భర్తగా మారకు బ్యాచిలరు...
భద్రం బీకేర్ ఫుల్ బ్రదరు భర్తగా మారకు బ్యాచిలరు... అన్నాడో సినిమా కవి. పెళ్లేంటే నూరేళ్ల మంట అని కూడా అన్నారండోయ్. పెళ్లైన తర్వాత బాధ్యతలు పెరిగి స్వేచ్ఛ హరించుకుపోతుందనే ఉద్దేశంతో ఇలా ఆట పట్టిస్తుంటారు. గృహస్థు జీవితంలోకి అడుగుపెట్టగానే బాధ్యతలు పెరగడం సహజం. బాధ్యతల బరువు మోయలేక చాలా మంది నిరాశ, నిస్పృశలకు గురవుతున్నారు. సహనం కోల్పోయి చావును కొనితెచ్చుకుంటున్నారు.
పెళ్లనే కాదు- ఉరుకుల పరుగుల జీవితంలో ఆధునిక మానవుడు ప్రతి దశలోనూ మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు. ఒక్కోసారి ఒత్తిడికి తలవంచి తనువు చాలిస్తున్నాడు. విచిత్రమైన విషయం ఏమిటంటే పెళ్లైన వాళ్లే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని జాతీయ నేర నమోదు సంస్థ(ఎన్సీఆర్బీ) వెల్లడించింది. 2013లో ఆత్మహత్యలు చేసుకున్న వారిలో 69.4 శాతం వివాహితులుండగా, 23.6 శాతం మంది అవివాహితులని ఎన్సీఆర్బీ తాజా నివేదిక తేటతెల్లం చేసింది.
గతేడాది 1,34,799 మంది బలవన్మరణాలకు పాల్పడగా అందులో 64,098 మంది పురుషులు, 29,491 మంది మహిళలు ఉన్నారు. ఒంటరిగా ఉంటున్న వారిలో 21,062 మంది పురుషులు, 10,766 మంది స్ర్రీలు ప్రాణాలు తీసుకున్నారు. సామాజిక, ఆర్థికపరమైన సమస్యలే వివాహితుల ఆత్మహత్యలు పెరగడానికి కారణమంటున్నారు నిపుణులు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కరుమరుగు కావడం మరో కారణమంటున్నారు. భార్యాభర్తల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తినప్పుడు సర్దిచెప్పేందుకు చిన్న కుటుంబాల్లో పెద్దలుండరు. దీంతో క్షణికావేశంలో వివాహితులు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.