అత్యంత సురక్షితంకాని నగరం ఇదే
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మహిళలకే కాదు సీనియర్ సిటిజెన్లకు కూడా సురక్షితం కాదట. దేశంలో సీనియర్ సిటిజెన్లకు సురక్షితంకాని నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. వరుసగా రెండో ఏడాది కూడా ఢిల్లీ అత్యంత సురక్షితంకాని నగరంగా నిలిచింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
ఎన్సీఆర్బీ ప్రకారం.. దేశంలో ఇతర నగరాలతో పోలిస్తే ఢిల్లీలో సీనియర్ సిటిజెన్లపై జరిగే నేరాలు ఐదురెట్లు అధికం. ప్రతి లక్షమందిలో 108.8 మందిపై నేరాలు జరుగుతున్నాయి. గతేడాది ఢిల్లీలో సీనియర్ సిటిజెన్లపై జరిగిన నేరాల్లో 145 దొంగతనం కేసులు, 123 ఛీటింగ్, 14 హత్య కేసులు, 2 హత్యాయత్నం కేసులు, ఓ అత్యాచారం కేసు ఉన్నాయి. గతేడాది మొత్తం 1248 కేసులు నమోదయ్యాయి. 2014తో పోలిస్తే గతేడాది 19 శాతం నేరాలు పెరిగాయి. ఇక 2014లో దేశవ్యాప్తంగా 18714 కేసులు నమోదైతే, గతేడాది 20532 కేసులు నమోదయ్యాయి. సీనియర్ సిటిజెన్ల కోసం 1291 హెల్ప్ లైన్ నెంబర్ ఉందని, వారు ఆపదలో ఉంటే ఏ సమయంలోనైనా తమకు ఫోన్ చేయవచ్చని ఢిల్లీ సీనియర్ పోలీస్ అధికారి ఒకరు చెప్పారు.