National Crime Records Bureau
-
మనోనిబ్బరం కోల్పోతున్న పురుషులు
హైదరాబాద్: నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ)– 2022 గణాంకాలు ఓ కీలక విషయాన్ని బయటపెట్టాయి. నగరంలో గతేడాది నమోదైన ఆత్మహత్య కేసుల్లో మహిళల కంటే పురుషులవే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నాయి. బాధ్యతలు ఎక్కువగా ఉండటంతో పాటు మనోనిబ్బరం విషయంలో సీ్త్రల కంటే పురుషులే బలహీనంగా ఉండటం దీనికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2022లో నగరంలో మొత్తం 544 ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి. ఈ మృతుల్లో పురుషులు 433 మంది కాగా... మహిళలు 111 మంది ఉన్నట్లు మంగళవారం విడుదలైన ఎన్సీఆర్బీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆత్మహత్యల సంఖ్యలో దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే మన హైదరాబాద్ పదో స్థానంలో ఉంది. అన్నింటా సీ్త్రలపై ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నించే పురుషులు కష్ట,నష్టాలు ఎదుర్కోవడంలో మాత్రం డీలాపడిపోతున్నారు. నిరాశ, నిస్పృహలతో అర్ధాంతరంగా జీవితాలు ముగించడానికే మొగ్గు చూపుతున్నారు. అనేక సమస్యలతో.. ► గత ఏడాది దేశ వ్యాప్తంగా 1,70,924 ఆత్మహత్యలు రికార్డుల్లోకెక్కగా.. వీటిలో 9,980 రాష్ట్రానికి సంబంధించినవే. మెట్రో నగరాలతో పోలిస్తే ప్రథమ స్థానంలో ఢిల్లీ (3367), ద్వితీయ స్థానంలో బెంగళూరు (2313) ఉండగా.. 1004 కేసులతో తర్వాత స్థానం సూరత్‌ది. సిటీలో జరిగిన ఆత్మహత్య మృతుల్లో పురుషులు 544 మంది ఉండగా... సీ్త్రలు 111 మంది ఉన్నారు. అంటే మహిళల కంటే పురుషులు కొన్ని రెట్ల సంఖ్యలో ఆత్మహత్య చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ బలవన్మరణాలకు కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం వంటి అనేక సమస్యలు దోహదం చేస్తున్నాయని ఎన్సీఆర్బీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా బలవన్మరణాలకు పాల్పడటానికి కుటుంబ కలహాలే ఎక్కువగా కారణం అవుతున్నాయి. ► నగరంలో గత ఏడాది జరిగిన ఆత్మహత్యల్లో 20.5 శాతం అప్పులు, బ్యాంకు రుణాలు తీర్చలేకపోవడం వంటి కారణాల వల్లే జరిగాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వివాహేతర సంబంధాల కారణంగా జరిగిన ఆత్మహత్యల్లో ఉన్న ముగ్గురు మృతులూ పురుషులే అని గణాంకాలు చెబుతున్నాయి. కుటుంబ కలహాలు కారణంగా ఆత్మహత్య చేసుకున్న 120 మందిలో 87 మంది పురుషులు ఉన్నారు. అనారోగ్య కారణాలతో 138 మంది సూసైడ్ చేసుకోగా వీరిలో మగవారు 100 మంది ఉన్నారు. సన్నిహితులు చనిపోయారనే కారణంతో ఏడుగురు పురుషులు, ఎనిమిది మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. నగరంలో ప్రేమ వ్యవహారాల వల్ల ఆత్మహత్య చేసుకున్న వారిలో మహిళల కంటే పురుషులు ఏడుగురు ఎక్కువ ఉన్నారు. నిరుద్యోగం కారణంగా చనిపోయిన 13 మంది పురుషులే కావడం గమనార్హం. పూర్తి వాస్తవాలు వెలుగులోకి రావు.. ఎన్సీఆర్బీ రాష్ట్ర పోలీసులు ఇచ్చే జాబితా ఆధారంగా నివేదిక రూపొందిస్తుంది. ఈ జాబితా ఠాణాలో నమోదయ్యే కేసుల ఆధారంగా తయారవుతాయి. ఆత్మహత్యల ఉదంతాలకు సంబంధించి అనేక కేసుల్లో అసలు కారణాలు వెలుగులోకి రావు. కొన్ని ఉదంతాలు అసలు పోలీసు రికార్డుల్లోకే ఎక్కవు. మహిళలు, యువతులకు సంబంధించి ఉదంతాల్లోనే ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు, విఫల ప్రేమలు, వివాహేతర సంబంధాల వల్ల జరిగిన ఉదంతాలు బయటకు రాకూడదనే కుటుంబీకులు ప్రయత్నిస్తారు. ఒకవేళ పోలీసుల వరకు వచ్చి అసలు కారణాలు బయటకు చెప్పరు. ఇలాంటి అనేక కారణాలు ఎన్సీఆర్బీ గణాంకాలపై ప్రభావం చూపిస్తుంటాయి. – నగర పోలీసు ఉన్నతాధికారి -
గంటకో రైతు మృతి
న్యూఢిల్లీ: బీజేపీ పాలనలో దేశంలో గంటకో రైతు ఆత్మహత్యకు పాల్పడుతున్నాడంటూ కాంగ్రెస్ పార్టీ మంగళవారం ధ్వజమెత్తింది. ‘‘2021లో 10,881 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. అంటే సగటున రోజుకు 30 మంది. గంటకొకరన్నమాట. 2014–21 మధ్య 54 వేల రైతు ఆత్మహత్యలు జరిగినట్టు నేసనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో గణాంకాలే చెబుతున్నాయి. 2022కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని బీజేపీ ప్రభుత్వం వాగ్దానం చేసింది. కానీ ఇప్పుడు వారికి రోజుకు కేవలం 27 రూపాయలు గిడుతోంది’’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాథే అన్నారు. -
పెరిగిన భద్రత.. తగ్గిన నేరాలు.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక వెల్లడి
సాక్షి, అమరావతి: ఆధునిక సమాచార, సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న టెక్ పోలీసింగ్ విధానం సత్ఫలితాలిస్తోంది. రాష్ట్రంలో నేరాలు తగ్గుతున్నాయి. సైబర్ నేరాల కట్టడిలోనూ రాష్ట్ర పోలీసు యంత్రాంగం విజయవంతమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిన దిశ యాప్ సత్ఫలితాలిస్తోంది. పోక్సో ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం తదితర చర్యలతో పోలీసుల పనితీరు గణనీయంగా మెరుగుపడుతోంది. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ మంచి పనితీరు కనబరిచిందని జాతీయ నేర గణాంకాల నివేదిక (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ)–2021) వెల్లడించింది. టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నేరాలు గణనీయంగా తగ్గాయని ఆ నివేదిక గణాంకాలు చెబుతున్నాయి. ఎన్సీఆర్బీ నివేదికలోని ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి. తగ్గిన హత్యలు ► రాష్ట్రంలో హత్యలు గణనీయంగా తగ్గాయి. చంద్రబాబు ప్రభుత్వంలో 2014లో 1,175, 2015లో 1,099, 2016లో 1,123, 2017లో 2,154, 2018లో 935 హత్యలు జరిగాయి. అంటే ఏడాదికి సగటున 1,077 మంది హత్యకు గురయ్యారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2019లో 870, 2020లో 853, 2021లో 956 హత్య కేసులు నమోదయ్యాయి. అంటే సగటున 893 హత్యలు జరిగాయి. ఏడాదికి సగటున 63 వరకు తగ్గినట్టు ఎన్సీఆర్బీ వెల్లడించింది. రాష్ట్రంలో అల్లర్లు, అలజడుల కేసులు 2019లో 492 నమోదు కాగా 2021లో 444కు తగ్గాయి. ► రాష్ట్రంలో కిడ్నాప్ కేసులూ తగ్గాయి. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2014లో 1,066, 2015లో 917, 2016లో 917, 2017లో 1,018, 2018లో 1,055 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. అంటే ఏడాదికి సగటున 944 మంది కిడ్నాప్‌నకు గురయ్యారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2019లో 902, 2020లో 737, 2021లో 835 కేసులు నమోదయ్యాయి. అంటే ఏడాదికి సగటున 824 కిడ్నాప్‌లు జరిగాయని ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొంది. డబ్బుల కోసం 2019లో 15 కిడ్నాప్‌లు జరగ్గా.. 2021లో 9 కేసులే నమోదయ్యాయి. బడుగులకు భద్రత ► వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణకు చిత్తశుద్ధితో కృషిచేస్తోంది. అవగాహన సదస్సుల ద్వారా వారిలో చైతన్యం కలిగిస్తోంది. దాంతో ఎస్సీ, ఎస్టీలు తాము వేధింపులకు గురైతే ఇప్పుడు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయగలుగుతున్నారని ఎన్సీఆర్బీ నివేదిక గణాంకాలు వెల్లడించాయి. ► చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎస్సీలకు సంబంధించి 2014లో 2,113 కేసులు, 2015లో 2,263 కేసులు, 2016లో 2,335 కేసులు, 2017లో 1,969 కేసులు నమోదయ్యాయి. మొత్తం మీద టీడీపీ ప్రభుత్వ హయాంలో సగటున ఏడాదికి 2,103 కేసులు నమోదయ్యాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2021 వరకు సగటున 2,011 కేసులు నమోదయ్యాయి. ఇక 2021లో 2,014 కేసులు నమోదయ్యాయని ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. ► టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎస్టీలకు సంబంధించి 2014లో 390 కేసులు, 2015లో 362 కేసులు, 2016లో 405 కేసులు, 2017లో 341 కేసులు నమోదయ్యాయి. మొత్తం మీద టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏడాదికి సగటున 365 కేసులు నమోదయ్యాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2021లో 361 కేసులే నమోదయ్యాయి. ఇక 2019 నుంచి 2021వరకు సగటున ఏడాదికి కేసుల సంఖ్య 337కు తగ్గింది. ► ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, రక్షణకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. వేధింపులకు గురైన ఎస్సీ, ఎస్టీలకు టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019వరకు రూ.52.32కోట్లే పరిహారంగా అందించారు. కాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019 నుంచి 2022 వరకు మూడేళ్లలోనే బాధితులైన ఎస్సీ, ఎస్టీలకు పరిహారంగా రూ.120 కోట్లు ఇవ్వడం విశేషం. పోలీసు సిబ్బందిపై కేసులు తగ్గుదల రాష్ట్రంలో పోలీసు సిబ్బందిపై కేసులు కూడా తగ్గాయి. 2020లో 261 కేసులు నమోదు కాగా 2021లో 185 కేసులే నమోదయ్యాయి. లాకప్ మరణాలు 2020లో 8 జరగ్గా, 2021లో ఆరుకు తగ్గాయని నివేదిక వెల్లడించింది. చార్జిషీట్ల నమోదులో అగ్రస్థానం కేసుల దర్యాప్తు, నేరస్తులకు న్యాయస్థానాల ద్వారా శిక్షలు విధించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. నేర నిరూపణలో కీలకమైన చార్జిషీట్లను సకాలంలో దాఖలు చేయడంలో అగ్రస్థానాన్ని సాధించింది. గడువులోగా దేశంలో 77.1శాతం కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఏకంగా 93.7 శాతం కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేస్తుండటం విశేషం. ఒక కేసు దర్యాప్తునకు 2018లో సగటున 164 రోజుల సమయం పట్టగా.. 2021లో 42 రోజుల్లోనే పూర్తి చేస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అత్యాచారం, లైంగిక వేధింపుల కేసుల్లో ఏడు రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్లు దాఖలు చేయడం పోలీసు శాఖ సమర్థతకు నిదర్శనం. పోక్సో కేసుల్లో 60 రోజల్లోనే చార్జిషీట్లు దాఖలు చేస్తున్నారు. 2019లో 14శాతం కేసుల్లోనే 60 రోజుల్లో చార్జిషీట్లు దాఖలు చేయగా.. 2021లో ఏకంగా 92.5 శాతం కేసుల్లో దాఖలు చేశారు. మహిళా భద్రతకు భరోసా ► దిశ యాప్ ద్వారా మహిళల భద్రతకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం భరోసానిస్తోంది. 2019 నుంచి వారిపై నేరాలు పెరగకుండా సమర్థంగా కట్టడి చేస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016లో మహిళలపై నేరాల కేసులు 16,362 నమోదు కాగా... 2017లో 17,909 నమోదయ్యాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2021లో మహిళలపై నేరాల కేసులు 17,752కు తగ్గాయని నివేదిక వెల్లడించింది. ► తెలంగాణ, కేరళ వంటి రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై నేరాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ప్రతి లక్ష జనాభాకు తెలంగాణలో మహిళలపై నేరాల కేసులు 111.2 నమోదు అవుతుండగా కేరళలో 73.3 కేసులు ఉన్నాయి. కాగా ఏపీలో 67.2 కేసులు నమోదవుతున్నాయి. ► ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారం–హత్య కేసులు గణనీయంగా తగ్గాయి. 2019లో ఆరు, 2020లో ఐదు కేసులు నమోదు కాగా 2021లో రెండు కేసులు నమోదయ్యాయి. అత్యాచారయత్నం కేసులు 2019లో 177, 2021లో 162 కేసులు నమోదయ్యాయి. బాలికలపై అత్యాచార యత్నం కేసులు 2019లో 45, 2020లో 40, 2021లో 35 నమోదయ్యాయి. మహిళలపై దాడుల కేసులు 8 శాతం తగ్గాయి. 2020లో 2,541 కేసులు నమోదు కాగా 2021లో 2,330 కేసులు నమోదయ్యాయి. బాలలపై నేరాలు తగ్గుముఖం బాలలపై నేరాలకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తోంది. 18ఏళ్ల లోపు వారిపై వేధింపుల కేసులు రాష్ట్రంలో తగ్గాయని ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. బాలికలపై దాడుల కేసులు 2020లో 513 నమోదు కాగా 2021లో 493కు తగ్గాయి. బాలలను వేధించేవారిపై పోక్సో చట్టం కింద నమోదు చేసే కేసులు 7శాతం తగ్గాయని నివేదిక పేర్కొంది. ఈ కేసులు 2019లో 502, 2021లో 466 నమోదయ్యాయి. రైతు ఆత్మహత్యలపై తప్పుదోవ పట్టిస్తున్న ఎల్లో మీడియా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల సంఖ్యపై ఎల్లో మీడియా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోంది. ఎన్సీఆర్బీ నివేదికలో ఆత్మహత్యల సంఖ్యనే పేర్కొంటుంది. కానీ అందుకు కారణాలను ప్రత్యేకంగా పేర్కొనదు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలతో నిమిత్తం లేదని కూడా ఎన్సీఆర్బీ స్పష్టం చేసింది. కానీ ఎల్లో మీడియా మాత్రం ఈ విషయాన్ని వక్రీకరిస్తూ వాస్తవ విరుద్ధమైన కథనాలను ప్రచురిస్తోంది. వాస్తవానికి రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో నిమగ్నమైన వ్యక్తుల ఆత్మహత్యలు తగ్గాయి. 2019లో 628 మంది, 2020లో 564 మంది ఆత్మహత్య చేసుకోగా 2021లో ఆత్మహత్యలు 481కు తగ్గాయి. భూమి కలిగిన రైతుల ఆత్మహత్యల కేసులు 2019లో 438, 2020లో 424 నమోదు కాగా 2021లో 359కు తగ్గాయి. కౌలు రైతుల ఆత్మహత్యలు 2019లో 190, 2020లో 140 కేసులు నమోదు కాగా 2021లో 122కు తగ్గాయి. -
తెలంగాణలో భారీగా పెరిగిన క్రైం రేటు.. దేశంలోనే నెం.1
న్యూఢిల్లీ: 2021లో తెలంగాణలో క్రైం రేటు విపరీతంగా పెరిగింది. అంతేకాదు మహిళలపై దాడులు, చిన్నారులపై లైంగిక వేధింపులు సైతం భారీగా పెరిగాయి. సైబర్ నేరాల్లోనూ తెలంగాణ దేశంలోనే తొలిస్థానలో ఉందని జాతీయ నేర గణాంక సంస్థ వెల్లడించింది. ఈ మేరకు జాతీయ నేర గణాంక సంస్థ 2021 నివేదిక ప్రకటించింది. దీని ప్రకారం మానవ అక్రమ రవాణా, ఆహార కల్తీ కేసుల్లోనూ తెలంగాణ మళ్లీ టాప్‌గా నిలిచింది. ఇక రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది 2019లో 2,691 సైబర్ నేరాలు నమోదవ్వగా. .2020లో ఈసంఖ్య 5,024కు చేరింది. కాగా 2021లో సైబర్ నేరాలు 200 శాతం పెరిగి ఏకంగా 10,303కు చేరాయి. దేశ వ్యాప్తంగా 52, 430 సైబర్ నేరాల కేసులు వెలుగు చూస్తే అత్యధికంగా తెలంగాణలోనే 20 శాతం నమోదవుతున్నాయి. సైబర్ నేరాల్లో 8, 829 కేసులతో ఉత్తర ప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. ఇక తెలంగాణలో ఆర్థిక నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. 2019లో 11, 465.. 2020లో 12.985..కేసులు నమోదయితే 2021లో ఏకంగా 20,759 కేసులు వచ్చాయి. 23, 757 ఆర్థిక నేరాల కేసులతో రాజస్థాన్ అగ్ర స్థానంలో ఉంది. వృద్ధులపై దాడుల్లో తెలంగాణ మూడు, రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. ఏటీఎం, ఆన్లైన్ బ్యాంకింగ్, ఓటీపీ, మార్ఫింగ్ మోసాలు, ఫేక్ ప్రొఫైల్ తయారీ తెలంగాణలో అధికమని ఎన్సీఆర్బీ నివేదికలో తేలింది. చదవండి: హతవిధీ!..పదేళ్ల తర్వాత విధులకు..గుండెపోటుతో -
ఉజ్వల భవిత.. ఊచల వెనక
సాక్షి, హైదరాబాద్: క్షణికావేశంలో చేస్తున్న నేరాలు జీవితాన్ని ఛిద్రం చేస్తున్నాయి. ఉన్నత చదువుల్లోనో, ఉద్యోగ వాపారాల్లోనో రాణించాల్సిన యువత జైలు గదుల్లో బందీ అవుతోంది. తెలంగాణ జైళ్లలో మగ్గుతున్న వారిలో ఎక్కువమంది యుక్త వయస్కులేనని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజాగా విడుదల చేసిన గణాంకాలు(2020) స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 37 జైళ్లలో 6,114 మంది ఉండగా, వీరిలో 1,910 మంది వివిధ నేరాల్లో శిక్ష పడిన వారు కాగా, 3,946 మంది అండర్ ట్రయల్స్ (విచారణ ఖైదీలు), మరో 256 మంది డిటైనీస్ (ముందు జాగ్రత్తగా నిర్బంధంలోకి తీసుకున్నవారు) ఉన్నారని ఎన్సీఆర్బీ పేర్కొంటోంది. అయితే వీరిలో ఎక్కువమంది 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సున్న వారు కావడం గమనార్హం. హత్యలు, లైంగిక దాడుల కేసులే అధికం అండర్ ట్రయల్స్‌లో ఖైదీలుగా ఉన్న యుక్త వయస్కులు ఎక్కువగా హత్యలు, హత్యాప్రయత్నం, లైంగిక దాడులు, మహిళలపై వేధింపులు, మద్యం, మాదకద్రవ్యాల సంబంధిత కేసులు, దొంగతనాల కేసుల్లో జైలు బాట పడుతున్నట్టు ఎన్సీఆర్బీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అదే విధంగా శిక్ష అనుభవిస్తున్న కేటగిరీలోనూ హత్యలు, లైంగిక దాడులు, మహిళలపై వేధింపులు, దొంగతనాలు తదితర కేసుల వారు ఉన్నట్టు వెల్లడవుతోంది. -
ప్రమాదాల్లో 11,822 మంది మృత్యువాత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోడ్డు, రైలు, ఇతర ప్రమాదాల వల్ల 11,822 మంది మృత్యువాత పడ్డట్లు నేషనల్ క్రైమ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. ప్రమాద మరణాలు, ఆత్మహత్యలకు సంబంధించిన జాబితాను గురువారం విడుదల చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 2019 కంటే 2020 ఏడాదిలో రోడ్డు ప్రమాదాల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య తగ్గినట్లు పేర్కొంది. అలాగే ఆత్మహత్య ఘటనల్లోనూ తగ్గుదల ఉందని వెల్లడించింది. ప్రమాదాల్లో 11,822 మంది.. రోడ్డు ప్రమాదాలు, రైల్వే ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు ఇతరత్రా ప్రమాదాల కింద మొత్తం 11,822 మంది మరణించినట్లు వెల్లడించింది. 2019–20కి సంబంధించిన జాబితాలో రాష్ట్రంలో జరిగిన 19,505 ఘటనల్లో 7,219 మంది రోడ్డు ప్రమాదాల్లోనూ మృత్యువాత పడ్డుట్టు తెలిపింది. ప్రకృతి వైపరీత్యాల కారణం గా 170 మంది మృత్యువాత పడినట్లు తెలిసింది. రైలు ప్రమాదాల్లో 337 మంది మృత్యువాత పడ్డారని పేర్కొంది. గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాలతో పోలిస్తే 11 శాతం మృతుల సంఖ్య తగ్గినట్టు ఎన్సీఆర్బీ స్పష్టం చేసింది. పలు కారణాల వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనల్లో 8,058 మంది మృతి చెందినట్లు నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో వెల్లడించింది. ఇందులో కుటుంబ సమస్యల వల్ల ఆత్మహత్యలకు పాల్పడ్డ వారే అధికంగా ఉన్నారని తెలిపింది. -
మానసిక సమస్యలపై శ్రద్ధ పెట్టాలి: విక్రమ్
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు, ఇతర కౌమార వయస్కుల ఆత్మహత్యలపై సమాజం ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని ప్రముఖ మానసిక శాస్త్రవేత్త, హార్వర్డ్ మెడికల్ స్కూల్ అధ్యాపకుడు విక్రమ్ పటేల్ పేర్కొన్నారు. యుక్తవయసులో ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య భారత్‌లోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిం చే అంశమన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యు లర్ బయాలజీ (సీసీఎంబీ) వ్యవస్థాపక దినోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2012 నాటి లెక్కల ప్రకారం దేశం మొత్తమ్మీద 60 వేల మంది యువజనులు ఆత్మహత్యల కారణంగా మరణించారు. వాస్తవ పరిస్థితులు ఇంతకంటే అధ్వాన్నంగా ఉన్నాయని విక్రమ్ పేర్కొన్నారు. దేశంలోనే అత్యధిక ఆత్మహత్య లు (యువత) పుదుచ్చేరిలో నమోదవుతుండగా.. ఏపీ, తెలంగాణలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయ న్నారు. యువత మానసిక ఆరోగ్యం పరిరక్షణకు తల్లిదండ్రులతోపాటు సమాజం తమవంతు పాత్ర పోషించాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా పాల్గొన్నారు. -
‘377’ కేసులు యూపీలోనే అత్యధికం
న్యూఢిల్లీ: దేశంలో స్వలింగ సంపర్కులకు సంబంధించి ఐపీసీ సెక్షన్ 377 కింద అత్యధిక కేసులు ఉత్తరప్రదేశ్‌లో నమోదయిన్నట్లు తేలింది. జాతీయ నేర నమోదు సంస్థ(ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం 2016లో యూపీలో 999 కేసులు నమోదుకాగా, కేరళ (207), ఢిల్లీ(183), మహారాష్ట్ర(170)లు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇద్దరు వయోజనులైన పురుషులు లేదా స్త్రీల మధ్య పరస్పర సమ్మతితో ప్రైవేటుగా సాగే శృంగారం నేరం కాదంటూ ఐపీసీ సెక్షన్ 377లోని కొన్ని నిబంధనలను కొట్టేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అవతలి వ్యక్తి సమ్మతి లేకుండా లేదా మైనర్లతో లేదా జంతువులతో చేసే శృంగారాన్ని నేరంగానే పరిగణించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 2016లో దేశవ్యాప్తంగా పురుష స్వలింగ సంపర్కులపై 2,195 కేసులు నమోదుకాగా, 2015లో 1,347, 2014లో 1,148 కేసులను పోలీసులు నమోదుచేశారు. తాజాగా సుప్రీం తీర్పు నేపథ్యంలో వీరిలో చాలామంది నిందితులకు ఊరట లభించే అవకాశముందని భావిస్తున్నారు. -
అయ్యయ్యో.. ఏసీ బోగీలు కనబడడం లేదు..!
రైళ్లలో ట్యూబ్‌లైట్లు, ఫ్యాన్లు, నల్లాలు, కొన్ని సందర్భాల్లో వాష్ బేసిన్లు సైతం చోరీకి గురికావడం, ఏసీ రైళ్లలోనైతే చేతి తువాళ్లు, బ్లాంకెట్లు వంటివి మాయమవుతున్న ఘటనలు ఇతర దేశాల్లోనైతే ఆశ్చర్యంగా చూస్తారు కాని... ఇక్కడైతే ఇదంతా మామూలే అన్నట్టుగా మనవాళ్లు పెద్దగా పట్టించుకోరు. రైళ్లలో ప్రవేశపెట్టిన ‘బయో టాయ్లెట్ల’లోని స్టెయిన్లెస్స్టీల్ డస్ట్బిన్లు కూడా దొంగతనానికి గురవుతున్న జాబితాలో చేరిపోయాయి. అయితే తాజాగా ఏకంగా రైలు బోగీలే అవీ కూడా ఏసీ కోచ్‌లు కొన్ని కనిపించకుండా పోయాయనే వార్తలు నోళ్లు వెళ్లబెట్టేలా చేస్తున్నాయి. వీటి ప్రకారం రాంచీ–న్యూఢిల్లీల మధ్య నడిచే రాజధాని, సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు సంబంధించిన కొన్ని కొత్త బోగీలు రాంచీ రైల్వే డివిజన్ యార్డు నుంచి మాయమై పోయాయి. ఈవిధంగా కొన్ని బోగీలకు బోగీలే కనబడకుండా పోవడం పెద్ద కలకలాన్నే సృష్టించింది. రాజధాని, సంపర్క్ క్రాంతి రైళ్లలో జతచేయాల్సిన ఈ బోగీలు మిస్ కావడంతో వాటి స్థానంలో పాత రైలు డబ్బాలతోనే రైల్వేశాఖ పని కానీచ్చేస్తోంది. ఇటీవల రాంఛీ నుంచి బయలుదేరాల్సిన రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మూడోబోగీలు కదలకుండా మొరాయించడంతో ప్రయాణీకులు పెట్టిన గగ్గోలు అంతా ఇంతా కాదు. అధునాతన సౌకర్యాలున్న రైళ్లుగా పరిగణిస్తున్న రాజధాని వంటి రైళ్ల కోసం తెప్పించిన కొత్త కోచ్‌లు ఏమయ్యయో తెలియక అక్కడి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ రైలు డబ్బాలు కనిపించకుండా పోవడం వెనక పెద్ద ముఠాయే పనిచేస్తున్నట్టు ఉందని సందేహాలు వ్యక్తం చేస్తున్న వారూ ఉన్నారు. దీనిపై సంబంధిత అధికారులు ఫిర్యాదు కూడా చేసినట్టు చెబుతున్నారు. అంతకు ముందు కూడా ఒకటో రెండో ఇలాంటి ఘటనలు జరిగినా ఇప్పుడు ఏకంగా కొన్ని ఏసీ బోగీలే కనిపించకుండా పోవడం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఏసీ బోగీలు కనబడకుండా పోయాయన్న వార్తలపై రాంచీ డివిజన్ అధికారి స్పందించినట్టు ఓ పత్రిక వెల్లడించింది. ‘తమ డివిజన్‌లోనే వీటిని ఉపయోగిస్తున్నట్టు మేము మార్క్ చేశాం. ఈ కోచ్‌లు ఉత్తరాది డివిజన్లో వినియోగంలో ఉన్నట్టుగా భావిస్తున్నాం. ఈ ఏసీ బోగీలను తిరిగి తమకు అప్పగించాలంటూ ఉత్తరాది రైల్వేకి ఆగ్నేయ రైల్వే లేఖ రాసింది. త్వరలోనే అవి వెనక్కు వస్తాయని ఆశిస్తున్నాం’ ఆ అధికారి పేర్కొన్నట్టు తెలిపింది. చిన్న చిన్న చోరీలు ఎక్కువే... 2016 నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం...2015లో రైళ్లలో చోటుచేసుకున్న చోరీ కేసులు 9.42 లక్షలుండగా, 2016లో ఈ సంఖ్య11 లక్షలకు చేరుకుంది. వీటిలో 2 లక్షల కేసులతో మహారాష్ట్ర మొదటిస్థానంలో, 1.24 లక్షల కేసులతో ఉత్తరప్రదేశ్ రెండోస్థానంలో నిలిచాయి. 2016–17లో చత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ కోచింగ్ డిపో పరిధిలో 817 బయో టాయ్‌లెట్లున్నాయి. దీని పరిధిలో 3,601 స్టీల్ డస్ట్బిన్లు కనబడకుండా పోయినట్లు ఫిర్యాదు చేశారు. పశ్చిమబెంగాల్లోని సీయల్దా కోచింగ్ డిపో పరిధిలో 1,304 బయో టాయ్లెట్లుండగా 3,536 చోరీకి గురైనట్టు అధికారులు తెలిపారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
బాల్యాన్ని చిదిమేస్తున్నారు..
దేశంలో పసికూనలపై అఘాయిత్యాలకు కశ్మీర్‌లోని కతువా ఘటన ప్రత్యక్ష ఉదాహరణ. జమ్మూకాశ్మీర్‌లోని కతువాలో ఎనిమిదేళ్ళ పసికూనపై జరిగిన అత్యాచారం కానీ, గుజరాత్‌లు తీవ్రమైన గాయాలతో బయటపడ్డ తొమ్మిదేళ్ళ చిన్నారి అత్యాచారం కేసు సహా ఉత్తర ప్రదేశ్, ఒరిస్సాల్లో ఈ మధ్యే వెలుగులోకి వచ్చిన ఇద్దరు చిన్నారుల అత్యాచారం కేసుల నేపథ్యంలో ఇటీవలి కాలంలో మైనర్ బాలికలపై అత్యాచారం కేసులను పరిశీలిస్తే మన దేశంలో మైనర్ బాలికలపై అత్యాచారాలు 500 శాతం పెరిగినట్టు తేలింది. గత పదేళ్ళలో మైనర్ బాలికల మీద అత్యాచారాలు 500 శాతం పెరిగినట్టు చైల్డ్ రైట్స్ అండ్ యు (సిఆర్‌వై) నిర్వహించిన తాజా పరిశోధన తేల్చింది. సిఆర్‌వై సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో మన దేశంలో 2006లో 18,967 మంది మైనర్ బాలికలు అత్యాచారాల బారిన పడితే 2016కి వచ్చేసరికి అంటే కేవలం పదేళ్ళలో 106,958 మంది మైనర్ బాలికలపై అత్యాచారాలు జరిగినట్టు తేలింది. ఇందులో 50 శాతానికిపైగా నేరాలు కేవలం ఐదు రాష్ట్రాల్లో నమోదైనవే. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోనే చిన్నారులపై 50 శాతం అత్యాచార కేసులు నమోదైనట్టు క్రై(సిఆర్‌వై) చిల్డ్రన్ రైట్స్ అండ్ యు అనే సంస్థ వెల్లడించింది. చిన్నారులపై అత్యాచారాల్లో ఉత్తర ప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉండడం ఆ రాష్ట్రంలో చిన్నారులకున్న రక్షణని ప్రశ్నార్థకంగా మార్చింది. మైనర్ బాలికలపై అత్యాచారాలు జరిగినట్టు నమోదైన కేసుల్లో 15 శాతం ఉత్తరప్రదేశ్‌లోనూ, మహారాష్ట్రలో 14 శాతం, మధ్యప్రదేశ్‌లో 13శాతం జరిగినట్టు నేర పరిశోధనా గణాంకాలు వెల్లడించాయి. 2016 నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం 2015తో పోలిస్తే మన దేశంలో చిన్నారులపై నేరాల సంఖ్య 14 శాతం పెరిగింది. అదేవిధంగా దేశంలో 2016 ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్స్(పోక్సో) యాక్ట్ ప్రకారం పరిశీలిస్తే చిన్నారులపై జరుగుతోన్న నేరాల్లో మూడొంతులు లైంగిక పరమైనవే. ఈ గణాంకాల ప్రకారం మన దేశంలో ప్రతి 15 నిముషాలకు ఒక పసికూన లైంగిక నేరాల బారిన పడుతోంది. గత ఐదేళ్లలోనే చిన్నారులపై లైంగిక నేరాలు 300 శాతం పెరగడం ప్రమాదం తీవ్రతని ప్రతిబింబిస్తోంది. -
గుర్తు తెలియని 5వేల మృతదేహాలు
సాక్షి, కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో గుర్తు తెలియని మృతదేహాలు సంఖ్య పెరిగిపోతోంది. తాజా రిపోర్టుల ప్రకారం 2016లో ఒక్క పశ్చిమ బెంగాల్లోనే సుమారు 5వేల గుర్తింపులేని మృతదేహాలు ఉన్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) తెలిపింది. ఇందులో అధికంగా రాజధాని కోల్‌కతా పరిసర ప్రాంతాల్లో జరిగిన పలు సంఘటనలు, ప్రమాదాల నుంచి తీసుకువచ్చినవేనని పేర్కొంది. అంతేకాకుండా వీటిలో ఎక్కువ శాతం హత్య కేసులే ఎక్కువగా ఉండటం విశేషం, వీటి ద్వారా రాష్ట్రంలో మర్డర్ కేసులు పెరిగిపోతున్నాయని ఎన్సీఆర్బీ ఆందోళన వ్యక్తం చేసింది. తాజా లెక్కల ప్రకారం మహారాష్ట్ర, తమిళనాడులు మొదటి స్థానాల్లో ఉన్నాయి. రికవరీ చేసిన మృత దేహాల్లో ఎక్కువ శాతం రైలు పట్టాలు, నదీ తీరాల్లో దొరికినవే. వీటి మీద ఎవరూ ఫిర్యాదు చేయకపోవడం, ఎక్కువ గుర్తు తెలియని మృతదేహాల సంఖ్య పెరగిపోతోందని, అంతేకాకుండ మరిన్ని కేసుల్లో అసంపూర్తి సమాచారం ఉండటంతో కేసులను విచారించడంలో ఆలస్యమౌతోందని పోలీసు వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కోసం టెక్నాలజీనీ అభివృద్ధి పరిచినప్పటికి ఈ సమస్య ప్రభుత్వానికి సవాలుగా మారింది. దీంతో ఈ సమస్యను అధిగమించేందుకు పోలీసులు సరికొత్త పద్దతిని అనుసస్తున్నారు. అన్ని పోలీసు స్టేషన్లలో దంతాలను భద్రపరిచే లైబ్రరీ ఏర్పాటు చేయనున్నట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వీటి ద్వారా డీఎన్ఏ పరీక్షల ద్వారా కేసులను పరిస్కరించే ఆలోచనల్లో పోలీసు యంత్రాంగం ఉన్నట్లు తెలిపారు. -
ఇది సూసైడే
భారత్‌లో డ్రగ్స్ బారిన పడి ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. గడిచిన పది సంవత్సరాల్లో 20 వేల మందికి పైనే డ్రగ్స్ మత్తులో ఆత్మహత్య చేసుకున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలు చెబుతున్నాయి. డ్రగ్స్ అంటూ సాధారణంగా పిలిచే మాదకద్రవ్యాల్లో చాలా రకాలు ఉంటాయి. ఉదాహరణకు గంజాయి, చరస్, హషీష్ ఆయిల్, భంగ్, కొకైన్, బ్రౌన్‌షుగర్, హెరాయిన్, ఎల్ఎస్డీ, ఎండీఎంఏ వంటివి అందులో కొన్ని. ఇటీవల పోలీసులు నిర్వహించిన దాడుల్లో బయటపడ్డవి ఇవే. వీటిల్లో ఒక్కోదానికి మళ్లీ వేర్వేరు మారుపేర్లు ఉన్నాయి. ఉదాహరణకు... హెరాయిన్ మారుపేర్లు : బ్లాక్ ట్రా, చివా, నెగ్రా, హార్స్. ఇలాతీసుకుంటారు : ఇంజెక్షన్, ముక్కుతో పీల్చడం, సిగరెట్లో నింపుకొని కాల్చడం. దుష్ప్రభావాలు : శ్వాసకోశవ్యాధులు, చర్మవ్యాధులతో పాటు కోమాలోకి వెళ్లచ్చు. ఎక్కువగా తీసుకుంటే మరణం కూడా. కొకైన్ మారుపేర్లు : స్టఫ్, ఫ్లాకీ, స్నో, కోకా, సోడా. ఇలా తీసుకుంటారు : ముక్కుతో పీల్చడం, సిగరెట్లో నింపి కాల్చడం, వైన్‌లో కలిపి తాగడం (స్పైకింగ్). దుష్ప్రభావాలు : కేంద్రనాడీవ్యవస్థ దెబ్బతింటుంది. జ్ఞాపకశక్తి కోల్పోతారు. అలై్జమర్స్ వ్యాధి వచ్చే అవకాశం, గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. గాంజా, చరస్ : మాల్ అని వ్యవహరిస్తారు. ఈ చెట్టు నుంచి స్రవించే పదార్థం నుంచి చరస్ ఉత్పత్తి అవుతుంది. ఇలా తీసుకుంటారు: ఆకులను సిగరెట్లో నింపుకొని కాలుస్తారు. చరస్‌ను నేరుగా తీసుకుంటారు లేదా సిగరెట్లో నింపుకొని తాగుతారు. దుష్ప్రభావాలు : మెదడు, నాడీ వ్యవస్థ దెబ్బతింటాయి. ఎందుకు తీసుకుంటారు... డ్రగ్స్ తీసుకోవాలనుకునే కోరిక బలంగా ఎందుకు కలుగుతుందో చూద్దాం. సాధారణంగా ధైర్యం, ఆత్మవిశ్వాసం, తెగింపు, పోరాటపటిమ, పట్టుదల వంటివి పాజిటివ్ లక్షణాలు. అవి నాయకత్వ లక్షణాలు. అవి కలిగి ఉన్నవారు తాము మిగతావారికంటే ఉన్నతులమని భావిస్తారు. లీడర్లా ఉంటారు. ప్రతి ఒక్కరినీ ఆ లక్షణాలు ఆకర్షిస్తుంటాయి. అయితే అవి స్వాభావికంగా ఉండటమో... లేదంటే వాటిని పెంపొందిచుకోవడమో జరగాలి. అలా పెంపొందించుకోవడం చాలా కష్టమైన పని. ఏళ్ల తరబడి సాధన తర్వాత కూడా సమకూరడం కష్టమే. అయితే ఇవన్నీ ఉన్న భ్రాంతి డ్రగ్స్ వల్ల కలుగుతుంది. అంతేకాదు... డ్రగ్స్ తీసుకోగానే ఒళ్లంతా తేలికవుతున్నట్లుగా ఫీలవుతారు. హాయిగొలుపుతున్న భ్రాంతికి గురవుతారు. ఆ తర్వాత వారి ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చినట్లుగా తెలుస్తుంటుంది. వాటిలో కొన్ని... ముప్పును లెక్కచేయకపోవడం, తెంపరితనం కలుగుతంది. పిరికిపిల్లలు తాము ధైర్యవంతులుగా మారినట్లున్న ఈ భావనను వదులుకోవడానికి ఇష్టపడరు. అలాగే ఎంతటి ప్రమాదాన్నైనా తేలిగ్గా తీసుకోవడం, అధిగమించగలమనే అతివిశ్వాసాన్ని కలిగి ఉంటారు. తాము డ్రగ్ ప్రభావంలో లేని సమయంలో బేలగా ఉండిపోతారు. అది వారికి ఇష్టం ఉండదు. కాబట్టి పై క్వాలిటీస్‌ను ఎప్పటికీ పొందాలనే ఉద్దేశంతో డ్రగ్స్‌ను కొనసాగిస్తారు. అయితే డ్రగ్స్ వల్ల కలిగే ఆ హాయిగొలుపుతున్న భ్రాంతి, ధైర్యపు భావనలు చాలాసేపు కొనసాగాలన్న ఫీలింగ్‌తో మోతాదును పెంచుకుంటూ పోతారు. ఆ క్రమంలో ఒక్కోసారి మరణం కూడా సంభవిస్తుంది. ఏయే డ్రగ్స్‌తో ఎలాంటి మార్పులు... మార్జువానాతో : కళ్లు ఎర్రబారడం, పెద్ద గొంతుతో మాట్లాడటం, నిద్రలోకి జారుకుంటూనే పెద్దగా నవ్వడం, తన పట్ల తనకే ఆసక్తి తగ్గడం, మోటివేషన్ తగ్గడం, అకస్మాత్తుగా బరువు పెరగడం/ తగ్గడం. వేలియం వంటి డ్రగ్స్ : కంటిపాప చిన్నగా మారడం, తాగినట్లుగా ప్రవర్తించడం, ఎదుటి వారికి చీదర కలిగేలా ఉండటం, సరైన సమయంలో నిర్ణయం తీసుకోలేకపోవడం, మాట ముద్దగా రావడం, మత్తుగా ఉండటం. కొకైన్ వంటి స్టిమ్యులెంట్స్తో... కంటిపాప విప్పారడం, అతిచురుగ్గా మారడం, ఏదో తెలియని అతి ఆనందంలో కొట్టుకుపోవడం, త్వరగా కోపం రావడం, యాంగై్జటీ, చాలా కుంగిపోయినట్లుగా ఉండటం, అంతలోనే విపరీతంగా మాట్లాడటం, నిద్ర–తిండి లేకుండా చాలాసేపు గడపగలగడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం, నోరంతా ఎండిపోయినట్లుగా ఉండటం (కొన్ని సార్లు ముక్కు కూడా). మిగతా కథన వాసన పీల్చే డ్రగ్స్ : కళ్లు నీళ్లతో నిండినట్లుగా, గాజుకళ్లలా మారడం, దృష్టి సరిగా నిలపలేకపోవడం, జ్ఞాపకశక్తి తగ్గడం, ఆలోచనలు సరిగా సాగకపోవడం, చొల్లు కారటం, తాగినట్లుగా మారడం, కండరాలపై నియంత్రణ కోల్పోవడం. ఆకలి తీరుతెన్నుల్లో మార్పురావడం, కోపం, యాంగై్జటీ. ఎల్ఎస్డీ వంటి హ్యాలూసినోజెన్స్ : కంటిపాప విప్పారడం, విచిత్రమైన, ఆ సందర్భానికి పొసగని ప్రవర్తన, తెలియని సంతోషంలో కొట్టుకుపోతున్న భావన, అకస్మాత్తుగా ముంచుకొచ్చే కోపం, మూడ్స్ వెంటవెంటనే మారిపోవడం, మాట ముద్దగా రావడం, అయోమయం. హెరాయిన్‌తో : కంట్లో వెలుగుపడ్డా కంటిపాప పెద్దగా స్పందించకపోవడం, నిద్రవేళల్లో మార్పులు రావడం, విపరీతంగా చెమటలు పట్టడం, దగ్గు వస్తుండటం, ఆకలి తగ్గడం, కండరాలు బిగుసుకుపోతుండటం, మాటిమాటికీ ముక్కుఎగబీల్చడం. కొన్ని నొప్పి నివారణ మాత్రలు (అనాల్జిసిక్స్) కూడా అడిక్షన్‌కు దారి తీస్తాయి. తలనొప్పి లేదా మెడనొప్పి లేదా ఇతర నొప్పులు దీర్ఘకాలం ఉన్నప్పుడు నొప్పినివారణ మందు తీసుకోగానే హాయి అయిన భావన కలుగుతుంది. దాంతో వాటికీ అలవాటయ్యే ప్రమాదం ఉంది. దీన్నే ‘అడిక్షన్ ఫర్ అనాల్జసిక్స్’ అంటారు. దీనికి కారణం ఉంది. నొప్పి తగ్గిన భావనతో పాటు, కాస్తంత మత్తుగా ఉండటం, ఏదో తెలియని ఆనందం, తామే గొప్ప అన్న భ్రాంతి కలుగుతాయి. చేయకూడనివి... ►డ్రగ్స్ అందనివ్వకుండా పారేయడం, దాచేయడం వంటివి చేస్తున్న కొద్దీ, వాటిని పొందడానికి వారు కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తారు. అది వద్దు. ►శిక్షించడం, బెదిరించడం, ప్రలోభపెట్టడం, ఉపదేశాలివ్వడం, వాదించడం సరికాదు. ►వారిని చిన్నబుచ్చడం లేదా వారిలో ఆత్మన్యూనత, అపరాధభావనను పెంపొందించడం ద్వారా వారిని డ్రగ్స్ అలవాటునుంచి దూరం చేయవచ్చని అనుకోవడం సరికాదు. ►డ్రగ్స్ అలవాటు ఉన్నవారి అలవాటు మాన్పించాలంటే కావాల్సింది సపోర్ట్. అంటే మేం నీవెంటే ఉన్నామన్న ఫీలింగ్‌ను పెంపొందించడం. ►‘నీ దురలవాటును మానేశాక దాని గురించి మా వద్ద నువ్వు సిగ్గు పడేలా (ఎంబరాస్మెంట్తో) ప్రవర్తించాల్సి పరిస్థితిని నీకు ఎప్పుడూ కల్పించబోము. ►అలాంటి పరిస్థితి ఎప్పుడూ రాద’నే నమ్మకం కలిగించాలి. ఇలాంటి వారికి ఎప్పుడూ ప్రోత్సాహమార్గమే బాగా పనిచేస్తుంది. డీ–అడిక్షన్ కార్యక్రమంలో సైకియాట్రిస్టులు చేసే పని ఇదే. దీంతో పాటు దుష్ప్రభావాలను తగ్గించే కొన్ని మందులు సైతం వారు సూచిస్తారు. – ఇన్పుట్స్: డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, సైకియాట్రిస్ట్, లూసిడ్ డయాగ్నస్టిక్స్, హైదరాబాద్ డ్రగ్స్‌కు అలవాటైన వారిని గుర్తించడం ఎలా : ►కళ్లల్లో ఎర్రజీరలు. కంటిపాప సాధారణం కంటే మరింతగా విప్పారినట్లుగానో లేదా చిన్నగా అయినట్లుగానో కనిపిస్తుంది. ►ఆకలి, నిద్ర వేళలు, తీరుతెన్నుల్లో మార్పులు. ఎక్కువగా తినడం లేదా ఆకలి మందగించడం. మత్తుగా నిద్రపోవడం లేదా అతిచురుగ్గా నిద్రకు దూరం కావడం. ► వేగంగా బరువు పెరగడం లేదా తగ్గడం. ►మంచి బట్టలు వేసుకోవడం, సామాజికంగా శుభ్రంగా కనపడాలన్న భావన సన్నగిల్లి మురికిగా కనిపిస్తారు. వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టిసారించరు. ►ఒంట్లోంచిగానీ లేదా మాట్లాడుతున్నప్పుడుగానీ లేదా బట్టల్లోగాని చిత్రమైన వాసన రావచ్చు. ►ఒళ్లు వణుకుతుండటం, మాట ముద్దముద్దగా రావడం, ఆలోచనలకు చేసే పనికి పొంతన కుదరదు. అంటే తాము స్పందించాలనుకున్నంత వేగంగా కదలలేకపోవడం మెదడుకూ, చేతులకు సమన్వయం కొరవడటం జరుగుతుంది. డ్రగ్ అలవాటైన వారితో డీల్ చేసే సమయంలో... ►డ్రగ్స్ అలవాటున్నవారి కోసం తగినంత, నాణ్యమైన సమయం వెచ్చించి మాట్లాడమే పరిష్కారం. అంతేగాని వారిని శిక్షించడం వల్ల ప్రయోజనం ఉండదు. ► అనునయంతో మాత్రమే వారిని మార్చడం సాధ్యం. కాబట్టి ‘డ్రగ్స్ తీసుకుంటే అలా చేస్తాం, ఇలా చేస్తాం’ అంటూ వారిని బెదిరించకండి. ‘ఇకపై నువ్వు డ్రగ్స్ తీసుకుంటే మేం చస్తాం లేదా ఆత్మహత్య చేసుకుంటాం’ అంటూ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడకండి. ►డ్రగ్స్ వల్ల వచ్చే దుష్పరిణామాల గురించి వారికి నచ్చేవిధంగా, వారిపై ప్రభావం చూపేలా వివరించడమే మంచి మార్గం. ► డ్రగ్స్ కారణంగా వారిలో వచ్చే ప్రవర్తనపూర్వకమైన మార్పులను వాళ్లకే తెలిసేలా చేసి, వారెంత నష్టపోతున్నారో వారి అనుభవంలోకి తేవడం ఒక మార్గం. ►వారు కోల్పోయే ఆత్మగౌరవం, సామాజికంగా వారికి కలుగుతున్న గౌరవభంగం గురించి తెలిసేలా చేయాలి. అడిక్ట్ అయ్యి డ్రగ్స్ తీసుకోకపోతే... ►వేగంగా మూడ్స్ మారిపోవడం, డిప్రెషన్, యాంగై్జటీ, క్రూరభావనలు పెరగడం, చాలా కోపంగా ప్రవర్తించడం. ►తమను తాము ప్రోత్సహించుకునే మోటివేషన్ కొరవడటం. ►రోజువారీ జీవితంలో ఉండే చిన్న చిన్న ఆనందాలు ఏమాత్రం సంతోషాన్ని ఇవ్వకపోవడం. డ్రగ్స్ తప్ప మరేవీ ఆనందాన్ని ఇవ్వవనే భావన పెరగడం. ►పిచ్చివాడిలా మారిపోవడం, ఉన్మాదంగా ప్రవర్తించడం. ►భ్రాంతులకు, అయోమయానికి లోనుకావడం. ►ఏదో తెలియని భయానికి లోనుకోవడం, అకారణంగా ఆందోళన చెందడం. స్క్రీన్ చరస్ సినిమా ఇండస్ట్రీకి డ్రగ్స్‌కు దాచేస్తే దాగని అనుబంధం ఉంది. కొందరు డ్రగ్స్ వాడి న్యూస్‌లోకి వస్తే కొందరు డ్రగ్స్‌ను కథాంశం చేసుకొని ప్రేక్షకుల దగ్గరకు వచ్చారు. ఇది మొదలు కాదు. అంతమూ కాబోదు. బహుశా రాబోయే రోజుల్లో డ్రగ్స్‌తో ముడిబడ్డ భారతీయ సినిమాను మనం తరచూ చూడబోతున్నాం. డ్రగ్స్ అంటే ఏమిటో తెలియని చాలా రోజుల క్రితమే హిందీలో దేవ్ ఆనంద్ ‘హరే రామా హరే కృష్ణ’ అనే సినిమా తీశాడు. అందులో ‘గంజాయి’ ప్రధాన అంశం. ఆ తర్వాత ధర్మేంద్ర హీరోగా ఏకంగా ‘చరస్’ అనే సినిమాయే వచ్చింది. ఫిరోజ్ ఖాన్ డ్రగ్స్‌ను కథాంశంగా తీసుకొని శ్రీదేవి, డింపుల్ కపాడియాలతో ‘జాన్బాజ్’ తీశాడు. అనురాగ్ కశ్యప్ ‘దేవ్ డి’ నిన్న మొన్నటి షాహిద్ కపూర్ ‘ఉడ్తా పంజాబ్’ డ్రగ్స్‌ను సినిమాల్లోకి బలంగా తీసుకొచ్చాయి. ఇక డ్రగ్స్ వాడి వార్తల్లోకి వచ్చిన నటీ నటులు లేకపోలేదు. సంజయ్ దత్ ఒకప్పుడు డ్రగ్ అడిక్ట్ అని దాని నుంచి బయటపడి ఇప్పుడు డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడు. డ్రగ్స్ మీద సినిమా తీసిన ఫిరోజ్ ఖాన్ కుమారుడు ఫర్దీన్ ఖాన్ డ్రగ్స్‌తో 2001లో పట్టుబడ్డాడు. హీరోయిన్స్‌లో మనీషా కోయిరాలా డ్రగ్స్ బారిన పడినట్టు వార్తలొచ్చాయి. ఒకప్పటి హీరోయిన్ మమతా కులకర్ణి ఏకంగా డ్రగ్స్ సప్లయర్‌గా పోలీసుల దృష్టిలోకి వచ్చింది. హృతిక్ రోషన్ మాజీ భార్య సుజాన్, షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ డ్రగ్స్ బారిన పడుండొచ్చని బాలీవుడ్లో కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే గౌరి ఖాన్ దీనిని ఖండించింది. తెలుగు నటీనటులు కూడా డ్రగ్స్ వాడకంలో ఉన్నట్టు గుసగుసలున్నాయి. చాలా పెద్ద హీరోలు కూడా డ్రగ్స్‌ను ‘టేస్ట్’ చేశారని అనుకునేవారున్నారు. ఇక రవితేజ సోదరుడు ఇటీవల మరణించిన భరత్ డ్రగ్స్ వ్యవహారంలో ఒకసారి పోలీసులకు పట్టుబడ్డాడు. గ్లామరస్‌గా కనిపించాలంటే డ్రగ్స్ వాడాలి అనే అపోహ వల్ల కూడా కొందరు హీరోలు వీటిని పరిమితంగా వాడుతున్నట్టు చాలా కాలంగా ఉన్న ప్రచారం. హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరా చేసే నైజీరియన్ల డైరీలలో టాలీవుడ్ హీరోల పేర్లు ఒకరిద్దరివి అప్పట్లో కనిపించినా పక్కా ఆధారాలు లేక పట్టుకోలేకపోయారు. ఇప్పుడు తాజాగా ఇండస్ట్రీలో డ్రగ్ కల్చర్ బాగా విస్తరించింది. ఏది ఏమైనా దొరికే వరకే అందరూ దొరలు. దొరికితే డ్రగ్ అడిక్ట్‌లు. మత్తుమూలాలు మత్తు పదార్థాల వాడుక చరిత్రపూర్వ యుగం నుంచే ఉండేది. కొత్త రాతియుగం మానవులకు నల్లమందు తెలుసు. బహుశ మనుషులు ఎరిగిన తొలి మాదకద్రవ్యం ఇదే కావచ్చు. మత్తు కలిగించే ఒకరకం పుట్టగొడుగులు (మేజిక్ మష్రూమ్స్), పొగాకు, గంజాయి, కోకా ఆకులు, మాండ్రేక్ చెట్టు వేళ్లు, బ్లూ లోటస్ మొక్క ఆకులు వంటి వాటి వాడకం క్రీస్తుపూర్వం నాటి నుంచే ఉండేది. వీటి గురించిన ప్రస్తావనలు పురాణాల్లో, మతగ్రంథాల్లో, ప్రాచీన వైద్యశాస్త్ర గ్రంథాల్లో కూడా కనిపిస్తాయి. నొప్పిని తగ్గించడం, నిద్ర కలిగించడం, ఇంద్రియాలు మొద్దుబారేట్లు చేయడం వంటి లక్షణాలు ఉండటం వల్ల సహజంగా సుఖాన్ని కోరుకునే మనుషులు ఈ పదార్థాలకు చేరువయ్యారు.గ్రీకు వైద్యుడు గాలెన్ తొలిసారిగా ఇలాంటి మత్తు పదార్థాలకు ‘నార్కోటిక్’ అని నామకరణం చేశాడు. నల్లమందు కోసం సుమేరియన్లు క్రీస్తుపూర్వం 3400 ప్రాంతంలోనే గసగసాల మొక్కలను విరివిగా సాగుచేసేవారు. చైనాలోనైతే 19వ శతాబ్దిలో ఏకంగా ‘నల్లమందు యుద్ధాలు’ జరిగాయి. ప్రాచీన ఈజిప్షియన్, గ్రీకు, రోమన్ తదితర నాగరకతల కాలంలో గంజాయిని మానసిక ఉత్తేజం కోసం వాడేవారు. మతపరమైన క్రతువుల్లో మద్యంతో పాటు గంజాయి, పొగాకు, నల్లమందులను కూడా విరివిగా వాడేవారు. ప్రాచీన వైద్యులు నొప్పితో బాధపడే రోగులకు ఇలాంటి మత్తు పదార్థాలను ఔషధంగా ఇచ్చేవారు. మతవిశ్వాసులు వీటిని దేవుని వరప్రసాదాలుగా భావించేవారు. మత విశ్వాసాలు ఎలా ఉన్నా, మత్తుపదార్థాల అనర్థాలను కూడా కొందరు ప్రాచీనులు గుర్తించారు. ‘బ్లూ లోటస్ మానసిక శక్తులను నిర్వీర్యం చేస్తుంది’ అని ప్రాచీన గ్రీకు కవి హోమర్ రాశాడు. అయితే, పంతొమ్మిదివ శతాబ్దిలోను, ఇరవయ్యో శతాబ్ది ప్రారంభంలోను చాలామంది ఆధునిక వైద్యులకు ఆ మాత్రం అవగాహన కూడా లేకపోయింది. కృత్రిమంగా తయారయ్యే కొకైన్, హెరాయిన్ వంటి మాదకద్రవ్యాలు అందుబాటులోకి వచ్చిన కాలంలో కూడా వీటిని వైద్యులే రకరకాల వ్యాధులకు విరుగుడుగా రోగులకు సూచించేవారు. సిగరెట్లకు కొందరు పాశ్చాత్య డాక్టర్లే బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండేవారు. హెరాయిన్ వ్యాపార ప్రకటనలు అక్కడి పత్రికల్లో విరివిగా కనిపించేవి. మత్తు పదార్థాలను అరికట్టే ప్రయత్నాలు పంతొమ్మిదో శతాబ్దంలోనే మొదలైనా అవి పెద్దగా ఫలితాలనిచ్చిన దాఖలాల్లేవు. ఈ దిశగా గట్టి ప్రయత్నాలు మాత్రం ఇరవయ్యో శతాబ్ది ద్వితీయార్ధంలోనే ప్రారంభమయ్యాయి. ► ప్రపంచవ్యాప్తంగా సుమారు 70 లక్షల మందికి పైగా డ్రగ్స్ బారిన పడుతుంటారని బిజెఎస్ వెల్లడించింది. ఇందులో కేవలం సుమారు 45లక్షల మంది మాత్రమే పునరావాస కేంద్రాల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ► డ్రగ్స్ మనిషి ఆలోచనను పూర్తిగా పాడు చేస్తాయి. మెదడుపై దీని ప్రభావం పెద్ద ఎత్తున కనిపిస్తుంది. మత్తులో పడిపోయి, విచక్షణ కోల్పోయి ఏం చేస్తున్నారో తెలియకుండా డ్రగ్స్ తీసుకునే వారు క్రైమ్‌కు పాల్పడుతూ ఉంటారు. ►రేప్, మర్డర్ కేసుల్లో ఎక్కువగా డ్రగ్స్ ప్రభావం ఉన్న కేసులే ఉంటున్నాయని ఎన్‌సిఆర్‌బి తెలిపింది. నమోదైన కేసుల్లోనే ఇలా ఉంటే, ఇంకా నమోదు కానివి, డ్రగ్స్ భారిన పడి నేరాలకు పాల్పడుతున్న వారి లెక్క చాలా ఎక్కువే ఉండొచ్చని ఈ సంస్థ స్పష్టం చేసింది. ► మనదేశంలో 50వేలకు పైనే నైజీరియన్లు ఉన్నారు. ఇందులో చదువుకోవ డానికి వచ్చిన వారే ఎక్కువ. ఇక లెక్కల్లో లేకుండా, అక్రమంగా చొరబడ్డ వారు ఎందరో. వీరిలో కొందరు డ్రగ్స్‌ను ఉత్తర అమెరికా నుంచి భారతదేశానికి, ఆఫ్రికన్ దేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నారు. ►ఆత్మహత్య చేసుకున్న ప్రతి ముగ్గురిలో ఒకరు డ్రగ్స్‌కు ప్రభావితమైన వారేనని బిజెఎస్ లెక్కలు. అమెరికాలో ఏటా సగటున 25వేల మంది డ్రగ్స్ మత్తులో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి ఆత్మహత్యల్లో మొదటి స్థానం ఆఫ్రికన్ దేశాలదే (ఏటా 55,000). ► భారత్‌లో సగటున రోజుకు పది మరణాలు డ్రగ్స్ ప్రభావం వల్లనే జరుగుతూ ఉండడం విషాదకరం. ►డ్రగ్స్ – క్రైమ్లది విడదీయలేని బంధం. డ్రగ్స్ తీసుకోవడమన్నదే ఓ పెద్ద నేరమైతే, డ్రగ్స్ తీసుకున్నాక ఆయా వ్యక్తులు పాల్పడే నేరాలకు ఇక లెక్కే లేదు. ► మహారాష్ట్రలో డ్రగ్స్ వల్ల జరుగుతున్న నేరాలు అత్యధికంగా ఉన్నాయి. వాణిజ్య రాజధాని అయిన ముంబై కేంద్రంగా డ్రగ్స్ రాకెట్స్ పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. డ్రగ్స్ క్రైమ్స్ ప్రధానంగా మూడు రకాలు 1. డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడం, తయారీ. 2. డ్రగ్స్ తీసుకొని మత్తులో పడి చేసే నేరాలు. 3. డ్రగ్స్ లైఫ్‌స్టైల్‌ను వ్యాప్తి చేయడం. ► మహారాష్ట్రతో పాటు హర్యానా, మిజోరం, త్రిపుర, తెలంగాణ, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో డ్రగ్స్ సంబంధిత నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెబుతోంది. ► డ్రగ్స్ మత్తులో జరిగే నేరాలను చూస్తే, ఆత్మహత్య, హత్య, అత్యాచారం, దొంగతనం లాంటివి ఎన్నో కనిపిస్తాయి. ► ప్రపంచవ్యాప్తంగా సుమారు 70 లక్షల మందికి పైగా డ్రగ్స్ బారిన పడుతుంటారని బిజెఎస్ వెల్లడించింది. ఇందులో కేవలం సుమారు 45లక్షల మంది మాత్రమే పునరావాస కేంద్రాల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ► డ్రగ్స్ మనిషి ఆలోచనను పూర్తిగా పాడు చేస్తాయి. మెదడుపై దీని ప్రభావం పెద్ద ఎత్తున కనిపిస్తుంది. మత్తులో పడిపోయి, విచక్షణ కోల్పోయి ఏం చేస్తున్నారో తెలియకుండా డ్రగ్స్ తీసుకునే వారు క్రైమ్‌కు పాల్పడుతూ ఉంటారు. ► రేప్, మర్డర్ కేసుల్లో ఎక్కువగా డ్రగ్స్ ప్రభావం ఉన్న కేసులే ఉంటున్నాయని ఎన్‌సిఆర్‌బి తెలిపింది. నమోదైన కేసుల్లోనే ఇలా ఉంటే, ఇంకా నమోదు కానివి, డ్రగ్స్ భారిన పడి నేరాలకు పాల్పడుతున్న వారి లెక్క చాలా ఎక్కువే ఉండొచ్చని ఈ సంస్థ స్పష్టం చేసింది. ►మనదేశంలో 50వేలకు పైనే నైజీరియన్లు ఉన్నారు. ఇందులో చదువుకోవ డానికి వచ్చిన వారే ఎక్కువ. ఇక లెక్కల్లో లేకుండా, అక్రమంగా చొరబడ్డ వారు ఎందరో. వీరిలో కొందరు డ్రగ్స్‌ను ఉత్తర అమెరికా నుంచి భారతదేశానికి, ఆఫ్రికన్ దేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నారు. ► ఆత్మహత్య చేసుకున్న ప్రతి ముగ్గురిలో ఒకరు డ్రగ్స్‌కు ప్రభావితమైన వారేనని బిజెఎస్ లెక్కలు. అమెరికాలో ఏటా సగటున 25వేల మంది డ్రగ్స్ మత్తులో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి ఆత్మహత్యల్లో మొదటి స్థానం ఆఫ్రికన్ దేశాలదే (ఏటా 55,000). చదవండి (ఇది సూసైడ్ కాదు) -
వారానికి ఇద్దరు!
పోలీసు కాల్పుల్లో మరణిస్తున్న సామాన్యుల సంఖ్య ఇది 4,747 - 2009–2015 మధ్య దేశంలో మొత్తం కాల్పుల ఘటనలు 796 - 2009 నుంచి 2015 మధ్య కాల్పుల్లో మృతిచెందినవారు పండించిన పంటకు మద్దతు ధర కోసం ఉద్యమించిన రైతులపై జూన్ 6న మధ్యప్రదేశ్ పోలీసులు కాల్పులు జరపడంతో ఆరుగురు అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే.. గత ఏడేళ్లలో పోలీసు కాల్పుల్లో సగటున వారానికి ఇద్దరు పౌరులు మరణించారట. 2009–2015 మధ్య నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం.. 2009 నుంచి 2015 మధ్య పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 796. 2009–2015 మధ్య దేశంలో 4,747 పోలీసు కాల్పుల ఘటనలు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువ భాగం జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఘటనలే. రాష్ట్రాలవారీగా చూస్తే 2015లో రాజస్థాన్‌లో అత్యధికంగా 35 పోలీసు కాల్పుల ఘటనలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 33, ఉత్తరప్రదేశ్‌లో 29 రికార్డయ్యాయి. అల్లర్లు, దోపిడీ వ్యతిరేక కార్యకలాపాలు, ఉగ్రవాదులు, తీవ్రవాదుల వ్యతిరేక చర్యలు.. మొదలైన సమయాల్లో పోలీసు కాల్పులను ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకున్నారు. కాగా, దేశంలో 2009 నుంచి 2015 మధ్య జరిగిన కాల్పుల్లో 471 మంది పోలీసు సిబ్బంది కూడా మరణించినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. – సాక్షి తెలంగాణ డెస్క్ -
బాల్యవివాహాల కేసులు ప్రతి ఏడాది పైపైకి
న్యూఢిల్లీ: బాల్య వివాహాల నిరోధక చట్టం(పీసీఎంఏ)-2006 ప్రకారం 2013-15 మధ్య కాలంలో ఓవరాల్‌గా 795 కేసులు నమోదు అయ్యాయి. బాల్య వివాహాలకు సంబంధించి 2013, 2014, 2015లలో వరుసగా 222, 280, 293 కేసులు నమోదైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎస్సీఆర్బీ) వెల్లడించింది. లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ సహాయ మంత్రి క్రిష్ణ రాజ్ ఈ వివరాలను తెలిపారు. బాలికలను బరువుగా భావించే ఆలోచన తీరుతోనే బాల్య వివాహాలు జరగుతున్నాయని అభిప్రాయపడ్డారు. నిరక్షరాస్యత, పేదరికం, సమాజంలో మహిళలపై చిన్నచూపు, సామాజిక నేపథ్యం, సంస్కృతితో సహా బాల్య వివాహాల వల్ల ఎదురయ్యే సమస్యలలపై అవగాహన లేకపోవడంతోనే బాలికలకు వివాహాలు చేస్తున్నారని చెప్పారు. కేవలం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో మాత్రమే ఈ సమస్య పరిష్కారం కాదని, ఇందుకు మీడియా సహకారం ఎంతైనా అవసరమన్నారు. తరచూ సభలు, కార్యక్రమాలు లాంటివి నిర్వహిస్తూ సాధ్యమైనంత వరకూ బాల్య వివాహాలను అరికట్టే చర్యలు చేపట్టాలని మహిళా మంత్రి క్రిష్ణ రాజ్ పిలుపునిచ్చారు. -
జైళ్ల ‘సంస్కరణ’
మన జైళ్లలో ఖైదీల సంఖ్య నానాటికీ పెరుగుతున్నదని ఈమధ్యే విడుదలైన జాతీయ క్రైమ్ రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక వెల్లడించింది. చిన్న చిన్న కేసుల్లో ఇరుక్కొని బెయిల్ ఇచ్చేవారు లభించక...అందుకు అవసరమైన స్తోమత లేక ఎందరో ఖైదీలు జైలు గోడల వెనక మగ్గుతున్నారు. ఖైదీల్లో అత్యధికులు ఈ కేటగిరిలోనే ఉంటారు. ప్రతి 10మంది ఖైదీల్లో ఏడుగురు విచారణను ఎదుర్కొంటు న్నవారే! వీరికితోడు జీవిత ఖైదీల సంఖ్య కూడా రాను రాను పెరుగుతున్నదని ఎన్సీఆర్బీ గణాంకాలు వివరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యావజ్జీవ శిక్ష పడి హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లినవారు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని గురు వారం ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పు అలాంటివారికి ఉపశమనం కలిగించడంతో పాటు జైళ్లపై ఉండే ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. యావజ్జీవ శిక్ష పడి ఐదేళ్ల శిక్షను అనుభవించినవారి అప్పీల్ పెండింగ్‌లో ఉంటే అలాంటివారికి బెయిల్ ఇవ్వొచ్చు నని జస్టిస్ సి. వి. నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎం. ఎస్. కె. జైశ్వాల్‌లతో కూడిన ధర్మా సనం చెబుతూనే అందుకు కొన్ని మార్గదర్శకాలు సూచించింది. బెయిల్ మంజూ రయ్యే వారికి రెండు షరతుల్ని కూడా విధించింది. ఈ మార్గదర్శకాలైనా, షరతు లైనా కరుడుగట్టిన నేరస్తుల విడుదలను నిరోధిస్తాయి. అదే సమయంలో విడుద లైనవారి కదలికలపై సైతం తగినంత నిఘా ఉండేలా చూస్తాయి. వీటితోపాటు ఆయా కేసుల ప్రత్యేక స్వభావాన్ని, అందులో ఇమిడివున్న పరిస్థితులను పరిగణన లోకి తీసుకున్నాకే బెయిల్ ఇవ్వడం, ఇవ్వకపోవడమన్న నిర్ణయం జరగాలని ధర్మాసనం చెబుతోంది. మన జైళ్లు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఖైదీల సంఖ్య నానాటికీ పెరగడమేనని ఎన్సీఆర్బీ నివేదిక చెబుతోంది. జాతీయ స్థాయిలో ఖైదీల శాతం 114 దాటగా, తీహార్ జైల్లో అది 226 శాతంగా ఉంది. వీరిలో మూడింట రెండొంతుల మంది విచారణలో ఉన్న ఖైదీలే. ఇలా అధిక ఖైదీల సమస్యతో ఇబ్బందిపడుతున్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ కూడా ఉంది. పరిమితికి మించి ఖైదీలు ఉండటంవల్ల వస్తున్న సమస్యలు అన్నీ ఇన్నీ కాదు. ఇంతమందిని అదుపు చేయడం అరకొరగా ఉండే సిబ్బందికి పెను సమస్య అవుతోంది. గార్డులకు సంబంధించి 33 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అధికారుల స్థాయిలో ఇది 36 శాతంగా ఉన్నదని ఎన్సీఆర్బీ నివేదిక అంటున్నది. మొత్తంగా వివిధ జైళ్లలో 80,000 సిబ్బంది అవసరంకాగా అందులో 27,000కు పైగా పోస్టులు భర్తీ చేయలేదు. సిబ్బందికి పదోన్నతులు, ప్రోత్సాహకాలు కూడా అంతంతమాత్రమే. ఇలాంట పుడు వారినుంచి మెరుగైన పనిని ఆశించలేం. ఈమధ్యే చోటుచేసుకున్న భోపాల్ సెంట్రల్ జైలు ఉదంతంలోని నిజానిజాలేమిటన్న అంశాన్ని పక్కనబెడితే నిరుడు వివిధ జైళ్లనుంచి 200మంది పారిపోవడానికి కారణం తగినంతగా సిబ్బంది లేకపోవడమే. భోపాల్ సెంట్రల్ జైలే తీసుకుంటే అక్కడ గార్డుల పోస్టుల్లో 28 శాతం, అధికార్ల స్థాయిలో 35 శాతం ఖాళీలున్నాయి. పర్యవేక్షణ లోపం ఖైదీల పరా రీకి మాత్రమే కాదు...ఇతరత్రా సమస్యలకు కూడా దారితీస్తోంది. నిరుడు జైళ్లలో మొత్తంగా 1,584మంది మరణించారు. అంటే సగటున రోజుకు నలుగురన్న మాట! ఇందులో 1,469 సహజమరణాలని ఎన్సీఆర్బీ నివేదిక చెబుతోంది. పోష కాహార లోపంవల్లనో, సకాలంలో అవసరమైన వైద్యం అందుబాటులో లేకపోవ డంవల్లనో మరణించినవారు కూడా ఈ ఖాతాలో జమ అయి ఉన్నా ఆశ్చర్యం లేదు. స్వతంత్ర సంస్థ ఏదైనా ఈ అధికారిక గణాంకాల లోతుల్లోకి వెళ్లి దర్యాప్తు చేస్తే మరిన్ని దిగ్భ్రాంతికర అంశాలు బయటపడవచ్చు. ఇవిగాక మిగిలిన 115 మర ణాలు అసహజమైనవిగా నివేదిక చెబుతోంది. ఇందులో 77 ఆత్మహత్యలున్నాయి. మిగిలినవి హత్యలు. ఇదొక విషాదకరమైన స్థితి. జాతీయ మానవ హక్కుల సంఘం ఈమధ్యే జైళ్లలో చోటుచేసుకుంటున్న ఆత్మహత్యలపై ప్రత్యేక నివేదిక విడుదల చేసింది. వీటి నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది. కానీ అంతంతమాత్రంగా ఉన్న సిబ్బందితో నెట్టుకొచ్చే జైళ్లు ఖైదీల మానసిక స్థితిని, వారిలో కనిపించే ఇతర లక్షణాలను పసిగట్ట స్థితిలో ఉన్నాయా అన్నది అనుమా నమే. ఒకవేళ పసిగట్టినా అలాంటివారికి అవసరమైన వైద్యం అక్కడ అందుబా టులో ఉండదు. దేశంలోని ఖైదీలందరికీ అందుబాటులో ఉన్న సైకియాట్రిస్టులైనా, సైకాలజిస్టులైనా కేవలం 18మంది మాత్రమే! అంటే ప్రతి 23,000మంది ఖైదీలకు ఒక సైకియాట్రిస్టు లేదా సైకాలజిస్టు ఉన్నారు. ఇంత అమానవీయమైన, అత్యంత దారుణమైన పరిస్థితులు మరెక్కడా ఉండవు. సిబ్బంది కొరత వల్ల జైళ్ల పర్యవేక్ష ణకు అధికారులు శిక్షపడిన ఖైదీల సాయం తీసుకుంటున్నారు. ఖైదీల్లో ఎవరికి ఆహారం, మందులు వగైరా అందాలో...ఎవరి ప్రవర్తన బాగోలేదో, వారిని దారికి తెచ్చేందుకు ఏం చేయాలో నిర్ణయించేది వారే. ఏమాత్రం శిక్షణలేకుండా, నేర ప్రవృత్తితో ఉండే ఇలాంటివారి దయాదాక్షిణ్యాలకు ఖైదీలను వదిలేయడంవల్ల మరిన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. జైళ్ల గురించి ఎన్సీఆర్బీ వెల్లడించిన అంశాలు ఇక్కడి సామాజికార్ధిక అస మానతలకు అద్దంపడతాయి. మన జైళ్లలో సర్వసాధారణంగా ఖైదీ అణగారిన కులాలకు లేదా ఆదివాసీ వర్గానికి చెంది, చదువుసంధ్యలు లేని నిరుపేద అయి ఉంటాడని నివేదిక అంటున్నది. ప్రతి ముగ్గురు ఖైదీల్లో ఇద్దరు దళితులు. అత్యధికులు పదో తరగతికి ముందే చదువు మానేసినవారు. వారి సంఖ్య 57,610 ఉంటే... నిరక్షరాస్యులు 36,406మంది. మనిషిలో అమానవీయతనూ, నేరప్రవృ త్తినీ పెంచే జైళ్ల ప్రస్తుత స్థితి మారాలంటే సిబ్బందిని పెంచడం, పర్యవేక్షణ సక్ర మంగా ఉండేలా చూడటంతోపాటు అందులో పరిమితికి మించి ఖైదీలు లేకుండా చర్యలు తీసుకోవడం కూడా అవసరం. ఆ దిశగా ఉమ్మడి హైకోర్టు తీర్పు దోహద పడుతుంది. మొత్తంగా జైళ్ల స్థితిగతులపై న్యాయస్థానాలు మరింత లోతుగా దృష్టి సారిస్తే అవి మెరుగుపడే ఆస్కారం ఉంటుంది. అధికార యంత్రాంగాలు ఈ విష యంలో తమంత తాము చర్యలు తీసుకోగలవన్న ఆశ ఎవరికీ లేదు. -
పరిచయస్తులతోనే మహిళలకు ముప్పు
రోజూ దేశంలో ఎక్కడో ఒకచోట లైంగిక దాడి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. దిగ్భ్రాంతి కలిగించే విషయం ఏంటంటే ఇరుగుపొరుగు వాళ్లు, పరిచయస్తులే మహిళలపై దారుణాలకు పాల్పడుతున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 2015లో లైంగికదాడి బాధితులు చేసిన ఫిర్యాదుల్లో 50 శాతమందికి పైగా నిందితుల్లో ఇరుగుపొరుగువారే ఉన్నారు. ఇక గతేడాది నమోదైన మొత్తం లైంగిక దాడి కేసుల్లో 95 శాతం మంది నిందితులు పరిచయస్తులే కావడం విస్తుగొలిపే విషయం. దేశ రాజధాని ఢిల్లీ సహా హిమచల్ ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం, చండీగఢ్ ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే మహిళలకు కుటుంబ సభ్యుల నుంచే రక్షణ లేకుండా పోతోంది. ఇంట్లో మామ, తండ్రి, ఇతర మగవాళ్ల వేధింపులకు బలైన మహిళలు ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదని ఓ మహిళా కార్యకర్త చెప్పారు. ఇక యుక్తవయసులో ఉన్న మహిళలకు లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలో తెలియడం లేదని డీపీఎస్ బొకరా డైరెక్టర్ హేమలతా ఎస్ మోహన్ తెలిపారు. 'కుటుంబ సభ్యులు ఇలాంటి విషయాల్లో పిల్లలకు చైతన్యం కలిగించడం లేదు. స్కూల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరముంది' అని హేమలత చెప్పారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో తండ్రి నుంచే అక్కాచెల్లెల్లకు వందలసార్లు వేధింపులు ఎదురయ్యాయి. ఈ విషయం బయటకు చెబితే పరువు పోతుందని తల్లి కూతుళ్లను వారించింది. చివరకు మహిళా కమిషన్ చొరవతో ఈ విషయం వెలుగుచూసింది. -
అత్యంత సురక్షితంకాని నగరం ఇదే
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మహిళలకే కాదు సీనియర్ సిటిజెన్లకు కూడా సురక్షితం కాదట. దేశంలో సీనియర్ సిటిజెన్లకు సురక్షితంకాని నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. వరుసగా రెండో ఏడాది కూడా ఢిల్లీ అత్యంత సురక్షితంకాని నగరంగా నిలిచింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఎన్సీఆర్బీ ప్రకారం.. దేశంలో ఇతర నగరాలతో పోలిస్తే ఢిల్లీలో సీనియర్ సిటిజెన్లపై జరిగే నేరాలు ఐదురెట్లు అధికం. ప్రతి లక్షమందిలో 108.8 మందిపై నేరాలు జరుగుతున్నాయి. గతేడాది ఢిల్లీలో సీనియర్ సిటిజెన్లపై జరిగిన నేరాల్లో 145 దొంగతనం కేసులు, 123 ఛీటింగ్, 14 హత్య కేసులు, 2 హత్యాయత్నం కేసులు, ఓ అత్యాచారం కేసు ఉన్నాయి. గతేడాది మొత్తం 1248 కేసులు నమోదయ్యాయి. 2014తో పోలిస్తే గతేడాది 19 శాతం నేరాలు పెరిగాయి. ఇక 2014లో దేశవ్యాప్తంగా 18714 కేసులు నమోదైతే, గతేడాది 20532 కేసులు నమోదయ్యాయి. సీనియర్ సిటిజెన్ల కోసం 1291 హెల్ప్ లైన్ నెంబర్ ఉందని, వారు ఆపదలో ఉంటే ఏ సమయంలోనైనా తమకు ఫోన్ చేయవచ్చని ఢిల్లీ సీనియర్ పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. -
ఏడాదిలో 34 వేలకు పైగా అత్యాచారాలు!
న్యూఢిల్లీ: దేశంలో మహిళలపై దాడులు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. గత సంవత్సరంలో దేశవ్యాప్తంగా 34,600 రేప్ కేసులు నమోదయ్యాయి. అత్యధిక లైంగిక దాడులతో రాష్ట్రాలలో మధ్యప్రదేశ్ ముందు ఉండగా, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఢిల్లీ ఈ అప్రతిష్టను మూటగట్టుకుంది. కామాంధుల కోరల్లో చిక్కుకున్న వారిలో ఆరేళ్ల పాప నుంచి అరవై ఏళ్ల వృద్ధురాలి వరకు ఉన్నారు. 2015లో మొత్తంగా 34,651 రేప్ కేసులు నమోదవ్వగా, అందులో 33,098 కేసుల్లో అత్యాచారానికి పాల్పడ్డవాళ్లు బాధితురాలికి తెలిసినవారే కావడం గమనార్హం. 4,391 రేప్ కేసులో మధ్యప్రదేశ్ మొదటిస్థానంలో ఉండగా, 2,199 రేప్ కేసులతో దేశ రాజధాని కేంద్ర ప్రాంత పాలిత ప్రాంతాల విషయంలో మొదటి స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా గత సంవత్సరం మహిళలపై 3.27 లక్షల నేరాలు జరుగగా, అందులో 1.3 లక్షల కేసులు లైంగిక నేరాలకు సంబంధించినవే. రేప్ కేసులు అత్యధికంగా నమోదైన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర (4,144), రాజస్థాన్ (3,644), ఉత్తరప్రదేశ్ (3,025) ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌లో 1027 రేప్ కేసులు నమోదవ్వగా, తెలంగాణలో 1105 లైంగిక దాడులు జరిగాయి. నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఇక దేశవ్యాప్తంగా దళితులపై దాడుల అంశం కలకలం రేపుతూనే ఉంది. గత ఏడాది రాష్ట్రాల పరంగా చూసుకుంటే ఉత్తరప్రదేశ్‌లో దళితులపై దాడులు ఎక్కువగా జరిగాయి. యూపీలో 8,358 దాడి కేసులు నమోదవ్వగా, ఆ తర్వాత రాజస్థాన్‌లో 6,998, బిహార్‌లో 6438 దాడులు జరిగాయి. దళితులపై దాడుల విషయంలో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉండటం గమనార్హం. ఏపీలో గత ఏడాది 4415 దాడులు దళితులపై జరిగాయి. ఈ మేరకు గత సంవత్సరంలో దేశవ్యాప్తంగా జరిగిన నేరాల వివరాలతో కూడిన 'క్రైమ్ ఇన్ ఇండియా-2015' వార్షిక నివేదికను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం విడుదల చేశారు. 29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు, 10 లక్షలకుపైగా జనాభా ఉన్న 53 మెగా నగరాల నుంచి వివరాలు సేకరించి.. జాతీయ నేరనమోదు బ్యూరో తాజాగా తన 69వ ఎడిషన్‌ను ప్రచురించింది. ఈ నివేదిక ప్రకారం 2015లో షెడ్యూల్డ్ తెగలపై జరిగిన నేరాలు 4.7శాతానికి తగ్గాయి. ఎస్సీలపై నేరాలు 4.4శాతం తగ్గగా, మహిళలపై నేరాలు 3.1శాతం తగ్గాయి. -
గంటన్నరకో మద్యం చావు
న్యూఢిల్లీ : 96/1... ఇది క్రికెట్ స్కోరు కాదు. ఆల్కహాల్ స్కోరు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ఆధారంగా ఇండియా స్పెండ్ అనే సంస్థ చేసిన విశ్లేషణ ప్రకారం ప్రతీ 96 నిమిషాలకో ప్రాణం ఆల్కహాల్‌కు బలవుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం మన దేశంలో 2003-05లో తలసరి మద్య వినియోగం 1.8 లీటర్లుండగా 2010-12 నాటికి 38 శాతం పెరిగి 2.2 లీటర్లయింది. 2014లో సరాసరిన రోజుకు అయిదుగురిని మద్యం మింగేసింది. ఇప్పడీ సంఖ్య మరింత పెరిగి 15కి చేరింది. ఈ నివేదిక ప్రకారం అతిగా మద్యం సేవించేవారు దేశంలో 11% మంది ఉన్నారు. 2013లో 387 మంది మంది మద్యం కారణంగా ప్రాణాలు కోల్పోగా, 2014కు ఆ సంఖ్య 339 శాతం పెరిగి 1,699కి చేరింది. దీంతో మద్య నిషేధానికి సర్వత్రా మద్దతు లభిస్తోంది. -
రైతు ఆత్మహత్యలు ఆగిపోయాయ్!
1995 నుంచి దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం రైతు ఆత్మహత్యల సంఖ్య 2014లో 3,00,000 మైలు రాయిని దాటింది. అయితే, 2014లోని రైతు ఆత్మ హత్యల గణాంకాలకు, అంతకు ముందటి 19 ఏళ్ల గణాంకాలకు పొంతనే లేదు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) అనుసరించే గణన విధానంలో వచ్చిన పెను మార్పుల ఫలితమిది. పద్ధతి మార్పుతో లెక్కల తారుమారు నూతన పారమితుల (కొలమానాల) ప్రకారం, 2014లో మొత్తం రైతు ఆత్మ హత్యలు 5,650కు పడిపోయాయి. అంటే 2013లోని 11,772 కంటే సగానికి పైగా తక్కువ. ఎన్సీఆర్బీ పట్టికల్లో కొత్త లేదా సవరించిన వర్గాలలోకి ఆత్మ హత్య సంఖ్యలను అటూ ఇటూ మార్చడం ద్వారా ఇది అతి సులుపుగా జరిగి పోయింది. రైతు ఆత్మహత్యల ‘‘తగ్గుదల’’తో పాటే ‘‘ఇతరుల’’ ఆత్మహత్య లు దిగ్భ్రాంతికరంగా పెరిగిపోవడమూ కనిపిస్తుంది. రైతు ఆత్మహత్యల్లో దేశంలో మొదటి నుంచి రెండో స్థానంలో ఉన్న కర్ణాటకలో 2014లో కేవలం 321 రైతు ఆత్మహత్యలు మాత్రమే జరిగాయి. అంతకు ముందటి ఏడాది 1,403తో పోలిస్తే ఇది చాలా పెద్ద తగ్గుదల. అదే 12 మాసాల్లో ‘‘ఇతరులు’’ కాలమ్‌లోని ఆత్మహత్యల సంఖ్య 245 శాతం, అంటే 1,482 నుంచి 5,120కి పెరిగిపోయింది. రైతు ఆత్మహత్యలు అతి ఎక్కువగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో సగటున ఈ ఒక్క ఏడాదే 128 శాతం ‘‘ఇతరుల’’ ఆత్మహత్యలు పెరిగాయి. ఎన్సీఆర్బీ గణాంకాలు వేలాది కౌలు రైతుల ఆత్మహ త్యలను పెద్ద ఎత్తున ‘‘వ్యవసాయ కూలీల’’ ఆత్మహత్య లుగా చూపాయి. తమ సరికొత్త గణాంకాలను సరిచూడలే దని ఎన్సీఆర్బీనే స్వయంగా అంగీకరించింది. ‘‘ఈ ఏడా ది గణాంకాలను యాదృచ్ఛికమైన ఎంపిక పద్ధతిలో క్రమబద్ధం చేయాలని చేయాలని ముందుగానే నిర్ణయించా రు.’’ ఇప్పటికే అధికారికమైవిగా ప్రకటించిన గణాంకాలనే ఇప్పుడు సరిచూస్తారని అర్థం. ‘‘జీరో’’ రైతు ఆత్మహత్యలు ఇంతేకాదు, 12 రాష్ట్రాలు, ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలను 2014లో ‘‘జీరో’’ రైతు ఆత్మహత్యల ప్రాంతాలుగా ప్రకటిం చారు. వీటి లో పెద్ద వ్యవసాయ రాష్ట్రాలైన పశ్చిమ బెంగా ల్, రాజస్థాన్, బిహార్ కూడా ఉన్నాయి. దీనికి విరుద్ధంగా 2010లో ఏ ఒక్క పెద్ద రాష్ట్రమూ ‘‘జీరో’’ రైతు ఆత్మహత్యల రాష్ట్రంగా ప్రకటించుకోలేదు. కేవలం మూడు కేంద్ర పాలిత ప్రాంతాలు మాత్రమే ఆలా ప్రకటించుకున్నాయి. ఇప్పుడు అవే రాష్ట్రాలు తమ లక్షలాది రైతుల్లో ఏ ఒక్కరూ 2014 ఆత్మహత్య చేసుకోలేదని చెప్పుకుంటున్నాయి. ఈ అంశాలకు సంబంధించి, ఈ గణాంకాలు అసాధారమైనవిగా భావిస్తున్నారు కాబట్టి ఎన్సీఆర్బీ సం బంధిత రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల నుంచి తాము వివరణను కోరవ చ్చని అంటోంది. ఎన్సీఆర్బీ భారత దేశంలో ప్రమాదాలలో మరణాలు, ఆత్మహత్యలు-2014 లోని ఈ కొత్త/సవరించిన వర్గాలకు సమాచారాన్ని ఎలా సేకరించారనేదానికి వివరణే లేదు. ఇక కారణాలకు వస్తే, ఎప్పటిలాగే ఆ నివేదిక రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పేట్టే బాధతో చేసుకున్న ఆత్మహత్యలుగా వాటిని పేర్కొంది. అంకెల గారడీకి తెరిచిన తలుపులు మహారాష్ట్ర, ఏపీ (తెలంగాణ సహా), కర్ణాటక, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లు రైతు ఆత్మహత్యల్లో ‘‘ఐదు పెద్ద’’ రాష్ట్రాలు. ఒక దశాబ్దిగా, ఆ ఐదే మొత్తంగా దేశవ్యాప్త రైతు ఆత్మహత్యల్లో సగటున మూడింట రెండు వంతులుగా ఉం డేవి. 2014లో అవి 90 శాతంకన్నా ఎక్కువని లెక్కించారు. మహారాష్ట్ర 20 ఏళ్లలో 63,318 రైతు ఆత్మహత్యలు జరిగినట్టు తేలగా అది 2014లో దేశ వ్యాప్తంగా మొత్తం రైతు ఆత్మహత్యలలో 45 శాతంగా మారింది. అయితే, వర్గీకరణలోని మార్పులకు సంబంధించిన తీవ్ర ప్రశ్నలకు జవాబులు లేవు. ఇక సమాచార సేకరణ విషయంలో మరింత సమస్యాత్మక ప్రశ్నలు అలాగే మిగిలాయి. ఎన్సీఆర్బీ సమాచార సేకరణ యంత్రాంగం కాదు. రాష్ట్రాల నుంచి వచ్చే గణాంకాలను సరిచూసి, ప్రోది చేసి పట్టికలను రూపొందిస్తుం ది. ఈ విషయానికి సంబంధించి దానికి అంకెలకు సంబంధించి స్వప్రయోజ నాలేమీ ఉండవు. ఇలా భారీ ఎత్తున గణాంకాలను వక్రీకరించడం చత్తీస్‌గ ఢ్‌లో 2011లో మొదలైంది. 2006-10 మధ్య సగటున 1,555 రైతు ఆత్మహత్యలు జరిగిన ఆ రాష్ట్రంలో 2011లో రైతు ఆత్మహత్యలు లేనే లేవు. 2012లో నాలుగు, 2013లో మళ్లీ జీరో అని తేల్చారు. పశ్చిమబెంగాల్ 2012 నుంచి అదే బాట పట్టగా, ఇక ఇతరులు కూడా అంకెలకు చిత్రిక పట్టడం మొదలెట్టారు. రైతు ఆత్మహత్యలు రాజకీయంగా నష్టం కలుగజేసే సమస్య. ఇప్పుడు సరికొత్త వర్గాలు, కాలమ్స్‌తో మరింత సులువుగా ప్రధానమైన రైతు మరణాలను తగ్గించేయగలుగుతారు. భూ యజమానులైన రైతులు, కాంట్రాక్టు/లీజుకు పనిచేసేవారు, వ్యవసాయ కూలీలు తదితర కొత్త ఉపవర్గాలను చేర్చారు. రైతు ఆత్మహత్యలను వీటిలో అటూ ఇటూ మార్చి గార డీ చేయగలుగుతారు. ‘‘పునర్వర్గీకరణేం లేదు’’ ‘‘కేవలం మరింతగా దేనికదిగావిభజించడం మా త్రమే ’’ జరిగిందని ఎన్సీఆర్బీ అంటోంది. ఎన్సీఆర్బీ అంటున్నట్టుగా గతంలో ఎన్నడూ, ఎక్కడా వ్వయసాయ కూలీలను ‘‘స్వయం ఉపాధిగల వారు’’గా పేర్కొనలేదు. అసలు వ్యవసాయ కూలీలంటేనే స్వయం ఉపాధి లేనివారని అర్థం. ఇతరుల వద్ద పనుల కోసం పల్లెల్లో తిరుగుతుంటారు. పోలీసు కానిస్టేబులే నిర్ణేత ఇంకా చూస్తే ఇది మరింత అధ్వానంగా ఉంటుంది. ఆత్మహత్య చేసుకున్నది ఎవరో నిర్ధారించేది దిగువస్థాయి పోలీసు స్టేషన్‌లోని కానిస్టేబులే. అది రైతా, భూయజమానా, వ్యవసాయదారా, కౌలుదారా, వ్యవసాయ కూలీనా అనే దాన్ని నిర్ధారించడం శిక్షణ పొందిన సర్వేయరుకు సైతం కొన్ని సందర్భాల్లో కష్టమే. కానిస్టేబుల్ సులువుగా చేసేస్తాడు. కానీ ఎన్సీఆర్బీ మాత్రం ‘‘ఆత్మ హత్యలపై పోలీసు స్టేషన్లలోని అధికారిక సమాచారంపై ఆధారపడ్డ గణాం కాలు’’ అంటుంది. గత ఏడాది ‘‘శిక్షకులకు ఒక నెలపాటూ కఠోర శిక్షణ ను’’నిర్వహించామని అంటోంది. అది రాష్ట్ర రాజధానుల్లో ఉండేవారికే, తప్ప స్థానిక పోలీసు స్టేషన్లలో వారికి కాదు. స్టేట్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో అధికారు లు జిల్లా/పోలీసు స్టేషన్ల స్థాయిలో వారికి శిక్షణ ఇచ్చినట్టు చెప్పుకుంటోంది. అదసలెన్నడూ జరగనే లేదు. రైతు ఆత్మహత్యలు ఎక్కువగా జరిగే మహారాష్ట్రలోని విదర్భ, కర్ణాటక లోని మాండ్య వంటి ప్రాంతాలలోని పోలీసు స్టేషన్లలో ఈ విషయమై అడి గితే వారు విస్తుపోయారు. అలాగే ‘‘ఐదు పెద్ద’’ రాష్ట్రాల అత్యున్నత పోలీసు అధికారులు కూడానూ. ఏపీలో ఓ సీనియర్ అత్యున్నత పోలీసు అధి కారి ఒకరు అలాంటి సర్క్యులర్ ఏదీ రాలేదని స్పష్టంచేశారు. తెలంగాణ లోని ఒక అత్యున్నత స్థాయి పోలీసు అధికారి ఈ పని అసలు కానిస్టేబుల్‌దే కాద ని, తహసీల్దార్దని, పోలీసులు అత్మహత్యకు కనిపించే కారణాలను మాత్రమే నమోదు చేస్తారు అని తెలిపారు. అంటే ఎవరు రైతో కాదో తేల్చా ల్సిందే రెవెన్యూ శాఖే. అంటే రెవెన్యూ శాఖలోనో లేదా రాష్ట్ర క్రైమ్ రికార్డుల శాఖలో నో ఈ వర్గీకరణ జరగాల్సి ఉంటుంది. ఆ పోలీసు అధికారే అన్నట్టు అనుమా నం ఉంటే దాన్ని ‘‘ఇతరులు’’గా వర్గీకరిస్తారు. వేలాది సందర్భాల్లో ఆ పనే జరిగి ఉంటుంది. రైతు ఆత్మహత్యలను జిల్లా కలెక్టర్లకు నివేదించమని మాత్ర మే 2006లో ఓ సర్క్యులర్ వచ్చిందని మహారాష్ట్రలోని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆత్మహత్యలు ఎక్కువగా జరుగు తున్న కర్ణాటకలోని పోలీసులు ఈ కొత్త వర్గీకణ తమకు అంతుబట్టనిదిగా ఉందన్నా రు. అసలు ఎఫ్ఐఆర్లో అలాంటివి నమోదు చేయాలని కూడా తెలియద న్నారు. మధ్యప్రదేశ్ పోలీసులదీ అదే పరిస్థితి. కౌలు రైతులంతా వ్యవసాయ కూలీలే ఈ కొత్త చర్యలతో తలెత్తిన గందరగోళం అసలు ఆ ఎన్సీఆర్బీ నివేదికలోనే కనిపిస్తోంది. రైతు ఆత్మహత్యలపై రెండో పేరా ఇలా పేర్కోంది:‘‘రైతులలో భూమికి యజమానులై పొలంలో పనిచేసేవారితో పాటూ పనికి పెట్టుకునే వారు/పొలం పనులకు కూలీలను పెట్టుకునేవారు కూడా వస్తారు. వ్యవ సాయ కూలీలు ఇందులోకి రారు ’’అలాంటప్పుడు వారు పట్టికలోని ‘‘స్వయం ఉపాధికలవారు’’ పట్టికలోకి ఎలా చేరుతారు? ఇతరులు భూమిని కౌలుకు తీసుకుని సాగుచేసే కౌలుదార్లేనే తీసు కోండి. వారిలో చాలా మందికి కౌలు ఒప్పందాలే ఉండవు. కాబట్టి బ్యాంకు రుణాలు అందవు. వడ్డీవ్యాపారుల వల్ల పీకల్లోతు అప్పుల్లో కూరుకుపో తారు. వారిలో చాలామంది ఆత్మహత్యలు చేసుసుకున్నారు. అయితే ఎలాం టి గుర్తింపు రికార్డు లేక అలాంటివారినందరినీ రైతు ఆత్మహత్యల నుంచి తొలగించేసేవారు. ఇప్పుడు మరింత జోరుగా అది సాగుతుంది. ఆత్మహత్య లకు పాల్పడ్డ కౌలుదార్లలో ఒక చిన్న భాగమే రైతు ఆత్మహత్యల వర్గం కింద కు వస్తారు. వారిలో చాలా మందిని వ్యవసాయ కూలీలుగా లెక్కించేస్తారు. తాజా 2014 సమాచారంలో ఇది చాలా స్పష్టంగానే జరిగింది. అది మొత్తం వ్యవసాయ కూలీల ఆత్మహత్యలను 6,710గా, అంటే రైతు ఆత్మహత్యల కంటే వెయ్యి ఎక్కువగా చూపింది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో 2014లో కేవలం 160 మంది రైతులే ఆత్మహత్య చేసుకోగా, వ్యవసాయ కూలీలు దాని కి దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఆత్మహత్యకు పాల్పడ్డారని నివేదిక తెలుపుతోంది. ఎన్సీఆర్బీ మాత్రం ‘‘సంబంధిత పోలీసు స్టేషన్లు బాధితులు రైతులా, వ్యవసాయా కూలీలో నిర్ధారించుకునే ఆయా వర్గాలలో చేరుస్తాయని’’ భావిస్తామంటోంది. అయితే, ఈ విషయం సమస్యాత్మకమైనదయ్యే అవకా శం ఉన్నందున సంబంధిత రాష్ట్రాల నుంచి ఈ విషయంలో వివరణ కోరుతా మని ఆ సంస్థ తెలిపింది. దానికి ఈ సమస్య తెలుసు. కేవలం కౌలు రికార్డు లు ఉన్న వారిని మాత్రమే లెక్కిస్తారని బ్యూరోకు చెందిన ఒక సీనియర్ అధి కారి తెలిపారు. అయినా అది మాత్రం ‘‘రాష్ట్రానికి రాష్ట్రానికి మారుతూ ఉండే కౌలు హక్కులు/సమస్యల విషయమై వివరమైన అధ్యయనమేదీ చేపట్టబోవ డం లేదు.’’ సరిగ్గా అదీ అసలు కారణం. కౌలు రైతు రికార్డులు నమోదు కాక పోవడం లే దా లేకపోవడం అనేదే 2014 సమాచారాన్నంతటినీ గందరగోళ పరించింది. ‘‘ఎన్సీఆర్బీ 2014 కౌలుదార్లను వ్యవసాయ కూలీలుగా తప్పు గా వర్గీకరించింది’’ అని అఖిల భారత కిసాన్ సభ (ఎఐకేఎస్) ఉపాధ్యక్షులు మల్లా రెడ్డి అన్నారు. కిసాన్ సభ పట్టుబట్టగా ఏపీ ప్రభుత్వం కౌల్దార్లకు స్పష్టమైన గుర్తింపును ఇవ్వడం కోసం లెసైన్సుడ్ కౌల్దార్ల చట్టం తెచ్చింది. ‘‘వారికి బ్యాంకు రుణ అర్హత కార్డులు’’ ఇవ్వాల్సి ఉండింది. కానీ 32 లక్షల కౌలు రైతుల్లో 90 శాతానికి ఆ కార్డులు ఇవ్వ లేదు అని ఆయన అన్నారు. ఈ కౌలుదార్ల సమస్యకు తోడు, తాజా రైతు ఆత్మహత్యల గణాంక సమాచారానికి అప్రతిష్టకు గురిచేసే ఇతర అంశాలు కూడా ఉన్నాయి. వీటి లో కీలకమైనది నమోదైన ఆత్మహత్యలలో బ్రహ్మాండంగా పెరిగిపోయిన ‘‘ఇతరులు.’’ ప్రత్యేకించి ‘‘పెద్ద ఐదు’’ రాష్ట్రాల్లో అవి 2014లో రెట్టింప య్యాయి. కర్ణాటకలో అది ఒక్క ఏడాదిలో 245 శాతం పెరగగా, ఏపీలో 138 శాతం, మహారాష్ట్రలో 94 శాతం, మధ్యప్రదేశ్‌లో 89 శాతం, చత్తీస్‌గఢ్‌లో 30 శాతం పెరిగాయి. ఇతరులు విభాగంలో పెరిగిన ఆత్మహత్యలు 2011-14 కాలంలో రైతుల ఆత్మహత్యలు సున్నాకు (లేదా సింగిల్ డిజిట్‌కు) చేరుకున్నాయని చత్తీస్గడ్ రాష్ట్రం ప్రకటించినప్పుడు ‘‘ఇతరులు’’ విభాగం లో ఆత్మహత్యల సగటు 83 శాతం వృద్ధితో, 1,472కు చేరింది. ఈ కేటగిరీలో 2013లో 24,809 ఆత్మహత్యలు నమోదుకాగా, 2014లో ఇవి 41,216కు చేరుకున్నాయి. ఆశ్చర్యకరంగా, ‘‘రోజుకూలీకి పని చేసేవారు’’ అనే కొత్త విభాగం కల్పన కోసం ‘‘ఇతరులు’’ విభాగం నుంచి 15,735 మంది మరణా లను ఉపసంహరించినప్పటికీ, అదే విభాగంలో ఇన్ని మరణాలు నమోదయ్యాయి. 2014లో ‘‘ఇతరులు’’ విభాగం దేశంలో సంభవించిన మొత్తం ఆత్మహత్యలలో 31.3 శాతంతో మూ డో స్థానంలో నిలిచింది. ఆత్మహత్యలు అధికంగా జరుగుతు న్న తొలి 5 రాష్ట్రాల్లోనే ఈ విభాగంలో 16,234 ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. 2013లో ఈ అయిదు రాష్ట్రాల్లో ఆత్మ హత్యల సంఖ్య 7,107 మాత్రమే. ఆత్మహత్యల సంఖ్యను తగ్గించి చూపిన ఈ ఫారంలోనే స్వయం ఉపాధి కలవారు (ఎస్ఈపీ -ఇతరులు) అనే కాల మ్ ఉంది. చత్తీస్‌గడ్‌లో రైతుల ఆత్మహత్యలకు, ఎస్ఈపీ కాలమ్‌లకు మధ్య స్పష్టమైన సంబంధం ఉంది. 2009లో అత్యధిక రైతు ఆత్మహత్యలను (1,802) నివేదించిన రాష్ట్రం లో దాని ఎస్ఈపీ (ఇతరులు) ఆత్మహత్యల సంఖ్య 861గా ఉండేది. 2013లో రైతుల ఆత్మహత్యలు లేనే లేవని ఆ రాష్ట్రం ప్రకటించినప్పుడు (వరుసగా మూడో సంవత్సరం) ఎస్ఈ పీ (ఇతరులు) విభాగంలో ఆత్మహత్యలు 2,077కు చేరుకు న్నాయి. 2011-13 వరకుగల మూడేళ్ల కాలంలో ఎస్ఈపీ (ఇతరులు)నీ, ‘‘ఇతరులు’’ విభాగాలను మనం కలిపి చూ సినట్లయితే, రాష్ట్రంలోని మొత్తం ఆత్మహత్యల్లో ఇవి 60 శాతంగా నమోదవుతాయి. ఆత్మ హత్యలు జరగనే లేదంటూ ‘జీరో’ ప్రకటనలు చేస్తున్న ధోరణి మరింత తీవ్ర మైంది. ఈ సంవత్సరం మరింత వక్రీకరణ జరిగింది. కానీ ఆత్మ వంచన ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. మనకు సంఖ్యల గురించి తెలీనట్లయితే ఏ సమస్యా లేదు. లెక్కించే పద్ధతిని మార్చండి, అప్పుడు లెక్కింపే మారిపోతుంది. దాంతో గ్రామీణ ప్రాంతం ప్రశాంతంగా సాగిపోతున్నట్లే లెక్క. ‘‘ఇతరులు’’ - ఇతరులు ‘‘ఇతరులు’’ కాలమ్‌కు చాలాకాలంగా ఒక ఘనమైన చరిత్రే ఉంది. 1997- 2000 మధ్య అనంతపూర్ జిల్లాలో సంభవించిన 1,061 ఆత్మహత్యలకు అస్వస్థత కారణమని 2001లో జిల్లా నేర రికార్డుల బ్యూరో తేల్చేసింది. అనేక సందర్భాల్లో ఈ అస్వస్థతను భరించరాని కడుపునొప్పిగా నివేదించారు. క్రిమిసంహారక మందులను తాగితే చావుకు ముందు భయంకరమైన కడుపు నొప్పితో విలవిల్లాడతారు. కానీ కడుపునొప్పిని తట్టుకోలేక రైతులు తమను తాము చంపుకుంటున్నారని పోలీసులు నమోదు చేసేశారు. ఇతర తప్పులేవీ లేవని దీనర్థం కాదు. మహిళా రైతుల ఆత్మహత్యలను ఎన్నడూ లెక్కలోకి తీసుకోరు. సాంప్రదాయిక సమాజాలు చాలావరకు మహిళలను రైతులుగా గుర్తించవు. హక్కుపత్రాలు, పట్టాలపై మహిళల పేర్లు ఉండటం చాలా తక్కువ. దీని ఫలితమేమిటంటే, మహిళా రైతుల ఆత్మహత్య లు సున్నాగా ప్రభుత్వాలు నమోదు చేసిన కాలంలో ‘‘గృహిణులు’’ విభాగం అమాంతంగా విస్తరించింది. కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని సంవత్సరాల్లో జరిగిన మహిళల ఆత్మహత్యలలో 70 శాతంవరకు ‘‘గృహిణులు’’ ఉన్నారు. ఆత్మ హత్యలు చేసుకున్న వారు రైతులా కాదా అని నిర్ణయించడంలో కుల దురభి మానం కూడా తన ప్రభావం చూపింది. హక్కుపత్రాలపై దళితుల, ఆదివా సుల పేర్లు ఉండటం చాలా అరుదు. వీరిని తరచుగా భూ ఆక్రమణదారులు గానూ మరింత ఘోరమైన ముద్రలతోనూ చూస్తుంటారు. ఇలా తక్కువ చేసి చూపే దురభిప్రాయాలు చాలా కాలం నుంచి ఉనికి లో ఉండటం వాస్తవం కాగా, కొత్త వ్యవస్థ వాటిని చట్టబద్ధం, వ్యవస్థీకృతం చేయడమే సమస్య. ఇంతవరకూ నిర్హేతుకమైన, అస్వాభావికమైనదిగా ఉంటూ వచ్చిన విషయం ఇప్పుడు సాధారణమైన విషయంగా మారిపోతోం ది. చత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్లో 2011-12 సంవత్సరాల్లో ప్రారంభమైన ఒక తప్పుడుధోరణిని ఇప్పుడు అన్ని రాష్ట్రాలూ చట్టబద్ధంగానే అమలు చేస్తూ వస్తున్నాయి. రాష్ట్ర రాజధానుల్లో ప్రభుత్వ అధికారులు చలాయిస్తున్న అధికారం అపారమైంది. రాజకీయ పరిస్థితికి అనుగుణంగా వీరు సంఖ్యల ను మార్చేస్తుంటారు. ఎన్ని లోపాలున్నప్పటికీ ఎన్సీఆర్బీ డేటా ఒకవైపు రాష్ట్రాల వద్ద ఉన్న డేటాలోని కొన్ని తప్పులను ప్రతిబింబిస్తూనే, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉన్న దానికన్నా కాస్త భిన్నమైన చిత్రణనే మనకు అందిస్తుంటుంది. ఉదాహరణకు, మహారాష్ట్ర ప్రభుత్వం 2013లో 1,296మంది రైతుల ఆత్మహత్యలను ప్రకటించింది. అదే సంవత్సరం ఎన్సీఆర్బీ ఆ రాష్ట్రంలో 3,146మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు తెలిపింది. 2011-12 సంవత్సరాల్లో కూడా ఇదే వ్యత్యాసం కనిపించింది. 2014లో మాత్రమే ఎన్సీఆర్బీ పొందుపర్చిన 2,568 ఆత్మహత్యల సంఖ్య మహారాష్ట్ర ప్రకటించిన 1,981 మంది ఆత్మహత్యలకు కాస్త సమీపంలోకి వచ్చి నిలిచింది. వచ్చే సంవత్సరం నుంచి రాష్ట్రాల రాజధానుల్లో అధికారులు వండి వార్చిన సంఖ్యలను మాత్రమే మీరు పొందవచ్చు. బహుశా వాటిపై ఎన్సీఆర్బీ రాజముద్ర ఉంటుంది కామోసు. వ్యాసకర్త ప్రముఖ పాత్రికేయులు psainath@gmail.com - పి. సాయినాథ్ -
నెత్తు‘రోడ్డు’తున్నాయ్...!
రాష్ట్రంలో రోజూ 55 ప్రమాదాలు..47 మరణాలు గతేడాది 20,078 ప్రమాదాల్లో 16,696 మంది బలి మృతుల్లో యువత, పురుషులే అధికం వ్యక్తిగత వాహనాల వాడకంతోనే ఎక్కువ ప్రమాదాలు దేశవ్యాప్త ప్రమాదాల్లో పదో స్థానంలో తెలంగాణ నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో గణాంకాల్లో వెల్లడి హైదరాబాద్: రాష్ట్రంలో రహదారులు నెత్తురోడుతున్నాయి. నిత్యం ప్రమాదాల రూపంలో ప్రయాణికులను బలితీసుకుంటున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ)-2014 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో సరాసరిన రోజుకు 55 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటుండగా వాటిలో 47 మంది మృత్యువాతపడుతున్నారు. ప్రమాదాల నమోదులో రాష్ట్రం దేశంలో పదో స్థానంలో నిలిచిందని ఎన్సీఆర్బీ నివేదిక స్పష్టం చేస్తోంది. మొదటి ఐదు స్థానాల్లో తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లు ఉన్నాయి. తెలంగాణలో గత ఏడాది మొత్తం 20,078 ప్రమాదాలలో 16,696 మంది మృత్యువాతపడ్డారు. విద్య, ఉద్యోగం ఇతర అవసరాల నేపథ్యంలో నిత్యం రహదారులపై సంచరించే వారే ఎక్కువగా రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రమాద మృతుల్లో యుక్త, మధ్య వయసు వారి సంఖ్యే ఎక్కువగా ఉండటమే దీనికి నిదర్శనం. ఎన్సీఆర్బీ విశ్లేషణ ప్రకారం రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 16,696 మంది మరణించగా వీరిలో 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయస్కులు 10,048 మంది ఉన్నట్లు తేలింది. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించే వారి కంటే వ్యక్తిగత వాహనాలు వాడే వారే ఎక్కువగా చనిపోతున్నారు. స్త్రీల కంటే పురుషులే ఎక్కువగా వ్యక్తిగత వాహనాలు వినియోగిస్తున్న నేపథ్యంలో మృతుల్లో పురుషుల సంఖ్య 8,240గా, స్త్రీలు 1,808గా ఉంది. కుటుంబ పోషణ భారాన్ని మోసేది ఎక్కువగా 25 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్కులే కావడంతో ఈ ప్రమాదాల కారణంగా అనేక కుటుంబాలు యజమానుల్ని కోల్పోయి ఆర్థికంగానూ చితికిపోతున్నాయి. డ్రైవింగ్ రాకపోయినా, లెసైన్సు లేకపోయినా తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం కారణంగా రహదారులపైకి వాహనాలతో దూసుకువస్తున్న మైనర్లూ ప్రమాదాలబారిన పడి అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. గతేడాది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన 18 ఏళ్లలోపు వయస్కులు 1,266 మంది ఉండటం దీనికి నిదర్శనం. డిసెంబర్లోనే అత్యధికం: శీతాకాలం కావడంతో పొగమంచు వల్ల రాష్ట్రంలో గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో అత్యధికం డిసెంబర్లోనే చోటు చేసుకున్నాయి. దాదాపు పదో వంతుకుపైగా... అంటే 2,171 యాక్సిడెంట్స్ ఈ నెల్లోనే జరిగాయి. ఏడాది మొత్తమ్మీద అతి తక్కువగా సెప్టెంబర్‌లో 1,455 ప్రమాదాలు నమోదయ్యాయి. ఏడాది మొత్తమ్మీద రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల మధ్యనే సంభవించినట్లు ఎన్సీఆర్బీ విశ్లేషణ స్పష్టం చేస్తోంది. ఈ సమయంలో అత్యధికంగా 3,484 ప్రమాదాలు జరిగాయి. ‘యాక్సిడెంట్ ప్రోన్ టైమ్’గా భావించే అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల మధ్య అతితక్కువగా 1,585 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. మరోవైపు రాష్ట్రంలో అగ్నిప్రమాదాలూ వందల మందిని పొట్టనపెట్టుకుంటున్నాయి. గతేడాది 638 అగ్నిప్రమాదాలు జరగ్గా వాటిలో 624 మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా ఉన్నారు. వంటింట్లో జరుగుతున్న ప్రమాదాలే దీనికి కారణమనే భావన ఉంది. మొత్తం మృతుల్లో 285 మంది పురుషులుకాగా 339 మంది స్త్రీలు ఉన్నారు. -
డీజీపీ కార్యాలయాన్ని సందర్శించిన విదేశీ అధికారులు
హైదరాబాద్: నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో కార్యక్రమంలో భాగంగా 21 దేశాలకు చెందిన 47 మంది పోలీసు అధికారులు తెలంగాణ డీజీపీ కార్యాలయాన్ని సందర్శించారు. డీజీపీ కార్యాలయాన్ని సందర్శించిన వారిలో ఆఫ్ఘనిస్తాన్, ఇథియోపియా, ఫిజి, ఇండోనేషియా, కెన్యా, ఉగాండా మొదలైన పలు దేశాలకు చెందిన అధికారులున్నారు. -
సైబర్ క్రైంలో ‘ఉద్యాన నగరి’ టాప్
గార్డెన్ సిటీ, భారత సిలికాన్ సిటీ, ఐటీహబ్ ఇలా ఎన్నో పేర్లతో ప్రఖ్యాతిగాంచిన బెంగళూరు నగరం ఇప్పుడు సైబర్ క్రైమ్ సిటి పేరును సైతం తన ఖాతాలో వేసుకుంది. ఐటీహబ్‌గా ఉన్న బెంగళూరు నగరం సైబర్ క్రైమ్‌కు సైతం వేదికగా మారుతోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం 2013 ఏడాదికి గాను బెంగళూరు నగరం సైబర్ క్రైమ్‌లో దేశంలోనే మొదటి స్థానంలో ఉండగా, కర్ణాటక రాష్ట్రంలో దేశ వ్యాప్తంగా మూడో స్థానంలో ఉంది. సైబర్ క్రైమ్‌లో బాధితులు ఎక్కువమంది అమ్మాయిలేనన్న అంశం మరింత ఆందోళనకు గురిచేస్తున్న అంశం. - సాక్షి, బెంగళూరు * 2013లో ఒక్క బెంగళూరు నగరంలోనే 399 కేసులు * దేశ వ్యాప్తంగా మూడో స్థానంలో కర్ణాటక * బాధితులు ఎక్కువ శాతం అమ్మాయిలే ! * సైబర్ నేరాల్లో ఉద్యాన నగరి టాప్....... నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) 2013 గణాం కాల ప్రకారం సైబర్ నేరాల్లో దేశంలోనే బెంగళూరు న గరం ప్రథమ స్థానంలో ఉంది. 2013లో ఒక్క బెంగళూరు నగరంలోనే 399 సైబర్ క్రైమ్ కేసులు న మోదయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో 173 సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా, తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో 159 కేసులు నమోదయ్యాయి. పూణె నగరంలో సైబర్ నేరాల సంఖ్య 97గా నమోదు కాగా కోల్‌కత్తాలో 84 కేసులు, ఇక దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబై నగరంలో 40 కేసులు నమోదయ్యాయి. దేశంలోనే కర్ణాటక మూడో స్థానంలో... ఇక రాష్ట్రాల వారీ లెక్కలను పరిశీలిస్తే సైబర్ నేరాల్లో కర్ణాటక రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఉండగా, మొదటిస్థానంలో మహారాష్ట్ర నిలిచింది. 2013 ఏడాదికి గాను మహారాష్ట్రలో 681 సైబర్ కేసులు నమోదు కాగా ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి) రాష్ట్రంలో 635 కేసులు నమోదయ్యాయి. ఇక కర్ణాటక రాష్ట్రంలో 513 కేసులు నమోదయ్యాయి. ఇక తరువాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్ (372), కేరళ (349) రాష్ట్రాలున్నాయి. అపరిచితులను అంగీకరించొద్దు.... ప్రస్తుతం సోషల్ నెట్వర్కింగ్ సైట్లను ఉపయోగిస్తున్న వారు తమకెంత మంది ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటే, అంత గొప్ప అన్న భావనలో ఉంటున్నారు. అందుకే ఎవరు రిక్వెస్ట్ పంపినా, వాటిని యాక్సెప్ట్ చేసి స్నేహానికి పచ్చజెండా ఊపేస్తున్నారు. దీని వల్ల రానురాను అనేక సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఇటువంటి పరిస్థితుల్లో అమ్మాయిలే ఎక్కువగా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో తప్పుడు సమాచారంతోనే చాలా మంది నెటిజన్లుగా మారుతున్నారు. ఈ విషయాన్ని గమనించని చాలా మంది అమ్మాయిలు వారితో ఆన్లైన్ స్నేహం చేస్తున్నారు. దీన్ని అలుసుగా తీసుకున్న సైబర్ నేరగాళ్లు అనంతరం వారిని బ్లాక్మెయిల్ చేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారు. దీన్ని అరికట్టాలంటే సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో మనతో బాగా పరిచయం ఉన్న వారి రిక్వెస్ట్‌లనే అంగీకరించి, ఏ విషయాలనైనా వారితో మాత్రమే షేర్ చేసుకుంటే సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ఉండడానికి వీలవుతుంది. కుటుంబాల్లో చిచ్చు.... ఎప్పుడో కొన్నేళ్ల కిందట విడిపోయిన వారిని కలిపేందుకు ఉపయోగపడుతున్న నెట్వర్కింగ్ సైట్లు, కుటుంబాల్లో చిచ్చు రగలడానికీ కారణమవుతున్నాయి. ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తులతో చాలా మంది అమ్మాయిలు, గృహిణులు కాలేజీ రోజుల్లో తమ జీవితాల్లో జరిగిన ప్రేమ వ్యవహారాలు, ఇంట్లో భర్తతో ఉన్న విభేదాలు వంటి వాటిని షేర్ చేసుకుంటూ, అందుకు సంబంధించిన ఫొటోలను సైతం పోస్ట్ చేస్తుం డటంతో సోషల్ నెట్వర్కింగ్ సైట్లు కొన్ని కుటుంబాల్లో కలహాలకు దారితీస్తున్నాయి. తమ స్నేహితులు మాత్రమే చూస్తున్నారని భావిస్తూ అమ్మాయిలు పంపిస్తున్న పోస్టింగ్ లు, సైబర్ నేరగాళ్ల చేతిలో పడి ఎక్కడ పడితే అక్కడ దర్శనమిస్తున్నాయి. దీంతో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. జాగ్రత్తలు తప్పనిసరి.... సోషల్ నెట్వర్కింగ్ సైట్లను ఉపయోగించేటపుడు కాస్తంత జాగ్రత్తలు తప్పనిసరి అని సైబర్ నిపుణులు చెబుతున్నారు. రోజురోజుకు సైబర్ నేరాలు అధికమవుతున్న నేపథ్యంలో యువత, ముఖ్యంగా అమ్మాయిలు వీటి పట్ల మరింత అవగాహనను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. సాధారణ విషయాలు, ఎవరితో షేర్ చేసుకున్నా పరవాలేదు అనిపించే సంఘటనలను మాత్రమే సోషల్ నెట్వ ర్కింగ్ సైట్లలో షేర్ చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. సెక్యూరిటీ ఆప్షన్స్ కలిగిఉన్న సైట్లను వినియోగించడం వల్ల సైబర్ నేరాల్లో చిక్కుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయని సైబర్ నిపుణులు చెబుతున్నారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఏర్పడిన పరిచయాల కారణంగా అమ్మాయిలు ఎలా ఉచ్చులో చిక్కుకుంటున్నారో తెలిపేందుకు ఉడిపిలో ఆదివారం వెలుగులోకి వచ్చిన ఓ సంఘటన ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. ఈ వివరాలను పరిశీలిస్తే...ఉడిపిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినికి కేరళకు చెందిన హరీష్ (23) అనే వ్యక్తితో ఆరు నెలల క్రితం ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. విద్యార్థినిని కలిసేందుకు హరీష్ గత శుక్రవారం ఉడిపి నగరానికి వచ్చాడు. అక్కడ హరీష్‌ని కలిసిన విద్యార్థినికి మాయమాటలు చెప్పి ఆమెను హరియడ్క సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అటవీ ప్రాంతంలో విద్యార్థిని అరుపులు విన్న కొంతమంది గిరిజనులు ఆ ప్రాంతానికి చేరుకొని విద్యార్థినిని రక్షించి, నిందితుడు హరీష్‌ని పోలీసులకు అప్పగించారు. -
ఆమె కన్నా అతడే ‘వీక్’!
ఆమె కన్నా అతడే ‘వీక్’! మనోస్థైర్యం కోల్పోతున్న పురుషులు ఆత్మహత్య కేసుల్లో మగవారిదే అధికం దేశంలో పదో వంతు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే స్పష్టం చేస్తున్న ఎన్సీఆర్బీ గణాంకాలు హైదరాబాద్: మహిళలపై అకృత్యాల్లో ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి రాష్ట్రం) ప్రథమ స్థానంలో ఉన్నట్లు స్పష్టం చేస్తోన్న నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) 2013 గణాంకాలు మరో విషయాన్నీ బయటపెట్టాయి. రాష్ట్రంలో నమోదవుతున్న ఆత్మహత్య కేసుల్లో మహిళల కంటే పురుషులవే ఎక్కువ ఉంటున్నాయని పేర్కొంటున్నాయి. మనోస్థైర్యం విషయంలో స్త్రీల కంటే పురుషులే బలహీనంగా ఉండటం దీనికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సగటున రోజుకు 40 ఉదంతాలతో గత ఏడాదికి సంబంధించి ఆత్మహత్యల సంఖ్యలో రాష్ట్రం మూడో స్థానంలో ఉండగా.. దేశంలో నమోదవుతున్న వాటిలో పదో వంతు ఇక్కడివే కావడం ఆందోళన కలిగించే అంశం. అన్నింటా స్త్రీలపై ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నించే పురుషులు కష్టాలు ఎదురవగానే మాత్రం డీలాపడిపోతున్నారని.. అర్ధంతరంగా జీవితాలు ముగించడానికే మొగ్గు చూపుతున్నారని ఈ గణాంకాలు చెప్తున్నాయి. గత ఏడాది దేశ వ్యాప్తంగా 1,34,799 ఆత్మహత్యలు రికార్డుల్లోకి ఎక్కగా.. వీటిలో 14,607 రాష్ట్రానికి సంబంధించినవే. ప్రథమ స్థానంలో తమిళనాడు (16,927), ద్వితీయ స్థానంలో మహారాష్ట్ర (16,112) ఉండగా.. తరవాతి స్థానం ఏపీదే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఆత్మహత్య ఉదంతాల్లో 9,902 మంది పురుషులు, 4,705 మంది స్త్రీలు అసువులు బాశారు. 2013లో దేశ వ్యాప్తంగా 1,34,799 మంది ఆత్యహత్యలకు పాల్పడ్డారు. వీరిలో పురుషులు 90,543 మంది ఉండగా.. స్త్రీలు 44,256 మంది ఉన్నారు. అంటే మహిళల కంటే పురుషులు రెట్టింపు సంఖ్యలో ఆత్మహత్య చేసుకున్నట్లు స్పష్టమౌతోంది. వీరిలోనూ 30 - 44 ఏళ్ల మధ్య ఉన్న నడివయస్కులే 32,099 మంది వరకు ఉన్నారు. ఈ బలవన్మరణాలకు కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం వంటి అనేక సమస్యలు దోహదం చేస్తున్నాయని ఎన్సీఆర్బీ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. వయస్సుతో నిమిత్తం లేకుండా బలవన్మరణాలకు పాల్పడటానికి కుటుంబ కలహాలే ఎక్కువగా దోహదం చేస్తున్నాయని.. రాష్ట్రంలో జరుగుతున్న ఆత్మహత్యల్లో 24 శాతం ఈ కారణాల వల్లే జరుగుతున్నాయని గణాంకాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో 2012లో 14,238 ఆత్మహత్యలు జరగ్గా.. గత ఏడాదికి ఆ సంఖ్య 2.6 శాతం పెరిగి 14,607కు చేరింది. 2013లో రాష్ట్రంలో 14 ఏళ్ల లోపు వయస్సున్న పసివాళ్లు కూడా 149 మంది బలవన్మరణానికి పాల్పడటం ఆందోళన కలిగించే అంశం. ఆత్మహత్యలకు సంబంధించి 2011లో 11.1 శాతం వాటాతో నాలుగో స్థానంలో ఉన్న రాష్ట్రం 2013 నాటికి మూడో స్థానానికి ఎగబాకింది. కుటుంబం మొత్తం బలవన్మరణానికి పాల్పడిన ఉదంతాలకు సంబంధించి రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉంది. విజయవాడ, విశాఖపట్నంలలో చోటు చేసుకున్న బలవన్మరణాల్లో ఆర్థిక పరిస్థితుల్లో ఒక్కసారిగా మార్పు రావడంతో జరిగిన ఉదంతాలే ఎక్కువ.వివాహం కావట్లేదనే కారణంతో ఉమ్మడి రాష్ట్రంలో 134 మంది (56 మంది యువకులు, 78 మంది యువతులు), సంతానం కలగట్లేదనే ఉద్దేశంతో 105 మంది (38 మంది పురుషులు, 67 మంది మహిళలు) బలవన్మరణానికి పాల్పడ్డారు. దీర్ఘకాలిక, నివారణ సాధ్యం కాని రోగాల కారణంగా మరో 210 మంది ఆత్మహత్య చేసుకోగా.. వీరిలోనూ మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఉన్నారు.రాష్ట్రంలో జరిగిన మొత్తం ఆత్మహత్యల్లో 0.7 శాతం మాత్రమే వరకట్న వేధింపుల వల్ల జరిగాయి. మాదకద్రవ్యాలకు బానిసై 282 మంది, పరీక్ష తప్పామనే కారణంగా మరో 235 మంది బలవన్మరణాలకు ఒడిగట్టారు. -
అమాయకులు కాదు... కామపిశాచులు
పిల్లాడే కదా అని అనుకుంటే అది చివరికి అమాయకత్వమే అవుతోంది. నగరంలో బాలనేరస్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. నేషనల్ క్రైంరికార్డ్స్ బ్యూరో గణాంకాలు దీన్నే సూచిస్తున్నాయి. న్యూఢిల్లీ: నగరంలో బాలనేరస్తులు మహిళలు లైంగికవేధింపులకు పాల్పడుతున్న ఘటనల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.ఇక అత్యాచారాల సంఖ్య 60.3 శాతం మేర పెరిగింది. నేషనల్ క్రైంరికార్డ్స్ బ్యూరో అందించిన వివరాల ప్రకారం 2013లో బాల నేరస్తులు మహిళలపై లైంగిక దాడులు 132.3 శాతం మేర పెరిగింది. మహిళలపట్ల అసభ్యంగా వ్యవహరించిన కేసుల సంఖ్య 60.3 శాతంగాను నమోదయ్యింది. 16 నుంచి 18 సంవత్సరాల వయ స్సు గల 66.3 శాతం మంది బాలనేరస్తులను పోలీ సులు అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది బాల నేరస్తులు పాల్పడిన నేరాల సంఖ్య 31,725గా నమోదయ్యింది. అంతకుముందు 2012లో 27,936 మంది బాలనేరస్తులపై కేసులు నమోదయ్యాయి. ఇక 7,969 మందిపై దొంగతనం, 6,043 మందిపై దాడిచేసి గాయపరిచిన కేసులు, మరో 3,784మందిపై చోరీ కేసులు నమోదయ్యాయి. మొత్తం బాలనేరస్తుల సంఖ్య 43,506 కాగా వారిలో 8,392 మంది నిరక్షరాస్యులు కాగా 13,984 మంది అక్షరాస్యులు. బాలనేరస్తుల్లో అత్యధిక శాతంమంది నిరుపేద కుటుంబాలకు చెందినవారే. ఆయా కుటుంబాల వార్షిక ఆదాయం రూ. 25 వేలకు లోపే కావడం ఈ సందర్భంగా గమనార్హం. వీరిలో 35 వేలమందికిపైగా తమ తల్లిదండ్రులతోనే నివసిస్తున్నారు. ఇతర నిందితులతో సమానంగా చూడాలి కాగా అత్యాచారం కేసుల్లోనమోదైన బాలనేరస్తులను ఇతర నేరాలకు పాల్పడిన వారితో సమానంగానే పరిగణించాలనేది కేంద్ర మహిళ, కుటుంబసంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ వాదన. లైంగిక నేరాల్లో పాల్గొంటున్నవారిలో 16 ఏళ్ల లోపు వారు కూడా ఉంటున్నారని అన్నారు. బాలనేరస్తుల చట్టం పై వారికి అవగాహన ఉందని వాదిస్తున్నారు. అం దువల్లనే వారు ఆవిధంగా చేయగలుగుతున్నారన్నా రు. ఇటువంటి వారిని ఇతర కేసుల్లో నిందితులతో సమానంగా పరిగణిస్తే వారిలో భయమేర్పడుతుం దన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర మహిళ, కుటుంబసంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన కృష్ణతీరథ్... అత్యాచారం కేసుల్లోనమోదైన బాలనేరస్తులను ఇతర నేరాలకు పాల్పడిన వారితో సమానంగానే పరిగణించాలంటూ ఓ ప్రతి పాదన కూడా చేశారు. అయితే ఈ ప్రతిపాదనను అప్పట్లో బాలల హక్కుల సంఘాలు వ్యతిరేకించా యి. అయితే నేరాలకు పాల్పడే బాలలపై చర్యలకు ఉపక్రమించేందుకు వీలుగా ఆగస్టు 12వ తేదీన కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ఓ బిల్లును ప్రవేశపెట్టింది.