హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఆటోమొబైల్ రంగంలో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) ఆధారిత వాహనాలకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. 2023 జనవరి–సెప్టెంబర్ మధ్య 6,66,384 యూనిట్ల సీఎన్‌జీ వాహనాలు రోడ్డెక్కాయి.
అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది ఏకంగా 32 శాతం పెరుగుదల. 2022 జనవరి–సెప్టెంబర్ కాలంలో దేశవ్యాప్తంగా 5,04,003 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలల్లో సీఎన్‌జీతో నడిచే త్రిచక్ర వాహనాల విక్రయాలు 81 శాతం అధికమై 2,48,541 యూనిట్లు నమోదయ్యాయి. ప్యాసింజర్ వాహనాలు 9 శాతం పెరిగి 2,65,815 యూనిట్లకు చేరుకున్నాయి. సరుకు రవాణా వాహనాలు 26 శాతం క్షీణించి 60,531 యూనిట్లకు వచ్చి చేరాయి. బస్‌లు, వ్యాన్స్ 125 శాతం ఎగసి 91,497 యూనిట్లను తాకాయి.
తక్కువ వ్యయం కాబట్టే..
సీఎన్‌జీ కేజీ ధర ప్రస్తుతం రూ.76 పలుకుతోంది. హైదరాబాద్ మార్కెట్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.109.66, డీజిల్ రూ.97.82 ఉంది. డీజిల్, పెట్రోల్‌తో పోలిస్తే సీఎన్‌జీ చవకగా దొరుకుతుంది కాబట్టే కస్టమర్లు మొగ్గు చూపుతున్నారు. సీఎన్‌జీ ఆధారిత త్రీవీలర్లు, ప్యాసింజర్ వెహికిల్స్, సరుకు రవాణా వాహనాలతోపాటు బస్‌లు, వ్యాన్స్ అన్నీ కలిపి 2022–23లో తొలిసారిగా పరిశ్రమలో 6,50,000 యూనిట్ల అమ్మకాలను దాటాయి. 2021–22తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో సీఎన్‌జీ వెహికిల్స్ విక్రయాల్లో 46 శాతం వృద్ధి నమోదైంది. 2023 జనవరి–సెప్టెంబర్‌లో దేశీయ ప్యాసింజర్ వెహికిల్స్ పరిశ్రమలో సీఎన్‌జీ ఆధారిత వాహనాల వాటా 8.8 శాతం ఉంది. ఇక సీఎన్‌జీ విభాగంలో ప్యాసింజర్ వెహికిల్స్ వాటా 40 శాతం, త్రిచక్ర వాహనాలు 37 శాతం కైవసం చేసుకున్నాయి.
తొలి స్థానంలో మారుతీ..
సీఎన్‌జీ ప్యాసింజర్ వెహికిల్స్ పరిశ్రమలో 72 శాతం వాటాతో మారుతీ సుజుకీ ఇండియా హవా కొనసాగుతోంది. 15 మోడళ్లలో ఈ కంపెనీ సీఎన్‌జీ వేరియంట్లను ప్రవేశపెట్టింది. భారత్‌లో ఈ స్థాయిలో సీఎన్‌జీ వేరియంట్లు కలిగిన కంపెనీ మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. మారుతీ సుజుకీ 2023 జనవరి–సెప్టెంబర్‌లో 10.85 శాతం వృద్ధితో 1,91,013 యూనిట్ల అమ్మకాలతో దూసుకుపోతోంది. 2020 ఏప్రిల్‌లో డీజిల్ నుంచి నిష్క్రమించిన తర్వాత ఈ సంస్థ సీఎన్‌జీని ప్రధాన్యతగా తీసుకుంది.
సెప్టెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలల్లో హుందాయ్ మోటార్ సీఎన్‌జీ విక్రయాలు 10.67 శాతం క్షీణించి 35,513 యూనిట్లకు పరిమితమైంది. టాటా మోటార్స్ 13.77 శాతం ఎగసి 34,224 యూనిట్లను సాధించింది. టయోటా కిర్లోస్కర్ మోటార్ 52 యూనిట్ల నుంచి ఏకంగా 4,679 యూనిట్ల అమ్మకాలను అందుకుంది. సీఎన్‌జీ త్రిచక్ర వాహనాల్లో బజాజ్ ఆటో 87 శాతం వాటాతో అగ్ర స్థానంలో ఉంది. పియాజియో, టీవీఎస్ మోటార్ కో, అతుల్ ఆటో, మహీంద్రా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. సీఎన్‌జీ గూడ్స్ క్యారియర్స్ విభాగంలో టాటా మోటార్స్, మారుతీ సుజుకీ ఇండియా, మహీంద్రా, వీఈ కమర్షియల్ వెహికిల్స్, అశోక్ లేలాండ్, ఎస్‌ఎంఎల్ సుజుకీ వరుసగా పోటీపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment