన మత్తులో గొడవలు పడడం, భర్త తన ఆధిపత్య ప్రదర్శన కోసం భార్యను రోడ్డు మీదకు లాక్కు వచ్చి మరీ కొట్టడం... కరోనా కాలంలో కరాళనృత్యం చేసిన కష్టాలు. ఈ గడ్డు పరిస్థితులు జీవితాన్ని అంతం చేసుకునే దారులుగా మాత్రం మారకూడదు, అందుకే శనివారం(8–1–2022) నాడు ‘సైకియాట్రీయట్ డోర్‌స్టెప్’ అనే కార్యక్రమం మొదలు పెట్టాం... అని చెప్తున్నారు రోష్ని వ్యవస్థాపకురాలు శశి. ప్రాణాలను నిలిపే ప్రయత్నమిది ‘‘ఆత్మహత్యలను నివారించడానికి గడచిన 24 ఏళ్లుగా పని చేస్తోంది రోష్ని సంస్థ. ‘నీ బాధ వినడానికి మేమున్నాం’ అంటూ హైదరాబాద్, బేగంపేటలో 1997లో హెల్ప్‌లైన్‌తో మొదలైన రోష్ని ఇప్పటి వరకు 98వేల ఫోన్ కాల్స్‌కు స్పందించింది. ‘తమ సమస్య ఇదీ’ అని బయటకు చెప్పుకోలేని మధ్యతరగతి మహిళలు తమ ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఫోన్ చేసి సహాయం కోరుతున్నారు. అలా సహాయం కోరిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతూ వాళ్లు మానసికంగా దృడంగా మారేవరకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు రోష్ని వాలంటీర్లు. అలాగే పన్నెండేళ్ల కిందట మొదలు పెట్టిన కౌన్సెలింగ్ సెంటర్ ద్వారా ముఖాముఖి కౌన్సెలింగ్ కూడా ఇస్తున్నారు. అల్పాదాయ వర్గాలు నివసించే కాలనీల్లో వాళ్ల కోసం ఫ్రీ మెంటల్హెల్త్ క్యాంప్‌లు మొదలు పెట్టి 33 వేలకు పైగా పేషెంట్లకు వైద్యం చేశాం. ఇటీవల గణాంకాలు, వార్తా కథనాలను, మాకు వచ్చే ఫోన్ కాల్స్‌ను కలిపి విశ్లేషించుకున్నప్పుడు మా సేవలను మరింత గా విస్తరించి తీరాలని అర్థమైంది. 2020లో ఆత్మహత్యలు విపరీతం గా పెరిగాయి. వీటన్నింటికీ పైకి కనిపించే తక్షణ కారణాలు ఎలా ఉన్నప్పటికీ వాటన్నింటి వెనుక ప్రధాన కారణం కోవిడ్ అని చెప్పక తప్పదు. తాము మానసిక వేదనకు లోనవుతున్న విషయాన్ని గ్రహించని వాళ్లే ఎక్కువ, కొందరు గ్రహించినప్పటికీ సైకాలజిస్టును, సైకియాట్రిస్టును సంప్రదించే పరిస్థితులు ఉండడం లేదు. అంతంత ఫీజులు ఇచ్చుకోలేకపోవడం, సైకాలజిస్టు ఎక్కడ ఉంటారో తెలియకపోవడం కూడా కారణమే. కాలనీకి ఒక గైనకాలజిస్టు కనిపిస్తారు, కానీ మన దగ్గర సైకాలజిస్టులు తగినంత మంది లేరు. ఉన్న వాళ్లు కూడా ఈ కాలనీలకు అందుబాటులో లేరు. అందుకే మేమే ఆ సర్వీసుని వాళ్ల ఇంటి ముంగిటకు తీసుకువెళ్తున్నాం. ఈ వైద్యానికి దూరంగా ఉండడానికి ‘పిచ్చి’ అని ముద్ర వేస్తారనే భయం కూడా కారణమే. మానసిక ఆందోళన పిచ్చి కాదని, మానసిక ఆవేదన, ఆందోళన, దిగులు, బెంగ వంటి స్థితిని సరిచేసుకుని జీవితాన్ని ఆరోగ్యవంతంగా, ఆనందకరంగా మార్చుకోవాలని పదే పదే చెప్తున్నాం. సమాజంలో మెంటల్హెల్త్ పట్ల ఉన్న అతిపెద్ద మానసిక అడ్డంకిని ఛేదించడానికి దాట్ల ఫౌండేషన్‌తో కలిసి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం’’ అన్నారామె. – వాకా మంజులారెడ్డి బిడియం వీడండి గొంతు విప్పండి ‘సైకియాట్రీ యట్ డోర్‌స్టెప్’ వాహనంలో ఒక సైకియాట్రిస్ట్, కౌన్సెలర్, కో ఆర్డినేటర్‌తోపాటు సాధారణ మానసిక సమస్యలకు అవసరమయ్యే మందులు ఉంటాయి. ఈ సర్వీస్‌కంటే ప్రధానంగా వారిని చైతన్యపరచడం పనిగా పెట్టుకున్నాం. ఒంట్లో బాగా లేకపోతే డాక్టర్ దగ్గరకు వెళ్లడానికి ఏ మాత్రం బిడియపడం, అలాగే మనసు బాగాలేనప్పుడు సైకియాట్రిస్ట్ లేదా సైకాలజిస్ట్‌ను సంప్రదించడానికి కూడా ఏ మాత్రం బిడియపడకూడదని చెప్పడం ప్రధాన కర్తవ్యం. – శశి, ‘రోష్ని’ వ్యవస్థాపకురాలు -
Kavitha Natarajan: ఆప్యాయతే.. అభయం
ఇప్పుడు సమాజం ఎన్నడూ లేనంత భయాందోళనల మధ్య కొట్టుమిట్టాడుతోందని, ఆప్యాయత, అవగాహన నిండిన మాటలతో దాన్ని పోగొట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు కవితా నటరాజన్. కరోనా కల్లోలం నేపథ్యంలో సమాజంలో విజృంభిస్తున్న పలు రకాల మానసిక సమస్యలకు ఆమె తన వంతు పరిష్కారాలను స్వచ్ఛందంగా అందిస్తున్నారు. గత ఏడాది తెలంగాణలోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటైన సైకోసోషల్ కౌన్సిలింగ్ సర్వీసెస్‌లో భాగంగా ఆమె కౌన్సిలింగ్ సేవలు కొనసాగిస్తున్నారు. ఐటీ ఉద్యోగినిగా పనిచేస్తూనే మరోవైపు తనకు ఇష్టమైన సోషల్ సర్వీస్‌నూ వదలకుండా కృషి చేస్తున్న కవితానటరాజన్ తన అనుభవాలను పంచుకున్నారిలా... కిందటేడాది కరోన.. ‘‘కార్పొరేట్ రంగంలో ఉన్నా, ప్రస్తుతం సిజిఐ అనే ఐటి కంపెనీలో పనిచేస్తున్నా. చిన్ననాటి నుంచీ స్వచ్ఛంద సేవ అంటే ఇష్టం. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ఎన్నడూ ఎరగనంత విచిత్రమైన పరిస్థితులున్నాయి. లాక్‌డవున్ అనే మాట అంతకుముందు మనలో ఎవరమూ కనీ విననిది. ఆకలి కేకలు విని చాలా బాధపడ్డా. అయితే బయటకు వెళ్లి ఫుడ్ ప్యాకెట్స్ పంచాలి వంటి ఆలోచనలు వచ్చినా, నా వ్యక్తిగత ఇమ్యూన్ సిస్టమ్ గురించి తెలుసు కాబట్టి అలా చేయలేకపోయా. అదే సమయంలో ఎన్నడూ లేనట్టు కొన్ని నెలల పాటు ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితుల వల్ల చుట్టుపక్కల పలువురిలో విభిన్న రకాల మానసిక సమస్యలను గుర్తించాను. అప్పటికే సైకాలజీలో డిగ్రీ చేశాను కాబట్టి.. స్వచ్ఛందంగా సైకలాజికల్ కౌన్సిలింగ్ ఎందుకు ఇవ్వకూడదు? అనిపించింది. ఆ ఆలోచనను పోలీసు ఉన్నతాధికారి మహేష్ భగవత్ గారితో పంచుకుని, వారి సూచనల మేరకు రాచకొండ కమిషనరేట్ ఆధ్వర్యంలో మేం గత ఏడాది ఏప్రిల్ 2 న కౌన్సిలింగ్ సేవలు ప్రారంభించాం. ఉదయం 9గంటల నుంచి రాత్రి 9గంటల వరకూ వచ్చిన కాల్స్ ఇంకా గుర్తున్నాయి. లాక్ డౌన్ వల్ల పెరిగిన పనిభారంతో ఇళ్లలో మహిళలు చాలా ఇబ్బందులు పడ్డారు. వర్క్ డివిజన్ తెలియక చాలా మానసికంగా ఒత్తిళ్లకు లోనయ్యారు. మహిళలపై గృహహింసకు సంబంధించిన కాల్స్ కూడా విపరీతంగా వచ్చాయి. వీరందరికీ కౌన్సిలింగ్ ఇస్తూ అలా... మూడు నెలల పాటు పని చేశాం. కోవిడ్ తగ్గటంతో ఆ కాల్స్ తగ్గిపోయాయి. అయితే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయినప్పుడు మానసిక సంఘర్షణకు లోనైన యువత నుంచి పెద్ద సంఖ్యలో కాల్స్ వచ్చాయి. సెకండ్‌వేవ్ బాధితులు మరోసారి కోవిడ్ తన ప్రతాపం చూపిస్తున్న పరిస్థితుల్లో భావోద్వేగాలు మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అందుకే మరోసారి ఈ కౌన్సిలింగ్ సేవలు ప్రారంభించాం. గతం తో పోలిస్తే ఇప్పుడు మరింత విభిన్నమైన మానసిక సమస్యలతో సంప్రదిస్తున్నారు. వీరిలో తమ వారిని పోగొట్టుకున్న మహిళల మానసిక పరిస్థితి దయనీయంగా ఉంది. అలాగే దగ్గర బంధువుల్లో చావులు ఈసారి చాలామంది మనోధైర్యాన్ని పోగొడుతున్నాయి. తాజాగా బ్లాక్ ఫంగస్ గురించి కూడా కాల్స్ వస్తున్నాయంటే... ఇప్పుడు భయం ఎంతగా జనాల్లో పేరుకుపోయిందో అర్థమవుతుంది. మా వంతుగా వారిలో ధైర్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాం. ఈసారి నాతోపాటు బాగా అనుభవం ఉన్న మరో 13 మంది మహిళ కౌన్సిలర్లు తమ సేవలు అందిస్తున్నారు. పోలీసుకూ మహిళకూ మధ్య గతంలో కూడా ఈ తరహా కౌన్సిలింగ్ చేసిన అనుభవం ఉంది. ‘మార్గదర్శక్’ పేరుతో మా లాంటి కొందరు స్వచ్ఛంద సేవకులకు గృహహింస, వేధింపులు.. వంటి వాటి విషయంలో చట్టబద్ధమైన అంశాలపై పోలీసు శాఖ ఆధ్వర్యం లో శిక్షణ అందించారు. అలాగే మన సమాజంలో కొందరు మహిళలకు పోలీస్ స్టేషన్ అన్నా, పోలీసులన్నా భయం ఉండొచ్చు. ముందు వారిని మానసికంగా ధైర్యం పుంజుకునేలా చేసి, వారి సమస్య నిర్భయంగా చెప్పగలిగేలా ప్రిపేర్ చేస్తాం, షీ టీమ్‌కు అనుసంధానంగా పనిచేస్తాం’’ అని వివరించారు కవిత. – నిర్మలారెడ్డి -
నా భార్య నన్ను తీవ్రంగా అనుమానిస్తోంది..
సైకియాట్రి కౌన్సెలింగ్ నాకు హోదాకు, డబ్బుకు ఏ లోటూ లేదు. మా పిల్లలిద్దరూ యూఎస్‌లో చదువుకుంటున్నారు. నా వయసు 51. నాకున్న సమస్యల్లా ఒకటే. నా భార్య నన్ను తీవ్రంగా అనుమానిస్తోంది. అయిదేళ్ల క్రితం ఒక ఫ్యామిలీ ఫంక్షన్‌కి వెళ్లినప్పుడు మా బంధువొకామె పూర్వ పరిచయం కొద్దీ నాతో కొంచెం చనువుగా మెలిగింది. అప్పటినుంచి ఆమెలో అనుమానం మొదలైంది. దాంతో మానసికంగా, శారీరకంగా నన్ను దూరం పెట్టేసింది. ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నా సరే, తనతోనే మాట్లాడుతున్నానని అనుమానిస్తోంది. కనీసం నేను తనని పొగిడినా కూడా మనసులో ఆమెను ఊహించుకుంటూ పైకి నన్ను పొగుడుతున్నారు అంటుంది. తీవ్రమైన డిప్రెషన్లో ఉండి, తను ఇబ్బంది పడుతూ, నన్ను ఇబ్బంది పెడుతోంది. మేమిద్దరం కలిసి తనని చంపడానికి పన్నాగాలు పన్నుతున్నామని తన భయం. నిజానికి నాది కానీ, నా భార్య అనుమానిస్తున్న ఆమెది కానీ అటువంటి స్వభావం కాదు. చాలా సున్నితమైన మనస్కులం. ఎవరితో చెప్పుకోవాలో, ఎలా చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియడం లేదు. దయచేసి సలహా ఇవ్వండి. - సురేష్ చంద్ర, విజయవాడ మీరు చెబుతున్న విషయాలను బట్టి మీ భార్య చాలా తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతోందని అర్థమవుతోంది. దీనిని మెడికల్ పరిభాషలో పీడీడీ అంటారు. అంటే పర్సిస్టెంట్ డిల్యూజనల్ డిజార్డర్ అని అర్థం. దీనిలో ఉన్న ప్రమాదకరమైన కోణం ఏమిటంటే పేషెంట్ పైకి మామూలుగానే కనిపిస్తారు. అన్ని పనులూ చేసుకోగలుగుతారు. సమస్యల్లా ఒక్కటే... వాళ్లు నమ్ముతున్న ఒకే విషయంపై చాలా బలంగా ఉంటారు. ఎవరు ఎంతగా నచ్చజెప్పినా పట్టించుకోరు. బోడితలకూ మోకాలికీ ముడివేసినట్లుగా తమ అనుమానానికి అర్థంపర్థంలేని ఆధారాలను వెతకడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కుటుంబ పెద్దలెవరైనా వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించినప్పుడు మరింతగా రెచ్చిపోతారు. ఒక్కోసారి అందరూ కలిసి ఏకమై తమను హత్య చేసేందుకు పథకం వేస్తున్నారేమో అన్నంతగా అనుమానిస్తారు. ఆత్మహత్యకు కూడా ప్రయత్నించే ప్రమాదం ఉంది. అయితే ఇది చాలా సాధారణమైన సమస్యే. మీరేమీ అందోళన పడనక్కరలేదు. మీరిద్దరూ కలసి ఒక ఫ్యామిలీ కౌన్సెలర్ వద్ద మ్యారేజ్ కౌన్సెలింగ్ తీసుకోవాలి. ఆ తర్వాత సైకియాట్రిస్ట్‌ను సంప్రదించాలి. సైకియాట్రిస్ట్ కౌన్సెలింగ్, మందులతో వైద్యం చేస్తారు. సమస్య తీవ్రతను బట్టి ఆమె తిరిగి మామూలుగా అవడానికి కొంత సమయం పట్టవచ్చు. డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ లూసిడ్ డయాగ్నస్టిక్స్ బంజారాహిల్స్ హైదరాబాద్ పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా పాపకు హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. డాక్టర్ కొన్ని పరీక్షలు చేయించమన్నారు. వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయించాలని కూడా అన్నారు. రిపోర్టులు మీకు పంపుతున్నాం. మా పాపకు ఉన్న సమస్య తీవ్రత చెప్పండి. అలాగే మాకు తగిన పరిష్కారం చూపండి. - బి. ప్రకాష్, విశాఖపట్నం మీరు చెప్పిన విషయాలు, రిపోర్టులు పరిశీలించాక మీ పాపకు ట్రంకస్ ఆర్టరియోసిస్ అనే పుట్టుకతో వచ్చే గుండె జబ్బు ఉందని చెప్పవచ్చు. ఇది కాస్త తీవ్రమైన, ఒకింత అరుదైన సమస్య. అన్ని రకాల గుండె సమస్యలలో ఇది 1.4 శాతం మాత్రమే. ఈ సమస్య ఉన్న పిల్లల్లో మూడు నుంచి ఆర్నెల్ల లోపు ఆపరేషన్ చేయించకపోతే పరిస్థితి విషమించే అవకాశం చాలా ఎక్కువ. ఈ కండిషన్‌కు - కొన్ని అదనపు సదుపాయాలు, నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్న కొన్ని ఆసుపత్రులలో మాత్రమే చికిత్స చేయించడానికి వీలవుతుంది. మీ పాపకు కాండ్యూట్ (ఆపరేషన్‌లో ఉపయోగించే ఒక ట్యూబ్) అమర్చడం లేదా అత్యాధునికమైన కోర్ మ్యాట్రిక్స్ అనే పదార్థాన్ని ఉపయోగించి ఆపరేషన్ చేయించాల్సిరావడం అవసరమవుతుంది. కాబట్టి ఇది కొంత ఖర్చుతో కూడుకున్న వైద్యమే. ఇప్పుడు మీ పాప ఆపరేషన్ చేసే స్థితిలో ఉందా, లేదా అన్నది కూడా చూడాలి. ఎందుకంటే ఊపిరితిత్తులు సహకరించకపోతే ఆపరేషన్ కొంత కష్టమవుతుంది. ఈ ఆపరేషన్ సదుపాయం హైదరాబాద్‌లో కూడా పీడియాట్రిక్ కార్డియాలజీ అనే ప్రత్యేక విభాగం ఉన్న చోట్ల మాత్రమే లభ్యమవుతుంది. ఇక ఖర్చు విషయానికి వస్తే ఆరోగ్యశ్రీ వంటి పథకాల కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయం అందించే వీలుంది. అది మీకు వర్తిస్తుందా, లేదా అన్నది చూడండి. మీరు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పీడియాట్రిక్ కార్డియాక్ స్పెషాలిటీ సెంటర్ ఉన్న ఆసుపత్రిలో ఒకసారి సంప్రదించండి. మా పాపకు ఈ నెలతో ఆర్నెల్లు నిండుతాయి. పిల్లలకు ఆర్నెల్లు దాటాక ఎలాంటి ఆహారం ఇవ్వాలో తెలియజేయండి. - అడుసుమల్లి మంజూష, హైదరాబాద్ చిన్నపిల్లలకు ఆర్నెల్లు దాటాక తల్లిపాలతో పాటు అన్నం, గోధుమల వంటి గింజధాన్యాలు (సిరియెల్స్), ఆపిల్, సపోటా వంటి పళ్లు, పప్పుధాన్యాలు (దాల్స్), కూరలలో క్యారట్, బాగా ఉడికించిన దుంపలు వంటివి ఇవ్వవచ్చు. పిల్లలకు ఆర్నెల్ల వయసు వచ్చాక మంచినీళ్లు తాగించడం అవసరం. ఈ వయసు పిల్లలకు పళ్లను జ్యూస్ రూపంలో ఇవ్వడం సరికాదు. పిల్లల ఆహారం తయారీకి కుదరని, అత్యవసర సమయాల్లో మాత్రమే - మార్కెట్లో దొరికే పిల్లల ఆహార పదార్థాలు (రెడీమేడ్ సిరియెల్ బేస్డ్ ఫుడ్స్) ను ఇవ్వవచ్చు. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ పల్మనాలజీ కౌన్సెలింగ్ నా వయసు 46 సంవత్సరాలు. గత వారం రోజుల నుండి విపరీతమైన దగ్గు, శ్లేష్మం పడటం, ఊపిరి పీల్చడంలో కష్టం, నాలుగడుగులు నడిస్తే ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలుంటే డాక్టర్‌ను కలిశాను. ఆయన పరీక్షలు నిర్వహించి, నేను సీవోపీడీ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. దయచేసి దీనికి చికిత్స మార్గాలు తెల్పగలరు. - పరమేశం, విజయనగరం సీవోపీడీ అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. అంటే మీ ఊపిరితిత్తులలో కొంత అవరోధాలు కలిగించే వ్యాధి అన్నమాట. ఈ వ్యాధికి దీర్ఘకాలిక చికిత్స అవసరమవుతుంది. ఈ అవరోధమనేది మీ ఊపిరితిత్తులలో లోనికి , బయటకి గాలిని సరఫరా చేసే వాయునాళాలలో ఏర్పడుతుంది. మీ వాయు నాళాలు సన్నబడతాయి. అందుచేత వాటిగుండా వెళ్లగల గాలి పరిమాణం కూడా తగ్గిపోతుంది. ఇంకా, గాలి మీ ఊపిరితిత్తుల ద్వారా బయటికి సరిగా వెళ్లదు. ఈ కారణంగా మీ ఊపిరితిత్తులు బరువుగానూ, మీ ఛాతీ పట్టేసినట్లుగానూ ఉండి, మీకు శ్వాస ఆడనట్లు అనిపిస్తుంది. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటంటే మీరు పొగ తాగుతున్నట్లయితే వెంటనే స్మోకింగ్ మానేయాలి. మీ ఊపిరితిత్తులకు మీరు సహాయం చేయాలనుకుంటే ఇదే అతి ముఖ్యమైన పని. మీ డాక్టర్‌గారు చెప్పిన విధంగా పరీక్షలు చేయించుకోండి. వాయునాళాలని వెడల్పు చేసే మందులని బ్రాంకోడైలేటర్స్ అంటారు. మీ ఊపిరితిత్తుల్లో గల వాయునాళాల చుట్టూ ఉన్న చిన్న చిన్న ఖండాలను గట్టిపరిచే చర్యలను అవ రోధించి, ఇంకా వెనక్కి మళ్లించడం ద్వారా ఈ మందులు పనిచేస్తాయి. ఈవిధంగా ఇవి మీ వ్యాధికి కొంత ఉపశమనం కల్పిస్తాయి. తద్వారా మీరు కాస్త సులువుగా శ్వాస తీసుకునేలా చూస్తాయి. వ్యాధి పూర్తిగా నయమయ్యేవరకు క్రమం తప్పకుండా మందులు వాడాలి. ఇన్ఫెక్షన్ వచ్చినా, ఆయాసం, దగ్గు పెరిగినా వెంటనే హాస్పిటల్‌కు వెళ్లాలి. ఇలాంటి పరిస్థితుల్లో యాంటీబయోటిక్స్, కృత్రిమ ఆక్సిజన్, అవసరమైన మందులు ఇచ్చి చికిత్స చేస్తారు. దీర్ఘకాలికంగా ఆయాసంతో బాధపడేవారు ఊపిరితిత్తుల రిహాబిలిటేషన్ వ్యాయామాలు చేయాలి. ఇందుకోసం పల్మనాలజిస్ట్, రెస్పిరేటరీ టెక్నిషియన్ సూచనలు తీసుకోవడం అవసరం. డాక్టర్ సందీప్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్ నాంపల్లి హైదరాబాద్