Delhi Govt
-
కేజ్రీవాల్‌దే పైచేయి
ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికి ఉండాల్సిన అధికారాలపై ఎనిమిదేళ్లుగా సాగిస్తున్న పోరులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు విజయం సాధించారు. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో అక్కడి గవర్నర్ వ్యవహారశైలిని తప్పుబడుతూ తీర్పునిచ్చిన గురువారం రోజే ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్‌కీ(ఎల్జీ), అక్కడి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వానికీ మధ్య సాగుతున్న వివాదంపై కూడా నిర్ణయాత్మక తీర్పు వెలువడింది. ఈ రెండు తీర్పులూ రెండు వేర్వేరు రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చినా... ప్రాతినిధ్య ప్రజాస్వామ్య ప్రాధాన్యతనూ, ఎన్నికైన ప్రభుత్వాల విషయంలో వ్యవహరించాల్సిన తీరుతెన్నులనూ ఆ తీర్పులు నిర్దేశించాయి. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వానికెదురైన సమస్య ప్రత్యేక మైనది. అధికారుల బదిలీకి కూడా ప్రభుత్వానికి అధికారం లేదన్నట్టు అక్కడి ఎల్జీ వీకే సక్సేనా ప్రవర్తించారు. ఆ వివాదం పైనే ప్రస్తుత తీర్పు వెలువడింది. పోలీసు వ్యవస్థ, శాంతిభద్రతలు, భూసంబంధ అంశాల్లో మినహా ఇతర అధికారాల విషయంలో ఎల్జీకి అజమాయిషీ ఉండదనీ, ఢిల్లీ ప్రభుత్వ కేబినెట్ సలహాలకు ఆయన లోబడి ఉండాల్సిందేననీ ఈ ఏకగ్రీవ తీర్పు స్పష్టం చేసింది. ఆ వెంటనే కేజ్రీవాల్ సర్వీసు వ్యవహారాల కార్యదర్శిని బదిలీ చేశారు. రాగల రోజుల్లో మరిన్ని బదిలీలు ఉంటాయని ఆయన సంకేతాలిచ్చారు. వాస్తవానికి 2018లో అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన మెజారిటీ తీర్పు ఇలాంటి సమస్యలకు ముగింపు పలికిందని అందరూ భావించారు. కానీ ఆ తర్వాత ఆప్ ప్రభుత్వం కొంతమంది అధికారులకు ఇచ్చిన బదిలీ ఉత్తర్వుల అమలు సాధ్యపడదని సర్వీసు వ్యవహారాల కార్యదర్శి చెప్పటంతో సమస్య మొదటికొచ్చింది. దానిపై ఆప్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేయటం, సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలోని న్యాయమూర్తులిద్దరూ భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేయటంతో రాజ్యాంగ ధర్మాసనం ముందుకు ఈ కేసు వెళ్లింది. ఈలోగా 2021లో కేంద్రం 1991నాటి ఢిల్లీ ప్రభుత్వ రాజధాని ప్రాంత చట్టానికి సవరణలు తీసుకురావటం ద్వారా పాలనాపరమైన నిర్ణయాలపై ఎల్జీ ఆధిపత్యాన్ని ప్రతిష్టించింది. 2018 నాటి సుప్రీం తీర్పును వమ్ము చేయటమే ఈ సవరణ ఆంతర్యమని ఎవరికైనా అర్థమవుతుంది. అయితే ఢిల్లీ కూడా ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల వంటి దేనన్న కేంద్రం వాదనతో 2018 లోనూ, ఇప్పుడూ కూడా సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. 1991లో 69వ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేరిన 239 ఏఏ అధికరణ ఇతర కేంద్ర పాలిత ప్రాంతాలకు భిన్నంగా ఢిల్లీ సర్కారుకు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చిందని గుర్తుచేసింది. 2018 తీర్పులో ప్రస్తావించిన కేంద్ర పరిధిలోని మూడు అంశాల్లో సర్వీసు వ్యవహారాల గురించి ప్రత్యేకించి చెప్పకపోయినా అది కూడా అంతర్లీనంగా ఉన్నట్టేనని కేంద్రం వాదిస్తూ వస్తోంది. అయితే 239 ఏఏ అధికరణంలోని క్లాజు (3)(ఏ) ఢిల్లీ సర్కారుకు విస్తృతాధికారాలిస్తోందని తాజా తీర్పు స్పష్టం చేసింది. దేశ రాజధాని కావటం వల్ల ఢిల్లీ ప్రభుత్వానికి ఉండే అధికారాలు పరిమితమైనవే. పూర్తి ప్రతిపత్తి ఉన్న రాష్ట్రాల అధికారాలే కుంచించుకుపోతున్న వర్తమానంలో, పరిమితుల చట్రంలో ఉండే ఆప్ ప్రభుత్వం తనదైన విధానాలను అమలు చేయటం ఎంత కష్టమో ఊహించుకోవచ్చు. ఢిల్లీ ప్రభుత్వానికి తగిన అధికారాలివ్వటంలో పార్టీలతో సంబంధం లేకుండా కేంద్రంలో ఉండే ప్రభుత్వాలు అలసత్వాన్నే ప్రదర్శిస్తూ వచ్చాయి. 1993లో ఢిల్లీలో అసెంబ్లీని పునరుద్ధరించిన నాటి నుంచీ ఈ డిమాండు వినిపిస్తూనే ఉంది. చిత్రమేమంటే కేంద్రంలో ఇతర ప్రభుత్వాలున్నప్పటి మాట అటుంచి వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్డీఏ ఏలుబడిలోగానీ, మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ఏలుబడిలోగానీ ఢిల్లీలో తమ పార్టీ సర్కార్లే నడుస్తున్నా ఏ నాయకత్వమూ ఢిల్లీ సర్కారుకు తగిన అధికారాలివ్వటానికి ముందుకు రాలేదు. ఢిల్లీలో బీజేపీ నేతలు మదన్‌లాల్ ఖురానా, సాహిబ్ సింగ్ వర్మ, సుష్మా స్వరాజ్‌లు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కాంగ్రెస్‌కు చెందిన షీలా దీక్షిత్ దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్నా తమను నామమాత్రావశిష్టం చేయటమేమిటన్నదే వీరందరి ప్రశ్న. ప్రజల ద్వారా ఎన్ని కైన ఢిల్లీ దేశ రాజధాని ప్రాంత(ఎన్‌సీటీడీ) ప్రభుత్వాన్ని ప్రజలకు జవాబుదారీగా చేయాలని,అందుకోసం దానికి తగిన అధికారాలను కట్టబెట్టాలని దేశ కార్యనిర్వాహక వ్యవస్థ భావించలే దంటే... ఆ విషయంలో అయిదేళ్ల వ్యవధిలో రెండుసార్లు న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోక తప్ప లేదంటే పరిస్థితెలా ఉందో అర్థమవుతుంది. తాజా తీర్పు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వానిదే పైచేయి తప్ప ఎల్జీది కాదని తేల్చింది. మూడు అంశాలు మినహా ఇతర విషయాల్లో ఢిల్లీ సర్కారుకు వేరే రాష్ట్రాలతో సమానంగా అధికారాలుంటాయని ఈ తీర్పు స్పష్టం చేసింది గనుక రెండు పక్షాలూ అనవసర వివాదాలకు స్వస్తి పలకాలి. కేజ్రీ వాల్ స్థానంలో ఒక రాజకీయ నేత సీఎంగా ఉంటే ఇంత పట్టుదలగా పోరాడే వారు కాదేమో! ఆ సంగతలావుంచి ఆప్ సర్కారు చిన్నచూపు చూస్తున్నదని అక్కడ పనిచేసే ఐఏఎస్‌లు ఆరోపిస్తుంటారు. ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలు తమపై దౌర్జన్యం చేశారంటూ 2018లో సమ్మెకు కూడా దిగారు. రోజువారీ వ్యవహారాల్లో పట్టువిడుపులుండాలనీ, అధికారులతో సామరస్యంగా పోవాలనీ కేజ్రీవాల్ గుర్తించటం అవసరం. రాజకీయ నాయకత్వానికీ, పాలనా వ్యవస్థకూ మధ్య సామరస్యత ఉన్నప్పుడే ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించటం సాధ్యపడుతుందని ఆయన గ్రహించాలి. ఇకపై ఎల్జీ కూడా తన పరిధులకు లోబడి వ్యవహరించటం అవసరమని తెలుసుకోవాలి. -
నా భార్య సైతం ఇన్ని ‘లవ్ లెటర్స్’ రాయలేదు: కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాల మధ్య కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. గవర్నర్ వివిధ అంశాలపై లేఖలు రాయటాన్ని సూచిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గడిచిన ఆరు నెలల్లో గవర్నర్ రాసినన్ని లవ్ లెటర్లు.. తన భార్య కూడా రాయలేదంటూ ట్వీట్ చేశారు. తనను తిట్టటం, లేఖలు రాయటానికి కాస్త విరామం ఇచ్చి కాస్త సేదతీరండీ అంటూ సూచించారు. ‘ప్రతి రోజు ఎల్జీ సాబ్ తిట్టినన్ని తిట్లు నా భార్య కూడా తిట్టలేదు. గడిచిన ఆరు నెలల్లో ఎల్జీ సాబ్ రాసినన్ని లవ్ లెటర్లు నా భార్య సైతం రాయలేదు. ఎల్జీ సాబ్ కొద్దిగా చల్లబడండి. అలాగే.. కొద్దిగా సేదతీరమని మీ సూపర్ బాస్‌కి సైతం చెప్పండి.’ అని హిందీలో ట్వీట్ చేశారు కేజ్రీవాల్. ఢిల్లీలోని బీజేపీ పాలిత మున్సిపల్ బాడీల్లో రూ.6000 కోట్ల స్కాం జరిగిందని, దానిపై దృష్టి పెట్టండంటూ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా లేఖ రాసిన మరుసటి రోజునే కేజ్రీవాల్ ఈ మేరకు ట్వీట్ చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. సిసోడియా లేఖకు ఎల్జీ సక్సేనా ఎలాంటి స్పందన తెలియజేయలేదు. కానీ, బీజేపీ ఆ ఆరోపణలను ఖండించింది. LG साहिब रोज़ मुझे जितना डाँटते हैं, उतना तो मेरी पत्नी भी मुझे नहीं डाँटतीं। पिछले छः महीनों में LG साहिब ने मुझे जितने लव लेटर लिखे हैं, उतने पूरी ज़िंदगी में मेरी पत्नी ने मुझे नहीं लिखे। LG साहिब, थोड़ा chill करो। और अपने सुपर बॉस को भी बोलो, थोड़ा chill करें। — Arvind Kejriwal (@ArvindKejriwal) October 6, 2022 ఇదీ చదవండి: వందేభారత్ ట్రైన్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం.. గేదెలను ఢీకొట్టడంతో..! -
పండుగ వేళ ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం, ఫైర్ క్రాకర్స్ బ్యాన్
న్యూఢిల్లీ: కాలుష్య భూతానికి చెక్ పెట్టేలా ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1, 2023 వరకు పటాకులను పూర్తిగా నిషేధించింది. ఈ మేరకు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ బుధవారం (సెప్టెంబర్ 7) సోషల్ మీడియాలో ఒక ప్రకటన చేశారు. ఢిల్లీలో కాలుష్య భూతంనుంచి ప్రజలను రక్షించడానికి, గత సంవత్సరం మాదిరిగానే, ఈసారి కూడా అన్ని రకాల పటాకుల ఉత్పత్తి, నిల్వ, అమ్మకం, వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నామని మంత్రి వెల్లడించారు. తద్వారా కాలుష్య భూతంనుంచి ప్రజల ప్రాణాలను కాపాడవచ్చంటూ రాయ్ తన అధికారిక ట్విటర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించారు. జనవరి 1, 2023 వరకు పటాకుల ఉత్పత్తి, నిల్వ, అమ్మకం, వినియోగంపై పూర్తి నిషేధం ఉంటుందని రాయ్ ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ ఏడాది దేశ రాజధానిలో ఆన్లైన్లో పటాకుల అమ్మకం లేదా డెలివరీపై కూడా నిషేధం ఉంటుందని తెలిపారు. నిషేధాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు ఢిల్లీ పోలీసులు, ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ, రెవెన్యూ శాఖలతో కలిసి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామన్నారు. పండుగ సీజన్లో ముఖ్యంగా దీపావళి సందర్బంగా క్రాకర్స్‌కు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇప్పటికే ఢిల్లీలోని కాలుష్యం రికార్డు స్థాయికి చేరడంతో దీని నివారణకు అనేక చర్యల్ని చేపడుతోంది. दिल्ली में लोगों को प्रदूषण के खतरे से बचाने के लिए पिछले साल की तरह ही इस बार भी सभी तरह के पटाखों के उत्पादन, भंडारण, बिक्री और उपयोग पर पूरी तरह प्रतिबंध लगाया जा रहा है, तांकि लोगों की जिंदगी बचाई जा सके। — Gopal Rai (@AapKaGopalRai) September 7, 2022 అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం గత ఏడాది ‘పతాఖే నహీ దియే జలావో’ అంటూ విస్తృత ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ సందర్బంగా పటాకుల అమ్మకాలను, పేల్చడాన్ని పూర్తిగా నిషేధించింది. అలాగే నివాస, వాణిజ్య ప్రాంతాల్లో పటాకులు పేల్చి పట్టుబడిన వారికి రూ.1,000 జరిమానా విధించగా, సైలెంట్ జోన్లలో అదే పని చేస్తూ పట్టుబడిన వారికి 3 వేల జరిమానా విధించారు. వివాహాలు, మతపరమైన పండుగలు లేదా ర్యాలీలు, బహిరంగ సభల్లో ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే నివాస, వాణిజ్యం ఆవాసాల్లో అయితే పదివేలు, కీలక జోన్లలో రూ. 20 వేలు చెల్లించేలా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. -
కేంద్రం–ఢిల్లీ రగడపై సుప్రీం ధర్మాసనం
న్యూఢిల్లీ: దేశ రాజధానికి సంబంధించిన పలు శాఖలపై శాసన, పాలనాపరమైన పెత్తనం విషయమై కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నడుస్తున్న వివాదంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది. ఇందుకోసం జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. జస్టిస్ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ అంశాన్ని ఢిల్లీ ప్రభుత్వం తరఫు న్యాయవాది సోమవారం లేవనెత్తారు. ఈ అంశంపై 2019 ఫిబ్రవరి 14న ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు భిన్నమైన తీర్పు వెలువరించారు. విచారణకు స్వీకరిస్తాం మనీ లాండరింగ్ చట్టంపై తీర్పును పునఃపరిశీలించాలంటూ దాఖలైన పిల్ విచారణ స్వీకరణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దాన్ని విచారణ కేసుల జాబితాలో చేరుస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంలోని ధర్మాసనం తెలిపింది. -
ఎలక్ట్రిక్ సైకిల్ కొంటున్నారా? భారీ రాయితీలు ప్రకటించిన ఢిల్లీ సర్కారు
వాతావరణ కాలుష్యం తగ్గించే ప్రయత్నంలో ప్రతీ అవకాశం వినియోగించుకోవాలని ఢిల్లీ సర్కారు డిసైడ్ అయ్యింది. అందులో భాగంగా మరోసారి ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది. వ్యక్తిగత, రవాణా, కార్గోలలో ఏ తరహా ద్విచక్ర వాహనమైనా సరే, ఈవీ అయితే చాలు ప్రోత్సాహం అందిస్తామని తెలిపింది. ఢిల్లీలోని ఆప్ సర్కారు ప్రకటించిన రాయితీల ప్రకారం.. ఢిల్లీలో రిజిస్ట్రర్ అయ్యే మొదటి పది వేల ఎలక్ట్రిక్ ద్వి చక్ర వాహనాలకు ఈ ఇన్సెంటీవ్ వర్తిస్తుంది. ఇందులో ఒక్కో వాహనంపై గరిష్టంగా రూ.5,500ల వరకు ప్రోత్సాహంగా అందివ్వనుంది. కార్గో, పర్సనల్, వ్యక్తిగత అన్ని కేటగిరీల వాహనాలకు ఇందులో చేర్చారు. దీనికి అదనంగా మొదటి వెయ్యి వ్యక్తిగత వాహనాలకు అదనంగా మరో రూ.2000లు ప్రోత్సాహక నగదు అందివ్వాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చదవండి: అవును నిజం.. త్వరలో ఎలక్ట్రిక్ ‘అంబాసిడర్’ కారు! -
వాహనదారులకు భారీ షాక్..ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోతే రూ.10వేలు జరిమానా, జైలుశిక్ష!
వాహనదారులకు ఢిల్లీ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని ప్రైవేట్, ప్రభుత్వ వాహనాల యజమానులకు రూ.10వేలు జరిమానా, జైలుశిక్ష విధిస్తున్నట్లు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఇన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్‌కే పరిమితమైన ఉద్యోగులు కార్యాలయాలకు తిరిగి వస్తున్నారు. అదే సమయంలో వాహనాల రాకపోకళ్లు పెరిగి రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ఢిల్లీ - గురుగ్రావ్ మార్గాల్లో 2020లో 347 మంది, 2021లో 10శాతం పెరిగి 389 మంది రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. 2020లో 375 మంది తీవ్రంగా గాయపడగా.. 2021లో 409 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయితే ఈ వరుస ప్రమాదాల నుంచి వాహనదారుల్ని కాపాడేందుకు ఢిల్లీ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఇటీవల రోడ్డు రవాణా శాఖ అధికారులు ఫిట్నెస్ లేని వాహనాల్ని గుర్తించేందుకు ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో "ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలకు ఫిట్ నెస్ సర్టిఫికెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇది మోటారు వాహనాల (ఎంవీ) చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించడమేనని రవాణా శాఖ జారీ చేసిన పబ్లిక్ నోటీస్‌లో పేర్కొంది. అందుకే ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని వాహనదారులపై కఠిన చర్యలు తీసుకునేలా కొత్త నిబంధనల్ని అమలు చేస్తున్నట్లు ఢిల్లీ రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. సరైన ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా వాహనాల్ని నడిపే వాహనదారులకు మొదటి తప్పుకు రూ. 2,000-5,000, రెండవ, మూడవ నేరం కింద రూ.5,000-10,000 జరిమానా విధిస్తారు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో యజమాని లేదా డ్రైవర్‌కు జైలు శిక్ష విధించే నిబంధన కూడా అమలు చేస్తున్నట్లు రవాణా శాఖ అధికారులు విడుదల చేసిన నోటీస్‌లో హైలెట్ చేశారు. ఇ-రిక్షాలు, ఇ-కార్ట్స్‌కు ఫిట్నెస్ సర్టిఫికెట్ మూడేళ్ల పాటు చెల్లుబాటులో ఉంటుంది. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ ప్రకారం, ఫిటెనెస్ సర్టిఫికెట్ గడువు ముగిసిన తర్వాత నుంచి రోజుకు 50 రూపాయల చొప్పున అదనంగా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. చదవండి👉 ద్విచక్ర వాహన దారులకు అలర్ట్.. కేంద్రం మరో కొత్త రూల్! -
ఢిల్లీలో బాణాసంచాపై నిషేధం
-
ఆక్సిజన్ మృతులపై అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందక మృతి చెందిన కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం అండగా నిలిచింది. మృతుల కుటుంబానికి రూ.5 లక్షల నష్ట పరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రకటించారు. ఈమేరకు నష్ట పరిహారానికి సంబంధించిన అంశంపై ఆరుగురు వైద్యులతో ఆమ్ఆద్మీ ప్రభుత్వం కమిటీ ఏర్పాటుచేసింది. పరిహారం విషయంలో కమిటీ నివేదిక మేరకు ప్రభుత్వం బాధితులకు సహాయం అందించనుంది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ కమిటీ వారం చొప్పున వైద్య ఆరోగ్య కార్యదర్శికి నివేదిక అందిస్తుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈనెల ఆరంభంలో ఢిల్లీలోని బత్రా ఆస్పత్రిలో 12 మంది ఆక్సిజన్ అందక మృతి చెందిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 24వ తేదీన ఢిల్లీలోని జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలో 20 మంది కరోనా బాధితులు కరోనా బాధితులు మృత్యువాత పడ్డారు. మృతుల విషయమై ప్రభుత్వం ఫిర్యాదులు, దరఖాస్తులు నేరుగా లేదా, ఆన్లైన్లో స్వీకరిస్తుంది. వాటిని పరిశీలించి పరిష్కారానికి చర్యలు చేపడుతుందని ప్రభుత్వం పేర్కొంది. -
‘నిర్భయ’ కేసులో కేంద్రానికి నిరాశ
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలకు తాత్కాలికంగా నిరాశ మిగిలింది. నిర్భయ కేసులో దోషులందరినీ ఒకేసారి ఉరితీయాలనీ, న్యాయపరమైన అవకాశాలన్నింటినీ వినియోగించుకోవడానికి వారికి ఢిల్లీ హైకోర్టు గడువివ్వడాన్ని సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఖైదీల ఉరితీతపై స్టేకు వ్యతిరేకంగా నోటీసులు జారీ చేయడానికి విముఖత వ్యక్తం చేసింది. దోషులకు నోటీసులు ఇవ్వాలన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనతో జస్టిస్ భానుమతి జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఏఎస్.బోపన్నలతో కూడిన ధర్మాసనం ఏకీభవించలేదు. అది మరింత జాప్యానికి దారితీస్తుందని, దీనిపై 11వ తేదీన విచారిస్తామని తెలిపింది. అయితే ఉరిశిక్ష అమలులో జాప్యంపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. ఇప్పటి వరకు దేశం సహనాన్ని పరీక్షించింది చాలుననీ, ఇకపై వారిని ఉరితీసేందుకు అనుమతించాలనీ కోరారు. అయిదేళ్లుగా నిర్భయ దోషుల్లో ఒకరైన పవన్ క్షమాభిక్ష అర్జీ పెట్టుకోకపోగా ముకేశ్ కుమార్ న్యాయపరమైన అన్ని అవకాశాలను వినియోగించుకున్నాడని వెల్లడించారు. అందుకే, ఒకే కేసులో దోషులను విడివిడిగా ఉరితీసే అంశంపై చట్టం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అయితే ఏ ఒక్కరూ తాము ప్రాణాలతో ఉండేందుకు కావాల్సిన అవకాశాలనూ వినియోగించుకోకుండా అడ్డుకోరాదని ధర్మాసనం తెలిపింది. మరో పరిణామం..నిర్భయ దోషుల ఉరి తీతకు కొత్త తేదీలను ఖరారు చేయాలంటూ తీహార్ జైలు అధికారులతోపాటు ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను పటియాలా హౌస్ కోర్టు తిరస్కరించింది. ‘చట్టపరంగా జీవించే అవకాశం దోషులకు ఉండగా, ఉరితీయడం నేరపూరితమైన పాపం’అని అదనపు సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రాణా వ్యాఖ్యానించారు. -
‘సిగ్గు పడాల్సిన విషయం’
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో నెలకొన్న వాతావరణ కాలుష్యంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ పరిస్థితులకు అన్ని పార్టీలు, ప్రభుత్వాలు బాధ్యత వహించాలని పేర్కొంది. భవిష్యత్ తరాలను ఇటువంటి వాతావరణాన్ని అందిస్తున్నందుకు అందరూ సిగ్గు పడాలని స్పష్టం చేసింది. శీతాకాలంలో ఇటువంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయన్న సంకేతాలు ఉన్నపుడు చర్యలు ఎందుకు తీసుకోలదని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. శవదహనాలు, భారీ నిర్మాణాలను చేపట్టే సమయంలో సరైన భద్రతా చర్యలు ఎందుకు తీసుకోలేదని ఎన్జీటీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48 ప్రకారం వాతావరణాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా పంచుకోవాల్సిన బాధ్యత ప్రజలు, ప్రభుత్వాల మీదే ఉందని ఎన్జీటీ స్పష్టం చేసింది. ఢిల్లీలోని వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు తగు తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. -
బస్సులో ప్రయాణిస్తే భారీ డిస్కౌంట్
సరి-భేసి విధానంతో కాలుష్యానికి చెక్ పెట్టాలని భావించిన ఢిల్లీ సర్కారుకు ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మరో వినూత్న ఆఫర్‌తో ప్రజల ముందుకొచ్చింది. ప్రజలు వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించి, ప్రజారవాణా వ్యవస్థలో ప్రయాణించే వారికి టిక్కెట్ ధరలో 75 శాతం డిస్కౌంట్‌ను ఢిల్లీ ప్రభుత్వం అందించబోతుంది. దీంతో దేశ రాజధానిలో బస్సు ప్రయాణం మరింత చౌకగా మారబోతుంది. రెండు రోజుల్లోనే దీనిపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటించబోతుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. జనవరి నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నాయని సీనియర్ అధికారి పేర్కొన్నారు. ఢిల్లీ ఇంటిగ్రేటెడ్ మల్టి-మోడల్ ట్రాన్సిస్ట్ సిస్టమ్(డీఐఎమ్‌టీఎస్) ఆపరేట్ చేసే డీటీసీ, క్లస్టర్ బస్సులన్నింటిలోనూ ఈ కొత్త ధరలు అందుబాటులోకి వస్తాయి. ఈ కొత్త ధరల ప్రకారం నాన్-ఏసీ క్లస్టర్ బస్సు ఫ్లాట్ చార్జీ రూ.5, ఎయిర్-కండిషన్డ్ బస్సు ఫ్లాట్ చార్జీ రూ.10గా ఉండబోతుంది. ప్రస్తుతం నాన్-ఏసీ బస్సులో ఢిల్లీ నగరంలో ప్రయాణిస్తే రూ.5 నుంచి రూ.15 మధ్యలో టిక్కెట్ ధరలున్నాయి. అదేవిధంగా ఏసీ బస్సులో రూ.10 నుంచి రూ.25 మధ్యలో చార్జీలున్నాయి. 21 సంవత్సరాలు కంటే తక్కువ వయసున్న విద్యార్థులకు, వితంతువులకు, సీనియర్ సిటిజన్లకు ఉచిత ట్రావెల్ పాస్‌లను ప్రభుత్వం అందించనుంది. మహిళ ట్రావెల్ పాస్‌లకు శాశ్వతంగా 75 శాతం డిస్కౌంట్‌ను ప్రభుత్వం తీసుకొస్తోంది. రూ.800, రూ.1000కు లభ్యమవుతున్న నెలవారీ నాన్-ఏసీ, ఏసీ బస్సు పాస్‌లు ఇక రూ.250కే లభ్యం కానున్నాయి. రాజధాని ప్రాంతంలో రోడ్లపై వాహనాల శాతాన్ని తగ్గించి బస్సు ప్రయాణాలు పెంచడానికి ఈ డిస్కౌంట్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని అధికారులు చెబుతున్నారు. -
నాకు తెలియకుండానే ఆ వీడియో తీశాడు!
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ మంత్రి, బహిష్కృత ఆప్ నేత సందీప్‌కుమార్ తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించి, తన జీవితాన్ని నాశనం చేశారని, ఆయనను కఠినంగా శిక్షించాలని బాధిత మహిళ పోలీసులను కోరింది. వివాదాస్పద సీడీలో సందీప్‌కుమార్‌తో కలిసి సన్నిహితంగా కనిపించిన ఆమె తాజాగా పోలీసులకు వీడియో స్టేట్మెంట్ ఇచ్చింది. ఇద్దరు మహిళలతో సందీప్‌కుమార్ రాసలీలలు నెరుపుతున్న వీడియో సీడీలు వెలుగుచూడటంతో ఆయనను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంత్రి పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. పోలీసులు సందీప్‌కుమార్‌ను అదుపులోకి తీసుకొని లైంగికదాడి అభియోగాలు మోపారు. ఈ నేపథ్యంలో బాధిత మహిళ పోలీసులకు తన వాంగ్మూలం ఇచ్చింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. '11 నెలల కిందట నేను సందీప్‌కుమార్‌ను మార్కెట్లో కలిశాను. నాకు రేషన్ కార్డు ఇప్పించేందుకు సహాయం చేయమని కోరాను. నాకు సహాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. పత్రాలు తీసుకొని ఒంటరిగా తన కార్యాలయానికి రావాలని సూచించారు. ఆ తర్వాత నన్ను తన ఇంటికి పిలిచారు. ఇంటికి వెళ్వాక ఓ గదిలో వేచి ఉండమని చెప్పారు. ఆ తర్వాత నాకు మత్తుపదార్థాలు కలిపిని పానీయాన్ని ఇచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు' అని బాధితురాలు తెలిపింది. అనంతరం తనపై సందీప్‌కుమార్ అత్యాచారం జరిపారని, మర్నాడు ఉదయం తనను ఇంటినుంచి పంపించాడని ఆమె పోలీసులకు చెప్పింది. 'తనను సందీప్ వీడియో తీస్తున్నాడనే విషయం ఆమెకు తెలియదు. మత్తులో ఉన్న ఆమెకు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. ఆమెను ట్రాప్ చేసి అతను వాడుకున్నాడు' అని పోలీసు అధికారులు తెలిపారు. ఇలా ఎందుకు చేశావని ఆమె మర్నాడు ఉదయం సందీప్‌ను నిలదీసిందని, ఇలా చేయడం వల్ల తన పెళ్లిపై ప్రభావం పడే అవకాశముందని ఆవేదన వ్యక్తం చేసిందని వారు చెప్పారు. 'రేషన్ కార్డు కావాలంటే నువ్వు లొంగిపోక తప్పదు అని సందీప్ చెప్పాడు. నీ పెళ్లి దెబ్బతీనకుండా ఉండాలంటే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకు అని ఆమెను బెదిరించాడు' అని పోలీసులు వివరించారు. తనను మోసం చేసిన సందీప్ చివరకు రేషన్ కార్డు కూడా ఇప్పించలేదని, అవమానభారంతో తాము మరో ఇంటికి మారామని బాధితురాలు తెలిపింది. 'నేను పేద మహిళను. వివాహితను. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతనికి వ్యతిరేకంగా పోరాడే వనరులు నా వద్ద లేవు. బహిరంగంగా వీడియో లీక్ చేసి అతను నా పరువుకు భంగం కలిగించాడు. ఇందంతా తెలిశాక నన్ను సమాజం ఒప్పుకోద్దు. ఇందుకు బాధ్యుడైన అతన్ని కఠినంగా శిక్షించాలి' అని బాధితురాలు కోరింది. -
ప్రైవేట్ స్కూల్ వ్యాన్లపై నిషేధం
న్యూఢిల్లీ : పాఠశాలలకు వెళ్లే పిల్లల భద్రతా నేపథ్యంలో స్కూల్ ట్రాన్స్పోర్ట్కు ప్రైవేట్ వ్యాన్లపై నిషేధం విధిస్తున్నట్టు ఢిల్లీ గవర్నమెంట్ వెల్లడించింది. వ్యాన్ కిందపడి ఓ మూడేళ్ల బాలుడు మరణించిన రెండు రోజుల అనంతరం ప్రైవేట్ వ్యాన్లను బ్యాన్ చేస్తున్నట్టు ప్రకటించింది. దేశ రాజధానిలో ప్రైవేట్ క్యాబ్ ఓనర్లు నిబంధనలను అతిక్రమిస్తున్నారని, వారిపై ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్టు ఢిల్లీ రవాణా శాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. గురువారం రోజు మూడేళ్ల బాలుడు అవిరాల్ రానాను ప్రైవేట్ మారుతీ స్కూల్ వ్యాన్ డ్రైవర్ నార్త్ ఢిల్లీ సివిల్ లైన్స్‌లోని ఇంటి దగ్గర దింపేశాడు. అనంతరం ఆ బాలుడు అక్కడే ఉన్నాడనే విషయాన్ని మరచిపోయి వ్యాన్‌ను రివర్స్ తీసుకుని బాలుడిపై నుంచి పోనిచ్చి, కొంతదూరం వరకు లాక్కెళ్లాడు. దీంతో ఆ బాలుడు మృతిచెందాడు. వెంటనే ఆ వాహనాన్ని సీజ్ చేసి, డ్రైవర్ రాహుల్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఈ డ్రైవర్ పలుమార్లు రూల్స్‌ను అతిక్రమించినట్టు వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం స్కూల్ ట్రాన్స్పోర్ట్కు వాడే అన్నీ ప్రైవేట్ వ్యాన్లపై నివేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. అయితే దీనిపై తల్లిదండ్రుల నుంచి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు చేపట్టకుండా ప్రైవేట్ వ్యాన్లపై నిషేధం విధించడం తమకు కష్టతరమవుతుందని వాపోతున్నారు. భద్రతా పరంగా చర్యలు చేపట్టినప్పటికీ అవి ప్రశ్నార్థంగా మారనున్నాయని చెబుతున్నారు. బిజీ షెడ్యూల్లో ఉద్యోగానికి, పనికి వెళ్లే తల్లిదండ్రులకు ఈ నిర్ణయం కొంత ఆటంకంగా మారనుందని వెల్లడవుతోంది. -
ఊబర్,ఓలా ధరలపై నిషేధం
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కే్జ్రీవాల్ అన్న మాట నిలబెట్టుకున్నారు. అనైతికంగా ట్యాక్సీ రేట్లను పెంచి ప్రయాణీకుల్ని నిలువు దోపిడీ చేస్తున్నఊబర్, ఓలా ట్యాక్సీ ధరల పెంపుపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు కేజ్రీవాల బుధవారం ట్వీట్ చేశారు. రేట్లను పెంచితే కఠినంగా వ్యవహరిస్తామని గతంలో కేజ్రీవాల్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ప్రభుత్వ ధరలకు వ్యతిరేకంగా అదనపు చార్జీలను వసూలు చేస్తున్న 50 ట్యాక్సీలను సీజ్ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. కాలుష్యాన్ని తగ్గించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం సరి-బేసి విధానాన్ని తీసుకువస్తే దాన్ని ఆసరాగా చేసుకొని ఊబర్, ఓలా సర్వీసులు ఐదు రెట్లు తమ ట్యాక్పీ రేట్లను పెంచడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ట్యాక్సీ సర్వీసులపై కొన్ని స్వచ్ఛంద సంస్థలు న్యాయస్థానంలో కేసును సైతం దాఖలు చేశారు. టాక్సీ ధరలు పెంచడంతో అది మరింత మంది డ్రైవర్లను అందుబాటులో ఉండేలా చేస్తుందని డిమాండ్ మేరకు ఒక్కోసారి ధరలను పెంచాల్సి వస్తుందని ఊబర్ ట్వీట్ చేసింది. ఊబర్ వాదనతో విభేదించిన ప్రభుత్వం దీనిని 'పట్ట పగలే దోపిడి' గా అభివర్ణించింది. కర్ణాటక రాష్ర్టం కూడా గతంలో టాక్సీ ధరల పెంపుపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. -
'ఆ ప్రభుత్వం విధుల్లో జోక్యం సరికాదు'
న్యూఢిల్లీ: ఒకసారి ప్రజలు ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాక మరొకరు ఆ ప్రభుత్వం విధుల్లో జోక్యం చేసుకోవడం సరికాదని రాజ్యాంగ నిపుణుడు గోపాల్ సుబ్రహ్మణ్యం అన్నారు. కేంద్రం, ఢిల్లీ సర్కార్ మధ్య విభేదాలపై ఆయన శనివారం స్పందించారు. ప్రజాస్వామ్య దేశంలో ఇదొక ప్రాథమిక అవగాహనగా గోపాల్ పేర్కొన్నారు. మంత్రి మండలి నిర్ణయాలు తీసుకుంటుంది, విధానాలు నిర్ణయిస్తుందనీ చెప్పారు. దీన్ని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఐఏఎస్‌ల నియామకాల్లో జోక్యం చేసుకునే అధికారం కేంద్రానికి ఉండదని చెప్పారు. ఢిల్లీ సీఎంను నియమించేది లెఫ్టినెంట్ గవర్నర్ కాదని, రాష్ట్రపతి' అని తెలిపారు. ఢిల్లీ సీఎంకు రాజ్యాంగం కల్పించిన హోదా విస్తృతమైనది, దీన్ని విస్మరించలేమని గోపాల్ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. -
ఢిల్లీ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
న్యూఢిల్లీ: మధ్యాహ్న భోజనం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయమై నాలుగు వారాల్లో సమగ్ర నివేదికను అందించాలని ఢిల్లీ ప్రభుత్వానికి జాతీయ మానవహక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) గురువారం నోటీసులు జారీ చేసింది. తూర్పు ఢిల్లీలోని పత్పర్గంజ్ ప్రాంతంలో ఉన్న సర్వోదయ కన్యావిద్యాలయలో చదువుతున్న 7 -14 మధ్య వయస్సు ఉన్న 22 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీనిపై పత్రికల్లో వచ్చిన కథనాలను ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించింది. ఘటనపై నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదికను అందజేయాలని ఢిల్లీ చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీచేసింది. అలాగే ఘటనపై తీసుకున్న చర్యలను గురించి నివేదిక అందజేయాలని డీసీపీ(తూర్పు)ను ఆదేశించింది. ఆ రోజు విద్యార్థినులకు పెట్టిన మధ్యాహ్న భోజనంలో చచ్చిన ఎలుక పడి ఉండటం అందరూ గమనించారు. పాఠశాలకు ఈ భోజనాన్ని డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ దళిత్ ఉతన్ శిక్షా సమితి సరఫరా చేస్తోంది. దీనిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినా మళ్లీ అనుమతి ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. -
అక్రమ రీఫిల్లింగ్‌పై ఉక్కుపాదం
న్యూఢిల్లీ: వంటగ్యాస్ సిలిండర్లను అక్రమంగా రీఫిల్లింగ్ చేసే వారిపై అధికారులు విరుచుకుపడుతున్నారు. నగరవ్యాప్తంగా గురువారం 164 చోట్ల దాడులు నిర్వహించిన అధికారుల బృందం 293 సిలిండర్లను స్వాధీనం చేసుకుంది. దుకాణదారులు పెద్ద సిలిండర్ల నుంచి అక్రమంగా గ్యాస్ తీసి చిన్నవాటిలో నింపుతున్నట్టు గుర్తించారు. ఈ మేరకు 32 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ‘గ్యాస్ సిలిండర్ల రీఫిల్లింగ్ చాలా ప్రమాదకరం. పేలుళ్లు, అగ్ని ప్రమాదాలకు దారితీసే అవకాశాలు ఉంటాయి. చిన్న సిలిండర్లను స్థానికంగానే తయారు చేస్తున్నారు. వీటి వినియోగమూ చాలా ప్రమాదకరం. తక్కువ బరువున్న సిలిండర్లను సరఫరా చేస్తూ నిందితులు వినియోగదారులను మోసగిస్తున్నారు’ అని ఆహార సరఫరాలు, వినియోగదారుల వ్యవహరాలశాఖ కమిషనర్ ఎస్ఎస్ యాదవ్ ఈ సందర్భంగా అన్నారు. నిందితులపై నిత్యావసరాల చట్టం 1955 ప్రకారం ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని పేర్కొన్నారు. దీని కింద నేరం రుజువైతే ఏడేళ్ల జైలుశిక్ష పడుతుందని యాదవ్ అన్నారు. ఈ చట్టం ప్రకారం ఎల్పీజీ సిలిండర్లను అక్రమంగా కలిగి ఉండడం, సరఫరా చేయడాన్ని పూర్తిగా నిషేధించారని తెలిపారు. పామాణిక బరువు కంటే ఎక్కువ లేదా తక్కువ బరువున్న సిలిండర్ల అమ్మకాన్ని కూడా నిషేధించారని వివరించారు. తాజాగా గురువారం సంత్‌నగర్, వాజీర్‌పూర్, బురారీ, రాజాపూర్, షాబాద్ దౌలత్‌పూర్, ఈస్ట్ వినోద్‌నగర్, మెహ్రౌలీ, కపషేరా, కలందర్ కాలనీ, దిల్షద్ గార్డెన్, గోకుల్‌పురి, సీమాపురి, మండోలీ, సదర్ బజార్, బల్లిమారన్, ఠాగూర్ గార్డెన్ ప్రాంతాల్లో దాడులు నిర్వహించామని చెప్పారు. ఈ నెలలో దాడులు నిర్వహించడం ఇది రెండోసారని కమిషనర్ ఈ సందర్భంగా వివరించారు. ఈ నెల ఐదున నిర్వహించిన తనిఖీల్లో 315 ఎల్పీజీ సిలిండర్లను స్వాధీనం చేసుకొని, 34 క్రిమినల్ కేసులు నమోదు చేశామని ఎస్ఎస్ యాదవ్ తెలిపారు. -
ప్రభుత్వ సలహాదారుగా సుభాష్ చంద్ర అగర్వాల్ నియామకం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఆర్టిఐ కార్యకర్త సుభాష్ చంద్ర అగర్వాల్ ఢిల్లీ ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ప్రభుత్వ యంత్రాంగంలో సమాచార హక్కు చట్టాన్ని మెరుగ్గా అమలుచేయడం కోసం ప్రభుత్వం ఆయనను సలహాదారుగా నియమించింది. ఈ పదవిలో ఆయన ఏడాది పాటు కొనసాగుతారు. సుభాష్ చంద్ర అగర్వాల్‌ను పాలనా సంస్కరణల విభాగం కన్సల్టెంట్‌గా నియమిస్తూ పాలనా సంస్కరణల విభాగం డిప్యూటీ డెరైక్టర్ అమితాబ్ జోషీ ఉత్తర్వు జారీచేశారు. ప్రభుత్వ సలహాదారుగా ఆయన సమాచార హక్కు చట్టం - 2005 నియమ నిబంధనల గురించి ఢిల్లీ ప్రభుత్వం కిందనున్న పిఐవోలు/ఫస్ట్ అప్పిలే ట్ అథారిటీలకు మార్గదర్శకత్వాన్ని అందిస్తారు. శిక్షణ కూడా ఇస్తారు. ఢిల్లీ పాలనా సంస్కరణల విభాగంతో కలిసి పనిచేస్తూ ఢిల్లీలో సమాచార హక్కు చట్టాన్ని మెరుగ్గా అమలుచేయడానికి సహకరిస్తారు. సమాచార హక్కు చట్టం కింద అనేక కీలకమైన దరఖాస్తులు దాఖలుచేసిన ఘనత సుభాష్ చంద్ర అగర్వాల్‌కు ఉంది. ఆయన దరఖాస్తు మూలంగానే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆర్టిఐ చట్టం కిందకు తీసుకువచ్చారు. అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్‌తో పాటు అగర్వాల్ దాఖలు చేసిన నివేదిక కారణంగా ఆరు జాతీయస్థాయి రాజకీయ పార్టీలను ఆర్టిఐ చట్టం పరిధి కిందకుతెచ్చారు. ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల రికార్డుల నిర్వహణలో ప్రభుత్వం తెచ్చిన మార్పుల వెనుక కూడా అగర్వాల్ ఆర్టిఐ దరఖాస్తు ఉంది. ఆయన పత్రికా సంపాదకులకు రాసిన లేఖలు అత్యధిక సంఖ్యలో ప్రచురితమయ్యాయి. ఈ విషయంలో గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఆర్టిఐ దరఖాన్తుల పరిశీలనలో ఢిల్లీ ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లు, లోటుపాట్లపై దృష్టిపెడతానని అగర్వాల్ చెప్పారు. కేంద్ర సమాచార కమిషనర్లను, మాజీ కమిషనర్లను కూడా తాను సంప్రదిస్తానని, ఢిల్లీ ప్రభుత్వ అధికారులకు సంబంధించి కేంద్ర సమాచార కమిషన్‌లో దాఖలైన ఆర్టీఐ పిటిషన్ల గురించి అడిగి తెలుసుకుంటానని చెప్పారు. లెఫ్టినెంట్ గవర్నర్ తనను కన్సల్టెంట్‌గా నియమించడం గర్వంగా ఉందని ఆయన చెప్పారు. ఆర్టీఐ దరఖాస్తులకు ప్రతిస్పందించడంలో ఢిల్లీ ప్రభుత్వం, దాని సంస్థలను అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తానని ఆయన తెలిపారు.