suicide in India
-
Hyderabad: మహానగరంలో మానసిక కల్లోలం!
సాక్షి, హైదరాబాద్ : ఇతర నగరాలతో పోలిస్తే భాగ్యనగరంలో చాలా మందిలో వయసులకు అతీతంగా ఆత్మహత్య ధోరణులు ఎక్కువగా ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. మానసిక ఆరోగ్యంలో వచ్చి న మార్పులపై ఇప్పటివరకు సుమారు 2,500 మంది నగరవాసుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ విషయం వెలుగులోకి వచ్చి నట్లు పేర్కొంది. అయితే సర్వే ఇంకా కొనసాగుతోందని... మరో నెల తర్వాత ఈ అంశంపై పూర్తిస్థాయిలో స్పష్టత రానుందని సర్వే బృందానికి నేతృత్వం వహిస్తున్న వారిలో ఒకరైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మెడికల్ సైన్సెస్ స్కూల్ ప్రొఫెసర్ బి.ఆర్.షమన్నా తెలిపారు. దేశంలో కోవిడ్ విజృంభణకు ముందు, తర్వాత అర్బన్ ప్రాంతాల ప్రజల మానసిక ఆరోగ్య పరిస్థితుల్లో అనూహ్య మార్పులు వచ్చి న నేపథ్యంలో కేంద్రం దేశవ్యాప్తంగా ఈ సర్వే నిర్వహిస్తోంది. నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే–పార్ట్ 2 పేరిట హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలలో ఈ అధ్యయనం చేపడుతోంది. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ అధ్యయనానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఎర్రగడ్డలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్‌లు ఇన్వెస్టిగేటర్లుగా వ్యవహరిస్తున్నాయి. అన్నింటినీ టచ్ చేస్తూ... సాధారణ సర్వేల రీతిలో ఇందులోనూ 75 ప్రశ్నలు ఉన్నప్పటికీ పరిస్థితినిబట్టి మార్పుచేర్పులకు అవకాశం ఇస్తూ మొత్తం 300 ప్రశ్నలు ఉన్నాయి. లాటరీ వ్యసనం, గుర్రపు పందేలు, స్ట్రీమింగ్ వీడియోలతోపాటు ఇంటర్నెట్, మొబైల్ వ్యసనం వంటి అంశాలపై ప్రశ్నలను కూడా చేర్చారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఎలాంటి మానసిక స్థితిని ఎదుర్కొన్నారు వంటి ప్రశ్నలు పొందుపరిచారు. కోవిడ్ తర్వాత ప్రజల మానసిక ఆరోగ్య భారాన్ని అర్థం చేసుకోవడానికి దోహదపడుతుందని పరిశోధకులు అంటున్నారు. బస్తీల్లో సై...కాలనీల్లో నై.. సర్వే కోసం నగరంలో 60 క్లస్టర్లను గుర్తించగా అందులో 20 మురికివాడల్లోనే ఉన్నాయి. మురికివాడల నివాసితులు అనేక వ్యసనాలతోపాటు ఇతర సమస్యలతో సతమతమవుతున్నా సర్వే ప్రశ్నలకు తక్షణమే సమాధానాలిస్తున్నారని బృంద సభ్యులు అంటున్నారు. అదే సమయంలో కాలనీల్లో నివసించే ప్రజల నుంచి సమాధానాలు పొందడం కఠినంగా ఉందని... తమ ప్రశ్నలకు చాలా మంది ఎదురుప్రశ్నలు వేస్తున్నారని వివరిస్తున్నారు. తమ కోసం సమయం వెచ్చి ంచడానికి తేలికగా ఒప్పుకోవడం లేదని చెబుతున్నారు. టీనేజర్ల నుంచి... సర్వే బృందాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3,600గా తీసుకున్న శాంపిల్ సైజ్‌లో టీనేజర్లు సహా ఆపై వయసుగల వారు ఉన్నారు. వారందరినీ ముఖాముఖి ప్రశ్నించి సమాధానాలు సేకరిస్తున్నారు. ఆ సమాచారాన్ని సర్వేకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (నిమ్హాన్స్)కు ఏ రోజుకారోజు అప్లోడ్ చేస్తున్నారు. ఈ సర్వే జూన్ నెలాఖరులోపే పూర్తవుతుందంటున్న పరిశోధకులు... నగరంలో రోహింగ్యాలు, ట్రాన్స్జెండర్ల వంటి వారిని కూడా ప్రత్యేక కేటగిరీగా చేర్చి సర్వే చేయవచ్చా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అన్ని చోట్లా పూర్తయ్యాకే స్పష్టత... అన్ని నగరాల్లో పూర్తి సర్వే ఫలితాలు వచ్చాకే స్పష్టత వస్తుంది.బెంగళూరు, ముంబైలలో అధ్యయనాలు పూర్తి కావచ్చాయి. చెన్నై, హైదరాబాద్‌లలో దాదాపుగా ఒకేస్థాయిలో ఉన్నాయి. ఢిల్లీ, కోల్‌కతాలలో సర్వేలు కాస్త నెమ్మదిగా సాగుతున్నాయి. ఆయా నగరాలకు చెందిన అధ్యయన ఫలితాలు కూడా వచ్చాక ‘నిమ్హాన్స్’వాటిని విశ్లేషించి మరో నెల రోజుల్లోపూర్తి వివరాలు వెల్లడిస్తుందని భావిస్తున్నాం. - ప్రొ. బి.ఆర్.షమన్నా మెడికల్ సైన్సెస్ స్కూల్, హెచ్‌సీయూ -
ఆత్మహత్యల్లో మహారాష్ట్ర టాప్
సాక్షి,న్యూఢిల్లీ: బలవన్మరణాల సంఖ్యపరంగా దేశవ్యాప్తంగా చూస్తే మహారాష్ట్రలో వీటి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. జాతీయ నేర గణాంకాల బ్యూరో తాజా నివేదికలో పలు విషయాలను ప్రస్తావించింది. 2021 ఏడాదిలో దేశవ్యాప్తంగా 1,64,033 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. వృత్తి సమస్యలు, ఒంటరితనం, హింస, కుటుంబ, మానసిక సమస్యలు, మద్యానికి బానిసకావడం, ఆర్థికంగా కుంగుబాటు, అనారోగ్యం ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణాలని నేర గణాంకాల బ్యూరో తెలిపింది. మహారాష్ట్రలో అత్యధికంగా 22,207 మంది, కర్ణాటకలో 13,056 మంది సూసైడ్ చేసుకున్నారు. దేశంలోని మొత్తం ఆత్మహత్యల్లో సగానికిపైగా సూసైడ్లు మహారాష్ట్ర తమిళనాడు, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, కర్ణాటకలోనే జరిగాయి. 53 నగరాల్లో మొత్తంగా 25వేలకుపైగా సూసైడ్ చేసుకున్నారు. 1.73 లక్షల యాక్సిడెంట్ మరణాలు గత ఏడాది దేశవ్యాప్తంగా జరిగిన 4.22 లక్షల ట్రాఫిక్ ప్రమాదాల్లో 1.73 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని జాతీయ నేర గణాంకాల బ్యూరో తెలిపింది. యూపీలో ఎక్కువ మరణాలు సంభవించాయి. 2020తో పోలిస్తే 2021లో మరణాలు 18.8 శాతం పెరగడం ఆందోళనకరం. చదవండి: గణపతి మండపానికి రూ. 316 కోట్ల బీమా -
24 వేల మంది బాలలు బలవన్మరణం
న్యూఢిల్లీ: దేశంలో 2017–19 సంవత్సరాల మధ్య 14–18 ఏళ్ల వయస్సున్న బాలలు 24 వేల మందికి పైగా బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇందులోని 4 వేల కేసులకు పరీక్షల్లో ఫెయిల్ కావడమే ప్రధాన కారణమని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. నేషనల్ క్రైం రికార్డ్స్బ్యూరో(ఎన్సీఆర్బీ) నివేదికను ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్‌కు సమర్పించింది. 2017–19 సంవత్సరాల మధ్య ఆత్మహత్యకు పాల్పడిన 24,568 మంది 14–18 ఏళ్ల గ్రూపులో 13,325 మంది బాలికలున్నట్లు ఆ డేటా పేర్కొంది. ఈ గ్రూపులో.. 2017లో 8,029 మంది, 2018లో 8,162 మంది చనిపోగా 2019 నాటికి వీరి సంఖ్య 8,377కు పెరిగింది. ఈ కాలంలో అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 3,115 మంది తనువు చాలించగా బెంగాల్లో 2,802 మంది, మహారాష్ట్రలో 2,527 మంది, తమిళనాడులో 2,035 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ప్రధానంగా పరీక్షల్లో ఫెయిలవ్వడం కారణంగా 4,046 మంది, వివాహ సంబంధ విషయాలతో 639 మంది చనిపోగా వీరిలో 411 మంది బాలికలున్నారు. ప్రేమ వైఫల్యంతో 3,315 మంది, అనారోగ్యంతో 2,567 మంది, భౌతిక దాడుల కారణంగా 81 మంది బాలలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవికాకుండా, ఆత్మీయులను కోల్పోవడం, మద్యం, డ్రగ్స్ వ్యసనం, అక్రమ గర్భం, మనస్తాపం, నిరుద్యోగం, పేదరికం వంటి కారణాలు కూడా ఉన్నట్లు ఆ డేటా వెల్లడించింది. -
మరో విషాదం : ప్రముఖ టీవీ నటుడు ఆత్మహత్య
సాక్షి, చెన్నై: తమిళ టెలివిజన్ పరిశ్రమ మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ టీవీ నటుడు ఇంద్ర కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. తమిళనాడులోని పెరంబలూర్‌లో ఆయన స్నేహితుని నివాసంలో ఉరివేసుకుని ఉసురు తీసుకున్నారు. వరుస ఆత్మహత్యలతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. (హీరో వీరాభిమాని ఆత్మహత్య : ఆఖరి కోరిక) చెన్నైలోని శ్రీలంక శరణార్థి శిబిరంలో నివాసం ఉంటున్న ఇంద్ర కుమార్ తమిళ డైలీ సీరియల్స్ ద్వారా ఫ్యామస్ అయ్యారు. అయితే గురువారం రాత్రి తన స్నేహితులతో కలిసి సినిమా చూసి వచ్చిన కొన్ని గంటల్లోనే కుమార్ విగతజీవిగా మారడంతో అతని స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయారు స్నేహితుల సమాచారం మేరకు కుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు పోలీసులు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అయితే అవకాశాలు రావడంలేదనే ఆందోళనతోనే ఇంద్ర కుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. మరోవైపు వివాహ జీవితంలో సమస్యలు, భార్యతో విభేదాలు కారణంగానే చనిపోయాడనే మరో వాదన కూడా వినిపిస్తోంది. కాగా కరోనా సంక్షోభ కాలంలో ఫిలిం ఇండస్ట్రీ కూడా కష్టాల్లో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో అవకాశాలు లేక చాలామంది నటీనటులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం ఆందోళన రేపుతోంది. ఈ వారంలో సినీ పరిశ్రమకు సంబంధించి ఇది రెండవ ఘటన. కేసరి, ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ వంటి సినిమాల్లో నటించిన బాలీవుడ్ నటుడు సందీప్ నహర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంతకుముందు ప్రముఖ నటి, వీజే చిత్ర ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. -
భర్తగా మారకు బ్యాచిలరు...
భద్రం బీకేర్ ఫుల్ బ్రదరు భర్తగా మారకు బ్యాచిలరు... అన్నాడో సినిమా కవి. పెళ్లేంటే నూరేళ్ల మంట అని కూడా అన్నారండోయ్. పెళ్లైన తర్వాత బాధ్యతలు పెరిగి స్వేచ్ఛ హరించుకుపోతుందనే ఉద్దేశంతో ఇలా ఆట పట్టిస్తుంటారు. గృహస్థు జీవితంలోకి అడుగుపెట్టగానే బాధ్యతలు పెరగడం సహజం. బాధ్యతల బరువు మోయలేక చాలా మంది నిరాశ, నిస్పృశలకు గురవుతున్నారు. సహనం కోల్పోయి చావును కొనితెచ్చుకుంటున్నారు. పెళ్లనే కాదు- ఉరుకుల పరుగుల జీవితంలో ఆధునిక మానవుడు ప్రతి దశలోనూ మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు. ఒక్కోసారి ఒత్తిడికి తలవంచి తనువు చాలిస్తున్నాడు. విచిత్రమైన విషయం ఏమిటంటే పెళ్లైన వాళ్లే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని జాతీయ నేర నమోదు సంస్థ(ఎన్సీఆర్బీ) వెల్లడించింది. 2013లో ఆత్మహత్యలు చేసుకున్న వారిలో 69.4 శాతం వివాహితులుండగా, 23.6 శాతం మంది అవివాహితులని ఎన్సీఆర్బీ తాజా నివేదిక తేటతెల్లం చేసింది. గతేడాది 1,34,799 మంది బలవన్మరణాలకు పాల్పడగా అందులో 64,098 మంది పురుషులు, 29,491 మంది మహిళలు ఉన్నారు. ఒంటరిగా ఉంటున్న వారిలో 21,062 మంది పురుషులు, 10,766 మంది స్ర్రీలు ప్రాణాలు తీసుకున్నారు. సామాజిక, ఆర్థికపరమైన సమస్యలే వివాహితుల ఆత్మహత్యలు పెరగడానికి కారణమంటున్నారు నిపుణులు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కరుమరుగు కావడం మరో కారణమంటున్నారు. భార్యాభర్తల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తినప్పుడు సర్దిచెప్పేందుకు చిన్న కుటుంబాల్లో పెద్దలుండరు. దీంతో క్షణికావేశంలో వివాహితులు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.