బస్సులో ప్రయాణిస్తే భారీ డిస్కౌంట్
బస్సులో ప్రయాణిస్తే భారీ డిస్కౌంట్
Published Wed, Dec 21 2016 1:28 PM | Last Updated on Mon, Sep 4 2017 11:17 PM
సరి-భేసి విధానంతో కాలుష్యానికి చెక్ పెట్టాలని భావించిన ఢిల్లీ సర్కారుకు ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మరో వినూత్న ఆఫర్తో ప్రజల ముందుకొచ్చింది. ప్రజలు వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించి, ప్రజారవాణా వ్యవస్థలో ప్రయాణించే వారికి టిక్కెట్ ధరలో 75 శాతం డిస్కౌంట్ను ఢిల్లీ ప్రభుత్వం అందించబోతుంది. దీంతో దేశ రాజధానిలో బస్సు ప్రయాణం మరింత చౌకగా మారబోతుంది. రెండు రోజుల్లోనే దీనిపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటించబోతుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. జనవరి నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నాయని సీనియర్ అధికారి పేర్కొన్నారు.
ఢిల్లీ ఇంటిగ్రేటెడ్ మల్టి-మోడల్ ట్రాన్సిస్ట్ సిస్టమ్(డీఐఎమ్టీఎస్) ఆపరేట్ చేసే డీటీసీ, క్లస్టర్ బస్సులన్నింటిలోనూ ఈ కొత్త ధరలు అందుబాటులోకి వస్తాయి. ఈ కొత్త ధరల ప్రకారం నాన్-ఏసీ క్లస్టర్ బస్సు ఫ్లాట్ చార్జీ రూ.5, ఎయిర్-కండిషన్డ్ బస్సు ఫ్లాట్ చార్జీ రూ.10గా ఉండబోతుంది. ప్రస్తుతం నాన్-ఏసీ బస్సులో ఢిల్లీ నగరంలో ప్రయాణిస్తే రూ.5 నుంచి రూ.15 మధ్యలో టిక్కెట్ ధరలున్నాయి. అదేవిధంగా ఏసీ బస్సులో రూ.10 నుంచి రూ.25 మధ్యలో చార్జీలున్నాయి.
21 సంవత్సరాలు కంటే తక్కువ వయసున్న విద్యార్థులకు, వితంతువులకు, సీనియర్ సిటిజన్లకు ఉచిత ట్రావెల్ పాస్లను ప్రభుత్వం అందించనుంది. మహిళ ట్రావెల్ పాస్లకు శాశ్వతంగా 75 శాతం డిస్కౌంట్ను ప్రభుత్వం తీసుకొస్తోంది. రూ.800, రూ.1000కు లభ్యమవుతున్న నెలవారీ నాన్-ఏసీ, ఏసీ బస్సు పాస్లు ఇక రూ.250కే లభ్యం కానున్నాయి. రాజధాని ప్రాంతంలో రోడ్లపై వాహనాల శాతాన్ని తగ్గించి బస్సు ప్రయాణాలు పెంచడానికి ఈ డిస్కౌంట్ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
Advertisement
Advertisement