
కులు: హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)లోని కులు పరిధిలోగల మణికరణ్‌లో కొండచరియలు విరిగిపడటంతో ఆరుగురు మృతిచెందారు. బలమైన గాలుల కారణంగా ఒక భారీ వృక్షం రోడ్డుపై నిలిపివుంచిన వాహనాలపై పడింది. అదే సమయంలో కొండచరియలు కూడా విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు.
ఈ ప్రమాదంపై హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు(CM Sukhwinder Singh Sukhu) విచారం వ్యక్తం చేశారు. ప్రమాదప్రాంతంలో తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని ఆయన సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మణికరణ్ ప్రముఖ మతపరమైన ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఆదివారం నాడు రాష్ట్రంలో ‘నవ సంవత్’ ఉత్సవం జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది.
ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు ఎవరన్నదీ ఇంతవరకూ గుర్తించలేదు. పోలీసులు దీనిపై ఆరా తీస్తున్నారు. ఈ దుర్ఘటనలో ఆరుగురు మరణించినట్లు కులు సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ అశ్విని కుమార్ తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ఆదివారం గురుద్వారా ముందు నిలిపివుంచిన తమ వాహనాలలో కూర్చున్న పర్యాటకులపై అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: పుతిన్ కారులో భారీ పేలుడు.. జెలెన్స్కీ భవిష్యవాణి నిజమేనా?