
నగరమంతటా కుళ్లిన శవాల వాసనే
మరో భూకంపం, మరింత విధ్వంసం
2,700 దాటిన మయన్మార్ మృతులు
మాండలే: మయన్మార్ భూకంపం దేశంలో రెండో అతి పెద్ద నగరమైన మాండలేను మరుభూమిగా మార్చేసింది. నగరంలో మూడొంతులకు పైగా భవనాలు కుప్పకూలాయి. అవన్నీ క్రమంగా శవాల దిబ్బలుగా మారుతున్నాయి. మౌలిక సదుపాయాల లేమితో శిథిలాల వెలికితీత నత్తనడకన సాగుతోంది. వాటికింద వేలాదిమంది చిక్కుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. భూకంపం సంభవించి ఐదు రోజులు కావస్తుండటంతో వారు ప్రాణాలతో ఉండే అవకాశాలు దాదాపుగా సన్నగిల్లుతున్నాయి. కుళ్లుతున్న శవాలతో మాండలే వీధుల్లో ఇప్పటికే భరించలేనంతటి దుర్గంధం వ్యాపించింది.
దీనికితోడు మంగళవారం సాయంత్రం కూడా మాండలేను మరో భూకంపం వణికించింది. 5.1 తీవ్రత భూమి కంపించడంతో ఇప్పటికే దెబ్బతిని పగుళ్లిచ్చిన చాలా భవనాలు కుప్పకూలాయి. దాంతో జనం హాహాకారాలు చేస్తూ రోడ్లపైకి పరుగులు తీశారు. రాత్రంతా ఆరుబయటే జాగారం చేస్తూ గడిపారు. దేశవ్యాప్తంగా భూకంప మృతుల సంఖ్య 2,700, క్షతగాత్రుల సంఖ్య 5,000 దాటాయి.
వారి స్మృత్యర్థం మంగళవారం మధ్యాహ్నం దేశవ్యాప్తంగా ప్రజలు నిమిషం పాటు మౌనం పాటించారు. మయన్మార్‌లో 10 వేలకు పైగా భవనాలు కూలిపోయినట్టు ఐరాస పేర్కొన్న నేపథ్యంలో మృతుల సంఖ్య అపారంగా ఉంటుందని చెబుతున్నారు. ప్రతికూల వాతావరణం కూడా సహాయక చర్యలకు పెద్ద ప్రతిబంధకంగా మారుతోంది. మంగళవారం దాకా విపరీతమైన ఎండ కాయగా బుధవారం నుంచి భారీ వర్ష సూచనలు ఆందోళనగా మారాయి.
బ్యాంకాక్‌లో 21 మంది...
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో భూకంపానికి 21 మంది బలైనట్టు ఇప్పటిదాకా తేలింది. కుప్పకూలిన నిర్మాణంలోని 30 అంతస్తుల భవనం వద్ద శిథిలాల తొలగింపు ఇంకా కొనసా గుతోంది. అందులో పని చేస్తున్నవారిలో 78 మంది ఆచూకీ తేలడం లేదని అధికారులు తెలిపారు. దానికింద చిక్కినవారి సంఖ్య 300 దాకా ఉంటుందని అనధికారిక అంచనాలు చెబుతున్నాయి.

పాపం పసివాళ్లు!
మాండలేకు 40 కి.మీ. దూరంలోని క్యౌక్సే పట్టణంలో ఓ ప్రీ స్కూల్లో 70 మంది చిన్నారుల్లో అత్యధికులు భూకంపానికి నిస్సహాయంగా బలయ్యారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. జరిగిన దారుణాన్ని తలచుకుంటూ ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటికీ గుండెలవిసేలా రోదిస్తున్నారు. మాండలే సమీపంలో కుప్పకూలిన ఓ బౌద్ధారామం శిథిలాల నుంచి ఇప్పటిదాకా 50 మందికి పైగా సన్యాసుల మృతదేహాలను వెలికితీశారు. వాటికింద నలిగి కనీసం మరో 150 మంది మరణించి ఉంటారని చెబుతున్నారు.
మృత్యుంజయులు
మయన్మార్ రాజధాని నేపిడాలో భవన శిథిలాల నుంచి ఓ 63 ఏళ్ల వృద్ధురాలు, ఆమె మనవరాలు ఏకంగా 91 గంటల తర్వాత మంగళవారం ప్రాణాలతో బయటపడ్డారు. మరోచోట ఓ ఐదేళ్ల చిన్నారిని, గర్భిణిని కూడా సహాయక బృందాలు కాపాడాయి.