ప్రైవేట్ స్కూల్ వ్యాన్లపై నిషేధం
న్యూఢిల్లీ : పాఠశాలలకు వెళ్లే పిల్లల భద్రతా నేపథ్యంలో స్కూల్ ట్రాన్స్పోర్ట్కు ప్రైవేట్ వ్యాన్లపై నిషేధం విధిస్తున్నట్టు ఢిల్లీ గవర్నమెంట్ వెల్లడించింది. వ్యాన్ కిందపడి ఓ మూడేళ్ల బాలుడు మరణించిన రెండు రోజుల అనంతరం ప్రైవేట్ వ్యాన్లను బ్యాన్ చేస్తున్నట్టు ప్రకటించింది. దేశ రాజధానిలో ప్రైవేట్ క్యాబ్ ఓనర్లు నిబంధనలను అతిక్రమిస్తున్నారని, వారిపై ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్టు ఢిల్లీ రవాణా శాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. గురువారం రోజు మూడేళ్ల బాలుడు అవిరాల్ రానాను ప్రైవేట్ మారుతీ స్కూల్ వ్యాన్ డ్రైవర్ నార్త్ ఢిల్లీ సివిల్ లైన్స్లోని ఇంటి దగ్గర దింపేశాడు. అనంతరం ఆ బాలుడు అక్కడే ఉన్నాడనే విషయాన్ని మరచిపోయి వ్యాన్ను రివర్స్ తీసుకుని బాలుడిపై నుంచి పోనిచ్చి, కొంతదూరం వరకు లాక్కెళ్లాడు. దీంతో ఆ బాలుడు మృతిచెందాడు.
వెంటనే ఆ వాహనాన్ని సీజ్ చేసి, డ్రైవర్ రాహుల్ కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఈ డ్రైవర్ పలుమార్లు రూల్స్ను అతిక్రమించినట్టు వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం స్కూల్ ట్రాన్స్పోర్ట్కు వాడే అన్నీ ప్రైవేట్ వ్యాన్లపై నివేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. అయితే దీనిపై తల్లిదండ్రుల నుంచి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు చేపట్టకుండా ప్రైవేట్ వ్యాన్లపై నిషేధం విధించడం తమకు కష్టతరమవుతుందని వాపోతున్నారు. భద్రతా పరంగా చర్యలు చేపట్టినప్పటికీ అవి ప్రశ్నార్థంగా మారనున్నాయని చెబుతున్నారు. బిజీ షెడ్యూల్లో ఉద్యోగానికి, పనికి వెళ్లే తల్లిదండ్రులకు ఈ నిర్ణయం కొంత ఆటంకంగా మారనుందని వెల్లడవుతోంది.