న్యూఢిల్లీ: దేశ ఆటోమొబైల్ మార్కెట్ క్రమంగా పర్యావరణ అనుకూల పరిష్కారాల వైపు అడుగులు వేస్తోంది. ఎక్కువ మంది పెట్రోల్, ఎలక్ట్రిక్ వాహనాలు, సీఎన్‌జీ కార్లకు ప్రాధాన్యం ఇస్తుండడంతో.. ఆటోమొబైల్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ తర్వాత సీఎన్‌జీ వాహనాలకే ఎక్కువ డిమాండ్ నెలకొంది. దీంతో ఎల్‌పీజీ కార్ల విక్రయాలు ఐదేళ్ల కాలంలో (2018–19 నుంచి చూస్తే) 82 శాతం తగ్గిపోయాయి. 2022–23లో కేవలం 23,618 ఎల్‌పీజీ కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి.
కానీ, 2018–19లో 1,28,144 యూనిట్లు అమ్ముడుపోవడం గమనార్హం. కేంద్ర రవాణా శాఖ పరిధిలోని వాహన్ పోర్టల్ గణాంకాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా గత ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం మీద 2,22,24,702 యూనిట్ల వాహనాలు అమ్ముడుపోతే, ఇందులో ఎల్‌పీజీ వాహనాలు కేవలం 0.11 శాతంగా ఉండడం వినియోగదారులు వీటి పట్ల ఆసక్తిగా లేరని తెలుస్తోంది. అదే సమయంలో సీఎన్‌జీ వాహన విక్రయాలు ఇందులో 3 శాతంగా ఉంటే, ఎలక్ట్రిక్ వాహనాలు 5 శాతంగా ఉండడం, కస్టమర్లు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నట్టు తెలియజేస్తోంది.
ఎగసి పడిన డిమాండ్
ఎల్‌పీజీ పుష్కలంగా అందుబాటులో ఉండడమే కాదు, ఎక్కువ ఆక్టేన్ కలిగి, చాలా తక్కువ ఉద్గారాలను విడుదల చేసే ఇంధనం కావడంతో.. ఆటోమొబైల్ పరిశ్రమకు ప్రత్యామ్నాయ ఇంధనంగా లోగడ భావించారు. దీంతో ఎల్‌పీజీ కార్లు, ఎల్‌పీజీ త్రిచక్ర వాహనాలు 2019లో ఎక్కువగా అమ్ముడుపోయాయి. కానీ, దేశంలో ఎల్‌పీజీ వాహనాల వినియోగం చట్టబద్ధంగా అమల్లోకి వచ్చిం ది మాత్రం 2020 ఏప్రిల్ నుంచి కావడం గమనార్హం.
నాలుగు చక్రాల ప్యాసింజర్ వాహనాలకుతోడు, ఎల్‌పీజీ త్రిచక్ర వాహనాలు (80 శాతానికి పైగా) 2019లో రికార్డు స్థాయి ఎల్‌పీజీ వాహన అమ్మకాలకు దోహదపడినట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కానీ, 2022–23 సంవత్సరంలో ఎల్‌పీజీ వాహనాల డిమాండ్ 14 శాతానికి పరిమితమైంది. 2018–19లో ఇది 18 శాతంగా ఉంది. 2022–23లో కేవలం 3,495 ఎల్‌పీజీ నాలుగు చక్రాల వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. 2018–19లో ఇలా రిజిస్టర్ అయిన నాలుగు చక్రాల వాహనాలు 23,965 యూనిట్లుగా ఉండడం గమనించాలి.
‘‘విక్రయానంతరం ప్యాసింజర్ వాహనాలకు ఉన్న డిమాండ్ ఇది. 2018 నుంచి 2020 వరకు ప్యాసింజర్ వాహన విభాగమే ఎల్‌పీజీకి పెద్ద మద్దతుగా నిలిచింది. నిబంధనలు అనుకూలంగా లేకపోవడం, కిట్ ఆధారిత అనుమతులకు అధిక వ్యయాలు చేయాల్సి రావడం, ప్రతి మూడేళ్లకోసారి తిరిగి సరి్టఫై చేయించుకోవాల్సి రావడం, ఎల్‌పీజీ మోడళ్లు పెద్దగా అందుబాటులో లేకపోవడం వినియోగదారుల్లో ఆసక్తి ఆవిరైపోవడానికి కారణం’’అని ఇండియన్ ఆటో ఎల్‌పీజీ కొయిలిషన్ డైరెక్టర్ జనరల్ సుయాష్ గుప్తా వివరించారు.
వసతులు కూడా తక్కువే..
2023 మార్చి నాటికి దేశవ్యాప్తంగా కేవలం 1,177 ఎల్‌పీజీ స్టేషన్లే ఉన్నాయి. అదే సీఎన్‌జీ స్టేషన్లు అయితే 4,600 ఉంటే, ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లు 5,200 ఉన్నాయి. పెట్రోల్ పంపులు 80,000 పైగా ఉన్నాయి. అంటే ఎల్‌పీజీ విషయంలో సరైన రీఫిల్లింగ్ వసతులు కూడా లేవని తెలుస్తోంది. మరోవైపు ధరలు కూడా అనుకూలంగా లేని పరిస్థితి నెలకొంది.
ఢిల్లీలో కిలో ఎల్‌పీజీ ధర లీటర్‌కు రూ.68కి చేరుకోగా, 2019లో రూ.40 మాత్రమే ఉంది. ఇతర రాష్ట్రాల్లో దీని ధర ఇంకా ఎక్కువే. ‘‘ప్రభుత్వం వైపు నుంచి ప్రోత్సాహం కొరవడడంతో వాహన తయారీదారులు ఎల్‌పీజీ మోడళ్లను తీసుకొచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. నేడు దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా అయితే ఎల్‌పీజీ కార్ల తయారీని నిలిపివేసింది.
ప్రజలు సీఎన్‌జీ, ఈవీల పట్ల ఆసక్తి చూపిస్తుండడం దేశంలో ఎల్‌పీజీ వాహన రంగానికి గొడ్డలి పెట్టుగా మారింది’’అని పరిశ్రమకు చెందిన నిపుణుడు ఒకరు పేర్కొన్నారు. ఈవీ, సీఎన్‌జీ వాహనాలను కేంద్రం సబ్సిడీలతో ప్రోత్సాహిస్తుండడాన్ని పరిశ్రమ ప్రస్తావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment