
ఢిల్లీలో వాయుకాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని అక్కడి ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. త్వరలోనే 'ఈవీ పాలసీ 2.0'ను తీసుకురావడానికి సన్నద్ధమవుతోంది. దీనికి మంత్రి వర్గం నుంచి ఆమోదం లభించిన తరువాత.. పెట్రోల్, డీజిల్ సీఎన్‌జీ బైకులను పూర్తిస్థాయిలో నిషేధించడానికి ఢిల్లీ సర్కార్ అడుగులువేస్తుంది.
ఈవీ పాలసీ 2.0 అమలులోకి వచ్చిన తరువాత.. వచ్చే ఏడాది నుంచే పెట్రోల్, సీఎన్‌జీ బైకులను బ్యాన్ చేయనున్నారు. 2027 డిసెంబర్ 31 నాటికి ఢిల్లీలో వందశాతం ఎలక్ట్రిక్ వాహనాలను నడపాలని ఉద్దేశ్యంతోనే.. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సీఎన్‌జీ బైకులతో పాటు, సీఎన్‌జీ ఆటోలను కూడా నిషేదించనున్నట్లు సమాచారం. ఫ్యూయెల్ కార్లను ఎంతవరకు నిషేధిస్తారు అనేదానికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
2025 ఆగస్టు 15 నుంచి ఢిల్లీలో కొత్త సీఎన్‌జీ ఆటో రిక్షా రిజిస్ట్రేషన్లను, రెన్యువల్స్ అనుమతించరు. కేవలం ఎలక్ట్రిక్ ఆటోల రెన్యువల్స్, రిజిస్ట్రేషన్లకు మాత్రమే అనుమతి లభిస్తుంది. ఆ తరువాత దశల వారీగా పెట్రోల్, సీఎన్‌జీ వాహనాలను తొలగించనున్నారు. వీటి స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాల్సి ఉంది.
బైకులు, ఆటోలు మాత్రమే కాకుండా.. ఢిల్లీలో చెత్తను సేకరించే వాహనాలు, సిటీ బస్సులు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు అయి ఉండాలి చెబుతున్నారు. కాగా మార్చి 31తో ముగిసిన 'ఈవీ పాలసీ'ని ఢిల్లీ ప్రభుత్వం మరో 15 రోజులు పెంచింది. ఆ తరువాత ఈవీ పాలసీ 2.0 అమలులోకి వస్తుంది. ఫ్యూయెల్ వాహనాలను.. ఎలక్ట్రిక్ వాహనాలతో భర్తీ చేయడమే ఈ కొత్త పాలసీ లక్ష్యం అని అధికారులు చెబుతున్నారు.
ఢిల్లీ వాయు కాలుష్య సంక్షోభం
దేశ రాజధానిలో చాలా సంవత్సరాలుగా తీవ్రమైన వాయు కాలుష్య సంక్షోభం నెలకొంది. శీతాకాలంలో గాలి నాణ్యత (AQI) ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఇది మరింత తీవ్రమవుతుంది. వాహనాల ఉద్గారాలు, నిర్మాణ పనుల నుంచి వచ్చే దుమ్ము, కర్మాగారాల నుంచి వచ్చే పొగ.. పంజాబ్, హర్యానా వంటి సమీప రాష్ట్రాలలోని రైతులు గడ్డిని తగలబెట్టడం వల్ల కాలుష్యం ఏర్పడుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. పండుగల సమయంలో పటాకులు కాల్చడం, వ్యర్థాలను కాల్చడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతోంది. వాయుకాలుష్యం కారణంగా పిల్లలు, వృద్ధులలో శ్వాస సమస్యలు, ఉబ్బసం, గుండె జబ్బులకు కారణమవుతాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.