‘నాకు బతకాలని లేదు’ ఒక నిస్సహాయ స్వరం. ఆ స్వరానికి ఓ ఆలంబన కావాలి.
‘ఎందుకలా’ అని చేతి మీద చెయ్యి వేసి అడిగే ఓ ఆత్మీయత కావాలి.
‘నీకేం తక్కువ... నువ్వు సాధించినవి తరచి చూసుకో’ అనే ధైర్యవచనం కావాలి.
‘ఉద్యోగంలో కష్టం వస్తే నీ ప్రాణం తీసుకోవడమా!! కాదు.. కాదు... ఉద్యోగం మారాలి’ అని ప్రత్యామ్నాయం చూపించే భరోసా కావాలి.
పరీక్ష ఫెయిల్ అయితే ‘ఉందిగా సెప్టెంబరు’ అనే చమత్కారపు స్నేహం కావాలి.
మామూలు రోజుల్లో ఈ ఆత్మీయత, స్నేహం, ధైర్యవచనం, ఆలంబన మన పక్కనే ఉండేవి. అవేవీ సమయానికి అందని వాళ్లు మాత్రమే నిస్సహాయంగా మిగిలేవాళ్లు. గడచిన రెండేళ్లుగా కరోనా ప్రపంచాన్ని కబళించేసింది. ఈ మాత్రపు ఆత్మీయవచనం చెప్పే వాళ్లను దూరం చేసింది. ఐసోలేషన్... ఐసోలేషన్... ఐసోలేషన్. కూరగాయల బండి దగ్గర కనిపించిన పక్కింటి వాళ్లను పలకరించాలంటే భయం. మనిషి కనిపిస్తే మాస్కును సరిచేసుకోవడమే దినచర్య అయింది. ఉద్యోగం ఉంటుందో పోతుందోననే భయం. వర్క్ ఫ్రమ్ హోమ్ వరమా శాపమ తెలియని ఆందోళన. ఇంట్లో ప్రతి పని సొంతంగా చేసుకోవాల్సి రావడంతో చిరాకులు. మనసులో సుడులు తిరుగుతున్న భయాలకు, చిరాకులకు అవుట్‌లెట్ కూడా ఇంట్లో ఒకరికొకరే అయ్యారు. మనుషులు దగ్గరగా ఉన్నారు, మానసికంగా దూరమయ్యారు. దూరమైన సంగతి కూడా తెలియనంతగా దూరమైపోయారు. స్మార్ట్‌ఫోన్‌లకు, సోషల్ మీడియాకు బానిసలైపోయారు.
మగవాళ్లలో వీటన్నింటితోపాటు ఆల్కహాలు సేవనం ఎక్కువైంది. వయసు మీరిన పెద్దవాళ్లలో తమకేదైనా జరిగితే అంత్యక్రియలు కొడుకులు, కూతుళ్ల చేతుల మీదుగా సవ్యంగా సాగుతాయో లేదోననే బెంగ. పిల్లల్లో బడి గంట మోగితే పాఠాలు ఎలా చదవాలోననే బెరుకు. ఇన్ని ఆందోళనల మధ్య సాగుతోంది జీవనం. మానసిక స్థితిని అదుపులో పెట్టుకోగలిగిన వాళ్లు సంయమనం తో గడపగలిగారు. ఫ్రస్టేషన్‌ను భరించలేని వాళ్లు అరచి గోల చేసి శాంతించారు. ఆ అరుపులను భరిస్తూ, బాధితులైన బలహీనులు ప్రాణాలను బలి తీసుకున్నారు. ఈ బలిదానాలు ఎక్కువగా అల్పాదాయ వర్గాల్లోనే చోటు చేసుకుంటున్నాయి. పని దొరక్కపోవడం ఒక కష్టం, ఉన్న నాలుగు రూపాయలు మద్యానికి ఖర్చు చేయడం, తాగిన మత్తులో గొడవలు పడడం, భర్త తన ఆధిపత్య ప్రదర్శన కోసం భార్యను రోడ్డు మీదకు లాక్కు వచ్చి మరీ కొట్టడం... కరోనా కాలంలో కరాళనృత్యం చేసిన కష్టాలు. ఈ గడ్డు పరిస్థితులు జీవితాన్ని అంతం చేసుకునే దారులుగా మాత్రం మారకూడదు, అందుకే శనివారం(8–1–2022) నాడు ‘సైకియాట్రీయట్ డోర్‌స్టెప్’ అనే కార్యక్రమం మొదలు పెట్టాం... అని చెప్తున్నారు రోష్ని వ్యవస్థాపకురాలు శశి.
ప్రాణాలను నిలిపే ప్రయత్నమిది
‘‘ఆత్మహత్యలను నివారించడానికి గడచిన 24 ఏళ్లుగా పని చేస్తోంది రోష్ని సంస్థ. ‘నీ బాధ వినడానికి మేమున్నాం’ అంటూ హైదరాబాద్, బేగంపేటలో 1997లో హెల్ప్‌లైన్‌తో మొదలైన రోష్ని ఇప్పటి వరకు 98వేల ఫోన్ కాల్స్‌కు స్పందించింది. ‘తమ సమస్య ఇదీ’ అని బయటకు చెప్పుకోలేని మధ్యతరగతి మహిళలు తమ ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఫోన్ చేసి సహాయం కోరుతున్నారు. అలా సహాయం కోరిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతూ వాళ్లు మానసికంగా దృడంగా మారేవరకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు రోష్ని వాలంటీర్లు. అలాగే పన్నెండేళ్ల కిందట మొదలు పెట్టిన కౌన్సెలింగ్ సెంటర్ ద్వారా ముఖాముఖి కౌన్సెలింగ్ కూడా ఇస్తున్నారు. అల్పాదాయ వర్గాలు నివసించే కాలనీల్లో వాళ్ల కోసం ఫ్రీ మెంటల్‌హెల్త్ క్యాంప్‌లు మొదలు పెట్టి 33 వేలకు పైగా పేషెంట్‌లకు వైద్యం చేశాం.
ఇటీవల గణాంకాలు, వార్తా కథనాలను, మాకు వచ్చే ఫోన్ కాల్స్‌ను కలిపి విశ్లేషించుకున్నప్పుడు మా సేవలను మరింత గా విస్తరించి తీరాలని అర్థమైంది. 2020లో ఆత్మహత్యలు విపరీతం గా పెరిగాయి. వీటన్నింటికీ పైకి కనిపించే తక్షణ కారణాలు ఎలా ఉన్నప్పటికీ వాటన్నింటి వెనుక ప్రధాన కారణం కోవిడ్ అని చెప్పక తప్పదు. తాము మానసిక వేదనకు లోనవుతున్న విషయాన్ని గ్రహించని వాళ్లే ఎక్కువ, కొందరు గ్రహించినప్పటికీ సైకాలజిస్టును, సైకియాట్రిస్టును సంప్రదించే పరిస్థితులు ఉండడం లేదు.
అంతంత ఫీజులు ఇచ్చుకోలేకపోవడం, సైకాలజిస్టు ఎక్కడ ఉంటారో తెలియకపోవడం కూడా కారణమే. కాలనీకి ఒక గైనకాలజిస్టు కనిపిస్తారు, కానీ మన దగ్గర సైకాలజిస్టులు తగినంత మంది లేరు. ఉన్న వాళ్లు కూడా ఈ కాలనీలకు అందుబాటులో లేరు. అందుకే మేమే ఆ సర్వీసుని వాళ్ల ఇంటి ముంగిటకు తీసుకువెళ్తున్నాం. ఈ వైద్యానికి దూరంగా ఉండడానికి ‘పిచ్చి’ అని ముద్ర వేస్తారనే భయం కూడా కారణమే. మానసిక ఆందోళన పిచ్చి కాదని, మానసిక ఆవేదన, ఆందోళన, దిగులు, బెంగ వంటి స్థితిని సరిచేసుకుని జీవితాన్ని ఆరోగ్యవంతంగా, ఆనందకరంగా మార్చుకోవాలని పదే పదే చెప్తున్నాం. సమాజంలో మెంటల్‌హెల్త్ పట్ల ఉన్న అతిపెద్ద మానసిక అడ్డంకిని ఛేదించడానికి దాట్ల ఫౌండేషన్‌తో కలిసి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం’’ అన్నారామె.
– వాకా మంజులారెడ్డి
బిడియం వీడండి గొంతు విప్పండి
‘సైకియాట్రీ యట్ డోర్‌స్టెప్’ వాహనంలో ఒక సైకియాట్రిస్ట్, కౌన్సెలర్, కో ఆర్డినేటర్‌తోపాటు సాధారణ మానసిక సమస్యలకు అవసరమయ్యే మందులు ఉంటాయి. ఈ సర్వీస్‌కంటే ప్రధానంగా వారిని చైతన్యపరచడం పనిగా పెట్టుకున్నాం. ఒంట్లో బాగా లేకపోతే డాక్టర్ దగ్గరకు వెళ్లడానికి ఏ మాత్రం బిడియపడం, అలాగే మనసు బాగాలేనప్పుడు సైకియాట్రిస్ట్ లేదా సైకాలజిస్ట్‌ను సంప్రదించడానికి కూడా ఏ మాత్రం బిడియపడకూడదని చెప్పడం ప్రధాన కర్తవ్యం.
– శశి, ‘రోష్ని’ వ్యవస్థాపకురాలు
Comments
Please login to add a commentAdd a comment