Dominican Republic: నైట్‌ క్లబ్‌ పైకప్పు కూలి 79 మంది మృతి.. 160 మందికి గాయాలు | Dominican Republic Nightclub Roof Collapses During Concert, 79 Lives End In This Shocking Incident, Watch Video Inside | Sakshi
Sakshi News home page

Dominican Republic: నైట్‌ క్లబ్‌ పైకప్పు కూలి 79 మంది మృతి.. 160 మందికి గాయాలు

Published Wed, Apr 9 2025 7:15 AM | Last Updated on Wed, Apr 9 2025 10:51 AM

Dominican Republic Nightclub Roof Collapses

సంతో డొమింగో: డొమినికన్ రిపబ్లిక్ రాజధాని సంతో డొమింగోలోని ప్రముఖ జెట్ సెట్ నైట్‌క్లబ్‌(Jet Set Nightclub)లో  ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. సంగీత కచేరీ జరుగుతుండగా నైట్‌క్లబ్ పైకప్పు అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో 79 మంది వరకు మరణించారని, 160 మందికి పైగా జనం గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ సంగీత కచేరీని వీక్షించేందుకు సుమారు 600 మంది హాజరైనట్లు తెలుస్తోంది.

స్థానిక రెస్క్యూ బృందాలు(Rescue teams) అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.  ఘటనలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో మరణించిన వారిలో డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన మాజీ బేస్‌బాల్ ఆటగాళ్లు ఎమిలియో బోనిఫాసియో, లూయిస్ రామిరెజ్ కూడా ఉన్నారు. అలాగే ఒక ప్రావిన్స్ గవర్నర్ కూడా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఈ సంగీత కచేరీకి హాజరైన వారిలో  ప్రముఖులు, స్థానిక నేతలు ఉన్నట్లు సమాచారం.
 

నైట్‌ క్లబ్‌ పైకప్పు కూలిపోవడానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అధిక జనసమూహం కారణంగా భవనంపై ఒత్తిడి పెరిగి పైకప్పు కూలివుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అధికారులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. నైట్‌క్లబ్ యాజమాన్యంతో పాటు స్థానిక నిర్మాణ అధికారులను ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా(Social media)లో వైరల్ అవుతున్న ఒక వీడియోలో కచేరీ జరుగుతున్న సమయంలో పైకప్పు కూలిన దృశ్యం స్పష్టంగా కనిపిస్తున్నది.

ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పైకప్పు కుప్పకూలడం ఆ వీడియోలో రికార్డ్ అయింది. ఈ దృశ్యాలు చూసిన వారు ఘటన తీవ్రతను అర్థం చేసుకోగలుగుతారు. డొమినికన్ రిపబ్లిక్ ప్రభుత్వం ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపింది. ఈ దుర్ఘటన సందర్భంగా దేశవ్యాప్తంగా సంతాప దినం ప్రకటించారు. బాధితులకు సహాయం చేయడానికి అత్యవసర నిధులను కేటాయించారు. ఈ ఘటన అంతర్జాతీయంగానూ చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి: ఏఐ చేతుల్లో పిల్లల ఎదుగుదల.. ఒడిశాలో శ్రీకారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement