Suicide Tendencies Are More In Hyderabad Than Other Cities - Sakshi
Sakshi News home page

Hyderabad: మహానగరంలో మానసిక కల్లోలం!

Published Fri, May 26 2023 3:04 AM | Last Updated on Fri, May 26 2023 1:13 PM

Suicide tendencies are more in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  ఇతర నగరాలతో పోలిస్తే భాగ్యనగరంలో చాలా మందిలో వయసులకు అతీతంగా ఆత్మహత్య ధోరణులు ఎక్కువగా ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. మానసిక ఆరోగ్యంలో వచ్చి న మార్పులపై ఇప్పటివరకు సుమారు 2,500 మంది నగరవాసుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ విషయం వెలుగులోకి వచ్చి నట్లు పేర్కొంది.

అయితే సర్వే ఇంకా కొనసాగుతోందని... మరో నెల తర్వాత ఈ అంశంపై పూర్తిస్థాయిలో స్పష్టత రానుందని సర్వే బృందానికి నేతృత్వం వహిస్తున్న వారిలో ఒకరైన హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ మెడికల్‌ సైన్సెస్‌ స్కూల్‌ ప్రొఫెసర్‌ బి.ఆర్‌.షమన్నా తెలిపారు. దేశంలో కోవిడ్‌ విజృంభణకు ముందు, తర్వాత అర్బన్‌ ప్రాంతాల ప్రజల మానసిక ఆరోగ్య పరిస్థితుల్లో అనూహ్య మార్పులు వచ్చి న నేపథ్యంలో కేంద్రం దేశవ్యాప్తంగా ఈ సర్వే నిర్వహిస్తోంది.

నేషనల్‌ మెంటల్‌ హెల్త్‌ సర్వే–పార్ట్‌ 2 పేరిట హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలలో ఈ అధ్యయనం చేపడుతోంది. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ అధ్యయనానికి హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, ఎర్రగడ్డలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌లు ఇన్వెస్టిగేటర్లుగా వ్యవహరిస్తున్నాయి. 

అన్నింటినీ టచ్‌ చేస్తూ... 
సాధారణ సర్వేల రీతిలో ఇందులోనూ 75 ప్రశ్నలు ఉన్నప్పటికీ పరిస్థితినిబట్టి మార్పుచేర్పులకు అవకాశం ఇస్తూ మొత్తం 300 ప్రశ్నలు ఉన్నాయి. లాటరీ వ్యసనం, గుర్రపు పందేలు, స్ట్రీమింగ్‌ వీడియోలతోపాటు ఇంటర్నెట్, మొబైల్‌ వ్యసనం వంటి అంశాలపై ప్రశ్నలను కూడా చేర్చారు.

కోవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో ఎలాంటి మానసిక స్థితిని ఎదుర్కొన్నారు వంటి ప్రశ్నలు పొందుపరిచారు. కోవిడ్‌ తర్వాత ప్రజల మానసిక ఆరోగ్య భారాన్ని అర్థం చేసుకోవడానికి దోహదపడుతుందని పరిశోధకులు అంటున్నారు. 

బస్తీల్లో సై...కాలనీల్లో నై.. 
సర్వే కోసం నగరంలో 60 క్లస్టర్లను గుర్తించగా అందులో 20 మురికివాడల్లోనే ఉన్నాయి. మురికివాడల నివాసితులు అనేక వ్యసనాలతోపాటు ఇతర సమస్యలతో సతమతమవుతున్నా సర్వే ప్రశ్నలకు తక్షణమే సమాధానాలిస్తున్నారని బృంద సభ్యులు అంటున్నారు.

అదే సమయంలో కాలనీల్లో నివసించే ప్రజల నుంచి సమాధానాలు పొందడం కఠినంగా ఉందని... తమ ప్రశ్నలకు చాలా మంది ఎదురుప్రశ్నలు వేస్తున్నారని వివరిస్తున్నారు. తమ కోసం సమయం వెచ్చి ంచడానికి తేలికగా ఒప్పుకోవడం లేదని చెబుతున్నారు.  

టీనేజర్ల నుంచి... 
సర్వే బృందాలు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 3,600గా తీసుకున్న శాంపిల్‌ సైజ్‌లో టీనేజర్లు సహా ఆపై వయసుగల వారు ఉన్నారు. వారందరినీ ముఖాముఖి ప్రశ్నించి సమాధానాలు సేకరిస్తున్నారు. ఆ సమాచారాన్ని సర్వేకు నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరోసైన్సెస్‌ (నిమ్హాన్స్‌)కు ఏ రోజుకారోజు అప్‌లోడ్‌ చేస్తున్నారు.

ఈ సర్వే జూన్‌ నెలాఖరులోపే పూర్తవుతుందంటున్న పరిశోధకులు... నగరంలో రోహింగ్యాలు, ట్రాన్స్‌జెండర్ల వంటి వారిని కూడా ప్రత్యేక కేటగిరీగా చేర్చి సర్వే చేయవచ్చా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. 

అన్ని చోట్లా పూర్తయ్యాకే స్పష్టత... 
అన్ని నగరాల్లో పూర్తి సర్వే ఫలితాలు వచ్చాకే స్పష్టత వస్తుంది.బెంగళూరు, ముంబైలలో అధ్యయనాలు పూర్తి కావచ్చాయి. చెన్నై, హైదరాబాద్‌లలో దాదాపుగా ఒకేస్థాయిలో ఉన్నాయి. ఢిల్లీ, కోల్‌కతాలలో సర్వేలు కాస్త నెమ్మదిగా సాగుతున్నాయి. ఆయా నగరాలకు చెందిన అధ్యయన ఫలితాలు కూడా వచ్చాక ‘నిమ్హాన్స్‌’వాటిని విశ్లేషించి మరో నెల రోజుల్లోపూర్తి వివరాలు వెల్లడిస్తుందని భావిస్తున్నాం.    - ప్రొ. బి.ఆర్‌.షమన్నా మెడికల్‌ సైన్సెస్‌ స్కూల్, హెచ్‌సీయూ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement